“మెట్రో జైలు” కథలు: 1
“హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”, విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్ నగరంలోని భిన్నమైన జీవితాలు ఎన్నో కనిపించాయి. చాలా సంక్లిష్టత కూడా ఉందని అర్థం అయ్యింది. అలాంటి నేపథ్యంలోనివి ఈ గాధలు.
సాయంత్రం గిన్తీ అయిపోయాక నాకు అప్పుడే అందిన హిందూ పేపర్ తీసి చూస్తున్నా. లాకప్ అయిపోయింది. అప్పటి వరకూ వార్డులో వరుసలుగా కూర్చున్న ఖైదీలు గుంపులు గుంపులుగా చేరిపోయి మాట్లాడుకుంటున్నారు.
కొత్తగా వచ్చిన నలుగురిలోనూ ఒకమ్మాయి నా దగ్గరికి వచ్చింది. “మీకు హిందీ వచ్చా” అని హిందీ లో అడిగింది. ఆ బీహారీ యాస చూసి ఉత్సాహంగా నేను కూడా కొంచెం అదే పద్దతిలో జవాబిచ్చాను. ఒక్క క్షణం ఆమె ముఖం వెలిగిపోయింది. మిగతా ముగ్గురిని కూడా పిలిచింది.
“మీరు బీహారీనా” అని నన్ను మరొక ఆమె అడిగింది.
“కాదు ఝార్ఖండీ” అని అనేసి తరవాత నవ్వేశాను. “కాదులే కానీ నేను హజారీబాగ్ జైల్లో నాలుగేళ్ళు ఉన్నాను. అప్పుడు నేర్చుకొన్నా.”
తమకి పరిచితమైన పేర్లు వినగానే వాళ్ళ ముఖాలు వికసించాయి. వేరే రాష్ట్రాలకు వెళ్ళినపుడు సాధారణంగా మన భాష తెలిసిన వాళ్ళు కనపడినపుడు కలిగే ఆనందమే అది.
“మర్డర్ కేసా?” ఆమె నన్ను అడిగింది.
“నన్ను చూస్తే మర్డర్ కేసులో వచ్చాననిపించిందా?” నవ్వుతూనే అడిగాను.
ఆమె నొచ్చుకుంది. “అయ్యయ్యో అలాక్కాదు. నాలుగేళ్ళు జైల్లో ఉన్నారంటే……..!!!”
“నక్సలీ కేస్” హిందీ బెల్టు లో సాధారణంగా వాడే పదం అది.
“ఓ…..”
చప్పున ఖైదీలకు జైలు ఆఫీసులో ఇచ్చే కార్డు బయటకు తీసి, “ఏం కేసు పెట్టారో జర చూసి చెప్తారా? అని అడిగింది.
కార్డు తీసుకుని అందులో రాసిన సెక్షన్లు నా దగ్గర ఉన్న ఐపిసి పుస్తకంలో చూశాను. డెకాయిటీ కేసు. అదే చెప్పాను.
“చోరీ కేసు ఉండాలి కదా” అని ఆశ్చర్యంగా అడిగింది.
“సాధారణంగా ఒక్కరే చేస్తే చిన్న చిన్న కేసులు దొంగతనం కిందకి వస్తాయి. ఎక్కువ మంది ఉండి, ఇంటి తలుపులు పగలకొట్టి చేస్తే డెకాయిటీ. నాకు అర్థం అయ్యింది అది. నేను వకీలును కాను. కాబట్టి అంతే తెలుసు.” అన్నాను. నాతో మాట్లాడిన అమ్మాయి పేరు కాజల్ అని కార్డు మీద ఉంది.
ఆ నలుగురూ ఒకే కేసులో రాలేదని కార్డులు చూస్తే అర్థం అయ్యింది. కాజల్ తో పాటు ఒకామే ఉంది. మరో ఇద్దరు వేరే కేసు. వాళ్ళలో అందరికన్నా కాజల్ వయసులో చిన్నది అనిపించింది. పాతికేళ్ళు ఉండొచ్చు. మిగతా ముగ్గురూ చీరలు కట్టుకున్నారు. కొంగు నెత్తి మీదకు లాక్కుని వేసుకున్నారు. బీహార్ లో వివాహితలు వేసుకునే పద్ధతి అది. అందరూ బిహారీ వాళ్ళే కాబట్టి ఒకే దగ్గర కూర్చున్నారు. తరవాత దాదాపు రెండు రోజులకి ఒకసారి వాళ్ళకి కొత్త కేసుల వారంట్లు రావడం, వాళ్ళని కోర్టుకు తీసుకుపోవడం జరుగుతుండేది. కాజల్ ఒక్కతే, మాట్లాడితే అందరికీ కాస్త అయినా అర్థం అయ్యేది. మిగతా వాళ్ళు మాట్లాడే యాస అందరికీ అర్థం అయ్యేది కాదు. నిజానికి అందులో ఇద్దరు మాట్లాడితే నాకు కూడా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చేది. మొత్తానికి వాళ్ళకి ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చాలా సార్లు నా దగ్గరికి వచ్చి, కొంచెం వాళ్ళకి చెప్పండి. అని నాకు చెప్పి పోయేవారు. మొత్తానికి వాళ్ళకి ఒక డజనుకు పైగా కేసులయ్యాయి. హైదరాబాదు లోనే కాకుండా వరంగల్ కేసులు కూడా ఉన్నాయి.
ఒకసారి నేను కాజల్ ని అడిగాను. “మీది బీహార్ కదా మరి ఇక్కడ ఏంటి కేసులు? అని. కాజల్ పెద్దగా నవ్వి, బీహార్ లో ఏం ఉంది దీదీ, దక్షిణ భారత్ లోనే ఉంది అంతా. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుండి ఆడవాళ్ళు వంటి మీద ఎంత బంగారం వేసుకుంటారు? ఇక్కడ ఉన్న సంపత్తి అక్కడ లేదు మరి.” అని పక పక నవ్వింది. మొదటి రోజు ఆమె హైదరాబాదు చూడడానికి వచ్చాం అని చెప్పింది గుర్తొచ్చి నవ్వొచ్చింది. మొదటి రోజు సాధారణంగా ఎవ్వరైనా జాగ్రత్తగా మాట్లాడతారు. తరవాత తరవాత మాట్లాడ్డం మొదలుపెడతారు.
“ఎలా చేస్తారు చెప్పవా?” అని అడిగాను.
“కాస్త ఖరీదైన కాలనీల్లో ఎక్కువ రోజులు తాళాలు ఉన్న ఇళ్ళు చూసిపెట్టుకుంటాము. ముందు ద్వారాన్ని పకడ్బందీగా కట్టుకుంటారు కానీ వెనుక డోర్లు గురించి శ్రద్ధ తీసుకోరు. మనకి ముందు డోర్లతో పని లేదు. నిజానికి వాళ్ళు కేసు పెట్టినట్టు తలుపులు పగలకొట్టే అవసరం కూడా ఉండదు”
“ఇన్ని తెలివితేటలు ఉంచుకొని ఈపనులు చేసే బదులు ఏదన్నా పని చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ జైళ్ళ చుట్టూ తిరగడం”. అన్నాను.
“ఇంకొక పని రాదు. మా తాతల దగ్గర నుండీ అందరూ ఇదే పని చేశారు. మేము అదే చేస్తున్నాము. మేము కొంచెం ఆధునిక పద్దతుల్లో చేస్తున్నాం అంతే.” అంది కాజల్.
“ ఇప్పుడు కాలనీల్లో కూడా ఆధునిక పద్దతులు వచ్చాయి. సిసి కెమెరాలు ఉంటాయి. మీరు తేలిగ్గా పట్టుబడతారు. శిక్షలు పడతాయి. జైల్లో ఉంటారు. ఏం లాభం?” అన్నాను.
కాజల్ మాట్లాడ లేదు. బహుశా మాట్లాడ దలుచుకోలేదు.
“కొంచెం సేపు మౌనం తరవాత “నీ ఇంటి అడ్రసు ఇవ్వు నాకు” అంది.
“ఎందుకూ? మా ఇంట్లో కన్నం వేస్తావా?”
“కాదు వెయ్యకుండా ఉండడానికి.” అంది నవ్వుతూ.
“ఫరవాలేదులే. మా ఇంట్లో ఎత్తుకుపోవడానికి నీకు పనికి వచ్చేవి ఏమీ లేవు.” అన్నాను.
నాకు మాల్కం ఎక్స్ ఆత్మ కథలో చదివింది గుర్తుకు వచ్చింది. ఆయన కూడా అలా దొంగతనాలు చేసి మారిపోయిన మనిషి. “రాత్రిపూట ఇంట్లో ఏదో ఒక గదిలోనో, బాత్రూమ్ లోనూ ఒక లైటు వేసి ఉంచాలి. లైటు వెలిగే ఇంట్లోకి రావడానికి ఏ దొంగా ధైర్యం చేయలేడు”, అంటాడు.
**** ***** ****
హైదరాబాదులో చాలా కోర్టులున్నాయి. అన్నీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి అందరినీ ఒకే వ్యానులో తీసుకుపోవడం అనేది ఉండదు. సాధారణంగా రోజూ ఉదయం పది గంటలకంతా కోర్టుకు హాజరు కావల్సిన వాళ్ళంతా జైలు గేటు దగ్గర ఆఫీసు బయట చెట్టు కిందకి చేరతారు. బయట నుండి కనిపించే ఎత్తైన బయటి గేటు లోపల ఒక పెద్ద హాలు ఉంటుంది. దానికి ఒక పక్క జైలరు, సూపరింటెండెంట్ ల కార్యాలయాలు ఉంటాయి. మరొక పక్క మూలాకాతీ రూము, ఖైదీలను సోదా చేసేందుకు ఉద్దేశించిన రూము ఉంటాయి. హాల్లో హెడ్ వార్డరు కోసం ఒక టేబుల్ కుర్చీ ఉంటాయి. హాలు నుండి బయటకు, అంటే జైలు లోపలికి పోవడానికి మళ్ళీ ఎత్తైన ఇనప గేట్లు ఉంటాయి. వాటికి ఉన్న చిన్న గేటు మాత్రమే తెరుస్తారు. అక్కడ ఆఫీసులో రెగ్యులర్ క్లర్కులకు సహాయ పడడానికి కొందరు శిక్ష పడిన ఖైదీలు పని చేస్తూ ఉంటారు. వాళ్ళని రైటర్స్ అంటారు. వాళ్ళు వివిధ కోర్టులకి పోవాల్సిన వాళ్ళ జాబితాలు తయారు చేసి ఒక్కొక్క కోర్టుకు తీసుకుపోవడానికి ఎస్కార్టు రాగానే ఆ చిన్న తలుపులో నుండి తల బయట పెట్టి పిలుస్తారు. ఒకే కోర్టుకు పోవాల్సిన వాళ్ళందరినీ కలిపి తీసుకుపోతారు. నేను వెళ్ళే కోర్టులో కూడా కాజల్ వాళ్ళకి కేసులున్నాయి. కానీ మేమెప్పుడూ కలిసి పోలేదు.
మొదటి సారి కోర్టుకు పోవాల్సి వచ్చినపుడు నేను కూడా నేను వెళ్లాల్సిన కోర్టుకు పోయే అందరితో పాటు నిలబడ్డాను. కానీ నా పేరు పిలవలేదు. నేను “ప్రమాద కరమైన మనిషి”ని కాబట్టి నన్ను తీసుకుపోవడానికి ప్రత్యేకంగా ఒక వాహనం వస్తుందని చెప్పారు. నాకు ఎస్కార్టు వచ్చేవాళ్ళు కూడా సంబందిత పోలీసు స్టేషన్ నుండి ఒకరో ఇద్దరో ఉండి, మిగతా వాళ్ళు హెడ్ క్వార్టరు నుండి సాయుధ పోలీసులు, కనీసం ఒక ఏ.ఎస్.ఐ ర్యాంకు మహిళా పోలీసు ఆధ్వర్యంలో తీసుకువెళ్ళేవారు. నాకు కూడా ఈ ఏర్పాటు బాగానే ఉండేది. కోర్టులో పడిగాపులు పడకుండా త్వరగా వెళ్ళి వచ్చేయవచ్చు, అని.
మేము కోర్టుకి వెళ్ళేటప్పుడు ఉదయం పెట్టే టిఫిన్ తిని కిచెన్ దగ్గర కోర్టుకి పోతున్నాం అని చెప్పి పోతే, వాళ్ళు మేము భోజనం టైమ్ అయిపోయాక వచ్చినా తీసిపెట్టేవాళ్ళు. కొంచెం దూరం ఉన్న కోర్టులకి వెళ్ళేవాళ్లు వచ్చే సరికి ఒక్కోసారి సాయంత్రం అయిపోయేది. ఆకలితో నకనకలాడే వాళ్ళు. కొందరు బిస్కట్లు, కానీ పండ్లు కానీ తీసుకుపోయేవాళ్ళు.
ఒకరోజు కాజల్ వాళ్ళు కోర్టుకు పోయి వచ్చి భోజనం తెచ్చుకోరా? అంటే “ఆకలి లేదు. చికెన్ బిర్యానీ తిన్నాం” అన్నారు. నాకు నోట మాట రాలేదు. అదెలా అంటే, “పోలీసులు తినబెట్టారు” అంది.
నిజానికి బయటి వూర్లకి వెళ్తే ఖైదీలకి తిండి పెట్టించడానికి ఒక్కొక్కరికి 60 రూపాయల చొప్పున ఎస్కార్ట్ పోలీసులకి ఇస్తారు. వాళ్ళు దానితో మధ్యాహ్న భోజనం పెట్టిస్తారు. కానీ స్థానిక కోర్టులకి తీసుకువెళ్తే ఆ సదుపాయం ఏమీ ఉండదు. మరి ఎలా పెట్టారు?
అదే కాజల్ ని అడిగితే నవ్వేసి, “మాకు ప్రతి సారి, చాయ్ లు బిస్కెట్లు, టిఫిన్లు పెట్టిస్తుంటారు. ఈరోజు నేనే అన్నాను. బిర్యానీ తినిపించవచ్చు కదా అని. తినబెట్టారు. ఎస్కార్టు వాళ్ళు మాతో చాలా బాగుంటారు దీదీ” అంది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు.
కొద్ది కాలానికి కానీ నాకు ఆ మిస్టరీ వీడలేదు. కాజల్ వాళ్ళకి ఒక కేసులో విచారణ మొదలయ్యింది. కోర్టుకి వెళ్ళి వచ్చిన రోజు అక్కడ ఏం జరిగిందో వచ్చి చెప్తూ ఉండేది. ఎవరి కేసులో నయినా విచారణ మొదలయ్యిందంటే సాధారణంగా వాళ్ళు వెనక్కి వచ్చాక ఆ వార్డులో అందరూ పడుకొనే వరకూ తప్పక అదే చర్చ నడుస్తది.
కాజల్ వాళ్ళు ఆరోజు కొంచెం ఆలస్యంగా వచ్చారు. రాగానే నవ్వుకుంటూ వచ్చింది. “ఏంటి సంగతి” అని అడిగాను.
“ఈ రోజు జప్తు సామాను తీసుకు వచ్చారు. ఓ! మస్తు సామాను తెచ్చారు. వెండి గిన్నెలు, పళ్ళాలు పూజ దగ్గర ఉండే కుందెలు, దీపపు సమ్మెలు, ఇంకా ఏవేవో ఉన్నాయి. మస్తు వెండి సామాను.” అని ఒకటే నవ్వు.
ఇందులో అంత నవ్వెందుకో నాకర్థం కాలేదు. “అయితే ఏంటి? ఎందుకు నవ్వుతున్నావు?” అన్నాను.
ఆమె నాకేసి చూసి అమాయకురాలా అన్నట్టు నవ్వింది. కనీసం నాకలా అనిపించింది.
“దీదీ, వాళ్ళు తెచ్చింది “వెండి” సామాను!!! మేము వెండి సామాను కొట్టేస్తామా? హా.హ…హ….!!! అని ఇంకా నవ్వుతూనే పొట్ట పట్టుకుంది. కొద్దిగా సంభాళించుకొని, “వెండి సామానా? థూ! ఇంత కష్టపడి ప్లాను చేసి, కారులో పోయి, ఇట్లా కేసులయితే లాయర్లను పెట్టుకొని ఎందుకూ పనికి రాని వెండి సామాను కొట్టేస్తామా చెప్పు.” అంది కాజల్.
నాకు నోట మాట రాలేదు. గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయేసరికి ఆమెకి జాలేసినట్టుంది.
“ఇంకా అర్థం కాలేదా? అసలు ‘మాల్’ నొక్కేశారు.”
“మరి ఈ సామాను” అని తెల్లబోయి అడిగాను.
“కొత్త కేసు పెట్టిన ప్రతిసారీ మమ్మల్ని రిమాండ్ లోకి తీసుకుంటారు కదా. అప్పుడు విచారణ పెద్దగా ఏమీ ఉండదు. నగల షాపులకి తీసుకుపోయి ఇవే కదా వీళ్ళు అమ్మింది, నీకు దొంగ సామాను అమ్మినట్టు విచారణలో తేలింది అంటారు. వాళ్ళు భయపడో లేక పోలీసులతో గొడవెందుకులే అనో కొంత సామాను ఇచ్చేస్తారు. ఒక్కోసారి వీళ్ళు బంగారం కూడా తీసుకుంటారు. కోర్టులో వెండి చూపెట్టారు అంటే పెద్ద గా శిక్ష కూడా పడదు. మా వల్ల అంత లాభం కలిగితే ఆమాత్రం చెయ్యాలిగా మరి” అంది.
**** ****
ఆరోజు నాకు కోర్టు ఉంది. జైలు వాళ్ళు స్పెషల్ ఎస్కార్టు అని రాయాలట. మర్చిపోయారు. కాబట్టి ఎస్కార్టు వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చే వెహికిల్ ఇవ్వలేదు. వాళ్ళు గాభరా పడి ఏం చేయాలి అని వాళ్ళ అధికారులని సంప్రతించారు. చివరికి నేను వెళ్ళే కోర్టుకి పోతున్న మిగతా ఖైదీలతో కలిపి పంపమని చెప్పారట. కాబట్టి హెడ్ క్వార్టరు నుండి వచ్చిన ఎస్కార్టు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సంబందిత పోలీసు స్టేషన్ నుండి నాకోసం వచ్చిన ఇద్దరూ మాత్రం నాతో పాటు వ్యాను ఎక్కారు. నలుగురైదుగురు ఇతర ఖైదీలు, వాళ్ళ ఎస్కార్టు కోసం వచ్చిన మహిళా కానిస్టేబుల్స్ తో పాటు అలా మొదటిసారి నేను అందరిలాగే నీలి పోలీస్ వ్యానులో కోర్టుకి బయలుదేరాను. ఆలస్యం అవుతుందేమో అని చదవడానికి ఫ్రంట్ లైన్ కూడా తెచ్చుకున్నాను. కాబట్టి వ్యానులో తలొంచుకొని పుస్తకం చదువుతున్నాను. డ్రైవర్ తప్ప అందరూ మహిళా పోలీసులే. పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారు. గోల గోలగా ఉండి చదివేది బుర్రలోకి ఎక్కడం లేదు. చాలా మంది మహిళా పోలీసులు స్మార్ట్ ఫోన్లు తీసి వాట్స్అప్ లో వచ్చిన మెసేజ్ లని, వార్తలని పెద్దగా చదవడం చర్చించడం మొదలుపెట్టారు.
“హే! బ్యాంకు రాబరీ జరిగిందట. వాళ్ళకి మనవాళ్ళ సంగతి తెలియదులే. పాపం బోలెడు కష్టపడి ప్లాను చేసిఉంటారు. ఎలాగూ పట్టుకుంటాం. అసలే మన సారింట్లో పెళ్ళి కూడా ఉంది. బోలెడు పెండింగు కేసులు కూడా ఉన్నాయి. అవి కూడా తోసేయ్యచ్చు. మొన్న జరిగిందాంట్లో కూడా ఫుల్లు ‘మాల్’ దొరికిందంటా. మనవాళ్లు భలే నోక్కేశారు తెలుసా!” ఒక కానిస్టేబుల్ ఘనకార్యం చేసినట్టు గట్టిగా, ఉత్సాహంగా మాట్లాడుతోంది.
అకస్మాత్తుగా అంతా నిశ్శబ్దం ఆవరించింది. నేను తలెత్తలేదు కానీ నాకు అర్థం అయ్యింది. ఎవరికో సడన్ గా నేను కూడా వ్యానులో ఉన్నానని గుర్తుకొచ్చింది. ఠక్కున నోళ్ళు మూశారు. కవర్ చేయాలని ఎవరికో గుర్తు వచ్చినట్టుంది.
“ఏం కాదే. ఇవ్వాళ రేపు తప్పుడు కేసులు పెడితే ఎవరు వూరుకుంటారు కానీ. అదేం కాదట”, అన్నది ఒక కానిస్టేబుల్. అంతకన్నా ఏం అనాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదు. కాసేపు ఆగి ఆ నిశ్శబ్దాన్ని భరించలేము అన్నట్టు మరో టాపిక్ ని ఈసారి జాగ్రత్తగా ఎంచుకున్నారు. “ఏం కూర తెచ్చావే ……”
నేను ఏవీ విననట్టు పుస్తకంలో నుండి తల ఎత్తకుండా పేజీలు తిరగేస్తూ ఉండిపోయాను. కాజల్ చెప్పినవే గుర్తుకొస్తున్నాయి.
“నిజమే దీదీ, మేము చోరీ పనే చేస్తాము. కానీ ఆ “మాల్” మేము ఒక్కళ్ళమే తింటున్నామా? ఇంత చేస్తే మా కడుపుకి ఇంత తినటం, పిల్లలకి పెట్టటమే కష్టం. సీజన్ లో వ్యవసాయ పనులు కూడా చేస్తాము. అప్పుడు దొరికేదానికన్నా ఇప్పుడు దొరికేది పెద్ద ఎక్కువేమీ కాదు. తినడం ఇంత మంది తింటారు. లాయర్లు కూడా మాదగ్గర ఎక్కువ తీసుకుంటారు. కానీ “దొంగ” అని మమ్మల్ని మాత్రమే అంటారు. మాకు “వర్దీ” (యూనిఫాం) లేదు కదా!
nice story…anruradha garu…