స్వయం సిద్ధ ఎవరి జీవన రాగాలాపన? ఏబిందువు నుండి ఏ బిందువు వరకు ప్రయాణం చేశాయి ఈ కథలు. కధావరణలో స్వయం సిద్ధ స్థానం ఏమిటి? ఒంటరి మహిళల జీవన గాథల వెనుక దాగిన సామాజిక నేపథ్యమేమిటి?   మహిళల జీవన పోరాటంలో అలసిన తరువాత మిగిలిన స్వేచ్ఛ మాటే మిటి . స్వయంసిద్ధ  కథలు  భారత సమాజన్ని స్త్రీల కోణం నుండి అంచనా వేసిన కథలు.  భూస్వామ్య సమాజం  దాని కొనసాగింపులో భాగంగా స్త్రీ పై అధికారాన్ని పురుషుడు మరింతగా కొనసాగిస్తున్నపుడు  తమ జీవితానికి తామే నిర్ణయించు కుంటాం అనే కోణం నుండి వచ్చిన కధలు. సామాజిక చలనంలో స్త్రీ, పురుష భాగస్వామ్యం వున్నప్పటికీ తూకం ఎవరి వైపు వొరుగుతున్నది? ఈ తుాకపు  రాళ్ళు ఎవరివి ? అయితే ఈ తూనిక రాళ్ళను  తునాతునకలు చేసే ధిక్కారం మహిళలు వైపు నుండి మొలకెత్తుతుంది. 

బండారువిజయ పి .జ్యోతి సంపాదకులుగా స్వయంసిద్ధ కథా సంకలనం వెలువడింది.  కొత్త , పాతతరం కథకులు ఇందులో వున్నారు. కథలన్నిటిలో అంతస్సూత్రం స్త్రీ కేంద్రక జీవితం. తెలుగులో  చాలా భాగం స్త్రీల వైపు నుండి వచ్చిన సాహిత్యమే. సాహిత్యానికి కేంద్రబిందువు స్త్రీ…  స్త్రీ రచయితల సున్నితత్వం, స్త్రీల పట్ల ఉండాల్సిన మృదుత్వం. కాలం కూడా స్త్రీ పక్షపాతిగా కొనసాగింది. మన ముందటి చరిత్రను అంచనా వేసినప్పుడు మహిళల  జీవన ఆకాంక్షల వైపు నుండి చూసినప్పుడు జీవితంలో  కోల్పోయింది ఎక్కువ. ఎన్నో విధ్వంసకర అమానవీయ అనుభవాలలోకి నెట్టి వేయబడ్డారు. ఈ చరిత్ర మానసిక గాయాల చరిత్ర అనుకుంటే స్త్రీలు అనుభవించిన మానసిక, శారీరక ఆవేదనలు వాటి  వెనుక దాగిన పితృస్వామ్యం కారణం.

వర్తమానం కాలంలో నిలబడి బండారు విజయ పి .జ్యోతి ఈ స్థితిని అంచనా వేయడానికి  స్వయం సిద్ధ కథలను ఒకచోట చేశారు. తెలుగు సమాజంలో ఉన్న మహిళా రచయితలు వారి దృష్టి  వ్యక్తీకరణ లోని సజీవత ఈ కథలు ప్రతిబింబం. చాలా విషయాలను చర్చకు పెట్టారు. ఇందులో ప్రధానమైన అంశాలు కుటుంబ జీవితంలోని ఆధిపత్యం. రెండవది స్వేచ్ఛ. మూడవది ఏ పంజరాలు లేకుండా జీవించడం.  పురుషుడి లైంగిక స్వేచ్ఛను తమ వైపు నుండి చూడడం . ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి తనదైన జీవితం జీవించడానికి ఉద్యోగం ఒక ఆలంబన . దుఃఖానికి సంబంధించిన కథలకు ఇందులో చోటు లేదు . వర్తమాన స్త్రీల ప్రపంచం ఎలా ఉంది? వారి అంతః సంఘర్షణ ఏమిటి? కుటుంబం దాని కొనసాగింపులో తాము ఎదురుకుంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి? కుటుంబ సంబంధాలలోని వైరుధ్యాన్ని ఎలా చూడాలి? సామాజిక అంతరాలలోని  అసమానతలను స్త్రీలుగా ఎలా పరిష్కరించుకోవాలి?    మహిళల వైపు నుంచి వచ్చిన ఈ కథల   వెనుక దాగిన దృష్టి కోణాన్ని  రెండో వ్యక్తిగా చూసి అంచనాకి రాలేం.  ఈ కథల వెనుక స్త్రీ, పురుషుడు కలిసి నడిచిన వచ్చిన దారి ఉంది. అయితే ఆ దారిని   ఒక దుఃఖ ప్రపంచాన్ని స్త్రీలకు చేరువ చేసింది.  సామాజిక రూపకల్పనను ఎవరు పొందుపరిచారు?  ఈ పొందికలో జెండర్  మాటేమిటి?  అత్యంత సున్నిత మనుషులుగా స్త్రీలను విభజించిన  శారీరక, మానసిక దౌర్భాగ్యాన్ని స్త్రీ కేంద్రీకృతం చేసిన మన సాంస్కృతిక వారసత్వం మాటేమిటి?  మన పురాణాలు, ఇతిహాసాలు, మానవ చరిత్ర, చివరకు వర్తమాన కాలం చేసిన ద్రోహం ఇవన్నీ సాహిత్య చరిత్రలో రికార్డు కావలసిన సందర్భం ఏర్పడింది.

స్వయం సిద్ధ కథా సంకలనం మన తరం,  లేదా వర్తమాన కాలానికి చెందిన కధలు . స్త్రీలు తమ తెలివి డితో, మెళకువతో, పరిణితితో  దాటి వచ్చిన కాలాన్ని జీర్ణం చేసుకుని  ఒంటరి స్త్రీలుగా ఎలాఉండాలి?  ఈ చలనంలో స్త్రీల జీవన రాపిడి ఏమిటి? నిజానికి ఈ కథలు సామూహిక ఉమ్మడి స్వరం.  ఈ కథకులకు  కుల, మత , ప్రాంత వర్గ అస్తిత్వం ఉన్నది.  వీటన్నిటి వెనుక దాగిన ఆధిపత్యం వున్నది . మానసిక, శారీరక గాయాలు ఉన్నాయి. వాటి వెనుక దాగిన భారతీయ సమాజ కొనసాగింపు , సజీవతను కోల్పోలేదు. ఇన్ని  ఇనుప తెరలను దాటుకొని స్వయం సిద్ధల జీవన పోరాటమే ఈ కథలు.

కథలు జీవితం నుండి వస్తాయి. ఏ కథకైనా జీవితం కొలమానం. కాలక్షేప కథలయినా, సామాజిక సామాజిక ప్రతిబింబమే. అయితే రూపం, సారం అనే విశ్లేషణలు గమనించినప్పుడు ఈ కథలలో కనబడుతున్న రూపం మాత్రమే వాస్తవం కాదు. ఈ రూపం వెనుక దాగిన సారాన్ని తూచకపోతే  స్వయం సిద్ధ కథలు సాదా, సీదా కధలనే అంచనాకి వస్తాం.  బహుశా ఈ కథల వెనుక దాగిన సామజిక వాస్తవిక దృక్పథం ఏమిటి? రాజ్యం , సాంస్కృతిక  పరాయిరణను అర్థం చేసుకోక పోతే ఇవి కేవలం తెలుగు సమాజానికి సంబంధించిన కథలగానే మిగిలి పోతాయి . ఇవి మొత్తంగానే రాజ్యం, కుటుంబం  సాగించిన  స్త్రీ అణిచి వేతకు సంబంధించినవి. వీటి వెనుక దాగిన ఆధిపత్యాన్ని స్వయం సిద్ధలు  చర్చకు పెట్టారు. మారుతున్న సామాజిక సందర్భం మహిళల ఆర్థిక స్వేచ్ఛ, జెండర్ సమానత ఇవన్నీ స్త్రీలు తమకై సాధించినవి. అయితే ఈ వాస్తవికతను అంగీకరించడానికి పురుషుడు సిద్ధం కాలేదు. భూస్వామ్య పితృస్వామ్య  సామాజిక చట్రంలో బందీగా వున్నాడు. ఆ భావజాలం పురుషుని వైపు ఇంకా స్థిరంగా వున్నది. స్త్రీలు తమదైన మార్గం వేసుకోవడమే కాదు, గమ్యం దగ్గర నిలబడ్డారు. ఇక్కడే స్వయంసిద్ధల కధావరణ అవగతమవుతుంది.

స్వయం సిద్ధ కధలు ఒంటరి మహిళలు రాసిన కథలు మాత్రమే కాదు. విస్తృతమైన స్త్రీ పురుషులు సంబంధాలలో  కుటుంబ ఆధిపత్యం కింద, నలిగిన స్త్రీల కథలు. ఇందులో కొన్ని   కథలు  కాలేదు అనే విమర్శ వుండనే వుంది.  దుఃఖానికి భాష, శైలి, శిల్ప  దృష్టితో  తూకం  ఏమిటి? బాధకు, బాధ్యతకు  జవాబు ఈ కథలు. ఈ సంకలనం వెనుక దాగిన కృషిని సామాజిక, సాహిత్య చరిత్ర తనలో సంలీనం చేసుకుంటుంది.

One thought on “మానసిక గాయాల చరిత్ర

  1. Review on Svayam sidda stories by women by Arasa velly is good. His observations on men who are lagging behind women are very appropriate

Leave a Reply