నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే.

మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా చలనరహితమైన సమాజంలో చలనం మొదలై మానవ సంబంధాలు మారి, కులం మాసిపోతుందని మార్క్స్ భావించినట్లే, ఇక్కడ గురజాడ కూడా ‘’మతములన్నియు మాసిపోవును/జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’’ అని కలగన్నాడు. ఆ ఇద్దరి కలలు నిజం కాలేదని ఆ తర్వాత చరిత్ర మనకు రుజువుచేసింది. పెట్టుబడి ప్రవేశ,విస్తరణల ఫలితంగా పరిణమించే ప్రగతిశీల ఆధునికత పై వాళ్లకు అంత భరోసా ఉండింది. కాని పెట్టుబడి వృద్ధి జరిగి,ముదిరిపోయి సామ్రాజ్యవాద అవతారం ఎత్తుతుందని,అది మన దేశంలో వికృతమైన ఆధునికతను సృష్టిస్తుందని వారు  ఊహించలేకపోయారు.సామ్రాజ్యవాదం ఇక్కడి భూస్వామ్యంతో మిలాకతై వికృతాధునికతను సృష్టించడం వల్లే కులమతాలు మాసిపోలేదు.జ్ఞానదీపం వెలుగులు ప్రజల జీవితాన్ని ఆవరించి వున్నచీకట్లను పారద్రోలలేదు. దోపిడీ పాలకులు తమ ఆధిపత్యం ద్వారా జ్ఞానాన్ని శ్రమనుండి విడగొట్టి, దాన్నొక ప్రజలకు అందని ద్రాక్షపండును చేశారు. శారీరక శ్రమకు, మానసిక శ్రమ(మేధస్సు)కు మధ్య దూరాన్ని పెంచుతూ,శారీరక శ్రమను హీనంగా చూస్తూ, మేధస్సును మేనాలో ఊరేగిస్తున్నారు.ఇదే పాలక వర్గాల వైఖరి జాతీయ విద్యావిధానం-2020 లో కూడా ప్రతిఫలించింది.శ్రామిక వర్గాల ప్రజలను నిజమైన జ్ఞానక్రమాన్నుంచి దూరం చేస్తూ, కార్పొరేట్ పెట్టుబడిదారీ అభివృద్ధికి అవసరమైన అర్థనిపుణులను తయారు చేయడమే పరమావధిగా పెట్టుకుని రూపొందించిందే ఈ విద్యావిధానం-2020. ఇక్కడి పాలకులు ‘’భిన్నత్వంలో ఏకత్వం’’ మన సంస్కృతి లక్షణం అని చెబుతారు. అంటే వైవిధ్యాన్ని మరుగుపరిచి, సంస్కృతిని అఖండం చేసి చూపుతున్నారు. సంస్కృతి అంటే ఒక రకంగా కులమతాచారాలతో కూడిన వర్ణాశ్రమ ధర్మాలే అని నర్మగర్భంగా ప్రకటిస్తున్నారు. కాని వాస్తవ జీవితంలో సంస్కృతి అత్యంత వైవిధ్యపూరితంగా సాగే సజీవ స్రవంతి. ఇది వర్గ సమాజం గనుక సంస్కృతిలో పరస్పర భిన్న వర్గప్రయోజనాలను వ్యక్తీకరించే (బుద్ధిజం,చార్వాకం లాంటి) అనేక పాయలు కలగలసి ఉంటాయి.

ఏదేమైనా శాస్త్రీయంగా పరిశీలిస్తే, మానవుల ఉమ్మడి శ్రమనుంచే సంస్కృతి పుడుతుందని తేలుతుంది.శ్రమనుంచి అనన్నప్పుడు,శ్రమ సృష్టించే సంపద(ఆస్తి) వైపు నుంచి, రాజకీయార్థిక పునాది వైపు నుంచి సంస్కృతిని చూడాల్సి ఉంటుందని అర్థం. అలా చూస్తే తప్ప సంస్కృతీ మూలాలు మనకు సరిగ్గా అర్థం కావు. అందుకే మావో ‘’నిర్దిష్ట రాజకీయార్థిక పునాది మీద నిర్మితమైన కట్టడియే సంస్కృతి’’ అనన్నాడు.

సామాజిక అసమానతలను రూపు మాపి, దోపిడీ పీడనలను నిర్మూలించి సమసమాజాన్ని నిర్మించడానికి, మానవ సంబంధాలను ఉన్నతీకరించడానికి సంస్కృతి గురించి సరైన అవగాహన చాలా ముఖ్యమని ఈ పుస్తక రచయితలందరూ తెలియజేస్తున్నారు. అసమానతల సమాజంలో విభిన్న కులమతాచారాల రూపంలో అమలవుతున్న సంస్కృతి వల్ల సమాజంలో పరస్పర విరుద్ధమైన మనోప్రవృత్తులు పుట్టి పెరుగుతాయి. అగ్రకులాల వాళ్ళు నిమ్న,దళిత కులాలను చిన్నచూపు చూస్తూ,వారి సంస్కృతిని అవహేళన చేసే అవాంఛనీయ ధోరణులు ప్రబలుతుంటాయి.ముస్లిం తదితర మైనారిటీల పట్ల కూడా శత్రుపూరిత మానసిక ధోరణులుంటాయి.కనుకనే బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్ మారణకాండ లాంటివెన్నో జరిగాయి. దళిత మైనారిటీలపై దాడులింకా కొనసాగుతున్నాయి.

పాలవర్గ పార్టీలలో ఇటీవల దూకుడుగా ముందుకు వచ్చిన పార్టీ బిజెపి. దేశ జాతీయోద్యమ, స్వాతంత్రోద్యమ రాజకీయ పోరాటాలలో ఎన్నడూ భాగం కాని ఆర్ఎస్ఎస్ తన సనాతన భావజాల సంస్కృతిని చాపకింద నీరులా వ్యాపింపజేస్తూ వచ్చి వచ్చి చివరికి 2014లో బిజెపికి రాజకీయ అధికారాన్ని అప్పగించింది. అప్పటిదాకా బిజెపియేతర పార్టీలు కప్పుకున్న లౌకికత్వ,ప్రగతిశీల ముసుగులన్నీ తొలగిపోయాయి. అన్నీ ఒకే తాను ముక్కలేనన్న సత్యం రుజువయింది. ఇక ప్రభుత్వాధికారాన్నే ప్రజారాజ్యాధికారంగా భావించిన కమ్యూనిస్టు పార్టీల అసలు రంగు కూడా బయటపడింది.

కాగా వర్గ పోరాటం ద్వారా ప్రజా రాజ్యాధికారాన్ని సాధిస్తామని బయలుదేరిన అసలైన కమ్యూనిస్టు పార్టీల ముందర అనేక సరికొత్త సవాళ్ళు ముందుకువచ్చాయి. అంతకంటే ముందే జెండర్,కులం తదితర అస్తిత్వాలకు సంబంధించిన సవాళ్ళు కూడా ఎదురయ్యాయి. వర్గ పోరాటం క్రమంలోని బహుముఖ కోణాలూ వెలికి వచ్చాయి.ఆది నుండి పీడిత అస్తిత్వాలతో మమేకమై వర్గపోరాటం నిర్వహిస్తూన్నప్పటికీ,కొత్త అస్తిత్వ ఆకాంక్షలు పోటెత్తి విమర్శనాత్మక ప్రశ్నలను సంధించాయి. వాటిపట్ల మొదట ఎలా స్పందించినప్పటికీ, కాలక్రమంలో వాటిని సానుకూల అర్థంలో స్వీకరించి ప్రజా అస్తిత్వాలకు సంబంధించిన వైరుధ్యాల పట్ల తమ అవగాహనను మెరుగుపరుచుకున్నా యి. అస్తిత్వ సమస్యలకు సరైన పరిష్కారం కోసం నిజాయితీగా కృషి చేస్తూనే, ప్రజా పోరాటాలను విభజించి అనైక్యంచేసే తప్పుడు భావధోరణులను సహేతుకంగా విమర్శించాయి.తమ గతాచరణకు సంబంధించిన లోటుపాట్ల విషయంలోనూ ఆత్మవిమర్శ చేసుకున్నాయి. అయితే పీడిత అస్తిత్వ సమస్యలను పరిష్కరించడానికి ఇతర అస్తిత్వాల పట్ల ఎరుక చాలా అవసరమని విప్లవోద్యమం భావించింది. వ్యవస్థ లోని వివిధ అస్తిత్వాల మధ్యగల సంబంధాలను పరిశీలించి అధ్యయనం చేయకుండా నిర్దిష్ట అస్తిత్వ జ్ఞానం (సాపేక్షికంగానైనా) సమగ్రం కాదు.నిర్దిష్ట అస్తిత్వ సమస్యలకు ఇతర అస్తిత్వాల ప్రమేయం ఉంటుందని తెలియజేసింది.పీడిత అస్తిత్వాల ప్రజా శ్రేణులతో కలిసి పీడక అస్తిత్వాలపై ఐక్య పోరాటాల ద్వారానే అస్తిత్వాల ప్రత్యేక సమస్యలు పరిష్కరించబదతాయనే శాస్త్రీయ అవగాహననూ ప్రకటించింది. రాజీలేని నిరంతర వర్గ పోరాటాల క్రమంలో పీడిత అస్తిత్వాల ప్రజలు చైతన్యీకరణను పొందుతారు. సరైన జ్ఞాన సృష్టీ జరుగుతుంది. ఆ క్రమంలో తమ స్వీయానుభవంలోంచి పీడిత అస్తిత్వ వ్యక్తీకరణలు ముందుకు రావడం అత్యంత సహజం. తీవ్రమైన పీడనానచివేతల వల్ల అవి కఠినంగాను,కటువుగానూ ఉండొచ్చు(ఉన్నాయి కూడా). అవి ఎలా ఉన్నప్పటికీ వాటిలోని ప్రజాస్వామిక ఆకాంక్ష చాలా ముఖ్యమైనది. కనుకనే అలాంటి వాటి పట్ల సానుకూల వైఖరే సరైనది.చరిత్ర నిర్మాణ క్రమంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు అనేక రూపాల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. వాటికి ప్రాతినిధ్యంగా కొందరు వ్యక్తులు నాయకత్వం వహించడానికీ అవకాశం ఉంటుంది. వర్గ పోరాటాల పట్ల,వర్గ పోరాట రాజకీయాల పట్ల ఆయా వ్యక్తుల లేదా శక్తుల వైఖరులు ఎలా ఉన్నప్పటికీ వారి పట్ల సానుకూల వైఖరి ముఖ్యమని పోరాటానుభవ పూర్వకంగా తెలిసి వచ్చిన దాఖలాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న విప్లవోద్యమ అవగాహనలో,డాక్యుమెంట్లలో,గత చరిత్రను పునర్దర్శించి, పునరధ్యయనం చేసి కొత్త సైద్ధాంతిక నిర్ధారణలకు రావడంలో స్పష్టంగా కనబడతాయి. నేర్చుకునే క్రమంలో ముందువెనుకలు సహజమని, వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి పరస్పరం తప్పులెన్నుకోవడం సరికాదనే ఉద్యమం పరిణత అవగాహనను కూడా ఎవరైనా గమనించవచ్చు.

ఈ పుస్తకంలో ‘’మనిషికి,మనిషికి ఉండే వైరుధ్యాన్ని ఐక్యత ప్రధానంగా ఒక సమాధానాన్ని చారిత్రకంగా గ్రహించి పొందుపరిచే సాధనం సంస్కృతి’’ అని ఆర్ఎస్ రావు గారన్నారు. కాగా మానవ వైరుధ్యాల ఘర్షణ ప్రాతిపదికగా చారిత్రకంగా సాగే అభివృద్ధి పరిణామ స్థాయిని నాగరికత అనవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే- సంస్కృతీ నాగరికతలు సమాజం తాలూకు రూపసారాలుగా భావించవచ్చును. సమాజంలో నిరంతరం సాగే నాగరికతా క్రమంలో ఎప్పటికప్పుడు నూతన విలువల సృష్టి జరుగుతుంది.వాటి గుణదోషాలను వింగడించుకొని,గుణాలను క్రోడీకరించుకోవడం వల్లే సంస్కృతిలో మార్పులకు దారి ఏర్పడుతుంది. సమాజాన్ని వర్గ ప్రాతిపదికన విశ్లేషించి చూసినపుడు, సంస్కృతీ నాగరికతలలో కూడా వర్గపరమైన తేడాలుంటాయని మనం సులువుగానే గ్రహిస్తాము.ఆ సంస్కృతీ నాగరికతలకు పునాది మానవ శ్రమే కాబట్టి, సమాజ ఉత్పత్తితో వాటికి అనివార్యమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధం లోని వైరుధ్యాలతోనే కాకుండా, వైవిధ్యాలతో కూడా ఎలా వ్యవహరిస్తున్నారన్న దాన్ని బట్టే మనుషులు ఏ వర్గానికి చెందుతారన్నది నిర్ణయమవుతుంది.

నేటి సామ్రాజ్యవాదం యుగంలో దేశ దేశాల వర్గ పోరాటాల క్రమంలో సామాజిక సంబంధాలు తీవ్రమైన మార్పులకు గురవుతుంటాయి. ఆ మార్పులు కూడా అంతటా ఒకే రకంగా ఉండవు.స్థలకాలాల నిర్దిష్టతలను బట్టి అవి వేర్వేరుగా ఉంటాయి. మన దేశంలోనైతే నిర్దిష్ట కుల,మత,పితృస్వామ్యాల కారణంగా సాంఘిక సంబంధాలు అత్యంత క్లిష్టంగా మారాయి,మారుతున్నాయి. ఇలా మారుతున్న సాంఘిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి జడ ప్రాయమైన, అశాస్త్రీయ దృక్పథాలు పనికిరావు. చలనశీలమైన, శాస్త్రీయమైన మార్క్సిస్టు దృక్పథమే నిత్యం మారుతున్న సమాజ వాస్తవికతను సరిగ్గా ప్రతిఫలిస్తుంది.ఆ మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికపై సాగే నిర్మాణాత్మకమైన, చైతన్యపూరితమైన మానవ రాజకీయ కార్యాచరణే సమాజాన్ని ఉన్నతంగా మార్చగలుగుతుంది.

Leave a Reply