నువ్వు నాతో మాట్లాడు

ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను

నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు

ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను

మాట్లాడు… మాట్లాడు

స్నేహితుడిలా… ప్రేమికుడిలా… సహచరుడిలా

రోజూ నన్ను పలకరించే

తోటలోని గువ్వలా…

మాట్లాడు… మాట్లాడు

– స్వర

“ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే… ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా…?” కోపపు ఎమోజీ ఎర్రగా… చిరాగ్గా కార్తీక్ నుంచి.

స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఏమీ లేవా తమ మధ్య మాటలు…? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి… రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య… సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ శబ్దం లేని సంగీతం ఏమిటి? అమ్మ… నాన్న, వదిన, అన్న వాళ్ళ పిల్లలు స్నేహితులు అక్క చెల్లెళ్ళు, బాస్, పక్కింటి వాళ్ళు… పెంచుకుంటున్న కుక్క మున్నా… వీళ్ళందరితో ఉన్న మాటలు… తనతో మాత్రమే ఎందుకు లేవు? అన్న వదినతో, నాన్న అమ్మతో, వీళ్ళ తాత… నానమ్మతో ఎక్కువగా మాట్లాడరట… ఇదే సమాధానం. ఆ…. ఆడముండలలో మాటలేఁవిటీ… చనువిస్తే అలుసైపోతాం… ఇదే ధోరణీ వారసత్వం. “మంచానికి… కంచానికి మాత్రమే వీళ్ళతో సంబంధంగా ఉండాలి. ఎక్కువగా మాట్లాడి నెత్తికెక్కించుకోకూడదు… మనం మాట్లాడామా… అన్నీ చెప్పేసుకున్నావా… ఇహ మన మాట వినరు…” మామయ్య మాటలు కొడుకులతో. తన పెళ్ళై పన్నెండేళ్ళు ఒక బాబు. .

పెళ్ళైన కొత్తలో ఎంతో ఉత్సాహంగా ఎగిసిపడుతున్న హృదయంతో మాట్లాడే ప్రయత్నించేది. ఊఁ… ఆఁ… అలాగే… సరే చేద్దాం… చూద్దాం… చాలు ఇక… ఎంత మాట్లాడుతావ్… వింటున్నానా లేదా చూడవా… ఏం వినాలి… ఆపింక… ఏంటది వసపిట్టలాగా ఇక మూసుకుంటావా… అబ్బా… ఉష్… షటప్… పార్టీకెళ్ళాలి… పెళ్ళికెళ్ళాలి తయారవు…. టిఫిన్ పెట్టావా… పన్నెండేళ్ళల్లో ఇదే సంభాషణ… మెల్ల మెల్లగా తన స్వరం మూగబోయింది. అదే కుటుంబంలో తన వాళ్ళతో ఎంత బాగా మాట్లాడతాడనీ? గలగలా మాట్లాడతాడు… కిలకిలా నవ్వుతాడు అది కాదు అమ్మా… ఇది విన్నావా వదినా… పొలం ఆస్థి కబుర్లు ఆఫీసు… కోలీగ్ల కబుర్లు… సినిమాలు అబ్బో ఎన్నని? స్వరా ఇది విన్నావా… అంటూ అతను తనతో మాట్లాడే మాటల కోసం చెవులూ… హృదయం ఎంత తన్లాడినా మాట్లాడడు కదా… తానొక వస్తువు అతగాడికి అంతే.

ఊర్లో ఎన్నెకరాల పొలం ఉంది… ఏ పంట వేస్తున్నారు ఎంత కౌలు వస్తుంది… ఎంత మంది జీతగాళ్ళున్నారు ఏమీ చెప్పడు. ఊరెళితే వాళ్ళ వదిన వాళ్ళు ఏమడిగినా వెర్రి మొఖం వేస్కోవడం తప్ప ఏం తెలీదు. వాళ్ళే “ఇదిగో మీ పొలంలో ఈ పంట వేసారు ఇంత కౌలు కార్తీక్ చెప్పాడు మాతో… నీకు చెప్పలేదా అంటే చెప్పాడు… చెప్పాడు… నేనే మర్చిపోయా” తడబడుతూ తను… అవమానం గుటకలు గుటకలుగా మింగుతూ…

ఊర్లో ఎవరితో పరిచయాలు లేవు.. ఉంచడు. సిటీనించి ఊరికెళ్ళేప్పుడు పెంచుకుంటున్న కుక్క మున్నాని గొలుసులు కట్టి కార్లో తీస్కెళ్ళి ఊర్లో వాళ్ళింట్లో ఉన్నన్ని రోజులు చావిడీలో గుంజకు కట్టేసినట్లే… తనూ… ఆ ఇంట్లోనే వాళ్ళ మధ్యలోనే ఉండాలి. వదినలు, అత్తయ్య, ఆడబిడ్డ ఊరంతా భర్తలతో కలిసి, విడిగా కూడా తిరుగుతూనే ఉంటారు. కార్తీక్ తనను ఎక్కడికి తీస్కెళ్ళడు.

ఊర్లో ఎవరితోనూ సంబంధాలు లేవు. ఎవరూ తెలీదు కూడా… వాళ్ళ దగ్గరి దూరపు చుట్టరికాలు ఏవీ తెలీవు. సిటీలో మాత్రం అప్పుడప్పుడూ స్నేహితుల పెళ్ళిళ్ళు పార్టీలకు గొప్ప కోసం తనకీ ఒక అందమైన భార్య ఉందని చూపించుకోడానికి మాత్రం తను కావాలి.

‘ఓహ్… అనూ డియర్… అది కాదు… ఇలా చెయ్యాలి” అంటూ తన కొలీగ్ అనురాధతో గంటలకొద్దీ సంభాషణ మధ్య మధ్యలో జోకులు… ఫెటిల్లున నవ్వడాలు… సరదా సరదా సంభాషణ దోస్తులతో అంతే… వాట్సప్ గ్రూపులుగా… గ్రూపులు… టెస్త్ క్లాస్… ఇంటర్… బీటెక్… ఊరి బాల్యపు దోస్తుల కసిన్స్… ఆఫీస్ కోలీగ్స్ వాట్సప్ గ్రూపులు… పుట్టలకొద్దీ మాటలు… మెస్సేజీలు… గుడ్మార్నింగులు… పాటలు… వీడియోలు… సినిమాలు… ఓహ్ అతని గొంతు మారుమోగుతూనే ఉంటుంది. పొద్దున్న లేస్తే చేతిలో సెల్ ఫోన్… ఫేస్ బుక్… ఇన్ స్టాగ్రామ్… ట్విట్టర్… వాట్సప్… టెలిగ్రాం… ఇక మాటలు షురూ.

ఫార్వర్డ్ల మీద ఫార్వర్డులు… దినమంతా సోషల్ మీడియాలో గడిపాక… మిగిలిన సమయం…. ఆఫీసు… అమ్మా నాన్నలతో గడిచాక అప్పుడు మిగిలిన నిమిషాల సమయంలో తననేదో కొత్త మనిషినో జంతువునో చూసినట్లుగూ చూసి, కొద్ది సేపయ్యాక భార్య అని గుర్తు పట్టినట్లు… కనురెప్పలు ఎగరేసి… పెదవి విప్పని నిర్లక్ష్యపు పలకరింత. దినమంతా ఇంటి ముందు బిక్షాటన కోసం నిలబడి… నిరీక్షించాక ఏ అర్ధరాత్రో ఇంటి యజమాని తలుపేసుకోడానికి బయటకొచ్చి బిక్షగాడ్ని అప్పుడే చూసినట్లు నటిస్తూ…. ఏం… ఏం కావాలన్నట్లు… ఓహ్… నువ్వా? అన్నట్లు కనుబొమ్మలు ఎగరేసి పలకరించినట్లు… తనను… తన భార్యను పలకరిస్తాడు చూడూ… రక్తం మరిగిపోతుంది. తనకూ అలా కనుబొమ్మలు ఎగరేసి పలకరించాలని లేదా మొఖమే అతగాడి వీక్షణం నుంచి తప్పించాలన్న కోరిక కలుగుతుంటుంది. కనీసం శృంగారంలో ఎలా ఉంది.. ఇష్టమేనా అని కూడా అడగడు… తన దేహం అతనికి ఒక మైనపు ముద్ద మాత్రమే. అభావాన్ని వ్యక్తీకరించే శరీర భాష అంతే… ఇషాన్ పుట్టాడంటే పుట్టాడంతే. ఇక ఎంత కాలం భరించాలి? మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. పాట బాల మురళీకృష్ణ తన కోసమే పాడాడా… తనకెంతో ఇష్టమైందీ పాట.

బాబు ఇషాతో మాట్లాడదామంటే పదేళ్ళ వాడైపోయాడు… “అబ్బా మమ్మీ… ఊర్కో… డిస్టర్బ్ చేయకు ఫో” అంటూ… వీడియో గేమ్స్ పట్టీ గేమ్స్… ఇన్ స్టాగ్రామ్… ఫేస్ బుక్ అకౌంట్లు అప్పుడే వాడికి. ఒద్దంటే ఆ సెల్ ఫోన్ కొనిచ్చాడు ఇషాన్ కి కార్తీక్. స్కూలుకెళ్ళి వచ్చాక… అర్ధరాత్రి వరకూ సెల్‌ఫోనే… అప్పుడే వాడి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, నిద్రలేక ఇర్రిటేషన్…

ఆ కొంచెం మాట్లాడే తన అత్తయ్య జీవితంలో సగం కంటే ఎక్కువ భాగం మౌన వ్రతంలో గడిపింది. ఏదో దేవుడి పేరు మీద వారంలో మూడు రోజులు మౌనం పాటిస్తుంది, సైగలతో మాట్లాడుంది ఇంటిల్లిపాదితో. ముఖ్యంగా ఆమె తన భర్తతో సైగలతో మాట్లాడుతూన్నప్పుడు, ఆ మూగ భాషను ఆయన అర్థం చేస్కోలేక సతమతమవుతూ చిరాకు… కోపం, అసహనం వ్యక్తం చేస్తూ “మాట్లాడి చావకూడదూ… ఎన్ని రోజులీ మౌన వ్రతం?” అంటూ కసురుకుంటున్నప్పుడు అత్తయ్య మొఖంలో, కళ్ళల్లో ఒక ఆనందం… ఏదో సాధించానన్న తృప్తి కలిగేవి. గెలుపు రంగులతో ఆమె ముఖం ఎర్రబారేది. ‘ఎందుకత్తయ్యా ఇన్నిసార్లు మౌన వ్రతం?’ తను ఒకసారి అడిగితే “ఏం స్వరా… బాధగా ఉందా… మీ మామయ్య ఇన్నేళ్ళ కాపురంలో నాతో మాట్లాడిన మాటలు గుప్పెడు కూడా ఉండవు. అన్నీ సైగలే… అన్నం పెట్టు… అడగడు. వేళ్ళు నోటి దగ్గరికి తీస్కెళ్ళి చూపిస్తాడు. స్నానానికి నీళ్ళు పెట్టు అనడు. బొటనవేలు భుజానికి ఆన్చి ఆడిస్తాడు. ఎవరైనా వస్తే చూడు పో అని వేళ్ళతో… కళ్ళతో చూపిస్తాడు. ఎక్కడికెళ్ళారంటే బయటకెళ్ళా అని నోటితో చెప్పడు…. వేళ్ళతో గుమ్మమావలున్న రోడ్డు చూపిస్తాడు. ష్… ఉషు…. ఏయ్… ఏవేమే… ఇదిగో చూడు… ఇవే… ఆయన పిలుపు… మాటా. ఏం నాకూ ఆత్మ లేదా… మనిషిని కానా…. లోకమందరితో మాట్లాడే మీ మామయ్య నాతో సైగలేంటి? నేనేమన్నా మూగదాన్నా.. పోనీ చెవిటిదాన్నా… చెప్పు? అందుకే అలా ఉంటే ఎట్టా ఉంటుందో తెలియాలనీ ఈ మూగనోములు మొదలుపెట్టాను. భక్తి ఒకటి ఏడ్చిందిగా ఆయనకి అందుకే నోరు మెదపరు. ఈ చిట్కా ఎవరు చెప్పారనుకున్నావ్… మా అత్తయ్యే చెప్పింది సుమా. ఆవిడా వారానికో రోజు ఇట్లా మూగనోము పట్టి మామని ఏడ్పించి కసి తీర్చుకునేదిట… నేను ఆవిడ తర్వాత తరం మనిషిని కాదూ… రెండాకులు ఎక్కువే చదివా” అంది… ఎంతో సంతోషంగా… గుంభనంగా నవ్వుతూ… తను నిర్ఘాంతపోయింది. “మరి మీ అబ్బాయి… కార్తీక్ నాతో మాట్లాడకుండా ఉంటాడు… మీరెందుకు చెప్పరత్తయ్యా ఇంత బాధ అనుభవించీ” అనడిగింది.

“ఏం చెప్తాం వీళ్ళంతా పెళ్ళాం మూగోళ్ళు…. చెప్తాలే” అంది. ఒక రోజు “ఏరా పెళ్ళాం దగ్గర ఒఠ్ఠి మూగెధవలా ఉంటావేరా… మాట్టాడి చావు” అంది కోపంగా తనని బొటన వేలితోని తన నోటి దగ్గర పెట్టి సైగలతో నీళ్ళు అడుగుతున్న కార్తీక్ ని చూస్తూ.

“నువ్వూ నాలాగా మూగనోము పట్టు వీడి తిక్కవదులుద్ది” అంది కోపంగా తనతో. ఏం వదులుతుంది అతనికే బాధ ఉండదు. ఎప్పుడూ మాట్లాడే మనిషి మాట మానేస్తే బాధ కానీ… మాట్లాడనివ్వని వాళ్ళు మాట్లాడకుండా ఉంటే సౌఖ్యమే తప్ప బాడెక్కడ ఉంటుందీ? ఒక రోజు ఉన్నట్లుండి మామయ్యకి బీపీ పెరిగి పక్షవాతం వచ్చి ఎడమ చెయ్యి, కాలూ… నోరూ మూడు పడిపోయాయి. అత్తయ్య పూర్తిగా ఇప్పుడు సైగలు, అరుపులతో మాట్లాడుతుంది. ఆయన సైగలూ ఎక్కువైపోయాయి.

మూడేళ్లు మామయ్య మూగభాష అత్తయ్యకి నరకంగా మారింది. ఆయన మీద పగ తీర్చుకోడానికి… ఆమె తను పట్టిన మూగనోములప్పుడు ఆనందించింది కానీ, భర్త నిజంగానే పూర్తి స్థాయిలో మూగవాడయ్యాక అత్తయ్య ఆయన మీద నోరు చేస్కుని అరవసాగింది. కొత్తగా ఆయన మీద వచ్చిన అధికారంతో… కొత్త గొంతూ… నోటితో. ఒకసారి అడిగింది కూడా… “ఏం బాధగా ఉందా… నాలో ఇట్టాగే మూగ సైగలలో మాట్లాడేవాడివిగా… నేనేదో మూగా… చెవిటి దాన్నైనట్లు… నా గురించి ఆలోచించావో” అని. ఆయన మొఖం కోపంలో ఎర్రబారింది.

కానీ ఏం చేస్తాడు? ఇప్పుడాయన అత్తయ్య పట్ల చాలా వినయమూ… గౌరవమూ, కాసింత భక్తితో కూడా ఉంటున్నాడు. కానీ… ఆయన మరో రెండేళ్ళు బతికాక పోయాడు. పోయే ముందు మూగ భాషలో బొటనవేలు నోటి దగ్గర పెట్టి దాహం… దాహం… అనడిగితే… అత్తయ్యే ఆయన నోట్లో నీళ్ళు పోసింది. ఆ తర్వాతే ఆయన పోయాడు.

ఆ తర్వాత నాలుగేళ్ళకి అత్తయ్య పోయింది. ఆ మాట్లాడే అత్తయ్యా పోయింది. “వాళ్ళు మాట్లాడలేకపోతే ఏంటే స్వరా… నువ్వూ… నేనూ లేమూ…? మనం మాట్లాడుకుందాం…” అంటూ బోలెడు కబుర్లు చెప్పేది తనతో మాట్లాడించేది. “స్వరా వాడు మాట్లాడట్లేదని నువ్వూ ఎవరితో మాట్లాడకుండా ఉన్నావనుకో మూగదానివి అయిపోతావు. నీ గొంతూ.. భాషా అన్నీ మర్చిపోతావు.. నీకు స్నేహితులు లేరూ.. అమ్మతో మాట్లాడు.. చెల్లితో మాట్లాడు.. నాతో మాట్లాడు కానీ మాట్లాడు” అనేది గబగబా.. ఆందోళనగా. నీకో రహస్యం చెప్తా స్వరా.. వినూ.. నేనూ మూగనోమప్పుడు, ఒక్క మీ మామయ్యతో మాత్రమే మాట్లాడేదాన్ని కాదు. మీ మామయ్య లేనప్పుడు ఫోన్ లో అందరితోనూ మాట్లాడేదాన్ని తెలుసా” అని చిలిపిగా నవ్వేది. అవును తను మూగది అయిపోదు కదా… “పుట్టగానే నువ్వేడ్చిన ఏడుపుకి హాస్పిటల్ టాప్ లేచిపోయింది తెలుసా కాన్పు చేసే డాక్టరమ్మా… నర్సులు బెదిరిపోయారు… నీకు స్వర పేరు పెట్టింది కూడా అందుకే… ఎంతలా వస పిట్టలా మాట్లాడేదానివి ఇట్టా పుట్టు మూగదానిలా మారిపోయావేంటే… పెళ్ళైనాక?” అంటూ అమ్మ, అమ్మమ్మ విలవిల్లాడిపోయారు. “ఇక నోర్లు మూస్కోండే… పెళ్ళికి ముందున్నట్లు పెళ్ళైయ్యాక కూడా ఉంటారా ఆడపిల్లలు…” అంటూ నాన్న అరిచారు.

అలాంటి అత్తయ్య… తన ఫ్రెండ్ లాంటి అత్తయ్య హఠాత్తుగా ఏక్సిడెంట్లో పోయింది. తన ప్రపంచం ఇంకా మూగగా మారిపోయింది. సెల్ ఫోన్ కి బానిసైపోయిన ఇషాన్ని, ఇంటర్ మీడియెట్ లో బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చాక తనింకా ఒంటిరిదైపోయింది.

కార్తీక్ కి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. వాళ్ళతో మాటలు కూడా… కాలం ఎప్పుడు పరిగెత్తిందో… తనకో నలభై రెండేళ్ళ వయసూ వచ్చేసింది… తెలీకుండా.

అలాంటి సమయంలో…. తన ఖాళీ సమయాల్లో తన ఒంటరి తనాన్ని పోగొట్టింది… సెల్ ఫోన్. తన చిన్నప్పటి స్నేహితులలో వాట్సప్ గ్రూప్ తయారు చేసింది. కాలేజీ, కాలనీ ఫ్రెండ్స్లో ఒక గ్రూపు… ఫేస్ బుక్… అకౌంట్… ఇన్ స్టాగ్రాం ఇషాన్ ఎప్పుడో తయారు చేసినా తనెక్కువ వాడేది కాదు.

కానీ ఇప్పుడు… తన లోకం అంతా ఫ్రెండ్లీ చాటింగ్లు వాళ్ళలో చేసిన వంటలు వీడియోల్లో పంచుకోడాలు చీరలు, నగల ప్రదర్శనలు… కిట్టీ పార్టీలు బిసీ అయిపోయింది. తనకు తప్పలేదు. ఇంతకాలం ఇదంతా ఎందుకు మిస్ అయ్యింది? తనకంటూ ఒక ప్రపంచం లేకండా కార్తీక్ తనను కనిపించని కత్తితో తన గొంతు కోస్తే అతనికి కావల్సినట్లు మూగది అయిపోయిందెందుకు? ఇప్పుడు తన జీవితం ఫ్రెండ్స్… వాళ్ళ హడావుడితో బిసీ అయిపోయింది. అయినా ఏదో వెలితి… కార్తీకే పూడ్చగల వెలితి.

కానీ కార్తీక్ ఆ పని చెయ్యడు అతని అసంఖ్యాకమైన స్నేహితుల లిస్ట్ లో తను లేదు… ఉండదు అని తనకర్థమై చాలా కాలం అయ్యింది. అతగాడికి తను భార్యను మాత్రమే… మా ఇద్దరిదీ మా మామయ్య అన్నట్లు మంచం, కంచం సంబంధం మాత్రమే. ఒగ్గి హృదయం లేని సంబంధం… అందులో ఇద్దరు మూగవాళ్ళ నిశ్శబ్దం తప్ప మరింకే రాగం లేదు. ఆ నిశ్శబ్ద తోటలో పొరపాటున కూడా కోయిల కూత కూడా వినపడదు. ఒక గాలి వీచిన చప్పుడు కూడా నిషేధమే.

– – –

“స్వరా… నేను అన్వేష్ ని… నీ టెంత్ బాచ్ మేట్ ని… బెంచిమేట్ని కూడా… నీ నీడని ఆ రోజుల్లో… నువ్వెక్కడుంటే… నేనక్కడే ఉండేవాడిని యార్… అన్యాయం… మర్చిపోయానా…” పొద్దున్నే వాట్సప్ మెస్సేజ్… డీపీలో ఇప్పటి అన్వేష్ ఫోటో గడ్డంతో అసలు గుర్తుపట్టలేనంత మారిపోయాడు.

ఒక రోజు అన్వేష్ ఫోన్ చేసాడు. చాలా కబుర్లు చెప్పాడు. ఎంతో ప్రేమగా… ఇద్దరూ చాలా విషయాలు షేర్ చేస్కునేవారు. చదువూ, వ్యాపారం, పెళ్ళి, భర్త భార్య… అత్తగారి కుటుంబం… ఇళ్ళు, ఆస్తులు, పిల్లలు, అప్పటి అభిరుచులు… ఆడిన ఆటలు… పాల్గొన్న పోటీలు… పరుగులు పెట్టిన మైదానాలు… విన్న పాటలు ఈతలు కొట్టిన చెరువులు… ఇంటర్ కాలేజీ… దాకా సాగిన చదువులు పెళ్ళిళ్ళు మూలాన్న విడిపోయిన జీవితాలు ఆగిపోయిన స్నేహాలు… అపరిచితులైన భార్య…. భర్తలతో చేసిన సంసారాలు….

విడిపోయిన స్నేహితుల చిరునామాలు… ఆరాలు… అకస్మాత్తుగా చిన్న వయసులోనే మరణించిన స్నేహితుల జ్ఞాపకాలు… ఇష్టమైన టీచర్లు ఇప్పటికీ గుర్తున్న పాఠాలు కవితలు… వచ్చిన మార్కులు… ఫేలయినప్పటి దుఃఖాలు అవమానాలు అన్నీ… అన్నీ ఎన్నో ఎన్నెన్నో… అన్వేష్ ఒక మాటల ప్రవాహం… సంభాషణల సంగీతం…

తను కార్తీక్ గురించి చెప్పింది… “బాగా చూస్కుంటాడా?” అడిగాడు అన్వేష్. “చాలా బాగా అస్సలు బాధ పెట్టడు తెలుసా” అంది తను బాధను గుటకలు గుటకలుగా మింగుతూ… “నీ భార్య మరి?” తనడిగింది. “ఆమె ఒక దేవత… నన్ను చాలా బాగా చూస్కుంది” అన్నాడు గొంతు ఒణుకుతుంటే…” “ఏమైంది అన్వేష్ ఎందుకు ఆ బాధ చూస్కుంది అంటున్నావేంటి మరి” తనడిగింది. “ఆమె పెళ్ళైన పదేళ్ళకే హార్ట్ ఎటాక్ తో చనిపోయింది. పెళ్ళికి ముందు నుంచే ఆమెకి షర్ట్ సమస్య ఉంది. ప్రేమించి పెళ్ళాడాను. అన్నీ తెలిసి” అన్వేష్ బాధగా చెప్తూ పోయాడు. గుండె జబ్బు ఉంది కాబట్టి పిల్లల్ని కనడం ఆమెకి ప్రమాదం కాబట్టి కనలేదట. తను చాలా బాధ పడింది. తర్వాత పెళ్ళి చేస్కోలేదట అన్వేష్ వ్యాపారంలో బిసీ అయిపోయాడట బెంగుళూరులో. అన్వేష్ తో స్నేహం… సంభాషణ… సంభాషణ… మాటలు… మాటల ఊటలు మాటల నదులు… సముద్రాలై… ఒక ఆబ్సెషన్ గా మారిపోయింది. అతనితో ఒకపూట మాట్లాడకపోతే… ఖంగారు భయం… ఒక భరించలేని ఖాళీతనం… పిచ్చెక్కినట్లుగా ఉండేది. ప్రతీది ప్రతీక్షణం… అన్వేష్ తో పంచుకోవాల్సిందే…

“టెంత్ లో నీకు రాసిన ప్రేమలేఖ చాలా కాలం దాచుకున్నా తెలుసా… ఇంటర్ లో దాన్ని మరింత బాగా రాసా కానీ ఇవ్వలేకపోయా…. నీకింతలో పెళ్ళైపోయింది. ఎంత ఏడ్చానో తెలుసా నిన్ను మర్చిపోడానికి ఢిల్లీలో ఎంబీఏ కోర్సులో చేరిపోయా… నిన్నిక డిస్టర్బ్ చేయదల్చుకోలేదు.

డిగ్రీ… పీజీ చదివాక నా జీవితంలోకి ఆమని ఎలా వచ్చిందో. అలాగే పోయింది. మళ్ళీ ఒంటరి అయిపోయాను” అన్వేష్ మాటలు తనలో తుఫాను రేపాయి. అప్పట్లో అంతా అదే అనే వాళ్ళు లవ్ బర్డ్స్ అనే వాళ్ళు కానీ ఇద్దరూ ఒక్కసారి కూడా చెప్పుకోలేదు ఇష్టాన్ని. దాచుకున్న ప్రేమలేఖల్ని ఢిల్లీలో యమునలో జారవిడిచాడు అన్వేష్, తన పెళ్ళి కార్తీక్ తో అయ్యాక… ఈ విషయం అన్వేష్ చెప్పిన రాత్రి తను చాలా ఏడ్చింది.

నిజానికి కార్తీక్ తో పెళ్ళైనాక మెల్లిగానైనా… చాలా త్వరగా మర్చిపోయింది. కార్తీక్ తో కొత్త ప్రపంచాన్ని కలగంటూ… దాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో ఈ పదిహేనేళ్ళు గడిపేసింది. నిజానికి తనో కఠినమైన గోడను తడుముతుందని తెల్సుకోలేకపోయింది. రాజీపడిపోయింది కూడా.

మెల్లిగా తను అన్వేష్ తో మళ్ళీ ప్రేమలో పడిపోయింది. అప్పుడు పధ్నాలుగేళ్ళ వయసులో ఇష్టం కానీ ఇప్పుడు ప్రేమ… ఒట్టి ప్రేమ… ఎంతంటే… ఒక్క క్షణం దూరం ఉన్నా చచ్చిపోవాలన్పించేంత. కార్తీక్ వెలితి బాధపెట్టటం మానేసింది తనను.

“కలుద్దామా ఒకసారి చూడాలని ఉంది… వాట్సప్ ఫోటోల్లో చూసినా ప్రత్యక్షంగా చూడాలని ఉంది…” ఆశగా అడిగాడు అన్వేష్. అతని కోరికను వెంఠనే తీర్చింది తను… ఎక్కడెక్కడ తిరిగారని… ఎన్ని కబుర్లు… ఎన్ని మాటలు… ఎన్ని రహస్యాలు గంటలకొద్దీ మాట్లాడుకునేవారనీ… పదిహేనేళ్ళ మూగ గొంతుకు స్వరం వచ్చింది. అవును తనకి… స్వరం వచ్చింది. అన్వేష్ ఇచ్చిన స్వరం… తను అలా మాట్లాడుతూనే ఉండిపోయింది. అతని మాటల్ని వింటూ వింటూ ఉండిపోయింది హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంటే… ఎక్కడ మాట్లాడ్డం మానేస్తాడేమోనన్న భయంతో… అతను మాట్లాడ్డం ఆపకుండా ఏవోవో అడుగుతూ… అతన్ని మాట్లాడిస్తూ… ఇన్నేళ్ళూ కార్తీక్ తో మాట్లాడాలనుకుని మాట్లాడలేనివి, వినాలనుకుని వినలేకపోయినవి…

తమ మధ్య ఒగ్గి మాటలే ఉన్నాయా… లేవు… ఇష్టం ఉంది… ప్రేమ ఉంది… ఆకర్షణ ఉంది… ఇవన్నీటితో పాటు… మోహం… కోరికా పుట్టుకొచ్చేసాయి. ఒకసారి బెంగుళూరికి రమ్మని ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసాడు. వెళ్ళిపోయింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా అంది కార్తీక్ తో. అన్వేష్ ఇంట్లో మూడు రోజులు ఉంది. ఇద్దరూ తీవ్రమైన మోహంతో పెనవేసుకుపోయారు. యుగాల తర్వాత కల్సుకున్న ప్రేయసీ ప్రియుల్లా ఒకరి దేహాల్లోకి మరొకరు అతను ఆమెతో ఒక్క నోటితో కాదు. మొత్తం దేహంతో సంభాషించాడు. అన్వేష్ కూడా హైద్రాబాద్ వస్తూ పోతూ ఉన్నాడు. కార్తీక్ కి ఒకట్రెండు సార్లు తన టెంత్ క్లాస్ మేట్ అని పరిచయం చేసింది కూడా. తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కార్తీక్ క్కి తెలిస్తే తెలవనీ అన్న తెగింపుతో ఉంది. కార్తీక్ తనతో ఎలా ఉంటాడో చెప్పిందో రోజు అన్వేష్ కి… “కొట్టడు… తిట్టడు… చీరలు, నగలు అన్నీ ఇస్తాడు కానీ మాట్లాడడు… అస్సలు మాట్లాడడు. మాట్లాడమని గుండె పగలగొట్టుకుని ఏడ్చినా మాట్లాడడు” అని ఏడ్చింది తను. అన్వేష్ ఆమెను మరింత గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ… “నేను మాట్లాడుతాగా నీతో… ఎన్నెళ్ళైనా… నీకు తెలుసా నా హృదయంలో కాదు నా గొంతులో స్వర ఉంది” అన్నాడు నవ్వుతూ… తను అన్వేష్ గొంతును ఎంత గాఢంగా ముద్దుపెట్టుకుందో… అన్వేష్ “అబ్బా గొంతు కొరికేస్తావా ఏంటీ… నేనెట్లా మాట్లాడాలి నీతో” అన్నాడు తన గొంతును తన అరచేత్తో సున్నితంగా హత్తుకుంటూ.

– – –

“ఎప్పట్నించీ… ఇదంతా… అదే అన్వేష్ తో కలవడం… స్నేహం… సెక్స్… ఇందంతా…” కార్తీక్ అడిగాడు. తను బిత్తరపోయింది, ఎందుకంటే అతను తనను అడిగిన విషయం… తనకీ… అన్వేష్ కీ ఉన్న సంబంధం గురించి కార్తీక్ చేస్తున్న ఎంక్వైరీకి కాదు. కార్తీక్ తనతో మాట్లాడుతున్నాడు. అతని వైపు సంభ్రమంగా చూసింది. కార్తీక్ వైపు వేలు చూపిస్తూ… “నువ్వు నాతో మాట్లాడుతున్నావు కార్తీక్” అంది తర్వాత…

“మూడేళ్ళ నుంచీ కలుస్తున్నా కార్తీక్” అంది చాలా మామూలుగా.

“ఎందుకు… నేను సరిపోనా నీకు… ఏం తక్కువ చేసాను. అతనేం ఎక్కువ చేసాడు అతనేం చేస్తాడసలు నువ్విలా లొంగిపోయావు అతనికి? నాకు నమ్మకద్రోహం చేసావు?” కార్తీక్ విలవిల్లాడుతూ అడుగుతున్నాడు… కాదు… కాదు… మాట్లాడుతున్నాడు.

తను పగలబడి నవ్వింది. “ఏం చెయ్యడు కార్తీక్… మాట్లాడతాడు… నాతో మాట్లాడతాడు… వింటాడు నన్ను వింటాడు… అంతే” అంది తను పెద్ద గొంతుతో… కార్తీక్ నిర్ఘాంతపోయాడు..

ఊర్లో కార్తీక్ వాళ్ళ అత్త సంవత్సరీకానికి వెళ్ళినప్పుడు భోజనాలయిపోయి బంధువులు వెళ్ళిపోయిన తీరు బడిలో, చావడీ అవతల ఉన్న అర్రలో కార్తీక్ అక్క కొడుకు వినయ్, కోడలు సౌమ్య పెళ్ళై ఆరేళ్ళైంది… కూర్చుని ఒకటే కబుర్లు… నవ్వులు… ఆ మాటల శబ్దం… నవ్వుల ధ్వని… వారి మధ్య ఒక పరస్పర అవగాహనతో కూడిన సంవాదన అదొక గొప్ప యుగళ గీతంలా వినిపించింది తనకు. ఇవతల చావడిలో భర్తా… ఆడబిడ్డతో తను…

ఆడబిడ్డ లోనకెళ్ళినప్పుడు… “కార్తీక్ నాకూ… నీతో అలా కబుర్లు చెప్పాలని ఉంటుంది. నీ కబుర్లు వినాలని ఉంటుంది. చూడు వాళ్ళిద్దరెంత సంతోషంగా ఉన్నారో” అంది తను కార్తీక్ వైపు ఎంతో ఆశతో చూస్తూ…

వెంఠనే కార్తీక్ చూపు వాళ్ళు కూర్చున్న చావిడీ వైపు మళ్ళింది. వాళ్ళు కూర్చుని ఊగుతున్న ఊయాల… పాదాలను నేలమీద మునివేళ్ళతో నొక్కుతూ… వదులుతూ… ఆమె ఊపుతున్న ఊయల చప్పుడుతో… ఆమె కాలి మువ్వల సవ్వడి… మధ్య మధ్యలో వాళ్ళు నవ్వుల సవ్వడిలో కల్సిపోతూ… ఉంటే… వెంఠనే తనవైపు తిరిగి “ఛ… చిన్న పిల్లాడు వాడు… వాడికేం తెలుసు భార్యతో ఎలా ఉండాలో అయినా… నీతో నాకు మాటలేంటి?” అని వెళ్ళిపోయాడు అక్కడ్నించి ఊరి బస్టాప్లో ఉన్న దోస్తులని కలవడానికి…

“నీతో నాకు మాటలేంటీ” అంటున్నప్పటి కార్తీక్ ముఖం మొత్తంగా ఒక వ్యంగ్యపు నవ్వుల కత్తిగా మారి తన గుండెల్లో సూటిగా దిగి… ఎంత నొప్పి… ఎంత అవమానం?

“ఎందుకు… నేనేం తక్కువ చేసాను నీకు” అని కార్తీక్ అడిగిన వెంఠనే ఈ సంఘటన ఆ ఉయ్యాల చప్పుడు… ఆమె కాలిమువ్వల… వాళ్ళ నవ్వుల ధ్వని ఒకే పాటలోని సంగీతంలా వినిపించింది… కనిపించింది.

“మీ పుట్టింటి… నా పరువేం కాను… ఇషాన్ ఏం కాను?” బలహీనంగా అంటున్నాడు కార్తీక్.

“ఇన్నేళ్ళూ ఎలా ఉన్నామో ఇక ముందూ అలానే ఉంటాము” అంది తను.

“అతన్ని కౌగలించుకున్నంత కోరికతో నన్నెన్నడూ కౌగలించుకోలేదే నువ్వు?” కార్తీక్.

“నువ్వు నాతో అలా కనెక్ట్ కాలేదు ఎప్పుడూ” తను. “ఏం తక్కువ చేసాను…. ఇల్లూ, కారూ, నగలూ… అన్నీ ఇచ్చాను” కార్తీక్.

“నీ మాటలు ఇవ్వలేదు” తను.

“అది పెద్ద కంప్లైంటేంటి? సరే… ఇప్పుడు… ఇప్పట్నించీ మాట్లాడతాను”

కార్తీక్.

“వద్దు…” తను.

“మోజు తీరాక వదిలేస్తాడు… రోడ్డున పడతావ్” కార్తీక్.

“ఫరవాలేదు… ఈ జన్మకి సరిపడా మాట్లాడుకున్నాం” తను.

“గెట్ అవుట్… వెళ్ళిపో నా ఇంట్లోంచి” కార్తీక్.

“థాంక్స్” తను.

ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోయిన తన వీపు మీద ధడాలున వేసిన తలుపు శబ్దం… కార్తీక్ అరిచిన అరుపూ తనకు వినిపించలేదు.

విచిత్రంగా కార్తీక్ కి కూడా…!

2 thoughts on “మాట్లాడు!!

  1. ఎంతమంది భార్యల మూగ బాధకు గొంతుక లా ఉంది మా మీ ఈ రచన. కానీ అయితే సహించడం లేదా భరించడం చివరికి వారిపైన ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే జీవితమా ఆడవారికి?ఇది మారాలి ఇకనైనా. ఆడవారి వేదనకి గొంతుక రావాలి

  2. Swara decision is absolutely correct.

    Vekthiki, thana vekthithvaaniki kaneesa viluva-gowravam ivvaleni manishitho sahajeevanam saagadhu. Baryatho matladite avamaanamga bavinche barthani barinchadam kannaa athmagowravanni kaapadukuntu athmeeyatha palukulakosam prayanichadame utthamam.

Leave a Reply