“ అశోకు వచ్చిoడాడా ? వాడి గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “
యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి దుర్గమ్మ గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది.
గుడి పక్కనే ఒక మొండిగోడల సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు.
తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి కూర్చునో , లేదా పడుకునో ఉంటాడు.పగల్లో కానీ, రాత్రుల్లో కానీ అతడికి ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఆదమరచి నిద్రలోకి జారుకుంటాడు. ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి కూర్చుని గుడ్డ పేలికతో తాడు అల్లడమో, వెదురు దబ్బలతో తట్టా, బుట్టా, చాటాలు చెయ్యడమో చేస్తుంటాడు. పగలుకు రాత్రికి అతడి దృష్టిలో తేడా వుండదు.వానొచ్చినా, చలి అన్పించినా , ఎండ మటమటలాడిస్తున్నా అతడి పని అతడిదే. అతడి లోకం అతడిదే .
ఆ గొంతు అతడిదే .!
“ ఈ కట్టే కాలిపోయే లోగా అశోకు వస్తాడు. వానికోసమే ఇదంతా. వచ్చినోడికి కష్టం తెలికూడదు. మళ్ళీ కడుపాత్రం ఇల్లు వదిలి దేశాంతరం వెళ్లి పోకూడదు చిన్నబ్బా… ” నారాయణప్ప తాత రోజూ చెప్పే మాటలే ఇది. అయినా నాకు ఎప్పుడూ విసుగు అనిపించదు.
ఆ ముసలాయనకు కళ్ళు సరిగ్గా కనిపించదు. ఆయనకు మొదటినుoడీ ఒక కన్ను పూర్తిగా కనిపించదు. అందరూ ఒంటి కన్ను నారాయణప్ప అనే పిలుస్తారు. దగ్గర దగ్గర ఎనభై ఏళ్లు వుంటాయేమో. నులక మంచం పైన కూర్చుని పని చెయ్యడమో, అదే నులక మంచం పైన పడుకుని గురక పెట్టి నిద్ర పోవడమో చేస్తూ ఉంటాడు.
ఆ పక్క ఎప్పుడు ఎవరొచ్చినా, ఎంత మాత్ర అలికిడైనా ఒక మాటే పదే పదే అడుగుతూ ఉంటాడు
” మా చిన్నోడు.. నా కొడుకు అశోకు గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? మనోళ్ళు దేశం మొత్తం కడుపాత్రం తిరగతానే వుంటారు కదా. ఎవురికైనా యాడైనా కనిపించాడేమో అడిగినారా? కుడికాలు ఎత్తుగా వుంటుంది. కాలు ఎగరేసి ఎగరేసి నడుస్తా ఉంటాడు. మట్టిలో కలిసే లోగా నా చేతులతో వాడికి కడుపునిండా ఇంత అన్నం తినిపించల్ల. మునక్కాయల చారoటే వాడికి శానా ఇష్టం. కడుపు నిండా వాడు తృప్తిగా తిని, వాడు నాకో ముద్ద తినిపిస్తే తినేసి, నా దోవ నేను సూసుకుంటా. నాకు ఇంకేం కోరికల్లేవురా అబ్బోడా. నోరు, చెయ్యి కట్టుకుని , తినీ తినక మునెమ్మ దగ్గర దాచి పెట్టిoడేది అంతా ఆయప్పకి ఇచ్చేస్తే సాలు. నా ప్రాణం నెమ్మదిస్తుంది. ముందిది సెప్పు . నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా చిన్నోడా “
::2::
ఆ పక్క నుండి చూస్తే మొత్తం కాలనీ ఇండ్లన్నీ నిలువు అడ్డం వరుసలలో కనపడతాయి. కొన్ని పాడు బడిపోయాయి, కొన్ని మరమ్మత్తు చేయించినవి. కొన్ని మళ్ళీ కొత్తగా అధునాతనంగా కట్టుకున్నవి. ఆ ఇండ్లు అన్నీ ఎరికిలోల్లవే . ఒక బోరింగు, సిమెంటు రోడ్లు, మురికినీటి కాలువ మళ్ళీ వచ్చాయి. కులమోల్లు అందరూ కలసి చందాలు వేసుకుని కట్టుకున్నదే దుర్గమ్మ గుడి.
చాలా కాలం కింద ఎరికిలోల్లoదరికీ కాలనీఇండ్లు కట్టిoచేదానికి గవర్మెంటు ముందుకు వచ్చింది. అప్పుడు ఇండ్లు మాకు కావల్లంటే మాకు కావల్ల అని చాలామంది ముందుకు వచ్చారు.టౌన్ లో ఇండ్ల స్థలాలకు డిమాండు ఎక్కువ కాబట్టి, ఎవరికీ స్వంతిండ్లు లేవు కాబట్టి,డబ్బు వున్నా లేకపోయినా చాలామంది మొదట ఉత్సాహo చూపించారు.ముందుకు రాని కొంతమందిని వాళ్ళ ఆడోల్లు ముందుకు తోసారు.
కానీ అందుకు లబ్దిదారుల వాటాపేరుతో డబ్బు కట్టాలి అనేసరికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. .అంత డబ్బు మా వద్ద లేదంటూ ఒకరొకరే వెనక్కి జరిపోతావుంటే మా నాయన , మా అమ్మ , మా మామయ్య , మా చిన్నాయనల మొహాలు మాడిపోయాయి. ఎంతో కష్టపడి, ఎన్నెన్నిసార్లు అధికారులకి , ప్రజా ప్రతినిధులకి అర్జీలపైన అర్జీలు పెట్టుకుంటేనో, ఎంతో కాలం తర్వాత యస్టీ కాలని మంజూరు అయ్యింది. ఆ కష్టం, ఆ శ్రమ తిరిగినోల్లకే తెలుస్తుంది. కాలనీ యెట్లా ఏర్పడిందో నేను చిన్నప్పుడు దగ్గరగా చూసింది మొత్తం నాకు ఇప్పటికీ బాగా గుర్తు వుంది.
ఎరికిలోల్లకి వూరి మధ్యలో , అదీ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళే రోడ్డులో స్థలం కేటాయించడమే గొప్ప అని, ముందు ముందు ఆ స్థలానికి విలువ బాగా పెరుగుతుందని, గుడిసెల్లో, ఎర్రమట్టి ఇండ్లల్లో వుండేవాళ్ళు వాళ్ళ బిడ్డలకోసమైనా పక్కా ఇండ్లు కట్టుకోవాలని శతవిధాలా పోరాడినారు మా పెద్దోళ్ళు.
డ్యూటీ నుండి ఇంటికి రాగానే “ జయా అర్జెంటుగా మంచి స్ట్రాంగ్ టీ పెట్టు..” అని ఆర్డర్ వేసి , కాఖీ యూనిఫారం విప్పేసి , తెల్ల చొక్కా, తెల్ల పంచ కట్టుకుని టీ తాగి, టీ బాగుందిమే .. అని మెచ్చుకుని, గణేష్ బీడీ ముట్టించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు మా నాయన . కొన్ని వారాల పాటూ రోజూ సాయంత్రాలు, రాత్రిళ్ళు అందరి ఇండ్లకు తిరగటమే అయన పని. కొంత మంది అయితే ఆయన వచ్చి చెప్పిందే చెప్తాడని ఇండ్లల్లో సరిగ్గా అయన వచ్చే సమయానికి లేకుండా పోయే వాళ్ళు. అది కూడా మంచిదే అనుకుని ఆయన మట్టసంగా గుడిసె ముందు చాప వేయించుకుని, మిగిలిండే ముసలి వాళ్ళు , ఆడవాళ్ళoదరితో మీటింగు పెట్టేసేవాడు.ఆఖరికి ఆ ఇండ్లల్లో చిన్నపిల్లోల్లకి కూడా అర్థం అయిపోయేది మా నాయన , మా చిన్నాయన , మా మామయ్య, మా అమ్మ ఎక్కడ కనిపించినా వాళ్ళు అడిగేది, చెప్పేది ఒకే మాటే అది సొంత ఇంటి గురించే అని.
“ నాకేమో ఉద్యోగం వుండాది అలివేలమ్మా , పెంకుటింట్లో వున్నాను. వానొచ్చినా, వరదొచ్చినా నాకేమీ బాధ లేదు. మీ పరిస్థితి ఏందో నాకంటే మీకే బాగా తెలుసు. నా మాట వినoడి. మీ పిల్లోల్లకి సదువులకి బాగుంటుంది,మీకు మర్యాదగా వుంటుంది. ఎంత కాలమని విసిరేసినట్లు వానకి తడస్తా ఆడాడ గుడిసెల్లో పడి వుంటారు? ఊర్లో అంతో ఇంతో మతింపు వుండల్లంటే సొంత ఇల్లు వుండల్నా, వొద్దా మీరే తేల్చుకోండి. దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తా వుంటే మీ మొగోళ్ళు వెనిక్కి వెనిక్కి పోతా వుండారు. సారాయి తాగే దానికి మాత్రం దుడ్లు యాడినుంచో రోజూ అదంతకు అదే పుట్టుకుని వస్తాయి. అరె దానేమ్మా సొంతంగా ఇల్లు కట్టుకోండిరా నాయనా అంటే మాత్రం మా కాడ దుడ్లు లేవు అనేస్తారు.దుడ్లు ఎవురికాడా ఎప్పుడూ వుండవు. కష్టపడల్ల, అప్పో సప్పో చెయ్యల్ల. పిల్లోల్ల మంచికోసం మనం తెగాయిoచల్ల .ఏ ఇల్లయినా వుండాది అంటే దాంట్లో ఆడోల్ల కష్టమే వుంటుంది.మీ కష్టం వూరికే పోదు, అయినా ఆడోల్ల పేరుతోనే కదా ఇంటి పట్టాలు, ఇండ్లు ఇస్తా వుండేది.. ఎవురిల్లు అంటే .. ఇది అలివేలమ్మ ఇల్లు, రాజమ్మ ఇల్లు అంటారే కానీ కుయ్యప్ప ఇల్లు, కపాలి గాడి ఇల్లు అనరు కదా. ”
మా నాయన ఆమాటలు చెప్పి వచ్చేసినంక వాళ్ళ సందేహాలన్నీ తీర్చే పెద్దమనిషి ఎవరో కాదు, వుంది కదా మా ఇంటి వెలుగు మా మదర్ తెరిసా.!మా అమ్మ .
“ ఇంకా మన ఆడోల్లు ఆడ పిలకాయలు ముండ్ల చెట్లకాడికి చెంబులు ఎత్తుకుని పోతా వుంటే సూసేదానికి అసింకంగా వుంటావుండలే, ఒకే గూట్లో పిల్లోల్లు పెద్దోళ్ళు పడుకుంటా వుంటే సంసారాలు ఎట్లా జరగతాయి . మొగోల్లకేమి సిగ్గా ఎగ్గా , మనం కదా అంతా యోచించాల్సింది” అని లోపలి మాటలేవో ఆడవాళ్ళతో గట్టిగానే చెప్పేది.
ఇప్పుడైతే స్యయం సహాయక బృందాలు, వెలుగు మెప్మా సంఘాలు అని మీటింగులు పెడుతున్నారు కానీ , ఆ పని మా నాయన, మా అమ్మ, మా అత్త , పిన్నమ్మ , మా మామయ్య ఏ కాలమో చేసేసినారు. మొగవాళ్ళు ముందుకు రాక పోయినా,సగం మనసుతో వెనకా ముందూ చూసుకుంటా వెనక వెనకే వుండి పోయినా, ఆడవాళ్ళకు అర్థం అయ్యేలా చెప్పి వాళ్ళు కూడ బెట్టిన డబ్బులతో , అక్కడక్కడా వేరే వాళ్ళ దగ్గర అప్పులు ఇప్పించి మొత్తానికి కాలనీ ఇండ్ల కోసం బ్యాంకులో డిపాజిట్లు కట్టించేశారు.
“ ఒకురి బాధలు ఒకురికి చెప్పుకోవల్లంటే, ఒకురి కష్టానికి ఒకురు రావాల్లంటే, అంతా ఒక్క చోట వుంటే మంచిది కదా వదినా. నీ మొగుడు తాగేసి వచ్చి ఒంట్లో సోధీనం లేకుండా కొడతా వుంటే నువ్వే ఎన్నితూర్లు ఇండ్లమ్మడి ఆయప్పకి దొరక్కుండా పరుగెత్తుకు వచ్చిoటావు చెప్పు? అంతా ఒక్క చోటే వుంటే ఒకురికి ఒకురు తోడుగా వుంటారు కదా. ఎంత కష్టం లో అయినా మనిషికి మనిషే కదా ధైర్యం ఇచ్చేది. నా మాట వినండి, పందుల్ని మేపినా, గాడిదల పైన ఉప్పు అమ్మినా, తట్టా , బుట్టా అమ్మినా, యెర్ర మన్ను ముగ్గు పిండి అమ్మినా మనల్ని అడిగే వోడు లేదు. మన కాళ్ళ పైన మనం నిలబడి మన కష్టం మనం తింటా ఉండామే కానీ ఉన్నప్పుడు తిని, లేనప్పుడు పస్తయినా వుండామే కానీ, ఏ పొద్దూ ఎవరి సొత్తుకు అయినా పోతావుండామా ? . అయినా మనం అంటే మన పిలకాయలకి ముందు ముందు కొంచైనా మర్యాద ఉండాల్నా వద్దా చెప్పు “ అని మా అమ్మ వాళ్ళను నిలదీసి అడిగేది.
::3::
“ అయినా ఈ మొగ నా బట్టలు మారతారoటావా ? ఇల్లు కట్టుకుంటే దినమ్మూ తాగేది మానేస్తారా వొదినా ? తాగిన్నాకొడుకులు గుట్టుగా ఇంట్లో ఉండిపోతే సాలు అంటే వినరే. పెండ్లాలు సెప్పేది వింటే యెట్లా?వాళ్ళు మొగోళ్ళు కదా, మొగోళ్ళు మొగోల్ల మాటలే వింటారు, సావనైనా సస్తారు కానీ , సచ్చినా ఆడోల్లు సెప్పే మంచి మాత్రం వినరు కదా. ఆడోల్ల మాట వింటే అంతకంటే అగుమానం ఇంకేమైనా ఉంటుందా ? ఆ మొగ నా బట్టలకి రాత్రయితే సాలు గుడ్డలిప్పుకుని ఈదుల్లోకి వచ్చేస్తారు. నా సంపాదన ఇంత అని రాగాలు తీస్తారు. ఈతలో పందిపిల్లలు రెండు ఎక్కువ పుట్టినా అదీ నా గొప్పే అనేస్తారు. గుడిసెలు, గుడిసెలో వస్తువులు చెప్పి, పంది పిల్లల్ని లెక్కేసి లెక్కేసి నాది ఇంత వుంది, నీది ఎంతరా అని కొట్టుకుంటారు. ఎనకటి పురాణాలు., తాతల కాలంనాటి రామాయణాలన్నీ అంత సారాయి గొంతులో పడేసరికి ఎక్కడెక్కడినుంచో గుర్తుకు వచ్చేస్తాయి.” ముక్కు చీదుకుంటా, ఒంటికి తగిలిన దెబ్బలని చూపిస్తా మొగుణ్ణి శాపనార్థాలు పెట్టడం లో మునిగి పోతుంది రాజమ్మ.
“ తాగినోల్లు తాగినట్లు గుట్టుగా వుంటే యెట్లా ? ఎవురు ఎంత ఎక్కువ తాగితే , ఎవురు ఎక్కువగా ఆడదాన్ని తంతే కదా అంత గొప్ప. అప్పుడు కదా ఆ నా బట్టలు మొగోల్లని అనిపించుకునేది. ” అలివేలమ్మకి జుట్టు ఎప్పుడూ నిలవదు.జుట్టు ముడి వేసుకుంటా ఆయమ్మ అట్లా అనగానే చంద్రమ్మ ఆవేశంగా లేచి నిలబడి చేతులు వూపతా అరుస్తుంది.
“ తాగేదంట్లో, ఆడోల్లని తన్నే దాంట్లో మొగతనం వుండాదని వీళ్ళకు నేర్పించినోల్లని ముందు ఎగేసి ఎగేసి తన్నల్ల . అంత సారాయి నోట్లికి పడే సరికి ఉచ్చ నీచాలు మర్చిపోతారు, మానం మర్యాద మర్చిపోతారు. సగం జీవాలు .. పంది పిల్లలు వానెమ్మా తాగుడికే పోతే నేనూ నా పిలకాయలు ఏం తిని యెట్లా బతకల్ల అక్కా? తాగేస్తే వానికి ఒంట్లో స్వాధీనం వుండదు అక్కా, సూడు ఆ నాబట్ట చేసిండే పని ” అంటా అరుస్తా అరుస్తానే నది వీధిలో చీర విప్పేసి ఒంటినిండా కమిలిన గాయాల్ని చూపుతుంది ఆయమ్మ .
“దానికే నువ్వట్లా అబ్బారిస్తా వుంటే నేను ఎవురికి సేప్పుకోవల్ల అత్తా..? ” అని అంటా అంటానే సులోచనమ్మ చీర కొంగు కింద పడేసి వెనక వైపు జాకెట్ గుడ్డ పైకెత్తేసింది. ఆమె వీపు మొత్తం గాయాలతో నిoడిపోయింది. ఒంటిపైన తేలి కనిపిస్తున్న కమిలిన గాయాలను చూసి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మగవాళ్ళని తిట్టడమే వాళ్లకు ఓదార్పు అయినట్లుగా అక్కడి వాతావరణం క్షణాల్లో మారిపోతుoది. అదంతా వాళ్ళకు మామూలే .
కొన్ని నిముషాల తర్వాత ఆ ఏడుపులే నవ్వులవుతాయి . వేళాకోలాలు మొదలవుతాయి.మొగోల్ల సరసాలు, మగతనాలు మాటల్లోకి వస్తాయి. ఒకరి పై ఒకరు పడీ పడీ నవ్వుకోవటాలు, మొగుడి దెబ్బల నుండి యెట్లా తప్పించుకుందీ, పనిలో పనిగా మొగుడ్ని యెట్లా ఎదురు దెబ్బ కొట్టిందీ, చెప్పుకుని కుశాలగా మాట్లాడుకుంటూ మొత్తం మీద మా అమ్మ చెప్పిన మాటలకు ఒప్పుకుంటున్నట్లు తలలు ఊపుతూ “ మాకు ఎప్పుడేం అవసరం వచ్చినా నువ్వొక చెయ్యి వెయ్యాలమ్మా” అని కూడా మాట తీసుకునేస్తారు.
::4::
“ మ్మోవ్ .. నాకుండేది మీకు అందరికీ ఉన్నెట్లు రెండు చేతులే. తలా ఒక్క చెయ్యి వెయ్యాలంటే కూడా నాకు ఈడ ముఫ్ఫై ఆరు చేతులు కావల్ల . ” అంటూ మా అమ్మ నవ్వుతూ తన రెండు చేతుల్ని దిష్టి తీస్తా వున్నట్లు గాల్లో గుండ్రంగా తిప్పి చూపిస్తుంది.
ఆ తర్వాత మా అమ్మ ఇంకో మాట కూడా అoటుంది “ వదినా నాకు రెండు చెవులు , రెండు చేతులే వున్నాయి. మీ అన్న కడుపు కాల్చుకుని సరిగ్గా తినీ తినకా ఎట్లనో జత కమ్మలు, గాజులు చేపించినాడు.అవి ఎప్పుడూ ఎవరికోసమో ఒకరికోసం కుదవలోనే కదా వుంటాయి.ఇంకో రెండు చేతులు, చెవులు వున్నింటే ఇంకో జత కమ్మలు, ఇంకో జత గాజులు వున్నింటే గానా ఇంకా బావుండేది వదినా, నా కోసరం కాదు, ఇంకో మనిషిని ఎవరినైనా ఆపదలో కాపాడింటాయి కదా . ”
మా నాయనకు, మా పెరుమాళ్ మామకు , అంగడి సుబ్రహ్మణ్యం చిన్నాయనకు, టెంకాయల నారాయనప్పకు కాలనీ యెట్లా పుట్టిందో చెప్పుకోవడం వాళ్ళకు ఎంతో సంతోషం కలిగించే విషయo.
“ నేల చదును చేసి, ముండ్ల కంపలు కొట్టి , బండరాళ్ళు ఏరి పారేసి ,ఆ ఇండ్లు కట్టేటప్పుడు ఆ మనుషులు, ఆడోల్లు , ఆ పిల్లోల్లు పడిన బాధలు అన్ని ఇన్నీ కావు. చీమ తలకాయంత బంగారం, వెండి కూడా వదల్లేదు, రాగి పాత్రలు, తట్టా,బుట్టా, గాడిదలు, పంది పిల్లలు, మేక పిల్లలు , కోళ్ళు , ఇనుప మంచాలు ఏమేమి వుంటే అవన్నీ అమ్ముకోక తప్పలేదు రా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడ ఎక్కడో విసిరేసినట్లు దూరదూరంగా వుండే వాళ్ళు, రకరకాల పనులు చేసే వాళ్ళు, అడవిలో కట్టెలు తెచ్చి అమ్ముకునే వాళ్ళు, తేనే , మూలికలు, ఆకు పసర్లు అమ్ముకునే వాళ్ళు, పందులు బాతులు మేపే వాళ్ళు , వెదురు పని చేసే వాళ్ళు, యెర్ర మన్ను, ముగ్గు పిండి అమ్మే వాళ్ళు ఇట్లా రకరకాల మనుషులు ఒక్క చోటికి వచ్చి , కాయ కష్టం చేసి, తినీ తినక, కూలి నాలి చేసి, ఒకరి ఇంటి పనుల్లో మరొకళ్ళు వంతుల వారిగా పని చేసుకుంటూ ఒకరికొకరుగా నెలల తరబడి అహోరాత్రులు శ్రమ పడితేనే కదా కాలనీ ఇట్లుoడాది.” మా పెరుమాళ్ మామకు చెప్పిందే చెప్పటం అలవాటు.
***
రెండు దశాబ్దాల తర్వాత అయితే పరిస్థితులు క్రమంగా మారాయి. చాలామంది ఆ పాడు అలవాట్లనుండి మెల్లగా బయట పడ్డారు, కొందరు తాగి తాగి ఆ తాగుడికే బానిసలై లోకం విడిచి వెళ్ళిపోయారు.అప్పుడు చాలా కష్టపడి కట్టుకున్న ఇండ్ల స్థానం లో ఇప్పుడు కాలనీలో కొత్త ఇండ్లు కనపడతాయి. అక్కడక్కడా కొన్ని ఇండ్లు గతచరిత్రకు సాక్ష్యాలుగా మొండి గోడలతో, తలుపులు, వాకిళ్ళు, కిటికీలు లేకుండా కనిపిస్తాయి . ఒక్కక్క ఇంటిది ఒక్కో కథ కాదు. ఒక్కో మనిషికో కథను ఆ ఇండ్లు వినిపిస్తాయి. ఏ ఇంటి ముందు నిలబడినా ఏదో ఏడుపు ఏళ్ళనాటిది సన్నగా అయినా వినపడకుండా ఉంటుందా?ఆ రక్త గాయాలు , కన్నీళ్ళు కనపడకుండా పోతాయా? ఆ చెమట చుక్కల వాసన రాకుండా ఉంటుందా ?
ఎన్నో దౌర్జన్యాలతో, ఎన్నో అవమానాలతో, నిలువెల్లా గాయాలతో ,ఇక్కడ బ్రతకలేక , ఎక్కడో బ్రతుకుదారుల్ని వెతుక్కుంటూ ఇండ్లు , ఊర్లు విడిచిపెట్టి పోయిన వాళ్ళ కతలు ఎన్నో! ఎన్నెన్నో !
::5::
లోకంలో లేకుండా పోయిన వాళ్ళ కతలు యెట్లా వున్నా, కడుపాత్రం దేశాంతరం పోయి , కరువు కాలంలో కంటికి కనిపించకుండా పోయిన వాళ్ళు ఇప్పటికైనా తిరిగీ ఇల్లు చేరుకుoటారేమో అని ఇంకా ఆ మొండిఇండ్లల్లో , మొండిగా బ్రతుకుతున్న ఆ మొండి మనుషుల ఎదురు చూపులే చూసేవాళ్ళకు కళ్ళ నిండా కన్నీళ్ళు తెప్పిస్తాయి.
ఇప్పుడు వాళ్ళు అందరూ ముసలివాళ్ళయిపోయారు. వాళ్ళను కదిలిస్తే చాలు కన్నీళ్ళు నేలరాల్తాయి. బ్రతుకుదారులు వేరైనా వాల్లందరివీ కంటికి కడవెడు కన్నీళ్ళు నింపుకున్న కతలే!
ఒకప్పుడు ఎరికిల వాళ్ళు అంటేనే పోలీసులు, నాయకుల మొహాలు మారిపోయేవి.
“ స్టూవార్టుపురం అనే ఊరు మీ కోసమే పుట్టిందంట కదా. దొంగతనాలు చేసే వాళ్ళoదర్నీ అక్కడకు తీసుకు వెళ్లి దూరంగా పెట్టేసి దొంగతనాలు చెయ్యకుండా కట్టడి చేసారంట కదా. ”
“ అయ్యా ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని మొత్తం కులాన్ని తప్పు పడితే యెట్లా ? గతాన్ని సాకుగా చూపి మొత్తం మా కులాన్నే తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ఎక్కడ దొంగతనాలు జరిగినా ముందు మీరు మా ఇండ్లకాడికే వచ్చి వయసు మొగోల్లని, ముసిలోల్లని కూడా కుల్లబొడుస్తారు. ముసిలోళ్ళనయినా ఇడిసి పెట్టండి సారూ అని మేం అడుక్కుంటే ముసిలోల్లకే అనుభవం ఎక్కువ, నేర్పరితనం, పనితనం ఎక్కువ అంటారు.మేం చెప్పే ఒక్క మాటైనా వినకుండా మమ్మల్ని అనుమానాలతో అవమానాలతో సంపేస్తావుంటే, మేం యాడికి పోవల్ల సామీ ? ”
అప్పుడెప్పుడో ఆ ముసలాయన, ఆ నారాయణప్ప, ఆ ఒంటి కన్ను నారాయణప్ప పోలీసులకు ఎదురు తిరిగి మాట్లాడినాడంట . ఏదో దొంగతనం కేసులో అనుమానం పైన వారం దినాలు అతడు , అతడి కొడుకు అశోకు పోలీసు స్టేషన్ లో వుoడి వెనక్కి వచ్చిన తర్వాతే అశోకు ఇల్లు వదిలిపెట్టి పోయిoది.
అలా పోయిన వాడు పోయినట్లే ఉండిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో చెప్పేవాల్లే లేరు.
తన పనేదో తానూ చేసుకుంటూ ఎవరి జోలికి పోకుండా మెత్తగా వుంటూ, ఏ చెడు అలవాట్లు లేని ఆ కొడుకంటే ఆయనకు చాలా ప్రేమ. కేవలం కులం కారణంగా అతడికి జరిగిన అవమానాల కారణంగా, పోలీసుల దెబ్బలకు భయపడి కొడుకు అట్లా దేశంతరo వెళ్ళిపోవడం అతడ్ని బాగా కలచివేసింది.
పెళ్ళాం చనిపోయాక, కూతురు బాతులు మేపే భర్త కుటుంబంతో తమిళ దేశం వెళ్ళిపోయాక అతడు ఒంటరివాడై పోయాడు. ఓపిక ఉన్నంత కాలం వంట చేసుకునే వాడు, కానీ వయసై పోయాక దగ్గరి చుట్టాలు పోసే కలో గంజో మాత్రమే అతడి ఆహారం. పండగలప్పుడు, దేవర్లప్పుడు, దినాలప్పుడు ఎవరో ఒకళ్ళు మర్చిపోకుండా అంత కూడు తెచ్చి పెట్టేసిపోతారు.
::6::
దగ్గు అడ్డు పడటం వల్ల ఆయాసం వల్ల కొంచమే మాట్లాడతాడు నారాయణప్ప. మిగతాది మనమే అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మాటలమధ్యలోనే ప్లాస్టిక్ కవర్ లోంచి ఆకు వక్క సున్నం దుగ్గు నోట్లో వేసుకుని కసాబిసా నమలతాడు. వక్కా ,ఆకు తినీ తినీ నోట్లో పండ్లు గార పట్టిపోయి, నాలుక ,పళ్ళు పెదాలు ఎర్రబరిపోయి చూడడానికి రక్తం కక్కినట్లు కనపడతాడు.
“ ఏముండాది అబ్బోడా ఈ కులం లో పుట్టినందుకు ఏ తప్పు చెయ్యకపోయినా దండన పడల్లoటే యెట్లా చెప్పూ ? . నా బిడ్డ ఒకురి మాటకు కానీ ఇంకొకళ్ళ సొత్తుకు కానీ పోయే రకం కాదు.పద్దతిగా పెరిగినాడు, మందూమాంసం ముట్టనోడు, నీతిగా నిజాయితిగా బ్రతికినోడు.పువ్వు మాదిరి మనసి. అట్లాంటోడ్ని నువ్వు దొంగతనం చేసినావు కదరా దొంగ ముండా కొడుకా.. తప్పు చేసినావని ఒప్పుకోరా అని గుడ్డలిప్పేసి కొడితే, వాడు ఆ పసికంద తట్టుకోలేక పోయినాడబ్బా. యాడికి పోయినాడో దేశాంతరం ఎల్లిపోయినాడు. నాకు దీపంపెట్టే టయానికైనా వస్తాడో, రాడో.కళ్ళు కనిపించకుండా పోయినా , కళ్ళలోనే వున్నాడబ్బా …నా చిన్నోడు. పెండ్లీ, దేవరా లేకుండా పోయింది నా బిడ్డకి. నా అశోకు యాడుండాడో, యెట్లా వుండాడో, ఏం తిని బతకతా వుండాడో, నోరు లేనోడు ఈ ముండా లోకంలో ఎట్లా బ్రతకతాడో నా సిన్నోడు .. ”
చాలా కాలం తర్వాత కాలనీలో సందడి మొదలైంది.
గుడి బయట చాపలు వేసుకుని ఆదివారం సాయంత్రం నిరుద్యోగ యువకులు, కాలేజీల్లో చదువుకుంటున్న కుర్రాళ్ళు అందరూ ఏదో మీటింగ్ పెట్టి కలుసుకున్నారు. గంటసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నారు. చర్చించుకున్నారు.
“ అందుకే చెపుతున్నాను. బాగా అర్థం చేసుకోండి. యస్టీ కాలనీ అని కాలనీ మొదట్లో తోరణం మాదిరి పెద్ద బోర్డు పెట్టుకుని , మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నాం. కాలేజీలో కానీ హాస్టల్లో కానీ ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన మార్పు ఏముందో చెప్పoడి. మన కులం పేరు చెప్పుకోవల్లంటేనే నామోషీగా వుంటుంది. అందుకే ముందు ఈ కాలనీకి పేరు మార్చేద్దాం. యస్టీ కాలనీ అని, ఎరికిలోల్ల కాలనీ అని అనటం మనకు ఏమైనా గౌరవంగా ఉందా మీరే చెప్పండి. ముందు కాలనీ పేరు మార్చేద్దాం, ఏమంటారు ? ”
అక్కడ కాసేపట్లోనే కలకలం మొదలయ్యింది. కొందరు పూర్తిగా ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తే , కొందరు ఆ మాటలని అంగీకరించారు.ఇంకొందరు తమ తమ వాదనల్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు.
“అందుకే కదా సిగ్గుపడి మనోళ్ళు కొందరు మన కులం ఏదని అడిగితే అసలు కులం దాచిపెట్టి ఇంకేదో పేర్లు చెప్పుకుంటావుండారు.”
“ ఎవురి కులం వాళ్లకి గొప్పే, సమాజం లో కులాల మధ్య అంతరాలు పోతేనే సమాజం లో అసమానతలు పోతాయి. సమానతే మనoదరి కర్తవ్యం కావాలి. ఎవరి కులాన్ని అయినా చెప్పుకోవడం ఎవరికీ తక్కువా కాదు, నామోషీ కాదు. ”
::7::
“ నేను ఇంతకు ముందే చెప్పినాను మీరే వినలేదు.”
“ ఏం చెప్పినావు బ్రో….”
“ మనోళ్ళు అందరూ పేరు చివర ఎరుకల అని పెట్టుకోవాలి. నా పేరు అడిగితే నాగరాజు ఎరుకల అనే చెపుతా ”
వీళ్ళ హడావిడిలో వీళ్ళు వుంటే, నారాయణప్ప గొంతు ఉన్నట్టుండి బలంగా వినిపించిది వాళ్లకు. గాలికి కొట్టుకు పోయేటట్లు వుండే ఎముకల గూడు లోంచి అంత బలంగా అంత మాట వస్తుందని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఎనభయ్యేళ్ల ఆ ముసలాయన గొంతు ఏదో చెపుతున్నట్లు లేదు. దేన్నో తీవ్రంగా నిరసిస్తున్నట్లు , ఎవర్నో బలంగా నిలదీస్తున్నట్లు, ప్రశ్నిస్తున్నట్లు వుంది.
నారాయణప్ప దగ్గుతెరల మధ్యే గట్టిగా అoటున్నాడు. “ ఆ కులం పేరు సేప్పినందుకే కదా సామీ ఒక కన్ను పోయేలా కుమ్మేస్తిరి. ఆ కులం పేరు సేప్పినందుకే కదా సామీ కొడుకుని దేశాంతరం పోయేలా తరంగొడితిరి. మేం చెప్పేది రవ్వంత వినండ సామీ, మీ కాళ్ళు మొక్కుతాం అంటే మా కులం పేరు మాత్రమే కదా సామీ ఇన్యారు. ఇంకేమైనా ఒక్క మాటైనా మేం సెప్పేది ఇంటిరా దొరా? ఎరికిల కులంలో పుట్టడమే మా తప్పా సామీ? ”
గాలి కూడా అక్కడే ఆగిపోయి వింటా వుంది ఆ గొంతుని, ఆ గుండెని.!