మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వృద్ధిని పెంచాయి కాని ఉపాధిని పెంచలేదు. సంపద పెరిగింది కాని పంపిణీ జరుగలేదు. పెట్టుబడులు పెరిగాయి కానీ అవి ఉత్పత్తి రంగంలో కాకుండా సేవా రంగాల్లోకి వెళ్లాయి. ఆర్థిక సంస్కరణల తదుపరి పలు ప్రభుత్వ రంగాల నుంచి తన వాటాను ఉపసంహరించుకుంటున్న కారణంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి సన్నగిల్లింది. ఫలితంగా రిజర్వేషన్ సదుపాయం అటకెక్కింది. సామాజిక న్యాయం పాతాళానికి తోయబడింది. మరోవైపు ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాలకు ఒడిగట్టడంతో తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రగతిని మానవాభివృద్ధిలో కాకుండా ఆర్థిక వృద్ధితో అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పన, సామాజిక అంతరాల నివారణ, పేదరికం నిర్మూలన జరుగకుండా ఆర్థిక వృద్ధిని చూపి ప్రగతిగా చెప్పుకోవడం వాపును చూసి బలుపుగా భావించినట్లుంటుంది.
వృద్ధిరేటుపై చర్చ ఆర్థిక నిపుణులకు, రాజకీయ నాయకులకు ఆసక్తికరంగా ఉండవచ్చు. కానీ చేతిలో డిగ్రీ పట్టా పుచ్చుకొని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ వృద్ధిరేట్లు, వాటిపై జరిగే చర్చలూ ఏ మాత్రం కొరుకుడు పడవు. వారికి కావలసిందల్లా ఉపాధి. దేశంలోని నిరుద్యోగ యువతకు ఏ మేరకు ఉపాధి కల్పించగలుగుతున్నామంటే సానుకూల సమాధానం చెప్పగలిగే వాతావరణం ఇప్పుడు లేదు. వృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ వంటి దేశాలు సామాజిక భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నాయి. అందుకే ఆ దేశాల్లో నిరుద్యోగ భృతి చట్టబద్ధంగా అమలవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ భావనకు మనదేశంలో బలం చేకూరడంతో కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఎంతోకొంత మొత్తం చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 2019 ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగ భృతికి హామీ ఇచ్చింది. కాని అమలు చేయడం లేదు.
ఏటా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టిస్తామన్న వివిధ ప్రభుత్వాల హామీలు ఆచరణలో ఎప్పటికప్పుడు వట్టిపోతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంగా దేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగుతోంది. ఈ ధోరణి సరికాదన్నది ఎంతోమంది సామాజికార్థిక వేత్తల స్థిరాభిప్రాయం. ఆర్థికాభివృద్ధి అద్భుతంగా ఉన్న రోజుల్లోనూ ఉపాధి కల్పన తగ్గు ముఖం పట్టినట్లు భారత ప్రభుత్వ కార్మిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు ఆరు శాతానికి తగ్గని కాలంలోనూ ఉపాధి కల్పన అంతంత మాత్రంగానే ఉన్న వాస్తవాలు కలవరపెట్టేవే. దేశంలోని ప్రతి ముగ్గురు పట్టభద్రులలో ఒకరు నిరుద్యోగేనని అంచనా! 1991లో ఉద్యోగ బలగంలో సగం ప్రభుత్వ రంగంలోనే ఉండేవారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు చాల తక్కువ.
కొంతకాలంగా నిర్మాణ ఉత్పత్తి, సేవారంగాలు మందగించడంతో పెద్దయెత్తున ఉపాధులు కోల్పోతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో 8.72 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీ ఉన్నాయి. ఈ వివరాలను పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వెల్లడించింది. మార్చి 1, 2020 నాటికి మొత్తం 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో మార్చి 1, 2020 నాటికి మొత్తం ఉద్యోగాల సంఖ్య 40,04,941గా ఉండగా 31,32,698 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని మంత్రి సమాధానంలో తెలిపారు. ప్రతి 1000 జనాభాకు కేవలం 16 మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పని చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తికాల ప్రాతిపదికపై కాకుండా ఒప్పంద, తాత్కాలిక పద్ధతుల్లో ఉద్యోగులను నియమించుకుంటూ, తక్కువ జీతభత్యాలు చెల్లిస్తున్నారు. 50 కోట్ల శ్రామిక బలగంలో 93 శాతం అసంఘటిత రంగాల్లో పని చేస్తున్నారు. వీరికి ఉద్యోగ భద్రత ఉండదు.
2014 మే లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక దివాళాకోరు విధానాలు, కొవిడ్ సంక్షోభ సమయంలో దాని అసమర్థ నిర్వాకం ఆర్థిక వ్యవస్థ పాలిట పెను శాపంగా మారాయి. 2014-15లో మోడీ అధికారం చేపట్టే నాటికి 7.4 శాతంగా ఉన్న జిడిపి వృద్ధి రేటు ఇప్పుడు మైనస్ 7.3 శాతానికి పడిపోయింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో పదకొండు శాతం వృద్ధి రేటు సాధించబోతున్నదంటూ మోడీ ప్రభుత్వం సాగించిన ప్రచారంలోని డొల్లతనం బయటపడిరది. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) వృద్ధిరేటు గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత అధోగతికి చేరిందనడానికి ప్రభుత్వ తాజా గణాంకాలే సాక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు మైనస్ 7.3 శాతానికి పడిపోయింది.
1991 సరళీకరణ తర్వాత జరిగిన రూ.7 లక్షల కోట్ల ఆర్థిక కుంభకోణాలను, బ్యాంకులను దోచుకుని విదేశాలకు పారిపోయిన విజయమాల్యా, నీరవ్ మోడీ, మొహిల్ చోక్సీ లాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం మరిచిపోదు. ప్రభుత్వం ఉపసంహరించుకున్న ప్రతి పెట్టుబడిని ప్రైవేటు సంస్థలు బ్యాంక్ రుణాలతో కొనుగోలు చేశాయి. ఇది పెద్ద ఎత్తున బ్యాంక నష్టాలకు(నిరర్థక ఆస్తులు), పెరుగడానికి దారితీశాయి. బ్యాంకుల ఎన్‌పిఎలు తగ్గించేందుకు 2019-20లో రూ.23786 కోట్ల రుణాలను బ్యాంకులు రద్దు చేసినప్పటికీ 2021 సెప్టెంబర్ నాటికి ఎన్‌పిఎలు బ్యాంకు రుణాల్లో 16.2 శాతానికి విస్తరించి బ్యాంకులు మళ్లీ ఒత్తిడిలో పడతాయని ఆర్‌బిఐ ఫైనాన్షియల్ సైబిలిటీ నివేదిక చెబుతోంది. పదేపదే బ్యాంకుల పునర్ వ్యవస్థీకరణ, విలీనాలు విశ్వాసం పెంపొందించలేదు. ఇప్పుడు నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ, ఎల్‌ఐసి వాటాల విక్రయం హర్షించబడటం లేదు. వాటిని కొనేవారిలో 50 మంది ప్రధాన డిఫాల్టర్స్ (రుణాలు ఎగనామం పెట్టిన వారు) నుండే ఉంటారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ‘పున్ణ పెట్టుబడి’ పేరిట బడ్జెట్ నిధులను సమకూర్చుతోంది మినహా ప్రభుత్వం బ్యాంకులకు అప్పు ఎగవేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఇప్పుడు బ్యాంకులకు మొండిబాకీలు (ఎన్‌పిఎలు) రూ. పది లక్షల కోట్లకు పైగానే ఉన్నాయి. 1991లో మొత్తం బ్యాంకు రుణాలు రూ.2.85 లక్షల కోట్లయితే, 2021 మార్చి నాటికి అవి రూ. 109.49 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. వీటిలో మూడోవంతు పెట్టుబడిదారుల వ్యక్తిగత రుణాలే. ఇక రాష్ట్ర ప్రభుత్వాల రుణ భారం 1991లో రూ.1.28 లక్షల కోట్లయితే, 2020 కల్లా అది రూ. 52.58 లక్షల కోట్లకు పెరిగింది. 2019 ఎన్నికల తరువాత సంస్కరణల అవశ్యకత, వాటి దిశ పట్ల సందేహాలు బలపడ్డాయి. 99 శాతం ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని సంస్కరణలను కొనసాగించడం దేశ ప్రయోజనాలకు ప్రమాదకరమన్న అభిప్రాయం బలంగా ఉంది. భారత ప్రభుత్వం తన విధానాలను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేసి, విద్య, ఆరోగ్యాలపై పెట్టుబడులు పెంచాలి.
2016 నవంబర్‌లో ‘పెద్ద నోట్ల రద్దు’తో ఒక పెద్ద ప్రహసనం ప్రారంభమయింది. కాకులను కొట్టి గద్దలకు వేసే వ్యవహారమది. సామాన్యులూ, చిన్న వ్యాపారులూ, పరిశ్రమల వ్యతిరేక ఆర్థిక నిర్ణయమది. కరెన్సీ నోట్లు అందుబాటులో లేని ‘పెద్ద నోట్ల రద్దు’ కాలంలో డిజిటల్ లావాదేవీలు చేయలేని చిన్న వ్యాపారులూ తదితరులు చితికిపోయారు. ఈ క్రమంలోనే బడా మాల్స్, పెద్ద వ్యాపారుల(ఎవరైతే మనం సంఘటిత రంగం అంటున్నామో వారి వ్యాపారం) అమ్మకాలూ, లాభాలూ పెరిగాయి. ఆ తరువాత వచ్చిన జిఎస్‌టి పన్ను విధానం చిన్న పరిశ్రమలనూ, వ్యాపారులనూ మరింత దారుణంగా చిదిమేసింది. దాంతో బడా వ్యాపారూలూ, కార్పొరేట్ల ఆధిపత్యం, వ్యాపారం మరింతగా పెరిగాయి. ఇదే వరుసలో అనంతర కాలపు కొవిడ్-19 నియంత్రణలు పేద జనాలనూ, మధ్య తరగతినీ కూడా మరింతగా చిదిమేసాయి.
ఈ కష్టకాలంలో ప్రభుత్వం అండ, ఆర్థిక సాయం లేక, చిన్న పరిశ్రమలూ, వ్యాపారులూ, మధ్యతరగతి, పేదలూ సమస్త సామాన్య జనాలస్థితి చితికిపోయింది. కానీ ఆన్‌లైన్ వ్యాపారాలు చేయగల, లాక్‌డౌన్‌ల వంటి వ్యాపార ప్రతిష్టంభనల కాలంలో నిలదొక్కుకునేందుకు కావలసినంత ఆర్థిక బలం ఉన్న పెద్ద సంస్థలూ, కార్పొరేట్లూ మరింత బలంగా, ఈ సంక్షోభం కాలాన్ని సొమ్ము చేసుకుని 35 శాతం లాభాలు గడించాయి. కష్టకాలంలో అండ, ఆసరాలేక చితికిపోయిన చిన్న చిన్న వ్యాపారాలూ, పరిశ్రమల మార్కెట్ వాటాను కూడా ఈ బడా కార్పొరేట్లు దిగమింగేసాయి. చిన్న చేపను పెద్ద చేప మింగేసినట్టు మార్కెట్ మాయాజాలం తాలూకు కథ! నిజానికి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే వినియోగం పెరగాలి. వినియోగం పెరగాలంటే ప్రజల వద్ధ డబ్బులుంటాలి. ప్రజల వద్ద డబ్బులుండాలంటే ప్రజలకు ఆదాయ మార్గాలు చూపాలి. అంటే అభివృద్ధి ఫలాలు ప్రజలకు పంపిణీ చేయాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. సంక్షోభం నుంచి బయటపడుతుంది.
కొవిడ్-19 పూర్వం నుంచే దిగజారుతున్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింతగా దిగజారిందని సమస్త గణాంకాలూ చెబుతున్నాయి. నిరుద్యోగం పెరిగింది, ప్రజల ఆదాయాలు పడిపోయాయి, తాము అత్యంత విలువైనదిగా భావించే బంగారాన్ని తాకట్టు పెట్టుకునే, అమ్ముకునే స్థితికి మధ్యతరగతి ప్రజలు వచ్చారు. ఆకలిచావులు పెరిగాయని గణాంకాలూ, జీవితాలూ చెబుతున్నాయి. మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల దివాళాలు పెరిగిపోయాయి. వాటి మొండి బకాయిలు ఈ రోజు బ్యాంకులకు అదనపు బెడదగా మారాయి. గృహ ఋణాలూ, వ్యక్తిగత రుణాలూ, వాహన రుణాలూ, క్రెడిట్ కార్డుల రుణాలలోనూ మొండి బకాయిలూ భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్లకు ఉద్దీపనలు ఇస్తున్నది కాని ఉపాధి కోల్పోయి దీనంగా చూస్తున్న ప్రజలను ఆదుకోవడం లేదు.
మనదేశ ఎగుమతుల తీరు నానాటికీ దిగజారుతున్నదని పదేపదే రుజువవుతున్నది. ప్రపంచమంతటి మాదిరిగానే భారతదేశమూ కనీవినీ ఎరుగని రీతిలో కొవిడ్ బాధలు ఎదుర్కొంటున్నది. ఏడాదిన్నరగా కరోనా మన దేశాన్నీ పీడిస్తున్నది. గత ఏడాది అనుభవించిన సుదీర్ఘ లాక్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను జన జీవనాన్ని ఎంతగా దెబ్బ తీసిందో తెలిసిందే. అయినప్పటికీ మనకున్న ఉత్పత్తి వనరులను ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధిని సాధించే ప్రయత్నాలు ఇంకా పుంజుకోలేదు. వ్యవసాయ రంగం కరోనా అవాంతరాన్ని అధిగమించి ఆలరారుతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా (మేకినిండియా) వంటి కార్యక్రమాలు ఏడేళ్లుగా సాధించినదేమిటి అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఆయన నాయకత్వంలోని బిజెపి మొదటిసారి దేశాధిపత్యాన్ని చేపట్టిన 2014 సంవత్సరం సెప్టెంబర్‌లో మేక్ ఇన్ ఇండియా అవతరించింది. ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయి వస్తు తయారీ కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తయారీ రంగంలో సాలీనా 12 నుంచి 14 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 నాటికి స్థూల దేశీయోత్పత్తి(జిడిపి)లో తయారీ రంగం వాటాను 16 నుంచి 25 శాతానికి పెంచాలని, 10 కోట్ల అదనపు ఉద్యోగాలు సృష్టించాలని దృఢ సంకల్పం చెప్పుకున్నారు. ఈ లక్ష్యాలను సాధించే వైపు పాలకులు చిత్తశుద్ధితో ప్రయత్నించి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇంత దారుణంగా ఉండేది కాదు.
దేశ ఆర్థిక రంగానికి వచ్చి చేరుతున్న స్థూల అదనపు విలువలో సగభాగం సేవల రంగం నుంచి వస్తున్నదే. వ్యవసాయ రంగం వాటాను తీసేస్తే తయారీ రంగం బాగం ఇప్పటికీ తక్కువగానే ఉంది. శుద్ధి చేసిన పెట్రోలియం, ఇంజినీరింగ్, వజ్రాలు, నగల రంగాల పుణ్యమా అని ఈ ఏడాది జూలైలో ఎగుమతులు 49.9 శాతం పెరిగినప్పటికీ దిగుమతులు కూడా 63 శాతానికి హై జెంప్ చేశాయి. పర్యవసానంగా విదేశీ వాణిజ్యం బిలటు 10.97 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే మనదేశం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆర్థికంగా ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాలకులు చూపే శ్రద్ధ, నిబద్ధతలే దేశాన్ని ఏ రంగంలోనైనా ముందుకు తీసుకెళతాయి. మన పాలకులు మాత్రం ప్రజల్లో మతపరమైన విభజన విద్వేషాలను పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున ఆర్థిక రంగానికి వెన్నెముక అయిన తయారీ రంగం మూలపడిపోతున్నది.
15-64 ఏళ్ల వయసులోని జనం దేశ జనాభాలో 67.27 శాతంగా ఉన్నారంటే మన దేశంలో యువశక్తి ఎంతగా ఉందో తెలుస్తున్నది. మరి వీరిని మనం పూర్తిగా ఉపయోగించుకుంటున్నామా? అంటే, అసలే లేదు. ప్రభుత్వ రంగంలోని లక్షల కోట్ల విలువైన పరిశ్రమలను, బ్యాంకులను, బీమా సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించి చేతులు దులుపుకోవడం మీదున్న శ్రద్ధ దేశంలోని యువశక్తిని సరైన మార్గంలో పెట్టి తయారీ రంగాన్ని బలపర్చడానికి వినియోగించుకునే లక్ష్యం పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదని బోధపడుతున్నది. 2017-18లో దేశ నిరుద్యోగం పెరుగుదల రేటు గత 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ఎత్తుకు చేరుకున్నదని ఒక సర్వే స్పష్టం చేసింది. దేశ జనాభాలో 67 శాతంగా ఉన్న పని చేసే వయసులోని ప్రజలను ఉపయోగించుకోలేకపోడమనే దురదృష్టకరమైన స్థితిని అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల సీనియర్ ఫెలో రాధికా కపూర్ ఎండగట్టారు.
2011-12తో పోలిస్తే 2017-18లో దేశ ఆర్థిక కార్యకలాపాల్లో కార్మిక శక్తి పాల్గంటున్న రేటు బాగా పడిపోయింది. 2011-12లో ఇది 55.9 శాతంగా ఉండగా 2017-18 నాటికి 48.8 శాతానికి దిగజారిపోయింది. సంపద పెంపు వ్యాపకాల్లో మహిళల పాత్ర మరింత దిగజారిపోతున్నది. వ్యవసాయ రంగానికి తోడుగా పారిశ్రామిక, తయారీ రంగాలను ఆశాజనకంగా వృద్ధి చేయలేకపోతున్నారు. గ్రామీణ జనాభాలో తలసరి 2200 కేలరీల కన్నా తక్కువ విలువ ఉన్న ఆహారధాన్యాలు పొందినవారు 1993-94 నాటికి 58 శాతం ఉంటే 2020-21 నాటికి వారి శాతం 68కి పెరిగింది. పట్టణ ప్రాంతాలకు 2100 కేలరీలు నిర్ణయించారు. 1993-94లో పట్టణ ప్రాంతాల్లో 2100 కన్నా తక్కువ కేలరీల విలువ కల ఆహార ధాన్యాలను పొందినవారి శాతం 57 కాగా అది 2020-21 నాటికి 65కు పెరిగింది. 2015 తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా దిగజారాయి. ఫలితంగా వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న కోట్లాది మంది వ్యవసాయ కూలీలు పొట్ట చేతపట్టుకొని నగరాలకు, పట్టణాలకు బతుకు తెరువు కోసం తరలిపోతున్నారు. అక్కడ సరైన ఉపాధులు లేక చితికి పోతున్నారు. మార్కెట్లో డిమాండు పెంచడానికి ప్రజలందరికి ఉపాధి కల్పించడమే సరైన పరిష్కారం. మోడీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సరిగాలేవని ఆర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు. కొనుగోలు పెంచడానికి బదులు సరఫరాకు మాత్రమే ఉద్ధీపనలు ఇస్తున్నారు. ఇది అపసవ్య విధానం ఆర్థిక అంతరాలను పెంచుతున్నాయని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, ఆశ్రితులకు పన్నురాయితీలు, ఉద్దీపనలు, రుణమాఫీలు చేయడంతో ప్రభుత్వ ఖజానా లూటి అయింది. ప్రభుత్వ ద్రవ్యలోటు పూర్చుకోవడానికి ‘జాతీయ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం’ అని ముద్దుపేరు పెట్టింది. ‘ద్రవ్యసేకరణ’ పథకం పేరుతో ప్రజల నుంచి పన్నుల రూపేణా సమకూరిన ఆదాయంతో నిర్మితమైన ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను అమ్మడానికి సిద్ధపడింది. 1991 నుండి రూ.3.63 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అమ్మివేశారు. 2014-19 మధ్య రూ.2.79 లక్ష కోట్ల పెట్టుబడి ఉపసంహరించారు. రూ.2020-21 లక్ష్యం రూ.2.1 లక్ష కోట్లు, ఆసక్తికరమేమంటే, ఈ సొమ్మునంతా బడ్జెటరీ వ్యయానికి ఖర్చు చేశారే తప్ప ఆస్తులు సృష్టించ లేదు. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, గ్యాస్ పైపు లైన్స్, టెలి కమ్యూనికేషన్స్, పబ్లిక్ వేరే హౌసింగే, ఉపరితల రవాణా గనులు, రేవులు, స్టేడియంలు వేటినీ వదలట్లేదు. రానున్న నాలుగేళ్లలో వీటన్నిటిని ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టడానికి పూనుకుంది. ప్రజల ఆస్తులకు సంరక్షకురాలిగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా జాతి సంపదను కారు చౌకగా అమ్మడం మోడీ దివాళకోరు ఆర్థిక విధానానికి పరాకాష్ట. కార్పొరేట్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని నిస్సిగ్గుగా చెబుతుందీ ప్రభుత్వం. ఇది దేశ స్వావలంబనకే కాదు మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలుగ చేస్తుంది.
మోడీ ఏడు సంవత్సరాల పాలన తరువాత ఆర్థిక వ్యవస్థ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్థాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫల్యం, అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపథ్యంలో మోడీ సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్థితిలో జనం లేరు. అదే మోడీకి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలను సమర్థించేవారు కాస్త ప్రజల జీవితాలు ఏ విధంగా చితికిపోతున్నాయో గమనించాలి. ఆధునిక భారత దేశం నిర్మాణం కావాలంటే అందుకు మౌలికంగా చేపట్టవల్సిన చర్యలు చేపట్టాలి. ప్రధాని విద్య, వైద్యం అందరికి ఉచితంగా అందించాలి. సమాజం స్వావలంబన చెందాలంటే భూ సంబంధాలలో మార్పులు రావాలి. అంటే భూ పంపిణీ జరుగాలి. ప్రపంచీకరణ విధానాలు వీటిని విస్మరించింది.
ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికా పద్ధతిని పునరుద్ధరించాలి. ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేసి ఉపాధిని కల్పించాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. భూ సంస్కరణలను అమలు జరిపి వ్యవసాయ సంబరాలలో ప్రజాతంత్ర మార్పు సాధించాలి. సహకార సేద్యాన్ని, సహకార మార్కెటింగు అభివృద్ధి చేయాలి. ప్రైవేటీకరించబడిన ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి జాతీయం చేయాలి. విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా, ప్రజా రవాణా, విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తేవాలి. సంపద పునఃపంపిణీ జరిగేలా ద్రవ్య విధానంలో, పన్ను విధానంలో మార్పులు చేయాలి. సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు, సంప్రదాయ పరిశ్రమలకు భద్రత కల్పించాలి. ఇవన్నీ అమలులోకి రావాలంటే ప్రభుత్వం మెడలు వంచే సంఘటిత విద్యార్థి, యువజన ప్రజా ఉద్యమం తప్ప మరో మార్గం లేదు.