నేటి ఆధునిక యుగంలోనూ భారత సామాజిక జీవనం ఇంకా అనాధునికంగానే ఎందుకు ఉన్నది? ప్రగతి సూచికలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడైనా మనకు ఎదురవుతాయి. నిజానికి ప్రగతి సూచికను బట్టి చూస్తే, మన సమాజం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హేతుబుద్ధి మన సమాజానికింకా అపరిచితాలుగానే ఉన్నాయి.

మరి మన దేశంలో జరిగిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమాలన్నీ సామాజిక మార్పుకు దోహదపడినవైనప్పటికీ, అవన్నీ మౌలిక సామాజిక మార్పును ఆశించి సాగినవి కావు. అలాగే ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకైనా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ, నక్సల్బరీ దాకా రాజ్యం పట్లనే ఒక స్పష్టమైన అవగాహన లేకుండింది. ఒక రకంగా నక్సల్బరీ విస్ఫోటనంతో రాజ్యం పట్ల సరైన అవగాహనా క్రమం ఆరంభమైందని, అది క్రమక్రమంగా విస్తరిస్తూ  వస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా, విప్లవం ఒకానొక ప్రత్యేక ఘటన కాదని, అది ఒక దీర్ఘకాలిక నిరంతరం పరిణామమనే అవగాహన కూడా బలపడుతూ వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సాగిన విప్లవ పోరాటాల ప్రభావం వల్ల ప్రజల్లో  వర్గ పోరాట చైతన్యం పెరగడం ఆరంభించింది. అది సమాజంలో భిన్న అస్తిత్వ సముదాయాలలో  ప్రతిఫలించి వివిధ అస్తిత్వ పోరాటాలకు దారితీసింది. ఆయా అస్తిత్వ సమస్యలకు తక్షణ పరిష్కారాలు డిమాండ్ చేస్తూ ప్రజల దీర్ఘకాలిక వర్గ పోరాటాల ఆవశ్యకతను అవి నిర్లక్ష్యం చేశాయి. అదే సమయంలో కులం, పితృస్వామ్యం వంటి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టమైన ప్రత్యేక పోరాటాల ఆవశ్యకతను కూడా అవి ముందుకు తెచ్చాయి. ఆ క్రమంలోనే విప్లవోద్యమం దండకారణ్యానికి కూడా పాకి విస్తరించింది. అక్కడి నిర్దిష్ట,సామాజిక ప్రత్యేకతలు ఎలాంటివైనప్పటికీ, ఒక సృజనాత్మక ప్రయోగంగా, నిరంతర ప్రగతిశీల పరివర్తనా క్రమంగా సాగుతున్న విప్లవానికి, ప్రత్యామ్నాయ ప్రజా రాజ్యానికి నేటి దండకారణ్యం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

అందువల్లనే సామాజిక పరివర్తనా క్రమంలో రాజ్యం పట్ల, రాజ్యాధికార సాధన పట్ల అవగాహనను మరింత లోతుగా పెంపొందించుకుంటూ, విస్తరించు కోవాల్సిన ఆవశ్యకత ముఖ్యంగా విప్లవ శక్తులకు చాలా కీలకమైన విషయంగా ఉంటుంది. ఒక రకంగా ఈ ఆవశ్యకతను మరింత సీరియస్ గా గుర్తించడానికి దోహదపడేవే మిత్రుడు బమ్మిడి జగదీశ్వరరావు రాసిన ఈ ‘మనువాచకం’ కథలు. తనదైన శైలిలో, ప్రత్యేకమైన శిల్ప నైపుణ్యంతో ప్రజల వెతలను కతలుగా మలచి రాసిన ఈ కథా సంపుటి మాతృక ప్రచురణలుగా ఇటీవలే వెలువడింది.

ఈ నేపథ్యంలో ఆలోచిస్తుంటే– ఇంతకూ రాజ్యం అంటే ఏమిటి? రాజ్యం ఎక్కడ ఉంటుంది? రాజ్యం ప్రజలతో ఏ సంబంధం లేకుండా బయట ఉండేది మాత్రమేనా? మరి అలా బయటిదైన రాజ్యం ప్రజలపై తిరుగులేని ఆధిపత్యం ఎలా చెలాయిస్తుంది? శత్రుత్వమైనా,మిత్రుత్వమైనా అసలు సంబంధం అనేదే లేకుండా సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలు మనల్ని తప్పక చుట్టుముడతాయి.

మిత్రుడు బజరా రాసిన ఈ మనువాచకం కథలు చదివితే, రాజ్యం మనకు దూరంగా  ఉండేది మాత్రమే కాదు. మన లోపల కూడా రాజ్యం ఉంటుందని, అంటే- మన నిత్య సామాజిక సంబంధాలలో భాగంగా రాజ్యం అనేక రూపాల్లో ఉనికిలో ఉంటుందని మనకు అర్థమవుతుంది. అయితే విచిత్రమేమిటంటే ప్రజలు దానిని రాజ్యం అనుకోరు. ధర్మం అనుకుంటారు. సనాతన సంస్కృతి అనుకుంటారు. ఆచారం అనుకుంటారు. దానికి తిరుగులేని సమ్మతి ప్రకటిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుషుల మధ్య ఉండే అసమానత్వాన్ని అత్యంత సహజమైన విషయంగా ప్రజలు భావిస్తారు. ఆ సమానత్వాన్ని  పితృభక్తి, గురుభక్తి, దైవభక్తి లాంటి అనేక భక్తి రూపాల్లో స్వచ్ఛందంగా పాటిస్తారు.ఇందుకు –ప్రార్థనలు భజనలు, నోములు, వ్రతాల రూపంలో, వివిధ కట్టుబాట్ల రూపంలో మనుషులు శిక్షణ పొందుతూ నిరంతరం సామాజికీకరించబడడం; ఒకే కులం లోనే విధిగా చేసుకునే అంతర్ వివాహాల ద్వారా అసమానతల కుల వ్యవస్థను, పితృస్వామిక కుటుంబ వ్యవస్థను నిరంతరం పునరుత్పత్తి చేస్తూ ఉండడం మూలకారణాలుగా పేర్కొనవచ్చు.

ఇవన్నీ ఆధునిక యుగంలోనూ అవిచ్చిన్నంగా  కొనసాగుతున్న అనాధునిక అవలక్షణాలు. ఇందుకు మూలకారణం మన దేశంలో ప్రవేశించిన పెట్టుబడి స్వభావంలో ఉన్నది. ఆ పెట్టుబడి ఆధునిక పూర్వ భూస్వామిక కుదురును పెకిలించి తొలగించి వేయకుండానే దానితో కుదురుకున్నది. అది సామ్రాజ్యవాద(పెట్టుబడి) రూపమెత్తినందువల్ల తన తొలినాటి ప్రగతిశీలతను కోల్పోయింది. అందువల్లనే సమాజంలో హేతుచింతన, స్వేచ్ఛా మానవుడి ఆవిర్భావం, సమానత్వం అనే ప్రగతి కారకాలకు ఆస్కారం లేకుండా పోయింది. నిజానికి సమాజంలో అవి ఏమేరకు సాధ్యమవుతాయో ఆ మేరకు గుణాత్మకమైన ప్రగతి సాధ్యమౌతుంది. లేకపోతే, సమాజంలో ప్రగతి లుప్తమై ఆధునికత డొల్ల అయిపోతుంది.

సరిగ్గా మన సమాజపు ఆధునికతలోని ఈ డొల్లతనాన్ని బజరా ‘మనువాచకం’ కథలన్నీ  నగ్నంగా ప్రదర్శిస్తాయి. సమాజంలోని అసమానతలకు గల మూలాలు ఎంత లోతుగా పాతుకుని పోయాయో, వాటి చుట్టూ అల్లబడిన భావజాలానికి సాంస్కృతిక క్షేత్రంలో లభించే ప్రజా సమ్మతి తెలియకుండానే అత్యంత శక్తివంతమైన ఫాసిజానికి ఎలా రాచబాటగా పనిచేస్తుందో కూడా ఈ కథలు తెలియజేస్తాయి. కాషాయ రాజకీయాల తొలి, మలి విడతల పాలనా కాలాలలో పాలకులు  మరింత ముందుకు వచ్చి అభివృద్ధి చుట్టూ ఒక మాయా జలతారు వలను అల్లి, ఆ అభివృద్ధివాద మాయా వలలో కోట్లాది ప్రజలను చిక్కుకునేట్లుగా ఎలా చేశారో కూడా వెల్లడిస్తాయి. పాలకులు రూపొందించిన  దుర్మార్గమైన వ్యవస్థ చేతిలో మెజారిటీగా వున్న దళితులు,మహిళలు, మైనారిటీలు,మధ్యతరగతి, తదితర  ప్రజలెందరో దోపిడీ, పీడనలకు గురవుతున్న తీరును రచయిత ఇందులో కథనీకరించాడు. న్యాయస్థానాల అన్యాయ తీర్పుల బండారాన్ని బట్టబయలు చేశాడు. శబరిమలై వివాదం రూపంలో చెలరేగిన మూక పురుషాహంకారం, అపురూపమైన లౌకిక ప్రజాస్వామ్యవాది గౌరీ లంకేశ్ హత్య,చిన్నారి ఆసిఫా మీద జరిగిన ఘోరం, కొత్త పౌరసత్వ చట్టాలు, ఆవును కేంద్రం చేసుకుని కాషాయం చేసే గోరాజకీయం, దేశ పేద యువతను సైన్యంలోకి ఆకర్షించి వారిని బలిగొంటున్న దేశ భక్తి రాజకీయం, రక్తమోడుతున్న కాశ్మీర్, డ్రగ్స్ వ్యాపారం, బుల్లి తెర బుల్ డోజింగ్ లు, సరికొత్త వంచనా రూపాలైన ఆన్లైన్ ట్రోలింగ్,అంతర్జాల వేధింపులు ఇలాంటివెన్నో బజరా కలం ఉలికి చిక్కి అద్భుతమైన కథా శిల్పాలయ్యాయి.

ఈ కథల్లో అన్నిటికంటే ముఖ్యమైనది రచయిత చూపు(దృక్పథం). అది చాలా తీక్షణమైనది. అది ఎక్స్ రే వలె అన్ని పొరల్ని చీల్చుకుంటూ వస్తువుకు సంబంధించిన  కోర్ లోకి దూసుకెళ్తుంది. అక్కడి దినుసును కూడా పైకి తీసుకువచ్చి పాఠకుల మనసుల్లోకి నేరుగా బట్వాడా చేస్తుంది. అప్పుడు వాస్తవం ఎటువంటి ముసుగుల్లేకుండా పాఠకులకు ఆసాంతం అనుభూతమవుతుంది. ఇంకా రాయడం ఎందుకు? అది అనుభవైక వేద్యమే. ఇంకా ఆలస్యమెందుకు? బజరా కథల్ని తక్షణమే చదవండి.

Leave a Reply