1. భార‌తదేశ మహిళా ఉద్యమాన్ని ఎన్ని దశలుగా చూడవచ్చు?

1857 లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటినుండీ 1947 వరకు జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లోనూ “స్వాతంత్రోద్యమంలోనూ” మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగినవిధంగా ఉంది. ప్రత్యేక మహిళాఉద్యమంగా రూపొందకపోయినా ఆ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా వారు పితృస్వామ్యాన్ని ఢీకొన్నారు. వారి భాగస్వామ్యం అర్జీలు, విన్నపాలు సమర్పించడం దగ్గర నుండి, ఊరేగింపులూ పికెటింగ్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, స్వచ్ఛంద అరెస్టులు తదితర రూపాల్లో కొనసాగడమే కాకుండా జాతీయ విప్లవకారులుగా సాయుధచర్యల వరకూ అన్నిటిలో పాల్గొన్నారు. 1917 నుండే అఖిల భారత స్థాయిలో మహిళా సంఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వాతంత్ర పోరాటంలోనూ కొంత మేరకు సంస్కరణ ఉద్యమాలల్లో పాల్గొనడం తప్ప మహిళాఉద్యమంగా రూపొందలేదు. ప్రధానంగా నాయకత్వం అంతా బూర్జువా మహిళల, “ఉన్నత” కులాల స్త్రీల చేతిలోనో లేక వారికి మార్గదర్శకత్వం వహించే పురుషుల చేతిలోనో ఉండడం వల్ల కొన్ని పరిమితులతోనే సాగింది. అయినప్పటికీ మహిళల క్రియాశీల భాగస్వామ్యం భవిష్య మహిళా ఉద్యమానికి బాటలేసింది. అయితే ఇదే కాలంలో కార్మికరంగంలో మాత్రం మహిళలు క్రియాశీలంగా పాల్గొన్నారు. కొన్నిచోట్ల ట్రేడ్ యూనియన్లలో నాయకులుగా కూడా ఉన్నారు. కాబట్టి అప్పటివరకూ దానిని మొదటి దశగా భావించవచ్చు.

1947 నుండి 1980 వరకూ రెండవ దశ అనుకోవచ్చు. 1946-51 తెలంగాణా సాయుధపోరాటం, 1967 లో నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ పోరాటాలలో మహిళలు పాల్గొనడమే కాక ఒక స్థాయి వరకూ నాయకత్వం కూడా వహించారు. ఇది ఒక పెద్ద మలుపుగా భావించవచ్చు. 67-77 దశకాన్ని కల్లోల దశాబ్దం అనేవారు. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున నిత్యవసరాల ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా, వరకట్నసమస్య, వరకట్న మరణాలు, కుటుంబ హింసలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు. ఈ పోరాటాలకు మహిళలు మహిళా కోణాన్ని, సృజనాత్మక రూపాలను జోడించారు. మహిళా సంఘాలు ప్రత్యేకంగా మహిళా సమస్యలపై ఒక మేరకు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇవన్నీ ఫెమినిస్టు భావజాలానికి స్ఫూర్తిని ఇచ్చాయి. ఎమర్జెన్సీ నిర్బంధానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా ఉంది.

1980 నుండి మూడవ దశ అనవచ్చు. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగానే ఫెమినిస్టు భావజాలం అభివృద్ధి చెందడంతో ఆ ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. విప్లవోద్యమ ప్రభావం వల్ల కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫెమినిస్టు భావజాలం అభివృద్ధి చెందింది. అనేక మహిళా సంఘాలు ఏర్పడి మహిళా ఉద్యమం బలంగా ఎగసిన కాలం ఇది. మహిళా సంఘాలు ఒక స్పష్టమైన రాజకీయ దృక్పథంతో పనిచేశాయి. అది కొనసాగుతోంది.

 1. ఉమ్మడి పార్టీ కాలంలో మహిళా సమస్యలపై ఎలాంటి అవగాహన ఉండేది?

మహిళాసమస్య పై అవగాహన ఎలా ఉన్నప్పటికీ ఉద్యమాలలో పెద్ద ఎత్తున మహిళలను భాగస్వామ్యం చేసిన ఘనత మాత్రం కమ్యూనిస్టు పార్టీదే. స్త్రీలను బయటికి తీసుకువచ్చి చైతన్యం చేయడం అనేది వాళ్ళు తమ ఇంటి నుండే ప్రారంభించడం చాలా ప్రశంసనీయం. నాటకాలలో స్త్రీ పాత్రలను పురుషులు మాత్రమే వేసే సాంప్రదాయాన్ని బద్దలుకొట్టింది కమ్యూనిస్టులే. వాళ్ళకి రాజకీయ తరగతులు నిర్వహించడం, కర్రసాములు నేర్పించడం వంటివి చాల బాధ్యతగా చేశారు. దానివల్ల మహిళలు తమ బాధ్యతలను చాలా ప్రతిభావంతంగా నిర్వహించగలిగారు. తెలంగాణ సాయుధపోరాటంలో కొట్లాడి మరీ తుపాకులు చేతబట్టి పోరాడారు. ఇవన్నిటివల్లా కమ్యూనిస్టు పార్టీపట్ల మహిళలు బాగా ఆకర్షితమయ్యారు. పెద్ద ఎత్తున స్పందించారు. కానీ పార్టీలో వారిని చేర్చుకోడానికి మాత్రం పార్టీ బాగా వెనుకాడింది. వారికి రక్షణ కల్పించలేమని భావించింది. భూపోరాటాలలో పాల్గొన్నప్పటికీ వారికి భూమి పై హక్కు కల్పించలేదు. కుటుంబ పెద్ద గా ఉన్న పురుషుని పేరు మీద పట్టా ఇచ్చారు. ఇలాంటివన్నీ చూసినపుడు వారు మహిళలని మద్దతుదారులుగా, సానుభూతిపరులుగా చూశారు తప్ప చరిత్రనిర్మాతలుగా చూడలేదు అనిపిస్తుంది. గ్రామాలలో ఊరేగింపులు, ప్రదర్శనల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నప్పటికీ వారిని సంఘటితం చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయలేదని సి‌పి‌ఐ తన డాక్యుమెంట్లలో రాసుకున్నది. మహిళలు విడాకులు తీసుకొని ఉద్యమంలోకి రావాలనుకున్నవారిని కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. పార్టీకి చెడ్డపేరు వస్తుందని భావించింది. మహిళా సమస్యపై చాలా వరకు భూస్వామ్య భావజాలాన్ని పూర్తిగా వదిలించుకోలేకపోయింది.

 1. ప్రారంభ‌ద‌శ‌లో విప్లవోద్యమంలో మహిళల భాగస్వామ్యం ఎలా ఉండేది?

మహిళలు ఎప్పుడూ విప్లవోద్యమం పట్ల బాగా ఆకర్షితులయ్యారు. కానీ మహిళలు “బలహీనులు” కాబట్టి వారికి ఆయుధాలను నిరాకరించింది. అయితే వాళ్ళు కొట్లాడి మరీ ఆయుధాలు సాధించారు. తరవాత అనేక సార్లు తాము పురుషులతో సమానులే కాదు కొన్ని సార్లు వాళ్ళ కన్నా మెరుగ్గా పోరాడగలమని నిరూపించారు. తెభాగా పోరాటంలో మహిళలను సాయుధం కానివ్వలేదు. రాణి సంకెయిల్ లో మహిళా వలంటీర్ దళం పోలీసులను బంధించి తుపాకులు గుంజుకొంటే వాటిని పార్టీ తప్పుబట్టి తిరిగి పోలీసులకు ఆయుధాలు అప్పగించింది. దు అర్స్ లో మహిళలు గుంజుకొచ్చిన తుపాకులను బావిలో పడవేయించింది. ఇక తెలంగాణా సాయుధపోరాటంలో కొందరు మహిళలు దళాలకు నాయకత్వం వహించారు. సాయుధపోరాటాన్ని ముగించి ఇళ్లకు మరలమని ప్రకటించినపుడు మహిళలు దానిని ఏమాత్రం స్వీకరించలేకపోయారు. వాళ్ళని ఇళ్లకు వెళ్ళమని అవివాహితలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనీ, వివాహితలు కుటుంబాలను చూసుకోవాలని పార్టీ సలహాలు ఇచ్చింది.

ఇక నక్సల్బరీ పోరాటం సందర్భంగా అందులోకి పెద్ద ఎత్తున మధ్యతరగతి మహిళలు చేరారు. శ్రీకాకుళ పోరాటంలో పీడిత వర్గాల మహిళలు ఎక్కువగా చేరారు. వాళ్ళందరికీ వర్గ శత్రు నిర్మూలన కార్యక్రమం ఒక ఆగ్ని పరీక్షలాగా మారింది. శత్రువు రక్తంలో తడిసిన చేతులు తప్ప విప్లవాన్ని విజయవంతం చేయలేవు అనే భావంతో వారి మీద వత్తిడి పెరిగింది. చాలా మంది దూరమయ్యారు కూడా. శ్రీకాకుళ పోరాటంలో అలా చేసిన మహిళలు కూడా ఉన్నారు. ఏదైనా మహిళలు సమానత్వం కోసం పడ్డ తపన వాళ్ళతో అనేక సాహసాలను చేయించింది. ఇదంతా కూడా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగినప్పటికీ తరవాతి కాలం నాటి విప్లవోద్యమంలో మహిళలకి ఈ అనుభవాలు ఒక భూమికగా పనిచేశాయి. ఆ అనుభవాలు లేకుండా వారు తాము సాధించినవేవీ సాధించడం అంత తేలికైన విషయం కాదు. తరవాత విప్లవోద్యమం సెట్ బ్యాక్ కి గురయ్యి మళ్ళీ ఎనభై నాటికి మొదలయి నపుడు మహిళలు ఉద్యమంలో చేరారు. ఈ సారి మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేకంగా కృషి జరిగింది. మహిళా సమస్యలపై పోరాటాలు జరపడమే కాకుండా ఉద్యమం పట్ల ఆకర్షితమైన మహిళలను రాజకీయంగానూ వివిధ రంగాలలో పాల్గొనేలా శిక్షణ ఇచ్చి సిద్ధపరిచారు.

 1. ఇది ఉమ్మడి క‌మ్యునిష్టు పార్టీ కంటే పూర్తి భిన్నమైనదని భావించవచ్చునా?

తప్పకుండా. అసలు మహిళలను పార్టీలోనే చేర్చోకోని దగ్గరనుండి సాయుధ పోరాటంలో పాల్గొనడం, నాయకత్వం వహించడం వరకూ చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా గతంలో చాలామంది మహిళలను డెన్ లకి పరిమితం చేశారు. ఆ పద్ధతిని పూర్తిగా మార్చి ఒకవేళ అలాఉండాల్సిన అవసరం వచ్చినా తాత్కాలికంగా మాత్రమే ఉంచి మళ్ళీ వారిని నిర్మాణాలలోకి మార్చారు. మహిళలు రాజకీయంగా పట్టు సాధించి స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ రాజకీయ శిక్షణ ఇవ్వడం, సాయుధ శిక్షణ పుచ్చుకోవడం ఇవ్వడం, తుపాకులు బాగుచేయడం, ఆయుధాలు తయారుచేయడం, ప్రజా ఉద్యమాలు నడపడం వంటి వాటి వరకూ మహిళలు విప్లవోద్యమం లోని అన్ని రంగాలలోకి వచ్చారు. పురుషాధిపత్య భావజాలం వదలగొట్టడానికి అనేక దిద్దుబాటు క్యాంపెయిన్లు జరిగాయి. మహిళా విముక్తికి సంబందించి స్పష్టమైన దృక్పథాన్ని ప్రకటించి ఆచరణకు పదునుపెట్టుకున్నారు. మహిళా సమస్యపై అధ్యయనంచేసి మహిళాఉద్యమానికి మార్గదర్శకత్వం వహించడానికి ప్రత్యేక మహిళా సబ్-కమిటీలు రాష్ట్ర స్థాయిలోనూ, కేంద్ర స్థాయిలోనూ నిర్మాణం చేశారు. అంతే కాదు చాలా సూక్ష్మ స్థాయిలో మహిళలకు కలిగే అసౌకర్యాలను కూడా పట్టించుకొన్నారు. ఉదాహరణకి మహిళలకి బహిష్టు సమస్య ఉంటుంది. ఆ సమయాల్లో వారికి కావల్సిన సానిటరి ప్యాడ్లు కానీ బట్టలు కానీ అందుబాటులో ఉంచడం, ఆ సమయంలో వారికి కష్టమైన పనులు అప్పగించకపోవడం వంటి విషయాలపై కమాండర్లుగా ఉన్న (ఇతర నాయకత్వ స్థానాల్లో ఉన్న) పురుషులకు అవగాహన కల్పించారు. ఇలాంటి విషయాలను స్వేచ్ఛగా బహిరంగంగా మాట్లాడుకొనే వాతావరణాన్ని కల్పించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పురుషులు మాత్రమే చేసుకొనేలా చైతన్యం కల్పించారు. యూనిఫార్మ్ లు వేసుకొనేటపుడు మామూలుగా ప్యాంట్లతో స్త్రీలకు యిబ్బంది కలగుతోందని గుర్తించి బటన్లు పెట్టుకోవడం కాకుండా తేలికగా వేసుకోడానికి వీలుగా ఉండే ఎలాస్టిక్ నడుముకు ఉపయోగించి ప్యాంట్లు కుట్టించారు. ఇలా ఎన్నోరకాలుగా ప్రతి విషయాన్ని నిశితంగా గమనించి ఆచరణలోకి తెచ్చారు. ముఖ్యంగా నాయకత్వంలో ఉన్న పురుషులు నాయకత్వంలో ఉన్న స్త్రీల దగ్గరనుండీ సాధారణ సభ్యులుగా ఉన్న మహిళల వరకూ అందరి అభిప్రాయాలూ సూచనలు శ్రద్ధగా విని ఓపికతో వ్యవహరించడం మహిళల అభిప్రాయాలకి తగిన గౌరవం ఇవ్వడం వల్ల మాత్రమే ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పవచ్చు.

 1. రాజకీయ ఉద్యమంలో మహిళల భాగస్వామ్యానికి, మహిళల ప్రత్యేక సమస్యలపై అవగాహనతోఉద్యమాలు నిర్మించడానికి తేడా ఉంటుందా? అది ఎలా ఉంటుంది?

రాజకీయ ఉద్యమంలో మాహిళలు భాగస్వామ్యం కావడం అంటే వారు మొట్టమొదటి అడుగు పితృస్వామ్యాన్ని ఢీకొట్టడం. ఏదో ఒకమేరకు పితృస్వామ్యాన్ని ఎదుర్కోకుండా వారు భాగస్వాములు కాలేరు. అలా భాగస్వాములు కావడం మాత్రమే సరిపోదు. స్పష్టమైన మహిళా విముక్తి దృక్పథంతో మహిళా సమస్యలపై ఉద్యమాలను నిర్మించడం దానిని సమాజ మార్పుకై జరిగే పోరాటంలో భాగం చేయడం ద్వారా మాత్రమే నిజంగా మహిళా విముక్తి కి బాటలువేయగలుగుతాము.

 1. విప్లవోద్యమ చైతన్యంతో మహిళా ఉద్యమం నిర్మాణం కావడానికి ఆంతరంగికంగా ఎలాంటి సంఘర్షణ జరిగింది?

1970 ల్లో గతాన్ని సమీక్షించుకొని ముందుకుపోదాం అని ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన ఏర్పరచుకొని విప్లవపార్టీ అనేక సమస్యలపై ప్రజా సంఘాలను స్థాపించినప్పటికీ మహిళా సంఘాన్ని ఏర్పరచలేదు. మహిళలు రైతు కూలీలుగా, విద్యార్థులుగా, సాంస్కృతిక సేనానులుగా, యువజనులుగా, కార్మికులుగా ఉంటారు కాబట్టి ఈ అన్ని సంఘాల్లో వారిని భాగస్వామ్యం చేయడం ప్రధానం అని భావించింది. ప్రత్యేకంగా మహిళా సంఘం నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తించలేకపోయింది. మహిళలు క్రమంగా దీన్ని ప్రశ్నించాకే నాలుగైదు ఏళ్ల తరవాతే అప్పటి పరిస్థితిని బట్టి వివిధ ప్రాంతాల్లో మహిళా సంఘాలను ఏర్పరచడం మొదలయ్యింది. అయితే ఈ చర్చకు సంబంధించిన ప్రభావం అంతగా లేకుండానే, ఏపి లో ప్రత్యేక మహిళా సంఘాలను ఏర్పరచక ముందే దండకారణ్యంలో 1980 నుండే వివిధ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళా సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పరిచి మహిళా ఉద్యమాన్ని నిర్మించారు.

 1. 1980లలో స్త్రీవాదం రావడానికి విప్లవోద్యమం కారణమా? లేక విప్లవోద్యమంలో స్త్రీ విముక్తి అవగాహన అభివృద్ధి పొందడానికి స్త్రీవాదం కారణమా?

ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి పరస్పరంగా ప్రభావితం అయ్యాయి. విప్లవోద్యమంలో భాగస్వామ్యం వల్ల స్త్రీల చైతన్యం బాగా పెరిగింది. ఆ చైతన్యంతోనే పితృస్వామ్యాన్ని బద్దలుకొట్టే క్రమంలో స్త్రీవాదం బలంగా ముందుకువచ్చింది. అంతర్జాతీయంగా కూడా 70,80 దశకాలలో స్త్రీవాదం అభివృద్ధి చెందడం కూడా స్త్రీ వాదం మన దేశంలో పెరగడానికి దోహద పడింది. ఆ ప్రభావం తిరిగి విప్లవోద్యమం మీద కూడా పడింది. స్త్రీవాద ప్రభావం విప్లవోద్యమంలో ఉన్న మహిళల పైనా పురుషుల పైనా కూడా పడింది. విప్లవ పార్టీలో ఉన్న స్త్రీలు అనేక రకాలుగా పార్టీ లోని పితృస్వామ్య దృక్పథానికి వ్యతిరేకంగా పోరాడటానికి స్త్రీవాదం ఇచ్చిన చైతన్యం పని చేసింది. పార్టీ లోని పురుషులలో కూడా ఎన్నో మూస భావాలను బద్దలు కొట్టడానికి, వారు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఆంతరంగికంగా పోరాటం చేసుకోవడానికి స్త్రీవాదం తప్పనిసరిగా ఉపయోగపడింది. ఆ ప్రభావం విప్లవోద్యమం మీద కూడా ఉంది. అవి ఒక మేరకు విప్లవోద్యమంలో మహిళా విముక్తి పట్ల స్పష్టమైన దృక్పథాన్ని ప్రకటించడాన్ని వేగిరపరిచాయి.

 1. వేర్వేరు రాజకీయ భావజాలాలతో దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత రంగాల్లో జరుగుతున్న మహిళా ఉద్యమాలకు, విప్లవోద్యమంలో భాగంగా జరుగుతున్న మహిళాఉద్యమాలకు తేడా ఎలా చూడవచ్చు?

ఏ రాజకీయ భావజాలంతో మహిళా సంఘాల నిర్మాణం జరిగిందో సాధారణంగా ఆ రాజకీయ ప్రయోజనాలకోసమే అవి పనిచేస్తాయి. విప్లవోద్యమంలో భాగంగా జరిగే మహిళా ఉద్యమానికి తక్షణ సమస్యల పరిష్కారంతో పాటు మహిళా విముక్తి దృక్పథం, మహిళా విముక్తి లక్ష్యం కూడా ఉంటాయి. అలా లేనపుడు అవి తక్షణ డిమాండ్లు నెరవేర్చుకోడానికి మాత్రమే పరిమితమవుతాయి. అలాగే స్త్రీలను వెనక్కి తీసుకుపోయే మనువాద భావజాలంతో ఉండే రాజకీయ భావజాలంతో నిర్మితమయిన మహిళా సంఘాలు కూడా మహిళలను మళ్ళీ వెనక్కితీసుకుపోయి పితృస్వామ్య చట్రాలలో బంధిస్తాయి. కాని విప్లవోద్యమంలో భాగంగా జరుగుతున్న ఉద్యమం తక్షణ సమస్య పరిష్కారం కోసమే కాకుండా ఆ సమస్యకి ఆధారం ఏమిటి? దానిని సృష్టించిన వ్యవస్థ ఏంటి అనే కారణాల విశ్లేషణలోకి పోయి అది మహిళా విముక్తికి ఆటంకంగా ఉన్నదయితే దానిని ధ్వంసం చేయనిదే మహిళా విముక్తి సాధ్యం కాదనే అవగాహన తన ప్రతిపోరాటంసందర్భంలోనూ ప్రచారంచేసి ప్రజల చైతన్యాన్ని పెంచుతుంది. ఈ స్పష్టత లేకపోతే తన శతృవులెవరో తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. అలాగే రాజకీయ రహితంగా మహిళల సమస్యలపై పని చేస్తే అది వారిని ఎవరో ఒకరు వచ్చి తమ సమస్యలను పరిష్కారం చేస్తారని ఎదురుచూసేలా చేస్తుంది. అలాగే పరోక్షంగా పితృస్వామ్య భావజాలాన్ని పెంపొందించడానికి రాజ్యానికీ ఉపయోగపడుతుంది.

 1. కమ్యూనిస్టు ఉద్యమమంటే పురుష ఉద్యమమనే ప్రచారం జరుగుతుంది క‌దా? ఈ ఆరోపణను ఎలా చూడవచ్చు?

ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతుందా అని నాకు సందేహం. ముఖ్యంగా విప్లవోద్యమంలో ఆదివాసీ ప్రాంతాల్లో అయితే స్త్రీలు సగ భాగంగా ఉన్నారు. ఇతర ప్రాంతాలలో కూడా గణనీయంగా ఉన్నారు. ఆ సమాచారం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఎన్నోసార్లు బూటకపు ఎదురు కాల్పుల సందర్భంగానో నిజమైన ఎదురుకాల్పుల సందర్భంగానో పేపర్లలో మరణించినవారి గురించి ప్రకటించినపుడు చూసినా ఆ విషయం అర్థమవుతుంది. మహిళలు వివిధ స్థాయిల్లో నాయకత్వ స్థానాల్లో కూడా ఉన్నారు. అయితే నాయకత్వ స్థానాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి నాయకత్వంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నా కేంద్ర స్థాయి నాయకత్వ స్థానంలో వారి సంఖ్య పెరగవలిసే ఉంది. ఇప్పటికీ సమాజం మహిళలను రెండవ తరగతి మహిళలుగానే చూస్తోంది. పురుషాధిపత్య ధోరణులు బలంగా ఉన్న సమాజంలోనుండి ఎంతో పెద్ద సంఖ్యలో మహిళలు విప్లవోద్యమంలో భాగం కావడం నాయకత్వం వహించడం అంత తేలిగ్గా జరగలేదు. దాని వెనుక ఎంతో కృషి, దిద్దుబాట్లు, పురుషాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా తమపై తాము చేసుకుంటున్న అలుపెరుగని పోరాటం ఉన్నాయి. రాజ్య నిర్బంధంలో భాగంగా ఎంతో మంది గొప్ప విప్లవ మహిళలను నాయకత్వ స్థానాల్లో ఉండగా కోల్పోవడం వల్ల కూడా ఈ అపవాదు ఎదుర్కోవాల్సి వస్తోంది.

 1. ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో స్త్రీవాదం ఎక్క‌డి దాకావ‌చ్చింది?

ఒక ప్రత్యేక సమస్య మీద కానీ, ప్రత్యేక అంశం మీద కానీ కేంద్రీకరించి పనిచేసినప్పుడు ఎన్నో సూక్ష్మమైన విషయాలు కూడా వెలికి వస్తాయి. ఎన్నో తెలియని కోణాలు బయట పడతాయి. అయితే అవి ఒక సమగ్ర ప్రాపంచిక దృక్పథంలో భాగమైనప్పుడే తాత్విక ముగింపుకు చేరుకోగలుగుతాయి. సమగ్ర ప్రాపంచిక దృక్పథంతో పనిచేసే ఉద్యమాలు కొన్ని అంశాలను ఏ కారణంతో నైనా చేపట్టలేకపోయినా, నిర్లక్ష్యం చేసినా ప్రాపంచిక దృక్పథంలో ఆ సమగ్రత లోపించినట్టే. అప్పుడు అవి ఆయా అంశాలకు సంబంధించిన ప్రత్యేక ఉద్యమాలకు, అస్తిత్వ ఉద్యమాలకు దారి తీయవచ్చు. మార్క్సిస్టేతర/ కార్మిక వర్గేతర ప్రాపంచిక దృక్పథాలు వీటికి మరింత తోడ్పడతాయి. అయినా, ఆయా సమస్యల పట్ల అవి చైతన్యాన్ని పెంచడంలో, సమస్య తీవ్రతని గుర్తింప జేయడంలో కీలకపాత్ర వహిస్తాయి. స్త్రీవాదం కూడా మహిళల చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర వహించింది. అయితే చాలావరకూ నిర్మాణం అంటేనే అణచివేత అనీ నాయకత్వం అంటేనే ఆధిపత్యం అనే భావాలు ఉండడం వల్ల అది ఉద్యమ రూపం తీసుకొనే అవకాశం తక్కువ. కాబట్టి సాధారణంగా వ్యక్తులుగానే వారు పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తారు. కానీ వ్యవస్థ మార్పుకోసం చేసే పోరాటాలకు నిర్మాణం, నాయకత్వం, క్రమశిక్షణ ఇవన్నీ అవసరమవుతాయి. మన దేశంలో స్త్రీవాదం పైన విప్లవోద్యమ ప్రభావం గణనీయంగా ఉంది. ఎనభయ్యవ దశకం మొదట్లో దేశవ్యాప్తంగా స్త్రీవాద ప్రభావంతో వరకట్నం, సతీ వంటి అనేక మహిళా సమస్యల పై ఉద్యమాలు కూడా నడిచాయి. పట్టణాల్లోని బస్తీ మహిళలు పాల్గొన్న సందర్భాలలో అవి మిలిటెంట్ రూపం కూడా తీసుకున్నాయి. కానీ నాయకత్వం మధ్యతరగతి మహిళా మేధావుల చేతిలో ఉండడం వల్ల వారు ప్రధానంగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్నే నమ్మడం, అర్జీలు, లాబీయింగ్ లే ప్రధాన కార్యాచరణ చేసుకోవడం వల్ల అది ఉద్యమ స్వభావాన్ని కోల్పోయింది. ఆ తరవాత అనేక మందిని ప్రభుత్వం కో –అప్ట్ చేసుకొని వాళ్ళతో విశ్వవిద్యాలయాలోనూ, ఇతరత్రా పరిశోధనల బాధ్యతలు ఇవ్వడం ద్వారా వారందరినీ కాగితాలకి పరిమితం చేసింది. మరికొందరు ఎన్‌జి‌ఓ లుగా కో ఆప్ట్ అయ్యి సామ్రాజ్యవాద నిధులతో పనిచేస్తున్నారు.

 1. వర్గపోరాటం ద్వారా స్త్రీవిముక్తి సాధ్యం కాదని చెప్పడానికి స్త్రీవాదులు చాలా సైద్ధాంతిక కసరత్తుచేశారు. ఈ వాదనను దండకారణ్య మహిళా ఉద్యమం వైపు నుంచి చూస్తే మీకుఏమనిపిస్తుంది?

వర్గపోరాటం ఒక సమూల మార్పుకోసం ఉద్దేశించినది. అది సాధ్యమే అని చెప్పటానికి దండకారణ్యంలోని ఉద్యమం ఒక ఉదాహరణ. అక్కడ మహిళలు మహిళా ఉద్యమంలోనే కాదు మొత్తంగా విప్లవోద్యమంలో తనదైన కీలక పాత్రను నిర్వహిస్తున్నారు. ప్రజారాజ్య కమిటీలలో నాయకత్వ బాధ్యతల్లో కూడా ఉన్నారు.

 1. విప్లవోద్యమంలో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లోజరుగుతున్న మహిళా ఉద్యమాలకు, దండకారణ్య మహిళా ఉద్యమానికి మధ్య కూడా తేడా ఉన్నట్లుంది. నిజమేనా? ఏమిటా తేడా?

తేడా ఉంది. అయితే దండకారణ్యంలో కృషికి కొన్ని అనుకూల అంశాలు తోడ్పడ్డాయని చెప్పవచ్చు. విప్లవోద్యమం వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ప్రాంతానికి సంబందించిన ప్రత్యేకతలు, విప్లవోద్యమం సాపేక్షికంగానైనా ఎంత స్థిరంగా ఉండగలుగుతోందనే దానిపైనా, అక్కడి సమాజంలోని ప్రత్యేకతలు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అటవీ ప్రాంతాల్లోని ఉద్యమానికీ మైదాన ప్రాంతాల్లోని ఉద్యమానికీ కూడా తేడాలుంటాయి. అంతెందుకు, దండకారణ్యంలోనే అన్ని ప్రాంతాల్లోనూ సమాన మైన స్థాయిలో మహిళా ఉద్యమం లేదు. కొన్ని ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెంది ఉంది. కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉంది. దానికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. అంతే కాదు విప్లవోద్యమం ఒడిదుడుకులకు గురి అయినపుడు ఆ ప్రభావం మహిళా ఉద్యమం మీద కూడా ఉంటుంది. దానిని గతితార్కికంగా అర్థం చేసుకోవాల్సిఉంటుంది. మహిళల భాగస్వామ్యం పెంపొందించడానికి పార్టీ తీసుకునే చర్యలు దేశవ్యాప్త ఉద్యమానికి మార్గదర్శకంగా ఉండేలా చూస్తుంది. విప్లవోద్యమం బలంగా ఉన్న దగ్గర అవి సాధించే ఫలితాలు గొప్పగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్యం బలంగా ఉన్న చోట విప్లవోద్యమం బలహీనంగా ఉంటే తక్కువ ఫలితాలుసాధిస్తాం. దండకారణ్యంలో విప్లవోద్యమం బలంగా ఉండడం, అక్కడి నాయకత్వం చేస్తున్న విశిష్ట కృషి, ఉద్యమానికి ఉన్న కొనసాగింపు, అక్కడి సమాజపు ప్రత్యేకతలు ఇవన్నీ అనుకూలించాయని చెప్పవచ్చు.

 1. దండకారణ్యం నుంచి వస్తున్ననివేదికలను చూస్తోంటే ఆధునిక భారతదేశ చరిత్రలోనే మహిళల క్రియాశీల, నిర్ణయాత్మక భాగస్వామ్యం అక్కడ గరిష్టంగా ఉందనిపిస్తోంది. అక్కడివర్గపోరాటమే మహిళలకు ఈ స్వేచ్ఛ‌ను , చైతన్యాన్ని ఇచ్చిందా? లేక స్త్రీలభాగస్వామ్యం కోసం చేసిన ప్రత్యేక సాంఘిక సాంస్కృతిక ఉద్యమాల వల్ల అక్కడవర్గపోరాటం ఈ దశకు అభివృద్ధి చెందిందా?

  నిజమే. అక్కడి వర్గపోరాటం మహిళలను భాగస్వామ్యం చేసింది. మహిళల భాగస్వామ్యం వల్ల విప్లవోద్యమం బలోపేతం అయ్యింది. దండకారణ్యంలో అడుగుపెట్టిన కొత్తలో అక్కడి సమాజంలో పితృస్వామ్యం ఉందా, వర్గాలు ఉన్నాయా? అనే సందేహాలు కూడా తలెత్తాయి. అక్కడి ఆచారాలు, సాంప్రదాయాల వల్ల పితృస్వామ్యం అర్థం అయినా వర్గాలు ఉన్నాయనేది కాల క్రమంలో స్పష్టమైన విషయం. పార్టీ, మహిళల సమస్యలను చేపట్టటంతో మహిళలు విప్లవోద్యమంలోకి ఆకర్షితమయ్యారు. అందులో భాగం కావడం వారి చైతన్యాన్ని గణనీయంగా పెంచింది. వర్గపోరాటం స్త్రీలను, స్త్రీలు వర్గపోరాటాన్ని పరస్పరం బలంగా ప్రభావితం చేశారు. దండకారణ్యంలోని మహిళా ఉద్యమం “మహిళ లేని విప్లవం గెలవలేదు, గెలవబోదు” అని గట్టిగా ప్రచారం చేసింది.

 2. దండకారణ్య మహిళా ఉద్యమం పితృస్వామ్య విశ్లేషణకు కొత్త చేర్పును ఏమిచ్చింది?

ఆదివాసీ సమాజంలో పితృస్వామ్యం అసలు ఉండదు అని కూడా కొంతమంది భావిస్తారు. కానీ పితృస్వామిక సంస్కృతిలో భాగంగా మహిళలు మాత్రమే చెయ్యవలిసిన పనులు, అలాగే చెయ్య కూడని పనులు కూడా ఉన్నాయి. స్త్రీలు గుడ్లు తింటే పిల్లలు కలగరు అనే అంధ విశ్వాసంతో వాళ్ళని గుడ్లు తిననివ్వరు. పొలం కూడా మగవాళ్ళు దున్నాలి. పంట కోస్తే అంతా తాలు అయిపోతుందని భావించి ఆడవాళ్ళను కోతల్లో పాల్గొననివ్వరు. కళ్ళాల్లో అడుగుపెట్టకూడదు. ఆహార సేకరణ వాళ్ళు మాత్రమే చెయ్యాలి. వేటలో పాల్గొనకూడదు. వేట పడదు అని భావిస్తారు. అలాగే బహిష్టు సమయంలో ఊరికి దూరంగా వంటరిగా అందుకోసం ప్రత్యేకించిన గుడిసెలో ఉండాలి. అలా దూరం పెట్టడం బ్రాహ్మణ సాంప్రదాయం మాత్రమే కాదు. (అదికూడా దక్షిణ భారతంలోనే) ఆదివాసీ సాంప్రదాయం కూడా. వివాహం తరవాత స్త్రీలను జాకెట్లు ధరించనివ్వరు. కొన్ని ఆదివాసీ సాంప్రదాయాల్లో పితృస్వామ్యాన్ని గుర్తించక వాటిని విప్లవకారులు ధ్వంసం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

ఉదాహరణకు గోటుల్ సంప్రదాయం. గోటుల్ అనేది అవివాహిత యువతీ యువకులు కలుసుకొనే స్థలం. అక్కడ సామూహిక నృత్యాలు ఆటపాటలతో పాటు లైంగిక కార్యకలాపాలు కూడా జరుగుతాయి. కానీ కాలక్రమేణ అందులో స్త్రీల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా లైంగిక సంబంధాలను కోరడం వల్ల అది వారికి భారంగా పరిణమించింది. అందువల్ల వాళ్ళు అక్కడకు వచ్చిన విప్లవకారులతో తమ బాధలను పాటలరూపంలో చెప్పుకున్నారు. ఆవిధంగా అక్కడి సమాజంలోని మహిళా సమస్యలను గుర్తించి వాటిపై పార్టీ ప్రత్యేక కృషి ప్రారంభించింది. ఈ వివరాలు 30యేళ్ళ దండకారణ్య సాహిత్య, సాంస్కృతిక చరిత్ర చదివితే మరింత వివరంగా తెలుసుకోవచ్చు. అయితే కొందరు ఆంత్రోపోలజిస్టులు (మానవ చరిత్ర శాస్త్రవేత్తలు) గోటుల్ సాంప్రదాయం వంటి వాటిలో విప్లవోద్యమం కల్పించుకోవడం అనేది వారి సాంప్రదాయాల్లో తల దూర్చడం, వారిని ఆదివాసీ సాంప్రదాయాలకు దూరం చేయడం అని కూడా వ్యాఖ్యానించారు. దండకారణ్య అనుభవం పితృస్వామ్య మూలాలు ఎంతగా చొచ్చుకుపోయాయో వాటిని పైపై పరిశీలనతో కనుక్కోవడం ఎంత కష్టమో తెలియజేస్తుంది.

 1. పితృస్వామ్యం-తెగ అనే రెంటిపై దండకారణ్య విప్లవోద్యమం ఇస్తున్న ఫోకస్ మైదాన ప్రాంతాల్లో పితృస్వామ్యం-కులం మధ్య సంబంధాన్ని పరిశీలించేందుకు ఉపయోగపడుతుందా?

తెగ కులం అనేవి రెండు వేరు వేరు విషయాలు. కాబట్టి ఆ పరిశీలనతో దీన్ని అర్థం చేసుకోలేము. అసలు అక్కడి నుండి పరిశీలన తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. పీడిత కులాల మహిళలు అగ్రకులాధిపత్యంతో పాటు పితృస్వామ్యాన్ని కూడా ఎదుర్కొంటారు. పీడిత కులాలకు కుల అణచివేతకి వ్యతిరేకంగాను, కుల నిర్మూలన కోసమూ పోరాడడం ప్రధానంగా ఉంటూనే పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంటుంది. మొత్తంగా కుల నిర్మూలన గురించిన దృక్పథం, ఆచరణతోనే ఆ విషయాలను పరిశీలించవచ్చు.

 1. దండకారణ్యంలో కొత్త సంస్కృతి వికసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అనుభవం నుంచి పితృస్వామ్యం-సంస్కృతి మధ్య సంబంధాన్ని మార్క్సిస్టు పద్ధతిలో ఎలా విశ్లేషించవచ్చు?

దండకారణ్యంలో వర్గపోరాటం అనేక అభివృద్ధి నిరోధక అంశాలకు పునాదులను మార్చివేసింది. ఎక్కడెక్కడ పితృస్వామ్యం స్త్రీల భాగస్వామ్యం లేకుండా చేసిందో అక్కడ స్త్రీలు పాల్గొనేలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు స్త్రీలు వేటకు వెళ్లడమే కాదు విల్లంబులతో పాటు వర్గపోరాటంలో తుపాకులు కూడా ఎత్తిపట్టారు. జనమిలీషియాలోని యువతులు విల్లంబులు పట్టి పోరాడుతున్నారు. పొలాలను దున్నుతున్నారు. పంటలను సల్వాజుడుమ్ మూకల నుండి రక్షించుకుంటున్నారు. స్త్రీలు ఉత్పత్తిలో సమానంగా పాల్గొనడం వల్ల పితృస్వామిక సంస్కృతికి ఆధారంగా ఉన్న నిర్మాణాలు మారిపోయాయి. సమాన పనికి సమాన వేతనం సాధించుకున్నారు. ఆర్థిక సంబంధాల పునాదిగా సంస్కృతి నిర్మాణం అవుతుందనే మార్క్సిస్టు విశ్లేషణను బట్టి ఆ ఆర్థిక అంశాల పునాది ఇక్కడ మారినందుకే సంస్కృతిలో మార్పు సాధ్యమైంది. ఆ రకంగా అక్కడ ఒక నూతన ప్రజాస్వామిక సంస్కృతి నెలకొన్నది.

 1. స్త్రీ కోణంతోపాటు దండకారణ్య ఆదివాసీ మహిళా ఉద్యమాన్ని సమగ్రంగా ఎలా విశ్లేషించుకోవచ్చు?

  స్త్రీలు విప్లవోద్యమంలో గణనీయమైన పాత్ర వహించాలంటే వాళ్ళు మొదట అందులో భాగస్వాములు కావాలి. మహిళా సమస్యల మీద ముందుగా కదులుతారు కాబట్టి ఆ సమస్యల ప్రాతిపదిక మీద మహిళా సంఘాలలో సంఘటితం కావడం ఒక మొదటి అడుగు మాత్రమే. అయితే మహిళలు మహిళా సంఘాలకి మాత్రమే పరిమితం అయితే అది విప్లవోద్యమంలో భాగం అయినట్టు కాదు. అదే విషయం దండకారణ్య మహిళా ఉద్యమాన్ని, మొత్తం ఉద్యమాన్ని చూస్తే తెలుస్తుంది. మహిళలు ఇప్పుడు మహిళా సంఘాలల్లో మాత్రమే కాకుండా, ప్రజా సంఘాల్లో, ప్రజా రాజ్య కమిటీల్లో వాటికి సంబందించిన వివిధ విభాగాల బాధ్యులుగా ప్లటూన్, కంపెనీ వంటి సైనిక నిర్మాణాల్లో సభ్యులు గానూ, కమాండర్లు గానూ రాజకీయ కమిస్సార్లుగా, దండకారణ్య ఉన్నత నిర్మాణాలలో నాయకులుగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆరకంగా వారు మహిళలకి మాత్రమే కాదు ప్రజలందరికీ కూడా నాయకత్వం వహిస్తున్నారు. మహిళాఉద్యమం బలంగా ఉంటే మాత్రమే సరిపోదు. దాని వల్లమిగతా అన్ని నిర్మాణాల్లోకి మహిళలు భాగం కావడం అంతిమంగా అసమానతలను రూపమాపడానికి కీలకం అవుతుంది. మొత్తంగా విప్లవోద్యమానికి మార్గదర్శనం చేసే నాయకత్వంలో సగం మహిళలు ఉన్నప్పుడే వ్యవస్థను సమగ్రంగా సమూలంగా మార్చగలుగుతాము. ఆరకమైన నిర్మాణాలను మనం అక్కడ చూస్తున్నాం. అంతే కాదు అక్కడి మహిళా ఉద్యమం సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్కడి ఉద్యమ సమగ్రతకి ఇది ఒక ఉదాహరణ.

 2. లైంగిక వివక్ష గురించి ఇంత ప్రజాస్వామిక చర్చ జరుగుతున్న సమయంలో మూడో జెండర్ అనే కొత్త మాటను వ్యవహారంలోకి తీసుకువస్తున్నారు. అసలు జెండర్ హైరార్కీకి వ్యతిరేకంగా కంప్లీట్ జెండర్ అప్ప్రోచ్ కు అవకాశం ఉందా?

  సమాజంలో కొత్త కొత్త విషయాలు సమస్యలుగా ముందుకు వచ్చినపుడు వాటిపట్ల సమగ్ర పరిశోధన చేసి ఒక దృక్పథాన్ని కలిగిఉండడం వాటిని పరిష్కరించడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. జెండర్ మైనారిటీలు వివక్షకీ, హింసకీ గురైనపుడు అటువంటి వాటికి వ్యతిరేకంగా జరిగే ప్రజాస్వామిక పోరాటాల్లో పాల్గొనడం, మద్దతునివ్వడం విప్లవోద్యమం సహజంగా చేసే విషయం. సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం అణచివేతకు, దోపిడీకి గురయ్యే వర్గాలకూ, కులాలకు, సమూహాలకూ వెసులుబాట్లు కల్పించడానికి ఈ గుర్తింపులు అవసరం అవుతాయి. అంతిమంగా అసమానతలన్నిటినీ నిర్మూలించడం అటువంటి గుర్తింపుల అవసరాన్ని రద్దుచేయడానికే.

Leave a Reply