తడికలు అడ్డెట్టి
తెల్ల గుడ్డ కట్టి
అదే వెండి తెర భావనలో
నేల పై మూడు గంటలు కూసుని
చూసిన సినిమా
నేల టికెట్ నుండి కుర్చీ దాకా
జనం ఎగబడితే ఏడాదీ ఆడిన సినిమా
కథలో అదే మూస
కథనంలో కొత్తదనం
కాసులు కురిపించిన సినిమా
రీళ్ళ డబ్బాలు టాకీస్ టూ టాకీస్
ఓ మాదిరి పెద్ద వూరిలో
ఓ టాకీసు
సినిమా బండ్లు పోటాపోటీ
పోస్టర్లు మైదాతో గోడలపై
వినోదాన్ని పంచిన సినిమా
మూకీ నుంచి టాకీ దాకా
నలుపు తెలుపు నుంచి రంగుల బొమ్మ దాకా
సాంకేతిక హంగుల హోరులో
పెంచుకున్న బడ్జెట్ సినిమా
కాపీల హోరులో ఉరుకుల సినిమా
కూసింతైనా సామాజిక ప్రయోజనం లేని నేటి సినిమా
మూకీ నుండి నేటిదాకా
ఏలే మూడు సామాజిక వర్గాల గల్లాలు నింపే మిగిలిన వర్గం
టికెట్ల వరుసల్లో చొక్కాలు చించుకున్నా
చిల్లర చల్లినా అభిమానం వెర్రితలలేసినా
రోజూ చేసిన చాకిరీ రాల్చిన పైకమే
వీడేమో పేదరికంలో వాడేమో కోట్లల్లో
టాకీసుల యజమానుల రోజులు పోయి
బెదిరింపుల అదిరింపులతో
లీజుల ఒరవడి ఆ వర్గాల చేతుల్లోనే
చిన్న సినిమా కొత్త వ్యక్తుల సినిమా
టాకీసులు దొరక్క చిన్నబోయింది
ఎప్పుడో ఓ సారి టాకీస్ ల ఖర్చులు పెరిగి
టికెట్ల రేట్లు పెరిగే కాలం నాడు
సినిమా ఖర్చు ని బట్టి రేటు పెంచే నయా దోపిడీ నేడు
ఎవడిచ్చాడు అధికారం వీళ్ళకి
బహిష్కరిద్దాం సినిమాని
కూడు గూడు గుడ్డ కోసం మన కష్టార్జితం మనం వెనకేసుకుందాం
టేకులు టేకుల మీద
కెమెరా అటెట్టి ఇటెట్టి
సొంత గొంతు లేక అరువు గొంతులతో
ఆరబోసే అందాలతో
హింసయే హీరోయిజంగా
తీసే సినిమా మనకెందుకు
మన బతుకే లేని ఆ సినిమాని తన్నేద్దాం
మన మధ్య
మన బతుకుల్లోంచి పుట్టిన నాటికలను బతికిద్దాం
నటన ప్రతిభ నాటికల్లోనే తేలుతోంది
ఈడ వారసులుండరు
నటనలో జీవం ఉట్టి పడుతుంది
ఆహార్యంకి జేజేలు
కునారిల్లి పోతున్న తోలు బొమ్మలాట కళకి రంగులద్దుదాం
వీధి భాగోతాలకి అరుగులు నిర్మిద్దాం
మన తరతరాల వాయిద్యాలను
సంప్రదాయ నృత్యాలను రాబోయే తరాలకి అందిద్దాం