జూన్ 18 సాయంకాలం గుంటూరు దగ్గర ఓ గ్రామంలో బెల్లాల పద్మను, అదే రోజు హైదరాబాదులో దుబాసి దేవేందర్‌ను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పద్మ అనేక అక్రమ కేసుల్లో సుదీర్ఘకాలంపాటు జైలులో ఉండి విడుదలై వచ్చింది. పద్మ అనే పేరు మీద నమోదై ఉన్న అక్రమ కేసులన్నిటినీ అమె మీద మోపి జైలు నుంచి బైటికి రాకుండా చేశారు. ఆ నిర్బంధాన్ని దాటి బైటికి వచ్చే సరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. తిరిగి మామూలు పరిస్థితికి రాలేదనంతగా శరీరం శిథిలమైపోయింది. అయినా ఓపికగా న్యాయశాస్త్రం చదివింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే ఓపిక ఉన్నప్పుడు సభలకు హాజయ్యేది. ఈ క్రమంలో ఆమె ఓ మిత్రురాని కలవడానికి గుంటూరు దగ్గర వెంకటాయపాలెం వెళ్లినప్పుడు చత్తీస్ఘడ్ నుంచి ఎన్ఐఏ పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకపోయారు. దుబాసి దేవేందర్ జూన్ 18న సిద్ధిపేట లో పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేసి తీసికెళ్లారు. అతని తండ్రి విప్లవోద్యమంలో పని చేస్తూ అరెస్టయి జైలుల్లో ఉన్నాడు. ఈ కారణంతో దేవేందర్ మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. వీళ్లను వెంటనే విడుదల చేయాలని విరసం డిమాండ్ చేస్తోంది.
సరిగ్గా ఈ సమయంలోనే తాడ్వాయి పోలీసు స్టేషన్లో రెండేళ్ల కింద నమోదైనట్లు ఓ అక్రమకేసు బైటపడింది. ఇందులో ప్రొ. హరగోపాల్, ప్రొ. పద్మజాషా, పివొడబ్ల్యు సంధ్య, అరుణోదయ విమల మొదలు దేశంలోని అనేక మంది ప్రజాస్వామికవాదులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు 152 మంది పేర్లు నమోదు చేశారు. ఇందులో మరణించిన ఇద్దరి వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. కొందరి పేర్లు డబల్ ఎంట్రీ చేశారు. 152 మంది మీద నమోదైన ఈ తప్పుడు కేసు మీద తెలంగాణలోనూ, మిగతా ప్రాంతాల్లోనూ పెద్ద ప్రతిస్పందన వచ్చింది. దీంతో కేసీఆర్ వెనకడుగు వేసి ప్రొ. హరగోపాల్, ప్రొ. పద్మజాషా, ప్రొ. లక్ష్మణ్, ప్రొ. గుంటి రవి, న్యాయవాదులు రఘునాథ్, సురేష్‌ల మీద కేసు ఎత్తేశారు. అయితే ఈ కేసులో ఉన్న 152 మంది మీద కేసు ఎత్తేయాలని ప్రొ. హరగోపాల్ దగ్గరి నుంచి ప్రజాసంఘాల నాయకులందరూ కోరుతున్నారు. రాజ్యాంగవ్యతిరేకమైన ఉపా చట్టాన్ని మొత్తంగానే రద్దు చేయాలని, తాడ్వాయిలో నమోదు చేసిన కేసుతో సహా ఇప్పటికే రెండు తెలుగు రాష్ర్టాల్లో అక్రమంగా నమోదు చేసిన అన్ని కేసులను రద్దు చేయాలనే ప్రజాస్వామిక ఆందోళన ఆరంభమైంది. ఈ కేసులు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టినా యుఎపిఏ కేసులు, ఎన్ఐఏ విచారణలు అన్నీ కేంద్రంలోని బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్నవే. పార్టీలు వేరైనా అణచివేత, ప్రజావ్యతిరేక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనల విషయంలో అన్ని ప్రభుత్వాలదీ ఒకే విధానం. సరిగ్గా తెలంగాణలో తాడ్వాయి కేసులాంటిదే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా కొయ్యురు మండలం మాంప పోలీస్ స్టేషన్లో 5 . 12 . 2021 న ఒక అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులో 37 మంది మీద కేసు పెట్టారు. విరసం సహా వివిధ ప్రజాసంఘాల సభ్యులు 10 మంది మీద అవుద్దపు ఆరోపణలు చేశారు. ఇలాంటి ఫాసిస్టు అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమంలో ప్రజాస్వామిక శక్తులన్నీ కలిసి రావాలని విరసం పిలుపుఇస్తోంది.
మా సత్యం
రాజ్యాంగ వ్యతిరేకమైన ఉపా చట్టం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేయకపోవడం, ఎన్ఐఏ అధికారులు ‘రూల్ ఆఫ్ లా’ను అధిగమిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఒక భయానక వాతావరణము సృష్టిస్తున్న తీరును సమర్థిస్తూ, భారత పాలకుల ఫాసిస్టు చర్యలలో భాగమై పనిచేయడం హాస్యాస్పదంగా ఉంది. బెల్లాల పద్మ పై మళ్లీ అబద్ధపు కుట్ర కేసులు బనాయించారు. సుదీర్ఘకాలం చాలా జైలు నిర్బంధం నుంచి విడుదలైన కొన్ని నెలలకే ఎన్ఐఏ అధికారులు మరో కుట్ర కేసు బనాయించి అరెస్టు చేయడం పాలకుల పిరికితనానికి నిదర్శనం. పద్మ చాలాకాలంగా వెన్ను నొప్పితో, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిస్తూ బేషరతుగా పద్మా గారిని,దుబాసి దేవేందర్ గారిని యుద్ధ ప్రతిపాదికన విడుదల చేయాలని, అలాగే దేశంలోని అనేక మంది ప్రజాస్వామికవాదుల పై, ప్రజాసంఘాల నాయకులపై కార్యకర్తలు 152 మంది పేర్లు నమోదు చేశారు. భేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను.