ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి కాలంలో ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాల మధ్య వైరుధ్యాలు అంతకంతకూ తీవ్రమవుతూ  ఉత్పత్తి, పునరుత్పత్తి ప్రక్రియల్లో  తీవ్ర అసమానతలు, వివక్షలు , శ్రమదోపిడీ, లైంగిక దోపిడీలు కొనసాగుతున్నాయి. ఇక్కడున్న భూస్వామ్య అవలక్షణాలకు తోడుగా సామ్రాజ్యవాద పెట్టుబడి చొరబాటు, దానికున్న ద్రవ్య లక్షణం కారణంగా మన దేశంలోని ఆధునికీకరణ క్రమం సమస్యాత్మకమై, అత్యంత సంక్లిష్టంగా తయారయ్యింది. వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటాల ఫలితంగా ఉద్భవించిన ఆధునిక విలువలేవీ  నేటి సామాజిక సంబంధాలలో ప్రతిఫలించడం లేదు. అంతెందుకు, ఏడుపదుల ఏళ్ల రాజ్యాంగమే కుప్పకూలుతున్న దుస్థితి మన ముందు ఉంది. ఏడున్నర దశాబ్దాల దేశ ‘స్వాతంత్ర్యం’ జన జీవితాల్లో ఎక్కడా ప్రతిబింబించడం లేదు.

అయితే ప్రజలు ఊరకే ఉన్నారా? లేదు. పాలకుల అణచివేతను రకరకాల మార్గాలలో ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. వివిధ రూపాలలో మార్పుకై పోరాడుతూనే ఉన్నారు. సంఘ సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, జాతీయోద్యమం, స్వాతంత్ర్యోద్యమం వంటి రూపాల్లో, ఆ తర్వాత కాలంలో  నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర, ఉత్తర తెలంగాణ పోరాతాలు, నేటి దండకారణ్య విప్లవోద్యమం వరకు అనేకానేక రూపాల్లో ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల తరపున అనేక మంది విద్యావంతులు, బుద్ధిజీవులు ముందుకొచ్చి వివిధ ప్రజా సంఘాల నిర్మాణాల రూపాల్లో పోరాడుతూనే ఉన్నారు. అట్లా పోరాడి అమరులైన 24 మంది స్ఫూర్తిదాతలపై ప్రొ. హరగోపాల్ గారు రాసిన 34 వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.                                                                                                           

అసలు కొంతమంది వ్యక్తులు మాత్రమే అత్యంత స్ఫూర్తిదాయకమైన  వ్యక్తిత్వాలను ఎలా సంతరించుకుంటారు? అందుకు దోహదపడే అంశాలేవి? అన్న ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ పుస్తకాన్ని పేర్కొనవచ్చు. ఎందుకంటే-హరగోపాల్ గారి జీవిత అనుభవం ప్రాతిపదికగా విశ్లేషణ చేసిన వ్యాసాలివి. ఇక్కడే మనం ఆయన అనుభవానికి ఎందుకంత ప్రాధాన్యత సమకూరింది? అన్న ప్రశ్న మనం  వేసుకోవాలి. దానికి జవాబు కోసం అన్వేషిస్తే- ఆయన అనుభవం వ్యక్తిగత అనుభవం మాత్రమే కాదు. అది ప్రధానంగా మనుషుల సామూహిక సామాజిక అనుభవాల సమాహారం అని తేలుతుంది.                      

 ఒకరి అనుభవం సామాజిక అనుభవాల సమాహారం అని అన్నప్పుడు అతడు/ఆమె  తనదైన అస్తిత్వాన్ని దాటి సామాజిక అస్తిత్వాన్ని(లను) సొంతం చేసుకొని స్వీయ అనుభవాన్ని విస్తృత పరచుకోవడమని లేదా సామాజిక అనుభవాలను స్వీయ అనుభవంగా చేసుకోవడమేనని అర్థం. ఇక్కడ తనదైన అస్తిత్వాన్ని దాటడం అంటే ఆ అస్తిత్వాన్ని విస్మరించడమో  లేదా వదులుకోవడమో కానే కాదు. తన స్వీయ అస్తిత్వ స్పృహతో పాటు, ఇతరేతర అస్తిత్వాలతో గల పరస్పర సంబంధాలలోకి వెళ్లి, ఆ సంబంధాల్లోంచి సమకూరే అనుభవాలను సొంతం చేసుకోవడమని అర్థం చేసుకోవాలి. ఆ సామాజిక సమిష్టి అనుభవాల్లోంచి వచ్చే జ్ఞానానికి సాపేక్షికంగా ఎక్కువ సమగ్రత ఉంటుంది.అట్టి జ్ఞానం  వ్యక్తుల వ్యక్తిత్వంలో భాగమై  స్వీయ చైతన్యంగా పరిణమించి, దృఢ విశ్వాసం గా మారినప్పుడు ఆయా వ్యక్తుల ఆచరణలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అంతేకాదు, అట్టి ఆచరణలకు చారిత్రక పరిణామంలో కీలక పాత్ర కూడా ఉంటుంది.                                                     

 ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసిన మనుషులు ,ప్రత్యేకించి ప్రజల కోసం తమ ప్రాణాలనే అర్పించిన వాళ్లను లేదా అర్పించడానికి సంసిద్ధులైన వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ ప్రేమ సంకుచిత పరిధులు దాటి విశాల మానవ సంబంధాలలోకి ప్రసరించి విశ్వజనీనమైతే తప్ప వాళ్ళు అలా ప్రాణ త్యాగం చేయడం సాధ్యం కాదని అర్థమవుతుంది. ప్రగతిశీలమైన మార్పు లక్ష్యాన్నెంచుకునో లేదా వర్గపోరాట లక్ష్యాన్నెంచుకునో  కొందరు వ్యక్తులు తమ జీవిత పర్యంతం పోరాడడమంటే లేదా ప్రాణ త్యాగానికి సిద్ధపడి పోరాడడమంటే ప్రజలను అవ్యాజంగా ప్రేమిస్తే తప్ప అది సాధ్యం కానే కాదు.అయితే అలా నిరంతరం ఎటువంటి షరతులు లేకుండా ప్రజలను ప్రేమిస్తూ పోరాడడం అంత సునాయాసమేమీ కాదని,అందుకు అవసరమయ్యే జీవశక్తిని మాత్రం చారిత్రక పోరాట వారసత్వం నుంచే వాళ్ళు పొందుతారని మనకర్థ మవుతుంది.అలాంటి మహోన్నతులే అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిత్వాలను సంతరించుకొని,చరిత్రలో స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రజలకు నిరంతర ప్రేరణనందిస్తారని అర్థమవుతుంది.              

అసలు చరిత్రలో ఉపయోగ విలువ లేనట్లయితే పాశ్చాత్య బూర్జువా వర్గం స్వేచ్ఛ, సమానత్వం భావనలను ముందుకు తెచ్చేదే కాదు. అయితే నిజార్థంలో ప్రజల జీవితాల్లో ఉపయోగ విలువలుగా మనగలిగే దాకా అవి ప్రజాపోరాటాలకు స్ఫూ ర్తిదాయకంగా నిలుస్తూనే ఉంటాయి. దోపిడీ పీడనలు,అసమానతా వివక్షలు అంతమై, రాజ్యం అనేదే అంతరించి నప్పుడు మాత్రమే స్వేచ్ఛ సమానత్వాలు నిండైన అర్థంలో  ప్రజలకు నిజమైన ఉపయోగ విలువలుగా స్వా నుభవంలోకి వస్తాయి. రాజ్యం లేకుండా పాలన లేదనే వాస్తవం నుండి అసలు రాజ్యమే లేని పాలన అనే వాస్తవం దగ్గరికి చేరుకోవాలంటే ప్రజలకు తమదైన రాజ్యం  ఎంత ఆవశ్యకమో  నాటి పారిస్ కమ్యూన్ నుండి నేటి దండకారణ్య పోరాట అనుభవాల దాకా రుజువుచేస్తూనే ఉన్నాయి. నిజానికి రాజ్యమే లేని ప్రజల స్వయం పాలన మహోన్నత మానవ  నాగరికతకు ప్రతీక. అయితే ఇక్కడ రాజ్యం రద్దుకు రాజ్యమే అనివార్యం కావడమనేది విచిత్రమైన వైరుధ్యం.ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడానికే  శస్త్రంగానే కాదు శాస్త్రంగా కూడా మార్క్సిజాన్ని చరిత్ర ప్రజలకు అందించింది. దాన్నందుకని పోరాడడం ద్వారానే భవిష్యత్తులో చారిత్రిక సత్ఫలితాలను మానవాళి పొందగలుగుతుంది.

ఈ పుస్తకంలో  మడ్కం విజయ్, బి. సుగుణల నుండి గంటి ప్రసాదం,టి. పురుషోత్తంల  దాకా; కాళోజి, బి.డి. శర్మ,శంకరన్ ల  నుండి కన్నబిరాన్,బాలగోపాల్, జయశంకర్, బొజ్జా తారకంల దాకా అనేక మందిలో మానవత్వం బహుముఖాలుగా పరిమళించి, ప్రసరించిన క్రమాన్ని, వారి వ్యక్తిత్వాల విశిష్టతలను హరగోపాల్ గారు అత్యంత స్ఫూ ర్తిదాయకంగా విశ్లేషించారు.

పైన పేర్కొన్న నేపథ్యంలో నుంచి పరిశీలించినప్పుడు ఈ పుస్తకం లోని 24 మంది లేదా ఎక్కువ మంది స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాల వెనక ఒక చారిత్రిక క్రమం ఉన్నదని, ఆ చారిత్రక క్రమానికి ఒక సైద్ధాంతిక చట్రం ఉన్నదని కూడా మనకు అర్థమవుతుంది. ఇందులోని అందరికందరూ భావజాలరీత్యా మార్క్సిస్టులు కానప్పటికీ, వారి వారి స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాచరణలు  పోరాట సిద్ధాంతమైన మార్క్సిజాన్ని మరింత సంపద్వంతం చేసుకోవడానికి ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయని చెప్పవచ్చు. మానవాళి విముక్తికై బహుముఖాలుగా కొనసాగుతున్న పోరాటాలన్నింటినీ ఏకం జేసి రాజ్యవ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టాల్సిన వర్గ పోరాటపు స్ఫూర్తినీ మనం ఈ అమరుల మానవత్వాచరణల  నుంచి పొందవచ్చు. మరీ ముఖ్యంగా నేటి ఫాసిస్టు చారిత్రక సందర్భంలో మనుషుల మానవత్వం పరిమళించాలంటే పోరాడక తప్పని అనివార్యతను గుర్తించడమే హరగోపాల్ గారి ఈ వ్యాసాలకు సార్ధకత.

Leave a Reply