“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు.

సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి.

ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం భిన్నమైనదని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

బ్రాహ్మణీయ హిందుత్వ సంగతి సరే సరి. మన సామాజిక సాంస్కృతిక ఆలోచనా ప్రపంచంలో అది నిరంతరం పునరుత్పత్తి అవుతోంది. దాన్ని సంఘ్పరివార్ విషపు పంటగా మార్చేసింది. పైగా దీన్నంతా ప్రజల కామన్‌సెన్స్‌లో  కూడా ఇంకించింది. ఈ ప్రమాదం గురించి ఇప్పుడు ఎవ్వరికీ సందేహాలు లేవు.

ఈ పరిస్థితి వల్లనే మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది కుదుటపడ్డారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఊరటే. సందేహం లేదు. దీనికి పెద్దగా విశ్లేషణ అక్కర్లేదు.

బీజేపీపట్ల, ఫాసిజంపట్ల విమర్శ ఉండే ఉదారవాద భావాలు కల వాళ్లందరికీ సులభంగానే అర్థం అవుతుంది. ఇలాంటి వాళ్లే రాబోయే ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించడానికి మమతా బెనర్జీ దేశానికి దారి చూపాలని ఆకాంక్షించారు. మరి కొందరైతే మమతా దీదీకి జేజేలు పలికారు. వాళ్లలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. పార్లమెంటరీ ఎన్నికల పరిధిలో అలోచిస్తే బీజేపీ అ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం మంచిదే. కానీ మమతా బెనర్జీని మతతత్వ వ్యతిరేక శక్తి అనుకోవడమే సమస్య. ఇంకా ముందుకెళ్లి తృణమూల్ విజయాన్ని హిందుత్వ ఫాసిజాన్ని ఓడించే మార్గమని అనుకోవడం అంతకంటే సమస్య.

విప్లవ ప్రజాస్వామిక శక్తులు ప్రత్యామ్నాయంగా లేనందు వల్ల ఇలా అనుకోవాల్సి వస్తోందని వాళ్లు సమర్థించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అలాంటి విప్లవ ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం ఇప్పటికిప్పుడు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్శానే స్థితిలో లేకపోవడం నిజమే. ఎందుకు ఎదగలేదనే చర్చ ఎంతైనా చేయాల్సిందే.

అ సంగతి అటుంచుదాం. పశ్చిమబెంగాల్లో వామపక్ష ప్రభుత్వం 1967 నుంచి విప్లవ శక్తులను ఎలా అణచివేస్తూ వచ్చిందో బుద్ధదేవ్ భట్టాచార్య దాకా చాలా చరిత్రే ఉన్నది. అందుకే సోషల్ ఫాసిజం అని సూత్రీకరించాల్సి వచ్చింది. ఈ మాట కేవలం అణిచివేతను దృష్టిలో పెట్టుకొనే అనలేదు. అదొక ముఖ్యమైన విషయం. వ్యూహాత్మకంగా దాన్ని పక్కన పెట్టి ఏ ప్రగతిశీల ఉద్యమ గమనాన్నీ అర్థం చేసుకోలేం. అ ఉద్యమాల అటుపోట్లను విశ్లేషించలేం. ఇతర కారణాలు కూడా ఉన్నప్పటికీ, అంతిమంగా మన దేశంలో చాలా ఉద్యమాల సంక్షోభానికి అణచివేత అతి ముఖ్యమైన కారణం.

సరిగ్గా అదే మార్గాన్ని మమతాబెనర్జీ మరింత ఉధృతంగా కొనసాగించింది. దాన్ని మమతా ఫాసిజం అనవచ్చు. ఈ వ్యూహాన్ని ఎదుర్కోవడంలో అక్కడ విప్లవ ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా లేకపోవచ్చు. ఎదుర్కోగలిగినంత బలంగా లేవని అనవచ్చు. అయితే అణచివేతకు గురికావడం వాస్తవం.

మమతా బెనర్జీ రాజకీయ చరిత్రను చూస్తే దీంతోపాటు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ ఎన్నికల సందర్భంలోగాని, పూర్వరంగంలో గాని అమె మతతత్వ వ్యతిరేకంగా బీరాలు పోయిన మాట వాస్తవమే. బీజేపీని చూపి ఇతర పాలక పార్టీలు భయపడుతున్న సమయంలో, సాగిలపడుతున్న సమయంలో అమె మతతత్వ వ్యతిరేకతను కొందరు ఆశాజనకంగా చూశారు.

కానీ ఈ దేశంలో ఫాసిజానికి బీజం వేసిన కాంగ్రెస్ తానులోని ముక్క తృణమూల్ కాంగ్రెస్. అ తర్వాత మమతా బెనర్జీ సుబ్బరంగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించింది. అక్కడా ఇక్కడా బెదిరింపులతో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పొందింది. అమె ఎవరినైనా ధాటీగా ప్రశ్నించవచ్చు. దాన్ని చూసి ముచ్చటపడేవాళ్లు పడవచ్చు. హవాయి చెప్పులు వేసుకొని ప్రజల్లో ఎంత బాగా కలిసిపోతోందో అని ప్రశంసించవచ్చు. కానీ అ ప్రజల్లోనే తనను ఎవరు ప్రశ్నించినా మావోయిస్టులని అనేయగల తెంపరి. అందుకే ఫాసిస్టు అని అనడం లేదు. మౌలికంగా అమెకు కాంగ్రెస్‌తో,  బీజేపీతో విధానపరమైన తేడా ఏమీ లేదు. అ మాటకొస్తే సామాజిక ప్రత్యామ్నాయం పేరుతో వచ్చిన కాన్నీరాం, మాయావతి కూడా జీజేపీతో కలిసి పని చేయడానికి ఇబ్బందిపడ లేదు. వాళ్లు సామాజిక పరిభాష వాడి ఉండొచ్చు. సామాజిక సమీకరణాలను సమర్థవంతంగా వాడుకొని ఉండవచ్చు. కొత్త నినాదాలతో, సమీకరణాలతో పార్లమెంటరీ వ్యవహారాల్లో చోటు సంపాదించుకోగలిగారు. పార్లమెంటరీ చట్రంలోనే ప్రత్యామ్నాయం కాలేకపోయారు. అప్పటి దాకా అధికారంలో ఉన్న పార్టీలకు పోటీ అయ్యారు. అంతే. కాబట్టి మమతా బెనర్జీలోని మతతత్వ వ్యతిరేకతను ఎలా చూడాలి? అనేది సీరియస్ ప్రశ్నే

హిందుత్వ ఫాసిస్టు స్వభావంలో పోల్చినప్పుడు బీజేపీతో కాంగ్రెస్ సహా వీళ్లందరికీ తేడా ఉంది. నేరుగా సంఘ్పరివార్ పునాదిలో రాటుదేలిన బీజేపీతో మిగతా ఎవ్వరినీ పోల్చ‌న‌వ‌స‌రం లేదు. హిందుత్వను, కులాన్ని అ రెంటితో పీట ముండి వేసుకున్న పితృస్వామ్యాన్ని సంఘ్‌ప‌రివార్‌ వాడుకుంటున్నట్లు, బలోపేతం చేస్తున్నట్లు ఇంకే రాజకీయ పార్టీ చేయకపోవచ్చు. _ అందుకే దళితులు, ముస్లింలు, స్త్రీలు, విప్లవ ప్రజాస్వామిక శక్తులపై ఇప్పుడు జరుగుతున్న తీరులో గతంలో దాడులు జరగలేదు. అయితే ఈ స్థితి ఇంత బలపడటం వెనుక అన్ని పార్లమెంటరీ పార్టీల పాత్ర ఉంది.

వాళ్లలో వాళ్ల మధ్య తేడా చూసి స్వభావంలో పోలికను, సంబంధాన్ని విస్మరిస్తే ఎలా?

దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. డెబ్బై ఏళ్ల నుంచి చూస్తున్నా ఇంకా మనకు ఇంకా భారత పార్లమెంటరీ స్వభావం అర్థం కావడం లేదు. ఈ కాలం పొడవునా అదెన్ని పోకడలు పోయిందో, ఎంత అప్‌డేట్ అవుతున్నదో, ఎంతగా ప్రజలను తనలోకి తీసుకుంటున్నదో, ఒకప్పుడు మేడి పండుగా ఉండి… ఇప్పుడు అదే పొట్ట చించుకొని పురుగులను బైటపెట్టుకుంటున్నదో, ఎప్పటికప్పుడు కొత్త మేలిముసుగులను ధరిస్తూనే నిస్సిగ్గుగా అన్ని దేవతా వస్త్రాలని వదిలి నగ్నంగా బైటికి వస్తున్నదో తెలియడం లేదు. ఈ విషయంలో స్పష్టత లేనంత వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంతో వ్యవహరించడం సాధ్యం కాదు.

మన దగ్గర పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే కేవలం ప్రజా ప్రాతినిధ్య, పాలనా రూపమే కాదు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుభవంలోకి వచ్చిన తీరే పరమ వికృతం. ఆ చర్చలోకి ఇప్పుడు పోనవసరం లేదుగాని, అ కారణాల వల్లనే దాని ప్రజాప్రాతినిధ్య, పాలనా వ్యవహారాలు జుగుప్సాక‌రంగా తయారయ్యాయి. అది వేసే ప్రతి వేషం, ప్రతి ఎత్తుగడ దీన్ని పెంచుతూనే ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ తన సహజ వికృత, అమానవీయతలను దాచుకోడానికేమో అనిపిస్తుంది. కానీ ఏ దాపరికం లేకుండా నిర్లజ్జగా ఊరేగడానికే ఈ వేషాలు వేస్తోంది. ఇదొక ప్రత్యేక స్వభావం. దీన్ని సంఘపరివార్ పునాది వల్ల బీజేపీ పరాకాష్టకు తీసికెళ్లింది. అంత వరకు చాటుమాటుగా ఉండేవాటిని బీజేపీ తీసి అవతలపడేయడం వల్ల కలిగిన బీభత్స సన్నివేశమే ఇప్పుడు అందరికీ భయంగొలుపుతున్నది.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన సామాజిక వ్యవస్థలను, సామాజిక క్రమాలను వాడుకొని, వాటి స్వభావాలను పొంది చాలా సంక్షిష్టంగా తయారైంది. _ కేవలం ప్రజా ప్రాతినిధ్య, పాలనా రీతులు సక్రమంగా లేకపోవడం ఒక్కటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని అవలక్షణం కాదు. అది ఒకానొకటి మాత్రమే. ప్రజాప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యం అనే భావనలను స్వతహాగానే ఇంకించుకోకపోవడం వల్ల పార్లమెంటరీ విధానానికి ఎన్నికలు ఒక్కటే గీటురాయి అయింది. నిజానికి ఏదో ఒక పద్ధతిలో ఎన్నికల ప్రక్రియకు కట్టుబడి ఉంటూనే నియంతృత్వంగా మారడం అనే వైచిత్రి ఒక్కటే ఇవాళ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంకా చాలా మందిని అకర్షిస్తోంది. భారత దేశంలో బహుశా ఎన్నటికీ ఢోకా లేనిది ఒక్క ఎన్నికల ప్రక్రియకే. ఆ ‘పరిణతి’ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సాధించింది.

మన దేశంలోని సకల సామాజిక, సాంస్కృతిక అంతరాల, అధిపత్యాల స్వభావాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రంగరించుకుంది. తద్వారా అదే ఒక సామాజిక అధిపత్య వ్యవస్థగా మారింది. అదే ఒక సంస్కృతీ ఉత్పత్తి స్థావరమైపోయింది. సమాజంలోని అన్ని పొరల్లోకి ఈ విషపు గాలులు వీచి అక్కడ ఊతం పొంది పెను తుపానుగా మానవ జీవితపు తీరాల్లోకి చేరి అన్నిటినీ చుట్టుముడుతోంది.

దీన్నంతా విమర్శనాత్మకంగా చూసే స్థాయికి ఎదిగితేనే పౌర సమాజం ఏర్పడ్డట్లు. 

దీన్నిపట్టించుకోకుండా మనకూ ఒక పౌర సమాజం ఉండాలి కదా? ఎందుకు లేదు? ఉంటే, అదెందుకు నిద్రావస్థలోకి పోయింది? అనే ప్రశ్నలు చాలా మంది వేస్తుంటారు. అందులోని ఆవేదన న్యాయమైందే. కానీ ఆ నిరాశ దేనికీ కొరకాదు. _ పైన చెప్పిన విమర్శనాత్మకతను అలవర్చుకోకుండా ఏ విశ్లేషణలు చేసినా నిరర్ధకమే.

మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఈ ప్రత్యేక లక్షణం, రాజకీయార్థిక, పాలనా రంగాల్లో అది నియంతృత్వంగా మారడం(నిజానికి మొదటి దాని వల్లే చాలా సునాయాసంగా అది నియంతృత్వంగా మారగలిగింది) అనే రెండింటి జమిలి ప్రక్రియ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి పునాది అయింది. అది ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చింది కాదు. దానికి నాయకురాలు బీజేపీ. అందులో అనుమానం లేదు. కానీ అది నాయకత్వశక్తిగా మారడం వెనుక అన్ని పార్లమెంటరీ శక్తులూ ఉన్నాయి. వలస, వలసానంతర పరిణామాలన్నీ దీనికి కారణం. అసలు మన ‘వలసానంతర’” భావననే సరికొత్తగా చూడవలసిన సందర్భాలు చరిత్రలో ఎన్నోసార్లు వచ్చాయి. దాన్ని సరిగా చూడకపోవడం వల్లే ఇవాళ దేశభక్తికి సంఘ్‌ప‌రివార్‌ దౌర్జన్యకర యజమాని అయింది. తాను అనుకున్న అ భావనకు ఎవరి వల్లనైనా విఘాతం కలుగుతుందనే సందేహం వస్తే చాలు.. వాళ్లందరినీ దేశద్రోహులంటోంది. దీనికి ఇంకో పక్క జుగుప్సాకరమైన వ్యక్తీకరణ ఏమంటే, చంద్రబాబునాయుడులాంటి వాళ్లు ‘హక్కుల కోసం మాట్లాడితే దేశద్రోహం కేసు పెడతారా?’  అనడం. ఆ మాట అనడానికి తనకు నైతిక అర్హత కూడా లేదనే విషయం మర్చిపోయి చంద్రబాబునాయుడే అనేలాగా పాలనాపరమైన నియంతృత్వం అన్ని స్థాయిల్లో నిస్సంకోచంగా అమలు అవుతోంది. మనం నియంతృత్వం అంటున్నది కేవలం అణచివేత, పాలనాపరంగానే కాదు. ఇంకా చాలా పెద్ద అర్థంలో.

ఇలాంటివి చూసి పాలకవర్గం మధ్య వైరుధ్యాలు తీవ్రం అయ్యాయనుకుంటే ఇంకో పొరబాటు చేసినట్లే. ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన కూడా ఇతరులందరి మీద దేశద్రోహం కేసులు పెట్టి జైళ్లలో తోసేవాడే. ఆ పని బీజేపీకే చేతనవుతుందని, కేసీఆర్‌కు, చంద్రబాబుకు, ఇంకా వాళ్ల మిత్రులకు చేతకాదని అనుకోగ‌ల‌మా?

సారాంశంలో బీజేపీ అన్ని పార్లమెంటరీ పార్టీల్లో ఉంటుంది. ఎక్కువ తక్కువల తేడా అంతే.

దేనికంటే అది పార్లమెంటరీ పంథాలోని వికృత విశేషం.

ఈ మాట ఊహాత్మకంగా అనడం లేదు.

కాంగ్రెస్ దగ్గరి నుంచి జనసంఘ్ మీదుగా గత డెబ్బై ఏళ్ల పార్లమెంటరీ రాజకీయాల చరిత్ర అంతా ఇదే చెబుతోంది.

కాబట్టి బీజేపీ చాలా ఎక్కువ ప్రమాదం కదా, మరీ అంత ప్రమాదాన్ని భరించలేం, కాబట్టి తక్కువ ప్రమాదాన్ని భరిద్దాం.. అని ఎవరైనా అనుకుంటే సరే. కానీ ఇదేదో ఫాసిస్టు వ్యతిరేక మార్గమనుకుంటే మాత్రం మనల్ని మనం వొంచించుకున్నట్లే. ముఖ్యంగా బీజేపీని ఓడించ‌గానే ఫాసిజం ఓడిపోతుంద‌ని  అనుకుంటే మన దేశంలో డెబ్బై ఏళ్లుగా ఎదుగుతూ వచ్చిన ఫాసిజం మనకు అర్థం కానట్టే.

ఫాసిజానికి మోడల్ ఏమీ ఉండదు. ఆయా దేశాల్లోకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చిన తీరునుబట్టి, అ నిర్దిష్ట సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలనుబట్టి ఫాసిజం ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారడంలో కూడా అనేక స్ధల కాల ప్రత్యేకతలు ఉంటాయి. మన దేశంలో నియంతృత్వం ఉందంటే ఎన్నికల్లో పాల్గొనే వాళ్లే కాదు. ఇంకా చాలా మంది అంగీకరించరు.

వాళ్లలో చాలా “గౌరవనీయులు” కూడా ఉండొచ్చు. అదీ మన ప్రజాస్వామ్య విలక్షణత్వం. అదే ఫాసిజం ప్రత్యేకత కూడా.

మన ఎన్నికల రాజకీయాల ఒరవడిలో సంఖ్యాబలం తగ్గడం, పెరగడం చాలా మామూలు విషయం. “ప్రజాస్వామ్యం” మిగిలింది ఇక్కడే. ఏ ఏ కారణాల వల్లనో ఒక వేళ బీజేపీ అధికారంలోంచి పోతే ఫాసిజం ఓడిపోయినట్లేనా? ఫాసిస్టు ప్రమాదం అంత ఈజీగా తప్పిపోయినట్లేనా? అదే నిజం అయితే ఫాసిజం అంత పెద్ద విపత్తు కానట్లే కదా. అంగీకరిద్దామా?

ఇదంతా విప్లవ ప్రజాస్వామిక శక్తులు బలహీనంగా ఉన్నాయని అంగీకరిస్తూనే చెప్పవచ్చు. బలహీనంగా ఉన్నందుకే మరింత గట్టిగా చెప్పవచ్చు.

One thought on “మమతా ఫాసిజం మాటేమిటో!

  1. మమత బాలపడడానికి ఆ నాటి విప్లవపార్టీ నాయకత్వం ఆమెకు పరోక్షంగా ఇచ్చిన మద్దతు ఒక కారణం కాదా? సిపిఐ (ఎం ) పాలనలో అమలుజేసిన నిర్భానఫహాన్ని,అణచివేటాను ప్రతిఘటించే ఎత్తుగగలలో భాగంగా లోకల్ విప్లవ నాయకత్వం మామతతో చేతులు కాలపిండానే ఆరోపణలు కొంటాయిన వాస్తవముందనడమ లో తప్పులేదనిపిస్తుంది.

Leave a Reply