దేవయాని బాధతో మూల్గింది. మెల్లగా వాకర్‌ పట్టుకుని నడుస్తూ బాత్‌రూం నుంచి బయటకు వచ్చి మెల్లిగా మంచం మీద కూర్చుంది… ఇంకా ఎన్ని రోజులో ఈ బాధ…

దేవయానికి తనకి అయిన యాక్సిడెంట్‌ గ్నాపకం వచ్చింది. కోడలుగా అత్తకు చాలా సేవలు చేసింది. మలమూత్రాలు ఎత్తిపోసింది. నోటికి ముద్దలు పెట్టింది… చంటిబిడ్డకు పోసినట్లు స్నానాలు పోసింది. పిచ్చెక్కి రోడ్లమీద పారిపోతే ఎన్నిసార్లు ఉరుకులు పరుగులెత్తి తెచ్చుకుందో… ఒక్కతే పిచ్చి అత్తను పట్కొని హాస్పిటల్‌ చుట్టూ తిరిగిందో ఆమెకి కూడా ఆరోగ్యం ఏమీ బాగుండదు. అయినా అత్తను తల్లికంటే ఎక్కువ చూస్కుంది. ‘ఆ పుణ్యమంతా ఆమెదే. అందుకే నిన్న రాత్రి అద్దం మీద పడ్డం కొద్దిలో తప్పిపోయింది. లేకపోతే మెడకోసేసేది. ఇంతకీ దేవయాని పిల్లలు అదృష్టవంతురాలు చిన్న ప్రమాదంలో ఆమె మీద చెడంతా పోయింది. గాజుముక్క నడుముకి గుచ్చుకుంది అంతే…’ వదినలు, అత్తలు, మామయ్యలు దీవెనలతో ముంచెత్తుతున్నారు దేవయానిని. తోటి కోడళ్లు, బావలు మూతి విరుస్తున్నారు. రుసరుసలు పోతున్నారు. వాళ్లెప్పుడూ అత్తమ్మ వకుళను చేరదీసింది లేదు మరి. అలాగే చిన్నప్పుడే భర్తపోయిన పెద్దాడబిడ్డ శశికళను కూడా వాళ్ళు పట్టించుకున్నది లేదు. ఆమె నుంచి, చెడు అన్నీ దేవయానే చూస్తుంది. ఇంట్లో పెట్టుకుని దేవయాని స్కూల్లో టీచర్‌గా పని చేస్తూనే ఇంట్లో అత్తగారిని చూసుకునేది రాత్రింబగళ్లు సేవలు చేసింది. ఇద్దరు తోటి కోడళ్లకు పూజలు, వ్రతాలు, నోములు… చేస్కుంటూ షాపింగులూ, పక్కిళ్లు, పేరంటాలు, పెళ్లిళ్లు అంటూ తిరగడం… ఆస్తులెట్లా కూడా బెట్టాలో చూస్కోవడంలో చాలా బిజీగా ఉంటంతోనే సరిపోతుంది. అత్తగార్ని చూస్కునే తీరికే లేదు. దేవయానికి కూడా ‘‘ఏం చూస్కుంటవు పిచ్చిలేసిన ముసలిదాన్ని వృద్ధాశ్రమంలో వేసి వదింలించుకో. ఎట్ల చేస్తున్నవు గలీజు పనులన్నీ’’ అంటూ హితబోధ చేస్తారు చాలా సార్లు. ‘అత్తమ్మ బిడ్డలు, కొడుకులు లేని అనాధలు కాదు… నేనున్నాను ఆమెకి’ అని దేవయాని అత్తని తన దగ్గరికి శాశ్వతంగా తెచ్చేసుకుంది.

చివరి ఐదేళ్లల్లో చివరి నాలుగు నెల్లకి మాత్రం పని వాళ్లు దొరికారు అప్పటి దాకా దేవయానే చేసింది. ‘ఆఁ పనోళ్లమీద వదిలేసి ఊరి మీదకి పొయ్యింది. పనోళ్లు తిండి సరిగ్గా పెట్టలేదు అందుకి సచ్చిపోయింది మా అమ్మ అని పెద్ద బావ తన భార్య తల్లికి  తిండి కూడా పెట్టని కర్కసత్వాన్ని, రెండో కోడలు పదే పదే తల్లిని స్వంత ఇంట్లోంచి వెళ్ళగొట్టిన క్రౌర్యాన్ని కనిపించనివ్వకుండా చేసే ప్రయత్నం చేశాడు. డెబ్భై ఏళ్ళ తల్లి చావుకి అన్నం పెట్టి సాదిన దేవయానే కారణం అన్నట్లు తల్లి చనిపోయిన మూడ్రోజులకి నిందలు, ఆరోపణలు ఆ చావింట్లో మొదలయ్యాయి. ఆ రోజు ప్రమాదం తప్పింది కానీ మరుసటి రోజే ఇంకో ప్రమాదానికి దేవయాని బలి అయ్యింది. దేవయాని మైల మూలాన్న వంటింట్లోకి వెళ్ళకూడదు. పెద్ద తోటికోడలు కూతురు నేను చేయను అని కూర్చుంది. పెద్దాడబిడ్డ మోకాళ్ళ నొప్పులతో ఎక్కలేక దిగలేక అవస్థ పడుతూ చేస్తోంది. ఇక ఆ రోజే వచ్చిన తన బిడ్డలు ఇద్దర్నీ తల స్నానం చేసి మడి వంటలకు సంప్రదాయమని పొద్దున్నే లేచి పెరట్లో పొయ్యి వెలిగించడానికి వెళ్ళి చీకట్లో కనపడక ఐదు గంటలకు లేచి వంటింటి గడప మీద గుంటలో కాలుపడి ఊహించని విధంగా పడిపోయింది. పదిహేను నిమిషాల పాటు దేవయాని నొప్పి భరించలేక పెద్దగా ఏడుస్తూ ఉండిపోయింది. దేవయాని భర్త జగన్‌, పిల్లలు మెలకువ వచ్చి పరిగెత్తుకొచ్చారు. కాలి చీలమండ నుజ్జు నుజ్జు అయిపోయింది. హుటాహుటిన హైద్రాబాద్‌ తరలిస్తే సన్‌రైజ్‌ హాస్పిటల్లో పది చిన్న చిన్న రాడ్స్‌ వేసారు. ఆరు వారాల బెడ్‌ రెస్ట్‌… కాలు మళ్ళీ కలుక్కుమంది దేవయాని స్పృహలోకి వచ్చింది. ‘ఓప్‌ా… ఇంకెన్నాళ్ళూ… ఈ నరకం’ పక్క మీద దొర్లుతూ జగన్‌ అతని చేతులు తన గుండెలపై… దొర్లుతున్న అతని దేహంలో అసహనపు కదలికలు. ఇతనికి తిండి లేకపోయినా ఫరవాలేదు. సెక్స్‌ కావాలి. తనకెలా ఉన్నా ఫర్వాలేదు తన శరీరం కావాలి. నూట రెండు జ్వరం ఉన్నా, పీరియడ్స్‌లో ఉన్నా, కాన్పై కుట్లు పడి రెండు నెల్లు మాత్రమే అయినా… సెక్స్‌ కావాలి. దేవయాని అసహ్యంతో జగన్‌ చేతిని బలవంతంగా పెకిలించినట్లే తీసి తోసి వేసింది. జగన్‌ కోపంతో ఘూర్ణిల్లాడు. విసురుగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లి సిగరెట్టు వెలిగించాడు. దేవయాని బాధను అదిమిపెడుతూ పక్కకు ఒత్తిగిల్లింది. సర్జరీ అయిన కాలు నడుము దగ్గర్నించి పాదపు గాయం వరకూ నొప్పితో సలుపుతుంటే… నడుము, తొడ ఎముక పైభాగం బిగుసుకుపోయింది. ఇంకా ఫ్లెక్సిబిలిటీ రాలేదు. కదలికే కష్టంగా ఉంది కానీ ఇతగాడికి అదేమీ పట్టదు. తన అవసరమే ముఖ్యం ఆరు నెలలు జాగ్రత్తగా

ఉండమన్నాడు డాక్టరు. అయినా సెక్స్‌ కోసం వేధిస్తున్నాడు. ‘ఏదో ఒక కారణం కావాలి మీ ఆడాళ్ళకి… ఛ… ఛా బతుక్కు సుఖం లేదు…’ అంటూ విసుక్కుంటాడు. ఆడాళ్ళకేగా నెలసరులు, ప్రసవాలు, ఆపరేషన్లు వంటిళ్ళల్లో, పెరట్లో రాత్రింబళ్ళు అత్తింటికి చాకిరీ చేస్తూ, ఆదరాబాదరా పరిగెడుతూ కాలు జారి పడిపోతూ… ఎముకలు విరగొట్టుకుంటూ… మళ్ళా అవి అతుక్కోడానికి పూర్తి టైం కూడా ఇవ్వలీ మగాళ్ళు.

వదిన శశిరేఖ గొణగడం మొదలెట్టింది ‘ఇంకా ఎంత కాలం… నేను చేసి పెట్టాలీ’ అంటూ దేవయానికి భోజనం కంచంలో వడ్డించి తెచ్చి స్టూల్‌ మీద పెట్టటం, టీలు అందివ్వడం మహా అవమానంగా ఉంది ఆవిడకు. తనకు రోగమూ.. రొష్టూ  వచ్చినప్పుడూ… రాకండా పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడూ మరదలు ఓపిగ్గా బాధ్యతగా చేసిందో అంతా మర్చిపోయిందావిడ. తన టీవీ సీరియళ్ళూ అమ్మలక్కలతో తీరుబడి ముచ్చట్లు, తీర్థయాత్రలూ మునుపటిలా కొనసాగటం లేదావిడకు. లేని మోకాళ్ళ నొప్పులు నటిస్తోంది.

దేవయానికి కూర్చున్న చోటే అన్నీ చేయించుకోవాల్సి వస్తున్నది. ‘కిందికి వస్తే చాలు ఏదో పని చెప్తుంది… కనిపించడం పాపం’’ కాసిన్ని మంచి నీళ్ళడగిన కూతురు మాటలు… పక్కకి తప్పుకు పోతూ… పూర్తి సెల్‌ఫోన్‌లో మునిగిపోయిన కూతురి మాధుర్య మొఖంలో కాఠిన్యం… విసుగు… పద్దెనిమిదేళ్ల కొడుకూ అంతే, చిన్నప్పుడు కింద పడిపోయిన ఏడుస్తున్న కూతుర్ని వంట చేస్తూ పరిగెత్తుకు వచ్చి ఎత్తుకుని గుండెలకు హత్తుకుని నొప్పిని పోగొట్టిన సందర్భాలు, జ్వరాలు, నెలసరుల నొప్పుల్లో తనే నొప్పి మాత్రలా మారిపోయి తగ్గించిన రోజులు… సెల్‌ఫోన్ల మత్తులో మమకారాలు బాధ్యతలు మర్చిపోతున్నారు ఈ కాలం పిల్లలు గుర్తుకు రాదా… ఈ పిల్లకి?

ఏమిటీ అన్యాయం…? క్షణం తీరిక లేకుండా ఇల్లంతా పరిగెడ్తూ తను సేవలు చేసినప్పుడూ ఆనందంగా అనుభవించిన వీళ్లే… ఈ రక్త సంబంధీకులే ఈ రోజు తన ఎముకలు విరిగి కుప్పకూలితే… దగ్గరికి కూడా రావట్లేదు. ఇంతగా ప్రేమలేని మనుషుల మధ్య నా తను బతుకుతున్నది? పధ్నాలుగేళ్ల ఏళ్ళ కూతురు మాధుర్య కూడా అంతేనా… లేక అది అడిక్ట్‌ అయిన సెల్‌ఫోన్‌ తప్పా? భర్త జగన్‌ నుంచి ఎన్నడూ ప్రేమ లేదు. వాళ్ళ అవసరాలు తీర్చిన తననెంత ప్రేమించారు… ఇప్పుడేమయింది అదంతా? ఇవే నిజ స్వరూపాలా వీళ్ళందరివీ?

‘‘కొద్దిగా ఈ కూరగాయలు కోసివ్వు ఊర్కెనే కూర్చుంటే కాళ్ళు చేతులు ఎట్లా పని చేస్తాయి పైగా ఉషారుగా కూడా ఉంటావు’’ అర్థ కిలో బెండకాయలు రెండు ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, గోంగూర కట్టలు తెచ్చి పడేసింది వదిన శశిరేఖ… దేవయాని ముందు.

అలా మొదలయ్యింది దేవయాని మళ్ళీ వంటగది పునః ప్రవేశం… వాకర్‌తో కుంటుతూనే వెళ్ళి కూర పోపెయ్యడం, మళ్ళీ వచ్చి హాల్లో తన మంచం మీద కూర్చోవడం, మళ్ళీ వెళ్ళడం… తిరిగి కుంటుతూ రావడం… హాల్లో కూర్చునే చపాతీలు ఒత్తడం, చాయ్‌ చేసి కప్పుల్లో వడపోసి అందర్నీ కేకెయ్యడం ఎవరు కుంటి వాళ్ళు? ఎవరికి కాలు విరిగి ఫ్రాక్చర్‌ అయ్యింది?

‘‘ఏమ్మా ఎందుకింత వాపు వచ్చింది రెస్ట్‌ తీస్కోవడం లేదా’’ ఆర్థో డాక్టర్‌ దేవయాని కాలు చూస్తూ ఆశ్చర్యపోయాడు. పది రోజుల క్రితమే కుట్లు విప్పారు. అప్పుడూ ఇంతే వాపుతో వచ్చింది. విప్పుతున్న ప్రతీ కుట్టుకీ… నొప్పితో విలవిల్లాడిరది. ‘‘సర్వెంట్‌ మానేసింది వదినకి మోకాళ్ళ నొప్పులు పాపకి సెల్‌ఫోన్‌ ఎడిక్షన్‌ మా ఆయనకి… ఆఫీస్‌ నించి వచ్చాక రెస్ట్‌ కావాలి… ఆరు వారాలు తీసుకున్న రెస్ట్‌ చాలు… వాకర్‌ ఉందిగా ఇక పనులు మొదలుపెట్టు అన్నారు ఇంట్లో వాళ్ళు. ఇరవై ఏళ్ళు నేను చేసిన చాకిరీకి ఆరు వారాల బోనస్సు మాత్రమే కాదు.. కాదు సిక్‌ లీవు మాత్రమే దొర్కింది… డాక్టర్‌గారూ… మా భర్త బాస్‌ గారు నా సిక్‌ లీవు పొడిగించడానికి ఇష్టపడడం లేదు. అందుకే నా కాలు పాపం పండినట్లు ఉబ్బిపోతోంది’’ అంది. దేవయాని పక్కనే ఉన్న భర్త జగన్‌న్ని చూపిస్తూ వ్యంగ్యంగా… ఆగ్రహాన్ని.. దుఃఖాన్ని అదిమిపడ్తూ ముద్దవుతూ వణుకుతున్న గొంతుతో. జగన్‌ నివ్వెరపోయాడు. డాక్టర్‌ దిగ్భ్రాంతికి గురై… ‘దిస్‌ ఈస్‌ టు మచ్‌! ఆమెకి పూర్తి రెస్ట్‌ ఇవ్వండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి… అమ్మా మీరు రెస్ట్‌ తీస్కోండి… కానీ మధ్య మధ్యలో నడవాలి ఫిసియోథెరపీ చేయాలి’ అన్నాడు. ‘నడుస్తున్నా డాక్టర్‌… వంటింటికీ… బెడ్‌రూంకీ మధ్య నా వాకింగ్‌ బ్రహ్మాండంగా నడుస్తున్నది’ అంది దేవయాని నీరసంగా నవ్వుతూ!

డాక్టర్‌ మాటలకి జగన్‌ రగిలిపోయాడు. ఇంటికొచ్చి అక్కకి చెప్పాడు. ‘సిగ్గులేకపోతే సరి… అట్టా ఎట్లా మాట్లాడావు డాక్టరుతో… ఆయన మన దూరపు బంధువని తెలిసి పరువు పోదూ మనాళ్ళ మధ్యా… నీకు సిక్‌ లీవు ఇవ్వట్లేదా మేం? ఈ ఆరు వారాలూ ఎవరు చేసారుట మా దెయ్యాలా… చెప్పి చావ్వేం? ` శశిరేఖ అరుపులతో వంటిల్లు కీచుమంది.

‘నాకు ఎక్సామ్స్‌…’ కూతురు అరిచింది ఇంస్టాగ్రామ్‌లో మేకప్‌ రీల్స్‌ స్క్రోల్‌ చేస్తూ చూపు కదపకుండా! కొడుకు నిఖిల్‌ సెల్‌ఫోన్‌లో తన పంచేంద్రియాలూ ముంచేసాడు… ఏమీ వినపడదు వాడికి.

ఆఫీసులో చచ్చీ చెడీ చాకిరి చేసి ఇంటికొచ్చి రెస్టు తీస్కోక… నీకు కూడా చాకిరీ చేయమంటావా… అయినా ఇంకా ఎన్నాళ్లు  నీకీ రెస్టు? నేనైతే ఇన్ని రోజులు తీసుకోను’’ జగన్‌ పట్టరాని ఆగ్రహంతో కీచుగొంతుతో అరుస్తూ తాగేసిన చాయ్‌కప్పు నేలకి విసిరికొట్టాడు… దేవయాని మౌనంగా ముడుచుకు పడుకుంది. వారం రోజులు వదిన గొణుక్కుంటూనే దేవయానికి చేసి పెట్టింది. జగన్‌ అక్కకి కూరలు తిరిగి పెట్టాడు.

‘‘చూడు… నీకు సేవ చేస్తున్నాం. మళ్ళీ పేపర్‌ ప్రకటనలు ఇవ్వబాకు మేం చేయట్లేదనీ… నీతో చాకిరీ చేయించుకుంటున్నామనీ’’ అన్నాడు కూరగాయలు కోస్తున్న కత్తి చూపిస్తూ బెదిరింపులాగా. ప్రేమ, కరుణ లేని సేవలు భారంగా భావిస్తూ చేసే సేవలు తనకెందుకు..? దేవయానికి కళ్ళు తిరిగాయి. పాప కోసం చూస్తు జాబ్‌ కూడా వదులుకొని హౌస్‌ వైఫ్‌గా సెటిల్‌ అయిపోయింది. లేకపోతే… ఈ రోజు తన పరిస్థితి ఇలా ఉండేదా? తనకి తండ్రి ఇచ్చిన సిటీ అవుట్‌ స్కర్ట్స్‌లో ప్లాటు తప్ప ఏమీ మిగల్లేదు. ఏం చేయాలి? ఈ చీదర నుంచెలా తప్పించుకోవాలి?

వారం రెస్టు వలన వాపు తగ్గింది… మళ్ళీ ఇంట్లో అదే గొడవ… చేయలేకపోతున్నామన్న విసుర్లు తమ సుఖాలు కోల్పోతున్న రుసరుసలు… దేవయానిలో ఒత్తిడి పెరగసాగింది. చనిపోయిన అమ్మా నాన్న గుర్తొచ్చారు. పరదేశంలో ఉన్న ఏకైక అన్నా వదినా గుర్తొచ్చారు. కన్నీళ్ళు కారిపోసాగాయి. ఒకటి రెండు సార్లు వాకర్‌కి గడప తట్టుకొని పడబోయి తనను తాను సంభాలించుకున్నా… భయంతో చమటలు పట్టాయి. మూడోసారి పూర్ణ రక్షించింది. దేవయానికి ఇదంతా అవమానంగా అనిపిస్తోంది… కోపం… నిస్సహాయత… దుఃఖం ముప్పిరిగొంటున్నాయి. రక్షణ, భద్రత, ప్రేమలేని మనుషులున్న ఇంట్లో ఉండ బుద్ధి కావాట్లేదు. తన ఫ్రాక్చర్‌ని తనే పూడ్చుకోవాలి… నొప్పైనా… మళ్లీ విరిగినా… అంతేనా?

తన వల్ల కావట్లేదు. బాల్య స్నేహితురాలు ఫర్హానా తనింటికి వచ్చేయ్యమంటోంది. మొన్నొచ్చి చూసిపోయింది. ఫర్హానాకి అంతా అర్థం అయ్యింది. ‘నీకు గర్భ సంచి ఆపరేషన్‌ చేసారుగా వదినా… పూర్తిగా కోలుకున్నారా… ఆసుపత్రిలో… ఇంట్లో దేవయాని మీకెంత సేవ చేసిందో తన తిండీ, నిద్రా మాని… అప్పుడు దేవయాని దేవతయ్యింది. ఇప్పుడు భరించరాని దయ్యం అయ్యిందా’’ అంది కోపంగా వదిన శశిరేఖతో. ముఖం చిటపటలాడిస్తూ ‘‘నేనేం చేయ్యకుండానే నీ ఫ్రెండ్‌ కోలుకుంటోందా… మాటలు జాగ్రత్తగా రానీ’’ అంది వదిన కోపంగా.

‘‘దేవీ… నా ఇంటికొచ్చేసి ఉండు… ఒక ఆర్నెల్లు వీళ్ళకు కనపడకు’’ అంది ఫర్హానా కోపంగా. రోజూ మాట్లాడుతుంది. కనీసం భర్త అయినా ప్రేమగా ఉంటే… పోనీ… కూతురైనా… కొడుకైనా! వదినకి ఎలాగూ తను పరాయిదే… తనని స్వంతం ఎప్పుడు చేస్కుందని… తన భర్తని.. వదిననీ అంత కఠినంగా ఎవరు చేసారు? అత్తయ్య మామయ్య? మరి వాళ్ళనెవ్వరు చేసారలా? వదిన ఆడదై ఉండీ… తనూ మనో దేహగాయాల నడుమ నడిదీ… అవమానాలు సహించీ వదిన కూడా తన పట్ల అంతే దయలేకుండా ఎలా ఉంది. తనలో అన్ని అవసరాలు చేయించుకుని మరీ… ‘ఉహూ.. తనకి ప్రేమ కావాలి… కారుణ్యంతో కూడిన స్పర్శ కావాలి. భర్తది ఒఠ్ఠి కామ స్పర్శ కారుణ్యం ఎక్కడిదీ అందులో? అతని దగ్గరి తనకి కావల్సిన స్పర్శ దొరకదు… సేవ సంగతి పక్కనే పెడితే… కాలి ఎముక విరిగినట్లు వీళ్ళ మనసులు.. వీళ్ళు కూడా నిలువెల్లా విరిగిపోయారు ఎందుకు?

ఒకపక్క రమ్మనే ఫర్హానా పిలుపు… వదిన చిరాకులు.. మూల్గులు కూతురి కొడుకు నిర్లక్ష్యం.. భర్త నిరాదరణలతో పెరుగుతున్న నిస్సహాయత… ఒత్తిళ్ళ మధ్య దేవయాని తన పనులు… నొప్పిని పళ్ల బిగువన భరిస్తూ… ఇంట్లో వాళ్ళ పనులు మెల్లగా చేస్కుంటోంది. వాకర్‌ విడిచి కాలు నేల మీద మెల్లగా ఆనించగలుగుతున్నది. ఇంట్లో వాళ్ళు హమ్మయ్య అనుకుంటున్నారు. సిక్‌లీవ్‌ పూర్తి చేస్కుని పనిలోకొచ్చిన వంట మనిషీ… పని మనిషిని చూస్తే కలిగే ఆనందం… శాంతి వాళ్ళ మొఖాల్లో కనిపిస్తున్నాయి. తను కోలుకుంటున్నందుకు కాదు… దేవయానికి దుఃఖం వస్తోంది… ఎంత చేసావు శశిరేఖా నీ మరదలికి నీ వల్లే కాదూ… లేచి తిరుగుతోందీ’ పక్కింటి నిర్మలమ్మ మాటలకి… ‘‘ఆఁ… ఎంత చేసినా కృతజ్ఞత ఉండద్దూ… వదినా ఆ డాక్టరుకీ… దాని ఫ్రెండ్‌కీ నేను నా తమ్ముడూ ఏం చేయట్లేదని చెవుతుందట… సిగ్గు లేకండా…’’ అంటోంది వదిన శశిరేఖ. దేవయానికి నవ్వొచ్చింది… కన్నీటితో పాటు ‘‘కిచెన్‌ రూమ్‌ డ్యూటీలో దిగిపోయావుగా ఇంకేం నీ సిక్‌ లీవు అయిపోయినట్లే కదా… ఇంకా బోనస్‌లు ఏమన్నా కావాలా… ఇక మరి బెడ్‌ రూం డ్యూటీ కూడా మొదలుపెడితే పోలా’’ ఆ రాత్రి జగన్‌ అంటుంటే… ‘‘ఒద్దు… ఇంకా చాలా నొప్పిగా ఉంది… డాక్టర్‌ ఒద్దన్నారు’’ అంది దేవయాని వారం క్రితం కావాలని తన తొడమీద జగన్‌ కాలేస్తే ప్రాణం పోయేంతగా కలుక్కుమన్న నడుము… తొడ ఎముకల మధ్య నొప్పిని తలుచుకుంటూ భయంగా. వాడెట్లా చెపుతాడూ ఇల్లాంటి గుట్టుగా బెడ్రూంలో మన మధ్యే ఉంచాల్సిన విషయాలు… ఏం నువ్వేమైనా చెబుతున్నావా ఏంటి సిగ్గు లేకుండా… వాడికి… వాడి పెళ్ళానికి’’ అని అరిచాడు జగన్‌. డాక్టర్‌ భార్య తమకు కొద్ది పరిచయం మాత్రమే ఎలా చెబుతుందీ తను మాత్రం… ‘‘లేదు… నాకే తెలుసు ఇంకా నేను కోలుకోలేదు ఇంటి పనే అతికష్టం మీద చేస్కుంటున్నా’’ అంది అటు తిరిగి కోపంతో బుసలు కొడ్తున్న భర్తను చూస్తూ.

‘‘ఎట్టా చేస్కుంటున్నారు అమ్మగారూ అలా కుంటుతూ ఇంకా ఏం కోలుకున్నారనీ’’ తన వైపు జాలి జాలిగా చూస్తూ అంట్లు తోముతూ… పూర్ణ అన్న మాటలు ఆమె ప్రేమ గుర్తొచ్చాయి దేవయానికి… తన అవసరానికే చేస్తోంది  పూర్ణ తమింట్లో కానీ తనకు ఆర్థిక సహారా అయిన తన మీద ఏదో ప్రేమ… కృతజ్ఞత… పూర్ణని చాలా సార్లు అవసరానికి మించి ఆదుకున్నది తను.’’ మా అత్త ఇంత కఠినం కాదమ్మ గారూ… ప్రసవం అయిన ఆర్నెల్ల దాకా నన్ను ఇంటికాడ్నే ఉంచి తను పనికి పోయింది. పెద్దమ్మ గారికి మీరెంత చేసారు?’ పూర్ణ గొంతులో కోపం…

` ` `

ఆ రాత్రి కూడా దాదాపు తనను ఆక్రమించుకో చూసిన జగన్‌న్ని తోసి వేసింది దేవయాని. ‘ఒద్దని చెప్పానా’ అంటూ జగన్‌ కోపంతో సిగరెట్‌ తాగుతూ… అడ్డంగా ఉన్న స్టూల్‌ని కాలితో తన్ని వెళ్ళిపోయాడు. ఇదొక పీడ అయిపోయింది దేవయానికి కొన్ని రోజుల నించి. రోజు రోజుకి అతన్ని తప్పించుకోవడం దుర్భరంగా ఉంది. మరీ వీధి రౌడీలా చేస్తున్నాడు. తర్వాత ‘‘నీకు తెలీదు మగవాడికి సెక్సువల్‌ ఇన్ట్సింక్ట్‌ ఎంత బలంగా ఉంటుందో సెక్స్‌ కోరిక తీరకపోతే మగవాడి శరీరంలో మనసులో ఎంత ఊహించని మార్పులు జరుగుతాయో… తట్టుకోలేక సిగరెట్లకు బానిసవుతున్నా నా ఆరోగ్యం పాడవుతుందన్న కనీస స్పృహ లేదు నీకు… కాలు మీద భారం వేయకుండా చూస్కుంటా ఒప్పుకో నొప్పొస్తే టేబ్లెట్‌ వేస్కుంటావు’’ ` జగన్‌. ‘‘అవసరం లేదు… నీకుందా నా ఆరోగ్యం పట్ల స్పృహ? ప్రసవాల కుట్లు, ఆపరేషన్లు, గాట్లు, జ్వరాలు, ముట్లు… అని లేకుండా నాతో బలవంతంగా… నా నొప్పి కనీళ్లతో సంబంధం లేకుండా సెక్స్‌ చేస్తూ వచ్చావు. అప్పట్లో అమాయకత్వమూ, భయమూ, పిల్లల కోసం భరించాను.. అప్పట్లో అమ్మా నాన్న పుట్టింటికి తీస్కెళ్లిపోయేవారు కానీ ఇప్పుడు కాలు, ఎముకలు విరిగి మంచాన పడ్డాక చేయడానికి నాకు సేవ మీ మనసులు ఒప్పటం లేదు… నీకు జ్వరాలు వచ్చినప్పుడు, నీకు అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ అప్పుడు పసిపాపలా చూస్కున్నా గుర్తు తెచ్చుకో నీకు… నాకు బాధ్యతల్లో ` బంధాలతో ఉండాల్సిన నిజాయితీతో ఎంత తేడా ఉందో? అసలు రంగులు బయట పడిపోయాయి. మనుషులతో సంసారం చేస్తున్నట్లు లేదు. నన్ను సెక్స్‌ కోసం వేధించకు. నాకు ఇష్టం లేదు… నీ మీద ప్రేమ లేదు… చచ్చిపోయింది.. బలవంతం చేస్తే ఊర్కునేది లేదు పాప గురించి కూడా ఆలోచించను ` దేవయాని.

‘నీకెంత ధైర్యం… ఎక్కడికి పోతావు? పోనీ నేను పోనా మరో దాని దగ్గరికి చెప్పు’ ` జగన్‌.

‘ఛీ సిగ్గు లేదు… కనికరం, మానవత్వం, ప్రేమా ఏమీ లేవు. ఏమన్నా చేస్కో… నా జోలికి రాకు, నా దేహం ఎముకలు సున్నితం… కానీ నా మనసు కాదు గుర్తు పెట్టుకో’ దేవయాని. వాట్సప్‌లో ఇద్దరికీ ఇదే యుద్ధం నడుస్తోంది.

ఆ రాత్రి తాగి వచ్చాడు జగన్‌. దేవయాని మీద కోపంతో రగిలిపోతున్నాడు. మంచి నిద్రలో ఉన్న దేవయానిని ఆక్రమించుకున్నాడు. నొప్పికి మెలకువ వచ్చి పెనుగులాటలోంచి పట్టె మంచం మీంచి తప్పించుకున్న దేవయాని జగన్‌న్ని తోసేసి తలుపు వైపుకి పరిగెత్తింది… ఆమెను అందుకోవాలనుకున్న జగన్‌ తూలి పట్టె మంచం మీద నుంచి జారి కింద పడిపోయి గావుకేక వేసాడు. అతని దేహంలో ఏదో ఎక్కడ ఫట్‌మని విరిగి.. చిట్లిన చప్పుడు వినిపించింది దేవయానికి. ఏమైందంటూ వచ్చిన వదిన శశిరేఖతో ‘తాగొచ్చి మంచం మీద నుంచి కింద పడ్డాడు మీ తమ్ముడు’ అంది దేవయాని.

జగన్‌కి తుంటి ఎముక విరిగింది ఆపరేషన్‌ చేసారు. డిశ్చార్చ్‌ చేసారు ఇంటికి తీస్కొచ్చాక వదిన తల్లడిల్లిపోతూ… నొప్పితో అమ్మా అని మూల్గుతున్న తమ్ముడికి సేవలు చేయసాగింది. తన పని తాను చేస్కుంటూ పిలిచినా దగ్గరికి కూడా రాకుండా.. దూర.. దూరంగా తిరుగుతూ చెప్పలేని భావాలని, ప్రశ్నలని… సమాధానాలని కూడా కళ్ళల్లో నింపుకుని చూస్తూ… ఆగ్రహావేశాలతో ఒణికిపోతున్నాడు జగన్‌. శిలలా బిగుసుకుపోయిన దేవయానిని విచిత్రపోయి చూస్తూ… కూతురు, కొడుకు ఎడమ చేత్తో సెల్‌ఫోను వదలకుండా కుడి చేత్తో అరకొర సేవలు చేస్తున్నారు తప్పించుకుంటూ.. విసుక్కుంటూ. తనని పట్టించుకోని… సేవలు చేయకుండా గాజు కళ్ళలో తిరుగుతున్న దేవయానిని చూస్తుంటే జగన్‌కి నొప్పిగా ఉంది నరకంగా ఉంది… అవమానంగా ఉంది. ఆమె మనసులో ఏం ఉందో అంచనా వేయలేకుండా ఉన్నాడు.

ఆ రోజు ఉదయం… ‘వచ్చి నన్ను తీస్కెళ్ళు ఫర్హానా’ అంటూ కాల్‌ చేసింది పర్సులో తన ప్లాటు కాగితాలు సర్దుకుంటూ దేవయాని. వెళ్తూ వెళ్తూ తను వాడిన వాకర్‌… జగన్‌ మంచం పక్కన పెట్టి… ‘లాంగ్‌ సిక్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోతున్నా’ అంటూ పిచ్చి చూపులు చూస్తూన్న జగన్‌ని… వదినని చిరునవ్వుతో చూస్తూ .. బయట ఉన్న ఫర్హాన కార్‌ ఎక్కడానికి వెళ్ళిపోయింది దేవయాని.

(ఈ కథలో జగన్‌కి ఆక్సిడెంట్‌ కాకపోయినా ముగింపు ఇలానే ఉండేది.)

2 thoughts on “ఫ్రాక్చర్‌

    1. థాంక్స్ జగన్ గారూ… ఇక్కడ bedroom encounter తరువాత మళ్ళీ ఆక్సిడెంట్ అయ్యేది దేవయనికే.కానీ నాకు మళ్లీ ఆమెకి అంత పెయిన్ ఇవ్వడం ఇష్టం లేదు…మెన్ కి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదా..అందుకే జగన్ కి ఆక్సిడెంట్ చేసేసా

Leave a Reply