‘హస్బెండ్ స్టిచ్’ 3

చిన్నారి తల్లీ… నన్ను క్షమించు.

ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ?

నిన్నూ… నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు.

అదీ అసహజంగా…

ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు…

నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు!

ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు…

ఎంత దురదృష్టం నీకు…?

పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు

మరెవరో కాదు తల్లీ… మీ నాన్న!

అవును మీ నాన్నే…

బాధగా వుందా పాపా?

నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట

నువ్వు పాలు తాగితే…

నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని

మీ నాన్నకు తెలీదు! ఇక వీడ్కో లు బిడ్డా…

నీ లేత ఆకలి గొన్న పెదాలు కాదు….

కోరికతో నలిపేసే మీ నాన్న చేతులు నేనెలా భరించను?

అందుకే… పాలు కాదు కన్నీళ్ళే ఇక…. కళ్ళల్లోంచీ…

రొమ్ముల్లోంచీ కారేది…

నిజం పాపా…

నిన్ను కన్నప్పుడు నొప్పితో నా దేహం ఎంత అరిచిందో…

అంతకంటే ఎక్కువగా నా రొమ్ములు ఏడుస్తున్నాయి….

పాలు… రక్తం కంటే ఎక్కువగా

నా దేహం అంతా కన్నీరే పారుతున్నది.

నాకేమనిపిస్తుందో తెలుసా పాపా…

ఈ లోకంలో మీ నాన్న లాంటి వాళ్లున్నప్పుడు….

రొమ్ముల నుంచి కాకుండా

కళ్ల నించి పాలు స్రవిస్తే

ఎంత బాగుండు?

– అమృత

అమృత డైరీలో ఇలాంటి పాల… కన్నీళ్ల పేజీలెన్నో. ఆమె రాస్తూ… రాసాక కార్చే కన్నీళ్ళు మమ్మల్ని తడిపేసేవి. మేమూ విలవిలలాడే వాళ్ళం. అమృత ఏంటో మాకు బాగా తెలుసు.

అమృతకు ఆనందాన్నిచ్చేందేంటో.. బాధపెట్టేది ఏంటో మాకు బాగా తెలుసు. ఆమె హృదయం బాధతో ముడుచుకుపోయినపుడు…. సంతోషంతో హృదయ స్పందన పెరిగినపుడు మొదటగా తెలిసేది మాకే. ఆమెతో కలిసి పెరుగుతూ వచ్చాము మేం. ఆమె దేహాన్ని అతుక్కుని… ఆమె గుండె స్పందనను వింటూ గుండెలోని రక్త ప్రవాహాన్ని స్పర్శిస్తూ పెరిగాం. ఆమె కౌమార యవ్వన కాలాల్లో ఆమెతో పాటు మేమూ ఎగిసి ఎగిసి పడ్డాం. అమృత మమ్మల్ని చూస్కుని మురిసి పోయినప్పుడు, గర్వపడ్డప్పుడు, సిగ్గుపడ్డప్పుడూ మేమూ ఆమె అనుభూతుల్లో కొట్టుకుపోయాం . ఆమె దుఃఖ కాలాల్లో ఆమె గుస గుసల కన్నీటి భాష మొదటగా వినేది మేమే… ఇంతకీ మేము ఎవరం అనుకుంటున్నారు? మేం ఆమె రొమ్ములం… అదే.. వక్షోజాలం.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. మేం మాట్లాడ్డం..? మనిషో.. లేదా ఆ మనిషి నోరో.. కళ్ళో మాట్లాడతాయి కానీ రొమ్ములు మాట్లాడం ఏమిటి అని? అవును మా మీద యుగాలుగా ఎన్నో దాష్టికాలు జరుగుతున్నాయి. చెప్పుకోలేనన్ని .. చెప్పరానన్ని… మాతో పాటు మమ్మల్ని భరించిన స్త్రీలు ఎంతో నరకభాద అనుభవిస్తూ వచ్చారు.. అమృతలాగా…

అమృత ఆ కవితో.. భావాలో డైరీలో ఊరికే రాయట్లేదు. అది ఆమె అనుభవిస్తున్న వేదన.. జీవితం. ఆమెకి పెళ్ళి కాకముందు ఏ బాధాలేదు. అమ్మా, నాన్న, తమ్ముడూ.. ఒక చెల్లి.. వీళ్ళ ప్రేమలో మునిగితేలేది. గర్వంగా.. ఆనందం.. ఆత్మ విశ్వాసంతో ఉండేది. తన అందం మీద.. దేహం మీద ఆమెకెప్పుడూ ఆరోపణలు లేవు. అలాగని గర్వమూ లేదు.

కౌమార యవ్వన కాలాల్లో మాలో వచ్చిన మార్పులు. పెరిగిన చర్మ కాంతి. నెలసరి అప్పుడు మేం కూడా నొప్పితో ఎర్ర బారడం, పొత్తి కడుపునొప్పితో అమృత గిజ గిజ లాడ్డం …. తన కొచ్చిన ప్రేమ లేఖలు.. నచ్చిన మనుషులు, ఆమె తిరస్కరించిన వాళ్ళు అంతా మాకు తెలుసు.. అమృతకు ఇష్టమైన ఆహారం ఆమె ఇష్టంగా గుటకలు వేస్తుంటే… ఆ ముద్దలు మేం కూడా రుచి చూసినట్లే ఉండేది. ఆమె స్నేహితురాళ్ళతో చెప్పే గుస గుసల రహస్యాలు మేం వింటున్నామని ఆమెకి తెలిసేది కాదు. వాళ్ళ స్నేహితురాలు క్షితిజకి అసలు రొమ్ములే పెరగడం లేదని వాళ్ళమ్మ ఏమేవో వన మూలికలు, కషాయాలు, నూనెల మర్దనాలు చేయిస్తూ పాలు, వెన్నా, నెయ్యీ ఒకటే తినిపిస్తుందని రొమ్ములు పెరగకపోతే పెళ్ళే కాదనీ.. ఒకవేళ అయినా కానీ ఒదిలేస్తాడనీ.. ఒదలకపోతే సతాయిస్తూనే వుంటాడని, లేకపోతే రొమ్ములు బాగా ఉన్న పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకుంటాడనీ, రొమ్ములు ఫలానా సైజులో ఉంటేనే ఆడదానికి అందమూ, మగాడికి సుఖమూ అని ఒకటే గోలట వాళ్ళమ్మ. క్షితిజ ఈ వేధింపులు భరించలేక అమృతకు చెపుతూ ఒకటే కన్నీళ్ళు కార్చింది.. పెళ్ళంటే భయం వేస్తుంది అమృతా… నేను తినే తిండీ.. వేసే బట్టా… తీస్కు మందూ వినే మాటా అన్నీ నా రొమ్ముల చుట్టే తిగురుతుంటాయి. ఎంత వద్దన్నా అమ్మ వినదు. పాడెడ్ బ్రాస్ వేయిస్తుంది నాతో.. లేనివి ఉన్నట్లు చూపడం దేనికి… పెళ్ళైనాక తెలీదా అంటే వినదు.. అసలు ఆడదానికి ఈ రొమ్ములు ఎందుకు పెట్టాడు భగవంతుడు.. అని వెర్రి చూపులు చూస్తుంది క్షితిజ. “పెళ్ళైనాక నా భర్త వదిలేస్తే ఎట్లా అమృతా” అంటుంది భయంతో. ‘నీకు లాగా.. నాకూ అందమైన రొమ్ములు ఎందుకు లేవు’ అంటుంది. “నాకు కాళ్ళూ చేతులున్నాయి కష్టపడి పనిచేస్తా, షటిల్ ఆడతా… మంచి హైట్ ఉంటా, అందమైన ముఖం అందులో పెద్ద పెద్ద కళ్ళు.. పొడవాటి జుట్టు ఉంది.. అన్నిటికీ మించి బాగా చదువుతాను. స్టేట్ టాపర్‌ని ఇంతకంటే ఏం కావాలి?” అంటే.. “ఉహూ.. సరిపోవు.. పుష్టిగా ఉండే రొమ్ములు కావాలి. నువ్వు జీవితాంతం నీ చదువుతో ఉండవు.. నీ భర్తతో ఉంటావు. నీ నీ కాళ్ళూ, చేతులూ.. నీ పెద్ద పెద్ద కళ్ళూ ఇవి కాదు నీ భర్తకి ఆనందాన్ని ఇచ్చేవి, పుష్టిగా ఉండే ఒళ్ళు.. రొమ్ములు మాత్రమే తృప్తినిస్తాయి. గుర్తుపెట్టుకో. మాట్లాడకుండా నేపెట్టిన తిండీ.. మందులూ వేస్కో.. మొగుడు వదిలి పెట్టాక మళ్ళీ మా నెత్తిన శనిలా దాపురిస్తే ఊర్కోను. నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్లున్నారు.” అంటుంటుంది కఠినంగా, ఎప్పుడూ ఇదే అమృతా.. చావాలనిపిస్తోంది… అని క్షితిజ చెప్పే విషయాలకి అమృత కదిలిపోయేది. భయపడిపోయేది. బాత్రూంలో రహస్యంగా మమ్మల్ని పరీక్షగా చూస్కుని టేపుతో కొలుచుకుని 34, 35 అనుకుంటూ మేం అంటే.. తన రొమ్ములం బాగున్నామని నిర్ధారించుకుని సాంత్వన పడేది. అనుకున్నట్లే క్షితిజ పెళ్ళైపోయింది. ఆర్నెల్లల్లో అమృతతో చెప్పుకొని ఎన్నిసార్లు ఏడ్చిందో. “నీకు రొమ్ములే లేవు నన్ను మోసం చేశారు” అంటూ భర్త… అత్తా వేధిస్తుంటే… ఆర్నెల్లకి భర్త విడాకులు కావాలని ఒదిలేస్తే…. పుట్టింటికొచ్చిన క్షితిజ ఉరేస్కుని చనిపోయింది. అమృత భయపడిపోయింది. ఆమె చాలా ఏడ్చింది. ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుందో క్షితిజ ఆత్మహత్య కబురు విని.. మాకే తెలుసు. ఒక వారం దాకా అమృత నిద్రోపోలేదు. ఖాళీ ఛాతీ మీద భర్త కత్తులతో పొడిస్తే… పారిపోయి ఉరిపోస్కున్న క్షితిజే ప్రతీ రాత్రి కల్లోకొచ్చింది. ఆమెతో పాటు మేమూ… అదే కలగన్నాం . “అమ్మా నాకు పెళ్ళి వద్దు చదువుకుంటాను” అంది అమృత డిగ్రీ పూర్తయిన వెంటనే. “చాల్లే.. పెళ్ళే ముఖ్యం.. చదువుదేవుందీ పెళ్ళైయ్యాక మీ ఆయనొప్పుకుంటే చదువుకుందువులే” అని అమృత నాన్న కొట్టిపడేశాడు. అమృత పెళ్ళి ప్రతీక్ తో అయిపోయింది. పీజీ చేస్తానన్న అమృత కోరికను ప్రతీక్ కూడా కొట్టిపడేసాడు. “ఐ వాంట్ ఎ హౌస్ వైఫ్” మీ నాన్నకి ముందే చెప్పా.. ఇక అడగకు ఇల్లు బాగా చూస్కో.. నీ ఫిసిక్ బాగా ‘మెయిన్ టెయిన్ చెయ్యి చాలు’ అన్నాడు. అమృత ఎదవైపు లోతుగా.. వెకిలిగా చూస్తూ… అంటే మా వైపు. సహజంగానే అమృత పిరికిది. ఏం మాట్లాడలేకపోయింది. తండ్రికి తల ఒంచినట్లే… భర్తకీ ఎదురు చెప్పలేకపోయింది. ప్రతీక్ ఎప్పుడూ మా గురించి మాట్లాడేవాడు. మాటాడకుండా అమృత ఎదురు తిరిగితే బాగుండు అనుకునే వాళ్ళం ఇద్దరం. “నువ్వు బాగా పుష్టిగా తినాలి పాలు వెన్న, నెయ్యి లాంటివి నీ బ్రెస్ట్ సైజ్ నాకు పూర్తి సాటిస్పక్షన్ ఇవ్వట్లేదు… ఐ వాంటెడ్ 38 సైజ్ బ్రెస్ట్ నీది 36 సైజ్ అయినా ఓకే.. ఈ సైజ్ మెయిన్‌టెయిన్ చెయ్యి”… అన్నాడు. అమృత భయపడి పోయింది. తనకీ.. మాకూ రొమ్ములు చిన్నగా ఉన్నాయని వదిలేసిన క్షితజ భర్త… ఆ తరువాత ఆత్మహత్య చేస్కున్న క్షితిజ ఎండిపోయిన దేహం గుర్తుకువచ్చాయి. ప్రతీక్ చేతులు మా మీద వీరంగం చేస్తుంటే అమృతకీ.. మాకూ చాలా బాధ.. చిరాకేసేవి. అమృత దేహం మీద ఆమెకేమీ అధికారం…. అనుభూతీ వుండేవి కావు. ఎంత నొప్పెట్టేలా మమ్మల్ని పిండేసేవాడంటే నొప్పితో విలవిల్లాడుతూ ఎర్రబడి పోయే వాళ్ళం, గోర్ల, పళ్ళ గాట్లు.. తప్పేవి కావు.. అమృత కళ్ళ నుంచి కన్నీరొచ్చేంత బాధించేవాడు. ఎంత సేపూ మమ్మల్ని ఫిట్ గా పెట్టుకోవాలని సైజ్ తగ్గద్దని హెచ్చరిస్తూ ఉంటాడు. అమృత అంటే.. అతనికి.. రొమ్ములే.. అంటే మేమే.. అతని ఆస్తి.. మేం! మమ్మల్ని చెడిపోకుండా ఫ్రిడ్జిలో పెట్టుకొని కాపాడే ఆపిల్ పండ్లలా చూసేవాడు. అందుకు అమృత బాధపడని క్షణం లేదు. అలాగని ఆమెకి ప్రతీక్ ని ఎదిరించే ధైర్యమూ లేదు. ఒక్కసారి మాత్రం ప్రతీక్ నువ్వట్లా అంటుంటే నాకసహ్యంగా అనిపిస్తుంది ఎంతసేపూ అదేనా… నేనింకేం కానా.. అన్నది బాధగా. “అలా అంటే ఎట్లా” నీ దేహంపై నీకు ప్రేమా, గౌరవం ఉండాలి.. జస్ట్ నాకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ అంటే.. నీకు తెల్సుకదా జిమ్ కెళ్ళి నేనూ పిట్నెస్ మీద శ్రద్ధ పెడతానని? అంటూ మాటలతో కవర్ చేస్తాడు. అమృత తల్లి కాబోతుంది. ప్రతి నెలా వచ్చి బాధపెట్టే నెలసరి ఈసారి రాలేదు. అమృత ఎంతో ఆనందపడిరది. కానీ ప్రతీక్ సంతోషపడలేదు.. ఎంతసేపూ “బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయద్దు.. బాటిల్ పాలు పట్టాలి నీ బ్రెస్ట్ ష్రింక్ అయిపోయి అందం పోతుంది” అని నస పెట్టడం, కొన్నిసార్లు కఠినంగా చెప్పడం, మొదలెట్టాడు. అమృతకు ఇదొక పీడ అయిపోయింది. మెల్లగా మాలోపల మార్పులు మొదలయ్యాయి. మేం పెద్దగా కాసాగాం. మెల్లగా ఐదో నెలలో మా నుంచి పాల ధార కనపడసాగింది. అమృతలో ఆనందం ఇంతలో బాధ.. భయం. “డాక్టర్ని అడిగి పాలుడిగిపోయే ఇంజక్షన్స్ ఇప్పించుకో లేకపోతే నేనే చెప్తాను.. వచ్చి” అనేవాడు. ‘నేను అడగలేను’ అనేది అమృత..

డాక్టర్‌కి ఫోన్ చేసి చెప్పాట్ట. “బేబీకి తల్లిపాలే మంచివి నేనాపని చేయలేను. పైగా పాప పుట్టాక ఇవ్వాలి పాలు మాన్పించే మందులు. అదీ పాపకో.. తల్లికో పాలివ్వడం ప్రమాదం అని అనిపిస్తేనే. మీరిట్లా ఫోర్స్ చేయద్దు అయినా ఆ మందులు తల్లి ఆరోగ్యానికి మంచివి కావు” అని చెప్పిందట డాక్టర్. ప్రతీక్ కోపంతో రగిలి పోయాడు. “అత్తయ్య మీ అబ్బాయి ఇలా అంటున్నాడు మీరైనా చెప్పండి” అంటూ ప్రతీక్ తల్లి సరస్వతిని అడిగింది అమృత. తన తల్లితో కూడా ఆమెకి చెప్పించింది. “వాడి మొఖం.. వాడికేం తెలుసనీ నేను చెప్తాగా” అంది. కానీ చెప్పలేదు. నెలలు నిండే కొద్దీ మెల్లగా పాలతో భారం అవుతున్న మమ్మల్ని చూస్తూ భయపడసాగింది. అమృత. ప్రతీక్ నిత్యం మేమెలా ఉన్నామో చెక్ చేస్తూ ఉండేవాడు. లాకర్ లో బంగారం సరిగా ఉందో.. లేదో సరి చూస్కుంటున్నట్లు.

చాలా చిరాకైనా విషయం ఇది అమృతకీ.. మాకూను. ఇక అమృతకు బంగారం లాంటి బాబు పుట్టాడు. పుట్టే సమయానికి ప్రతీక్ బెంగుళూరులో అతిముఖ్యమైన ట్రైనింగ్‌లో ఉన్నాడు. కానీ బాబు పుట్టాడన్న ఆనందంలో కాకుండా ఎక్కడ అమృత పాలు తాగించేసి మా బిగువుని కోల్పోయేలా చేస్తుందో అన్న భయంతోనే ఉండేది. బాబుకి ఒక్కపాల చుక్కకూడా తాపద్దు.. అని మెస్సేజీల మీద మెస్సేజీలు.. ఫోన్లమీద ఫోన్లతో విసిగించాడు. అమృత ఆనందం అంతా ఆవిరి అయిపోయింది. ప్రతీక్ లేని ఆ మూడు రోజులూ డాక్టరు చెప్పినట్లు బిడ్డకు చాలా ముఖ్యమైన కొలస్టంను తాగించేసింది. మేమూ ఆనందంగా బాబు నోట్లోకి ప్రవహించాం. ఇక మా నుంచి పాల ధార మొదలైంది. ప్రతీక్ మాటలు డాక్టర్‌లో కోపాన్ని తెప్పించాయి. అమృత ఒక్క నెలన్నా బాబుకి పాలు తాగిస్తానని బ్రతిమిలాడింది. పాలతో నిండిన మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పిండించేవాడు. పంపింగ్ మెషిన్ పెట్టి మాలోపలి పాలన్నీ పీల్చేసి ఆ పాలు కూడా పారబోసేవాడు. బాబుకి బాటిల్ పాలే దిక్కయ్యాయి. అమృత కన్నీళ్ళ సాక్ష్యంగా మా మీద ఎనలేని దౌష్ట్యం చేసేవాడు. దౌర్జన్యంగా ప్రతీకో… నిస్సహాయంగా అమృతో పాలు పిండుతున్నప్పుడు నొప్పితో విలవిల్లాడే వాళ్ళం. అమృత ప్రతీక్‌కి ఎదురు తిరిగి ఈ దుర్మార్గం మాన్పిస్తే బాగుండునని ప్రార్థన చేసేవాళ్ళం.

కానీ పాలు ఇవ్వక. నిండిపోయి మాలోపల గడ్డలు కట్టి చీము నిండి నిలువెల్లా జ్వరం కమ్మింది అమృతకి. మేము నొప్పి.. వేడితో అల్లాడిపోయాం. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాడు. అదీ తనకు తెలిసిన డాక్టర్ దగ్గర. ఏవో ఇంజెక్షన్స్ ఇప్పించాడు. ఇన్ఫెక్షన్ తగ్గడానికని చెప్పాడు. కానీ.. మాకెందుకో అనుమానం వచ్చింది. ఆ రాత్రి మేం గుస గుసలాడుకున్నాం కూడా… మా కోసం అమృతను బలిచెయ్యటం లేదుకదా అని. అమృతకి జ్వరం తగ్గిపోయింది. మా లోపల పూర్తిగా పాలు ఆగిపోయాయి. భర్త దౌర్జన్యం తెల్సుకుని బాబుని పట్టుకొని అమృత కన్నీరు మున్నీరు అయిపోయింది. ఆమె కన్నీరులో మేం కూడా తడిసిపోయాం . ఆమె డైరీ అంతా బాబుకి తన పాలు తాగించలేని నిస్సహాయమైన కన్నీటి రాతలతో నిండిపోయింది.

పాపా.. నీకూ నాకూ మధ్య తొలి పరిచయం ఈ పాలధార కాదూ.. నా గర్భం నీ మజిలీ. నా దేహంలోంచే బయటకు వచ్చావు ఆకలికి పాల ధారలను ముందే తయారు చేసుకున్నావు. ఈ పాలు నీ హక్కు కదూ… నీకూ నాకూ మధ్య ఈ పంపింగ్ మెషిన్ ఎందుకు మాట్లాడుతున్నది..? నీ జీవ ధారని అది ఎందుకు పీలుస్తున్నది నీ నోటికి పాలతో నిండిన రొమ్ములు కాకుండా ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు గుచ్చబడుతున్నది? ఈ లోకంలో ఇప్పుడు నాకు.. నీకు నా పాలు తాపడం కన్నా ముఖ్యం ఏది చెప్పు? మబ్బుల నించి నీటి ధార కురుస్తున్నట్లు, భూమినించి నీటి ఊట ఊరుతున్నట్లు నా శరీరం ఇప్పుడు పాల ధారని స్రవిస్తున్నది. కానీ… పోటెత్తి పోతున్న పాలు ఇప్పుడు మురుగు నీళ్ళలో పిండబడుతున్నాయి దేహం మొత్తం కన్నీళ్ళతో పిడచగట్టుకుపోతున్నది నా రొమ్ములు గుండెలు బాదుకుంటూ… పాల కన్నీరు కారుస్తున్నాయి. నీకు పాలు మాన్పించిన మీ నాన్న మాత్రం ఈ రాత్రికి శృంగారపు కల కంటున్నాడు.

‘అమృత జీవితంలో అలాంటి రోజులు, డైరీలో ఇలాంటి నిస్సహాయపు రాతలు ఎన్నో. బాబు అలాగే పెరిగాడు. ఆ సంవత్సరం గడిచింది. ప్రతీ .. అమృతకీ.. మాకూ.. ఆఖరికి వచ్చిన ఒకటే అనుమానం… మేం చిన్నగా అవుతున్నాం.. మాలో ప్రతీక్ భాషలో ఫిట్నెస్ తగ్గిపోయింది. ప్రతీక్… పిచ్చెక్కినట్లే చేసాడు. తన డాక్టర్‌కి ఫోన్ చేసి “దే ఆర్ ష్రింకింగ్… వై?” (అవి ముడుచుకు పోయాయెందుకు?) అంటూ మా గురించి ఆందోళనతో అడిగాడు. “పాలు మాన్పించడానికి నువ్వు చేయించిన ఇంజెక్షన్స్… మందుల వలన” అని డాక్టర్ చావు కబురు మెల్లగా చెప్పాడు. ఇక అక్కడ్నించి మొదలైంది. అమృతకు మరో నరకం.. అసంతృప్తుల నిట్టూర్పులతో.. కోపపు అరుపులతో ఆ పలుచటి భయం గొలిపే చీకటిలో అమృత బెడ్రూం చిరచిర లాడేది. ఎంత సేపు నెట్ లో పెద్ద రొమ్ములున్న స్త్రీల నగ్న వీడియోలు చూస్తూ గడిపేవాడు. “నువ్వు చేసిన పాపానికి

నేను శిక్ష అనుభవిస్తున్నా ప్రతీక్ నా మీదెందుకు అరుస్తున్నావు?” అని అమృత విలవిల్లాడేది. ఒంటరిగా గదిలో కూర్చొని.. అద్దంలో మాటి మాటికి జాకెట్ విప్పి మమ్మల్ని పరీక్షగా చేతులతో తడిమి చూస్కుంటూ.. నిజంగానే ముడుచుకు పోయిన మమ్మల్ని చూస్తూ ఖిన్నురాలయ్యేది. మేమూ దుఃఖించేవాళ్ళం. మా నిండుదనం పోయిన తర్వాత అమృతకెంత కష్టం వచ్చిందో కదా అని. కానీ.. నిజంగా మేమూ అలా అయిపోయాం .. ముడుచుకుపోయాం … అమృతతోపాటు మేము చిన్నబోయాం… ప్రతీక్ చేతులు మామీద అసహనంగా.. కోపంగా కదలడం మాకూ ఇబ్బందిగా.. అవమానంగా ఉంది.. అది పెరుగుతూ పోయింది. ఇప్పటికైనా అమృత ఎదురెందుకు తిరగదు.. ప్రశ్నించదు.. మా కోపం అమృత మీదకి మళ్ళింది. ప్రతీక్ రాత్రి పూట ఇంటికి రావడం బాగా తగ్గించాడు. ఎపుడన్నా అమృతను ముట్టుకున్నా ఎదమీద చేతులు వేసేవాడు కాదు. వేసినా… ‘ఛ.. టూ మచ్ గా స్ప్రింక్ అయినాయి. మూడ్ ఎలా వస్తుంది!” అని ఆమెను తోసేసి అటు తిరిగి పడుకునేవాడు. అతడు వేరే స్త్రీల దగ్గరికి వెళ్తున్నాడని అర్థం అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలోనే మరో మూడేళ్లు గడిచిపోయాయి. అమృత రెండు మూడు సార్లు ప్రతీక్ అంటించిన సుఖ వ్యాధులకు ట్రీట్మెంట్ తీస్కుంది. కాలం గడిచిపోతున్నది. అమృత మూగ భాష మేము కూడా వింటూ ఉండిపోయాము. ఇటు అత్తింటివాళ్ళు అటు పుట్టింటి వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అమృతనే సర్దుకుపొమ్మన్నారు. అమృత మళ్లీ అమ్మ అయ్యింది. ప్రతీక్ పెద్ద ఆసక్తి చూపించలేదు. పాప పుట్టింది. విచిత్రంగా ఈసారి మాలో పాలు నిండలేదు. అతి తక్కువగా మాత్రమే వచ్చాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. మేం అలాగే ఉన్నాం ముడుచుకుపోయి ఈసారి సాగిపోయి.

తన ఫ్రెండ్ బ్రెస్ట్ లిఫ్ట్ ట్రీట్మెంట్ చేయించుకోమంటే చేయించుకుంది అమృత.. భర్తకోసం కాదు. తనకోసం.. పిల్లలకోసం.. భర్త అంటించే సుఖ వ్యాదులు భరించలేక. ఆ ట్రీట్మెంట్ తర్వాత కొన్ని రోజులే మేం పొందికగా బిగువుగా ఉన్నాం. తర్వాత మామూలే. మళ్ళీ ముడుచుకుపోయాం .. సాగిపోయాం . మళ్ళా అవే ఛీత్కారాలు.. కోపాలు. కాలం మరో మూడేళ్ళు ముందుకు గడిచిపోయింది. ఒక రోజు ఎడమ రొమ్ము నాతో గుసగుసగా.. నాలో ఏవో మార్పులు కన్పిస్తున్నాయి. “నాలో ఏవో గడ్డల మాదిరి అన్పిస్తున్నాయి. నొప్పి భరించలేకపోతున్నా అమృత కూడా ఏడుస్తున్నది నొప్పికి… నా నించి … ఏవో స్రావాల వంటివి వస్తున్నాయి” అంది ఏడుస్తూ… అమృత మూల్గుతూ ఏడవడం., నొప్పి తగ్గే మందులు మింగడం, స్నానం చేసేప్పుడు చేత్తో ఏవో గడ్డలకోసమన్నట్లు మమ్మల్ని తడమడం నేనూ గమనించాను. నేనూ పరీక్షగా చూసాను. ఆరెంజ్ పండు మీది తొక్కలా తయారయ్యింది ఎడమ రొమ్ము చర్మం.. చనుమొన లోపలికి ముడుచుకుపోయింది. డాక్టర్ ముక్క పరీక్ష చేసి కేన్సర్ అంది.

రొమ్ము తీసెయ్యకపోతే ప్రమాదం.. రెండో రొమ్ముకి.. అంటే నాకు, అలాగే అమృత శరీరంలో ఏ భాగానికైనా కాన్సర్ పాకి ఆమె ప్రాణాలే పోవచ్చంది. నా గుండె గుభిల్లుమంది. అమృత బాగా ఏడ్చింది. ప్రతీక్ నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. కీమో థెరఫీ వలన అమృత జుట్టు ఊడిపోయింది. వాంతులతో తోటకూర కాడలా వేలాడిపోయింది. ఎడమ రొమ్ము తీసేసారు. నా కవల సోదరిని నా సాక్షిగా కోసేసారు.. నేను చూస్తుండగానే.. నేను కుళ్ళి కుళ్లి ఏడ్చుకున్నా… ఎవరితో చెప్పుకుంటానిక కబుర్లు.. బాధలు? తల్లిలాంటి అమృత వెచ్చని కొంగుమాటున వెచ్చగా ఒదిగిపోయి ఎన్ని కబుర్లు మాట్లాడుకునేవాళ్ళమనీ? అమృతకు సపోర్టుగా ప్రతీక్ ని బాగా తిట్టుకునేవాళ్లం. ఇద్దరం కలిసి అమృత హృదయ స్పందన వింటూ నిద్రపోయేవాళ్ళం. అమృత గర్భంతో ఉన్నప్పుడు బాబు.. పాప గుండె చపుళ్ళు కూడా వినేవాళ్ళం. వాళ్ళతో కూడా కబుర్లు చెప్పేవాళ్ళం. అలాంటిది నేను ఒంటరి అయిపోయాను. అమృత కూడా ఒంటరిగా మిగిలిన నన్ను… మోస్తూ ఎడమ రొమ్ము తీసేసిన ఖాళీ అయినపోయిన… ఆపరేషన్ గాటును చూస్తూ… భరించలేని వేదనతో కన్నీళ్ళు కార్చేది. పిల్లలిద్దర్నీ గుండెకి అదుముకుని ఏడ్చేది. బహుశా నన్ను కూడా… తన ఖాళీ అయిన రొమ్మును పాడెడ్ బ్రాతో కప్పేసేది. జుట్టు బాగా ఊడిపోయి… బక్కగా బలహీనంగా ఒంటి రొమ్మై నిలిచిన నాతో… దీనంగా తిరిగే అమృతను ప్రతీక్ అసహ్యించుకునేవాడు. పూర్తిగా వేరే గదిలో పడుకునేవాడు. ఆమె ఒంటి మీద చెయ్యివేసేవాడు కాదు. సిలికాన్ ఇంప్లాంట్ చేయించుకొమ్మని తరచూ వేధించేవాడు. సిలికాన్ ఇంప్లాటేషన్లో కూడా ఒక్కోసారి బ్రెస్ట్ కాన్సర్ వచ్చి ముదిరేదాకా తెలియదట.. తన ఫ్రెండ్ సంజన వదిన భర్తకోసం చేయించుకున్నాక, బ్రెస్ట్ కేన్సర్ నాలుగో స్టేజిలో బయటపడి చనిపోయిందట అని తెల్సుకున్న అమృత ససేమిరా చేయించుకోను అని తెగేసి చెప్పేసింది.

ఆపరేషన్ అయ్యాక నేనిక ఒంటరిని కదా.. ఎడమ రొమ్ము సచ్చిపోయింది లేదా చంపేసారు కోసేసి… ఇక మేము అనకుండా నేను అంటాను. అనడం… మొదలెట్టా కూడా… ఒకరోజు అమృత రాస్తున్న డైరీ చదివాను. “నాకు అనవసరంగా భయంకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు, మందులు మోసంతో ఇప్పించి నా దేహాన్ని నాకు కాకుండా నన్ను ఒక వికలాంగురాలిని చేసిన ఈ దుర్మార్గుడ్ని ఏం చేయాలి…? అని రాస్కుంది. ఇన్నేళ్ళకి అమృతలో మేం ఎదురు చూసిన మార్పు వచ్చింది. ఎన్నిసార్లు మేం గుసగుసలాడుకునే వాళ్ళం. అమృత, ప్రతీక్ కి ఎదురు తిరిగి మా మీద చేసే అన్ని దౌష్ట్యాలను ఆపితే ఎంత బాగుండు.. ఇంత పిరికిదేంటి అని కోపగించుకునే వాళ్ళం. దుఃఖంతో ఆమె హృదయం అరిచే బీద అరుపులు ఒక్కోసారి మాకు కోపం కూడా తెప్పించేవి. ఎంత పిరికి దాని హృదయం మీద పెరిగాం మేం ఇద్దరం? అని “అమృతా ఇకవాడికి బుద్ధి చెప్పు” అని అరిచేవాళ్ళం కానీ ఇంతలో మరో ఘోరం జరిగిపోయింది. నాలోపల కూడా కేన్సర్ గడ్డలు మొదలయ్యాయి. నన్నూ ఆపరేషన్ చేసి కోసేస్తారు. ఇక అమృత పూర్తి ఒంటరి అవుతుంది. నేను నొప్పితో విలవిల్లాడుతూనే అమృత గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను పోయినా… అమృత బతికితే చాలు అనుకున్నా… ఆ రోజు అమృత చేతికి విడాకుల నోటీస్ ఇచ్చాడు ప్రతీక్. దుఃఖంతో అనారోగ్యంతో ఉన్న అమృతను ఓదార్చాల్సింది పోయి ఒంటరిని చేద్దామని చూస్తున్నాడు. “నీ వైద్య ఖర్చులు భరించడం నావల్ల కాదు. నీతో నాకు సంసార సుఖమూ లేదు. అసలీ పని ఎప్పుడో చేయాల్సింది రొమ్ములే లేని నీతో కాపురం చెయ్యలేను, బ్రెస్ట్ రీ కన్స్ట్రక్షన్ చేసుకో లేదా విడాకులు ఇచ్చెయ్యి” అన్నాడు. కాలు చెయ్యి లేని.. లేదా పక్షపాతంతో పడిపోయినా.. గుడ్డి వాళ్ళైన భర్తలను… గుండెపోటొచ్చి కోలుకున్న భర్తలను ఎంత ఓపికతో చూస్తారీ భార్యలు? భర్తలు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పూజలు, వ్రతాలు నోములు మొక్కులు, యాత్రలు ఉపవాసాలు చేస్తారే ఈ అమాయకమైన భార్యలు… భర్తలతో సెక్స్ జీవితం దూరం అయ్యిందని బాధపడకుండా? భర్తలు ఎందుకలా ఉండరు? మమ్మల్నే కాదు… గర్భ సంచిని తీసేసిన భార్యలతో సెక్సులో ఆనందం కలగటం లేదని విడాకులు ఇచ్చిన మగాళ్ళు లేరా…? అమృత అత్త సరస్వతికి గర్భసంచి తీసేస్తే…. “నీ దేహం ఇక

డొల్ల ఖాళీ” అంటూ అక్రమ సంబంధాల్లోకి వెళ్లిన ఆమె భర్త లాంటి వాళ్ళు ఎంత మందిని చూడలేదు మేము… అంతెందుకు.. పెళ్ళైన ఐదేళ్ళకు గుండె జబ్బున పడిన ప్రతీక్ అక్కయ్య భర్త పూర్తిగా సంసార జీవితానికి పనికిరాని వాడై పోయినా.. ఆమె మంచి వయసులో ఉన్నా ఏనాడూ తన సంసార జీవితంలోని అసంతృప్తి బయట పడనివ్వకుండా ఉన్న ఒక్క బిడ్డను చూస్కుంటూ భర్తను ఎంతో ప్రేమ.. శ్రద్ధలతో చూస్కుంటుందే ప్రతీక్ అక్కయ్య? ఈ మగవాళ్ళెందుకట్లా ఉండరు? అమృత గుండెలు పగిలేలా ఏడ్చింది ‘

పిల్లల కోసం ఆలోచించమని వేడుకుంది. అత్తతో అమ్మతో చెప్పించింది. ఊహు వాడు కనికరిస్తేగా… అద్దంలో ఆ రాత్రి తన ఎదని గాజు కళ్ళతో… చాలా సేపు చూస్కుంది అమృత. మరీ ముఖ్యంగా రెండు రోజుల్లో నిలువునా కోసెయ్యబోయే నన్ను చూస్కుంది. నన్ను తడిమి తడిమి ఏడ్చుకుంది. అమృత కన్నీళ్ళతో నేనూ తడిసి ముద్దెపోయాను. నేనూ ఏడ్చాను. నన్నన్నా అమృత కోసం మిగల్చలేదే అని…. స్త్రీ దేహంలో గర్భసంచీ.. దానికింద యోనీ.. ఎన్నో రక్త శిక గాయాలతో అల్లాడ్డం చూస్తూనే ఉన్నా… వింటూనే ఉన్నా.. మా రొమ్ముల చుట్టూ కూడా ఎన్ని విషాద కథలున్నాయి..? “నేను బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ చేయించుకొవాలట ప్రతీక్ కోసం. అత్తయ్య సలహా.. ప్రతీక్ ఆర్డర్.. నేనేం బొమ్మనా… నా దేహం అతనికేమైనా అలంకార వస్తువా.. అతని సొమ్మా నేను? నేను చేయించుకోను ఏం చేస్తాడో చూస్తాను విడాకులు ఇవ్వను. నాకు కాన్సర్ రావడానికి తానే కారణమని నేను కోర్టులో కేసు వేస్తాను. నాకిక ఓపిక లేదు “నా పిల్లలు నాకు ముఖ్యం” అని రాస్కుంది ఆ రాత్రి అమృత డైరీలో, ఇది.. ఇదే కదా… ఈ తెగువే కదా… మేం కోరుకున్నది అమృత నుంచి? నేను ఆనందంతో ఏడ్చాను…

బాగా ఏడ్చాను.. నా అమృత కోసం. నేను మరణించే రోజు రేపే. రేపు ఆపరేషన్ చేసి, నన్ను కోసేస్తారు. నా బదులు ఒక గాటు మిగులుతుంది నా గుర్తుగా. నా లోపల కేన్సర్ గడ్డ రెండో దశలో ఉంది. తీసేస్తే… అమృత బతుకుతుంది. ఇక నిత్యం భయపెట్టే మా నుంచి.. అసలైన రోగంతో కుళ్ళిపోయిన ప్రతీక్ నుంచి అమృతకు శాశ్వత విముక్తి! ఈ రాత్రి చివరిసారి అమృత వెచ్చని చీర కొంగు మాటున అమృతను గాఢంగా కౌగిలించుకుని, ఆమె గుండె సవ్వడి వింటూ నిద్రపోతాను.. రేపు మరణించడానికి…

2 thoughts on “ బ్రెస్ట్ టాక్…

Leave a Reply