పాఠకుడి నోట్సు

ప్రవేశిక:
నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై “రొయ్యలు”),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ ‘జీవితమే ఒక నాటక రంగం’) కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది.

అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా… దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ.

ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా?

మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ వచ్చు.  జీవితం వున్నదున్నట్టుగా రక్తమాంసాలతో మనకళ్ళ ముందుకు రావచ్చు. హాస్యం- వేదన, వెటకారం-మమకారం, ఆనందం-ఆగ్రహం కలగలిసిపోయి ఒకానొకసారి ‘మర్యాదస్తులమైన మనకు’ ఒళ్ళు గగుర్పొడిచే అనుభవం కలుగవచ్చు.

చర్చీలో ప్రార్ధనలను,హిందూ దేవుడై పూజలందుకున్న ‘మొండిగుద్దల సామి’ని ఏకకాలంలో అవహేళన చేయగల గుండెధైర్యమూ కనపడవచ్చు. నవ్వు తెప్పించే వాక్యంవెనుక, నగ్నమైన భాషవెనుక ఒక బీభత్సమైన విషాదం వుండవచ్చు. అన్నిరకాల ముందస్తు అభిప్రాయాలనూ పక్కపెట్టి మానవులుగా మనకు తెలియని జీవితాన్ని చూడటానికి పసిమనసులంత స్వచ్చత కావాలి.

స్థానికంగా ‘మొగిలేరు’ గా పిలువబడే  సువర్ణముఖి ఒడ్డున  నీటిలో, గాలిలో, ఇసుకలో… ‘చిగురుపాడు’గా పిలుచుకునే మునికాంతపల్లిలో ఒకతరం అనుభవించిన అన్నిఛాయల, అన్ని వర్ణాల ఆనంద దుఃఖ బీభత్స జీవితాన్ని యీ కథల్లో చూడొచ్చు.  మొత్తం 23 కథల్లోతొమ్మిది కథలు ప్రధానంగా స్త్రీల జీవితాలు. 127 పేజీల పుస్తకంలో కథలు వంద పేజీలకన్నా తక్కువే. కాశీభట్ల వేణుగోపాల్, ఆర్.ఎం. ఉమా, గుర్రం సీతారాములు, ప్రసాదమూర్తి, సం.వె.రమేష్, గోపిని, భారతి కోడె,  నరేశ్కుమార్ సూఫీల ముందుమాటలున్నాయి.

ఇంతకూ ఏం చెప్పాడు యీ అబ్బాయి?

ఏం చూపాడు యీ కథల్లో ?

ఘనమైన మన సంస్కృతి  డార్క్ సైడ్ ను, ఘనత వహించిన మన ప్రజాస్వామ్యం గురువింద గింజ ముడ్డిక్రింది నలుపును.
                            
***నేను 1980 లో ఇంటర్లో చేరాను. అది పదహారేళ్ళ  నా యవ్వనం ప్రారంభదశ. 2000 లో స్థానిక కాలేజీల మనుగడ కష్టమని ఎరుక కలిగి కర్నూలు వంటి సెమి అర్బన్ పట్టణంవదలి కార్పొరేట్ కాలేజీల్లో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సహా దేశద్రిమ్మరినయ్యాను. 1980నుంచి 2000వరకు యీ ఇరవై ఏళ్ల కాలం లో జరిగిన సామాజిక ఆర్థిక రాజకీయ చలనం వ్యక్తిజీవితం పైన అనేక ప్రభావాలను చూపింది.

యీ కథల్లోని కాలం సరిగ్గా యీ  కాలమే. అందుకనే నాకు ఆసక్తి కలిగింది.

2000 లకు ముందు- “సాహిత్య ఆసక్తి ఉన్న యువతీ యువకుల సంఖ్య తగ్గిపోతున్నది” అని దిగులుపడేవాళ్ళు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. 20 ఏళ్లపాటు నేను దినపత్రికల ఆదివారం అనుబంధాలతో తప్ప సాహిత్యంతో స్పర్శ లోనే లేను. అటువంటి నాకు 2000 సంవత్సరం లో  ఒక్కసారిగా సాహిత్య యవనిక పై కవిత్వమూ, కథ యువ రక్తం తోపోటెత్తుతూ కనపడ్డాయి. ఒకరిద్దరు కాదు, లెక్కలేనంత మంది యువతీయువకులు. భయం లేదు తెలుగు సాహిత్యానికీ భాషకూ ఏమీ కాదు అన్న నమ్మకం కలిగింది. అప్పటివి అనవసర భయాలేమోనని అనుమానమూ వేసింది. అట్లా భరోసా కల్పిస్తున్న కథకుల్లో సోలోమన్ విజయ్ కుమార్ ఒకడు. అదొక విలక్షణమైన స్వరం. క్లుప్తత,గాఢత పాటిస్తూ రాసిన వొక బలమైన మాండలీక వాక్యం.

***

“ప్రతి జాతికీ, ప్రతీ కులానికీ,భాషకూ,ప్రాంతానికీ, వృత్తికీ,ప్రతీ కుటుంబానికీ, ప్రతీవ్యక్తికీ తనదైన ఒక కథన శైలి అంతర్గతంగా అమిరివుంటుంది.” ఇది సంస్కృతి రూపంలో బాల్యం నుంచి అతడు/ఆమెలో నిరంతరం నిర్మితమవుతూ ఉంటుంది. నాగప్పగారి సుందర్రాజు కథలు, అంతరానివ సంతం నవల, నామిని కథలు చదివినప్పుడు నాకు ఏర్పడిన అభిప్రాయం యిది. కథనశైలి మన డి. ఎన్. ఎ. లాంటిది. వ్యక్తి వ్యక్తికి అది మారుతూ వుంటుంది. కొన్ని సాధారణీకరణల తోపాటు కొన్ని అసాధారణ ప్రత్యేకతలూ ఉంటాయి.

ఆ ప్రత్యేకతలు విజయ్ కథల్లో ఎన్నో వున్నాయి.

తన పుట్టుక గురించి “అవ్వ జెప్పిన వాన కత”నాకు శారద ‘అదృష్టహీనులు’ గుర్తుతెచ్చింది.  రెండు దినాలు గా తెరిపిలేని వానలో సిగురుపా డు సెరువుకట్ట తెగి మాలాడ లోకి నీళ్లు బారినాయి. పుట్యాలకడుపుతో ఉన్న తల్లి, చలికి సలివిరి గమ్మింది. మంచం దిగలేదు. కళ్ళముందు భర్త గుండెనొప్పితో నీళ్ల లోనే పడి చనిపోయాడు. బూడ్సే దానికి సందుగూడాలేక మూడు దినాలు ఇంట్లోనే పడుంది శవం. గుండెలవిసేట్టుగా శవం మీద పడి ఏడ్చి ఏడ్చి ఆమెకు జెరంగాసింది. అమె గూడ దక్కదనే అనుకున్నారు. చుట్టుపక్కల నలగరు ఆడోళ్ల  సలవతో బతికింది.

ప్రకృతి వైపరీత్యంగా చెప్పి ‘కాసేపునెపం’ ఎవరిమీదో తోసి మనం  తప్పించుకోవచ్చు. కానీ ఇటువంటి ఏ దుర్బిష్ట సందర్భంలో నైనా నగ్నముని మనల్ని నిలేస్తాడు. వీపున చరిచి కొయ్యగుఱ్ఱపు ఏలికల  వైఫల్యాన్ని గుర్తుచేస్తాడు.

కథల్లోని పాత్రల భాష ఎడిటింగ్ లేకుండా నగ్నంగా వుంటుంది. 1990 ల ముందు నీటి కట-కట అనుభవించిన కాలంనుంచి ఇంటింటికీ కొళాయి ఏపిచ్చుకునే సౌలభ్యం ఉన్న కాలానికి మధ్యలో వీధి కుళాయిల కాలమొకటి ఉండేది. అది పట్టణాల వారికి తెలియదు. నీటికి ఎంత యుద్ధమో, నీటిలేమి మనుషుల్ని ఎంత అమానవీయంగా మారుస్తుందో రాయలసీమ ‘నీటికథలు’ చదివితే తెలుస్తుంది.

చాలా హాస్యం తో ప్రారంభమై ముగిసిన ‘ఈది కుళాయి ఈరోయిన్లు’ కథ వెనుక అంతులేని  నీటి దరిద్రముంది. నీరులేని చోట నాగరికత కూడా ఉండదన్నారు ‘పెద్దలు’.

కొళాయి దగ్గర వంతులకోసం పెట్టిన బిందెలు ముందుకు జరుగుతాయి.ఇక  గొడవ మొదలైంది పాపులుకు, లచ్చువత్తకు….

“అది నాఁబిందె పొద్దన్నే బెట్టినా వొంతులో.!

యాద్యే నువ్వు బెట్టింది నా బొక్క సందులోనా??

నెనుబెట్టకపోతే నువ్వు బెట్నా వంటే నా తోలుసందులోనా..??

యీ వాటాన ఆగబాగం అంకాలమ్మ కొలువూ రేగతాది….

కొళాయితగువు ఈదిలోకీ వస్తాది.

ఉన్నట్టుండి  ఇదిగొనే లంజా అంటా కోక పైకెత్తేసిందా పాపులు

మా లచ్చువత్తమాత్తరం తక్కవ తిన్యాదా?

ఇదీ బాగోతం….

“అమ్మో! యింత బూతా” అనే వారికి విన్నపం.

ఆధునిక తెలుగు సాహిత్యం/కథ శిష్ఠ వర్గాలు,అగ్రకులాల నించి మొదలయ్యింది. అందుకే అది మనకు ప్రామాణికమూ అయి కూర్చుంది. ఆధిపత్య ప్రాంతాల భాష ( రెండున్నర జిల్లాల భాష) పుస్తక, సినిమా వచనమైంది. నా మాటలు సాధారణీకరింపబడినవి. వాదనకోసం శ్రీపాదనో, చాసోనో మాండలీకాన్ని వాడారని చెప్పొద్దు. పాత్రోచితంగా అక్కడక్కడా వాడి వుండొచ్చు. అందరూ అంగీకరించిన సత్యమే మంటే తెలంగాణా, రాయలసీమ,ఉత్తరాంధ్ర మాండలీకాలు సాహిత్యంలో స్థానం పొందడానికి 70 ఏళ్ల కాలం పట్టింది.

ఏ వ్యక్తీకరణ/ పదాలు/ భాష కు సాహిత్యంలో చోటులేదు?  

“బూతులు”

అన్ని బూతులూనా?…..

సంస్కృత/తెలుగు కావ్యాల / పురాణాల బూతులుకూడానా?

హేతువాద,నాస్తిక, విప్లవ నేపధ్యం నుంచి వచ్చిన త్రిపురనేని రామస్వామి, కత్తి పద్మారావు, త్రిపురనేని మధుసూదనరావు, జ్వాలముఖి వంటి వారు తప్ప తొలి, మలి తరపు ఆధునికులెవ్వరూ వీటిని కటువుగా ప్రశ్నించలేదు.

అంటే ఆ ప్రమాణాన్ని మౌనంగా అంగీకరించారనే కదా! అందుకనే మొదటిసారి తీవ్ర చర్చకు దారి తీసిన దిగంబర కవిత్వం లో అప్పటి మార్క్సిస్టు లకు బూతులు కనిపించి సాహిత్యంగానే చూడ నిరాకరించారు.

ఇటువంటి నిరసనను ఆహ్వానించే కొత్తతరం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఆ కవిత్వం నిలబడింది.

కొన్నాళ్ల తరువాత స్త్రీ వాదం అందించిన కొత్త దృష్టితో మన చూపు మారింది.

“బూతులన్నీ స్త్రీలను అవమానపరిచేవే కాబట్టి ఆధునిక/ప్రజానుకూల సాహిత్యకారులందరూ వాటిని వాడకపోవడమే మేలు”అని ఒక స్థూల అవగాహనకు వచ్చాము.

మరి యిది నిర్దిష్టతల కాలం గదా! తొలినాళ్ళ స్త్రీవాదులు ఎక్కువగా అగ్రవర్ణ/పట్టణమధ్య తరగతి/చదువుకున్న స్త్రీల సముదాయం.

మళ్లీ మనం మనకు తెలియకుండానే పాత ప్రమాణికాల కిందికే వెళ్లిపోయామా? యేమో చర్చించాలి.

స్త్రీలను అవమానించడానికే ఉద్దేశించిన సాహిత్యంలో భాష కూడా స్త్రీలను అవమానిం చడానికే వాడబడుతుంది.

రచయిత ఉద్దేశ్యం, ఆ రచనలో దృక్ఫధంనుబట్టి మాత్రమే మంచి,చెడుల అంచనాలు ఉండాలి.

భాష గురించి నా అభిప్రాయం: 

భాషలో బూతులుగా వాడిన పదాలు నిజానికి మన పల్లెల్లో యీ నాటికీ బహిరంగ వాడుకలో ఉన్నవే. మనం విన్నవే. పుస్తకంలోకి రాగానే అవి ఎందుకు నిరాకరింపబడతాయి.  “బూతు ఉదేశ్యంలో వుంటుంది గానీ మాటల్లో,పదాల్లో కాదు” అని చెప్పిన  వి. వి. వాక్యం గీటురాయిగా చూస్తే భాష కారణాన్ని చూపి  సాహిత్యాన్ని నిరాకరించకూ డ‌దు. పక్కకు తోసేయకూడ‌దు.. ముందు అన్ని భాషా రూపాలు స్వేచ్ఛ‌గా సాహిత్యంలోకి రావాలి.  దానికి ‘విలువ’ క‌ట్టే సాహ‌సమూ చేయ కూడ‌దు.

ఏది పరిహరించుకోవాల్నో  ప్రజాస్వామికంగా వారితో చర్చించాలి. ప‌రిహ‌రించుకోవాలో వ‌ద్దో, ఏది ప‌రిహ‌రించుకోవాలో ప్ర‌తిపాదించే హ‌క్కు, అధికారం కూడా ఇత‌రుల‌కు ఉండ‌కూడ‌దు. అది వారే స్వేచ్ఛ‌గా ఎంచుకొని, నిర్ణ‌యించుకోవాలి.  భాష, సాహిత్యం ప్రజాస్వామ్యకరణ పొందే పద్ధతి ఇదే. యీ చర్చమొత్తం దళితబహుజన స్త్రీల నేతృత్వం లోనే జరగాలి.
కాబట్టి యీ పుస్తకం చదివే వారు అన్ని ముందస్తు అభిప్రాయాలను పక్కకు పెట్టి కథలలో ప్రస్తావించిన సామాజికాంశాలను,మాండలికపు నుడికారాన్నీ మాత్రమే ముందు చూడమని విజ్ఞప్తి.

కథన శిల్పం:

అన్ని సృజన ప్రక్రియలకు ఒక దృశ్య సౌలభ్యం వుంటుంది. రచన చదువుతూ పాఠకుడు మనసులో అదృశ్యాన్ని నిర్మించుకుం టూ కథతో, కవితతో పాటూ కొనసాగుతాడు. కొన్ని/కొందరి కథల్లో ఈ దృశ్య నిర్మాణం గాఢంగా మనసుకు హత్తుకునేట్టుగా వుంటుంది. అమరావతి కథలు,కుటుంబరావు, చాసో, రాజ య్య, వంశీ,ఖదీర్ బాబు… ఉదాహరణకు కొన్ని.

మరికొన్నింటికి దృశ్య సౌలభ్యం తో పాటు పఠనసౌలభ్యం కూడా వుంటుంది. కథ చదువుతూ దృశ్యానిర్మాణం తోపాటూ పాఠకుడు వచనం లోని సొగసుకు ముగ్ధులైపోయి ఆనందించగలరు కూడా.  ఉదాహరణకు ముళ్ళపూడి ‘బుడుగు’. రావిశాస్త్రి కతలు, పతంజలి నవలలు, అప్పల్నాయుడు, నామిని, గోపిని కతలు…  వీటితోపాటు విజయకుమార్ కతలు కూడా.

సంకలనంలో ఎక్కువ కథలు హాస్యంతోనో, వెటకారం తోనో చాలా తేలికగా  ప్రారంభమై , ముగింపుకొచ్చే సరికి మనసుపై మోయలేనంత బరువుపడుతుంది.

కథా వస్తువు:

కథల్లో తడిమిన జీవితాలు అన్నీ  యానాదులు, నక్కలోళ్ళు,పియ్యేత్తే మాదిగ సుబ్బులు,LGBT వంటి మార్జినల్ సెక్షన్స్.  కథాకాలం సుమారుగా 1980 నుండి 2000 సంవత్సరం.విదేశీ పెట్టుబడులు నేరుగా దేశంలో ప్రవేశించడానికి వీలుగా ప్రభుత్వం తన ఆర్థిక,పారిశ్రామిక, విద్యా విధానాల్లో ‘నూతనత్వం’ ప్రవేశపెట్టింది.(నూతన ప్రజాస్వామిక విప్లవానికి పోటీగానా.. యేమో) పెట్టుబడి తెచ్చిన సంస్కృతి ప్రభావం సమాజంతో మొదలై కుటుంబంలో ప్రవేశించి వ్యక్తి వరకు చేరడాన్ని ఈ కథల్లో చూస్తాం.

సమాజం ఒక స్థితి  నుండి మరో స్థితికి మారుతున్నప్పుడు తీవ్ర కుదుపులకు లోనౌతుంది.

విరుద్ధశక్తులమధ్య ఘర్షణ తీవ్రమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు మారుతున్న పరిణామంతో మనిషి పరాయీకరణ చెందుతాడు. తనకు తాను కాకుండాపోయి, గతంలోనివేవీ తనివి కాకుండాపోవడం బాధిస్తుంది. వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయిన వ్యక్తి ఒంటరి అవుతాడు.పరాయీకరణ లో మనిషి పలవరింతలే  సాహిత్యం అవుతుంది.

సొలోమన్ విజయకుమార్ కథల్లోనూ(కవిత్వం లోనూ) రెండుమూడు చోట్ల ‘బతుకు నెల్లూరు పాలయినప్పుడు’ అంటాడు. విస్తాపితం అయిన జీవితం. నిజానికి యీ కథలన్నీ ఆయన  నోస్టాల్జియానే. పోగొట్టుకున్న ఊరిలో,  తప్పిపోయిన తన మనుషులకోసం వెతుకులాట.తాను పుట్టి, ఇరవైయేళ్ళ దాకా పెరిగిన జ్ఞాపకాలు యీ 23 కథలు.

అయితే ఒక ప్రధానమైన ప్రశ్న! మార్జినల్ సెక్షన్ల మీదకూడా పరాయీకరణ ప్రభావముటుందా?

నక్కలోళ్ళ, పూసలోళ్లు,వంటి మార్జినల్ సెక్షన్స్ మీద   వాటి ప్రత్యేక సాంస్కృతిక సమస్యలతో పాటు బయటి ప్రభావాలూ వుంటాయి. కాస్త ముందూ వెనక పెట్టుబడి అందరినీ అంతిమంగా  కొనుగోలుదారులుగానే మార్చేస్తుంది.ఈ పనిలో అది మనుషులను ఉన్న వృత్తులనుంచి, వున్న ఊళ్లనుంచి, ప్రాంతాలనుంచి, సంస్కృతి నుంచీ విస్తాపితం చేస్తుంది. ఒక్కోసారి దాని వల్ల కొన్ని కులాలకు మంచీ, కొన్నింటికి చెడూ జరగొచ్చు.

అడవుల్లో నివసించే ఆదివాసులు బయటి ప్రపంచంతో తక్కువ పరిచయంలో వున్నారు కాబట్టి అంత తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చు. కథల్లో చెప్పిన సెక్షన్లు మాత్రం బలంగానే ప్రభావిత మయ్యాయి. 2020 తరువాత అయితే ఊహించలేనంత వేగంగా కూడా. ఇప్పుడైతే వాళ్ళుకూడా రోజుకు 1జి బి, 2 జి బి డేటాకొనే వినియోగదారులుగా కూడా మారారు.

ఇదే విధంగా 1980 లలో కూడా కంటికి కనిపించేట్టు నేరు ప్రభావం ఉండకపోవచ్చు గానీ, వాళ్లలో కొంతమంది సంప్రదాయ వృత్తి/ పని,వనరులను వదలి వూరు వూరు తిరుగుతూ ప్లాస్టిక్ బిందెలు అమ్ముకునే వాళ్ళు అయ్యారు. హైదరాబాద్ లో అయితే బంజారాలు, లంబాడాలు విపరీతంగా ఆటోఓనర్లు/డ్రైవర్లు అయ్యారు. (ప్రతీ ఏడుగురిలో ఇద్దరు వాళ్ళు అయ్యేంతగా)  ఆటో డ్రైవర్ల లో ముస్లిముల తరువాత గణనీయంగా వాళ్లే వున్నారు.బహుశా ఎస్సీ ,ఎస్టీ కార్పొరేషన్ల సబ్సిడీ తో కూడిన ఋణ సదుపాయం. గృహసదుపాయం అందుకు ఉపకరించి ఉండవచ్చు.అందరూ ఇలాంటి ప్రయోజనం పొందారని అనటం లేదు కానీ గుర్తించదగిన సంఖ్యలో వాళ్ళుకూడా  దిగువ మధ్యతరగతిగా ఉన్నతీకరింపబడుతున్నారు.

ఇలాగే పరోక్షంగా, ప్రచ్ఛన్నంగా వారి సంస్కృతి లోనూ మార్పులు వచ్చాయి.

నిజానికి రెండు రెండు దశాబ్దాల ప్రాతిపదికన (1980-2000,2000-2020 లకు) ఈ కులాలపై సోషియాలజికల్ అధ్యయనం జరిగితే బాగుండు. భారతదేశంలో పెట్టుబడి కొత్త పోకడలు మరింత  బాగా తెలుస్తాయి.

ఈ సమూహాలు భారత ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేయలేక పోవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థకు ఈ సమూహాలు కూడా కావాలి.

1980 ల తరువాత వచ్చిన విదేశీ పెట్టుబడి  దాని సంస్కృతిని కూడా  ప్రవేశపెట్టింది.ముందటి కుల, వివాహ  కట్టుబాట్లను ఎంతోకొంత తెంచింది కూడా. చదువులు, ఉద్యోగాలు పొందిన కొత్త తరం అగ్రవర్ణాలను ప్రశ్నించడం తీవ్రమైంది 80,90 దశకాల్లోనే , ఆయా కులాల యువతీ యువకుల్లో ప్రేమపెళ్లిళ్ళు గణనీయంగా జరిగాయి. సంకలనంలో మూడు ప్రేమపెళ్లిళ్ళు వున్నాయి. (ఒక విఫల, రెండు సఫల ప్రేమలు), బాప్టిజం పొందటం, మత మార్పిడి రెండుమూడు కథల్లో రెఫరెన్స్ ఉంది.

ఇంకో ప్రశ్న:

‘పరాయీకరణ’.ఇది మధ్యతరగతి కి మాత్రమే వర్తిస్తుందా? లేదు సమాజం లోని   పీడిత వర్గానికి మొత్తం వర్తిస్తుంది. కాకపోతే  కాస్త నోరూ గొంతూ ఉన్నది అగ్రవర్ణ పట్టణ మధ్య తరగతికే కాబట్టి వారి ద్వారా మొదట వ్యక్తమవుతుంది. వ్యక్తి వేదనగా  కవిత్వంగానో, కథగానో,నవలగానో  ఏదో ఒక కళగా బహిర్గతమౌతుంది. చదివిన, చూచిన సమాజం వేదనతో ఐడెంటిఫై అవుతుంది. ఈక్రమంలో దిగువమధ్యతరగతిగా మారిన దళితుల సాహిత్యం లోనూ అనివార్యంగా అది ప్రవేశిస్తుంది. పరాయీకరణ చెందిన వంటరి మనిషిని నోస్టాల్జియా లోకి వెళ్లకుండా ఆపలేరు. ఆ ఒంటరితనపు పలవరింతలె సాహిత్యమూ అవుతుంది.

‘బొమ్మలాటోళ్ల సెర్చీ ఆరాధన’ కతలో దూదేకుల కుసీదా వ్యభిచారం లోకి ఎందుకు దిగింది?

‘పురుషోత్తం మావ బాప్తీసం’ అనే కథలో ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.  

మన లాంటి సమాజం ఎంత ఆధునీకరణ  చెందింది అనడానికి ప్రమాణం ఆసమాజంలోని ఆత్మహత్యలే.

సమాజ గతిని మారుస్తున్న పెట్టుబడి కలిగించే విధ్వంసం ఇంతవరకు తెలుగు కథల్లో ఒక కోణం లోనే చూపబడింది. అది కుల/ చేతి వృత్తుల విధ్వంసం. కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి కులవృత్తుల నడుము విరిచి ఆ వృత్తి పనివారిని ఫ్యాక్టరీ కార్మికులుగానో, పట్టణ కూలీలుగానో మార్చింది. ఉన్న వూరినుంచి బయటికీ (బాంబే, సూరత్ లకు) నెట్టింది.కులవృత్తి కాకపోయినా కులవృత్తి లాంటిదయిన దర్జీ పనిలోనూ అదే విధ్వంసం. ఇటీవలి ‘బాంబే టైలర్’ చర్చ దీనికి మంచి ఉదాహరణ.
పెట్టుబడికి మనం గుర్తించ నిరాకరించే పాజిటివ్ కోణామూ ఒకటి వుంటుంది. అది ప్రగతిశీల ముఖం.  గత సమాజంలోని కొన్ని కులకట్టుబాటు వృత్తులను అది ధ్వంసం చేసింది. సాంకేతికత దానికి సహకరించింది. మానవ మలాన్ని గంపలకెత్తి శుభ్రపరిచే మేదరి వృత్తిని రద్దు చేసింది.

‘పియ్యేత్తే మాదిగ సుబ్బులు’  కథలో చేత్తో మలం ఎత్తే పని glorify కాలేదు ‘ … ఆపని ఎంత జుగుప్సతో ఉంటుందో …చూపారు. కుల కట్టుబడి పేరుమీద ఇంత సేవ/ చాకిరీ చేయించుకుంటూ కూడా అగ్రవర్ణాల వారు ఎంత నీచంగా చూస్తారో ఉంది. ఇది తోటీ పని వాళ్ళ కొన్నితరాల వేదన.. “మేదరి బతుకొద్దురో మేదరన్నా యీ రోతబతుకు లొద్దురో మేదరన్నా! ” అని గద్దర్ పాట రాసిన 40 ఏళ్లకు యీ అంశం కథా సాహితంలోకి వచ్చింది. గమనించగలరు..

కులకట్టుగావున్న వృత్తి విధ్వంసం సుబ్బులు జీవితంలో అద్భుతమార్పు ఏమైనా తెచ్చిందా? అని మీరు అడగవచ్చు. లేదు. అద్భుతమార్పేమీ తేలేదు. చేత్తో మలం ఎత్తే పనిరద్దు అయితే భవిష్యత్తు లో  దొడ్లు కడిగే స్కేవెంజర్ గాసుబ్బులు  మారటం కూడా  ఆమె జీవితానికి అభివృద్దే. (సాంకేతికత సాయంతో డ్రైనేజీ పారిశుధ్యం కూడా ఇలా మార్పు చెందాలి. స్వాతంత్య్రం వచ్చిన డెబ్భై మూడేళ్ళ తరువాత కూడా ఇటువంటి వ్యవస్థలు ఉనికిలో ఉండటమే మన రాజ్య అమానవీయ స్వభావానికి ఋజువు) అలాగే స్వాతంత్ర్యపు తొలి నాళ్ళ సంక్షేమరాజ్యం కల్పించిన ఉచితవిద్య, రిజర్వేషన్ల వల్ల సుబ్బులు కూతురు డాక్టర్ కావటం గుర్తించాల్సిన ఒక మార్పు. ఆ సుబ్బులు కూతురు డాక్టర్ షారోన్ శ్రీకాంత్ అయ్యంగార్ గా అయ్యంగార్ల యింటికోడలు కావటం కథ చివరలో ఒక విరోధాభాస.

ఉన్న హిందూ మతం  విలువ ఇవ్వదు,యెదగ నివ్వదు. సామాజికగౌరవాన్ని ఇవ్వకపోగా అవమానిస్తుంది. మతం మారితే. అనుకుంటాం గానీ అదేమంత సులభం కాదు. మాలా,మాదిగా అని పిలిపించుకోకుండా క్రిస్టియన్ గా హోదా పెంచుకోవచ్చు. అందుకోసమే రాకేలత్త బాప్తీసం  తీసుకుందికానీ ఇది ఒక సంస్కృతీకరణ ప్రక్రియగా మారింది. ఉన్నత కులాలను, వర్గాలను  అనుకరింపుకు దారితీసింది. పాత, కొత్త భావాలు, అలవాట్లు సంస్కృతుల మధ్య ఘర్షణ ‘పురుషోత్తం మావ బాప్తీసం’ కథలోలాగా ఆత్మహత్య కు దారితీయవచ్చు. మతం లో చేరటం పురుషోత్తం మామకు నచ్చదు. ఎప్పుడో ఒకసారి తాగే మందుపైన కూడా ప్రభువు పేరుచెప్పి, తన సంస్కృతి పై బలవంతపు నిషేధం పెట్టడం అసలు నచ్చదు.తన సంస్కృతి నుంచి వేరుపడటం కూడా బాధించిందా? కుటుంబం మొత్తం ప్రభువురక్షణ పొందాలన్న భార్య మాటలు పురుషోత్తంకు నచ్చలేదు. భార్యను ఎదిరించలేని నిస్సహాయత, ఘర్షణ, వేదనతో ఆత్మహత్య చేసుకుంటాడు.
ఇలా తనను తాను సంస్కరించుకోడానికి, ప్రజాస్వామ్య కరణ చెందడానికీ సిద్ధపడని సమాజం ప్రజల చావుకు మాత్రమే దారిచూపుతుంది.

మతం మారడం ఓదార్పు కావచ్చునేమో కానీ పరిష్కారం కాదు. ఫాతిమా అనే ప్రేమకథలో మాలవాడ అబ్బాయి తన ప్రాణస్నేహితుడి చెల్లెలు ఫాతిమానుప్రేమిస్తాడు.గుంటూరు వెళ్లిపోయి పెళ్లికూడా చేసుకుంటాడు. తల్లిదండ్రులు అమ్మాయికి మైనారిటీ తీరలేదని కేసుపెట్టి వెనక్కు తెస్తారు. కథ చివరలో ఒక ముస్లిం పాత్ర అంటుందీ:

మన బిడ్డ మాలోన్ని పెళ్లిచేసుకొని మనముందరే తిరగతావుంటే ఇంక మతంలో తలెత్తుకొని తిరగగలమంట్రా మనవా?ఇదిజూసి రేపొక మాదిగోడు! ఎల్లుండొక యానాదోడూ వచ్చి మనబిడ్డల్ని లేవదీసుకుపోతారు. అప్పుడు గూడ
సూస్తా గమ్మునుందావా?

అటు ముస్లింలు, ఇటు దళితులు ఇద్దరూ హిందూ మతం దస్టీకానికి బలియైన వాళ్లే అయినప్పటికీ, హీరో పుట్టుకతోనే క్రిస్టియన్ గా పుట్టినప్పటికీ యీ వివక్ష నుంచి తప్పించుకోలేక పోయాడు.. ఎందుకంటే ఇక్కడ వేళ్ళునుకొని నిలదొక్కుకున్న ప్రతిమతము ఈ దేశ/ప్రాంత/సంస్కృతిని ఎంతో కొంత వంటబట్టించుకుంది. ఇండియన్ ఇస్లాం, ఇండియన్ క్రిస్టియానిటీ  ఆ ప్రాంత హిందూ మతం లోని  అవలక్షణాలు కొన్నింటిని తమలోకి తెచ్చుకున్నాయి.

ఈ వివక్షకు వున్న ఇంకో కోణం కూడా చూపుతాడు రచయిత. ‘బొమ్మలాటోళ్ళసేర్చీ ఆరాధన’ కథలో. బొమ్మలాటోళ్లు మహారాష్ట్ర నుంచి వచ్చిన తోలుబొమ్మలు ఆడించేకులం. ఒకప్పుడు సంచారజాతి లక్షణాలు వున్నవారు. అయితే ఇప్పుడు వాళ్ళ మగవారు ట్యాంకర్లు పెట్టుకొని సెప్టిక్ ట్యాంకులు శుభ్రపరచడం చేస్తే, వాళ్ళ ఆడపిలకాయలు రికార్డింగ్ డ్యాన్సులు వేసి డబ్బులు సంపాదిస్తారు.యిప్పుడు ఇల్లూకట్టుకొని స్థిరపడ్డారు. మతంగా క్రైస్తవాన్ని అనుసరిస్తారు.ఆదివారం వాళ్లు ప్రార్థన చేసే చర్చిలోకి నిజమైన మతవిశ్వాసి అయిన దూదేకుల కుసీదా అందరితో కలిసి ప్రార్థనకు రాలేకపోయింది.

సామూహిక ప్రార్థన అయ్యేంతవరకు ఎదురుచూసి,అందరూ వెళ్ళిపోయాక పాస్టర్ అయ్యవారి యింటిబయట నిలబడి కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకొని మంచి జరగాలన్న దేవునిపైన విశ్వాసంతో తన వృత్తి అయిన ‘వ్యభిచారానికి’ వెళ్లిపోతుంది. హాస్యంగా ప్రారంభమయిన ఈ కథ ముగింపు మనసును పిండేస్తుంది.

రచయిత కేవలం క్రైస్తవ మతాన్నే విమర్శించినాడ నుకోవద్దు. ఆయన పుట్టిపెరిగింది మాలవాడ అందులో కొంతమంది మాదిగలున్నారు, హిందువులున్నారు, క్రైస్తవ విశ్వాసులూ వున్నారు. ఆవాడ అన్ని మతాలకలగలుపు.
బరిబత్తల తిరిగే పిచ్చిమారాజును దేవుణ్ణి చేసిన పల్లెటూరి కథ ‘మొండి గుద్దల సావి’. అదృష్ట వశాత్తు ఆ కథా సంధర్భం 2010 కాదు. అయివుంటే కథలో చూపిన పరిణామం మరో రకంగా ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూ ధర్మ రక్షణ పేర ఒక గుంపు ఏర్పడి ఆస్తులూ వాటి పరిరక్షణకు ఒక ట్రస్టు, అక్రమాలు, అంతిమంగా రాజకీయాలు ప్రవేశించి వుండేవి.

‘దేవగన్నిక సిత్ర’ ఒక LGBT కథ. రచయిత కథ మొదట్లో ఈ విషయం చెప్పడు. మధ్యలో ఒక పాత్ర తనను బూతుతో తిడుతున్నప్పుడు సూచాయగా మనకు తెలియజేస్తాడు. చిత్ర ఆ యింటి పెద్దకొడుకు భాస్కర్. ఆ ఇంటికి తానే ఆధారమవుతుంది. తన సంపాదనతోనే కుటుంబం మొత్తం నిలుస్తుంది. డబ్బు సంపాదనలో ఎయిడ్స్ సోకి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంటుంది.గొప్ప శిల్పంఉన్న కథ.

***   ***   ****

ఉపసంహారం:

ఇప్పుడు వునికిలో ఉన్న సాహిత్య ప్రామాణికతలను స్థూలంగా అంగీకరిస్తున్న సాహిత్యకారులకు, విమర్శకులకు:   ప్రజాస్వామికంగా ఆలోచించడం నేర్చుకోవాలంటే ముందు వినడం ప్రారంభించాలి. అప్పుడే ఆలోచించడం మొదలుపెడతాం.  అదేదో వాళ్ళను ఉద్ధరించడానికన్నట్టు కాకుండా తెలుగు సమాజం తనను తాను ప్రజాస్వామికీకరించు కోవడం కోసమే మార్జినల్ సెక్షన్స్ సాహిత్యాన్ని వినాలి, పట్టించుకోవాలి,తానే బాధ్యతగా అచ్చువేయాలి, ప్రోత్సహించాలి. ఇలాంటి జీవితాలు సాహిత్యంలో ఇంకా ఇంకా రావాలని కోరుకోవాలి.

నా వ్యాసాన్ని చివరగా రచయిత మాటలతోనే ముగిస్తాను

“నేనట్టా ఏట్లో నడిసిపోయ్యే పెతిసారీ ఇసికె లో నిదరబోతుండేటి మావోల్లందురి గుండిలమీదా పారాడతాబొయ్యే పసిపాపలాగా నన్ను నేను ఉహించుకునేది.ఏడుపుతన్నకొచ్చి దిగమింగేసుకునేది.”

” మునికాంతపల్లి మనుసుల్నిసొర్ణముకి యేటి ఇస్కతో జేసినట్టుండారు. పొడిసక ఎంత తేలిగ్గా యాళ్ల సందల్నుంచి జారిపోతాదో తడిసక అంత బొరువు.”

బుక్ రీడర్స్ క్లబ్  నవలా స్రవంతి
సీజన్ -5, ఎడిషన్ -7
30.5.21 ఆన్‌లైన్ ప్రసంగానికి వ్యాస రూపం.

Leave a Reply