ఎవరు రాసారీ పద్యాన్ని,
ఉద్యమంలాంటి ఉదయాన్ని?!
వెలుతురు లాంటి నినాదాన్ని?!
చీకటికి తెర దించి కాంతికి పట్టం కట్టిన
పదాల కెరటాల కవన సముద్రాన్ని!?
ఎవరు రాసారీ పద్యాన్ని
దువాల ఒడిలోంచి నిదుర లేచిన
జాబిల్లి తోబుట్టువుని!?
తిమిరం కుబుసాన్ని విడిచి
తళతళాడుతూ తెల్లారిన కాలాన్ని!?
ఎవరు రాస్తారు వెన్నెల సిరా నిండిన
గాలి కలంతో
కొండలపై నుంచి జారే నిశ్శబ్దపు జలపాతాలని?!
అరణ్యంలో తాండాలో
తంగెడు పూల పురుడు వాసనని
పీల్చుకుని మత్తగిల్లే మధువుకు ప్రియమైన భ్రమరాలనీ!?
ఎవరు రాస్తారు పద్యాలనీ
ప్రాణ త్యాగానికి సిధ్ధపడి
తుపాకీ భుజాన వేలాడదీసుకొని
అరణ్యం మీంచి లోకం మీదికి
విప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపుని!?
అరణ్యం మీంచి లోకం మీదికి విప్లవం ప్రసరిస్తున్న భానుడి చూపు