నాలుగు రోడ్ల కూడలిలో
నిమ్మ కాయ ముగ్గు తొక్కండి
భూత వైద్య పట్టాదార్లు
బెనారస్ నుండి వస్తున్నారు

ఆత్మ పరమాత్మ ల
సంఘర్షణ ల నిగ్గు తేల్చే
నిఖార్సైన చదువులు
రాజు ఇలాకాలో చెబుతున్నారు

ఎలా చస్తే
ఎలా చంపితే
ఆత్మ పునర్జన్మ పొందుతుందో
చెప్పే ప్రయోగశాలలు తయారవుతున్నాయి
తొందర పడి
నోట్లో రాగి చెంబులు పెట్టి
డంబెల్స్ తో చంపబాకండి

త్రిశూలం వాడితే శివుడొస్తడో
చక్రం తో ఛేదిస్తే విష్ణువు వస్తాడో
చెప్పే జ్ఞానం
బాబాలకి లేదని
విశ్వవిద్యాలయాల్లో పురుడు పోస్తున్నారు

నగ్న దేహాన్ని
పటాల ముందు ప్రదర్శిస్తే
పటాలు శాంతిస్తాయో లేదోననే
పరిశోధనలు కొనసాగుతాయి త్వరలో

అంతా ద్వైతమే
శాస్త్రం సమాధి
మీరు కోరుకుంటున్న సమాజమే వస్తుంది
ఆత్మలన్నీ మరుజన్మ ఎత్తి
చావులేని పురాణ వైద్యాన్ని వెలుగులోకి తెస్తుంది రాజ్యం!!

బువ్వ పెట్టే వాడ్ని చంపైనా
మీ మూఢ నమ్మకాన్ని బతికిస్తారులే!! ఆదుర్దా పడకండి!

Leave a Reply