1
జీవనయానం

నేను నీ పాటలు పాడుతుంటాను
మశీదు ప్రాంగణంలో దినుసులు తినే పావురాల్లా
వాళ్ళు గుమిగూడతారు

జీవనసాగరపు
లోతుని పాటలు
వాళ్ళకి పరిచయం చేస్తాయి

కటిక నేల మీదా బురద వాలులపై
జీవన శకలాలని జారనిచ్చేవారు
జారుతూ జారుతూ గాయపడడమే బతుకైన వారు
ఎడారి  ఎండ వేడి చురుకుని పాదాలపై మోసేవారు

లోయల లోతుల్లోంచి కనబడని ఆకాశంకై భూఉపరితలాన్ని తాకే కలలు కనేవారు
సాగించాల్సిన ప్రయాణ భారాన్ని
లెక్కించుకుంటారు

పాటల గూడార్థం అర్థమైన తర్వాత
వాళ్ళు సీతాకోకచిలుకల్లా మారిపోతారు

మనోభారం దిగిపోవడం కంటే
గొప్పదేమీందీ లోకాన!
అన్ని బలహీనతల బరువులను దించుకొని
పావన హృదయంతో వాళ్ళు ప్రపంచంలోకి వెళతారు

జహాపనా!
నీ పాటల సమక్షం
వారికి అన్నీ నేర్పిస్తుంది
పదంతో పదం కలపడం
పాదం తో పాదం కలపడం
ప్రయాణం నిజంగా నీ గీతాల తోడులో-
సాఫిగా సాగిపోతుంది

బిడారుకి
పాట ని అలుపు తీర్చుకునే ఆహారంగా
అందించినందుకు
షుక్రియా!


2
నీ ప్రేమ తో

ఎల్లప్పుడూ నీ ప్రేమతో
నిండుగా ఉంటానా!
లోపలంతా శూన్యం మాయమై
ఆనందం
నాట్యం చేస్తుంది
సంతోషపు అలికిడి అలికి చిలికి
మనో ప్రాంగణం మధుర గానం ఆలపిస్తుంది
పిల్లల నవ్వు కేరింతలా
సంతోషం, దుఃఖం స్థానాన్ని భర్తీ చేసి
ఖాళీతనపు సుడిగుండం మాయమైపోతుంది
కాలం స్థాణువు కాదు నీ సమక్షంలో జహాపనా!
అది నిత్య ప్రవాహపు వెన్నెల నది
సమస్త మోహ పరిత్యాగపు
పరిమళం ఒక దువా నాకు
నీ నుంచి దూరం పోవడం నాకు నేను చేసుకునే 
ద్రోహం
నీ అడుగుజాడల దోసిలి లో నీడనై
నీతోనే సంచరిస్తుంటాను
దువాల బిడారు నా వెనుక వెనుకే...!

Leave a Reply