నే నడిచానా
అంతంత దూరం ఏనాడైనా
మోశానా అంతంత భారం ఎన్నడైనా
పూసినకాసెగడ్డిలో పేట్లఇరుకు దారులవెంట
నల్లమలలో ఆ రాత్రి నానడక
నిన్ను కలవడానికో
నన్ను నేను వెతకడానికో

వెన్నెల నీడల మాటున
చుక్కలపూల దుప్పటి కప్పుకొని
ఆ రాత్రి కొండలన్నీ గడిచానా
నిన్ను నన్ను కలిపే
వేగును అతివేగంగా అనుసరించానా
యేగిరంగా నీ ముంజేతిని ముద్దాడాలన్న
పిచ్చి తాపత్రయం యేనాటికీ

కోసు అంచు కొసలమీద దీర్ఘకాలపు నడక
డస్సిపోయో
నీ ఆలోచనల్లో మునిగిపోయో…
తూలి ఆవలలోయలో పడబోయాను
నాగురించి చెప్పేపంపావు వాళ్లకు….
రెప్పలకింద దాచుకుతెమ్మని
నీవు అప్రమత్తుడవు.

కలిశానా! ఎట్టకేలకు
తెల్లని కోరమీసం కొసనచల్లనినీ నవ్వు
వెన్నెలపూసి పొగడదండలైనచెట్లమొదల
చిక్కని పచ్చనాకుల దాపున
మనమిద్దరమో ముగ్గురమో పలువురమో
గలగలమని వనమంతా విరిసినమాటలు
కొసరు కబుర్లు కొన్ని….
కనుల మధ్యవాలిన మౌనాలు మరిన్ని
జమేదారి కోయిలో… జమేదారికోయిలో…
పాటలు పవనమై ఆడివంతా వీచి
భయం లోనో… మోహంలోనో సంభ్రమమైన నేను
నీ తుపాకీ తడిమి అబ్బురపడిన పసిపిల్లడు గోపీ
అభయారణ్య గర్జనల నడుమ
కణుతుల అరుపులమధ్య
బూడిదవర్ణపు నక్కల నిఘాను దాటి
కాలరేఖకిరువైపులా నిలబడి
రక్షణనిస్తున్న ఎర్రసైనికుడవు

కరుకైన నీ ప్రశ్నలకు వొకమారు కలవరపడి
కడుపులో దుఃఖాన్ని ఎత్తి పోసుకుంటే
అమ్మలా ఓదార్చిన నీవూ, మా శంకరన్నా
విమర్శ ఆత్మవిమర్శలో పుటంపెట్టిన ఆ క్షణమే
ననుకాచుకుంటున్న ఆయుధం యీనాటికీ
నువ్వు మా నాయకుడవు

జలపాతంలా దూకుతున్నవాన
ఒకపక్కతడుస్తూ ఒకేవరుకు కింద అందరమూ…
వానవెలిశాక తాగిన వెచ్చటి నీళ్ల చాయ్
రుచినాలుకది కాదు మనసుది
కష్టాల్లో పంచుకోవడం నేర్పిన నీజీవితానిది
నీ ప్రేమకు లొంగనిదేమైనా వుందా?
శిరీషక్కనడగాలి….పల్నాడు నడగాలి ..
* * *
ఆనాడు ఎదురు చూపులతో తెల్లారలేదు
ఎంత నడిచినా….
యీ రాత్రీ తెల్లారడం లేదు
ఎంత గడిపినా….
నీతో ఎప్పుడూ ఇంతే…..
కలవాలంటే,
నువ్వు తెలవాలంటే
దినరాత్రులూ
జీవితమంత నిరీక్షణ….
పరవాలేదు… నీకోసం, నీ ఆశయం కోసం
నీ దరహాసంకోసం….
ఎంతైనా……ఎదురుచూస్తాం
శంకరన్నగనో ,రమాకాంత్ గనో
హరిభూషన్ గనో, సాకేత్ దాదా గనో
ఏదో ఒకపేరుతో, అదేవెన్నెల నవ్వుతో
మళ్లీవస్తావన్న నమ్మకం.


(14.10.21 రాత్రి)

Leave a Reply