70 ఏళ్లుగా ఆ నేల  పాలస్తీనా ప్రజల రక్తంతో త‌డుస్తోంది. వాళ్ల తమ జాతి విముక్తి  ఆకాంక్ష ప్ర‌పంచ‌మంతా పిక్క‌టిల్లుతోంది. ఆ ప‌క్క‌నే ఇజ్రాయిల్ దారుణాలు వినిస్తున్నాయి.  అరబ్బుల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఈ మే 14తో దాని దురాక్రమణకు 70 ఏళ్ళు నిండుతాయి. ఈ 70 ఏళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు అది పాలస్తీనా ప్రజల అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ సారి దానికి మే 7 ను ఎంచుకుంది. 

జెరూసలెంలోని ఓల్డ్ సిటీలో అల్-అక్సా మసీదు కాంప్లెక్స్ ఉంది. ముస్లింలకు అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఇది ఒకటి. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మే 7 రాత్రి వేల మంది ముస్లింలు ఇక్కడకు చేరుకున్నారు. వారి మీద ఇజ్రాయిల్ పోలీసులు దాడులు చేశారు. అది మొదలు గాజా, జెరూసలేం, వెస్ట్ బ్యాంకులలో దాడులు మొదలయ్యాయి. ఈ పది రోజులలో గాజాపై ఇజ్రాయిల్ 100 కి పైగా దాడులు చేసింది. ఈ దాడులలో సుమారు 227 మంది ప్రజలు మరణించారు. జెరూసలెం, వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకూ 700 మందికి పైగా పాలస్తీనా వాసులు గాయపడ్డారు. అనేక మంది దూర ప్రాంతాలకు వలస వెళ్లారు.

ఇంతకీ మనం పాలస్తీనా ప్రజల గురుంచి ఎందుకు మాట్లాడుకోవాలి? బాలగోపాల్ అన్నట్టు తమ నేల కోసం పక్క దేశంలో తలదాచుకుని పోరాడుతున్న వాళ్లు పాల‌స్తీనియ‌న్లు.   వాళ్ల ఆకాంక్ష‌లు ఏమిటో తెలుసుకోడానికి మ‌నం పాలస్తీనా ప్రజల గురించి   మాట్లాడుకోవాలి. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న సామ్రాజవాదం గురించి తెలుసుకోడానికి మాట్లాడుకోవాలి. 

గత 70 ఏళ్లకు పైగా మధ్య ప్రాచ్య‌ ప్రాంతమంతటినీ పాలస్తీనా – ఇజ్రాయిల్ సమస్య ప్రభావితం చేస్తున్న‌ది. ఒక్క మధ్య ప్రాచ్యాన్ని మాత్రమే కాదు,  మొత్తం ప్రపంచ రాజకీయాలను ఇది ప్రభావితం చేస్తున్నది.  నిజానికి దీన్ని పాల‌స్తీనా-ఇజ్రాయిల్ స‌మ‌స్య‌గా చూడ్డానికే లేదు. పాల‌స్తీనా అస్తిత్వాన్ని ర‌ద్దు చేయ‌డానికి సామ్రాజ్య‌వాదం తెచ్చి పెట్టిన స‌మ‌స్య‌. దేనికంటే  జీవితంలో, యుద్ధ రంగంలో అత్య‌వ‌స‌ర‌మైన అపారమైన చమురు నిక్షేపాలు ఆ ప్రాంతం ఆవాసం. అందుకే సామ్రాజ్య‌వాదులు ఈ *స‌మ‌స్య‌*ను తీసుకొచ్చారు. పెంచిపోషిస్తున్నారు. మొదట బ్రిటన్ సామ్రాజ్యవాదులు, ఆ తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదులు చ‌మురు దోపిడీ కోసం ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు.

1917లో బ్రిటన్ పాలకులు పాలస్తీనాలో తక్కువ సంఖ్యలో ఉన్న యూదుల కోసం ‘నేషనల్ హోమ్’ ను ఏర్పాటు చేస్తామని బల్ ఫోర్ లో ప్రకటించారు. అప్పటికి పాలస్తీనాలో యూదుల ఎనిమిది శాతం మాత్రమే. ఈ ప్రకటనకు కారణం యూదులకు, అరబ్బులు మధ్య తగాదాలు పెట్టడమే. విభజించు పాలించు అన్న బ్రిటన్ రాజనీతి సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత పాలస్తీనాలో యూదుల సంఖ్యని పెంచడానికి ప్రపంచంలో చెల్లా చెదురై ఉన్న యూదులను పాలస్తీనాకు తరలించడం మొదలు పెట్టింది. ఆర్ధికంగా, సాంస్కృతికంగా బలంగా ఉన్న యూదులు రావడంతోనే అరబ్బులను అణగదొక్కడం ప్రారంభించారు. దానితో 1920, 1929, 1933, 1936 లలో యూదుల వలస ఆగిపోవాలని, పాలస్తీనా ప్రజలకు స్వాతంత్య్రం కావాలని ప్రజలు ఉద్యమించారు.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ ప్రాంతం అమెరికా ఆధీనంలోకి వెళ్ళింది. 1947లో ఐరాస ప్రత్యేక కమిటీ పాలస్తీనాను రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. 32 శాతంగా ఉన్న యూదులకు 56 శాతం భూభాగాన్ని కేటాయించారు. 68 శాతంగా ఉన్న అరబ్బులకు 42 శాతం భూభాగాన్ని కేటాయించారు. పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని ఉంచుకోడానికి, రాజకీయంగా తన ప్రయోజనాలకు అనుగుణంగా ఈ తీర్మానాన్ని ఐరాసలో ఆమోదింపచేసింది. 1930 లో పాలస్తీనా జాతి నిర్మూలనకు ప్లాన్ దలెత్ అనే ఒక రహస్య ముఠాను ఏర్పాటు చేశారు. పాలస్తీనాను ఏర్పాటుకు రెండు నెలల ముందు డేవిడ్ బెన్ గురియన్ నాయకత్వంలోని యూదు దురహంకార నాయకులు దీనికి ఒక రూపునిచ్చారు. పాలస్తీనా గ్రామాలను బాంబులతో నేలమట్టం చేసి, ప్రజలను కొల్లగొట్టారు. మనుషులను అత్యంత పాశవికంగా హతమార్చారు. ” ప్రతి ఒక్కదాడి కూడా ఆక్రమణ, విధ్వంసం, అరబ్బుల బహిష్కరణతోనే ” పూర్తికావాలని గురియన్ ఆదేశించాడు. 

1948 లో ఇజ్రాయిల్ ఏర్పడటంతోనే పాలస్తీనా మీద దాడులు చేయటం మొదలుపెట్టింది. 7 లక్షలకు పైగా పాలస్తీనా ప్రజలను నిర్వాసితులను చేసింది. వీరంతా  శరణార్థులుగా మారి తమ నేల కోసం పోరాటం చేస్తున్నారు. ఆలా గత 70 ఏళ్లుగా ఇజ్రాయిల్ పాలస్తీనాను క్రమంగా దురాక్రమిస్తూనే ఉంది. పాలస్తీనా ప్రజలు తమ స్వంత నేల కోసం పోరాడుతూనే ఉన్నారు.  అక్కడ ఒక అరబ్బు వ్యతిరేక కూటమి ఉండటం అనేది అమెరికాకు అవసరం కాబట్టి ఇజ్రాయిల్ కు మద్దతు ఇస్తుంది. 

ప్రపంచమంతా కూడా ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తుంటే అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. అందులోనే ట్రంప్ తరువాత అధికారంలోకి బైడెన్ వచ్చిన తరువాత పరిస్థితిలో మార్పు వస్తుందని చాల మంది ఊహించారు. కానీ తమ పౌరుల రక్షణ కోసం ఇజ్రాయిల్ తీసుకునే అన్ని చర్యలను అమెరికా సమర్దిస్తుందని వైట్ హౌస్ ప్రకటంచింది. ఇంతకముందు ఇజ్రాయిల్ లో రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు ట్రంప్  అమెరికా సంబంధాలు ఇజ్రాయిల్ తోనే  అని, వ్యక్తులతో కాదు అన్నాడు. అలాగే అమెరికా లో కూడా అధికారంలో ఎవరున్నా అది అక్కడి పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది.  ఈ యుద్ధంలో ప్ర‌పంచ మాన‌వాళి, ప్ర‌జాస్వామిక‌శ‌క్తులు పాల‌స్తీనా ప‌క్షాన మొద‌టి నుంచీ నిల‌బ‌డ్డాయి.  పాల‌స్తీనా ప్ర‌జ‌లు త‌మ మాతృభూమిని సొంతం చేసుకొనేదాకా, వాళ్లు విజ‌యం సాధించేదాకా మ‌న మ‌ద్ద‌తు కొన‌సాగాల్సిందే. పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డ‌మంటే    సామ్రాజ్యవాద వ్య‌తిరేకంగా మ‌న‌మూ పోరాడుతున్న‌ట్లే. 

Leave a Reply