గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే  ఇప్పుడు మరింత  గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది. 

ముఖ్యంగా ఫాసిస్టు సందర్భం సమాజంలో ఉండే అనేక వైరుద్యాలకు మసి పూసి ‘మేము’ అనే ఒక ఊహాజనిత పెద్ద కేటగిరీని నిర్మాణం చేస్తుంది. దాని మూలంగా ఏర్పడే ‘మేము’, ‘వారు’ అనే విభజన సమాజంలో పెద్ద భాగానికి ఒక దృష్టి కోణంగా మారిపోతుంది. కొన్నిసార్లు ఫాసిస్టు వ్యతిరేక శక్తులు కూడా ఇటువంటి నిర్ణయాత్మకమైన (deterministic) ఆలోచనలే చేసే స్థితికి చేరే ప్రమాదం వుంటుంది.

ఏ చీకటి శాశ్వతం కాదని చరిత్ర చెబుతుంది. చీకటి కాలంలోనే వెలుగుల కోసం ఆరాటం పెరుగుతుందని కూడా చెబుతుంది. ఇది మూస ఆలోచన కాదు. ఒక గతితార్కిక ప్రక్రియ. అందుకే చీకటి కాలంలో హింస, అణిచివేత, యతలు

ఉన్నట్లుగానే వాటిని ధిక్కరించే శక్తులు, ధిక్కార గానాలు కూడా వుంటాయి. సమాజపు నలుమూలల నుండి వీస్తున్న అన్ని విషపు గాలుల మూలాలను అర్థం చేసుకుంటూ సాహసంగా వాటిని ఎదురించే ధిక్కార గానాల విశ్లేషణే ఈ ‘ద్వేషభక్తి’ సారం. ఈ పుస్తకంలో 42 వ్యాసాల్లో  పాణి అనేక అంశాలు చర్చించాడు. అవన్నీ చాలా లోతు, విస్తృతి వున్న విషయాలు. అయితే అవి మొత్తంగా నాలుగు ముఖ్యమైన ఫాసిస్టు లక్ష్యణాలను అనేక కోణాలలో, సందర్భాలలో చర్చిస్తాయి. అవేమంటే ద్వేషం, పెత్తనం  (సాంస్కృతిక, రాజకీయార్థిక పెత్తనం), భయం (ఫాసిస్టులు భయపడుతూ కుట్రలతో, దొంగ కేసులతో భయపెట్టే ప్రయత్నం చెయ్యడం), హింస (అన్ని రాజ్య వ్యవస్థలను, రాజ్యాంగేతర శక్తులను ఉపయోగించి ప్రజల మీదా, ప్రజా ఉద్యమాల మీదా హింసను కొనసాగించడం). 

‘చరిత్రలో ఫాసిజం పుట్టుక, ఎదుగుదల విఫలమైన విప్లవాలకు ఒక నిదర్శనం’ అని అంటాడు స్లావో జెజాక్‌. కేవలం విప్లవాలు వెనుకంజ వెయ్యడమే ఫాసిజానికి మూలం అనే వాదన అచారిత్రకమైనది, అశాస్త్రీయమైనది. ఎందుకంటే వాస్తవానికి ఫాసిజం పుట్టుక అతిజాతీయవాదంలో, తమ జాతే గొప్పదనే ఆధిపత్య భావజాలంలో, సామ్రాజ్యవాద ప్రపంచయుద్ధాల పర్యవసానంలో, అడుగంటిపోయిన ఉదారవాద ప్రజాస్వామ్య విలువల్లో, నిరంకుశత్వానికి, పెట్టుబడికి కుదిరిన చీకటి ఒప్పందాలలో ఉంది. నిజానికి ఫాసిజాన్ని ఓడిరచడానికే సోషలిస్టు విప్లవాలు మహోన్నతమైన త్యాగాలు చేశాయి. ఈ విషయాన్ని జెజాక్‌ లాంటి మేధావులు మాట్లాడరు.  ఫాసిజం అభివృద్ధి క్రమంలో తన లక్ష్యంగా చేసుకునేది కేవలం కమ్యూనిస్టులను మాత్రమే కాదు. అది అన్ని రకాల ప్రజాస్వామిక వాదాలను, ఉదారవాదాన్ని, హేతువాదాన్ని, బహుళత్వవాదాలను తన శత్రువు జాబితాలో వేసుకుంటుంది. వాటన్నింటి గొంతు నొక్కే పని చేస్తుంది. అయితే అది కమ్యూనిస్టులతో మొదలు పెడుతుండొచ్చు కాని, అక్కడే ఆగిపోదు.

అయితే యురోపియన్‌ ఫాసిజం నమూనా అధారంగా ‘వలసానంతర’ దేశాల్లో అమలవుతున్న ఫాసిజాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. భారతదేశంలో యురోపియన్‌ ఫాసిజంలో మాదిరిగా పార్లమెంట్‌ను బలప్రయోగంతో  కైవసం చేసుకొని నిరంకుశత్వాన్ని అమలుచేసే పరిస్థితి లేదు. నిజానికి యురోపియన్‌ ఫాసిజం ఒక మొరటు పద్ధతిని ఎంచుకుంది. కాని భారతదేశంలో హిందుత్వ శక్తులు యురోపియన్‌ ఫాసిజం ప్రభావానికి గురైనప్పటికి అవి తమకు అనుకూలమైన sophisticated మార్గాన్ని ఎంచుకున్నవి. ఆ మార్గంలో వేల ఏండ్ల పీడనగా కొనసాగుతున్న బ్రాహ్మణీయతను, అధికార బదిలీతో వచ్చిన బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థను, కొన్ని సామాజిక సందర్భాలలో స్పష్టంగా, మరికొన్నిసార్లు అస్పష్టంగా కనిపించే భూస్వామ్య భావజాలాన్ని తన సాధనాలుగా వాడుకుంటున్నాయి. వాటిని ఆధారంగా చేసుకోనే తాను వ్యతిరేకించే వర్గాల, కులాల, జాతుల, లింగాల, మత మైనారిటీల మీద ద్వేషాన్ని పెంచుతున్నాయి. ఈ దేశం హిందువులది, ఇక్కడ వుండాలంటే హిందువులుగా బతకాలనే భావనతో హిందుత్వ ద్వేషాన్ని పురికొల్పుతున్నాయి. దీని కోసం చరిత్రను వక్రీకరించి అందులో పర మతస్థుల చేతుల్లో హిందువులను బాధితులుగా చూపి ఆయా మతాల మీద ద్వేషాన్ని నింపడం నిరంతర ప్రక్రియగా మారింది. ఆ ‘బాధిత’ హిందువుల ‘గత కీర్తిని’ పునరుద్ధరించడమే తమ లక్ష్యం అని హిందుత్వ శక్తులు నమ్మబలుకుతున్నాయి.

హిందుత్వ శక్తులంటే దేశాన్ని హిందూదేశంగా మార్చాలని కలలు కనే హిందూ మతోన్మాద శక్తులు. వాటి భావజాల పునాది బ్రాహ్మణీయత. బ్రాహ్మణీయతంటే వర్ణాశ్రమ విభజన పునాదిగా దోపిడీ, పీడన, హింసను ‘కింది’ కులాల, వర్గాల మీద, మహిళల మీద నిరంతం (అంటే సనాతనంగా) కొనసాగించడం. అందుకే వాళ్ళు చెప్పే హిందూదేశం అందరి హిందువులది కాదు. దాని భావజాలం, ఆచరణ, నిర్మాణం అంతా కేవలం బ్రాహ్మణీయ పెత్తనం కోసమే. అందుకే కేవలం హిందుత్వ ఫాసిజం అనడం అసంపూర్తి వ్యక్తీకరణే అవుతుంది. దాని పూర్తి రూపం: బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం.

అంబేద్కర్‌ విశ్లేషణ ప్రకారం బ్రాహ్మణిజంలో  సోదరభావానికి, సమానత్వానికి, స్వేచ్ఛకు ఎలాంటి స్థానం లేదు. అది రూపంలోను, సారంలోను ఫాసిస్టు లక్షణాలను కలిగివుంటుంది. స్వభావ రీత్యా ప్రపంచానికి ఫాసిజాన్ని పరిచయం చేసింది బ్రాహ్మణిజమే. ఫాసిజం యూరప్‌ నుండి దిగుమతి కాబడినట్లు కనబడుతుంది కాని దానిని బ్రాహ్మణీయ శక్తులే బయటి ప్రపంచానికి ఎగుమతి చేశాయి. అట్లా చూస్తే బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులే ఫాసిస్టు విశ్వగురువులు! అయితే యురోపియన్‌ ఫాసిస్టులు బ్రాహ్మణిజాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వుంటే చరిత్రలో వారికి అంత తీవ్రమైన హింసను ఉపయోగించాల్సిన, అంత నెత్తురు పారించాల్సిన అవసరం వచ్చివుండేది కాదంటాడు అంబేద్కర్‌. ఎందుకంటే బ్రాహ్మణిజం మనిషి మెదడును పట్టుకొని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. అది కుదరకపోతే హింసకు దిగుతుంది. హింసను కూడా సాధారణీకరిస్తుంది. నిత్యజీవితంలో భాగం చేస్తుంది. దానితో ఆ హింసకు గురయ్యే సమాజానికి శతృవును పోల్చుకోవడం కూడా కష్టమవుతుంది. చివరికి హింస, పీడన, దోపిడంతా ‘ఖర్మ’ జాబితాలో చేరిపోతుంది. దానితో మళ్ళీ బ్రాహ్మణీయ విష వలయంలో చిక్కుకుపోతారు. 

బ్రాహ్మణీయతే హిందుత్వ ఫాసిజానికి మూలమనుకుంటే దాని చరిత్ర కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ పుట్టుకుతో మొదలు కాలేదు. అది చరిత్ర పొడువునా సనాతనంగా (నిరంతరంగా) కొనసాగుతూనే వుంది. అయితే అది ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టుకతో ఆధునిక భారతంలో మరో రాజకీయ రూపం తీసుకుంది. వందేళ్ళ కింద పుట్టిన ఈ సంస్థ సంఘ్ పరివార్‌గా రూపాంతరం చెంది సమాజంలోని అన్ని సెక్షన్లను ప్రభావితం చెయ్యడానికి వందల సంస్థలను నిర్మాణం చేసింది. వాటన్నింటి ప్రధానమైన లక్ష్యం ఒక్కటే: బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేసి, దాని ద్వార  హిందూ రాష్ట్ర నిర్మాణానికి ఒక అడ్డంకుల్లేని వాతావరణాన్ని తయారు చెయ్యడం.

ఆ పని కోసం సమాజంలో ఎన్ని అసత్యాలనైనా ప్రచారం చేస్తారు, ఎంత అజ్ఞానాన్నైనా ప్రజల మీద రుద్దుతారు. ఆ పనికి సాధికారత కల్పించుకోవడం కోసం విద్యావ్యవస్థను, న్యాయవ్యవస్థను, మీడియాను వీలయినంతగా కాషాయీకరిస్తారు. తాము చేసే పెత్తనాలకు, దౌర్జన్యాలకు ముందుగా మీడియా ద్వారా, తమ సంస్థల ద్వారా భావజాలవ్యాప్తి చేస్తారు. దానికి కొంత అనుకూల పరిస్థితి వచ్చిందనుకోగానే తమ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ చర్యలకు చట్టబద్ధత కల్పిస్తారు. చివరికి న్యాయవ్యవస్థ కూడా పూర్తి ‘‘ధర్మాసనమై’’ తన ఆమోదాన్ని ప్రకటిస్తుంది. ఇవన్నీ కూడా ‘రాజ్యాంగబద్దంగా’, ‘న్యాయబద్దంగా’ కొనసాగుతాయి. దీనితో ఫాసిస్టు చర్యలకు మరింత బలం చేకూరడమే కాదు, న్యాయ భద్రత కూడా దొరుకుతుంది. ఇక ఆ ఫాసిస్టు చట్టాలకు వ్యతిరేకంగా గొంతువిప్పే అన్ని ప్రజాస్వామిక శక్తులు ‘చట్టవ్యతిరేక’ చర్యల పరిధిలోకి నెట్టవేయబడుతాయి. ‘దర్యాప్తు’ సంస్థలు వాళ్ల కోసం వేట మొదలుపెడుతాయి. అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు, ప్రజా మేధావులు ఒక్కసారిగా ‘కుట్రదారులుగా’ మార్చబడుతారు. అక్రమ అరెస్ట్లతో ఏండ్ల కొద్దీ జైళ్ళలో మగ్గుతారు. వీటికి సంబంధించి అనేక ఉదాహరణలు, వివరాలు పాణి ఈ పుస్తకంలో వివరించారు.

ప్రశ్నించే అన్ని గొంతుకలను నొక్కివేయడానికి ఫాసిస్టు రాజ్యం భయాన్ని ఆయుధంగా వాడుతుంది. ప్రజల్లో భయం ఉన్నంత వరకే వాళ్ళ ఆటలు సాగుతాయి. కాని భయం ఎక్కువ కాలం కొనసాగదు. ఏదో ఒకరోజు పాణి మరో సందర్భంలో రాసినట్లు ‘భయపడుతున్నరా, భయపెడుతున్నారా?’ అని తప్పక అడిగే పరిస్థితి వస్తుంది. ఫాసిస్టులు సృజనాత్మకత లేని మనుషులు. కేవలం భయం, పెత్తనం, హింస ఆధారంగా చరిత్రలో ఏ రాజ్యం మనుగడసాగించలేదని తెలిసినా అదే పద్ధతిని పునరావృతం చేస్తుంటారు. అంతకు మించి పాణి అన్నట్లు వాళ్ళు భయపడుతూనే భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకు హేతువంటే, సమానత్వమంటే, స్వేచ్ఛంటే, ప్రజాస్వామ్యమంటే, పౌరహక్కులంటే భయం. ఇక సమాజాన్ని సమూలంగా మార్చే విప్లవాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా సమాజాన్ని ఒక్క అడుగు ముందుకు వేయించే ఏ రాజకీయానికైనా ఫాసిస్టులు వ్యతిరేకమే. ఈ విశాల అర్థంలోనే   ఫాసిస్టులను విప్లవ ప్రతిఘాతుక శక్తులు అనేది. మనిషిని ఆధునికంగా ఉంచినా అతని/ఆమె మానసిక, సామాజిక స్థితిని మధ్యయుగాలకు తీసుకుపోయే ప్రయత్నం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం చేస్తుంది. ఈ ప్రక్రియకు అడ్డుతగిలే ప్రతి వ్యక్తిని, శక్తిని అది రకరకాల ముద్రలు వేసి హింసించే పనిలో ఉంటుంది.

ఒకవైపు హింసను కొనసాగిస్తూనే తన భావజాలంతో హిందువులుగా భావించే వాళ్ళను నిరంతరంగా ప్రభావితం చేసే పని చేస్తుంది. హిందు మత విశ్వాసంలో  ఉన్న వాళ్ళు తెలిసో తెలియకనో చాలా తేలికగా హిందూమతం స్థానంలో హిందుత్వ అనే మాటను వాడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం హిందుత్వ శక్తులు ముందు హిందూ సమాజంలో ఒక అభద్రతను (sense of insecurity)  కల్పించి దాని ఆధారంగా మనమంతా ఒకే జాతికి చెందిన వాళ్ళమనే (sense of belonging) భావనను కల్పించి ఒక కొత్త గుర్తింపును (sense of identity) ఇస్తారు. ఈ గుర్తింపు ద్వారానే మంద మనస్తత్వాన్ని ఫాసిజం నిర్మాణం చేస్తుంది. ఫాసిజానికి స్వతంత్రంగా ఆలోచించే మనుషులంటే గిట్టదు. తనను తాను మరిచిపోయి మందలో కలిసిపోయే మనుషులంటేనే ఇష్టం. ఆ మనుషులను తయారు చెయ్యడం కోసమే అన్ని రంగాలలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ‘ఏకాత్మత’ సిద్ధాంతాన్ని ప్రవేశపెడుతుంది. ఒకే జాతి, ఒకే భాష, ఒకే చట్టం, ఒకే విద్య, ఒకే గుర్తింపు … ఇలా అన్ని రంగాలలో  అందరు ఒకే రకంగా ఆలోచించాలి, ఆచరించాలి అని హిందుత్వ శక్తులు కోరుకుంటాయి.

సంస్కృతి, భావజాల రంగంలో భారతీయత, స్వదేశీ అని గుండెలు బాదుకునే హిందుత్వ పాలకులు  ఆర్థిక రంగంలో అంతకు ముందుకంటే ఎక్కువగా, వేగంగా అన్ని వనరులను, సేవలను కార్పొరేట్‌ శక్తుల పరం చేస్తున్నారు. దానికి అనుకూలంగా అనేక కొత్త చట్టాలను (లేబర్‌, పర్యావరణ, డీమానిటైజేషన్‌, జిఎస్‌టి, ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌్‌ గార్‌ యోజన ..) తెచ్చారు. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం ప్రైవేట్‌ రంగానికి, ప్రధానంగా కార్పొరేట్లకు సహజ, మానవ వనరులను ఉచితంగా దొరికే మార్గాలను ఏర్పాటు చెయ్యడం. ఈ ప్రయత్నాలను ఎదిరించే ప్రజల మీద హింసను కొనసాగించడం. కాని అంతిమంగా పోరాడే ప్రజలే గెలుస్తారని రైతు ఉద్యమం మరోసారి నిరూపించింది. అలాగే మైనింగ్‌, మిలటరైజేషన్‌కు వ్యతిరేకంగా మధ్య భారతంలో ఆదివాసీలు చేస్తున్న పోరాటాలు భవిష్యత్తుపై కొత్త ఆశలను కలిగిస్తున్నాయి.

స్వావలంబన అనే మాటలు వల్లించే హిందుత్వ పాలకులు ‘‘మేక్‌ ఇన్‌ ఇండియ’’ అనే పాలసీతో  ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం కోసం అన్ని దారులు తెరిచిపెట్టి, Ease of Doing Business  పేరిట ఎలాంటి పాలసీ అడ్డంకులు లేకుండా చెయ్యడమే కాదు, మొత్తంగా సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సానుకూల వాతావరణం అంటే కావాల్సిన సహజ వనరులను పెట్టుబడులకు అప్పచెప్పడం, రవాణా వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం, వీటి అమలు కోసం కావాల్సిన కొత్త చట్టాలను తీసుకురావడం. అన్నింటిని మించి పెట్టుబడులకు రక్షణ వలయాలను నిర్మాణం చెయ్యడం. వనరుల పరిరక్షణ కోసం, పెట్టుబడి చేసే విధ్వంసాన్ని అడ్డుకోవడం కోసం పోరాడే అందరి మీద ‘ఊపా’ వంటి తీవ్ర చట్టాలను ప్రయోగించడం. పోరాడే ప్రజలు ‘అభివృద్ధి’ వ్యతిరేకులని ప్రచారం చెయ్యడం, ఆ ప్రచారానికి మీడియాతో పాటుగా దళారీ మేధావి వర్గాన్ని పురమాయించడం కాషాయదండు నిరంతరంగా చేస్తుంది.

వాస్తవానికి ఆర్థిక రంగంలో కాంగ్రెస్‌ కూటమి కంటే దూకుడుగా  బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలను అమలుచేస్తున్నది. ఈ రెండు ప్రభుత్వాలు కవలలే అని వాటి ఆర్థికరంగ పాలసీలు, విధానాలు నిరూపిస్తున్నాయు. విదేశీ పెట్టుబడుల కోసం దేశాన్ని ప్రపంచ మార్కెట్‌కు అనుకూలం చేస్తూనే, ‘దేశీయం’ అని చెప్పుకునే అంబానీ, అదానీ, వేదాంత వంటి క్రోనీ కాపిటలిస్టులను పెంచిపోషించడమే కాదు, వారిని ఎదిరించడమంటే దేశద్రోహానికి పాల్పడటమే అనే వరకు పోయారు. క్రోనీ కాపిటలిజం అనేది ఒక ఆర్థిక ఫాసిజం నమూన. తన సన్నిహిత పెట్టుబడిదారులకు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను, ప్రక్రియలను బుల్‌డోజ్‌ చేసి అన్ని వనరులు, సకల సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేసి దాని ద్వారా తమ ప్రయోజనాల కోసం ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం. ఈ పని కాంగ్రెస్‌ చేసింది, బిజేపీ మరింత ఉధృతంగ చేస్తుంది. ఒక్కమాటలో క్రోనీ కాపిటలిజం అనేది చట్టబద్ధ అవినీతి, దోపిడీ.

పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చే పూడ్చలేని సంక్షోభాలే ఫాసిజం పుట్టుకకు కారణమవుతాయని చరిత్రకారులు చెబుతున్నారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పరాయీకరణ చెందిన కార్మికవర్గం, మధ్యతరగతిలో వచ్చే అసహనం, అసమ్మతిని ఫాసిస్టులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. తామే ప్రత్యామ్నాయమని నమ్మబలుకుతారు. ఈ సందర్భంలో వామపక్ష ఉద్యమాలు కార్మికరంగంలో, తమ నిర్మాణాల ద్వారా మొత్తంగా సమాజంలోను చేయవల్సిన కృషి చెయ్యకపోవడం కూడా ఫాసిజానికి బాగా కలిసొస్తుంది. అయితే పెట్టుబదారీ వ్యవస్థకు, సోషలిజానికి ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మాణం చేస్తామని బయలుదేరే ఫాసిస్టులు పెట్టుబడిదారి విధానాన్నే తీవ్ర స్థాయిలో అమలుచేస్తారు.

నిజానికి ఫాసిజానికి తనకంటూ ఒక ప్రత్యేక ఆర్థిక విధానం లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని ఉధృతంగా  కొనసాగించడమే  ఫాసిజం చేసే పని. అందుకే ‘‘పెట్టిబడిదారి విధానం గురించి మాట్లాడలేని వాళ్ళే ఫాసిజం గురించి మౌనం వహిస్తారని’’ ప్రాంక్‌ఫర్డ్‌ స్కూల్‌ బుద్ధిజీవి మాక్స్‌ హార్కైమర్‌ అంటాడు. ఫాసిజం కేవలం సాంస్కృతిక, రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు. అది క్రూరమైన పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా.

ఫాసిజం మొదట ఒక సాంస్కృతిక ఉద్యమంగా మొదలయినప్పటికి అది ఒక రాజ్యవ్యవస్థ రూపంగా మారడానికి పెట్టుబడి తన పూర్తి మద్దతును ఇస్తుంది. పెట్టుబడికి కావాల్సిన కార్మికవర్గ నియంత్రణ, చౌకగా దొరికే వేతన కూలీలు, సంపద సృష్టికి కావాల్సిన వనరులను, భద్రతను ఫాసిజం సమకూర్చుతుంది. ఇలా ఒకదానికొకటి సహకరించుకొని మనుగడ సాగిస్తాయి. ఇదీ ఫాసిజానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండే సంబంధం.

ముఖ్యంగా నయా ఉదారవాదం రూపంలో అమలవుతున్న సామ్రజ్యవాద కాలంలో ద్రవ్యపెట్టుబడి అన్ని రకాల బూర్జువా రాజ్య పాలనలను తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. ద్రవ్యపెట్టుబడికి ఒకే రకమైన పాలనా సిద్ధాంతం ఏమీ ఉండదు. వీలయిన చోట పార్లమెంటరీ పద్ధతిని వాడుకొని తన దోపిడీని కొనసాగిస్తుంది. ఆ సందర్భాన్ని ‘‘ప్రగతి’’ కోసం జరిగే పరివర్తనగా చూపిస్తుంది. అయితే ఆ సందర్భంలో పుట్టుకొచ్చే కార్మిక, ప్రజా ఉద్యమాలను చూసి భయపడుతుంది. అందుకే ఫాసిస్టు శక్తులకు ఊతమిస్తుంది. ఇది యాంత్రికంగా జరిగే ఆర్థిక ప్రక్రియ కాదు. ఏక కాలంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పెట్టుబడి, ఫాసిస్టు శక్తులు కల్సి పని చేస్తాయి. పార్లమెంటరీ విధానం, రాజ్యాంగం తమ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని భావించినప్పుడే ఫాసిజం నియంతృత్వ రూపం తీసుకుంటుంది. అంతవరకు పార్లమెంటరీ తరహా ఫాసిజాన్నే అమలుచేస్తుంది.

బ్రాహ్మణీయతలో ఫాసిజం ఉన్నట్లే, ద్రవ్యపెట్టుబడిలో సహితం ఫాసిజం దాగివుంది. అది పరిస్థితులను అనుగుణంగా తన రూపాన్ని ప్రకటిస్తుంది. ‘‘జాతీయత’’ అని గుండెలు బాదుకునే హిందుత్వ శక్తులకు, ద్రవ్యపెట్టుబడికి మధ్య సాంగత్యమే తప్ప వైరుధ్యం లేదు. ఫాసిజం రాజ్యమేలే చోట దళారీ బూర్జువాలకు అవకాశం ఉండదు కదా అనే ప్రశ్న కూడా వుంది. అయితే ఫాసిజం అభివృద్ధి క్రమంలో సామ్రాజ్యవాద ఏజెంట్లుగా తమ ప్రయోజనాల కోసం పనిచేసే దళారీ పెట్టుబడిదారులు ఫాసిజానికి, ద్రవ్యపెట్టుబడికి మధ్య బ్రోకర్లుగా పనిచేస్తారు. సామ్రాజ్యవాద సందర్భంలో ఏ ఫాసిస్టు రాజ్యం ద్రవ్యపెట్టుబడి గ్లోబల్‌ నెట్‌వర్క్‌ బయట వుండే ప్రయత్నం చెయ్యదు. దానికి లోబడి, దానికి సహకరిస్తూ, సహకారం తీసుకుంటూ మనుగడ సాగిస్తుంది. మొత్తంగా ఒకదానికి మరొకటి కాపాడుకుంటాయి. పరస్పర సహకారంతో బలపడుతాయి. ఫాసిజం సాంస్కృతిక, రాజకీయ రంగంలో ఎంతటి హేయమైన హింసను కొనసాగించినా పెట్టుబడి పట్టించుకోదు. అలాగే పెట్టుబడి తన విస్తరణ కోసం చేసే అన్ని దుర్మార్గాలకు ఫాసిజం చేయూతనిస్తుంది. అందుకే బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ (అది ఎన్ని రూపాలలో ముందుకొచ్చినా) ఫాసిజాన్ని ఓడిరచలేదు, దానికి ప్రత్యామ్నాయాన్ని నిర్మించలేదని చరిత్ర స్పష్టంగా చెబుతుంది.

ఇదే విషయాన్ని పాణి తన ‘‘మమత ఫాసిజం మాటేమిటో?’’ అనే వ్యాసంలో వివరిస్తాడు. భారతదేశంలో ఫాసిజం ‘‘బహురూపి, సూక్ష్మరూపి, సర్వవ్యాప్తి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం భిన్నమైనది అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే’’ అంటాడు. బహురూపాలలో కొనసాగుతున్న ఫాసిజాన్ని గుర్తించకపోతే దాని మూలాలను కేవలం సాంస్కృతిక లేక రాజకీయ రంగానికో పరిమితం చేసి విడివిడిగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది.

అంతేకాదు బూర్జువా రాజకీయాలు ఫాసిజానికి ఎలా ప్రత్యామ్నాయాన్ని చూపలేవో ‘‘రాహుల్‌ వాదం వినిపించాల్సిందేనా?’’ వ్యాసంలో వివరిస్తాడు. అలాగే ‘‘కార్పొరేట్‌స్వామ్యంలో ప్రజలపై యుద్ధం’’ అనే వ్యాసం దేశంలో సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం దళారీ పెట్టుబడిదారులు, భారత పాలక వర్గం ఏ విధంగా ఆదివాసుల మీద అప్రకటిత యుద్ధాన్ని చేస్తున్నాయో వివరిస్తుంది. ఫాసిజం గురించి మాట్లాడుతున్న వ్యక్తులు, సమూహాలు ఈ యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాయి, ఏ వైపుకు నిలబడుతాయి అనే రాజకీయ, నైతిక ప్రశ్నను ఈ వ్యాసం వేస్తుంది.

అంతేకాదు అణగారిన ప్రజల మీద జరుగుతున్న బహుముఖ యుద్ధాల గురించి కూడా పాణి వివరిస్తాడు. ఆ యుద్ధాలు సాంస్కృతిక రంగంలో, వివిధ పాలసీల రూపంలో, కొత్త చట్టాలు, కొత్త కుట్రలు, ఆధ్యాత్మికత రూపంలో కొనసాగుతుంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అన్ని దారుల్లో ప్రజల మీద వేట మొదలుపెట్టింది. నిజానికి ఇవన్నీ నిరాశను కలిగించే అంశాలే, కాని ఒక నల్లజాతి స్నేహితురాలు అన్నట్లు ‘‘నిరాశను ప్రకటించడం విలాసానికి ఒక సంకేతం’’. ఎందుకంటే సమస్య చావు-బతుకుల స్థాయికి చేరినప్పుడు ఎవ్వరు ‘‘నిరాశ’’ను ప్రకటించి ఊరుకోలేరు. ఈ దేశంలో అనేక వర్గాలు, కులాలు, మత మైనారిటీలు తమ నిరాశ ప్రకటన స్థాయి నుండి బయటకు వచ్చే కాలం ఎంతో దూరంలో లేదు. తమ అస్తిత్వం కోసమైనా ఫాసిజంతో కలబడే కాలమొకటి తప్పక వస్తుంది. అందరి విముక్తిని కాంక్షించే విప్లవశక్తులతో కల్సి పనిచేయాల్సిన చారిత్రక సందర్భమొకటి పునరావృతమవుతుంది.

పాణి తన వ్యాసాలలో హిందుత్వ ఫాసిజానికి ఉన్న అన్ని ముఖాలను (సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, మిలిటరీ) పరిచయం చేస్తూనే, వాటికీి విఫలమైన ఉదారవాద పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలకూ ఉన్న సంబంధాన్ని కూడా వివరించాడు. అది చదివిన తర్వాత నిజానికి భారతదేశ రాజకీయాలలో కాని, సమాజంలో కాని కనీస ఉదారవాద భావనలు మొలకెత్తాయా? బ్రాహ్మణీయత, అర్ధ-భూస్వామ్యం వాటి పుట్టుకను ఒప్పుకుంటాయా? అభివృద్ధి చెందనిస్తాయా?అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు ఉదారవాద ప్రజాస్వామ్యం అనే మాటనే ప్రశ్నార్థకం చేస్తాయి.

ఈనాడు భారతీయ సమాజంలో నిగూఢంగా, రాజకీయాలలో బహిరంగంగా కొనసాగుతున్న ఫాసిజం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింతగా వాడుకుంటోంది.  రాజ్యాంగంలో ఉన్న కనీస ఉదారవాద ప్రజాస్వామిక భావనలను కూడా తుడిచేసి దాని స్థానంలో ‘ఫాసిస్టు ప్రజాస్వామ్యాన్ని’ (రూపంలో ప్రజాస్వామ్యం సారంలో ఫాసిజం) అమలుచేస్తున్నది. దీనిని అర్థం చేసుకోవడంలో గందరగోళపడే బుద్ధిజీవులు కేవలం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే సరిపోతుంది, అదే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది అనే భ్రమల్లో ఉన్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఫాసిజం అమలవుతుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు.

నిర్మాణపరంగా స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయవ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను, మీడియాను చూపించి భారతదేశం ఫాసిజంగా మారడానికి అవకాశం లేదని మరికొంతమంది మేధావులు  వాదిస్తున్నారు. ఈ వ్యవస్థల నిర్మాణాన్ని చూస్తున్నారు కాని వాటి పని విధానంలోని డొల్లతనాన్ని పట్టించుకోవడం లేదు. ఈ వ్యవస్థలన్నీ ఏ విధంగా బ్రాహ్మణీయ హిందుత్వకు దాసోహమయి పోయాయో చూడ నిరాకరిస్తున్నారు. మరికొందరు అన్ని వ్యవహారాలను కేవలం మోదీ పాపులిజానికి కుదించి చూస్తున్నారు. మోదీ పాపులిజానికి రాహుల్‌ కౌంటర్‌ పాపులిజం సమాధానమని భావించేవాళ్ళు కూడా వున్నారు. అయితే ఫాసిజం కేవలం పార్లమెంట్‌లో లేదు, ఎన్నికల ద్వారా దానిని ఓడిరచలేము. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా అవసరమే, కాని అదే అంతిమ లక్ష్యం కావడం సరయినది కాదని ఈ పుస్తకం ప్రకటిస్తోంది.

అంతకు మించి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని కేవలం భావోద్రేకాలతో ఓడిరచలేము. దాని సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, మిలటరీ అంగాలను దెబ్బతీయడం అవసరం. వాటి పునాదులను పెకిలించివేయటం అత్యవసరం. ఆ పని మానవాళి మీద ప్రేమతో, సాహసంతో, త్యాగంతో చేయాల్సి వుంది. ఈ పనుల ద్వారా మాత్రమే పాణి విశ్లేషించిన ఫాసిస్టు ద్వేషం, భయం, పెత్తనం, హింసలను తుదిముట్టించగలం. ఇది చరిత్రలో నిరూపించబడిరది. చారిత్రక బాధ్యతగా మనముందు ఉంది. చివరిగా పాణి రచనా శైలి గురించి ఒక్కమాట. తన అక్షరాలు వాస్తవ పరిస్థితులను తూకమేసినట్లు ఉంటాయి. అతని ఆలోచనలు అకడమిక్‌ మేధావుల అనువాద ఆలోచనల్లా ఉండవు. బహుశా నిరంతరం ఆచరణలో ఉండటం మూలంగానేమో విస్తృత సాహిత్య పరిచయం ఉండే ఆలోచనాపరుడిలా తనదైన శైలిలో స్పందిస్తాడు. పాణి రచనలో ఎంతో గాఢత, లోతు, విస్తృతి ఉంటాయి. వీటన్నింటిని నా ఆలోచనల్లో, రాజకీయాల్లో భాగం చేసినందుకు ఉద్యమాభివందనాలు చెబుతూ ‘ద్వేషభక్తి’ పుస్తకాన్ని స్వాగతిస్తున్నాను.

Leave a Reply