ఈ పుస్త‌కం మీ కోసం. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్త‌కం ఉప‌క‌రిస్తుంద‌ని మీకు అందిస్తున్నాం. చ‌ద‌వండి.. చ‌ర్చించండి.

భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్‌) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు.

నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం కాదని, వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే అర్ధ వలస, అర్ధ భూస్వామ్య విధానం

ధ్వంసం చేయబడి నూతన ప్రజాస్వామిక విప్రవం జయప్రదమై పెట్టుబడిదారీ విధానం నుండి సోషలిజానికి సమాజం మార్పు చెందగలదని విప్ల‌వ‌కారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే  దేశంలో సామ్రాజ్యవాదుల రీస్టక్చర్‌ విధానం వలన స్వతంత్ర పెట్టుబడిదారీ విధానం ఏర్పడకపోవడం” మరోవైపు వర్గ పోరాటాల మూలంగా కరడు గట్టిన భూస్వామ్యం దెబ్బతిని పోయినప్పటికీ విప్లవం జయప్రదం అయి దాని స్థానంలో సోషలిస్టు ఉత్పత్తి సంబంధాలు వఏర్పడకపోవడంతో, అర్ధ భూస్వామ్య విధానంలోనే వక్రీకరించిన పెట్టుబడిదారీ సంబంధాలు అభివృద్ధి అయినాయని విప్లవోద్యమం విశదీకరిస్తున్నది.

వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం ప్ర‌వేశించిందనేవారు ఈ కింది వాదనలు చేస్తున్నారు.

  1. గ్రామీణ వ్యవసాయ రంగాల్లో గత మూడు, నాలుగు దశాబ్దాలుగా అనేక మార్పులు జరిగాయి. పదుల, వందల ఎకరాలలో ఉన్న భూస్వాములు లేరు. భూమి చిన్న కమతాలుగా విభజింపబడింది. జీతగాళ్ల పద్ధ‌తి చాలా వరకు తగ్గిపోయింది. స్వేచ్ఛాయుతమైన కూలీ (శ్రామికులు) ఉనికిలోకి వచ్చారు. వ్యవసాయ మిగులును దోచుకునే వెట్టి, దండగలు తదితర రూపాల్లో దోపిడి లేదు. ప్రధానమైన కౌలు పద్ధ‌తి తగ్గిపోతున్నది. భూస్వాముల వడ్డీ వ్యాపారం ప్రస్తుతం లేదు.

2. వ్యవసాయంలోకి ఆధునిక ఉత్పత్తి సాధనాలు ఎన్నో వచ్చాయి. వ్యవసాయం ఆధునిక పద్ధతుల్లో సాగుతున్నది. మార్కెట్‌ కోసమే ఉత్పత్తి జరుగుతున్నది. మార్కెట్‌ సంబంధాలు చాలా బలపడ్డాయి.

3. సమాజంలో సరుకులు విస్తరించాయి. జీవితంలో సరుకులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

4. పట్టణాలు చాలా అభివృద్ధి అయినాయి. వారంగం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించింది.

5. భారత పెట్టుబడి చాలా విస్తరించింది. సామ్రాజ్యవాదుల పెట్టుబడితో కలిసి దళారీగా ఉండే దశ నుండి స్వతంత్రంగా ఎదిగింది.

పెట్టుబడి ఉన్నచోట పెట్టుబడితో పాటే పెట్టుబడిదారీ సంబంధాలు ఉనికిలో ఉండక తప్పవు. కాబట్టి వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు లేవని చెప్పడం సరికాదు.

గ్రామీణ వ్యవసాయ రంగాల్లో కొన్ని మార్పులు కనపడుతున్నాయి. కానీ ఆ మార్పులు ఉత్ప‌త్తి శక్తుల్లో అందులో భాగమైన ఉత్పత్తి సంబంధాలలో ఎంత వరకు జరిగాయి, అలాగే ఈ మార్పులు ఉపరితలాంశంలో ఏ మేరకు జరిగాయనే విషయాన్ని

సూక్ష్మంగా పరిశీలించినప్పుడు ఈ మార్పులు గుణాత్మకమైనవి కావని, పరిమాణాత్మక మార్చులేనని మనం నిర్ద్వంద్వంగా నిరూపించవచ్చు.

1.భారీ భూ కమతాలు గల భూస్వాములు తగ్గిపోయి, భూ కమతాల విస్తీర్ణం తగ్గిందనేది వాస్తవమే గానీ, ఇప్పటికీ భూస్వామ్య ఆధిపత్యం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు ఉపరితలంలో ఎలా కొనసాగుతున్నదో చూస్తే అది రూపంలో మార్చే తప్ప సారంలో కాదనే విషయం అర్థం అవుతుంది.

2.జీతగాళ్లు, కట్టు బానిసలు   నేడు నామమాత్రంగానే ఉన్నారనే విషయం వాస్తవమే అయినప్పటికీ స్వేచ్చాతమైన శ్రమశక్తిగా మారిందనేది సూక్ష్మ పరిశీలనలో వాస్తవం కాదు. గ్రామీణ వ్యవసాయ శ్రామికులు పట్టణ పారిశ్రామిక కార్మికులుగా మారినప్పుడే పెట్టుబడిదారీ మార్పుగా పరిణామం చెందుతుంది. వ్యవసాయంలోనే శ్రామికులు దిగబడిపోయి, వ్యవసాయంలో ఒత్తిడి పెరిగినప్పుడు స్వేచ్ఛా కార్మిక శక్తి అభివృద్ధి చెందటం కష్టం. పట్టణాలలో పారిశ్రామిక అభివృద్ధిలేక నిరుద్యోగులుగా, అడ్డా కూలీలుగా మారినప్పటికీ స్వేచ్ఛా శ్రామికులుగా చెప్పలేం. కౌలు, పాలు, పొత్తు వంటి మిగులు దోపిడి

రూపాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో వ్యవసాయంలో ఉనికిలో ఉన్నాయి. పాత దోపిడి పద్ధతులు ఉనికిలో లేని చోట కొత్త రూపాల్లో దోపిడి పద్ధతులు ఉనికిలోకి వచ్చాయి. వ్యవసాయంతో సంబంధంలేని  భూస్వాములు, మరో పక్క నూతన భూస్వాములు కొత్తగా రంగం మీదికి వచ్చారు.

3. పాత భూస్వామ్య వడ్డీ రూపాల స్థానంలో నూతన వడ్డీ వ్యాపారులు అభివృద్ధి అయినారు. దేశంలో నూతన ఆర్థిక విధానం వలన పేద, మధ్యతరగతి రైతులకు బ్యాంకు రుణాలు లభించకపోవడంతో అనివార్యంగా వీరంతా వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకొంటున్నారు.

4. సమాజంలో సరుకీకరణ జరిగినట్లుగా స్థూల దృష్టికి కనిపిస్తుంది. కానీ దీనికి రెండు ప్రతిధోరణులు ఉన్నాయనే విషయాన్ని చూడాలి. ఒకటి, సమాజంలో సరుకేతర, మార్కెటేతర సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. రెండవది, సరుకుల ఉత్పత్తి వలన దేశంలో హోం మార్కెట్‌ పెరిగి, ఇక్కడ స్వతంత్ర ఉత్పత్తి విధానానికి దారితీయలేదు. మన దేశపు మార్కెట్‌లో బహుళజాతి

సంస్థల ఉత్పత్తులే ఆధిపత్యం వహిస్తున్నాయి. కనుక అవి స్థానిక ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి గాని, ఉత్పత్తి సంబంధాల అభివృద్దికి గాని దోహద పడలేదు.

5. పట్టణీకరణ విషయం చూస్తే, పట్టణీకరణ పెరుగుతున్న మాట వాస్తవమే. అలాగే గ్రామాల నుండి పట్టణాలకు వలస కూడా పెరుగుతున్నదనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేశంలో పట్టణాలు పెట్టుబడిదారీ యుగపు పారిశ్రామిక పట్టణాలుగా విరాజిల్లుతున్నాయా లేదా అర్థభూస్వామ్య సంబంధాలు పట్టణాల్లో కూడా తగు మోతాదులోనే ఉన్నాయా అనే విషయాన్ని

పరిశీలిస్తే రెండవ అంశమే నేటి మన పట్టణీకరణలో స్పష్టంగా కనపడుతున్నది.

6. సేవారంగంలో అభివృద్ధిని మనం నిశితంగా గమనిస్తే ఇందులో మూడు అంశాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఒక ఆర్థిక రంగానికి హెచ్చు విలువ కట్టి దాని విలువను పెంచడం, మరొక రంగానికి తక్కువ ధరలు కట్టి దాని విలువను తగ్గించడం, తద్వారా వ్యవసాయ రంగపు విలువను తగ్గించి, సేవా రంగం విలువను పెంచడంలో పాలకవర్గాల

మాయాజాలం ఉంది. రెండవది, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి గమనం లేకపోతే అది సుస్థిరమైన అభివృద్ధి కాదు. మూడవది, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి, సేవా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చే విధానమే అయితే మనుషులు తిండి, సరుకుల కన్నా సేవలకే ప్రాధాన్యత నిస్తున్నారనే అవాస్తవిక విషయాన్ని నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ‘సేవా రంగం అభివృద్ధి అనే విషయంలో ఉన్న మాయాజాలాన్ని అర్ధం చేసుకోవాలి. ఇది ఎంత మాత్రమూ సమగ్ర అభివృద్ధిలో భాగం కానేరదు.

7. వ్యవసాయంలో పెట్టుబడి ప్రవేశంలో రెండు అంశాలను పరిశీలించాలి. వ్యవసాయంలో మిగులు మళ్లీ వ్యవసాయంలో పెట్టకుండా విలాస, వినోద రంగాలకు తరలిస్తున్నారు. మరో వైపు సామ్రాజ్యవాదుల పెట్టుబడి (ఫైనాన్స్‌) హోం మార్కెట్‌ను అభివృద్ధి చేయకుండా లాభాలు తరలించుకుపోతుంది. ప్రభుత్వం వ్యవసాయంలో స్ఫూల పెట్టుబడులు తగ్గిస్తూ పోతున్నది. ఇలా

పెట్టుబడి వ్యవసాయరంగాన్ని పీల్చివేస్తూ, ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి ఆటంకంగా మారింది.

కాబట్టి, పై విషయాలను గమనిస్తే, మన దేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి కాలేదనీ, మన సమాజం ఇప్పటికీ అర్ధ్థభూస్వామ్య, అర్ధవలస సమాజమేనని, అయితే ఇందులో వక్రీకరించిన పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి చెందాయని చెప్పగలం.

మన దేశంలో ఉత్పత్తి విధానం ఏ స్వభావం కలిగి ఉందో తేల్చుకోవడం అంటే ఆ సమాజం స్వభావాన్ని నిర్ణయించుకొని, విప్లవం వ్యూహాత్మక కర్తవ్యాన్ని నిర్ణయించుకోవడం ఎంత అవసరమో, ఆ సమాజంలో నిరంతరం జరుగుతున్న మార్పులను సూక్ష్మంగా పరిశీలిస్తూ ఎత్తగడలు నిర్ణయించుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశంగా విప్లవం డిమాండ్‌ చేస్తుంది. కాబట్టి మనం మన సమాజంలో జరుగుతున్న మార్పులను పరిశీలించడానికి వర్గ పరిశీలన, వర్గ పోరాటంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

1991 (నయా ఉదారవాద విధానం) తర్వాత వ్యవసాయరంగంలో మార్పులు మన దేశంలో సరళీకరణ విధానాల అనంతరం ఉత్పత్తి శక్తుల్లో వచ్చిన మార్పులను క్లుప్తంగా పరిశీలిద్దాం. సరళీకరణ, ప్రపంచీకరణల ద్వారా ప్రవేశపెట్టిన విధానాలు ప్రత్యేకించి 1991 తర్వాత గ్రామీణ పెరుగుదల, అభివృద్ధిపై విస్తారమైన ప్రభావాన్ని చూపాయి. వీటిలోని కొన్ని విధానాలు ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న కొన్ని ధోరణులను మరింత తీవ్రం చేశాయి. మరి కొన్ని కొత్త అంశాలను జత చేశాయి. స్థూలంగా చెప్పాలంటే నూతన విధాన చట్రం నామమాత్రంగా అమలు జరుగుతున్న భూ సంస్కరణలను తిప్పికొట్టింది. వ్యవసాయ పెట్టుబడులు, ఉత్పత్తుల ధరల విషయంలో నియంత్రణ విధానాలను మార్చివేసింది. గ్రామీణ భౌతిక సామాజిక మౌలిక సదుపాయాలలో ప్రభుత్వ పెట్టుబడులకు కోత విధించింది. సామాజిక అభివృద్ధి బ్యాంకింగ్‌ స్వరూపాన్ని తీవ్రంగా బలహీనపర్చింది. వ్యవసాయ సరుకుల వ్యాపారంలో అడ్డంకులను తగ్గించింది. నిల్వ, మార్కెటింగ్‌ సనదుపాయాలలో ప్రభుత్వ సదుపాయాలను బలహీనపర్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు కోత విధించింది. వ్యవసాయ పరిశోధన, విస్తరణలు, జాతీయ వృక్ష ఇతర జీవ సంపదను పరిరక్షించే జాతీయ వ్యవస్థలను దెబ్బతీసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలలో మాదిరిగానే వ్యవసాయరంగంలో కూడ ప్రైవేటీకరణ అనేది ఒక విధానంగా తయారయింది.

మొత్తంగా చూసుకున్నప్పుడు, 1998 నుండి 2003-04 కాలంలో ఉత్పత్తి, సాగు విస్తీర్ణం విషయంలో అత్యంత తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రభుత్వ వ్యయంలో కోత, వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉపసంహరించుకోవడం, గ్రామీణ రుణ సదుపాయంలో సంక్షోభం, డబ్య్యుటిఓ మూలంగా కొత్తగా ఉనికిలోకి వచ్చిన వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ ధరలు పడిపోవడం, కరువు కాటకాలు ఇవన్నీ కలిసి సరళీకరణ విధానాల అనంతర కాలాన్ని గ్రామీణ భారతంలో అత్యంత అధ్వాన్నమైన కాలంగా మార్చాయి.

(ఈ పుస్త‌కంలోని ఒక చిన్న భాగం..)

Leave a Reply