ఆ ఒక్క క్షణం కోసం
యుగాలుగ ఎదురుజూసింది
ఆ ఒక్క ఊహ
ఆమెను పసిదాన్ని జేసింది

అల్మయిరాలో
పుస్తకాలు సర్దింది
” మరణాన్ని తిరస్కరిస్తున్నా “
వాక్యాన్నిపక్షిని జేసి
భుజంమీద మోసుకుతిరిగింది..

గుండెనిండా
వసంతాలపొదుముకొని
గిన్నెనిండా
బువ్వవొండుకొని
వొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలని
మొగులుకోసం రైతుజూసినట్టు
బిడ్డడి కోసం తల్లి జూసనట్టు
గేటుకు కళ్ళ నతికించి
ఎంత ఎదురుచూసిందో

అతడురాలేదు
భయపడ్డట్టే జరిగింది
ఊపిరి బిగబట్టే లోపు
ఊపిరాగినంత పనయ్యింది.

ఆమెకూ అతడికీ మధ్య
రాజ్యం..
పూలరెక్కలమీద
బుల్ డోజర్ నడిచింది

మధ్య యుగాలకేసి
ముఖంతిప్పిన కోర్టు
ప్రజలకోసం కొట్టుకునే గుండె
ప్రమాదమన్నది
****
” అమ్మా..ఇక నాయినరాడా? “
మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీ
అంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టి
తెగుతున్న
ఆశల దారాల్ని పేనుతూ
మళ్ళీ
చౌరస్తాలో నిలబడ్దదామె..

యుద్ధ మాగదు..

One thought on “యుద్ధమాగదు

Leave a Reply