మైదానాల్లో ఆంబోతుల అకృత్యాలకు
తల్లులు సాధు మాతలు తల్లడిల్లుతున్నారు
ఒకనాడు సైన్యానికి ఎదురుగా
దిశమొలగా నిలబడ్డ ధిక్కారాలు
నేడు పొరుగువాడి దౌర్జన్యం ముందు
తలదించుకుంటున్నారు.
మైదానాల్లో చెలరేగిన చర్య
లోయలను వణికించే పదఘట్టన
ప్రతిచర్యలు చిందించే హింసోన్మాదంలో
నిస్సహాయ జాతులు అణిగిపోతున్నాయి .
నెపాలను మోపుతూ ఒక కుట్ర
దురాలోచనలు దట్టించిన ఒక వ్యూహం
ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఒక ప్రణాళిక
మణిపూర్ కు మంటల హారాన్ని తలకెత్తుతున్నవి.
పరిణామాల విస్తీర్ణాన్ని
వాస్తవాల వ్యాసార్ధం కొలవలేనప్పుడు
అతలకుతల తలమే అడవిగా నిలబడుతుంది.
జరుగుతున్నదంతా అలవిలేని దృశ్యమై
బోరవిడిచి హింసాంగమై చెలరేగినపుడు
సున్నితత్వం నలిగి బండబారుతుంది.
కదలిపోయిన చరిత్రలకు వక్ర కషాయాలద్దే
రాజ్యనేతల దుష్క్రియాపరత్వం పడుగుపేకై
మరణవస్త్రాన్ని అల్లుతుంది.
ఇప్పటి పరిణామాలన్నీ
చిక్కుముడులు పడ్డ యితివృత్తాలు
సాపుజేయాల్సిన సూత్రధారులు
చిక్కుల పెంచీ మడతలు పేడిన పేచీలు.
ఇప్పటి సూత్రీకరణలన్నీ
మసిబూసిన మారేడు కాయలు
నెపాలు మోస్తున్న సమూహాల పాలిటి బలిపీఠాలు.
చినుకు చినుకు గా
ఒక ఆవేదన చిందుతున్నది
హిమాలయాల నుంచి నీలగిరులదాకా
ఒక అవమానధార స్రవిస్తున్నది
దిగంబరంగా రాజ్యమేలుతున్న దౌష్ట్యాల భారానికి
అవనతమవుతున్నది దేశపు జెండా.
చినుకు చినుకు గా ఒక చింతన రగులుతున్నది
వంకై వాగై పొంగే ప్రజాగ్రహాన్ని రచిస్తున్నది.
ఇకనైనా పెళ్లుబికే ప్రతివ్యూహానికి
తెరతీయాలి ప్రజాచేతన.
*
Related