కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం  పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్‌ కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్‌ స్పైవేర్‌ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ దుమారాన్ని మర్చిపోకముందే మరో వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ కానున్నదా?

2024 ఎన్నికలే లక్ష్యంగా పెగాసస్‌ స్థానంలో మరో శక్తివంతమైన కొత్త స్పైవేర్‌ను బిజెపి సర్కార్‌ కొనాలనుకుంటున్నదా? ఆ స్పైవేర్‌ సాయంతో ప్రతిపక్షనేతలు, అసమ్మతి వర్గాలు, ప్రభుత్వ విధానాల్లో తప్పులను ఎత్తిచూపే మేధావులను, జర్నలిస్టులపై గట్టి నిఘాను కొనసాగించాలనుకుంటున్నాదా? అంటే, బ్రిటీష్‌ పత్రిక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ మార్చి 30 న ప్రచురించిన కథనం ప్రకారం ఇవే అనుమానాలకు తావిస్తున్నది. కేంద్ర సర్కార్‌ మరో కొత్త స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్న సంస్థలలో కాగ్నైట్‌ సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ ఒకటి అని ఆ పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు చెందిన కాగ్నైట్‌ నుంచి రక్షణశాఖ ఇవే పరికరాలను కొనుగోలు చేయడం ‘నిఘా’ అనుమానాలు మరింతగా పెంచుతున్నది. అయితే దీనిపై కాంగ్రెస్‌ అభ్యర్థి తివారీ పెగాసస్‌ స్థానంలో కొత్త నిఘా స్పైవేర్‌ కాగ్నెట్‌ను కొనుగోలు చేశారా? లేదా? కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఆయన చేసిన అభ్యర్థనపై రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన ‘సర్వేలెన్స్‌ ఫర్‌ హైర్‌’ పరిశ్రమపై ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా వేదిక తీవ్రంగా హెచ్చరిస్తున్నది.

ముగియని పెగాసస్‌ వివాదం:

ప్రతిపక్ష పార్టీ నాయకులు, న్యాయకోవిదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఇలా దేశంలోని 300 మందికి పైగా ఫోన్లు హ్యాకింగ్‌కి గురయ్యాయని 2021లో ‘ఫర్‌ బిడెన్‌ స్టోరీస్‌’ ఓ నివేదిక ద్వారా బయటపెట్టింది. 2018-19 మధ్య ఆయా ప్రముఖుల ఫోన్లపై నిఘా కొనసాగిందని, 2019 లోక్‌సభ ఎన్నికలపై ‘పెగాసస’్‌ ప్రభావాన్ని కొట్టిపారేయలేమని ఆ నివేదిక తెలిపింది. దీంతో ఏడాదిన్నరపాటు ఈ అంశంపై దేశం అట్టుడికింది. పెగాసస్‌ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీ వేసింది. గత ఆగస్టులో నివేదిక ఇచ్చిన కమిటీ… కొందరి ఫోన్లలో మాల్‌వేర్‌ను గుర్తించామని, అయితే అది పెగాసస్‌ ఆపునా? కాదా? అనేది తేలాల్సి ఉన్నదని చెప్పింది. ఫోరెన్సిక్‌ పరిశోధనల్లో పెగాసస్‌ ఉనికి గుర్తించడం జరిగింది.  అయినా ఇప్పటికీ పెగాసస్‌ కొనుగోలుపై బిజెపి ప్రభుత్వం అంగీకరించడంగాని, లేదా ఖండిరచడంగాని చేయనందున ‘ఫర్‌ బిడెన్‌ స్టోరీస్‌’ వాదనకు బలం చేకూర్చినట్లు అయింది. 2017లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) ఇదేవిధంగా పెగాసస్‌ స్పైవేర్‌ తయారీ సంస్థ నుంచి కంప్యూటర్‌ పరికరాలు కొనుగోలు చేసిందని ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) వెల్లడిరచింది.

కేంద్ర ప్రభుత్వ నిఘా పరికరాల అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరనుంది. వివాదస్పద పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌కు ప్రత్యామ్నాయంగా పేరొందిన కాగ్నైట్‌ సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థ నుంచి భారత రక్షణ సంస్థ నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లు తాజాగా హిందు దిన పత్రిక వెలుగులోకి తెచ్చింది. స్పైవేర్‌ వ్యవహారంపై సమాధానం చెప్పాలని గతంలోనే ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వాన్ని డిమాండు చేశాయి. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారంటూ మానవ హక్కుల సంఘాలు కేంద్రంపై దుమ్మెత్తి పోయడం, యాపిల్‌, వాట్సాప్‌ వంటి టెక్నాలజీ సంస్థలు కూడ పెగాసస్‌ ప్రమాదం గురించి హెచ్చరికలు చేశాయి. పై అంశాలపై  కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిఘా పరికరాల కొనుగోలు అంశంపై నోరు మెదపకుండా దాటవేత వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయిల్‌ నుంచి పెగాసస్‌ కొనుగోలు చేశారా? లేదా అని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసినా బిజెపి ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకుండా నాన్చుతోంది.

ఈ దశలో బాగా పాపులర్‌ గానీ మరో నిఘా సంస్థ నుంచి పరికరాలు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి రావడం విశేషం. కేంద్రం రహస్యంగా ఉంచుతూ వస్తున్న ఈ వివరాలు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ద హిందూ’ జరిపిన డేటా విశ్లేషణలో బట్టబయలయ్యాయి. కాగ్నైట్‌ కూడా ఇజ్రాయిల్‌కు చెందిన సంస్థే.ఇది పెగాసస్‌కు పోటీదారుగా ఉంది. పెగాసస్‌ లాగే అనేక వివాదాలు మూటగట్టుకున్న ఈ సంస్థపై అనేక దేశాల్లో కేసులు నడుస్తున్నాయి. అమెరికాలో ఈ కంపెనీపై ఇన్వెస్టర్ల  కేసులు కూడా వున్నాయి. నూతనంగా కొనుగోలు చేసే కాగ్నైట్‌ స్పైవేర్‌ ఫోన్‌లోని డాటాను తన సర్వర్లలో స్టోర్‌ చేసుకొని, వ్యక్తికి తెలియకుండానే ఫోన్‌ నుంచి డాటాను డిలీట్‌ చేయగలగడం లేదా ప్రవేశపెట్టడం చేయగలదు. ఫోన్‌లోకి మాల్వేర్‌ ప్రవేశించినట్టు కూడా తెలియకపోవడం దీని ప్రత్యేకత. అయితే ఈ స్పైవేర్‌ పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతున్నట్టు మెటా ఓ రిపోర్ట్‌లో పేర్కొన్నది. నార్వేకు చెందిన వెల్త్‌ ఫండ్‌ దీని వాడకాన్ని నిలిపేసింది. అయితే, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ కాగ్నైట్‌ కంపెనీతో స్పైవేర్‌ ఒప్పందాలు చేసుకొన్నాయి. దీనిపై పెద్దయెత్తున విమర్శలు వస్తున్నాయి.

కాగ్నైట్‌  సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను, అసమ్మతివాదులను, నిరంకుశ ప్రభుత్వ విమర్శకులను, ప్రతిపక్షాల కుటుంబాలను, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుంటుంది. వారికి తెలియకుండానే, వారి ఫోన్లు, కంప్యూటర్ల నుంచి డేటాను డిలీట్‌ చేస్తుంది. మాల్‌వేర్‌ ప్రవేశించినట్లు కూడ తెలియదని  నిఘా చెక్‌ ఎల్‌ఎల్‌పి పేర్కొంది. ‘‘కిరాయికి నిఘా’’ పరిశ్రమపై ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ ఫారమ్స్‌ ఇచ్చిన ‘త్రెట్‌ రిపోర్ట్‌’ను ప్రస్తావించింది. రక్షణ ఇంటెలిజెన్స్‌ సంస్థ (డిఐఎ) పరిధిలోకి వచ్చే సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (ఎస్‌ఐడి)కు మూడేళ్ళుగా కాగ్నైట్‌, దాని మాతృ సంస్థ వేరియంట్‌ సిస్టమ్స్‌ ఇన్‌ కార్పొరేషన్‌లు కంప్యూటర్‌ గేర్‌ను సరఫరా చేస్తున్నాయి. 2022 చివరలో ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌, కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఓసిసిఆర్‌పి) నివేదిక ప్రకారం, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబి), భారతదేశ దేశీయ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, ఇజ్రాయెలీ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ నుంచి హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు దిగుమతి పత్రాలు చూపించాయి. ఈ ఏడాది జనవరిలోనే ఆ సంస్థ నుండి ఒక ఉత్పత్తి దిగుమతి అయింది. దిగుమతులపై హిందూ అడిగిన ప్రశ్నలకు కాగ్నైట్‌ స్పందించలేదు. 

ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌కి పోటీగా ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న ప్రత్యర్ధి సంస్థల నుండి నిఘా పరికరాలను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం టెండర్లు వేయాలనుకుంటోందని ఇటీవల ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వ్యాసం పేర్కొంది.  ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. గత అనుభవాలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే. ఈ సారి ఫోరెన్సిక్‌ పరిశోధనలకు కూడా పట్టుబడని శక్తివంతమైన స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి సర్కారు యోచిస్తున్నట్టు ఆ పత్రిక వెల్లడిరచింది. అలాగే, వివాదాలకు దూరంగా ఉండేందుకు.. బయటి ప్రపంచానికి తక్కువగా పరిచయం ఉన్న సంస్థల నుంచి ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. దీనిపై రక్షణ శాఖను సంప్రదిస్తే ఎవరూ స్పందించలేదని పత్రిక వెల్లడిరచింది. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలను దెబ్బతీయడానికి, ప్రతిపక్ష నేతల ఫోన్లపై నిఘా పెట్టడానికి కేంద్రం కొత్త స్పైవేర్‌ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు పలువురు  రాజకీయ నాయకులు, హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం పరిశీలిస్తున్న సంస్థల్లో  కాగ్నైట్‌ ఒకటి.

Leave a Reply