మమతలు కరిగి మానవత్వం మసకబారుతున్నప్పుడు మనుసును ఏదో చీకటి పురుగు కొరికిన బాధ.కనుల ముందటి మనుషులు ఉన్మాద ప్రతీకలుగా  మారుతున్నప్పుడు గుండె పుండవుతోంది.ఉక్కిరిబిక్కిరై ఊపిరి సలపదు.ఏటి ఊట చెలిమెలా గొంతుతడిపిన మనుషులూ బీటలువారిన ర్యాగడిలా బిర్రబిగిసి పోతున్న కాలం.భయం పురుగు కరిసి మాటలురాక మ్రన్పడినట్లనిపిస్తోంది.హరితవనం మధ్యనున్నా ఆకులురాలిన మోడులమధ్యున్నట్లనిపిస్తోంది.మనుషులు మాట్లాడుకుంటున్న మార్కెట్ సక్సెస్ మంత్రాలు కనపడని రేసులు తోడేళ్లు కొండ్రగాళ్ల ఊళ్లాలనిస్తున్నయ్.

ఆకురాలిన కాలంలో మండుటెండలను ధిక్కరిస్తూ చిగురించే పూసుగుమానుల ఊసులినాలన్పిస్తోంది.వడగాడ్పులను వెక్కిస్తూ ఎదిగే ఇప్పవనాల లేతాకుల ఎరుపు చూడాలనిపిస్తోంది.

పట్టపగలు మిట్టమధ్యాహ్నం నీరవ కమ్మిన నిషిని తలపిస్తున్నప్పుడూ జలపాతహోరునలుముకున్న  వెలుగువెన్నెల ఎంత అద్భుతం. భయం కమురువాసన మధ్య గుగ్గిలం అందుగు మాకుల గొందు అగ్గినజేరితే ఎగిసే పరిమళ దూమం ప్రాణాలకు ఎంతహాయి. గొంతులు తాడారిపోంగా నాలుక పిడచకట్టిపోతున్నప్పడు కొండదామర చెట్టదాచిన నీరు గొంతులవడితే అదొక్కబొట్టైనా అమృతమే.

పాదాల నుండి పైకెగబాకుతూ వెన్నుదాటి భయాలు మెదడునావరిస్తున్న కాలంలో ఓ నర్రెంగ చెట్టు నన్ను చూసి నిండుగా నవ్వుతున్నట్లనిపిస్తుంది. రోజు నా బిడ్డను బడికితోలుకపోయే తొవ్వలో విరబూసిన ఈ నర్రెంగ రోజుకో సుద్ది చెప్తున్నట్టనిపిస్తోంది.  నర్రెంగ చెట్టకింద నరుడో భాస్కరుడా నీవు కన్నెరచేస్తవయో నరుడో భాస్కరుడా అన్న శివసాగరుడి పాట గుర్తొస్తుంది. పొద్దటి గాలిలో రాలుతున్న   పూరేకులు నర్రెంగ చెట్టుకిందొరిగిన  మా సిక్కోలు భాస్కరుడి చిరునవ్వొలేనిపిస్తంది.

చాగంటి భాస్కరుడి అమరత్వంనాటికి లోకమెరుగని పసితనం. ఆ అమరుడి నెత్తురింకిన నేలలో మహేంద్రగిరుల  సిగలో విరబూసిన సంపెంగల తావి మనుసుపొరలను మెలిపెడుతోంది.చినబాబు నిర్మల అంకమ్మ పాణిగ్రాహి రక్తమొడిసిన రంగమేటియా కొండలు వరదపాటుకు కోసిన ఎర్రమట్టి పిలిచి పలకరించిన సప్పుడు. పిలుపుననుసరించి వడివడి పరుగులతో చేరబోయినప్పుడు ఒళ్లంతా పులకింతే.పాణిగ్రాహి జమిడికె మోతననుసరించి మోగిన రమేషన్న డప్పుసప్పడు ఉద్యమాల ఉరవడై చేవుల్లో పోటెత్తుతోంది.రోహిణి మండుటెండల్లో సందెమబ్బులయాళ్ల నెమళ్లాట మనుసు తెరమీద బొమ్మకడుతోంది.కలిసున్న మనుసుల మధ్య ఎవడోనాటిన ఇనుప తెరల సందుల్లోంచి దూరొచ్చే సవ్వడి నిశ్చయంగా వెదురు వనాలగానమే. అది ఏదో ఒకరోజున ప్రభాత భేరినాదమోతుంది.

Leave a Reply