భర్తను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఆ గృహిణి జీవిత కథనం

తన ముగ్గురు పిల్లలను నిద్ర లేపడం, వారిని, అందులోనూ ప్రత్యేకించి ఏడేళ్ల పిల్లవాడిని ఆన్‌లైన్ తరగతులకు కూర్చోబెట్టడం,  వారు తమతమ స్థలాల్లోనే కూర్చునేట్లుగా చూడడం, క్లాసు జరుగుతున్నప్పుడు వీడియో గేమ్‌లు ఆడకుండా, నిద్రమత్తులోకి జారిపోకుండా లేదా కొట్లాడుకోకుండా చూసుకోవడం లాంటి పనులతో ఉదయం పూట కొంచెం హడావిడిగా ఉంటుంది: గత 17 నెలలుగా ఇదంతా ఒంటరిగా చేస్తూండడంతో ఆ హడావిడి మరింత ఎక్కువవుతుంది.

ఆమెకు పెళ్లై 14 వ సంవత్సరాలయింది. 2007 లో వివాహ ప్రతిపాదన వచ్చినప్పుడు, కనీసం ఒక్కసారైనా విడిగా కలిసి మాట్లాడుకోవాలనుకున్నారు, చాలా సంప్రదాయబద్ధంగా వివాహాలు జరిగే పరిస్థితుల్లో అలా అనుకోవడం ఇప్పటికీ అరుదైన విషయంగానే వుంది.

సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కొత్తగా ప్రారంభించిన పిజ్జా హట్ అవుట్‌లెట్‌లో కలుసుకున్నారు. ఆమె 20 ఏళ్ళ ఢిల్లీ యూనివర్సిటీ మొదటి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని. అతను పూణేలోని సింబయాసిస్ ఇనిస్టిట్యూట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న 25 సంవత్సరాల యువకుడు.

ఆమె మెట్రో ఎక్కింది, అతను కారులో వచ్చాడు. “నేను చూసిన ఇతర మగవాళ్ళలా అతనికి తొందరపడే స్వభావం లేదు, గర్విష్టి కాడు. తెలివైనవాడు, పరిణితి చెందినవాడు, హాస్యానికి స్పందించే గుణం కూడా వుంది ” అని ఆమె అంటుంది.

 “మా యిద్దరి పిజ్జాలలో వున్న మిరపకాయలు ఏరి నాతో తినిపించాడు. ఎలా ఉంటుందో ఊహించండి”.

బిల్లును కూడా ఆమెతోనే కట్టించాడు. తనతో వుండే మగవాళ్లే ఎప్పుడూ బిల్లు చెల్లించడాన్ని చూసిన ఆమెకి  పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఇలా చేయడం ఏ మాత్రం ఊహకందని విషయం. “కానీ నాకు నచ్చింది. నేను అతనితో సమానంగానూ, నా నియంత్రణలో నేనున్నాను”అన్పించింది.

కొన్ని నెలల తరువాత పెళ్లయింది, వారిది సాంప్రదాయక జీవితమే, కానీ ఆనందంగా వుండింది.

తరువాతి కొన్ని సంవత్సరాలు ముగ్గురు పిల్లల పోషణలో గడిచాయి, ఒక కూతురు కూడా కావాలనే కోరిక వారిద్దరికీ ఎంతగానో వుండింది, చిన్నది చాలా కాలానికి పుట్టింది.

మొదట్లో అతను తన తండ్రితోపాటు ఫర్నిచర్ వ్యాపారం చేశాడు. “కానీ అతనికి ఆ పని అంతగా నచ్చలేదు.”  తరువాత  తీర్థయాత్రలను నిర్వహించే ట్రావెల్ కంపెనీని ప్రారంభించాడు.
కానీ అతనికి ఎప్పుడూ తన పనిమీద కంటే వేరే విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉండేది.

మురికి కాలువలకి చెత్త అడ్డం పడితే లేదా మురుగునీటి పైపు పొంగిపొరలినప్పుడు, ఆ సమస్య పరిష్కారమయ్యే దాకా నానా తిప్పలు పడేవాడు.

“నాకు చిరాకేసేది. మనం మూడో అంతస్తులో వుంటున్నాము. మనకేమి ఇబ్బంది లేదు కదా నువ్వు ఎందుకు అంతా కష్టపడాలి అని నేనంటాను.” 

2011-12లో  ‘అవినీతి వ్యతిరేక భారతదేశం’ ఉద్యమంలో జరిగిన అవినీతి వ్యతిరేక నిరసన ప్రదర్శనలలో పాల్గొన్నాడు

2012 లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఏర్పడినప్పుడు, ఈ కొత్త పార్టీ సాధిస్తుందని నిజాయితీగా విశ్వసించాడు

 “ప్రతిసారి ఎన్నికలప్పుడు, నాయకులు హడావిడిగా వచ్చి ఏనుగు, గాలిపటం, చెంచా లేదా ఇంకేదో గుర్తుకు ఓటు వేయమని అడిగేవాళ్లు, కానీ కాలువను శుభ్రం చేయడానికి వారికి సమయం వుండేది కాదు” అని ఆమె గుర్తుచేసుకుంది.

నిరుద్యోగం, మౌలిక సదుపాయాల ఏర్పాటులో వైఫల్యం, పనికిరాని ఎన్నికల ప్రచారాలతో విసిగిపోయిన ఆయన ఆ పార్టీలో కొద్ది కాలమే పనిచేశాడు.

ఇంటికి సంబంధించి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. వారం రోజులూ అతను ఏమి చేస్తాడో ఆమె అడగదు. రాత్రుళ్లు చాలా ఆలస్యంగా, ఒక్కోసారి ఒకటి లేదా రెండుగంటలకు యింటికి వచ్చేవాడు. రోజుల తరబడి కలిసి భోజనం చేసే అవకాశం కూడా వుండేది కాదు. కానీ వారంలో ఒక రోజు, శుక్రవారాన్ని మాత్రం ఇంటి కోసం కేటాయించాలి. పిల్లలు ఇప్పటికీ దీన్ని ‘#మస్తీ శుక్రవారం’ అని పిలుస్తారు. ఆ రోజంతా సోషల్ మీడియా, మాల్, వాటర్‌పార్క్, పబ్లిక్ పార్క్ లేదా అలా కారులో తిరుగుతూ కలిసి గడపాలి.

2017 జూన్ 22 న, 15 ఏళ్ల బాలుడు, జునైద్ ఖాన్ ఫరీదాబాద్‌లో వున్న తన ఇంటికి మధురకి వెళ్లే రైలులో వెళ్తున్నాడు. కొద్ది రోజుల్లో రాబోతున్న ఈద్ కోసం కొత్త బట్టలు, బూట్లు వగైరా కొన్నాడు. రైల్లో సీటు గురించి జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి కొంతమంది అతడిని కత్తితో పొడిచి ఫరీదాబాద్‌లోని అసోటి స్టేషన్‌లో బయటకు నెట్టివేయడంతో, కిందపడి రక్తస్రావమై మరణించాడు. వారు జునైద్‌ను ఎగతాళి చేశారని, అతని గడ్డాన్ని పట్టుకు లాగారని, గొడ్డు మాంసం తినేవాడని తిట్టారని అంటున్నారు.

భారతదేశం రెండు సంవత్సరాల నుండి గోసంరక్షణ ముసుగులో ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన విద్వేష, రక్తపాత నేరాలు చూసింది. ఛాందసవాదులకి రాజ్యం మద్దతుతో ధైర్యం వచ్చింది, వారికి శిక్షనుంచి పూర్తిగా మినహాయింపు దొరుకుతోంది.

కానీ, జునైద్ చిత్రహింసల మరణం ప్రతిఒక్కరి పీడకలను సజీవం చేసింది  – మీరు కేవలం ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి చెందినవారవడం వల్లనే, ఛాందసవాదుల భావాలను దెబ్బతీసినందుకు మిమ్మల్ని చంపేయవచ్చు.

ఐదు రోజుల తరువాత, 2017 జూన్ 28 న, మెజారిటీ సముదాయ ప్రయోజనాలను కాపాడటం పేరిట మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని హత్యలు చేయడాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ‘నాట్ ఇన్ మై నేమ్’ (నా పేరు మీద వద్దు) అనే నిరసన కార్యక్రమం జరిగింది.

అతను కూడా ఆందోళన చెందాడు, ‘నా పేరు మీద వద్దు’ అని నిరసన తెలియచేస్తున్న ఢిల్లీలోని జంతర్ మంతర్‌కి వెళ్లాడు.

అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అదే మొదటిసారి. “అతన్ని అరెస్ట్ చేస్తారనే ఆలోచనతోనే నేను భయపడిపోయాను.”

నిర్బంధం, అరెస్ట్ మధ్య వ్యత్యాసం ఆమెకు అప్పుడే తెలిసింది.

ఆ రోజు అతనితో పాటు మరి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కొన్ని రోజుల తరువాత, వారు యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ (UAH) అనే సలహా బృందాన్ని ఏర్పాటు చేశారు.

ముస్లింలు, ఆదివాసీ క్రైస్తవులు, శ్రీలంక క్రైస్తవుల కోసం కూడా UAH తరచుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేరళ వరదబాధితుల కోసం, పాలస్తీనాలోని ప్రజల కోసం సంఘీభావ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. నంకానా సాహెబ్‌ గురుద్వారాపై జరిగిన దాడిని ఖండించింది, బూటకపు ఎన్‌కౌంటర్ కేసుల కోసం ప్రజా న్యాయస్థానాలను కూడా నిర్వహించింది.

జాతీయ పౌరుల రిజిస్టర్‌ గురించి అస్సాంకు; హింస చెలరేగిన ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్, బహరైచ్, బులంద్‌షహర్‌లకు; భారతదేశంలోని వివిధ ప్రదేశాలకు జర్నలిస్టులు, పరిశోధకులు, కార్యకర్తలతో కూడిన నిజనిర్ధారణ కమిటీలను పంపించింది. పత్రికా స్వేచ్ఛ కావాలని నిరసన ప్రదర్శనలు చేసింది, ప్రశాంత్ కనోజియా వంటి పాత్రికేయులు జైలు పాలైనప్పుడు కూడా నిరసన తెలిపింది.

రోడ్ల మీది మురికి కాలువలు, గుంతలను దాటి ఆవల ఒక కొత్త ప్రపంచం తెరుచుకుంది. “అంతిమంగా అతనికి  తన మార్గం ఏమిటో తెలిసినట్లు అనిపించింది.”  

ఒకటిన్నర సంవత్సరంలోపే, 2019 జూలై 15 న, ద్వేషపూరిత నేరాలకు వ్యతిరేకంగా ఒక హెల్ప్‌ లైన్‌ను కూడా UAH ప్రారంభించింది. ద్వేషపూరిత నేరాల బాధితులకు వేగవంతమైన ప్రతిస్పందన, చట్టపరమైన సహాయ, సలహాలను హెల్ప్‌‌లైన్ అందిస్తుంది.

UAH బృందం సంఖ్యారీత్యా చిన్నది కానీ గతంలో కంటే ఎక్కువ పని చేయడం ప్రారంభించింది.

అతను కొన్నిసార్లు  హెల్ప్‌లైన్ నంబర్‌ వున్న ఫోన్‌ను ఇంట్లో వదిలేసి, ప్రతి కాల్‌కు స్పందించమని అడిగేవాడు.

అత్యవసర సహాయాన్ని సక్రియం చేయడానికి అతను వివిధ ప్రాంతాల్లోని స్థానిక వ్యక్తుల సంప్రదింపు నంబర్లను ఆమెకు ఇచ్చాడు. కానీ తర్కం, మానవత్వాలు ఏమైపోయాయి అనిపించేది ఆమెకు.  

ఒకరోజు జార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఒకరిని చెట్టుకు కట్టేసారని, కొట్టి చంపేస్తారని అనుమానంగా వుందనీ చెప్పాడు. ఆమె ఫోన్ చేసిన వ్యక్తిని ఎగతాళి చేసింది. “మీరు ఫోన్ చేయడం చాలా బాగుంది, కానీ ఎవరినైనా మీ కళ్ల ముందు కొట్టి చంపేస్తుంటే ఫోన్ చేయడం తప్ప మరేమీ చేయరా? కొంతమందిని తీసుకెళ్ళి వారిని ఆపండి. మేము వెంటనే కొంత స్థానిక సహాయాన్ని పంపుతాము కానీ మీరు వెళ్లి అప్పటి వరకు వారిని కాపాడండి”అని చెప్పింది. ఆ రోజు, ఆ వ్యక్తి నిజంగానే రక్షించబడ్డాడు.

కొంతమంది ఫోన్ చేసి “మీరు కేవలం ముస్లింలను మాత్రమే కాపాడతారా? “అని కూడా అడిగారు.

 “2018 డిసెంబర్‌లో బులంద్‌షహర్‌లో ఎవరిని చంపారో  మీకు గుర్తుందా? ” అని నేను తిరిగి ప్రశ్నించాను.

2018 డిసెంబర్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని ఒక పోలీసు పోస్ట్‌లో జరిగిన తుపాకులు, పెద్ద రాళ్లతో దాడి, ఇటుకలు విసరడం, యిల్లు తగలబెట్టడం లాంటివి జరిగిన ఘటనలో ఇద్దరిని – ఇన్స్‌‌పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌ను, నిరసనకారుడు సుమిత్‌లను కాల్చి చంపారు. నగరంలోని ఒక ప్రాంతంలో ఆవులను వధిస్తున్నారనీ, పోలీసు అధికారులను హిందూ వ్యతిరేకులుగా ఎగతాళి చేస్తున్నారని హిందూ మితవాద సభ్యులు ఆరోపించారు.

2015 సెప్టెంబర్‌లో గొడ్డు మాంసాన్ని వినియోగిస్తున్నాడనే అనుమానంతో అఖ్లాక్ (50సం) అనే వ్యక్తి హత్య చేయబడిన ‘దాద్రి హత్య’ కేసును దర్యాఫ్తు చేస్తున్న కారణంగానే ఆ పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్‌ను చంపేశారని సుబోధ్ కుటుంబం ఆరోపించింది.


మరణించిన వారి కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు బులంద్‌షహర్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని UAH తీసుకువెళ్ళింది.

“అయితే ప్రస్తుత భారతదేశంలో ద్వేషపూరిత నేరాలకు మరింత ఎక్కువగా మైనారిటీలు, దళితులే గురవుతున్నారని నేను వారికి చెప్పాను. ఎలాంటి తప్పుడు సమానత్వం ఉండకూడదు. ”

ఈ కాలమంతా, పెద్ద సంఖ్యలో ఇంటికి రావడం ప్రారంభించిన అతిథులకు చాయ్, టిఫిన్లు తయారు చేయడంలో ఆమె సామాజిక జీవితం వంటగదికి పరిమితమైంది. “వారిలో చాలా మంది నాకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు కూడా.”

అపరిచితులతో ఫోన్‌లో మాట్లాడే స్త్రీలను భారతదేశంలో చెడుగా చూస్తారు. కానీ తానెవరో వారికి తెలియకపోవడం అనేది సామాజిక, రాజకీయ అంశాల గురించి వాదించడానికి, సలహా ఇవ్వడానికి, సహాయం చేయడానికి, వినడానికి, నడిపించడానికి, విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆమెకు సహాయపడింది.

&&&

యిక అతను ఇంట్లో వుండడం మానేశాడు. ఎక్కువసేపు బయటే వుంటాడు, ఆదివారం కూడా ఇంట్లో ఉండడు. ‘సాధారణంగా జరుగుతున్నట్లుగానే’ అతను ఆమెను పట్టించుకోవడం మానేసాడు.

స్త్రీలు పెళ్లి చేసుకున్నాక, పాత స్నేహాలను కొనసాగించలేరు, వూరు మారిపోతారు, తమ స్నేహితులతో సంబందాన్ని కోల్పోతారు. “పెళ్ళయినప్పటి నుండి నాకు ఉన్న ఏకైక స్నేహితుడు అతనే. మేము గంటల కొద్దీ మాట్లాడుకొనేవాళ్ళం. ఆ లోటు తెలియడం మొదలైంది.”

2019 డిసెంబర్ 12 న పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదించబడినప్పుడు అతను కలత చెందాడు. ఆ చట్ట వ్యతిరేక నిరసన జరుగుతున్న ప్రదేశాలకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడు. తోటి నిరసనకారులతో కలిసి పోలీసుల బారికేడ్‌లను, తోపులాటలను ఎదుర్కొన్నాడు.

“అతనితో ఎక్కువ సమయం గడపడం కోసమే ఆ తరువాతి వారం ప్రతిరోజూ నేను నిరసనలకు వెళ్లాను అనేది వాస్తవం. అయితే రాబోయే పరిస్థితికి సిద్ధమవుతున్నాననేది నాకు తెలియలేదు.”

భారతదేశంలో ఆశ్రయం పొందకుండా, నిర్దిష్టంగా ముస్లింలను పౌరసత్వ సవరణ చట్టం మినహాయించింది. తరువాత రాబోయే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) తమ పూర్వీకులు భారతదేశంలో నివసించినట్లు వ్రాతపూర్వక, పత్రాల రుజువును చూపించలేని వ్యక్తులను వడపోత చేయడానికి ఉద్దేశించబడింది.

” నువ్వూ, నేనూ, మన పిల్లలు కూడా ఢిల్లీలోనే  పుట్టాము కదా. మీరు దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది?” అని అడిగాను.

CAA, NRC వల్ల పేదలు, అట్టడుగు వర్గాల వారికి కలగబోయే పరిణామాలను వివరించాడు. UAH తయారు చేసిన అస్సాం నిజ నిర్ధారణ నివేదికను చూపించి, వీటి ద్వారా అనేక వందల మందిని ‘అక్రమ పౌరులు’ గా ప్రకటించి ఎలా నిర్బంధ కేంద్రాలకు పంపించారో వివరించాడు.

మహిళల నేతృత్వంలో నిరంతర దేశవ్యాప్త ఉద్యమాన్ని మేము మొదటిసారి చూస్తున్నాము. 2019 డిసెంబర్ 19 న మొదటిసారిగా, ఆమెను నిరసన స్థలం నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధ్యతా రహితమైన తల్లిగా మందలిస్తూ కుటుంబ సభ్యుల నుండి ఆ రోజు అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి.

 “నేను నా పిల్లల హక్కుల కోసం కూడా నిరసన చేస్తున్నానని, నిరాశ్రయుల హక్కుల కోసం, నా ఇంటి పనివాళ్ళ కోసం, ఎలాంటి పత్రాలు లేని వారెవరి కోసమైనా సరే, వారు ప్రతిరోజూ సజీవంగా ఉండటానికి పోరాడుతున్నాను.” అని వారికి చెప్పాను

అపరిచితులతో ఫోన్‌లో తన భావాలగురించి మాట్లాడటం నుండి కుటుంబంతో తన భావాలను పంచుకోటానికి పరివర్తన చెందడం అనేది – ఆమె నివసించే ప్రపంచంలో చాలా కష్టమైన పని.

CAA ఆమోదించబడిన ఒక నెల తరువాత, 2020 జనవరి లో ప్రారంభమైన తూర్పు ఢిల్లీలోని ఖురేజీలో CAA వ్యతిరేక నిరసన స్థలం సహ-నిర్వాహకులలో ఒకడు అయ్యాడు.

జాతీయ దృష్టిని ఆకర్షించిన, దక్షిణ ఢిల్లీలోని షహీన్ బాగ్‌లో జరిగే ఇదే విధమైన ప్రదర్శన ద్వారా ఈ నిరసన స్ఫూర్తి పొందింది. ఖురేజీ నిరసనకారులు పట్‌పట్‌గంజ్ రోడ్‌లోని పంపు ఎదురుగా పందిరి, టెంట్‌ల కింద కూర్చునేవారు. మహిళలు ఇంటి పని ముగించుకుని సాయంత్రంపూట వచ్చేవారు. సంఘీభావం తెలిపేందుకు దూరప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రసిద్ధ నిరసన ప్రదేశంగా ఇది మారింది. ఆమె కూడా క్రమం తప్పకుండా పాల్గొనేది, తరచూ ప్రధాన రహదారి నుండి నిరసన స్థలం వరకు జరిగే ర్యాలీకి నాయకత్వం వహించేది.

ఒక నెల తరువాత, 2020 ఫిబ్రవరి 23న, ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో వున్న మరొక CAA వ్యతిరేక నిరసన స్థలం సమీపంలో అల్లర్లు చెలరేగాయి.

ఆ రోజు, అతను యింటికి వచ్చి, ప్రార్థన చేసుకొని నిద్రపోయాడు. కానీ చాలా ఆందోళనగా వున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

“మన ప్రపంచంలో, పురుషులకి తమ సవాళ్లు, పోరాటాలు, సమస్యలు, భావోద్వేగాలను తమ కుటుంబాలతో పంచుకొనే శిక్షణ యివ్వలేదు. అన్ని సమయాల్లో వారు ఆ పాత్ర పోషించారు” అని ఆమె అంటుంది.

ఆ అల్లర్లలో చాలా మంది, ఇంటికి దగ్గరలోనే ప్రాణాలు కోల్పోయినందు వల్ల మాత్రమే అతను ఆందోళన పడటం లేదని ఆమెకు తెలియదు. నిరసన స్థలాన్ని ఖాళీ చేయమని పోలీసులు చేస్తున్న ఒత్తిడి కారణంగా కూడా అతను ఆందోళనతో వున్నాడు.

మూడు రోజుల తరువాత, 2020 ఫిబ్రవరి 26 న, పోలీసులు వచ్చి నిరసన స్థలాన్ని విచ్ఛిన్నం చేసి, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనకారులు తిరిగి రాకుండా ఆపడానికి బారికేడ్లను అడ్డు పెట్టారు.

అతన్ని అక్కడనుండి నుండి తీసుకెళ్లారని ఆమె విన్నది. పోలీసుల వైపు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను ఎవరో ఆమెకు పంపారు.

“నిర్బంధించి వుండాలి. సాయంత్రానికి తిరిగి వస్తాడు” అని తనకు తానే సమాధానం చెప్పుకుంది.

కానీ అతను రాలేదు. ఆ రోజు, కాంగ్రెస్ పార్టీ మాజీ మునిసిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్‌తో సహా మరో ఏడుగురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

మారణాయుధాలతో అల్లర్లలో పాల్గొనడం; చట్టవిరుద్ధంగా సమావేశమవడం; విధి నిర్వహణలో వున్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం; ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోడానికి దాడి చేయడం లేదా నేరపూరిత శక్తిని ఉపయోగించడం; హత్యాయత్నం లాంటి ఆరోపణలతో ఆయుధాల చట్టం, భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కూడా అభియోగాలు మోపారు.

పద్నాలుగు రోజుల తరువాత, మార్చి 11 న, ఆమె అతడిని చూసినప్పుడు, అతను ఒక వీల్‌చైర్‌లో ఉన్నాడు, అతని కాళ్లకి, కుడి చేతి వేళ్ళకి పట్టీలు ఉన్నాయి. అతణ్ణి కస్టడీలో కొట్టారు.

అతను 17 నెలలుగా జైలులో ఉన్నాడు.

కోవిడ్-19 వ్యాప్తి వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబడిన సమయంలో 2020 మార్చి 24నాడు, పదమూడు రోజుల తర్వాత కాళ్లు విరిగివున్న అతన్ని చూసింది.

UN సహా అనేక అంతర్జాతీయ సంస్థలు రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని వివిధ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశాయి.

అతనికి మధుమేహ వ్యాధి వుంది, జైళ్లు రద్దీగా వుండడం వల్ల  అతని ఆరోగ్య స్థితి గురించి ఆందోళనగా వుంది. అతను ఇంకా విడుదల కాలేదు.

అప్పుడే పిల్లల ఆన్‌లైన్ తరగతులు మొదలయ్యాయి.

 “నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అతను పిల్లలకు హోంవర్క్‌లో సాయం చేసేవాడు. ఇక్కడ నేను ముగ్గురు పిల్లలకి ఒకేసమయంలో జరిగే ఆన్‌లైన్ తరగతుల్లో కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నాను.  చాలా కాలం వరకు వాళ్ళకు ఫోన్లు లేవు. నెమ్మదిగా ఏర్పాటు చేసుకొని వాటికి అలవాటు పడటానికి కొంత సమయం పట్టింది”.

ఆమె ప్రస్తుతం విడుదల ప్రచారం కోసం స్వీయ శిక్షణ పొందిన సోషల్ మీడియా మేనేజర్‌గా చేస్తోంది. సామాజిక మాధ్యమాల్ని ఎలా వుపయోగించాలో నేర్చుకోడానికి లాక్‌డౌన్‌ సమయాన్ని ఉపయోగించుకొంది. “అతని అరెస్టుకు ముందు నాకు సోషల్ మీడియా ఖాతా కూడా లేదు”.

ప్రస్తుతం, అతని విడుదల కోసం చేసే కేంపెయిన్‌లో భాగంగా రోజులో కొంత సమయాన్ని పోస్టర్‌లు, గ్రాఫిక్స్, సంగీతాన్ని ఉపయోగించి వీడియోలు తయారు చేయడం కోసం వినియోగిస్తుంది.

తమ తండ్రి ఇంట్లో లేడని పిల్లలు అర్థం చేసుకుంటారు, కానీ అంతవరకు మాత్రమే.

“వారు శారీరకంగా పాఠశాలకు హాజరయ్యే అవసరం లేకపోవడం సంతోషంగా ఉంది. పిల్లలు సంక్లిష్టతలను అంతగా అర్థం చేసుకోలేరు. తమ తండ్రి జైలులో ఎందుకు ఉన్నాడో చెప్పలేకపోయినందుకు స్కూల్లో తోటి పిల్లల వేధింపులకు గురయ్యారు” అని బాధపడుతుంది.

కరోనా విపత్తు సమయంలో, ఇంట్లోనే వుండిపోయిన పిల్లలు తండ్రి గురించి అడుగుతారు. “ఇంట్లో చిన్నపిల్లలు వున్నప్పుడు మీరు నిరంతరం విషాద వాతావరణంలో ఉండలేరు.”

అతని జ్ఞాపకాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సెలవులు గడపడానికి వెళ్లినప్పుడు తీసిన వీడియోలు, ఫోటోలు, చివరగా 2019లో గోవాకి వెళ్ళినప్పటివి తరచుగా చూస్తూ వుంటాను. వారికి ఇష్టమైన టిక్ టాక్ నిషేధం వల్ల ఇన్‌స్టా రీల్స్‌తో డైలాగ్‌లను అనుకరించి, నృత్యాలు చేసి తరచుగా వీడీయో తీసేవాళ్లం. అప్పుడప్పుడూ కంప్యూటర్ గేమ్స్‌ ఆడేవాళ్ళు.

ఆ రోజు పిల్లలు తండ్రికిష్టమైన వంటకం పప్పు-మాంసం (దాల్ గోష్) తింటున్నారు. చిన్నది హఠాత్తుగా తినడం ఆపేసి, “నాన్నకి జైల్లో తినడానికి పరవల్ (దొండకాయలా వుంటుంది) మాత్రమే ఎందుకు పెడతారు?” అని ప్రశ్నించింది.

అతను ఈ దేశాన్నీ, ప్రజలనూ ప్రేమిస్తాడు. అది చాలా “లోతైన ప్రేమ.”

అతను ఎప్పుడూ పక్షపాత వైఖరి వహించలేదు, ఈద్ పార్టీ చేస్తే, దీపావళి పార్టీ కూడా చేసేవాడు. “అతడిని అరెస్టు చేసినప్పటి నుండి, చాలా మంది మహిళలు తమ పిల్లలకు ఫీజులుయివ్వమని అడగడానికి వచ్చారు. ఏ మతానికి చెందినవారనే దానితో సంబంధం లేకుండా సహాయం చేసేవాడు. అతను ఇలా సాయం చేస్తున్నాడనే విషయం అప్పటివరకూ నాకు కూడా తెలియదు”.

గత ఏడాదిన్నర కాలంలో, 19 ఏళ్ల దళిత మహిళపై అగ్రవర్ణ పురుషులు అత్యాచారం చేసిన హత్రాస్ రేప్ కేసుకు నిరసన లేదా కొనసాగుతున్న రైతుల నిరసన ఏదైనా సరే, అన్నింటికీ తప్పకుండా వెళ్తుంది.

“మంచి దేశం కావాలని కోరుకునే వారందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందని నేను తెలుసుకున్నాను” అని అంటుంది.

గత ఏడాదిన్నర కాలంలో, ఆమె చాలా చట్టపరమైన పదాలను నేర్చుకోవలసి వచ్చింది, బయటకు వెళ్లినప్పుడు ఏమి మాట్లాడాలో తెలుసుకోవలసి వచ్చింది. ఆమె సంఘీభావం వ్యక్తం చేయగలదు, పొరుగువారు లేదా బంధువులు ఆమె ప్రవర్తనను ప్రశ్నించినప్పుడు కలిగే బాధను కూడా ఓర్చుకోవాలి.

ఆమె ఒకరిని సహాయం కోసం అడగలేదు, బాధితురాలినని చెప్పుకోలేదు. ఒక మహిళ అలా చేయకపోతే ప్రశంసించరు. ఆమె అంతకు ముందు స్వయంగా చేయని, విద్యుత్ బిల్లు చెల్లించడం, గ్యాస్ సిలిండర్ కోసం వెళ్ళడం, బిడ్డను దంతవైద్యుని వద్దకు తీసుకెళ్లడం లేదా కాలి చికిత్స కోసం ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లడం లాంటి పనుల కోసం ఇంటి నుండి బయటకు వస్తే అవహేళనకు గురవుతుంది, ప్రత్యేకంగా చూస్తారు.

పిల్లలను బజారుకు తీసుకెళ్లినప్పుడు ఏదైనా కొనాలనుకునే ముందు “మమ్మీ, దీని ఖరీదు చాలా ఎక్కువ కదా?” అంటారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వారు ఎప్పుడూ యిలా ఆలోచించలేదు.

అన్ని ట్రావెలర్స్ వ్యాపారాల మాదిరిగానే, కరోనా విపత్తు కారణంగా అతని కంపెనీ ఒక సంవత్సరానికి పైగా మూతబడింది. “పొదుపు చేసుకున్నవి అయిపోతున్నాయి. అతను దూరంగా ఉన్నప్పటి నుండి నేను కొంచెం వ్యాపార మెళకువలు నేర్చుకున్నాను. అతని కంపెనీని తిరిగి దారిలో పెట్టడానికి నెమ్మదిగా ప్రయత్నిస్తాను”అంటుంది.


తన పిల్లలకు అందించాలనే సాకుతో ఆమె మరింత సృజనాత్మకంగా వుండటాన్ని నేర్చుకుంటున్నది.

వారు నిరంతరం అడుగుతూనే వుంటారు, “మమ్మీ, నాన్న ఇంటికి ఎప్పుడు వస్తారు?” అని.

ఆమె వారిలో ఒకరి పుట్టినరోజు తేదీని చెప్తుంది. ఆ రోజు వచ్చి వెళ్ళి పోతుంది, కానీ అతను రాడు. కుటుంబంలో రాబోయే యింకో పుట్టినరోజు తేదీని మళ్ళీ చెబుతుంది. అలాంటి ఆరు పుట్టినరోజులు గడిచిపోయాయి.

పిల్లలు ఆశను కోల్పోకూడదు. కాబట్టి తండ్రి ఖాలిద్ సైఫీని ఎలా స్వాగతించాలనే దానిపై రోజూ ప్రణాళికలు తయారుచేస్తాం.

 “నాన్న రాగానే ఒక చేతిలో చికెన్ టిక్కాతో, మరొక చేతిలో చైనీస్ ఆహారంతో అతని ముందు  నిలబడతాను” అని పెద్ద వాడు యెస్సా అంటాడు.

“చాలా టపాసులు, రాకెట్లు, చుచ్చుబుడ్లు కొంటాము” అని మధ్యవాడు తాహా అంటే “ఇంటి ప్రతి మూలా పువ్వులతో అలంకరిద్దాం, పెద్దగా సంగీతం పెట్టుకుందాం” అని అందరికంటే చిన్నది మరియమ్ అంటుంది.

 “మేము ఎన్నో కబుర్లు చెప్పుకుంటాము, అతన్ని ఎప్పటికీ పోనివ్వం” తల్లి నర్గీస్ సైఫీ జోడిస్తుంది.

——-

అనువాదం: కొండిపర్తి పద్మ
సోర్స్ : ది వైర్

Leave a Reply