స్వప్న స్పర్శ
------------
 
భూగ్రహం మీద
ఉల్కల వంటి వారు

మట్టితో కలిసి
చిగుళ్ళకు ప్రాణం పోసే
ఉల్కలు
అరణ్యంలో పిట్టలకు
కాంతిని ఆయుధంగా ఇస్తారు

అవి అడవిని
కాపలా కాస్తుంటాయి
తమ నీడలని
రాత్రింబవళ్ళకి రెక్కలు గా తొడిగి

1.
సముద్రపుటలల మీంచి
జారే సూర్యరశ్మి లాంటి
పారదర్శక జీవితాలవి

తమతో తాము పోరాడుతూనే
చుట్టూ పరిసరాల్తో తీరని
సంఘర్షణలో మునిగి ఉంటాయి

గాయమయమౌతూనో,
గానమయమౌతూనో,

2.
లేత కాంతికి  బట్టలుగా తొడిగినట్టు
నిండైన దృష్టి

ఆదివాసి ఊదే
బూరలాంటి స్పష్టాతిషైపష్టమైన కంఠస్వరం

ఖంగున మ్రోగే మాట
వినగానే మెదడులో రూపం ప్రసారమయేంత
తాజా ఉద్యమ ప్రతిబింబాలు వాళ్ళు

వాళ్ళు
మన కళ్ళ మీదా హృదయంమ్మీదా
తొలి జాము మంచు తెరలా
కదలాడుతుంటారు
మన లోపలి కదలికలౌతుంటారు

అమావాస్యను పున్నమిగా మారుస్తూనో...
చెలమల నిండా నీళ్ళను నింపుతూనో...


2.

సమిష్టి వృక్షం కింద
సప్తవర్ణాల స్వప్నాలను
కనడం అలవాటు వారికి


దోపిడీ వడగాల్పులు
అరణ్యం చుట్టూ అలముకున్నప్పుడు
అడవి సంపదని
చెద పురుగుల్లా నమలాలనున్నప్పుడు

కన్ను మీద చూపును బెదరినివ్వరు
చూపు మీద కన్నీటి చెమ్మ ఊరనివ్వరు

పచ్చదనాన్ని ఆర్మీ ట్యాంకర్లతో
కుళ్ళబొడిచడానికొచ్చినప్పుడు
హంతక ముఠాల్తో
రోజువారీ సంగ్రామం ఓ సుదీర్ఘ వ్యాపకం..వారికి

స్వేచ్ఛ తనను తాను స్వచ్ఛంగా
వ్యక్తికరించుకునే వనం వారి హృదయం

వెదురుకు గాలి ప్రాణం పోసి
వేణుగానం నేర్పిస్తూనో
వేకువజాముకు మేల్కోలుపునిస్తూనో



3.
వాళ్ళతో అడగకండి
మీరెలా ఇంతలా సంఘర్షణతో
మనుగడెట్లా కొనసాగిస్తున్నారు అని

ఆగాగి ఉండుండి వీచే మలయమారుతంలా
ఓ చల్లని సాయంకాలాన్ని మన ప్రశ్నపై అంటించి

తుపాకుల ప్రతిధ్వనులకు బెదిరి చెదిరే పక్షుల ఆక్రందనల దృశ్యాలని
మనకు కళ్ళముందుంచుతారు


పై నుంచి డ్రోన్లు జారవిడిచే బాంబు
శబ్దాలకి వణికే ఆదివాసీ గూడెం గుండెని
ఆగిపోకుండా కాపాడుకోవడంలో ప్రాణం పెడుతుంటారు

మృత్యు దండయాత్రల్ని ఎదుర్కోంటున్న
వారి నవ్వుల్ని చెట్లు ఆకులుగా తొడుగుకొని
చల్లదానాన్ని ఎండకు కానుకిస్తుంటాయి

జాబిలిలా
వెలుతురు వెదజల్లుతాయి
కాంతి వనాలను
విస్తరిస్తూ పోతాయి

వారి సహవాసంలో
మీరూ
అరణ్యాన్ని లోపల నింపుకొని
బయటికి జలపాతమై జాలువారుతారు

విధ్వంసకర క్షణాల మధ్య కూడా
వారి నవ్వుల్లో వెన్నెల మీ పై పడి
మీరో మెరుపు ప్రతిమగా మారతారు

వారి మధ్య తాచ్చాడినప్పుడు
కలిసినడిచినప్పుడు

మీలో తడి తడి స్వప్న స్పర్శ..
మీ లోంచి మట్టి శ్వాస...
మీరు మీ నీడ లో
విరగ్గాస్తున్న వనాన్ని చూసుకుంటారు...

మీకు తెలియకుండానే
ఓ మహత్తర విముక్తి
పోరాటంలో భాగస్వాములైపోతారు

ఒక ఆయుధంతోనో..
నిరాయుధంగానో...




విముక్తం
----------
 
నెత్తుటి విత్తులు నాటి
పెంచుకున్న
ఆదాయం చెట్టు
కళ్ళ ముందు కూలిపోయింది

పండ్లు పంచుతుందనుకున్న
దేశ ఆర్థిక వ్యవస్థ
నేరస్తుల తిజోరీల్లో బంది అయింది...

ఫాసిస్టు నాయకుడి రాజ్యంలో
జీవితం లాభనష్టాల వ్యాపారానికి
తక్కెడలా అంటూ ఇటూ ఊగుతోంది

కళ్ళకి అవాస్తవాల గంతలు ఎలా కట్టచ్చో
తెలిసిన తెలివి మీరిన తనం
దేశకాల సర్వావస్థల్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది

ఇక కళ్ళు మనవి చూపు వాళ్ళది
నోరు మనదే
వారి మాట కోసం తెరుచుకుంటుంది

ఇప్పుడు ప్రతి వ్యవస్థా
ఆధిపత్య కమరువాసన కొడుతోంది
జీ హుజూర్ అనే బానిస మనస్తత్వాన్ని అలవరుచుకుంది

ఇప్పుడు ఎవరూ
నోరు విప్పడం లేదు
నోరే కాదు కనులూ విప్పడం లేదు
చెవులకి అబద్ధాల లోలాకులు కుట్టారు వాళ్ళు
తాడుగుతూంటే వీళ్ళు రిక్కిస్తున్నారు
న్యాయం తన ఆత్మైన స్వతంత్రత ను
కోల్పోయి రాజ్యసభ సీటు కో, గవర్నర్ గిరీకో
అతుక్కుపోయింది


చేతులకు చేతులు లేవు
నడకలకు బరువైన కాళ్ళు తొడిగారు

చేయమన్నది చేయడానికి
పూనుకునే
రోబోలం మనం
అతికించబడిన నవ్వుతో
బతుకొక అతుకుల బట్ట

గంగిరెద్దులా తల ఊపడం
దేశభక్తికి ఆలవాలం
ప్రజాస్వామ్యాన్ని ప్రజానాయకుడు కాదు
మధ్యయుగాల ప్రతినిధి పరిపాలిస్తున్నాడు
యుగాలుగా బూజు పట్టిన ఆలోచన

దేశం కోసం ధర్మం కోసం
ఇపుడు చేయాల్సింది
త్యాగాలు కాదు మోసాలు

పరిమితికి మించిన
ఆస్తులు ఉండడం
ప్రజా సేవ ఇప్పుడు

మోసాలు చేసి పరదేశాలకు
పారిపోయిన వారిని చూసి
అంతర్జాతీయ స్థాయి లో దేశ గౌరవ మర్యాదలు  తలదించుకుంటుంటే
ఇక్కడ మాత్రం
ఇంటంటి పై త్రివర్ణాన్ని ఎగరవేస్తున్నాం

శ్రమదోపిడీని  తరిమికొట్టాల్సిన వాళ్ళం
వస్తుసేవల రూపంలో
ఇండ్లలో కి దొంగలను ఆహ్వానిస్తున్నాం

ఎంత ఆర్థిక మోసానికి అంతే పెద్ద పీట
పీటని ప్రశ్నించడం , ఎదురెళ్ళడం దేశద్రోహం


అవును ఇపుడు
మనమంతా దేశద్రోహమే చేయాలి

అదానీ అంబానీ మార్క్
దేశభక్తి నీ
ప్రభుభక్తిని
ప్రశ్నించి నిలదీయడం కాదు
నిట్టనిలువుగా నిప్పు పెట్టే
దేశద్రోహం చేయాలిప్పుడు

పదండి దేశద్రోహం చేద్దాం
దేశాన్ని క్రోనీ కాపటలిస్టుల
నుంచి కాపాడుకొందాం.

Leave a Reply