ప్రేమను వ్యక్త పరిచే

  మానవులు వున్న నేలపైనుండి

  ఒకానొక మనిషి

  దారి చేసుకుంటూ తరలిపోయాడు.

  పంజరాన్ని ధ్వంసం చేసి

  పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-

  దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి

  భూమి ఆలింగనంలో

  కంటి పాపను దాచుకున్నాడు

   జాబిలి వైపు చిరునవ్వు విసిరి

   అంధకారపు ఆకాశంలోకి

    నక్షత్ర వల విసిరి

    నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు

    మరణం అతనిదేనా

    ఒక కలను మోసిన వారందరిది

    ఆకలి పేగు-

    వినిపించే సన్నటి మూలుగు నుండి

    అతనొక నిత్య సంభాషి

     బాట పొడవునా

     ఆకలి లేని

     నేల గురించే మాట్లాడి

     విత్తన రహస్యం తెలిసిన ఆఖరి మనిషి

     సమయం ఉరితాడు అల్లుతున్నప్పుడు

     చివరి ఊపిరి దగ్గర కంఠనాళం

     ఏమని మాట్లాడి వుంటుంది.

     అర్ధమవుతుందా

     గణతంత్ర రాజ్యానికి

    ఒక దేశంపై 

   కప్ప బడిన జెండా నిండా-

   అలుముకున్న స్వరం

   ముక్కలు , ముక్కలుగా

   విరిగి పడుతున్నప్పుడు

   జనం గాయ పడలేదు-

   గానం దగ్గర నిలబడ్డారు

   ఒకానొక చావు వార్త

   భూమిని జ్ణాపకం జ్ణాపకం చేసింది

   భూమి మినహా

   ఏజ్ణాపకం మిగలలేదు

   చెరువంతా వికసించిన

   కలవపూల సాంగత్యంలో

   తెగిపడిన పాదముద్రలను వెతికాను.

  ఎక్కడో ఒక శిధిల భవనంలో

  మొలిచిన చెట్టులో

  అతని రూపం కనబడుతుంది

  అతని మాట వినబడుతుంది

   అనేక నయనాలు విడిచిన

   దుఃఖ మేఘంలో

   అతని రూపు,అతని స్వప్నం

   నీటి తెరపై కనబడుతుంది.

Leave a Reply