సంఘర్షణ తీవ్రమైనట్లుగానే ఉద్యమ ఆకాంక్షలు సమాజంలో బలపడతాయి. దీని ప్రతిఫలం సాహిత్యంలోనూ కనిపిస్తుంది ‘‘జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుని సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతనిలో పెంపొందించింది. అవబోధనాశక్తి, భావనాశక్తి. అవబోధనాశక్తి అంటే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాంఘిక జీవిత వాస్తవాల్ని పరిశీలించి, పోల్చి అధ్యయనం చేసే శక్తి. భావనాశక్తి అంటే విషయాలకీ ప్రకృతి మూలశక్తులకీ మానవ లక్షణాలనీ అనుభూతులనీ, ఆమాటకొస్తే అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట’’ అని గోర్కీ  అంటారు. అవబోధనాశక్తి, భావనాశక్తులు రెండూ పల్లపు స్వాతి రాసిన మోదుగుపూల వాన కవిత్వం అంతటా నిండుగా పరచుకొంది. ఇరవై చిన్న కవితలున్న ఈ పుస్తకానికి జి.కల్యాణరావు ‘కవిత్వం, విప్లవం ఒకటైన వేళ’ అన్న శీర్షికతో ముందు మాట రాశారు. ఈ పుస్తకం 2019 ఫిబ్రవరిలో విరసం ప్రచురించింది.

ఈ కవితల్లో స్వాతి గోర్కీ అన్నట్లు అవబోధనాశక్తితో ప్రకృతి ఉద్యమ అభివ్యక్తి సాధనాలుగా ఉపయోగించుకుంది. అప్రయత్నాంగానే ప్రకృతిని విప్లవీకరించి మాట్లాడుతుంది. ప్రకృతికి తన అనుభూతుల నద్దుతుంది. ఉద్యమానికి ప్రకృతి ఉపమానమైంది. పుస్తక శీర్షికనే కవితాత్మకమైనది. మోదుగుపూలు చిగిర్చిన తరువాత వాడిపోయి రంగుమారదు. చిగిర్చినపుడు ఎలా వుంటుందో ఎండిన తరువాత కూడా అలాగే వుంటుంది. గతంలో మోదుగు పూలను ఇండ్లల్లో అలంకారంగా గ్రామాల్లో వాడుకునే వారు. ఇంకా వెనక్కు వెళితే మోదుగు పూలతో రంగులు తయారు చేసుకుని వసంతం ఆడుకునేవారట. గ్రామీణ జీవితంలో మోదుగు చెట్టు ప్రయోజనాలున్నాయి. ఆకుల్ని విస్తరిగా ఉపయోగించేవారు. ఆ సంస్కృతిలోకి వెళ్ళకుండా రచయిత మోదుగు పూలను ఉద్యమ ప్రతీకగా వాడుకోవడం నిబద్ధతను తెలియజేస్తుంది. ముందుమాటలో జి.కల్యాణ్‌రావు పేర్కొన్నట్లుగా ‘‘మనిషిని, ప్రకృతిని, ప్రేమను, పోరాటాన్ని, యుద్ధాన్ని, యుద్ధం తాలూకు జ్ఞాపకాల్ని, అమరత్వాన్ని, ఆ అమరత్వం అందించిన సందేశాన్ని కలిపి విప్లవ సందేశం’’తో కవిత్వం స్వాతి అల్లింది.

                                   మొదటి కవితలో ‘‘కాగితంపై గాయపడ్డ      

                                                  అక్షరమిపుడు

                                                  సాయుధమై యుద్ధక్షేత్రానికి సాగిపోయింది

                                                  వెలుగులీనే వెన్నెల్లా

                                                  తుడుం మోతల యుద్ధగీతంలా …..’’ యుద్ధాన్ని వెన్నెలంతా సహజంగా అంగీకరించింది. అప్పుడే అది తుడుం మోత అయింది. యుద్ధగీతమైంది. ప్రకృతిని యుద్ధంలోకి ఆవాహన చేసి తాను యుద్ధం చేయడం అత్యంత సహజ కారణమని ఆ యుద్ధం ఆదివాసుల్లో ప్రారంభమైందని, స్వాతి యుద్ధ స్వభావాన్ని వివరించింది.

ప్రబంధకవులు భావకవులు వెన్నెలను విహార వేళల ఆస్వాదించారు. వెన్నెల ప్రకృతి సంపద. అది ప్రజోపయోగం కావాలి. భూమి ప్రకృతి సంపద. అది కొందరి అనుభవంలో వుండకూడదని కదా ఉద్యమకారు లంటున్నది! అలాగే వెన్నెల కూడా ప్రజోపయోగం కావాలి. కొండ గుర్తుగా చెప్పుకుంటే వెన్నెలను శ్రీశ్రీ ‘శరశ్చంద్రిక’ గేయంలో ప్రజాపరంగా ఉపయోగించుకున్నారు. అటు తరువాత శివసాగర్‌, అజ్ఞాతసూరీడు, కౌముది (కౌముది అంటే వెన్నెల) విప్లవ కవులంతా వెన్నెలను తమ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సినిమా కవుల వెన్నెలను ఆస్వాదించ లేక పోతున్నారు.

పల్లపు స్వాతి వెన్నెలను చాలా కవితల్లో ప్రస్తావించారు. ‘‘నెత్తురోడుతున్న వెన్నెల’’ కవితలో ప్రకృతిలో భాగంగా వెన్నెలను పోరాటంలో భాగస్వామిని చేసింది. ‘‘చిత్రహింసల కొలిమిలో.. రాటుదేలిన వెన్నెలా ’’  అని సంబోధించడంలో ప్రకృతిని హింసించే సమాజం దాపురించిందని పాఠకుడు గ్రహించాలి. కవితలో ఇంకా ముందుకెళితే కాశ్మీరు స్వయంప్రతి పత్తి ఉద్యమాల నుంచి దండకారుణ్యం దాకా ఉద్యమాల అణచివేతను స్వాతి ప్రశ్నించింది. కవిత ఆఖరు కొచ్చేసరికి వెన్నెలను ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఆఖరి కవితా పాదాల్లో అజ్ఞాత సూరీడు, శివసాగర్‌ కవితలు గుర్తుకొస్తాయి. మనకు ప్రకృతిలో కనుపించే విషయాలను ఉద్యమ సాధనాలుగా మలచుకోవడం రచయితల చైతన్యాన్ని సూచిస్తుంది. పైగా గెరిల్లా కవికి నియాన్‌లైట్ల వెలుతుర్లు, ఇల్యూమినేషన్స్‌ వంటివి కృత్రిమమైన అలంకారాల్ని తమ దృష్టితో చూస్తారు. ‘పాటనై పదునెక్కాల’ కవితలో

                                జ్ఞాపకాల వసంతాల్ని

                                కళ్ళ నిండా ఒంపుకోవాలి

                                ……………………

                                హరిత వనాల్లో

                                నెత్తురై విరబూస్తున్న వెన్నెలకు

                                కలిష్నికోన్‌లై కోరసవ్వాలి….

                                …………………….

గుండెను రగల్‌ జెండాలా ఎగరేయాలి అంటూ అతి సాధారణంగా ఒక భావాల్ని ప్రారంభించి అతి తీవ్రస్థాయికి తీసుకుని పోయింది. ‘వెన్నెల నెత్తురై విరబూస్తున్నదట’ పోరాటాల్ని, త్యాగాల్ని గుండెను రగల్‌ జెండాగా ఎగరేయాలని ఉద్యమాలతో తాదాత్మ్యం చెందుతుంది.

ఈమె కవిత్వం నిండా యుద్ధవర్ణనే కనిపిస్తుంది. జీవితమే యుద్ధంలో కూరుకుని పోయిన తరువాత యుద్ధ క్షేత్రం విడిగా ఒకటి కనిపించదు. ప్రకృతిలోని ప్రతి ఒక్కదాన్ని రచయిత యుద్ధానికి తోడుగా చూస్తుంది.  ఎరుపెక్కిన వెన్నెల అన్న శీర్షికలోని కవితలో

                                ఆ వసంతాన్ని ఒంటరిగా చూడనే లేదు

                                ఆ అడవి పువ్వులూ

                                ఆ పిట్టల గానాలూ      

                                ఆదివాసీ పిల్లల నవ్వులు

                                ఆరుద్రపువ్వుల నెత్తుటి కవాతు

                                ఒంటరిగా నేనెప్పుడూ చూడలేదు. ఇక్కడ ఆరుద్ర  పువ్వుల నెత్తుటి కవాతు అన్నమాటలో అడవి మొత్తం ఇవ్వాళ యుద్దోన్ముఖంగా నడుస్తుందని కవి అంటారు. ఈ పుస్తకంలో కలష్మికొవ్‌ ప్రస్తావన మూడు సార్లు కనిపిస్తుంది. ఈ కవిత్వం మొత్తం ఉద్యమాన్ని వివిధ కోణాలలో, వివిధ తలాల్లో స్పృస్టిస్తుంది. అట్లని రచయితకు కదన కుతూహలం వుందని చెప్పలేం. త్యాగాలను ఉద్యమాల్ని ప్రకృతితో కలిపి చూపిస్తుంది. ఇవి అతివాద దుస్సాపిక కవితలు కాదు. ఎలాగంటే ఎవరు వాళ్ళు అన్న కవితలో

                                ‘‘తమ చెమట చిత్తడితో

                                సూర్యుణ్ణి నిద్రలేపే వాళ్ళు

                                భూమికి నెత్తురు తాపి

                                నీకు బుక్కెడు బువ్వ పెట్టేటోళ్ళు

                                డొక్క లెండినా నీతి తప్పనోళ్ళు’’ అని వాళ్ళ చిరునామా తెలుపుతుంది. జాషువాను తలపింపచేస్తూ

                                ‘‘వాళ్ళ రెక్కల కష్టం తిని

                                తెగ బలిసిందీ దేశం’’ అనడంలోని అధిక్షేపం న్యాయమైనది. జ్ఞాపకం అన్న కవితలో

                                నిజంగా ఆరోజులు వేరు

                                వెన్నెల్ని మండిరచిన

                                తుడుం మోతల యుద్ధగానాలూ

                                అలుపెరగని నడకలూ

                                గడచిన కాలాన నడచిన

                                వసంత మేఘగర్జనలవి’’ ఈ కవితలో రచయిత నిస్పృహకు లేదా ఆ పోరాటాల ఉద్యమాలు ఇప్పుడు లేవేమననిపించేలా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వుంది. ఇక్కడ లీగల్‌ ఉద్యమాలకు తావు లేకుండానే కాదు ప్రజాసామ్యయుతంగా కూడా నిరసనలు తెలియజేసే వీలు లేదని రచయిత అభిప్రాయం. ఈ కవితలో స్పష్టత సాధించాల్సి వుంది. ‘‘వెన్నెల్ని మండిరచిన తుడుం మోతల యుద్ధగానాలూ’’ అనడంలో యుద్ధాన్ని వెన్నెలంత సహజంగా రచయిత ఆస్వాదిస్తూ వుంది. విప్లవకవిత్వంలో రెవెల్యూషనరీ రొమాంటిసిజం వుండాలని శివసాగర్‌ అంటూండేవారు. ఆ ప్రయోజనాన్ని పల్లపు స్వాతి సాధించింది. ఐతే కారణం చూపి కార్యం వివరించి వుంటే ఇంకా గొప్ప ప్రయోజనం సాధించి వుండేది. కాని పల్లపు స్వాతి భావనల కాంతిని వెదజల్లే నిప్పుకణికలు. వెన్నెలలో అగ్నిజ్వాలలు రగిలించే భాష. యుద్ధరంగంలో లిప్తపాటు ట్రిగ్గర్‌ సరిచూసుకునే వ్యవధిలోని భావనలివి. ఇది గెరిల్లా కవనం. గెరిల్లా అమ్మను గురించి ఎలా జ్ఞాపకం చేసుకుంటారు.

                                మా అమ్మ పగిలిన పాదాల్లో కనిపించే

                                మట్టిగుండెల అలజడి నాలో పోటెత్తే సంద్రమైంది.

గతంలో ఒకసారి అనంతపురం పట్టణంలో వందలాది మందితో కవి సమ్మేళనం జరిగింది. ఆ కవులలో అత్యధిక మంది కవులు అమ్మను గురించి రాశారు. అందులో సారాంశం ‘‘అమ్మ గొప్పది. అమ్మ తన సంతానాన్ని లాలిస్తుంది. పాలిస్తుంది’’ అని.  ఆమెకుండే కష్టాలను ఏకవీ ప్రస్తావించడు. ప్రకృతి ధర్మాన్ని సాంఘిక ధర్మాన్ని విడదీసి చూడక పోవడం ఆ కవులలో వుండే అవగాహనా రాహిత్యం, మానవ సంబంధాల్ని కష్టసుఖాలలో చూడాలి. తనను లాలించే అమ్మ కష్టాన్ని ప్రపంచానికి తెలపాలి. స్వాతి ఈ కవితలో పగిలిన పాదాల్లో కనిపించే మట్టి గుండెల అలజడి పోటెత్తే సముద్రమైందని కలత చెందుతుంది. అమ్మ దుఃఖాన్ని ఎత్తి పట్టింది. ఇదీ వర్గీదృక్పథం. స్వాతి కవిత్వమంతా యుద్ధం పరచుకునింది. జీవితమంటే ఇప్పుడు యుద్ధమే! యుద్ధ చంద్రుడు అన్న శీర్షికలోని కవిత వి.వి.ని. ఉద్దేశించి రాసిందే అయినా ఈ కవితలో రాజ్యపు అణచివేత రూపాలన్నిటిని చెబుతూ రాజ్యపు చీకటి కుట్రలు ఇక సాగవని తూర్పున ఉషోదయమవుతూ వుందని హెచ్చరిస్తుంది. తనను తాను రక్షించుకుంటూనే కవిత శత్రువుపై దాడి చేస్తుంది. ఈ సంకలనంనిండా ఇదే తత్వం కనిపిస్తుంది. యుద్ధం కొనసాగుతూనే వుంటుందని వీరుడు నేలకొరిగినంత మాత్రాన యుద్ధం ఆగిపోదని మోదుగుపూల వాన శీర్షిక కవిత చెబుతుంది. మోదుగుపూల వాన కవితలు చదువుతూ వుంటే ఆద్యంతం యుద్ధరంగంలో వుండిన భావన కలుగుతుంది. అయితే గంధక ధూమం వాసన ఎక్కడా తగలదు. తుపాకీ పేళుళ్ళ శబ్దం వినబడుతుంది. ఇవి లేని యుద్ధముంటుందా అంటే స్వాతి కవిత్వం చదవాల్సిందే. ప్రకృతి మధ్య నిలబడి సామాజిక నియమాల ఉల్లంఘనను ప్రశ్నిస్తూ వ్యవస్థపై యుద్ధం ప్రకటించడం ప్రకృతంత సహజం. దీన్నే గొర్కీ క్రియాత్మక రొమాంటిసిజం అంటారు. ‘‘క్రియాత్మక రొమాంటిసిజం జీవించడానికి మానవుడి ఇచ్చని  ధృడ తరం చెయ్యడానికీ, తన చుట్టూతా వున్న జీవితం మీద ఎదురు తిరగడానికి, ఆ జీవితం బలవంతంగా రుద్దే ఏ నియంతృత్వానికైనా వ్యతిరేకంగా అతను ఎదురు తిరిగేటట్టు చెయ్యడానికి కృషి చేస్తుందం’’టారు గోర్కీ. ఈ విషయాన్నే శివసాగర్‌ కవిత్వంలో రెవెల్యూషనరీ రొమాంటిసిజం వుండాలనే వారు. స్వాతి తన కవిత్వంలో ఈ ప్రయోజనాన్ని సాధించింది. విరసానికి పల్లపుస్వాతి గొప్ప కవిత్వ వాగ్దానం చేసింది.

One thought on “మోదుగుపూల కవిత్వపు జడివాన

 1. మా సత్యం
  నాగేశ్వర చారి గారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ..
  ఈ సందర్భంగా అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’లో
  తన కవితా అక్షరాలను సహజ పరమైన మానవతా భావనతో అన్న మాటలు స్ఫురణకు వచ్చాయి.
  “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయైరావతాలు
  నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అన్నారు. తిలక్ కన్నా రెండు అడుగులు ముందుకు వేస్తూ నిత్య చైతన్య స్ఫూర్తితో వస్తూన్న పల్లపు స్వాతి గారు
  ‘’కాగితంపై గాయపడ్డ అక్షరమిపుడు
  సాయుధమై యుద్ధక్షేత్రానికి సాగిపోయింది
  వెలుగులీనే వెన్నెల్లా.”
  కళాత్మకమైన వ్యక్తీకరణ తో కవిత వస్తువు శైలి సమ ప్రాధాన్యతతో తన దైన ఒక సొంత శైలిని నిర్మించుకుని రాసిన కవిత్వంలో విప్లవాత్మకమైన వ్యక్తీకరణతో సమకాలీన ప్రజా ఉద్యమాలను ప్రతిబింబింప చేస్తూ శక్తివంతంగా భావాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడొస్తున్న కొత్త తరం కవుల్లో పేర్కొనదగిన కవియిత్రి. పల్లపు స్వాతి గారికి ఉద్యమాభివందనాలు
  లాంగ్ లీవ్ ఇండియన్ రెవల్యూషన్ ✊✊

Leave a Reply