చిటుక్కుమని గండు చీమ 
మామిడి ఆకు తొడిమ కొరికిన సడి 
ఎంత గట్టిగా వినబడిందో


టేకు ఆకు మొదలుపై వాలిన 
గోరపిట్ట కాలి గోరు శబ్దం 
టిక్ టిక్ మని చెవులని తాకింది 


ఇంతలోనే గాలి మోసుకొచ్చిన 
టకటక బూట్ల శబ్దం ఎత్తుపల్లాల మధ్య 
హోరుగా వినిపిస్తూ ఒక్కసారిగా 
బుల్లెట్ల వర్షం 


మొదలైన యుద్ధం చివరాఖరుకు 
నెత్తుటి ముద్దల విసిరివేతతో 
హాహాకారాల ఆర్తనాదాలమయంగా 
అడవి హోరుపెట్టింది


పుడమి తల్లి గర్భంలో దాగిన‌ 
సంపదను కాపాడుతూ ఒరిగిన 
ప్రాణాలు కొన్ని


ఫాసిస్ట్ కార్పొరేట్‌ దొంగల ఆశలు 
కావలి కాసే ఆకలి కడుపుల 
జీతగాళ్ళ మృతదేహాలు కొన్ని 


నేలపై కారిన ప్రతి రక్తపు బొట్టు 
ఎదురెదురు గుండెల మండే 
కన్నీటి చారికల గాయపడిన 
అమ్మతనం 


పేలిన‌ ప్రతి తూటాకు కళ్ళుంటే
తను వెళ్ళే దిక్కు చూపేది
నోరుంటే సాక్షిగా మారేది!!


(జీరగూడెం ప్రజాప్రతిఘటన యుద్ధానికి స్పందనగా) 

Leave a Reply