కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి. మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.
వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది.
ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి కాలంలో ఈ కవిత్వం రాశారు? విప్లవాన్ని కలగనడమే నేరంగా మారిన రోజుల్లో ఈ కవిత్వం చదవడమే ఒక ఉద్విగ్న అనుభవం. మనలోని భావోద్వేగాలను సహితం మాటుగాసి ఛిద్రం చేస్తున్న రోజుల్లో ఈ కవిత్వాన్ని పలవరించడమే నేరం. పరామర్శించడమే విద్రోహం. అనేకానేక మంది లోపలా, బైటా అనుభవిస్తున్న నొప్పినంతా సృజనశీలం చేయడం ఎంతటి సాహసం? నిజంగానే ఎంత ప్రమాదం!
ఎన్‌ఐఏ అధికారులు ఈ మధ్యే వర్మను అడిగారట.
మావోయిస్టు అమరుల గురించే కవిత్వం ఎందుకు రాస్తావు? అని.
దానికాయన విప్లవం గురించే కాదు, ఎన్నిటి గురించో రాస్తాను, ఒంటరితనం గురించి కూడా రాస్తానని అన్నారట.
ఉద్యోగం, సంసారం ఉన్నాయి కదా, ఒంటరితనం ఎందుకు? అని పరీక్షించారట.
మానవులంటే సామూహికమని, అందులో కలిసిపోడానికి కవిత్వమొక మార్గమని, నిత్యం ఒంటరితనం నుంచి మహాద్భుతమైన, క్రియాత్మకమైన, చారిత్రక శక్తి అయిన సామూహికతను చేరుకొనే అన్వేషణే కవిత్వమని, అది విప్లవంలో భాగమని చెప్పడానికి ఆయన ఎంతో ప్రయత్నించారట.
పోలీసులకు ఈ మానవోద్వేగం ఎట్లా అర్థం అవుతుంది? మనుషుల సహజాతమెలా ఆమోదమవుతుంది?
కవిని ఇంటరాగేట్ చేయడం ఈ కాలపు వైచిత్రి మాత్రమే కాదు. రాజ్యపు నైజం.
మన చుట్టూ ఉన్న ‘ప్రజాస్వామ్య’ హామీలు, రాజ్యాంగ నైతికతలు, సకల సిద్ధాంతాలు, విమర్శ పద్ధతులు అన్నీ ఎక్కడికి వచ్చి చేరాయో, ఏం నిగ్గు తేల్చాయో చూడండి.
ఇలాంటి కాలాన్ని వర్మ కవిత్వం చేశారు. కాలం కవిత్వమైనప్పటి ఉద్వేగం, వైభవం, విషాదం, సాహసం ఇందులో ఉన్నాయి. వర్మ ఎన్నెన్ని చెరగులనో తన కాల్పనిక శక్తిని విస్తరించి, గాఢతరం చేసి, కల్లోలాలను ఈది, తీరం దిశగా సాగి ఈ కవితలను అల్లారు. దీన్నంతా ఒడిసిపట్టి అనుభవించడం, విలువ కట్టడం సామాన్యం కాదు.
జీవితపు సకల పార్శ్వాల, మనసు లోలోపలి తొక్కిసలాటల, అవధులు ఎరుగని ఊహా తీరాల, అచంచల తాత్విక విశ్వాసాల పరిపక్వ సంపుటి ఈ విప్లవ కవిత్వం.
2
ఇది వర్మ నాలుగో కవితా సంపుటి.
కవిగా ఆయన పదిహేనేళ్ల కింద ‘వెన్నెల దారుల’ల్లో(2006) ప్రయాణమయ్యారు. ‘రెప్పల వంతెన’ మీదుగా, ‘కాగుతున్న రుతువు’లోంచి ఈ ‘మట్టి రంగు మనుషుల’ను చేరుకున్నారు. చెప్పుకోడానికి ఇది ఒకటిన్నర దశాబ్దమే. కానీ ఆయన, విప్లవాభిమానిగా, కార్యకర్తగా, సృజనకారుడిగా గడిచిన సన్నాహక దశ కూడా ఉన్నది. అది చాలా అరుదైనది. అపురూపమైనది. కవిత్వానికంటే ముందు కవి ఆవిష్కృతమైన క్రమం. ఇది కవులందరికీ అంది వచ్చేది కాదు. ఆయన మనిషిగా రూపొందాక శ్రీకాకుళం నుంచి, ఆంధ్ర`ఒడిషా సరిహద్దుల మీదికెళ్లి, అటు నుంచి తిరిగి తెలుగు నేల అంతా ఆయన కవియానం సాగింది. సరిగ్గా ఇది విప్లవ కవులందరి నడక. విప్లవం కోసం కవన రంగాన్ని సిద్ధం చేసిన వాళ్లందరి నడత. మట్టి మనుషులతో వెన్నెల కాసిన వనాల్లో కలియ తిరిగి మళ్లీ మట్టి రంగు మనుషులను చేరడమే ఆయన దృక్పథ ప్రత్యేకత.
కాలం గడిచే కొద్దీ, వెన్నెల సహితం రాపిడి పెట్టేకొద్దీ ఆయన చూపు విశాలమైంది. విప్లవంలోని సకల అర్థాలను గ్రహించారు. కవిత్వ వైశాల్యాన్ని గుర్తించారు. కవిగా విస్తరించారు. విప్లవంలో ఉండగల ఊహాశక్తినంతా సొంతం చేసుకున్నారు. విప్లవంలోని స్థితులన్నిటినీ లోపలికి తీసుకొని అనుభవించగల నిబ్బరం సంపాదించుకున్నారు. దీనికి ఇప్పటికి వచ్చిన మూడు కవిత్వ సంపుటాలే నిదర్శనం. తాజాగా ఈ మట్టి రంగు మనుషులతో, మనతో ఆయన నెరపే సహచర్యమే తార్కాణం.
ఈ సంపుటిని రెండు మూడుసార్లు చదివాను. అప్పుడు ఓ సందేహం కలిగింది.
ఈ పదహైదు ఇరవై ఏళ్ల వర్మ పరిణామాన్ని ఏమైనా సూత్రీకరించవచ్చునా? అని. దేనికంటే ప్రతి కవితా మనల్ని ఎక్కడికెక్కడికో తీసికెళుతుంది. వాస్తవ`కాల్పనిక ప్రపంచాల చుట్టూ పరుగులు తీయిస్తుంది. మనలోకి తొంగి చూసి మన బహిరాంతరాలను తట్టి లేపుతుంది. ఇన్నేళ్లలో ఎప్పటికప్పుడు ఆయన ప్రతి కవితా ఇలాగే అనిపించింది. చాలా కవితలు అచ్చుకు ముందే చదివే అవకాశం కలిగింది. అప్పుడూ అలాగే అనిపించేది. అన్నీ కలిపి చదువుతోంటే ఇప్పుడూ అనిపించింది. గతంలో రెండు వ్యాసాలు కూడా రాశాను. అయినా వర్మను సాంతం గ్రహించగిలిగానా? అనే సందేహం.
గాఢమైన, లోతైన భిన్న తాత్వికార్థాలు ధ్వనించేలా, ప్రకృతి పరివ్యాప్తమైన కంఠ స్వరం ఆయనది. ప్రకృతిలోని భిన్న స్వరాల, స్వర స్థాయిల సమ్మేళనం అందులో పలుకుతూ ఉంటుంది. అక్కడితో ఆగరు కదా. దాన్నంతా విప్లవంలోకి తీసుకొస్తారు. విప్లవంలోని ఆగ్రహ, దు:ఖ, సునిశిత, నిష్కపట, సాహస గొంతుకల లోంచి మనకు కవిత్వం వినిపిస్తారు. అలాంటి ఏ కవినైనా చప్పున అంతా గ్రహించేశామని చెప్పగలమా? ఇప్పుడు నాలుగు సంపుటాలను ఒకేసారి తిరిగి చదువుతోంటే ఇదే అనుభవం కలిగింది.
అందుకే నేనెన్నడూ రాయని పద్ధతిలో ‘నేను.. ’ అని నా అనుభవం నుంచే ప్రారంభించాల్సి వచ్చింది.
ఈ అనుభవం ఎందుకు కలిగిందంటే వర్మ కవిత్వంలో ఒక రకమైన మూడ్ ఉంటుంది. ఇది మొదటి సంపుటంలోనే ఉంది. రెండో సంపుటానికల్లా చిక్కబడిరది. అది పాఠకులున్న స్థలకాలాలనుబట్టి, మన:స్థితినిబట్టి అర్థమవుతుంటుంది. ఒకసారి చెప్పుకున్న అర్థమే రెండోసారి కూడా స్పురించకపోవచ్చు. అసలు ఏ కవితా వస్తువునైనా ఆయన తన అంతరంగ స్థితిలోకి ఒంచుకొని కవితా పాదాలుగా తీర్చిదిద్దుతారు. ఆ వెలుగులో, అది ప్రకటించే అర్థాల్లో మన చుట్టూ ముసురుకుంటున్న చీకట్లు తొలగిపోతాయి. మామూలుగా అనిపించే స్థితిని అనేక పొరల్లో, దశల్లో, రూపాల్లో సాగుతున్న చలనాలు కనిపిస్తాయి. మొత్తంగా బహుశా వాటితో కలిసి మనమూ చలనంలోకి వెళతాం.
వర్మ కవిత్వంలో దృశ్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మూడ్‌కు తగిన బొమ్మ కట్టేస్తారు.
‘వెన్నెల దారి’లో దృశ్యం అనే శీర్షికతోనే ఒక కవిత ఉంది. అందులో..
ఎక్కడో చిల్లుపడిన శబ్దం
పెరట్లో వేపకొమ్మ విరిగిపడిరది
గుమ్మాన రాసిన పసుపు వెలవెలబోయింది
కాలం బిగ్‌బిన్‌లో అలారం మానేసింది..అంటారు.
ఈ ఆరంభం ఆయన ఉద్దేశించిన కాల్పనిక స్థావరానికి మనల్ని తీసికెళుతుంది. దృశ్యాన్ని అల్లడంలో ప్రకృతి భాగమవుతుంది. వెన్నెలదారి సంపుటంలో ఆరంభం మాత్రమే. కాగుతున్న రుతువులో అనేక రుతువుల ప్రాకృతిక సౌందర్యమంతా కవిత్వలోకి వచ్చేసింది. సామాజిక సంబంధాల సంఘర్షణ నుంచి, సృజనాత్మకత నుంచి పుట్టే కవిత్వానికి ప్రకృతిని ఆయన మాధ్యమంగా చేసుకున్నారా? అనిపిస్తుంది. వెన్నెల దారి అనే శీర్షికతో వచ్చిన కవిత్వంలో ‘జీవితమే యుద్ధమైనప్పుడు వెన్నెల గురించి ఎలా పాడగలను?’ అంటారు. ఇంకో వైపు నుంచి ‘నా రెప్పల చాటున సూర్యోదయం దాగి ఉంది’ అని కూడా అనగలరు.
ఇవన్నీ కలిసి వర్మ కవిత్వానికి ఆర్దృ స్వభావం పుష్కలంగా వచ్చింది. కవిత్వం చేయవలసిన పని ఇదే కదా. రెప్పల వంతెన సంపుటిలో ‘నాకింకా’ అనే కవిత ఉంది. అందులో..
నాకింకా అతడి చేయి నా భుజంపై
ఉన్నట్లే ఉంది.. అంటారు.
ఆ చేయి ఏ విప్లవకారుడిదైనా కావచ్చు. నిజానికి అది చేయి మాత్రమే కాదు. జీవితంలోని అనేక అనుభవాలను సరిపోల్చగల, గుర్తు చేయగల భావన. అందులో ఒక దృశ్యం కూడా ఉండొచ్చు. అనేకానేక దృశ్యాల కలనేత వాక్యం అది. కొంచెం ఓపిగ్గా పరిశీలిస్తే ఆయన వాక్యం నిర్మించే పద్ధతిలోనే ఒక ప్రత్యేకత ఉంది. వర్మ కవిత్వంలో కంఠస్వరం, దృశ్యం ప్రాధాన్యత సంతరించుకోవడం వెనుక ఈ వాక్య నిర్మాణ రహస్యం ఉంది. ఇది మొదటి సంపుటిలోనే ఉన్నట్టనిపిస్తుంది. కానీ రెండో సంపుటంలో వర్మ వాక్యం స్పష్టమైపోయింది. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి.
ఉదాహరణకు ఒలికిపోతూ (రెప్పలవంతెన) అనే ఈ కవిత చూడండి..
ఎక్కడో ఒక మలుపు దగ్గర
ఆగిపోవడమేనా..
మొదలు పెట్టిన గీత అలా
ఓ అసంపూర్ణ రేఖా చిత్రంలా..
కుంచెనంటిన రంగు చివరంటా
అలా ఆరిపోతూ..
గొంతు పెగలని రాగమేదో
సుళ్లు తిరుగుతూ లోలోపల.
ఇలా దృశ్యంతో కూడిన కవిత్వ నిర్మాణానికి ఎన్ని అద్భుత ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. అయితే ఇందులో ఒక రకమైన కంఠస్వరం. దాని కోసం అనుసరించిన వాక్య నిర్మాణం. వాటి మధ్యనే ఏదో సందిగ్ధత ఉన్నట్లనిపిస్తుంది. మళ్లీ వెంటనే
పొలమారిన నా ప్రతిబింబం
నీ కన్నీటి ధారలో ఒలికిపోతోంది..(గాలిగోపురం) అంటారు. ఇందులో విషాదం ధ్వనిస్తుంటుంది. కానీ అక్కడితో ముగించరు.
మళ్లీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది.. అంటారు.
ఈ కవిత్వ లక్షణాన్ని ఆయన విప్లవోద్యమం నుంచి తెచ్చుకున్నారు. బహుశా నిర్మాణ రహస్యాన్ని కూడా కావచ్చు. దాన్ని ఆయన ఎంతగా సాధన చేసిందీ ఈ నాలుగు సంపుటాలే నిదర్శనం. శిల్పం మీది మోజుతో చేశారని అనిపించదు. దేనికంటే శిల్పం వేరుగా ఉండదు. అందుకే అది అందరికీ అనిపించే శిల్ప సాధన కాదు. తన అంతరంగ వ్యక్తిత్వంతోనే శిల్పాన్ని తీర్చిదిద్దుకున్నారు. అందువల్ల విప్లవమూ, ఆయన కవి వ్యక్తిత్వమూ కలగలసిపోయాయి. ఎంతగానంటే ఎవ్వరూ, ఎన్నటికీ వేరు చేయలేనంతగా. విప్లవమంటే అంతిమంగా రాజకీయ కార్యక్రమమే. మానవులు సకల బంధనాల నుంచి విముక్తం కావడమే. లోలోపల అణచివేయబడిన అపారమైన సృజనశక్తి అంతా వెల్లివిరియడమే. ఆ కారణం వల్లనే విప్లవోద్యమం అనేక తలాల్లో, కోణాల్లో, క్రమాల్లో మానవాంశను సంతరించుకుంది. ఒక సమగ్రశక్తిగా రూపొందింది. ఇదొక నిరంతరాయ క్రమం. యాభై ఏళ్ల కింద అప్పటి విప్లవ కవులు దీన్ని ఆరంభించారు. అప్పటి నుంచి విప్లవం జీవితాన్నంతా, వాస్తవ ప్రపంచాన్నంతా, మానవ ఊహా లోకాన్నంతా ఆవరించింది. రాజకీయ భాషలోనే చెప్పాలంటే ఇదంతా వర్గపోరాటం. దాని బహు రూపాలను విప్లవ కవిత్వం ప్రదర్శించింది. అది సాధించే పరివర్తనా క్రమాలన్నిటిలో భాగమైంది.
దీనికి పదుల సంఖ్యలో తెలుగు కవులను ఉదహరించవచ్చు. గత పాతికేళ్లలో విప్లవ కవిత్వం కెరటాలు కెరటాలుగా సాధించిన విస్తృతికి, చేరుకున్న శిఖర తలాలకు, తరచి చూసిన లోతులకు వర్మ కవిత్వం అత్యుత్తమ ఉదాహరణ. ఇందులో వర్మ తరం, తదనంతర తరం విప్లవ కవులందరి ప్రమేయం ఉంది.
వర్మ మౌలికంగా రాజకీయ కవి కావడమే ఈ పరిణతికి కారణం. ఆ మాటకొస్తే విప్లవ కవిత్వమే రాజకీయ కవిత్వం. వర్మ కవిత్వంలో కొంత రాజకీయమని, కొంత రాజకీయేతరమని విభజించడానికి లేదు. వైయుక్తిక కవిత్వమని, సామాజిక కవిత్వమని వేరు చేయడానికి లేదు. దేన్నయినా విప్లవ దృష్టితో ఎట్లా చూడాలనే విషయంలో ఆయనకు తిరుగులేదు.
మామూలుగా ఒక దురభిప్రాయం తెలుగు కవిత్వ, విమర్శ రంగాల్లో ఇప్పటికీ బతికే ఉంది. కాకపోతే అది ఏ మారు మూలల్లోనో నిట్టూర్పులు విడుస్తుంటుంది. పైగా ఆ అభిప్రాయం ఉన్న వాళ్లకు కనీస ప్రభావశక్తి లేదు. కాబట్టి సమస్య లేకుండాపోయింది. అదేమంటే.. రాజకీయాన్ని రాస్తే కవిత్వం పలుచన అవుతుందని. బహుశా రాజకీయమంటే ఏమో తెలియకపోవడమే దీనికి కారణం కావచ్చు. వ్యక్తిగతం కూడా రాజకీయమే అనే మాట సిద్ధాంతరంగంలోకంటే కవిత్వంలోనే మన దగ్గర బలంగా వచ్చింది. చాలా ముందుగా వచ్చింది. అయినా ఇలాంటి వాదన చేసేవాళ్లున్నారు. బహుశా వాళ్లకు విప్లవ రాజకీయాలను చూడగల కవితా దృష్టి లేకపోయి ఉండవచ్చు. కవిత్వ శక్తి లేకపోవడమే అసలు కారణం కావచ్చు. నిజంగానే రాజకీయానికి అర్థం తెలిస్తే, దాన్ని కవిత్వం చేయగల సత్తా ఉంటే సమస్యే కాదు. కవిత్వం మీద ప్రేమను ఒలకబోస్తున్నట్లు మాట్లాడతారు. వాస్తవానికి విప్లవ రాజకీయాల మీద కంటగింపుతోనే ఈ వాదన చేస్తుంటారు. రాజకీయాల నుంచి, అంతిమంగా జీవితం నుంచి పలాయనం చిత్తగించడానికి చేసే సూత్రీకరణ అది. దేనికంటే జీవితంలోని సకలం రాజకీయమే. రాజకీయాలను వద్దనుకుంటే జీవితాన్ని కాదనుకోవడమే.
వర్మ కవిత్వ సందర్భంలో రాజకీయాల గురించి ఎంతైనా చర్చించవచ్చు.
‘అతనెప్పుడూ కలల్ని మోసుక తిరుగుతాడు
అతని కనురెప్పలకావల ఎన్నో యుగాలుగా
అంతంకాని స్వప్నమేఘాలు..
అతనెప్పుడూ కలల్ని మోసుక తిరుగుతాడు
ఆరారు రుతువుల వెంట
ఏడేడు ఇంద్రధనస్సుల్ని
భుజానేసుకొని
అతనెప్పుడూ కలల్ని మోసుకతిరుగుతాడు..
వర్మ ఊహాశక్తికి ఈ కవిత ఉదాహరణ. గత ఇరవై ఏళ్ల విప్లవ కవిత్వానికి వర్మలాంటి పలువురు కవులు ఈ లీడ్ ఇచ్చారు. వాస్తవాన్ని ఊహాత్మకం చేస్తారు. తిరిగి అద్భుత వాస్తవాన్ని పునర్నిర్మిస్తారు. అందుకే విప్లవాన్ని కవిత్వ శిఖరాగ్రానికి ఈ దశ చేరింది. విప్లవ కవిత్వం మానవోద్వేగాల వ్యక్తీకరణ అంటే సమాజ సంస్పందన. వర్గపోరాటం తీవ్రరూపం దాల్చినప్పుడు, నిర్బంధం అనేక రూపాల్లో చుట్టుముట్టినప్పుడు, చుట్టూ భీభత్స వాస్తవం సలసల మరుగుతున్నప్పుడు విప్లవ కవిత్వం ఎలా ఉండాలి? ఏం చేయాలి? పాఠకుల్లో ఏ సున్నిత, సునిశిత ప్రేరణలను అందించాలి? మరే మాధ్యమం ద్వారా చేరుకోలేని తీరాలనెలా కవిత్వమే అందుకోవాలి? ఈ ఇరవై ఏళ్ల కాలం ఇలాంటి సవాళ్లను ముందుకు తీసుకొచ్చింది. ఇవి రాజకీయ, కళా సంబంధమైన ప్రశ్నలు. వాటిని స్వీకరించి, ఒక నిశ్చయ దృష్టిని సమకూర్చుకోవాలి. అందులో తాత్వికమైన లోతు ఉండాలి. విప్లవ కవిత్వం వీటిని సంతరించుకుంది.
‘నవ్వు వాడినెప్పుడూ భయపెడుతుంది’ అంటారు వర్మ. ఈ మాట అనడానికి సాహసం, సృజనాత్మకత రెండూ ఉండాలి. నిర్బంధ కాలాల్లో మనుషులు ఒంటరి దు:ఖంలోకి జారిపోవచ్చు. అప్పుడు బహుశా దు:ఖం తప్ప మరేమీ ఉండకపోవచ్చు. అదే ఆలంబన కావాలి. వర్మ ఏమంటారంటే
మరల మరల నిన్ను ముసురుకుంటున్న
సామూహిక దు:ఖమేదో మేల్కొలిపి
నిన్నో జెండాగా మార్చి ఎగరేస్తుంది (సాంగ్ ఆఫ్ ది రివర్`కాగుతున్న రుతువు)
దీనికి కేవలం ఆశావాదమే చాలదు. అదీ ఉండాల్సిందే. లోతైన అంతర్ దృష్టి ఉండాలి. అది కల్పనా తలంలో ఒక రూపాన్ని తీసుకోవాలి. దు:ఖమే ఆవరించి ఉండవచ్చు. విచిత్రంగా అదే ఒక మేల్కొపు గీతమవుతుంది. అదొక సామూహిక సంవేదన అవుతుంది. అంతిమంగా క్రియాత్మకం అవుతుంది. ఇవన్నీ కలిసి ఒక వాక్యం నిర్మాణం కావాలి. అది వ్యాకరణ సంబంధమైనది కాదు. భావనాత్మకమైనది. ఊహకు`వాస్తవానికి మధ్య వారధిని నిర్మించే వాక్యమై ఉండాలి. ఇది భాషాపరమైన సాధనతో అయ్యేపని కాదు. వర్మ కవిత్వం చదువుతోంటే ఎక్కడా భాషతో వ్యవహరించినట్లు ఉండదు. పట్టించినట్లు ఉండే వాక్య సందర్భాల్లో కూడా అలా అనిపించకపోవడమే ఆయన ప్రత్యేకత.
అది ఊరక వచ్చేది కాదు. ఈ కాలాన్ని మధించి తీరాల్సిందే. లేకపోతే నిట్టూర్పులు, నిరాశలు, దారం తెగిన పతంగుల విన్యాసాలే మిగులుతాయి. ఈ కాలానికి తగిన విప్లవ కవిత్వం రాయడమంటే వేరే ఏమో కాదు. ఈ కాలాన్ని భవిష్యత్తులోకి విస్తరింపజేయడమే. రూపొందుతున్న ప్రపంచానికి రంగులు అద్దడమే. ఆ పని వర్మ ఎంత అద్భుతంగా చేశారో చూడండి.
రెక్క తెగిన తూనీగ ఒరిగిపోతూ
దోసిలి నిండా నెత్తుటి మరక
చిత్రంపై ఒలికిన రంగు కాన్వాసు
మీదుగా మొఖంపైకి పాకుతూ
విరిగిన వేణువు నుంచి నిషిద్ధ
రాగమేదో గొంతులోకి చిలుకుతూ
పాదాలను తాకుతున్న గడ్డి పరకల
తడి గుండెలోకి జారిపోతూ
పదిలంగా దాటుతున్న నెమలీకలు
వదిలిన బియ్యం గింజలు మెరుస్తూ…
‘వెన్నెల దారి’ నుంచి ఇప్పటి దాకా వర్మ చేతిలో ఈ రాజకీయ కవితాశైలి అలలు అలలుగా విస్తరిస్తోంది. రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఆయన చూసిన సృజనాత్మకతే దీనికి ఆధారం. ‘రెప్పల వంతెన’ నాటికి ఇది వికసిత రూపాన్ని సంతరించుకుంది. ఆ సంపుటిలో ఒకరమైన అంతస్సంఘర్షణ కనిపిస్తుంది. వైయుక్తిక ఆవేదన వినిపిస్తుంది. కానీ అది సమూహానికి భిన్నమైనది కాదు. వైయుక్తికం పేరుతో సమూహం నుంచి పలాయనం కాదు. నిష్కిృయ కాదు. నిరాశ కాదు. దారి తెన్నూలేని సందిగ్ధతలో కొట్టుకపోవడం కానేకాదు. ‘వ్యక్తివాద’, ‘ఆత్మాశ్రయ’ వాద ధోరణుల కంటే పూర్తి భిన్నంగా తన వైయుక్తిక, కాల్పనిక ఆవరణ నుంచి విప్లవోద్యమ బహుముఖాలను ఆయన చూశారు. వ్యక్తి`విప్లవోద్యమ అన్యోన్య సంబంధాల్లోకి వెళ్లారు. దాన్ని చారిత్రక ఆచరణగా గుర్తించారు. అది మనుషుల అడుగుజాడల అన్వేషణ. సమాజ మార్పు క్రమాలతో, విప్లవోద్యమ ఎగుడుదిగుళ్లతో కలిసి నడుస్తున్న వ్యక్తి ఆరాటం. మనిషిని ఆయన వీటన్నిటి మధ్య చూశారు. ఈ దృష్టి ఉన్నందు వల్లే ఆయన ఒంటరితనం గురించి రాసినా రాజకీయ కవిత్వమే అయింది. విప్లవ కవిత్వానికి అనేకానేక పార్శ్వాలను అద్దింది.
ఈ మొత్తం వెనుక ఇంకోటి పని చేసింది. కవిత్వ సృజనలోని మౌలిక దినుసు అయిన అనుభూతిపట్ల వర్మకు విప్లవాత్మక వైఖరి ఉండటం. దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా తన కవిత్వంలోకి తీసుకొచ్చారు. ఇది అనుభూతివాదాని కంటే పూర్తి భిన్నమైనది. ఎక్కెడెక్కడ, ఎన్నెన్ని తావుల విప్లవాచరణ ఎట్లా అనుభూతిమయమో గుర్తించి అందులోంచి కవిత్వాన్ని రూపుకట్టించారు. విప్లవం ఎన్నెన్ని తలాల్లో అనుభూతి సంచితమో నిరూపించారు. వర్మ కవిత్వాన్ని పక్కన పెడితే శుష్క అనుభూతిలోని డొల్లతనం దానికదే తేలిపోతుంది.
రాతిరంతా రెప్పలపై కలల తూనీగ
తెలవారగానే రెక్కలు విరిగి నేల రాలింది
రంగు వెలిసిన గోడపైన చేతి వేళ్ల గీతలే
నెత్తుటి మరకల మధ్య వేలాడుతూ
తూటా దిగిన గుండెలో పాట
చివరి నినాదంగా మారింది..(కలల తూనీగ`కాగుతున్న రుతువు)
నిజానికి విప్లవం ఎంత సైద్ధాంతిక, భౌతిక ఆచరణో అంత అనుభూతిమయం. మానవులలోని భావోద్వేగాల అంచుల దాకా అది విస్తరించి ఉంటుంది. వర్మ కవిత్వాన్ని ఆస్వాదించగలిగేది ఈ లక్షణం వల్లనే. దీన్ని విప్లవ కవిత్వంలో శివసాగర్ దగ్గరి నుంచి వర్మ దాకా చూడవచ్చు.
రాజకీయ కవిత్వం కావడం వల్లనే వర్మ కవిత్వం సౌందర్యవంతం అయింది. ఇది రూప సౌందర్యం మాత్రమే కాదు. అసలు ఆగ్రహం, దు:ఖం, ఆర్తి, ప్రేమ, కసి వంటి భావనలే కళాత్మకమైనవి. మానవోద్వేగాలన్నీ కళాత్మకమే. నిరంతరం మనుషుల కోసం తపన పడటంలోనే ఒక రకమైన సౌందర్యం ఉంటుంది. ఇది నిజ జీవితంలోంచి వేరు చేయలేనిది. దానికి సాటిరాగలదేదీ ఉండదు. అందుకే మనుషులు దాన్నే తిరిగి కళలో, కవిత్వంలో చూసుకుంటారు. అలా చదువుకున్నప్పుడు కలిగే అనుభవం ఎరుకగా మారడమే సౌందర్యం.
వర్మ తనను తాను పాఠకులతో పంచుకోడానికి స్వీయ ఉద్వేగాల మాధ్యమంలో ప్రయాణించినట్లనిపిస్తుంది. అలాంటప్పుడు కవిత్వంలో ఆదాటున ఒక మాట అనేసినట్లనిపిస్తుంది. ఒక్కోసారి వైయుక్తిక ఉద్వేగమేనా? అనే సందేహం కలుగుతుంది. దేనికంటే అవతల ఒక సమూహం ఉంది. అది చరిత్ర నిర్మాణ సంరంభంలో ఉంది. దాన్ని చేరుకోవాలి. అందులో భాగం కావాలి. ఈ ప్రయత్నంలో వైయుక్తిక ఉద్వేగంగా కనిపిస్తూనే అంతిమంగా అనేకానేక తాత్విక అర్థాలను కవిత్వం ప్రతిఫలిస్తుంటుంది. అంతగా ఆయన వైయుక్తిక భావోద్వేగం అనేక చెరగుల నుంచి చారిత్రక ప్రపంచానికి విస్తరిస్తుంది.
విప్లవ రాజకీయాల వల్లనే సృజనకారుల భౌతిక, ఆంతరంగిక జీవితం ఇలా విశాలం అవుతుంది. విప్లవ కవుల కార్యకర్తృత్వంలో, ఆలోచనా రీతుల్లో విస్తృతికి రాజకీయాలే కారణం. కేంద్రం, అంచులనే తేడా లేకుండా అనేక వైపుల నుంచి విస్తరిస్తుంటారు. అనేక రూపాల అలజడిని కవిత్వంలో పలికిస్తూ ఉంటారు. వర్మ రెండో కవితా సంపుటిలోకంటే కాగుతున్న రుతువులో ఈ అలజడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ మట్టి రంగు మనుషుల్లో అది తీవ్ర అనుకంపగా మారింది.
బహుశా మరే కవిత్వ ధోరణికంటే విప్లవ కవితోద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. విప్లవ కవిత్వంలోని ఉద్వేగం, అనుకంప పాఠకులను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. క్రియాశీలం చేస్తుంది. దేన్నయినా మామూలు చూపుకుంటే భిన్నంగా చూసే దృష్టిని ఇస్తుంది. దీన్నే ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. పాఠకుల ప్రతిస్పందనా స్థాయినిట్టే ఒక కవిత్వం రాజకీయ కవిత్వం అవునా కాదా? అనేది తేలుతుంది. ఇదే కొందరు విమర్శకులకు కంగటింపుగా మారింది. రాజకీయ కవిత్వమని ఈసడిరచుకుంటారు. పాఠకుల్లో కలిగించే ఈ ప్రతిస్పందన వాళ్లలోని కళాతృష్ణను తీర్చుతుంది. ఎరుక కలిగిస్తుంది. ఈ గుణం విప్లవ కవిత్వంలో అనేక దశలను దాటుకుంటూ విస్తరించింది. ఇప్పుడు ఇది ఎలా ఉన్నదో వర్మ కవిత్వంలో గమనించవచ్చు. ఆయన కవిత్వం పాఠకులను అనేక తలాల్లో ప్రతిస్పందింజేస్తోంది. ఈ వికాసమంతా విప్లవోద్యమంతోపాటే సాగింది. కవిత్వంలో, ఉద్యమంలో అలాంటి పోలికలు చాలా కనిపిస్తాయి. అది అనివార్యం. కానీ కవిత్వ వికాసం మక్కికిమక్కి విప్లవోద్య వికాసంలాగే ఉండదు. అదే కవిత్వ ప్రత్యేకత. గత యాభై ఏళ్ల విప్లవ కవిత్వ చరిత్రను పరిశీలిస్తే ప్రతి దశలో ఇది కనిపిస్తుంది. ఇప్పుడు వర్మ కవిత్వం దానికి గొప్ప ఉదాహరణ. తన కవిత్వ వికాసంలో అనేక వ్యక్తిగత, సృజనాత్మక ప్రత్యేకతలు పని చేశాయి. దీన్నంతా కేవలం శిల్పమని అనడానికి లేదు. అలా అంటే పాక్షిక వ్యాఖ్య చేసినట్లే. దీని వెనుక విప్లవ దృక్పథం ఉన్నది. కవిత్వంలో వస్తువును, శిల్పాన్ని, దృక్పథాన్ని వేరు చేయలేమనే హోలిస్టిక్ వైఖరికి వర్మ కవిత్వం గొప్ప ఉదాహరణ. ఆ మూడిరటి సమ్మేళనమే ఈ ‘మట్టి రంగు మనుషులు’.
3
అమ్మలు నేలకూ
ఆకాశానికీ తమ కొంగుతో
పాలపుంతల దారి వేస్తారు.. (భూమి రంగు మనుషులు)
అమర వీరుల తల్లులను చూడటం, వినడం గగుర్పాటు కలిగించే దు:ఖపు అనుభవం. మానవ సంబంధాల్లో ఎన్నడూ ఎరుగని కన్నీటి జడి మనల్ని అపమ్రత్తం చేస్తుంది. ఒక రకమైన ఆగ్రహం మనల్ని లేపి కూచోబెడుతుంది. ఈ అమ్మలు ఎలా ఉన్నారు? ఏం చేస్తారు? అనే ప్రశ్నలు చుట్టుముడతాయి. వర్మ ఎలా భావించాడో చూడండి. ఇది చదివితే ఎవరికైనా అజ్ఞాత విప్లవకారులు తమ తల్లుల్ని ఎలా తలపోసేదీ కౌముది కవిత్వంలో గుర్తుకు వస్తుంది.
‘నేను ఫార్మేషన్లో
పడిపోకుండా నడుస్తున్నది
నీ కొంగుపట్టుకొనే కదూ!’ అనే దృశ్యం కనిపిస్తుంది.
కౌముది తన విప్లవాచరణలో భాగంగా దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర వెళ్లాడు. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఆయన కవిత్వం వెన్నెల కురుస్తూనే సాగింది. ఆ వెలుగు ఒడిషా అడవుల మీది నుంచి, కొండల మీది నుంచి, విశాఖ సముద్ర కెరటాల మీది నుంచి వర్మ కవిత్వంలోకి కూడా ఇంకింది. అది ఆగ్రహాన్ని కూడా ప్రకటిస్తుంది. ఇంతక ముందు వర్మ కవితా వాక్యం గురించి చెప్పుకున్నాం. ఆ నిర్మాణ శైలి భూమి రంగు మనుషుల్లో మరింత పటిష్టమైంది. లలితంగా ఉంటూనే ఎంత పదునెక్కిందో ఈ సంపుటంలో చూడవచ్చు. దీనికి పెద్ద ఉదాహరణలు అక్కర్లేదు.
ప్రొ. సాయిబాబా అక్రమ నిర్బంధం మీద రాసిన ‘వాక్యం కావాలి’ కవిత చాలు. ఆయన ఖైదు జీవితం చాలా మందిని కదిలించి వేస్తోంది. ప్రపంచమంతా కదిలినా రాజ్యంలో చలనం రావడం లేదు. నిస్సహాయతలోంచి కూడా ఆగ్రహం పెల్లుబుకుతుంది. సుతిమెత్తని కవిత్వం రాసే వర్మ ఏమంటారంటే..
ఇప్పుడో వాక్యం కావాలి
మరఫిరంగిలానో అణుబాంబులానో
విస్పోటన చెందే
వాక్యం కావాలి
కదలని దేహం చుట్టూ
బలమైన గోడలను పాతిన
ఈ రాజ్యం దేహాన్ని
తుత్తినియలు చేసే
వాక్యం కావాలి
ఏ వాక్యానికి
మందుపాతరగా మారే శక్తి
ఉందో ఆ వాక్యం కావాలి
వర్మ కవిత్వంలో సున్నితత్వం, పదును తప్ప ఒక్క అస్పష్ట వాక్యం కూడా ఉండదు. వాక్యంలో సంక్లిష్టత కనిపించదు. విప్లవ కవిత్వమంటే సూటి కవిత్వమనే అపవాదును కూడా కొందరు పేర్చారు. విప్లవ కవిత్వానికి సూటిదనం ఒక ముఖ్యమైన లక్షణం. దానికి సంక్లిష్టతను పోటీగా తీసుకొస్తారు. విప్లవ కవిత్వానికి అదీ ఉండగల లక్షణమే. కానీ వర్మ కవిత్వంలో చాలా సంక్లిష్ట భావనలు సాంద్ర అనుభూతితో సరళంగా వ్యక్తమవుతాయి. ఈ నాలుగో సంపుటానికల్లా అనుభూతిలో, సరళతలో లోతు బాగా పెరిగాయి. మార్మికతను దరిదాపుల్లోకి కూడా రానీయలేదు. వర్మకు ఎన్నడూ కవిత్వమంటే కేవల పలవరింత కాదు. ఆగ్రహ వాక్యాన్ని, లలిత వాక్యాన్ని సమానంగా పదునుదేల్చగల స్పష్టత ఆయన సొంతం. దాన్ని సాధించడానికి దారి చూపింది నిస్సందేహంగా దృక్పథమే.
కవిత్వం ఎందుకో.. కవిత్వం ఏం చేస్తుందో వర్మకు పూర్తిగా తెలుసు. మొదట కవిత్వ పఠనం ఒక అనుభవంగా మారాలి. ఆ తర్వాత చైతన్యంగా మారాలి. దీని కోసం తన అనుభవం, అనుభూతి పాఠకులకు చేరవేయడానికి ఏం చేయాలో వర్మకు తెలుసు. ఇది ఆయన వస్తు నిబద్ధతకు కూడా నిదర్శనం.
ఈ సంపుటిలో 62 కవితలు ఉన్నాయి. అన్నిటిలోని అంతస్సూత్రం ఈ కాలపు కల్లోలం. ఈ కాలపు దు:ఖం. అంతే కాదు. గొప్ప ధిక్కారం, ప్రతిఘటన, అంతులేని ఆశ కూడా ఈ కాలం సొంతమే. ఈ సంపుటిలోని కవితలన్నిటి వెనుక ప్రేరణ ఇదే. ఈ స్పృహ ఉండటమే రాజకీయం. ఇదే లేకపోతే చట్టూ అలుముకున్న కల్లోలంలో మనమూ కొట్టుకపోతాం. కాకపోతే అలా కొట్టుకోతున్న వైనాన్నే కవిత్వం చేయవచ్చు. ఇదంతా కవి దుస్థితిని తెలియజేస్తుంది. ఒక్కోసారి మనల్ని నిస్సహాయత చుట్టుముట్టవచ్చు. కానీ అది నిరాశలోకి మళ్లిపోకూడదు. మనకు ఎదురయ్యే సకల స్థితులను చరిత్ర చోదకంగా మార్చాలంటే పూర్తిగా ఇంకో వైపు నుంచి రంగ ప్రవేశం చేయాలి. అప్పుడు సరికొత్త దృశ్యం కనిపిస్తుంది. వర్మకు అలాంటిది కనిపించింది. అలాంటి దాన్ని తప్పక హృదయం దగ్గరికి వెళ్లి అత్యంత సరళంగా చెప్పాలి. మామూలు మాటల్లో చెప్పాలి. అది అసాధారణంగా ఉండాలి. ఆయన ఏమంటారంటే..
ఓరిమితో ఎదురు చూడాలి
సమయమింకా ముగిసిపోలేదు
అందరమూ మరొకసారి
కలుసుకొని కదిలే కాలమే ఇది..
మన చుట్టూ దుర్భేద్యమైన గోడలు మొలిచి ఉండవచ్చు. బైటికి కనిపించకుండా వాటిలోని నెర్రెలు ఉంటాయి. గోడలను చూపడం కాదు. వాటిలోని నెర్రెలను చూపడమే రాజకీయ కవిత్వం. దేనికంటే ఇనుప గోడల్లో సహితం ఉండే నెర్రెలను చీల్చుకొని అవతలికి వెల్లడమే మానవ జీవితపు సహజ తర్కం. దాన్ని చెప్పడమే రాజకీయం.
వర్మ కవిత్వంలో ప్రస్పుటంగా కనిపించే లాలిత్యానికి, సౌందర్యానికి, భావుకతకు మురిసిపోతే అంతిమంగా దాన్ని అర్థం చేసుకోనట్టే. ఆయనలోని ఆగ్రహమే అనేక ప్రతిఘటనలను కవితాత్మకం చేసింది. ముఖ్యంగా రెంటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాటికి వర్మ అపూర్వంగా స్పందించారు. అద్భుత కవిత్వం రాశారు.
ఒకటి వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటం. ఇప్పటికీ తొమ్మిది నెలలుగా రైతాంగ ఉద్యమం సాగుతున్నది. ఆ పోరాట దశలన్నిటికీ వర్మ స్పందించారు. తన కవిత్వాన్ని పోరాట రైతాంగానికి తోడుగా నిలబెట్టారు. ఆ పోరాటంలో, దాని సమయ సందర్భాల్లో ఏది కవిత్వమవుతుందో పట్టుకోవడంలోనే వర్మ ప్రత్యేకత ఉంది. కేవలం పోరాటానికి సంఫీుభావం చెప్పడమే కాదు. మహాద్భుతమైన ఆ మానవాచరణలో, కోట్లాది మంది ఆకాంక్షలో కళాత్మకత ఉన్నది. ఆ మాటకొస్తే అలుపెరుగని జన సందోహమే కళాత్మకం. కవితాత్మకం. దానిలోనూ దాగి ఉన్న సౌందర్యాన్ని వెలికి తీయాలి. దీనికి కేవలం సౌందర్య దృష్టి ఉంటేనే చాలదు. తాత్విక దృష్టి కూడా ఉండాలి. ఈ పోరాటం పొడవునా వర్మ ఆరేడు కవితలు రాశారు. అసలు ఈ కవితలను మాత్రమే తీసుకొని వస్తు శిల్ప చర్చ చేయవచ్చు.
ఒక పక్క జైల్లో సాయిబాబా జీవన్మరణ పోరాటం చేస్తున్నాడు. దేశ రాజధాని మొగదాల రైతులు అతి పెద్ద సామూహిక ప్రతిఘటన సాగిస్తున్నారు. ప్రేమ లేని లోకంలోకి సాయిబాబా జైల్లోంచే కబీర్ ప్రేమ సందేశాన్ని పంపించాడు. సరిగ్గా వర్మ కబీర్ ప్రేమను, రైతాంగ పోరాటాన్నీ మేళవించారు. కవిత్వంకాగల అంశాన్ని గుర్తించి పట్టుకోవడమంటే ఇదే.
అవునిప్పుడు
ప్రేమను పంచమంటాడు కబీర్
కబీర్ అంటాడు దాహంతో ఉన్నవాడికి
నీ రక్తమోడిన దేహంతోని కాసిని నీళ్లు పోయమని
ఆకలైనవాడికి కాసింత అన్నం కాగలవా అని
అడుగుతున్నాడు కబీర్
రైతు ప్రేమ జీవి కదా
మట్టి మీద మమకారం ఉన్నవాడు కదా
ఈ నేలను తన నెత్తుటితో పునీతం చేస్తున్నవాడు కదా
ఒకసారి లేచి రైతుకు నమస్కరిద్దాం
ఈ మట్టిని కాసింత పిడికిలితో ఎత్తిపడదాం
ప్రేమను, శ్రమను ఎత్తిపట్టిన కవిత ఇది. కవిత్వం.. ఆ మాటకొస్తే ఏ కళా రూపమైనా పాఠకులకు ఒక దర్శనం కలిగించాలి. ఆ వైపు నుంచి ఈ కవితను చూడండి. రైతాంగ ఉద్యమంలోని రాజకీయార్థిక, పోరాట విశ్లేషణల కంటే భిన్నమైన ఎరుక కలుగుతుంది. ఆ పని రాజకీయ కవిత్వమే చేయగలుగుతుంది. సరిగ్గా ఇలాంటి ఇంకో ప్రతిఘటనపై వర్మ స్పందించారు. విప్లవోద్యమాన్ని లక్షల సంఖ్యలో భారత సైన్యం చుట్టుముట్టిన వేళ సహజంగానే ఆ వైపు నుంచి ప్రతిఘటన వస్తుంది. జీరగూడెం ప్రజా ఘటన అలాంటిది. దాని గురించి విని అంతంత మాత్రం ప్రగతిశీల వాదులకు గుండె జారిపోయి ఉంటుంది. లేదా ఎన్నడూ లేనంతగా ‘మానవత’ తొంగి చూసి ఉంటుంది. అటూ ఇటూ కాకుండా మధ్యలో కూచొని మేధో సూత్రీకరణలు చేసి ఉంటారు. కానీ వర్మ దాన్ని ‘యుద్ధానికి ఆవల’ అంటారు. అదీ చూడాల్సిన రాజకీయ కోణం. ఆయన ఏమంటారంటే..
పేలిన ప్రతి తూటాకు కళ్లుంటే
తను వెళ్లే దిక్కు చూపేది
నోరుంటే సాక్షిగా మారేది.
రైతాంగ ప్రతిఘటనను కబీర్ ప్రేమ వైపు నుంచి, జీరగూడెం ప్రతిఘటనను యుద్ధానికి ఆవలి వైపు నుంచి చూశారు. ఈ రెండు చూపులతో ఆ రెండు కవితల శిల్ప చర్చ కూడా చేయవచ్చు. జార్జి ఫ్లాయిడ్, వివి, సాయిబాబాల మీది నిర్బంధాన్ని పోల్చుతూ రాఆసిన మల్టీ లేయర్ పోయెం మూడు సందర్భాలు చాలా సరళమైన కవిత్వ నిర్మాణానికి మంచి ఉదాహరణ. ఇది ఇలా ఎందుకు రాశారని అనిపిస్తుంది. చివర్లో ‘ఈ ప్రశ్నలకు అంతు లేదు, మీరు జవాబు కాగలరా?’ అనే రెండు వాక్యాలు ఉన్నాయి. వర్మ ఈ ప్రశ్న వేయడానికి తగినట్లుగా పై మూడు స్టాంజాల కవిత్వాన్ని ఆ పద్ధతిలో నిర్మించారు. దళితుడి శిరోముండనం ఘటనపై రాసిన ‘అసహ్యం’ కవిత కూడా సరిగ్గా ఇలాంటిదే. పైది ఒక ఆలోచనాత్మక ప్రశ్నతో ముగిస్తే, ఇది ఆగ్రహంతో ముగుస్తుంది.
మేం తల్చుకుంటే
మీ అశుద్ధంతోపాటుగా
మిమ్మల్నీ ఊరవతల పారబోయగలం.. అంటారు. ఇలా సరళ నిర్మాణాలు ‘రెప్పల వంతెన’లో తక్కువ. వస్తు స్వభావాన్నిబట్టి, ఫోకస్ పాయింట్‌ను బట్టి కవిత్వం నిర్మించే ఈ పద్ధతి ఈ నాలుగో సంపుటిలో బాగా వచ్చింది.
అట్లాగే కశ్మీర్ గురించి రాసిన ‘కుంకుమ పూల దు:ఖం’, ‘ఆజాదీ’ కవితలు అత్యుత్తమమైనవి. కశ్మీర్ సహా ఈ కాలం పొడవునా కలిగిన గాయాలను, కన్నీళ్లను ఒడిసిపట్టి రాసిన కవిత దు:ఖాంతం. ఇది ఈ సంపుటికే ప్రాతినిధ్య కవిత అనవచ్చు.
కొన్ని గాయాలు చికిత్సకందవు
కొన్ని కరచాలనాలు మరపు రావు
కొన్ని మాటలకు శబ్దముండదు
కొన్ని పాటలు గొంతు దాటిరావు
కొన్ని క్షణాలు ఊపిరినిస్తాయి
కొన్ని సమయాలు పరిమళిస్తాయి
కొన్ని జీవితాలు దు:ఖాంతమవుతాయి
చివరిగా తడి అంటిన పూలు సమాధిని తాకుతాయి..
రాజకీయాలంటే ఏమిటో తెలిసినవాళ్లే ఇంత ఆర్దృ వాక్యం రాయగలరు. ఇందులోకి రక్తం, తిరుగుబాటు, మానవాళి చేరుకోవాల్సిన ఆకాంక్ష రాకుండా ఎందుకు ఉంటాయి. భూమి రంగు మనుషులు సంపుటిలో అవీ ఉన్నాయి. వర్మ ఒక అద్భుతమైన మాట రాశారు.
నువ్వంటావు
నెత్తురు పదం అంటకుండా
రాయలేవా అని
అప్పుడది జీవితం అవుతుందా?
జీవితాన్ని రాయాలని అనుకున్నప్పుడు అందులోకి అన్నీ వస్తాయి. అన్నీ ఎలా రాయాలన్నదే విప్లవ దృక్పథం. విధ్వంసమైపోతున్న పరిసరాలను మానవులు మార్చవలసి ఉన్నది. తమను తాము మార్చుకోవలసి ఉన్నది. దాన్ని విప్లవమని అనడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఉన్నదంటే అనుమానించాల్సిందే. మనుషులందరూ కలిస్తే ఘటిల్లే అద్భుతం విప్లవం. వర్మ దాన్ని ఎక్కడెక్కడ చూశారో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘పిల్లలు’ అనే కవిత్వంలో ‘పిల్లలు నీకూ నాకూ మధ్య ఓ పూల వంతెన కదా?’ అంటారు. అదీ విప్లవ దృక్పథం!
ఆయనలో ఇది ఎంతగా జీర్ణమైపోయిందో తెలుసుకోడానికి ఈ సంపుటి నిదర్శనం. కవిగా ఇప్పటికే ఆయనను ఎరిగిన వారికి ఈ సంపుటిని చదవడం గొప్ప అనుభవం. ఆయన విస్తృతిని తెలుసుకోవడమే కాదు. పాఠకులుగా మన మనో కౌవారం పెరుగుతుంది. మన స్పందనా గుణం లోతును సంతరించుకుంటుంది. ఆయన ఈ మధ్య ఓ కవితలో ఓ మాట అంటారు. అదేమంటే.. నడుస్తూ మాట్లాడుకుందాం..అని. అనేక తాత్విక అర్థాలున్న మాట అది. సంక్షోభ వేళల్లో పని మానేసే వాళ్లుంటారు. మాట్లాడటం మర్చియే వాళ్లుంటారు. నడక ఆపి పండిత చర్చల్లో తలమునకలయ్యేవాళ్లు ఉంటారు. ఏమీ తేలలేదని, దారి లేదని, కొత్తగా కసరత్తు మొదలు పెట్టాలని సమర్థించుకొనే వాళ్లుంటారు. కానీ నడుస్తూ మాట్లాడుకోవాల్సిందే. నడుస్తూ కవిత్వాన్నల్లవలసిందే. నడుస్తూ వాస్తవ, సృజన లోకాలన్నిటికీ విస్తరించాల్సిందే. దగ్గరి దారి లేదు. ఆ పని చేయాలంటే మనం భూమి రంగు మనుషుల దగ్గరికి వెళ్లాల్సిందే. వర్మ తాను అలా వెళుతూ, తన కవిత్వపు ఊసులు మనకు చెబుతూ, మనతో కలిసి నడుద్దామనుకున్నారు. అందరమూ ఆయనతో అడుగులు కలుపుదామా?
(‘భూమిరంగు మనుషులు’ కవిత్వం పుస్తకానికి పాణి ముందుమాట. విరసం 28 వ మహాసభలకు రాబోతుంది. )