మరోసారి ఆర్థిక సంక్షోభం రాబోతున్నదా! ప్రపంచ దేశాలు మాంద్యం బారిన పడబోతున్నవా! రష్యా-యుక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధంతో ఇప్పడికే భారీగా నష్టబోయిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు మళ్లీ చిల్లులు పడబోతున్నాయా! ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. గత ఆరు మాసాలుగా ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు క్రమంగా ఒక్కొక్కటి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నదన్న సాకును చూపెడుతూ అన్ని దేశాల బ్యాంకులు వడ్డీ రేట్లను ఒక్క శాతం పైనే పెంచేశాయి. ఈ నిర్ణయాలతో మదుపరుల్లో ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ద్రవ్యోల్బణం కోరలు చాస్తుండడంతో సెంట్రల్‌ బ్యాంకులు దీనిని కట్టడి చేయడానికి వడ్డీరేట్ల పెంపును తెరపైకి తీసుకొచ్చాయి.

            వారం రోజుల్లో (మార్చి 8నుండి 15 వరకు) మూడు అమెరికన్‌ బ్యాంకులు దివాళా తీయడం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాన్ని మరోసారి ప్రపంచం ముందుకు తెచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. వారం రోజుల్లో అమెరికాకు చెందిన సిల్వర్‌గేట్‌ బ్యాంక్‌, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌(ఎస్‌విబి), సిగ్నేచర్‌ బ్యాంక్‌లు దివాళా తీశాయి. అమెరికాలోని ప్రధాన బ్యాంకుల స్టాక్‌ విలువ ఏడు నుంచి 12 శాతం మేర పడిపోయింది. ఎనిమిది వేల కోట్ల డాలర్‌ల వరకూ ఆవిరయ్యాయి. తాజా పరిణామాలతో 2008 నాటి ప్రపంచ బ్యాంకింగ్‌ రంగ సంక్షోభం పునరావృతమవుతుందా? అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అప్పట్లో 150కి పైగా బ్యాంకులు కుప్పకూలి అమెరికా  బ్యాంకింగ్‌ వ్యవస్థ అల్లకల్లోలమయింది. ప్రస్తుతం దివాళ తీసిన మూడు బ్యాంకుల్లో ఎస్‌విబి అమెరికాలోని 16వ అతి పెద్ద బ్యాంక్‌. ఈ బ్యాంకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌ కంపెనీల నుంచి డిపాజిట్లను సేకరించి, వాటికి అధికంగా రుణాలిస్తుంది. సాధారణంగా స్టార్టప్‌ కంపెనీల వంటి వాటికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనకాడతాయి. ఈ బ్యాంక్‌ అందుకు భిన్నంగా రుణాలిస్తుంది.

            ఏడాది కాలంగా అమెరికాలోని కేంద్ర బ్యాంక్‌ అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. రిస్క్‌ తీసుకుని ఎస్‌విబి లాంటి బ్యాంక్‌లలో డిపాజిట్లు పెట్టే బదులు ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకునేందుకు కొందరు డిపాజిట్‌దారులు మొగ్గు చూపారు. వారు తమ డిపాజిట్లను ఉపసంహరించడం మొదలుపెట్టారు. స్టార్టప్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమాన్యాలు కూడా డిపాజిట్లను వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఎస్‌విబిపై ఒత్తిడి పెంచాయి. డిపాజిట్లను వెనక్కి ఇచ్చే నిధులు లేకపోవడంతో అమెరికన్‌ ట్రెజరీలో పదేళ్లకు పెట్టుబడిపెట్టిన బాండ్ల అమ్మకాలను ఎస్‌విబి మొదలుపెట్టింది. సాధారణంగా 3.5 శాతానికి పైగా రావాల్సిన వడ్డీ రేటు 1.77 శాతానికి తగ్గినా 21 బిలియన్‌ డాలర్ల విలువైన బాండ్లను అమ్మామని, అందువల్ల 1.8 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చిందని ఆ బ్యాంకు తాజాగా ప్రకటించింది. దీంతో, ఒక్కరోజులో ఆ బ్యాంకు షేర్‌ విలువ 60 శాతం పడిపోయింది.

            ఎస్‌విబితో పాటు దివాళా తీసిన ౖ న్యూయార్క్‌లోని సిగ్నేచర్‌ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి, ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిఐసి) ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. సిగ్నేచర్‌ బ్యాంక్‌తో పాటు సిల్వర్‌గేట్‌ బ్యాంక్‌ పతనానికి ఆ బ్యాంకులు క్రిప్టో డిపాజిట్లను అధికంగా స్వీకరించడమే కారణమని విమర్శలున్నాయి. ఈ బ్యాంకుల శాఖలు, అత్యధికంగా కస్టమర్లు ఉన్న మనదేశంతోపాటు చైనా, కెనడా, డెన్మార్క్‌, ఇజ్రాయిల్‌, జర్మనీ వంటి దేశాలను తాజా పరిణామాలు కలవరపరుస్తున్నాయి. ఎస్‌విబి, సిగ్నేచర్‌ బ్యాంకు డిపాజిట్‌దారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్సూరెన్స్‌ ఉన్నా, లేకపోయినా… మొత్తం డిపాజిట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. తాజా ప్రకటనతో బడా పెట్టుబడిదారులు కొంత ఉపశమనం పొందుతుండగా, వెంచర్‌ క్యాపిటలిస్టులు, ఉద్యోగ, కార్మిక వర్గాలు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

            అమెరికా బ్యాంకింగ్‌ సంక్షోభం యూరప్‌ను తాకింది. యూరప్‌లోని అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన క్రెడిట్‌ సూయిస్‌ కూడ దివాళా అంచుల్లో ఉంది. దీని షేర్లు మార్చి 16న ఒక్క రోజులో 25 శాతం  పడిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదుర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్‌ అవుట్‌ ఇస్తోంది. అలాగే యుబిఎస్‌ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో నిరుద్యోగంతో పాటు అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులు విపరీతంగా పెరిగాయి. 40 శాతం మంది తమ ఆదాయంలో 30 శాతానికి పైగా ఇంటి అద్దెకే చెల్లించాల్సి వస్తోంది. బ్యాంకుల దివాళా ఆసియన్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. వరుస నష్టాలతో సెన్సెక్స్‌, నిప్టీలు ఐదు మాసాల కనిష్టానికి పడిపోయాయి. తాజా పరిణామాలు కొత్తగా స్టార్టప్‌లు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి అశనిపాతంగా మారుతున్నాయి. వాటి ప్రభావం నిరుద్యోగితను మరింతగా పెంచుతుందనే ఆందోళన నెలకొంది. ప్రపంచ పెట్టుబడిదారీ విధానంలోని డొల్లతనాన్ని ముందుకుతెచ్చిన ఈ సంక్షోభం ప్రజా ఆందోళనలకు దారితీస్తున్నది.

            ముంచుకొస్తున్న ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు… అగ్రరాజ్యం… చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకొస్తోంది. ఈ సంకేతాలు ఎప్పట్నుంచో ఉన్నా ఐయంఎఫ్‌,  ప్రపంచబ్యాంకు తాజా హెచ్చరికలు ముందుంది ముసళ్ల పండగ అని చెబుతున్నాయి… ఇంతకీ ఐయంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు ఏం చెబుతున్నాయి…? రెసిషన్‌ ప్రభావం ఎలా ఉండబోతోంది…? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచున నిలిచింది. ఆర్థిక మందగమనం సునామీలా విరుచుకుపడబోతోంది. ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి-ఐయంఎఫ్‌ చేసిన తాజా వార్నింగ్‌ ఏ క్షణమైనా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయన్న భయంకర నిజాన్ని బయటపెట్టింది. వృద్ధిరేటు అంచనాలను తగ్గించడమే కాదు… మాంద్యం కాటు తప్పదంటోంది ఐయంఎఫ్‌. ప్రపంచంలో మూడో వంతు దేశాలు ఈ ఏడాది దీని బారిన పడక తప్పదంటోంది. ఐయంఎఫ్‌ హెచ్చరికలు చూస్తుంటే ప్రపంచం ఈ ముప్పు నుంచి బయటపడటం పెద్ద సవాలే…

            ‘పెట్టుబడి’కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్‌, అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలతో పాటు ప్రపంచమంతటా మాంద్యం మేఘాలు ఆవరించాయి. సంపద కేంద్రీకరణ వినాశకర విధానాల వల్ల ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దశలో కొవిడ్‌ మహమ్మారి  ముంచెత్తడం, లాక్‌డౌన్లు తదితర పరిణామాలతో మళ్లీ కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే ఎత్తుగడలనే పాలకులు అవలంబించడంతో ఎక్కడికక్కడ ఆర్థిక అసమానతలు పెరిగి సంక్షోభం మరింతగా ముదిరింది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా, రైల్వే సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇతర రంగాల ఉద్యోగులు సమ్మెలతో హోరెత్తిస్తున్నారు. లక్షలాది మంది ప్రజానీకం వీధుల్లోకి వచ్చి సంఫీుభావం తెలియజేస్తూ ప్రజా ఐక్యత చాటుతుండటం హర్షణీయం. ఫ్రాన్స్‌లో పెన్షన్‌ వయస్సును 62 నుండి 64 ఏళ్ళకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ 11 లక్షల మందికి పైగా కార్మికులు రెండు వారాల్లో రెండోసారి నిరసన చెపట్టారంటే ఆర్థిక సంక్షోభ ప్రభావాలు వారిపై ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో రవాణా కార్మికుల సమ్మె సైతం పెట్టుబడిదారీ దోపిడీపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహంలో నుంచి పుట్టుకొచ్చిందే.

            శ్రీలంక, ఆ తరువాత పాకిస్తాన్‌ ఇలా ఒక్కొక్కటిగా ఆసియా దేశాలు కూడా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలతో భారత్‌ కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి పెరిగిందని సిఎంఐఇ పేర్కొందని పైనాన్సియల్‌  టైమ్స్‌ ఉటంకించింది. దేశంలో ఉపాధి రహిత వృద్ధి ఆందోళన కలిగిస్తుందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద మహీంద్రా చెప్పారు. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిందే దరిమిలా మౌలిక, సేవా, ఆహార రంగాలన్నింటినీ అంబానీ, అదానీలకే దోచిపెడుతున్న వైనాన్ని చూస్తున్నాం. ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కుంభకోణం… దానికి బ్యాంకులు, ఎల్‌ఐసి వంటి విత్త సంస్థలు రూ.వేలాది కోట్లు రుణాలు కుమ్మరించినందున దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంకెంతటి ప్రభావం చూపనుందో! మోడీ ప్రభుత్వం ఆర్థిక విధానాల వైఫల్యాలకు తోడు గోబెల్స్‌ సమాచారాన్ని జనానికి అందించే వాట్సప్‌ విశ్వవిద్యాలయం, మత విద్వేషాన్ని బోనస్‌గా ఇచ్చింది.

            ప్రపంచవ్యాప్తతంగా పెట్టుబడిదారీ దేశాలను కుదిపేస్తున్న ప్రజాందోళనలకు కారణం ఆయా దేశాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక విధానాలే. సంక్షోభం అనేది ‘పెట్టుబడి’ విత్తులోనే దాగుందన్నది మార్క్సిజం ఏనాడో చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య విధానాలు అనుసరించిన పెట్టుబడిదారీ దేశాలు.. ఆ తర్వాత (1980లో)థాచర్‌-రీగన్‌ సూత్రీకరణలతో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి మార్కెట్‌కు దోచిపెట్టడమే ప్రధాన బాధ్యతగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక దోపిడీ మంత్రాంగాన్ని జపిస్తూ వచ్చాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ వంటి సంస్థల మాటున రుణాలు ఎరగా వేసి పేద, వర్థమాన దేశాలను పెట్టుబడిదారీ దేశాలు నడ్డివిరుస్తూ వస్తున్నాయి. విత్త సంస్థల షరతులకు పాలకులు మోకరిల్లడంతో శ్రామికులు, రైతులు, సాధారణ ప్రజానీకం బతుకులు అగమ్యగోచరంగా మారిన సంగతి విధితమే. స్వేచ్ఛా వాణిజ్యం మాటున పెట్టుబడిదారీ గుత్తాధిపత్యానికి అన్ని రంగాలలో స్వేచ్ఛను అనుమతించడంతో ప్రపంచంలో అసమానతలు ఆకాశమంత పెరిగిపోయాయి.

            ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో సహా ప్రస్తుత ఆర్థిక మాంద్యం మేఘాలు ఆవరించడానికి కొవిడ్‌ను, రష్యా-యుక్రెయిన్‌ వివాదాన్ని పెట్టుబడిదారీ దేశాలు సాకుగా చెబుతున్నాయి. వాస్తవానికి 2008లో అమెరికాలో మొదలైన ప్రపంచ సంక్షోభానికి ఇది కొనసాగింపే తప్ప కొత్తగా పురుడుపోసుకున్నది కాదు.గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ మరియు అమెజాన్‌ వంటి పెద్ద టెక్‌ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపును ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. గత ఏడాది టెక్‌ కంపెనీలు లక్షన్నర మందికి పైగా ఉద్యోగులను ఇళ్లకు పంపినట్లు అంచనా. రోబోల కంటే హీనంగా వేతనజీవులను అమెజాన్‌ రాచిరంపాన పెడుతోందంటూ బ్రిటన్‌లోని అమెజాన్‌ కార్మికులు సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని కంపెనీ గిడ్డంగి వద్ద సమ్మె చేపట్టారు. ఒక్క అమెజానే కాదు… కార్పొరేట్‌ కంపెనీలన్నీ ఇదే తీరుతో శ్రమదోపిడీకి పాల్పడుతున్నా… పాలకులు నోరు మెదపడం లేదు. సులభ వ్యాపార ర్యాంకింగ్‌ కోసం పోటాపోటీగా కార్పొరేట్‌ సేవలో పునీతమవుతున్నారే మినహా కష్టజీవుల గోడు పట్టడం లేదు. భారత్‌లో ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు జాతీయత, మెజారిటీ మతోన్మాద ఆగడాల కత్తి దూస్తోంది.

            ఆర్థిక మందగమన పరిస్థితులు వస్తే ఏం జరుగుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం తల్లకిందులవుతుంది. కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతుంది. దీంతో ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం పడిపోవడం అంటే కొనుగోలు శక్తి తగ్గిపోవడమే. అంటే ఏం కొనలేం.. తినలేం… గిరాకీ తగ్గిపోతుంది. దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. దీంట్లో కోతలు పడటం అంటే మరిన్ని ఉద్యోగాలు పోవడమే… ఇదంతా ఓ విషవలయం లాంటిది…              ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అగ్రదేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక విదేశీ మదుపరులు తరలిపోతారు. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలతాయి. మౌలిక, సేవా రంగాల్లో పెట్టుబడులు ఆగిపోతాయి. చిన్న చిన్న సంస్థలు మార్కెట్‌లో నిలబడలేకపోతాయి. కొత్తపెట్టుబడులు రావడం కష్టమవుతుంది. ముడిచమురు ధరలు పెరుగుతాయి. నిజానికి గిరాకీ తగ్గితే ముడిచమురు ధరలు పడిపోవాలి. అయితే దీన్ని ఎదుర్కోవడానికి ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఉత్పత్తిలో కోత పెడతాయి. దేశాలకు దేశాలు దివాళా తీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంటే మరిన్ని శ్రీలంకలను మనం చూడాల్సి రావచ్చు. దాదాపు 70 దేశాలు ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు ఎప్పట్నుంచో చెబుతున్నారు. మందగమనంతో ఇవన్నీ మరింత కుదేలవుతాయి. అప్పులిచ్చిన దేశాలది ఓ కష్టం… తీసుకున్న దేశాలది మరో కష్టం… సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వస్తుంది. 2008 నాటి మాంద్యం ప్రభావాన్ని ప్రపంచం మర్చిపోలేదు. ఆ పీడకల మరోసారి నిజం కాబోతోంది.

Leave a Reply