హేమ్ మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు 2013 లో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మొదటిసారి అరెస్టు చేసారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు కొరియర్గా పనిచేశాడని, దేశంపై యుద్ధం చేస్తున్నాడని అభియోగాలు మోపారు. 2017మార్చి 7నాడు గడ్చిరోలి సెషన్స్ కోర్టు హేమ్, మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2024మార్చి 5నాడు బాంబే హైకోర్టు-నాగ్పూర్ బెంచ్ ఈ కేసులో హేమ్, మరో ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

నన్ను ‘అరెస్టు చేశారు’ అనను. నన్ను కిడ్నాప్ చేశారు, 2013 ఆగస్టులో. ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీల ఆరోగ్య సమస్యలపై పనిచేస్తున్న డాక్టర్ ప్రకాశ్ ఆమ్టేను కలవడానికి ఆ సమయంలో నేను ఢిల్లీ నుంచి వెళ్తున్నా. ఆయన పని చేస్తున్న కష్టభరితమైన పరిస్థితుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వుండింది. 19వ తేదీన నేను ఢిల్లీ నుంచి బయలుదేరి, 20వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో చంద్రపూర్ జిల్లాలోని బలార్షా రైలు స్టేషన్లో దిగాను. అక్కడ నుంచి ప్రకాశ్ ఆమ్టే ఆసుపత్రి ఉన్న హేమల్కసాకు బస్సులో వెళ్లాలని అనుకున్నాను. సాధారణ దుస్తుల్లో వున్న కొంతమంది అకస్మాత్తుగా వచ్చి నన్ను పట్టుకున్నారు. అక్కడ ఎవరితోనూ నాకు శత్రుత్వం లేదు. వాళ్ళు ఎవరో నాకు అర్థం కాలేదు. ఒక వాన్లోకి ఎక్కించారు. మూడు రోజుల పాటు వేర్వేరు ప్రదేశాల్లో అక్రమ అదుపులో ఉంచారు. ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకెళ్ళేటప్పుడు కళ్ళకు గంతలు కట్టారు. నన్ను నిద్రపోనీయలేదు. చిత్రహింసలు పెట్టారు. 2013 ఆగస్టు 23న అహెరి కోర్టులో హాజరుపరిచారు.

నే ను కొన్ని విషయాల్లో ప్రభుత్వంతో విభేదించవచ్చు, అంతే. అందుకనే మమ్మల్ని శిక్షించారు. ఒక దశాబ్దానికి పైగా కటకటాల వెనుక జీవితాన్ని కోల్పోయాం. అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి.. లేకుంటే మన హక్కులు మన నుంచి లాగేసుకుంటారు.. ప్రమాదకరమైనా సరే మాట్లాడాలి.

మాది ఉత్తరాఖండ్. సమానత్వం ఆధారంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉత్తరాఖండ్లో జరిగిన  ఉద్యమం అక్కడి విద్యార్థులు, యువతపై ప్రభావం చూపింది. నేను జేఎన్యు క్యాంపస్కు వచ్చేటప్పటికి, ఉత్తరాఖండ్ రాష్ట్రం కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమం నన్ను ప్రభావితం చేసింది. గిరిష్ తివారీ ‘గిర్దా’ వంటి సాంస్కృతిక కవులు ఉత్తరాఖండ్ ఉద్యమంలో భాగంగా ఉన్నారు.

ఉత్తరాఖండ్లోని మారుమూల గ్రామాల్లోని విద్య, నీటి కొరత, వలసలలాంటి సమస్యలు ఆయన పాటల్లో వ్యక్తమయ్యేవి. కొండ ప్రాంతాల్లో రోడ్లు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఢిల్లీకి వలస పోవాల్సి వచ్చింది. ప్రజల బాధలను చిత్రీకరించే గిర్దా పాటలు నన్ను ప్రభావితం చేసాయి.

నేను ఈ ఉద్యమంలో ఒక విద్యార్థి-సాంస్కృతిక సంస్థ ద్వారా చేరాను. విద్యార్థి, కార్మిక, రైతాంగ వర్గాలను జైలుకు పంపడానికి బూటకపు కేసులను పెడుతున్న ప్రభుత్వ అణచివేత విధానాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మేము ప్రయత్నించాం. అధికార యంత్రాంగపు విధానాలకు వ్యతిరేకంగా మేం ప్రచారం చేశాం.

2010 లో జెఎన్యులో చేరినప్పుడు కూడా వివిధ ఉద్యమాలలో పాల్గొన్నాను. జెఎన్యు విద్యార్థుల పోరాటాలకు ప్రసిద్ధి చెందింది. వివిధ విద్యార్థి సంస్థలు సమస్యలపై పోరు చేసేవి. ఒక సాంస్కృతిక కార్యకర్తగానూ, సామాజిక న్యాయం కోసమూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను, అన్యాయమైన అరెస్టులకు వ్యతిరేకంగా నా గళాన్నెత్తాను. ఈ నేపథ్యం నా అరెస్టుకు దారితీసింది.

నాపై చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు. నేను నిషేధించబడిన సంస్థలకు కొరియర్గా పని చేస్తున్నానని ఆరోపించారు. కానీ నేను ఎవరి సందేశాన్ని ప్రచారం చేస్తున్నాను? నా పాటల ద్వారా, నా డప్పు ద్వారా ప్రజల బాధల గురించి అవగాహన పెంచడానికి మాత్రమే పనిచేశాను. ఇలా చేయడం ఈ దేశంలో రాజ్యాంగ విరుద్ధం కాకపోతే కనక నన్ను తప్పుడు కేసులో ఇరికించినట్లే. సుదీర్ఘ పోరాటం తరువాత, చివరకు నాకు న్యాయం జరుగుతుందని, నన్ను విడుదల చేస్తారని నాకు ఎప్పుడూ అనిపించేది.

మీడియా, సోషల్ మీడియా, పెద్ద కంపెనీలు, అధికారంలో ఉన్నవారు యువతకు కార్లు, బంగళాలు మొదలైన వాటి వినియోగదారులుగా మారాలనే కలలను చూపించడం మన తరం దురదృష్టం. కానీ వాస్తవికత ఏమిటి? మనం అభివృద్ధి చెందిన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం, కానీ కోట్లాది మందికి సంవత్సరాల పాటు ఉచిత రేషన్లు అందించాలి. ఎందుకంటే వారికి తమ నిత్యావసరాలను కొనగలిగే ఆర్థిక స్థోమత లేదు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశ వాస్తవ చిత్రం.

జైలులో ఉన్నప్పుడు వివిధ సమస్యల గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది. బయట ఏ మాత్రం లెక్క చేయని  చిన్న విషయాలు కూడా అక్కడ ఎంతో విలువైనవిగా కనబడతాయి. ఉదాహరణకు, మీకు పెన్ అవసరమైతే, మీరు దాని కోసం దరఖాస్తు చేసుకోవాలి, జైలు అధికారి సంతకం పెట్టాలి – ఇలా ఒక ప్రక్రియను అనుసరించాల్సి వుంటుంది. అక్కడ మానవ హక్కులు లేకపోవడంతో , మీరు ప్రాథమిక విషయాలను కూడా అడుక్కోవాల్సి వుంటుంది.

జైలు లోపలి నుండి బయట పరిస్థితిని చూస్తే, మేము చదువుకున్న క్యాంపస్లో విద్యార్థి ఉద్యమాలకు అవకాశం వుండేది- కనీసం మేము నిరసనలు, ర్యాలీలను నిర్వహించగలిగాము. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు కుంచించుకుపోతున్నాయి. ప్రభుత్వం దాడులతో ప్రతిస్పందిస్తుంది. విభిన్న అభిప్రాయాలకు, హక్కులకు గల స్థలం తగ్గిపోతూ ఉండగా ఒక నిర్దిష్ట సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు. మానవ హక్కుల కోసం మాట్లాడే వారు కూడా నిరంతరం అణచివేతకు, జైలు శిక్షకు గురవుతున్నారు. న్యాయం కోసం ప్రజలు పోరాడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు మనం ఎదుర్కొన్న ఆరోపణలు ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా విస్తరించాయి. ఆరోపణల పరిధి విస్తరించింది.

భారతదేశం లాంటి దేశాలలో ఈ రోజున ఒక బలమైన న్యాయ వ్యవస్థ అవసరం వుంది. ప్రధాన న్యాయమూర్తులతో సహా ఈ దేశ న్యాయవ్యవస్థ, న్యాయం అందించడంలో ఆలస్యాన్ని నివారించాల్సిన అవసరాన్ని, జైలుకు బదులుగా బెయిలుకు ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే నొక్కిచెప్పింది. అయితే, ఆచరణలో ఇది జరగడం లేదు.

మా కేసును పరిశీలిస్తే, మాపై ఆరోపణలు చేసిన కార్యకలాపాలు ఏవీ లేవు. మా కేసు పూర్తిగా అబద్ధాలపై ఆధారపడింది. అయినా మేం 10-11 సంవత్సరాలకు పైగా జైలులో గడపాల్సి వచ్చింది. ఈ విధంగా, మీడియాలో, ప్రజలలో ఒక భయంవేసే మానసిక రుగ్మతను కలిగించారు. భీభత్సం సృష్టించే వాతావరణం ఏర్పడింది, ఒత్తిడి చేసే ఎత్తుగడలను ఉపయోగించారు.

న్యాయవ్యవస్థలో ఉన్న వారు దీని ద్వారా ప్రభావితం కాకూడదు. కానీ అలాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

నా ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రజాస్వామిక మార్గమైన నిరసనల ద్వారా నా అభిప్రాయాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించాను. ఇది ప్రజాస్వామిక వ్యవస్థ మనకు ఇచ్చిన హక్కు. ఏదేమైనా, నేడు దేశంలో, ప్రపంచంలో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా ప్రస్తుత వ్యవస్థ ఉత్పత్తి చేసినవే.

.మీరు ప్రస్తావిస్తున్న (హింసాత్మక) ఉద్యమాల విషయానికి వస్తే, అవి నిర్దిష్ట సామాజిక, ఆర్థిక పరిస్థితుల నుండి ఉద్భవించాయి. వాటికి స్వంత చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. మన ఆలోచనలు లేదా ఇతరుల ఆలోచనలు మాత్రమే వాటి వెనుక ఉన్న కారణాలను ఆపలేవు. అసమానతకు బదులు సమానత్వంపై ఆధారపడిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడేంతవరకు, సమతుల్య వ్యవస్థ వైపు సమర్థవంతంగా వెళ్ళే వరకు, సమాజంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతాయి.

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వంటి ప్రధాన సంస్థకు నేను వచ్చినప్పుడు, నా అధ్యయనాలను కొనసాగించాలనే కల నాకు ఉండేది. ఇప్పుడు, 10 సంవత్సరాల తరువాత, విద్యాపరంగా, వ్యక్తిగతంగా, ఇది ఒక పెద్ద నష్టం. నేను ఇప్పుడే విడుదల అయ్యాను, 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘకాలం. నా భవిష్యత్తు కోసం నేను ఏ దిశలో వెళ్ళాలి అనే దాని గురించి నేను ఆలోచించాలి.

ఈ మొత్తం చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో, ఇప్పటికీ న్యాయాన్ని అభిమానించే  ప్రజలు ఉన్నారు. కానీ మనం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే స్థాయికి ఎదగడానికి న్యాయ వ్యవస్థ చేద్యాల్సింది ఇంకా ఎంతో వుంది.

అటువంటి పరిస్థితిలో ప్రజలు మరింత ఆత్మ స్థైర్యంతో జీవించాల్సి వుంటుంది. జైళ్లలో కూడా న్యాయం కోసం పోరాటం కొనసాగించాలి. ప్రజాస్వామ్యంలో నేరమని భావించదగిన నేరం నేను చేయకపోయినప్పటికీ, నాకు శిక్ష విధించినప్పుడు, చాలా కాలం పాటు జైలులో వుండాల్సి వస్తుందని నాకు తెలుసు.

న్యాయం పట్ల విశ్వాసం ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ న్యాయ వ్యవస్థ పట్ల నా విశ్వాసం కొనసాగుతోంది. అది ఆలస్యం కావచ్చు, కానీ అది వస్తుంది. ఏదేమైనా, 10 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలం, ఇది భర్తీ చేయలేం. జైలులో వైద్య సదుపాయాల కొరత కారణంగా ఒక ఆదివాసీ  విచారణ ఖైదీ మరణించడంవల్ల 10 సంవత్సరాల తరువాత నా విడుదల అసంపూర్ణంగా అనిపిస్తుంది. దీనికి వ్యవస్థనే బాధ్యత వహించాలి.

లోపల నుంచి చూస్తే, మనం 10×10 సెల్ నుండి పెద్ద స్థలానికి విడుదలైనప్పటికీ, అది కేవలం భౌతికంగా వచ్చిన  స్వేచ్ఛనే కానీ మానసికంగా కాదు, ఎందుకంటే మా కేసు కోసం పోరాడిన లేదా మాకు సహాయం చేసిన కొందరు ఇప్పటికీ జైలులో ఉన్నారు. ప్రొఫెసర్లు జైలులో ఉన్నారు. ‘నేరస్థులు’ అని పిలవబడే వారు కూడా అలా పుట్టలేదు సామాజిక-ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యవస్థ వల్ల అలా అయారు. ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థ కారణంగా వారు కూడా జైళ్లలో ఉన్నారు.

కాబట్టి, వారు లేకుండా, నా వ్యక్తిగత స్వేచ్ఛ పరిపూర్ణంగా అనిపించదు. కానీ బయటకు వచ్చి మీ అందరినీ, నా కుటుంబాన్ని, స్నేహితులను కలుసుకోవడం ఒక ఉపశమనం.

మార్చి 17, 2024

https://www.outlookindia.com/national/i-only-spread-the-message-of-suffering-jnu-student-hem-misha-walks-out-of-prison-after-10-years

Leave a Reply