అత్యంత శక్తివంతుడ‌ని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో,  కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు.  కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయ‌న అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భ‌యపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగ‌ల‌వాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే  కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుండి ‘పెగసస్’ అనే ఒక సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారా లేదా అన్నదే. కొనుగోలు చేస్తే చేశామ‌ని,  లేదంటే లేదు అని చెప్పగలిగే ధైర్యం లేని నాయకుడు. అలాంటి వ్య‌క్తి ఈ రోజు భారత ప్రజలను పరిపాలిస్తున్నాడు.

ఇంతకీ ‘పెగసస్’ మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది. ఎందుకు దాని గురించి అంద‌రూ. ముఖ్యంగా భార‌త పాల‌క‌వ‌ర్గంలోనే కొంద‌రు  అంతగా భీతిల్లుతున్నాయి. ‘పెగసస్’ అనేది నిఘాకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్. ఇది ఎదుటివారికి తెలియకుండా వారి ఎలక్ట్రానిక్ పరికరాలలోకి చొరబడి వారి సమాచారాన్ని దొంగిలిస్తుంది. వారికీ తెలియకుండా వారికీ సంబంధం లేని వాటిని ఆ పరికరాలలోకి పంపుతుంది. ప్రపంచంలో యాభై వేల మందికి పైగా ఈ నిఘాలో ఉన్నారు. భారతదేశంలో దాదాపు మూడు వందల మంది మీద దీనిని ఉపయోగించార‌ని స్వతంత్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీని నిఘా నీడలో పాత్రికేయులు, మేధావులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులూ ఉన్నారు. రాహుల్ గాంధీ, ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్ కు చెందిన అభిషేక్ బెనర్జీ (ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు) ఉండటం వల్ల ఇది పెద్ద స‌మ‌స్య‌గా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. మన దేశంలో నిఘా అనేది చాలా సాధారణమైన వ్యవహారం. అందులోను చట్టబద్ధంగా ఫోన్ ట్యాప్ చేయడం అన్నది ఎప్పటి నుండో జరుగుతున్నది. ఏడు  సంస్థలు ఈ పనిని చట్టబ‌ద్ధంగానే చేస్తున్నాయి. 


ఇదేదో ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోను ఇది జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగులతో ఎంతో మంది విప్లవకారులను హత్య చేయించాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద భగ్గున లేస్తున్న మమతా బెనర్జీ కూడా చేసింది అదే. 


కానీ ఇప్పుడు మాత్రమే ఈ చర్చ ఎందుకు నడుస్తుంది. తమ దాక రావడమే వీరి బాధ.  వారి వ్యక్తిగత గోప్యత, భద్రత కి ప్రమాదం రావడంతో గొంతు ఎత్తి అరుస్తున్నారు.. అంతేకాని వీరు ఉద్వేగంగా చెబుతున్న‌ ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ లాంటి వ‌న్నీ  ఒట్టి మాటలు మాత్రమే. కొంతమంది అయితే ఇది తీవ్రవాదుల మీద వాడొచ్చు కానీ రాజకీయనాయకుల మీద  కూడ‌ద‌ని  అంటున్నారు. తీవ్రవాది అంటే ఎవరు? ప్రభుత్వానికి నచ్చిని వారంతా  తీవ్ర‌వాదులే.  ఈ రోజు అర్బన్ మావోయిస్టులాగా చిత్రీకరించబడ‌ని వాళ్లెవ‌రూ లేరు.  అందుకని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేవారంతా వారువీరు అనే తేడా లేకుండా అందరూ  ఈ నిఘాలో ఉండొచ్చు.         


ఇది ఫోన్ ట్యాప్ చేయడం లాంటిది మాత్రమే కాదు. మీకు తెలియకుండా మీ పరికరాలలోకి అక్రమంగా చొరబడి మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటారు. మీకు  సంబంధం లేని సమాచారాన్ని పంపిస్తారు. ఆ  డేటా ఆధారంగా మిమ్మల్ని అరెస్టు  చేయవచ్చు. భీమాకోరేగాం కేసే అందుకు ఉదాహరణ. భీమాకోరేగాం / ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టు అయిన  వారు కూడా పెగ‌స‌స్  జాబితాలో ఉన్నారు. పెగసస్ వ్యవహారం బయటపడటానికి ముందే అర్సనైల్ రిపోర్ట్ బయటికి వచ్చింది. ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు చెబుతున్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్ని కూడా ప్రణాళిక ప్రకారం చొప్పించారు అని వీరు మొదటి నుండి వాదిస్తున్నారు. దానికి సంబంధించి అర్సనైల్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్టు సంబద్ధ‌తను అప్పుడు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు నిరాకరించాయి. కానీ ఇప్ప‌డు అంతా బ‌ట్ట‌బ‌య‌లైపోయింది.


ఒక పక్క ప్రభుత్వాలు ఊపా లాంటి చట్టాలను కఠినతరం చూస్తూ  మరో వైపు అక్రమంగా చొరబడి మనుషులను నిందితులుగా చూపిస్తాయి.  దొంగే దొంగ దొంగ అని ఎదుటివాడిని నిందిస్తున్నటుంది ఈ వ్యవహారం.   ఇంత గోల నడుస్తుంటే ఒకవైపు భాజపా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించింది లేదు.  కేంద్రమంత్రి  రవిశంకర్ ప్రసాద్ 45 దేశాలు పెగసస్ ను వాడుతున్నాయి. ..కేవలం భారతదేశాన్ని మాత్రమే ఎందుకు నిందిస్తున్నారు అంటున్నారు. అసలు విషయం నిఘా పెట్టామా లేదా అన్నది. కొనుగోలు చేశామా లేదా అన్నది. దానికి మాత్రం సమాధానం లేదు. ఇంకో వైపు ఇది కోవిడ్, ద్రవ్య సంక్షోభం ముందు ఇది పనికిరాని విషయం అని భాజపా అంటుంది.  ఇది అంతర్జాతీయ కుట్ర అంటూ ప్రచారం మొదలుపెట్టింది. కానీ అసలు విషయం మీద మాత్రం జవాబు ఇవ్వటంలేదు.  ఈ నిఘా ఎవరెవరి మీద ఉంచారు. పార్లమెంటరీ రాజకీయాలలో తమ ప్రత్యర్థులు అనుకున్న వారి మీద. తమ పరిపాలన లోటుపాట్ల మీద విమర్శ చేస్తున్న ప్రగతిశీల మేధావుల మీద, తమకు అనుకూలంగా లేని పాత్రికేయులు మీద ఈ నిఘా ఉంచారు. తమకు అడ్డు వస్తారనుకున్న అందరూ  ఈ నిఘా క్షేత్రంలో ఉన్నారు. అక్రమ చొరబాటుదారులు అంటూ ముస్లిం లపై భాజపా ప్రభుత్వం దాడి చేస్తుంది. ఉగ్ర‌వాదులంటోంది. ఇంకో వైపు ప్రభుత్వమే అక్రమంగా చొరబాటుదారు అయింది. దేశ ప్ర‌జ‌లంద‌రి ఆంత‌ర‌గిక జీవితంలోకి చొర‌బడుతోంది. 


ఒక క్ర‌మంలో ఈ చ‌ర్చ ఎలా ముందుకుపోగ‌ల‌దో మ‌నం ఊహించ‌గ‌లం. అది ఎలా  ఉంటుంద‌టే.. పెగ‌సస్ నిఘా  అస‌మ్మ‌తిదారుల మీద ఉండ‌వ‌చ్చు, ప్ర‌జాస్వామిక‌వాదుల మీద ఉండ‌వ‌చ్చు. విప్ల‌వాన్ని కాంక్షించే  వాళ్ల మీద ఉండ‌వ‌చ్చు. ఈ చ‌ర్చ స‌రిగ్గా ఆ తీరం చేరుకుంటుంది. అక్క‌డ నిల‌బ‌డుతుంది. అంతిమంగా ప్ర‌జ‌లు పాల‌కుల నిఘాలో బ‌తికే రోజు వ‌స్తుంది. అది ఇప్ప‌డే ఉంది. కాక‌పోతే మ‌రింత తీవ్ర‌మ‌వుతుంది.   
నిఘాలో బ‌త‌క‌డమంటే మ‌రింత స్వేచ్ఛ‌ను కోరుకోవ‌డ‌మే. దాని కోసం పోరాటానికి సిద్ధం కావ‌డ‌మే.   

Leave a Reply