1.నో కేస్ట్ నో రెలిజియన్ అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది.. ?

   మీ ప్రశ్న చిన్నదే ..  అయితే  ఈ ప్రయత్నం వెనక ఒక  పెద్ద ప్రయాణం ఉంది..  ఈ ఆలోచన వెనక   నా/ మా   జీవిత సంఘర్షణ  ఉంది.  అందువల్ల  కొద్దిగా  ఆ నేపథ్యం  చెప్పాలి.. వీలయినంత సంక్షిప్తంగా చెప్పడానికి  ప్రయత్నిస్తాను.   నా చిన్నతనం అంటే హై స్కూల్ / 10వ తరగతి వరకు  నేను ఒరిస్సా   రాష్ట్రంలోని  సుందరగడ్  జిల్లా బండముండ అనే ఊరిలో  చదువుకున్నాను.  మా నాన్న దువ్వూరి వీర వెంకట సత్య సూర్య దుర్గా ప్రసాద్ రామారావు , అమ్మ  యశోద.  నాన్న   రైల్వే ఉద్యోగి కావడం వల్ల  దాదాపు  40 ఏళ్ళు అంటే 1998 లో నాన్న   రిటైర్  అయ్యేదాకా  ఒరిస్సా లో ఉన్నాం.   రైల్వే క్వార్టర్ లో  ఉండేవాళ్ళం.    నేను వచ్చిన సామాజిక నేపథ్యం వల్ల, ఇంట్లో కుల , మత విశ్వాసాలు , ఆచార వ్యవహారాల  వల్ల  సాటి మనుషులతో అంటు, ముట్టు,    మనుషులను దూరం పెట్టడం వంటివి  నా అనుభవంలో ఉన్నాయి.. అవి నాకు ఇబ్బందిగా ఉండేవి.. ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థితి.  నేను   ఇంటర్మిడియెట్  చదువు కోసం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు  తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం వచ్చాను . ఎస్ ఆర్ వి బి ఎస్ జె బి  మహారాణీ కళాశాల లో  ఎం పి సి కోసం ప్రయత్నించి , సీటు దొరక్క  బై పి సి  లో జాయిన్ అయ్యాను.   అక్కడ  మిత్రుడు మొహమ్మద్ ఇబ్రహిం పరిచయంతో ప్రగతిశీల సాహిత్యం  , మార్క్సిస్టు ,  కమ్యునిస్ట్ భావాలు పరిచయమయ్యాయి..  ఆ భావజాలం నన్ను    ” కూటికి పేద  అయినా , కులానికి కాదు ”  అనేటటువంటి   తప్పుడు పోకడలకు  పోకుండా నన్ను  కాపాడాయి.  అదే  క్రమంలో     శివ వర్మ రాసిన ” సంస్మృతులు ”   పుస్తకం  నాకు దేశ  స్వాతంత్రం కోసం  తమ ప్రాణాలిచ్చిన    భగత్ సింగ్, చంద్ర శేఖర్ అజాద్ , రాజ్ గురు , సుఖ్ దేవ్ ల జీవితాలను పరిచయం చేసింది.. ప్రజల స్వేచ్ఛ , స్వాతంత్రాల కోసం  వారు చేసిన  సాహసం,  ప్రాణ త్యాగం నన్ను ఎంతో కదిలించింది.. శ్రీశ్రీ మహాప్రస్థానం , చలం సా హిత్యం , ఎలెక్స్ హేలీ ఏడు తరాలు, జాక్ లండన్ ఉక్కు పాదం, రావిశాస్త్రి  ఆరు సారా కథలు  ఇలా తరవాత అనేక పుస్తకాలు  నా ఆలోచనలను మార్చేశాయి .. ఇంటర్మీడియేట్ తరవాత   కాకినాడ పి  ఆర్ కాలేజీలో బి ఎస్ సి చదువుతూ  మెడిసిన్ లో  సీటు సాధించాలనే లక్ష్యంతో   మొత్తంగా   3 సార్లు  ఎంసెట్    పరీక్ష రాసాను .. మూడోసారి  వ్యవసాయ బి ఎస్ సి కోర్సులో సీటు వస్తే  బాపట్ల కళాశాలలో  జాయిన్ అయ్యాను..  నా ప్రగతిశీల ఆలోచనలు   వ్యవసాయ బి ఎస్ సి   లో   మిత్రుడు ఉమాశంకర్ ని కలిసాక కొనసాగాయి..   బాపట్ల వ్యవసాయ కళాశాలలో  కులపరంగా  స్నేహాలు , గ్రూపులు ఉండేవి..  మావి వేరు వేరు సామాజిక నేప థ్యాలు  కావడం వల్ల  బాపట్లలో   మా స్నేహానికి ఇబ్బంది వాటిల్లుతోందని నేను , ఉమా శంకర్ హైదరాబాద్  లోని రాజేంద్రనగర్   వ్యవసాయ  కళాశాలకు  ట్రాన్స్ఫర్  పెట్టుకుని వచ్చేసాం..  హైదరాబాద్  వ్యవసాయ కళాశాలలో    మిత్రుల వల్ల  నాకు   ప్రగతిశీల  విద్యార్థి రాజకీయాలు ,  వర్గ రాజకీయాలు  పరిచయమయ్యాయి.. నా ఆలోచనలు ఉన్నతీకరించిన  మిత్రులంతా ప్రధానంగా  దళిత , బహుజన సామాజిక  నేపథ్యాల నుంచి వచ్చిన వారే .. నా ఆలోచనల పై ఎంతో  ప్రభావం వేశారు.. మనుషులను కులం పేరిట , మతం పేరిట అవమానించడం నన్ను ఎప్పుడూ  చాలా వేదనకు గురిచేసివి.  సామాజిక అంతరాలు , అంటరానితనం  గురించి  అర్థం చేసుకోవడానికి  డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, పెరియార్  వంటి  సామాజిక వేత్తల  ప్రభావం నా పై ఉంది. భూస్వామ్య  హిందూ  బ్రాహ్మణీయ భావజాలానికి  , కుల దుర అహంకారానికి  వ్యతిరేకంగా పోరాడకుండా  మార్పు  సాధ్యం కాదని  అర్థం అయింది. ఈ పరిస్థితి మారాలి అంటే , అందుకోసం వీలయిన పద్ధతుల్లో ప్రతి ఒక్కరం పోరాడాలి ,  ప్రయత్నించాలి అని అర్థం అయింది..  

వ్యవసాయ బి ఎస్ సి చదువు అయ్యాక ఇంటి వద్ద ఆర్ధిక ఇబ్బందులు, నాన్న ఆరోగ్య  పరిస్థితి , ఇతర కారణాలతో  ఇక పి జీ  విద్య కు ప్రయత్నించకుండా ధనుకా పురుగుల మందుల కంపెనీ లో  మార్కెటింగ్ జాబ్ కు జాయిన్ అయ్యాను .. రెండేళ్లు ఆ ఉద్యోగం చేసాక పర్యావరణ దృష్టి తో కొంత , అనవసరంగా  పురుగు  మందుల కొనుగోళ్లు ప్రోత్సహించి రైతులను మోసం చేస్తున్నాననే అపరాధ  భావన తో మరికొంత ,  కొంతమంది   మిత్రుల  ప్రోత్సాహంతో  మొత్తానికి  పురుగు మందుల కంపెనీలో  ఉద్యోగం మానేసి ,  పురుగు మందులు వాడకుండా, సహజ పద్ధతులతో  చేసే వ్యవసాయ కార్యక్రమం లో  ప్రోగ్రామ్ ఆఫీసర్ గా   హైదరాబాద్  కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫార్ వరల్డ్ సాలిడారిటీ అనే ఒక స్వచ్చంద సంస్థలో జాయిన్ అయ్యాను.. అక్కడే నాకు క్లారెన్స్ సహ ఉద్యోగిగా  పరిచయం అయ్యింది.. కాల క్రమంలో  మా  స్నేహం , ప్రణయంగా , పరిణయంగా పరిణమించించింది. మాది కులాంతర , మతాంతర  వివాహం …  నా పెళ్లి విషయంలో  నా నిర్ణయానికి మా ఇంట్లో  తల్లిదండ్రులు, అన్నదమ్ములు చాలా బాధపడ్డారు., ఇబ్బంది పడ్డారు , నాతో ఘర్షణ పడ్డారు. తరవాత కొద్ది కాలానికి సర్దుకున్నారు.  2000 అక్టోబర్ 17 న   హైదరాబాద్ లో     అనవసర ఖర్చులు, ఆర్భాటాలు  లేకుండా చాలా సింపుల్  గా మేము స్టేజ్ మ్యారేజ్  చేసుకున్నాం.. నా వైపు   పెద్దలుగా బాధ్యత వహిస్తూ  వరవరరావు గారు , హేమక్క , కులనిర్మూలన పోరాట సమితి అప్పటి అధ్యక్షులు  ప్రొఫెసర్   సత్యనారాయణ , ఇంకా  కొద్దిమంది ప్రజాసంఘాల మిత్రులు , నాయకులు , స్నేహితులు పాల్గొన్నారు..  క్లారెన్స్ తరఫున  వాళ్ళ  నాన్నగారు సలాది కృపానందం (  అమ్మ  పొట్టి   క్లారా కేథరీన్ 1999 లో చనిపోయారు ) , వాళ్ళ మావయ్య  తాళ్ళూరి పాల్  రామారావు , అక్క  కరుణ రంజని ,  బావగారు డాక్టర్ వారా వెంకట్రావు  సహా కొద్దీ మంది బంధు, మిత్రులు పాల్గొన్నారు..  ఎటువంటి  కుల , మత సంప్రదాయాలతో  నిమిత్తం లేకుండా  అటు , ఇటు నలుగురు పెద్దల మాటలతో  , మిత్రుల ఆప్త వాక్యాలతో  ప్రత్యామ్నాయ  పద్ధతిలో  మేము ఒక్కటయ్యాము ..  ఒక  ప్రేమ చిహ్నంగా  వికసించిన  ఈ భాగ్యనగరంలో , అనేక ప్రాంతాల  , వివిధ  భాషా ,  సంస్కృతులు , విశ్వాసాలు కలిగిన  ప్రజల జీవన సమాహారంగా  పరిణమించిన ఈ భాగ్యనగరంలో ,  అనేకానేక   జీవన శకలాలలో  మా ప్రేమ కథ కూడా ఒకటి. 

 మేమిద్దరం రకరకాల కారణాలతో , అవసరాల రీత్యా  ఉద్యోగాలు మారం.. మాది కులాంతర, మతాంతర వివాహం కావడంతో  హై టెక్  నగరంగా   చెప్పుకునే  హైదరాబాద్ లోను ఇల్లు అద్దెకు వెతుక్కునే క్రమంలో   కుల, మత సంబంధ   వివక్షలు అనేక  రూపాల్లో  వ్యక్తమయ్యేవి.. మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు.. వారి పేర్లు  స్పందన , సహజ అని పెట్టుకున్నాం.. వేరు వేరు  సామాజిక నేపథ్యాల మా  సహచర్యాన్ని  దృష్టిలో పెట్టుకుని పిల్లలకు మా ఇద్దరి  ఇంటిపేర్లను కలిపి పెట్టాం.  క్లారెన్స్ క్రిస్టియన్ విశ్వాసాలు  కలిగి ఉన్నా, నాకు ఏ మత  విశ్వాసాలు  లేకున్నా  మా పిల్లలకు ఎటువంటి కుల, మత  విశ్వాసాలు ఆపాదించవద్దని నిర్ణయించుకున్నాం.  పిల్లలకు 18 ఏళ్ళు  దాటాక ,  వారు  మేజర్ లు అయ్యాక వారికి ఇష్టమున్న విశ్వాసాలను ఎంపిక చేసుకోవచ్చని , అది వారి స్వేచ్ఛకు వదిలివేయాలని అనుకున్నాం..   

మేము అనుకుంటే సరిపోదు కదా .. అందుకు అనుకూలమయిన , ఇముడ్చుకునే  వ్యవస్థాగత అమరికలు కూడా ఉండాలి కదా.. అలా  లేనప్పుడు అటువంటి ప్రశ్నలు ప్రజాస్వామిక  ఆకాంక్షలుగా సమాజం ముందుకు  వస్తాయి .. మా పెద్దమ్మాయిని జాయిన్ చేసిన స్కూల్ లో  పాప ”  మతం ” వివరాలు రాయవలసిన అవసరం రాలేదు . కానీ చిన్నమ్మాయిని 2009 నవంబర్/ డిసెంబర్ లలో  మరొక  స్కూల్ లో   జాయిన్ చేయడానికి  వెళ్లినపుడు  అక్కడ  అప్లికేషన్ లో  ” మతం ” అనే కాలమ్  నింపాలని అన్నారు.. నా సహచరి క్లారెన్స్  వెంటనే  స్కూల్ నుంచి   నాకు  ఫోన్ చేసి  విషయం చెప్పింది..   అప్పుడు నేను ..   మనం ఆలోచించి , నిర్ణయించుకుందాం.. వెనక్కు వచ్చేయమని  అన్నాను..  తరవాత  స్కూల్  ప్రిన్సిపాల్ తో  మా వివాహం గురించి, పిల్లలను  కుల, మతా లకు అతీతంగా  పెంచడానికి మేము తీసుకున్న నిర్ణయం గురించి   మాట్లాడగా – అలా సాధ్యం కాదని ,  తల్లిదో , తండ్రిదో మతం రాయవలసి ఉంటుందని  ఆమె  అన్నారు.. లేకుంటే అటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు లేక జి ఓ  వంటివి ఉంటే  తీసుక రమ్మన్నారు.. అన్ని వివరాలు  ఇవ్వకపోతే  ,  స్కూల్  టి సి  తీసుకునేటపుడు, భవిష్యత్తులోను   సమస్యలు ఎదురవుతాయని  చెప్పారు.    అలా   మా పోరాటం మొదలు అయ్యింది.   ఇక  మేము  డి ఇ ఒ , కమిషనర్ ఎడ్యుకేషన్ సహా , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కలిసాం .. ఫలితం లేదు .

ఇక మిత్రులు, అప్పటి  ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకులు డి . సురేష్ కుమార్ గారి సహకారంతో   ఉమ్మడి   ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర హైకోర్టులో  రిట్ పిటిషన్ వేసాం..  2010 ఏప్రిల్ 24న అప్పటి హై కోర్టు జడ్జ్  సి వి నాగార్జున రెడ్డి గారు ” మతం నమ్మడానికి హక్కు ఉందంటే  , ఏ మతమూ ఆచరించకుండా ఉండడానికి హక్కు ఉన్నట్లేన ” ని  చెబుతూ , పిటిషనర్ ను అంటే మమ్మల్ని  మతం రాయమని ఒత్తిడి చేయవద్దని , మతం  రాయనిరాకరించినందున  అడ్మిషన్ తిరస్కరణ  కుదరదని  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు..  అలా మా పోరాటానికి ఒక ఆలంబన దొరికింది.. ఆ ఆలంబనతో చిన్నమ్మాయి సహజను ” మత రహితం కుల రహితం ” అని అప్లికేషన్ నింపి జాయిన్    చేశాము..  తరవాత పెద్దమ్మాయి స్పందనను  అదే స్కూల్ లో   ” మత రహితం కుల రహితం ” అని రాసి జాయిన్ చేసాం .. 2017 లో పెద్దమ్మాయి 10 వ తరగతి టి  సి  కూడా  ” మత రహితం కుల రహితం ”  అని  తీసుకున్నాం..  అయితే  ఇంటర్మీడియట్  లో ఫీజు కట్టేటపుడు  ఆన్లైన్ అప్లికేషన్ లో మాలాంటి వారికి  మత  రహిత   ఆప్ షన్  లేదు..  ఇలా ప్రతి సందర్భంలో  కొట్లాడాల్సిన పరిస్థితిలో  ఆన్లైన్  అయినా , ఆఫ్ లైన్ అయినా     ” మత రహితం కుల రహితం ”  అనే   అస్తిత్వ  ప్రకటనకూ  అవకాశం ఉండాలని  2017 లో తెలంగాణ  హై  కోర్టు లో ప్రజాప్రయోజన  వ్యాజ్యం వేసాం .. మాకు   2010లో  రిట్ పిటిషన్ వేసి సహకరించిన డి సురేష్ కుమార్ గారే  మా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా వేశారు.   ఆన్లైన్ లో ” నో రెలిజియన్ నో కేస్ట్    చేంజ్ డాట్ ఆర్గ్  పిటిషన్ ”  ( No Religion No Caste Change dot org Online Petition )  మొదలు పెడితే  2022 ఆగస్టు 30 నాటికి 55,394 సంతకాలు అయ్యాయి.. మాకు మద్దతుగా  సంతకాలు చేసిన వారిలో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ,దేశంలోని  వివిధ రాష్ట్రాలకు చెందినవారు, అనేక ఇతర దేశాలలోని భారతీయులు , విదేశీయులు కూడా  ఉన్నారు . మా ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో  డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్  ( డి.టి.ఎఫ్ ) సంస్థ కూడా  మాతో  ఇంప్లీడ్ అయింది.  పెద్దమ్మాయి ఇంటర్మీయట్  టి సి , చిన్నమ్మాయి 10 వ తరగతి టి సి లు   ” మత రహితం కుల రహితం ”  అని తీసుకున్నాం.. మా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( పిల్)  నంబర్  66/2017  పై ఇంకా తుది తీర్పు వెలువడవలసి ఉంది. 

2. గతంలో ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయా  ? 

ఈ పోరాటం లో మేము మొదటి వాళ్ళం కాదు ,  సమస్య  ఇంకా పరిష్కారం కాలేదు కాబట్టి  మేము  చివరి వాళ్ళమూ  కాదు.. ఈ ప్రశ్న  అనేక సందర్భాలలో ముందుకు వచ్చినా  ఆయా ప్రభుత్వాలు   పరిష్కారం   చూపలేదు..  

ఒక్కొక్క స్కూల్ లో ఒక్కో పధ్ధతి అనుసరించడం,  సాధారణంగా   విద్యా , ఉద్యోగ విషయాల్లో  దరఖాస్తు చేసుకునే సమయం లో  ఉండే సమయాభావం వల్ల  ఎక్కువ సందర్భాలలో తల్లిదండ్రులలో  తండ్రి కుల , మత వివరాలు నింపేయడం జరిగినట్లు కొందరి అనుభవాల నుంచి తెలిసింది. ఆయా  సందర్భాలలో వ్యక్తిగతంగా ఏమయినా ప్రయోగం చేసినా  అటువంటివి  వ్యక్తిగత విషయంగా ఉండిపోయాయి తప్ప ఒక విధానంగా  రూపొందలేదు.. అయితే ,  మత  భావన ఎంత పురాతనమో , అంతకన్నా పురాతనమయినది మత రహిత భావన. మత  భావనతో ఘర్షణ పడుతూనే మన దేశంలో లోకాయుతులు, చార్వాకులు , ఇంకా అనేకులు బయలుదేరారు. మన  జనాభా లెక్కలలోనూ  ఆరు మతాలకు ( హిందూ , ముస్లిం, క్రిస్టియన్ , బుద్ధిజం , జైనిజం ,  సిక్కిజం)  చెందిన  వారిని గుర్తిస్తున్నారు .. 7వ అంశంగా  మా లాంటి వారిని  ” మతం చెప్పని వారు ” ( Religion Not Stated ) గా గుర్తిస్తున్నారు. ఇది సరి కాదు .. మేము మతం చెప్పని వాళ్ళం కాదు.. ఏ మతం ఆచరించనివాళ్ళం..  మా కోవలోకి  ఈ దేశంలోని   అనేక మంది మార్క్సిస్టులు , కమ్యూనిస్టులు , నాస్తికులు , మానవతా వాదులు వస్తారు.. అందువల్ల 2021 జనాభా లెక్కలు  నడుస్తున్న ఈ సందర్భం లో ,  అనేక అస్తిత్వాలను  గుర్తిస్తున్న మనం  ” మత రహితం, కుల రహితం ” అనే మరొక  అస్తిత్వాన్ని గుర్తించవలసిన  అవసరం  ఉంది. ఈ క్రమంలో ఒక  ఉత్సాహం కలిగించే విషయం ఏమంటే 2019 లో  తమిళనాడు  తిరుపత్తూరు కు చెందిన  ఎం ఏ స్నేహ  గారు  తాను   ” మత  రహితం , కుల రహితం ” అని ఎం ఆర్ ఓ గారిద్వారా   వ్యక్తిగత స్థాయిలో సర్టిఫికెట్ ను  తన   9 ఏళ్ల   పోరాటంతో సాధించారు. అలాగే  మన తెలంగాణ   రాష్ట్రం  నుంచి  డేవిడ్ , రూప దంపతులు వాళ్ల  అబ్బాయి ఇవాన్ రుడే  బర్త్  సర్టిఫికేట్ ను   ” మత  రహితం , కుల రహితం ” గా  ఇవ్వమని కొత్తపేట మునిసిపాలిటీ లో కోరగా  అధికారులు ఆన్లైన్ లో అలాంటి అవకాశం లేదని తిరస్కరించారు .. వాళ్ళు కూడా  మన రాష్ట్ర హై  కోర్టులో రిట్ పిటిషన్ వేసి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు..  బాబు కి  ఇటీవల 3 సంవత్సరాలు పూర్తయ్యాయి.  బర్త్  సర్టిఫికేట్ , ఆధార్ గుర్తింపులు ఇప్పటికీ   రాకపోవడంతో , స్కూల్ యాజమాన్యానికి  తమ సమస్య  చెప్పుకుని,  కొంత సమయం  కోరుతూ  బర్త్  సర్టిఫికేట్ , ఆధార్ గుర్తింపులు లేకుండా  స్కూల్ లో జాయిన్ చేశారు.  ఇలా మన దేశంలో అనేక మంది  మత  రహిత , కుల రహిత అస్తిత్వంకోసం పోరాడుతున్నారు.   2022 ఆగస్టు 12 న కేరళ హై  కోర్టు  జడ్జ్  వి జి అరుణ్ గారు  ఈ డబ్ల్యూ ఎస్ కోట  రిజర్వేషన్ కింద అర్హులైన  మత రహితులు , కుల రహితులను కూడా గుర్తించి వారికి  ఈ డబ్ల్యూ ఎస్ కోట  రిజర్వేషన్ వర్తింపజేయాలని  కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఇదొక మంచి పరిణామం.  ఇవన్నీ మా పోరాటానికి బలం చేకూరుస్తున్న అంశాలే . 

3. పీడిత కులాలకు సంబంధించినంత వరకు కుల ప్రకటనలో ఆత్మగౌరవ సూచన ఉన్నది. అలాగే సామాజిక
సమానత్వానికి రిజర్వేషన్లు ఒక చిన్న సాధనం అని కూడా రుజువైంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ పిల్లలకు కులం లేదు, మతం లేదు అని సర్టిఫికెట్‌ కావాలనుకోడాన్ని ఎలా సమర్ధించుకుంటారు?

మీరన్నది నిజం.. ఇవ్వాళ మన దేశంలో పీడిత కులాల  ప్రజలకు తమ  కుల అస్తిత్వ ప్రకటన  ఒక ఆత్మ గౌరవ సూచికగా ముందుకు వచ్చింది ..  విద్య, ఉద్యోగాల్లో  ( ముఖ్యంగా   ప్రభుత్వ రంగంలో )  రిజర్వేషన్లు  సామాజిక సమానత్వాన్ని సాధించడానికి  ఒక మేరకు ఉపయోగపడుతున్నాయి..  ఓట్ల రాజకీయాలు చేస్తున్న పాలక వర్గాలు  అస్తిత్వ చైతన్యాన్ని  తమకు అనుకూలంగా    ఉపయోగించుకుంటున్నాయి.. . ఇక  మా పోరాటానికి వస్తే , మేము అడుగుతున్నది రిజర్వేషన్ స్ఫూర్తికి  ఏమాత్రం  వ్యతిరేకం కాదు.. వాస్తవానికి దళిత , బహుజన నేపథ్యం ఉన్న అనేక మంది మిత్రులు  మత  రహిత , కుల రహిత అస్తిత్వాన్ని  తాము కూడా అనుసరించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పి , మమ్మల్ని ప్రోత్సహించారు.. దళిత నేపథ్యం ఉన్న మిత్రులు , జర్నలిస్ట్  సువర్ణ కుమార్ గారు మమ్మల్ని గట్టిగా బలపర్చడమే కాదు .. తాను స్వయంగా రిజర్వేషన్ వదులుకున్నట్లు చెప్పారు… తరతరాల ఆధిపత్య  కుల అణిచివేతను సరిచేయడంలో భాగంగా ఒక సామాజిక  పరిష్కారంగా , ఒక హక్కుగా వచ్చిన  రిజర్వేషన్  ఎందుకు వదిలేశారని  సువర్ణ కుమార్ గారిని  నేను  అడిగితే , ఆయన – నేను  ఉన్న  పరిస్థితి లో  నాకు రిజర్వేషన్ అవసరం లేదని అనుకున్నాను .. నేను వద్దనుకున్నాను ,  అయితే, నిజంగా అవసరమున్నవారికి ఆ రిజర్వేషన్  ఉపయోగపడతుంది కదా  అని ఆయన  చెప్పినపుడు  నాకు చాలా ఉత్సాహం కలిగింది .. ఆయన ఇంకో మాట కూడా అన్నారు.. పోరాడితే  పోయేది  ఏమీ లేని ( రిజర్వేషన్ ప్రయోజనం వంటివి  ) మీలాంటోళ్ళు  ఇలా  ముందుకు రావాలన్నారు..  అప్పుడు నేను – నేపథ్యం రీత్యా మా పై  మేము   పోరాడి   ఆధిపత్య కుల స్వభావాన్ని  వదుల్చుకోవాల్సి   అవసరం  ఉందని అన్నాను .. డీ కాస్టిఫై  అవ్వడం లో ఇలాంటి చైతన్యం అవసరం అని నేను అనుకుంటున్నాను .. సామాజిక  రిజర్వేషన్లు  ఎంత న్యాయమైనవో  , రకరకాల కారణాల వల్ల   మత  రహిత , కుల రహిత అస్తిత్వం కోరుకునే వారికి అటువంటి అస్తిత్వ ప్రకటనకు అవకాశమివ్వడం అంతే  న్యాయం,   ప్రజాస్వామికం.  ఒక గ్యాస్ సబ్సిడీ  వదులుకోవడానికి, ఒక  ప్రభుత్వ పథకం ఏదైనా  వదులుకోవడానికి  ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చినట్లు  కుల , మత  అస్తిత్వం వదులుకునే వారికి కూడా   అన్ని దరఖాస్తు ఫారాలలో ఒక కాలమ్  ఇవ్వాలి.. అలా ఇవ్వడం వలన  వాస్తవానికి   రిజర్వేషన్లు పొందేవారికి , ఏవైనా ప్రభుత్వ పథకాలు పొందే సామాన్య ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది.  అనవసర పోటీ, ఒత్తిడీ తగ్గి నిజమైన అర్హులకు దారి చూపుతుందని నేను నమ్ముతున్నాను.  అలాగే అనేకమంది సామాజిక ఉద్యమకారులు కలలు  కన్న  కుల, మత పరిధులకు  వెలుపల మానవత్వం మరింత బలంగా  వికసిస్తుందని  నమ్ముతున్నాను. 

4. దీని వల్ల మీకు పీడిత కులాల మిత్రుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి?

కొంత మంది  మా ప్రయత్నాన్ని  మేము   వ్యక్తిగత గుర్తింపు కోసం , ఒక సంచలనం కోసం   చేస్తున్నట్లు  అనుకున్న వారూ  ఉన్నారు.  మా  ప్రయత్నం రిజర్వేషన్లకు వ్యతిరేకం  అని అన్నవారూ  ఉన్నారు.  అయితే  మా  ప్రయత్నానికి  మద్దతు ఇవ్వడమే కాకుండా తాము కూడా  కుల , మతాలు   వదులుకోవాలని  అనుకుంటున్నట్లు  చెప్పి, మాకు అండగా నిలచినవారే  ఎక్కువ మంది ఉన్నారు .. అదే మేము చేస్తున్న పోరాటానికి  గొప్ప  నైతిక బలం. 

5.  ఈ ప్రశ్నల్లోని సమంజసత్వం దృష్ట్యా కూడా నో కాస్ట్‌, నో రిలీజియన్‌ అనే మీ పోరాటాన్ని ఎలా వివరిస్తారు?

ఒక సైన్స్ విద్యార్థిగా , మానవ పరిణామ క్రమం అర్థం  చేసుకున్న  మనిషిగా  కుల, మతాల  చరిత్ర  ఒక 4,5 వేల  సంవత్సరాల విషయం కాగా , ఈ భూమి పై  మనిషి వయసు 10 లక్షల సంవత్సరాలని తెలుస్తోంది.. అంటే 9లక్షల 95 వేల సంవత్సరాలు  మనుషుల మధ్య ఈ కులమతాల ప్రస్తావన లేదు.  ఇవి ఒక క్రమంలో సమాజాల్లోకి వచ్చాయి.. మన చైతన్యవంత  ఆచరణతో , సాంస్కృతిక పోరాటాలతో  ఈ పరిస్థితిని మనం  మార్చగలం.. అనేక మంది సామాజిక ఉద్యమకారులు మన సమాజ  మార్పుకోసం అనేక ఆలోచనలు చేశారు .. అవి మనం మన సమిష్టి ఆచరణలోకి తేవాలి .. కుల, మతాల బయట  కూడా మనుషుల అస్తిత్వాన్ని గుర్తించడాన్ని  ప్రోత్సహించాలి .  పుట్టకతో వచ్చిన అస్తిత్వం  స్థిరం చేయడంగా  కాకుండా  ఇష్టమైన వృత్తిని , ఇష్టమయిన విశ్వాసాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ను ప్రోత్సహించినపుడు  మార్పు సాధ్యమవుతుంది. ఆ మార్పు  సమాజాల్లో వేరు వేరు తలాల్లో  ఎప్పటినుంచో  జరుగుతోంది .. ఈ రోజు కేవలం కులవృత్తుల పై  ఆధారపడి బతుకుతున్న వారి శాతం  గణనీయంగా  తగ్గుతూ , ఆయా ప్రజా సమూహాల ప్రజలు   వేరు వేరు  జీవన వ్యాపకాల్లోకి వెళ్లడం మనం చూస్తున్నాం.. ఇది మంచి పరిణామం .. సమాజాల్లో వస్తున్న మార్పులను , అభివృద్ధికర అంశాలను ప్రోత్సహించడానికి   అందుకు తగిన  ఫార్మాట్స్ కావాలి ..  నువ్వు  నీ కులంలోనే ఉండాలి , ఫలానా మతం లోనే ఉండాలనే నిర్బంధం తగదు.. మనుషులు ఆ పరిధులు  దాటి ముందుకు వెళుతున్నా వెనక్కి లాగి, కట్టి ఉంచే ప్రయత్నం సమాజ పురోగమనానికి మంచిది కాదు.. ఆ క్రమంలోనే  మా కుల రహిత , మత  రహిత వ్యక్తీకరణ కూడా ..  సామాజిక మార్పుకు ఒకానొక చిన్న ప్రతిఫలనమే  మా ప్రయత్నం కూడా.. ఇది ఎవరి హక్కులకూ  వ్యతిరేకం కాదు. 

6. నో కాస్ట్‌ నో రిలీజియన్‌ అనేది వ్యక్తిగతంగా మీకు సంబంధించింది కాదు. మీ భాగస్వామిది కూడా కాదు. మీ
పిల్లలకు సంబంధించింది. దీన్ని వాళ్లు ఎలా అంగీకరించారు? కుటుంబంలో అదెలా సాధ్యమైంది? మీ బంధువులప్రతిస్పందన తెలుసుకుందామని ఆసక్తిగా ఉంది.

మీరన్నది నిజం.. ఈ పోరాటం నా వ్యక్తిగతం కాదు.. నాలో ఇటువంటి చైతన్యానికి  కారణమైన, ప్రగతిశీల ఆలోచనలు పరిచయం చేసిన మిత్రులందరిదీ.. కుల, మత పరిధులు దాటి  నాతో  జీవితం పంచుకున్న  నా సహచరి క్లారెన్స్  ఈ పోరాటానికి ప్రజాస్వామిక దృష్టితో సహకరించకుంటే  ఈ పోరాటం సాధ్య మయ్యేది  కాదు. నా సహచరి క్లారెన్స్ కు  క్రిస్టియన్  మత  విశ్వాసాలు ఉన్నా.. ఏ మతం నమ్మని నా ఆలోచనను ప్రజాస్వామికంగా బలపరచి  కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో  నాతో  పాటు సహ  పిటిషనర్ గా  నన్ను బలపరిచింది..  పిల్లలు మేజర్లు అయ్యాక  వారికి ఇష్టమయిన విశ్వాసాల ఎంపికకు  మేము సహకరించాలని  ఉమ్మడిగా నిర్ణయించుకున్నాం.. స్కూల్ యాజమాన్యం  తమ ప్రశ్నతో , పద్ధతితో  మమ్మల్ని ప్రశ్నించకుండా  ఎదో ఒకటి రాయనీ అని ఊరుకున్నా, బహుశా  మా ప్రయత్నం  ఉండేది కాదేమో..  అందువల్ల  వారికి కృతజ్ఞతలు..  మా జీవితంలో  ఎదురయినా ప్రశ్నకు మేము  జవాబు  కనుక్కునే ప్రయత్నంలోనే  ఈ ప్రయాణం.. ఇది మా ఒక్కరిది మాత్రం కాదు. ఇక మతం అంటే ఏంటో తెలియని పిల్లలకు మేము మతం నేర్పలేదు.. వాళ్ళు ఎదుగుతున్న  క్రమంలో అన్నీ గమనిస్తున్నారు.. శాస్త్రీయ , హేతువాద  దృష్టితో విషయాలను చూసే ప్రయత్నానికి  సహకరిస్తున్నాము.. ఇక బంధు,  మిత్రులు మా ప్రయత్నాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.. ఆయా సందర్భాలలో అభినందించారు. 

7.  సర్టిఫికెట్లలో కులం మతం వద్దనే అవగాహనకు వయసురీత్యా కూడా మీ పిల్లలకు ఇప్పుడు వచ్చి ఉంటారు. అంతక ముందు రోజువారీ జీవితంలో కుల, మత విషయాల్లో పిల్లలు ఎలా ఉండేవారు?

ఇతరుల విశ్వాసాలు  ఏవైనా   మా పిల్లలు   అందరితో సమ దృష్టితో మెలుగుతున్నారు..  ఇంట్లో  , బయట స్నేహితులతో  స్నేహ పూర్వక సంబంధాలు నెరపుతున్నారు. వాళ్లకు అర్థమయిన మేరకు  శాస్త్రీయంగా  బదులు ఇస్తున్నారు.    ఆధిపత్య కుల, మత  స్వభావం తో  దేశవ్యాప్తంగా  సామాన్యుల పై జరుగుతున్న దాడులను , హింసను, కులాంతర , మతాంతర వివాహాలు చేసుకున్న వారు   ఎదుర్కొంటున్న హింస , హత్యలకు గురికావడం  చూసి బాధపడుతున్నారు..  ఇలాంటి పరిస్థితి మారాలని అనుకుంటున్నారు. 

8. ఈ పోరాటంలో న్యాయ పరమైన సంక్షిష్టతను ఎలా ఎదుర్కొన్నారు?

ఎప్పుడయితే మన  ప్రభుత్వ విధానంలో  మత  రహిత , కుల రహిత అస్తిత్వానికి గుర్తింపు , వ్యక్తీకరణ కు అవకాశం లేదని తెలిసిందో అప్పుడే అంటే 2010 ఏప్రిల్ లో మొదటిసారి  రిట్ పిటిషన్ వేయడం ద్వారా  మేము కోర్టు గుమ్మం ఎక్కాం .  కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వెలుగులో , అప్పుడే ప్రభుత్వం  మా ప్రశ్నకు అర్థవంతమైన పరిష్కారాన్ని చూపి ఉంటే  ఇంతకాలం మాకు ఈ పోరాట అవసరం ఉండేది కాదు.. అలా జరగకపోవడం వల్లే  మళ్ళీ మా పెద్దమ్మాయి ఇంటర్మీడియట్  సందర్భంలో  2017 లో  మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. అంతిమ తీర్పుకోసం  ఎదురు చూస్తున్నాం. మా వ్యాజ్యం పై  ప్రభు త్వాన్ని స్పందించమని  తగిన సమయం ఇస్తూ  2022 జనవరిలో , జూన్లో హై కోర్టు న్యాయమూర్తి  ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  సానుకూలంగా స్పందిస్తే ..  దేశంలోనే  మన రాష్ట్రం  మత రహితులకు , కుల రహితులకు  గుర్తింపు ఇచ్చిన మొదటి రాష్ట్రం అవుతుంది .. మన  రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన  సెక్యులర్ భావనకు మరింత  బలం చేకూర్చినట్లు అవుతుంది..  12 ఏళ్ళు  దాటిన మా పోరాటానికి అర్థవంతమైన ముగింపు అవుతుంది .. దేశంలో ఇతర రాష్ట్రాలకూ మార్గ నిర్దేశం చేసిన వారమవుతాం.. 

9. మీ పోరాటం గురించి వింటుంటే ఇలాంటి వాటిల్లో ఇంకొన్ని చేరాలనిపిస్తోంది. కులం, మతం గుర్తింపు వద్దనడం సరే. పిల్లలను తల్లి పేరుతో కూడా గుర్తించాలని, మొదట తల్లి, ఆ తర్వాత తండ్రి గుర్తింపు ఉండేలా అధికార పత్రాల్లో ఉండాలనిపిస్తోంది. పైగా సింగిల్‌ పేరెంట్‌ అయినప్పుడు తండ్రితో గుర్తింపు కాలం అధికార పత్రాల్లో తప్పక ఉండటం అన్యాయం కదా? మీరేమంటారు?

అవును .. మీరన్నట్లు అన్ని అధికార పత్రాలలో , దరఖాస్తులలో  వ్యక్తుల   సమాచార క్రోడీకరణలో   అవసరమైన చోట్ల  చాలా ప్రజాస్వామికీకరణ చేపట్టాల్సి ఉంది.. ముఖ్యం గా తల్లి పేరును మొదటి ప్రాధాన్యతతో  తర్వాత  తండ్రి పేరును నమోదు చేసుకోవాలి .. కేవలం తల్లి మాత్రమే ఉన్నపుడు తల్లితో పిల్లలను గుర్తించాలి .  ఇటీవల  లింగ గుర్తింపు లో  – స్త్రీ , పురుషులతో పాటు  ,  భిన్న లైంగికతను  ( 3వ జెండర్  అనడం కూడా సరియైనది కాదు ) ను గుర్తిస్తున్నారు .. ఇది మంచి విషయం.  ఆదివాసులు కూడా  తమది  ట్రైబల్  రెలిజియన్  గా  ప్రత్యేకంగా  గుర్తించమని  కోరుతున్నారు.. ఇలాగే  ఇంకా అనేక సున్నితమయిన ఇబ్బందులు ఉన్నాయి . వాటిని చర్చించి పరిష్కరించాలి . ప్రభుత్వం నుంచి లేక  ఏదైనా  ప్రత్యేక లబ్ది పొందే  సందర్భంలో తప్ప ,  అవసరమున్నా , లేకున్నా  కుల , మత  సమాచారాన్ని సేకరించడం, వెల్లడించడం  ఆపేయాలి ..  మెరుగైన భవిష్యత్ కోసం ,   నిజమైన అర్థంలో  సామాజిక అంతరాలు  తొలగించడానికి అందరం  బహుముఖాలుగా  కృషి చేయాలి .. 

10. ఈ పోరాటానికి మీ మిత్రుల నుంచి ఎలాంటి సహకారం వచ్చింది? లేదా వ్యతిరేకత ఏమైనా వచ్చిందా?

ఆలోచనలతో మొదలు పెట్టి  ఆచరణ వరకు  మిత్రులతో సంభాషణ వారి సహకారం, ప్రోత్సాహం  ఈ క్రమం అంతా  ఎప్పుడూ ఉన్నాయి.. అనేక ప్రజా సంఘాల మిత్రులు  మాకు తోడ్పాటు ను అందించారు. వారి ఆలోచనలు , అనుభవాలు మాతో పంచుకున్నారు.. ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తామని ముందుకు వచ్చారు.. మా ఆన్లైన్ పిటిషన్  సంతకం చేయడమే కాకుండా స్వయంగా 12 వేల 6 వందల 60   మంది  సంతకాల  సేకరణ లో భాగంగా మా పిటిషన్ ను షేర్ చేశారు.. ఇది సామాన్యమైన విషయం కాదు. అనేక దినపత్రికలు , మాస పత్రికలూ, వెబ్ మేగజైన్స్  మా పోరాటాన్ని కవర్ చేశాయి .. అనేక న్యూస్ చానల్స్ , డిజిటల్ మీడియా  మా సమస్యను కవర్ చేశాయి..   మా    ” నో రెలిజియన్ నో రెలిజియన్  చేంజ్ డాట్ ఆర్గ్  పిటిషన్ ”  ( No Religion No Caste Change dot org Online Petition )    పిటిషన్ లో  సంతకాలు చేసిన  55 వేల మంది లో అనేకమంది కవులు, రచయితలూ , మేధావులు, ప్రజాస్వామిక వాదులు , ప్రజా సంఘాల కార్య కర్తలు సహా  వివిధ దేశాల ఆలోచనాపరులు ఉన్నారు.  చేంజ్ డాట్ ఆర్గ్  ప్రతినిధి  నమ్రత గారు , వారి మొత్తం టీమ్ మా సమస్య ను అన్ని మూలలకు  చేర్చడం లో   మాకు  వెన్ను దన్ను గా నిలుచున్నారు.  సంతకాలు మాత్రమే కాదు   రెండు వేల రెండు వందల మందికి పైగా మాకు  మద్దతుగా కామెంట్స్  చేశారు .. ఇక ఫెస్బుక్ , వాట్సాప్  లలో షేర్ చేసిన , అభినందించిన వారి లెక్క తీయలేం.. అందరికీ  పేరు పేరునా  వినమ్రంగా    కృతజ్ఞతలు..  ఒక  ఆలోచననూ సమర్థించే వారు ఉన్నట్లే , వ్యతిరేకించే వారు , అనుమానంతో గమనించే వారు కూడా ఉంటారు.  

11. ఈ విజయాన్ని సాంస్కృతికంగా మీరు ఎలా అంచనా వేస్తారు?

మత  రహిత , కుల రహిత  అస్తిత్వ గుర్తింపు కోసం అనేక మంది పోరాడారు .. తమ ధిక్కార స్వరం వినిపించారు .. ఎంతో  సృజనాత్మకంగా  తమ భావనలను  వ్యక్తం చేశారు.. మానీవీయ సమాజం  కోసం , నూతన మానవ ఆవిష్కారం కోసం తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా అర్పించిన    మహనీయులు , సంఘసంస్కర్తలూ, ప్రజాస్వామిక వాదులు, విప్లవకారులూ   ఉన్నారు. ఆ పోరాటాలు అందించిన  స్ఫూర్తి మా ప్రయత్నానికి ఊపిరి.. అయితే ఇది చాలా ప్రాథమికమైన  విషయం .. ఇంకా అనేకానేక విషయాలు  మనమంతా  సాధించుకోవాల్సి ఉంది . 

12.  ఈ అనుభవం తర్వాత సాంస్కృతిక విషయాల్లో పోరాటం గురించి ఏమనిపిస్తోంది? అందునా అవి ప్రభుత్వంతో ముడిపడినవి అయినప్పుడు.

ఇవాళ సాంస్కృతిక రంగంలో గట్టిగా నిలబడి  చాలా పెద్ద పోరాటం చేయవలసి ఉంది.. శ్రామిక ప్రజా సమూహాలపై ఆధిపత్య   కుల, మత భావజాలం దాడులు చేస్తున్న సందర్భం లో మనం ఉన్నాం.. ఈ పరిస్థితిని  శ్రామిక , ప్రజా  ప్రత్యామ్నాయ సంస్కృతితో  బలంగా ఎదుర్కోవాలి ..  సమాజంలో శాస్త్రీయ దృక్పథం  పెంపొందించాలి .  మనిషి కేంద్రంగా , మనిషి శ్రమ కేంద్రంగా  ఈ సమాజాన్ని మనమంతా  పునర్నిర్వచించుకోవాలి .  ” మత ములన్నియు మాసిపోవును..  జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును ” అని అన్న గురజాడ మాటలను నిజం చేయాల్సింది మనమే.. ” కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి  .. పంజరాన  గట్టువడను  నేను.. నిఖిల లోకమెట్లు  నిర్ణయించిన  నాకు..  తరుగు లేదు.. విశ్వనరుడ నేను ” అని సగర్వంగా  ప్రకటించిన  జాషువా   ధిక్కారాన్ని ఎత్తి పట్టి  , మానవతా  పతాకను  ఎగురవేయాల్సింది మనమే … 

చాలా  వివరంగా   ఇంటర్వ్యూ  చేసి , మా పోరాటానికి  సహకరించిన  వసంత మేఘం టీమ్ కు హార్దిక కృతజ్ఞతలు .. ఉద్యమాభినందనాలు.. 

ఒక విన్నపం –    మా ఆన్లైన్ పిటిషన్  చదివి , సంతకం చేసి ,  షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం..  మా ఆన్లైన్ పిటిషన్  లింక్ ఇక్కడ క్లిక్ చేయగలరు

https://www.change.org/p/no-religion-no-caste-one-more-option-who-ever-wants-to-opt

One thought on “మత రహిత , కుల రహిత అస్తిత్వం  కోసం.. 

  1. Salutes sir —for your life journey. GREAT
    —————————————————-
    BUCHIREDDY GANGULA

Leave a Reply