ఊరికే
నీ ఇంట్లోకి చొరబడి
నీ పసిపాపల ముందు
నిన్ను పెడ రెక్కలు విరిచి కట్టి
బలవంతంగా ఎత్తుకు పోతారు

ఎక్కడో నువ్వొక సారి
ఎమోజీగా
నవ్వినందుకు
నీ మిత్రులతో కలిసి
గొంతు కలిపినందుకు
నీ చేతిలో
పచ్చగా ఓ రుమాలు
ఎగిరినందుకు
ఏమైనా కావచ్చు
నీ నుదుటిపై ఊపా
ముద్ర వేయడానికి

ఇక నీ కను రెప్పల చుట్టూ
ఇనుప చువ్వలు మొలకెత్తుతాయి
నీ గుండెలపై ఊపిరిసలపనంతగా
ఉక్కు పాదంతో తొక్కిపెట్టడానికి
రోజు లేమీ మిగిలి వుండవు

నీ పసిపాపల‌ నవ్వుల కేరింతలు
వినపడకుండా గాజుటద్దాలు
ఉబికి వస్తాయి

నీ ఇంటి మీదకు
బుల్డోజరు నడిచి వస్తుంది

అనుమానపు పరిహాసాలతో
చుట్టూ పరిక కంపలు
పరచుకుంటాయి

ఎప్పటికో ఒక వేకువలో
మెలకువ వచ్చిన
న్యాయ పీఠం నిర్దోషిత్వాన్ని
గుర్తిస్తూ నీ ముఖాన ఒక‌
బెయిల్ కాగితం విసిరి కొడితే
అందుకోలేని నీ వణుకుతున్న
చేతులు చివరిగా ఆసరాను
వెతుక్కుంటూ బయటకు రావచ్చు

లేదా ఏ ఆసుపత్రి బల్ల మీదో
చివరిగా నీ గుండె సవ్వడి
వినపడక పోవచ్చు కూడా!!

2 thoughts on “మరో వైపు..

  1. నీ కనురెప్పల చుట్టూ ఇనుప చువ్వలు మొలకెత్తు తాయి

Leave a Reply