కామ్రేడ్ జతీంద్రనాథ్ దాస్ అమర్ రహే

బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అత్యంత ధైర్య సాహాసాలతో పోరాడిన జాతీయ విప్లవకారులలో కామ్రేడ్ జతీంద్రనాథ్ ఒకరు. ఆయన కామ్రేడ్స్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలసి జైలులో అమరణ నిరహార దీక్షకు పూనుకొని 63 రోజుల తరువాత అసువులు బాసాడు. అంతర్జాతీయంగా మార్చ్ 18ని రాజకీయ ఖైదీల దినంగా పాటించడం మూడవ ఇంటర్నేషనల్ ప్రకటించిన విషయం విదితమే. ఆ పరంపరను కొనసాగిస్తూనే వారి త్యాగాల సృతిలో ఖైదీల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 13ను పోరాట దినంగా పాటించడం పరిపాటైంది. భారతదేశ విప్లవోద్యమంలో తమ ఆశయాల సాధనకై పోరాడుతూ జైళ్లలో అసువులు బాసిన వీరయోధులందరికీ పేరు పేరున ముందుగా విప్లవ జోహార్లర్పిద్దాం. వారి ఆశయాల సాధనకై తుదివరకూ పోరాడుదామనీ శపథం చేద్దాం.

మన దేశంలో కొనసాగుతున్న ఫాసిస్టు పాలనలో పౌర హక్కులు హననమవుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా భారత ప్రజలు అసమాన త్యాగాలతో పోరాడిన ఫలితంగా 1947లో జరిగిన అధికార మార్పిడితో 1950లో భారత రాజ్యంగం వునికిలోకి వచ్చింది. ఆ రాజ్యాంగం పౌరులకు పలు ప్రాథమిక హక్కులను హమీ ఇచ్చింది. కానీ, అవన్నీ క్రమంగా హుళక్కి అవుతూ గత 8 సంవత్సరాల హిందుత్వ శక్తుల ఫాసిస్టు పాలనలో భారత పౌరులకు కనీస భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, నిరసన తెలిపే హక్కు కానీ లేకుండా పోయాయి. మోదీ రాజ్యంలో ప్రశ్నించడం తప్పిదమవుతోంది. జుమ్లా పాలనలో న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం నేరమవుతోంది. మరోవైపు మన దేశ పాలకులు ప్రజలను తమ జీవన్మరణ సమస్యల నుండి పక్కదారులు పట్టించడానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలవుతోన్నాయనీ ఆజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుతున్నారు. నిజానికి ఈ వేడుకలు దేశంలోని నిరంకుశ పాలనను, కరుడు గట్టిన హిందుత్వ శక్తుల హింసోన్మాదాలను మరుగున పరచడానికే తప్ప ఇవి ప్రజల నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ఎంతమాత్రం ప్రతీకలు కావనీ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు.

సెప్టెంబర్ 13 జతీంద్రనాధ్ దాస్ (జతీన్ దా 27 అక్టోబర్, 1904- 13 సెప్టెంబర్, 1929) 93వ సంస్మరణ దినం. ఈ రోజు భారత రాజకీయ ఖైదీల విడుదలకు మనమంతా ప్రతిన బూనే దినం. 14 జూన్ 1929 నాడు అనేక మంది తన సోదర విప్లవకారులతో కలిపి జతీన్ దాను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారు. 13 జూలై, 1929నాడు కామ్రేడ్ భగత్సింగ్ నాయకత్వంలో వారంతా తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనే ప్రధాన డిమాండ్ తో ఆమరణ నిరహారదీక్ష ప్రారంభించారు. కానీ, బ్రిటిష్ పాలకులు వారి డిమాండ్ల పట్ల కౄరమైన అణచివేత చర్యలను చేపట్టారు. తుదకు 63 రోజులనంతరం కామ్రేడ్ జతీన్ దా అమరుడయ్యాడు. దానితో పాలకులు దిగివచ్చి వారి డిమాండ్లను ఓ మేరకు ఆమోదించారు. మన దేశంలో అధికార మార్పిడి జరిగి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశంలోని జైళ్ల పరిస్థితులలో మౌలికమైన మార్పులేమీ లేవు. నేటికీ వారు రూపొందించిన మాన్యువల్స్ లలోనే ఖైదీల, విచారణాధీన ఖైదీల జీవితాలు బందీ అయివున్నాయి. వాస్తవానికి దేశమే జైలైన నికృష్ట పరిస్థితులలో మనమంతా జీవిస్తున్నాం.

జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో ప్రకారం 2020 చివరి నాటికి 4.88 లక్షల మంది ఖైదీలతో దేశంలోని 1,339 జైళ్లు కిక్కిరిసి వున్నాయి. వీటి వాస్తవ కెపాసిటీ 4,14,033 కాగా 4,88,511 మంది బందీలుగా వున్నారు. వీరిలో 20 వేలు పై చిలుకు మహిళలున్నారు. 1,427 మంది బాలలున్నారు. వీరిలో విచారణాధీనంలో వున్నవారి సంఖ్య 3,71,848 (76.1%) ఉంది. నిజానికి వీరిని అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. జైళ్లలోని ఖైదీలకు కనీస వసతులైనా కల్పించడం లేదు. అనేక మంది వివిధ రకాల వ్యాధులతో అలమటిస్తున్నారు. సరైన వైద్యం అందని కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. గడచిన 20 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న 1,888 కస్టోడియల్ మరణాలలో 26 మంది సాధారణ పోలీసులను శిక్షించారు. నిజానికి, శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు, విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలకు కూడ మన దేశ రాజ్యాంగం నిర్ధేశించిన సమానత్వం (ఆర్టికల్ 14) స్వేచ్ఛ (ఆర్టికల్ 19), జీవించే హక్కు (ఆర్టికల్ 21) కొన్ని పరిమితులకు లోబడి వర్తిస్తాయి. ఇతర చట్టాలు వారి హక్కులను, జీవితాన్ని, స్వేచ్ఛను కొన్ని నిబంధనల మేరకు మాత్రమే  నియంత్రిస్తాయి.  కానీ, ఇవేవీ వర్తమాన నిరంకుశ పాలనలో చెల్లడం లేదు. ఇందులో భాగంగా ఇటీవలే 9 ఎప్రిల్ 2022 నాడు విప్లవోద్యమ ప్రియతమ నేత కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మల)ను ముంబాయిలోని హస్పైస్ సెంటర్ లోకి నెట్టి హత్య చేశారు. భీమా కోరేగాం తప్పుడు కేసులో ముద్దాయిగా వుండిన ఫాదర్ స్టాన్ సామికి అవసరమైన చికిత్స అందించకుండా గత సంవత్సరం పోలీసులు  హత్య చేశారు. ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తున్న వారిని రాజ్యం హతమార్చడానికి ఇదొక చట్టబద్ద మార్గంగా మారింది. ఈ హత్యలను యావత్ప్రపంచం ఖండించాల్సిన సమయం ఇది. ఇవి రాజ్యం చేస్తున్న హత్యలేననీ దోషులను శిక్షించాలనీ నినదించాల్సిన పరిస్థితులివి.

మన దేశంలోని విచారణాధీన ఖైదీలకు సాధారణ కేసులలోనే బెయిల్ దొరుకడం గగనమవుతోంది. అలాంటపుడు నాసా (1980), టాడా (1985), పోటా (2002), మీసా, ఎస్మా, అఫ్ ప్సా, 1967 నాటి  ఉగ్రవాద నిరోధక చట్టాన్ని అత్యంత నిరంకుశంగా సవరించి 2009లో ముందుకుతెచ్చిన యూ.ఏ.పీ.ఏ (ఊపా) ల కింద అరెస్టు అవుతున్నవారికి కనీసం బెయిల్ కావాలనీ వెంటనే కోర్టుకు వెళ్లడానికే అవకాశాలను లేకుండా చేశారు.  ఈ చట్టాలు కాకుండా రాష్ట్రాలు రూపొందించిన కౄరమైన చట్టాలు అదనంగా వుండనే వున్నావి. తప్పుడు ఆరోపణలపై పోలీసులు భీమా కోరేగాం కేసులో అరెస్టు చేసిన ప్రముఖ న్యాయవాది, కార్మిక సంఘం నాయకురాలు కామ్రేడ్ సుధా భరద్వాజ్ 7 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించిందంటే ఈ దేశ న్యాయ వ్యవస్థలో న్యాయం ఎంతుందో తెలుసుకోవచ్చు! ప్రాసిక్యూషన్ ఆరోపణలకు తలలూపే న్యాయమూర్తులు ఉన్నారనీ విడిగా చెప్పాల్సిన పనే లేదు. 

మన దేశంలో 2010 నుంచి ఊపా కింద 11 వేల మందిపై 816 కేసులు నమోదైనాయి. ఇందులో 65 శాతం కేసులు మోదీ హయాంలోనే నమోదైనాయి. అధికార పక్ష నాయకులను విమర్శించినందుకే 405 మందిపై  (పౌరులు, విపక్ష రాజకీయ నాయకులు, విద్యార్థులు, పాత్రికేయులు, కార్టూనిస్టులు, రచయితలు, ఇతర మేధావులపై) ఈ నిరంకుశ చట్టాన్ని ప్రయోగించారు. 2018-2020 మధ్య దేశ వ్యాప్తంగా 4,690 మందిని ఊపా కింద పోలీసులు అరెస్టు చేశారు. మోదీ హయాంలో  మొత్తంగా 10,552 మందికి  ఊపా సంకెళ్లు బిగుసుకుంటే 253 మందిపై చతురోపాయాలతో నేరాభియోగాలు రుజువుచేసి అనేకమందిని జీవితఖైదు చేశారు. జుమ్లా పాలనలో కేవలం 2019 సంవత్సరంలోనే ఊపా కేసులలో 33 శాతం పెరుగుదల నమోదైందంటే దేశంలో ఎంత తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయో ఊహించుకోవచ్చు. వాస్తవానికి 45 యేండ్ల కిందనే 1977లో జస్టిస్ వీ. ఆర్. కృష్ణ అయ్యర్ ‘బెయిల్ అనేది రూలు, జెయిలు అనేది అసాధారణ పరిస్థితులలోనే అని వ్యాఖ్యానించారు. కానీ, దానిని పాటిస్తున్నదెక్కడా!!

మోదీ పాలన చేస్తున్న ఒక ‘‘మంచి’’ పనేమంటే గతంలో భారత రాజ్యంపై, రాజ్యాంగంపై అనేకమంది మేధావులకు, హక్కుల కార్యకర్తలకు, రాజ్యాంగవేత్తలకు మన దేశ ప్రజాస్వామ్యం పట్ల పట్టరాని భ్రమలుండేవి. వాటన్నింటినీ మోదీ అండ్ కంపెనీ తన ఫాసిస్టు చర్యలతో తునాతునకలు చేసేస్తున్నది. అంతేకాదు, పీడిత, బాధిత సమూహాలన్నీ సమైక్యం కావాలనీ వేగిరపరుస్తున్నది. శహబాస్ మోదీ, శహబాస్!!!

దేశంలోని ఖైదీలకు బెయిల్ దొరుకడమే గగనమవుతుందంటే, బెయిల్ దొరికిన వారిని జైలు నుండి విడుదల కాకుండా, కటకటాల నుండి మోక్షం లభించకుండా పోలీసులు జైలు గేట్ల దగ్గరే అడ్డుకుంటున్నారు. కొత్త కొత్త కేసులను మోపుతూ వారిని పదే పదే నిర్బంధిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎవరికైనా ప్రత్యేక పరిస్థితులలో బెయిల్ మంజూరైనా వారిని అనేక కఠిన నిబంధనల మధ్య కట్టడి చేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వివిధ కేసులలో బెయిల్ లభించినప్పటికీ కామ్రేడ్స్ ఎంజెలా, వరవరరావు, సుధా భరద్వాజ్ లాంటివాళ్లు స్వేచ్ఛగా వుండలేకపోతూ ఆ నిబంధనాలకు బలికాక తప్పడం లేదు. ఈ సమస్యలకు తోడు, ముద్దాయిలకు కోర్టులు శిక్షలు విధిస్తున్నపుడు అన్ని శిక్షలూ ఏకకాలంలో పూర్తయ్యే విధంగా కాకుండా విడివిడిగా శిక్షలు అమలయ్యేలా చేస్తూ జీవితకాలంలో కటకటాల నుండి బయటపడని విధంగా హతమారుస్తున్నారు. ఈ చర్యలన్నీ రాజ్య ఫాసైజేషన్ కు ప్రబల తార్కాణాలు.

ఖైదీలకు అందించే శిక్షానంతర సంరక్షణ (ఆఫ్టర్ కేర్) విషయంలో (అవసరమైనపుడు మాజీ ఖైదీలందరికి సాయం, మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్, సపోర్టుతో పాటు రక్షణను అందించడం, మానసిక, సామాజిక ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తోడ్పడటం, వారిపై సామాజిక కళంకాన్ని తొలగించడానికి సాయపడటం, కుటుంబం, ఇరుగుపొరుగు, వర్క్ గ్రూప్, కమ్యూనిటీలో కలసి పోయెలా చేయడం) మన దేశ పరిస్థితులు ఊహాతీతంగానే వున్నాయి.

2016 తరువాత ఆరేళ్లకు 2022లోనే న్యాయమూర్తుల, ముఖ్యమంత్రుల 39 వ సమావేశం జరిగింది. 25 హైకోర్టుల న్యాయమూర్తులతో పాటు సీజేఐ కూడ ఇందులో పాల్గొన్నాడు.  ఇందులో పాల్గొన్న దేశ ప్రధాని తన సహజ కౌటిల్య శైలీలో ‘‘న్యాయ ప్రక్రియను వేగవంతం చేయండి, దీనితో 3.5 లక్షల విచారాధీన ఖైదీలకు ఊరట లభిస్తుంది’’ అన్నాడు. వీళ్లలో అత్యధికులు పేదలే వున్నారనీ అన్నాడు. న్యాయాలయాల భారాన్ని తగ్గించడానికి మధ్యవర్తిత్వాన్ని కూడ చేపట్టండి అని హితవు పలికాడు. కోర్టులలో స్థానిక భాషలను వాడాలన్నాడు. న్యాయం ప్రజలకు తెలువాలట! నిజమే మరి! తెలువడం ద్వారానే న్యాయాలలో జరుగుతున్న అన్యాయం బయటపడుతుంది. ఇక ఎక్కడైనా తన వ్యాపార బుద్దిని పోనివ్వని మోదీ ఇక్కడ కూడ ఈ-కోర్టు ప్రక్రియ మిషన్ మోడ్లో ప్రవేశపెట్టాడు. వాస్తవానికి కేసుల సత్వర పరిష్కారం అనేది రాజ్యాంగంలోనే రాసి వుంది.  కానీ దానికి ప్రభుత్వాలు అవకాశాలే ఇవ్వడం లేదు. అందుకే సీజేఐ నిష్టూరంగానే అయినప్పటికీ నిజం వెల్లడించక తప్పలేదు. ఆయన దీర్ఘకాల కేసులకు ప్రభుత్వంతో పాటు, అధికారుల నిర్లక్ష్య వైఖరిదే సగం బాధ్యత అన్నాడు.

జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్థి నటాషా నర్వాల్,  దేవాంగణా కలిత, జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ లకు 2021 జూన్ మొదటివారంలో డిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిరసన తెలుపడం పౌరుల ప్రాథమిక హక్కనీ, వారిని ఉగ్రవాదులుగా చిత్రించడం సహేతుకం కాదనీ ఇలాంటి చట్టాలు వారిపై ప్రయోగిస్తారా అని న్యాయమూర్తులు పోలీసులను ప్రశ్నించారు. దీనిపై కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లగా మేం జోక్యం చేసుకోమని కోర్టు తేల్చిచెప్పింది. మరోవైపు భారత న్యాయ వ్యవస్థలోజమానతు ఇచ్చే విషయంలో విడిగా ఎలాంటి చట్టాలు లేవు. బెయిల్ పిటిషన్ లను పరిష్కరించ డానికి ఎలాంటి సమయబద్దత లేదు. దీనితో 11 జులై 2022 నాడు సుప్రీం కోర్టు కేంద్రాన్ని బెయిల్ ఆక్ట్ తయారు చేయాలని సిఫారస్ చేసింది. కానీ, ఆ సిఫారసు బుట్టదాఖలా కాకతప్పదనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. గత కొద్ది సంవత్సరాలుగా మన దేశంలో నిరంకుశ చట్టాలను ముఖ్యంగా రాజద్రోహ చట్టం 124-ఏ ను రద్దు చేయాలనీ సీజేఐ తో సహా అనేక సంస్థలు, వ్యక్తులు ఉద్యమిస్తున్నారు. కాలం చెల్లిన 1800 చట్టాలను మోదీ రద్దు చేశాడు కానీ, 124-ఏ ను మాత్రం తొలగించలేదు. ఉపాపై వాజ్ పేయి 1967లో దేశ ప్రజలలో నమ్మకం కోల్పోయిన గుప్పెడు మంది ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారనీ విమర్శించాడు. కానీ వాళ్లు అధికారానికి వచ్చిన తరువాత దానిని విచ్చలవిడిగా ప్రతీకార చర్యలలో భాగంగా దుర్వినియోగం చేస్తున్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాలను  అనుసరించే ఏ రాజ్యం కూడ నిరంకుశ చట్టాలను రద్దు చేసి ప్రజలకు ఒక్క క్షణమైనా పరిపాలనను అందించలేదనీ ప్రపంచ ఆర్థిక, ద్రవ్య సంక్షోభమే హెచ్చరిస్తున్నది. కానీ, సంక్షోభాల తీవ్రత ప్రజలను పోరాటాలకు అనివార్యం చేస్తున్నది. ఎంతటి నిరంకుశ చట్టాలనైనా ప్రజలు ప్రతిఘటిస్తూ విప్లవిస్తారనీ మన దేశ వర్తమాన పరిస్థితులే నిరూపిస్తున్నాయి. అందుకు నిన్న విజయం సాధించిన భారత రైతాంగ పోరాటం, నెలల తరబడిగా సాగుతున్న నేటి భారత మూలవాసీ ప్రజల పోరాటాలే అనుపమానమైన ఉదాహరణలు.

ఇటీవలే ముగిసిన మ్యునిచ్ జీ 7 దేశాల సదస్సులో వాచాల మోదీ వాక్ స్వాతంత్ర్యం గురించి గంభీర వుపన్యాసం దంచాడు. తన దేశ పౌరులకు ఆ స్వేచ్ఛ దక్కేట్టు చేయడానికి కట్టుబడి వున్నామని హామీ ఇచ్చాడు. కానీ ఆయన ఉపన్యాస ధ్వని తరంగాలు ఖండాతరాలు ఛేదించకముందే దేశంలో పెద్ద ఎత్తున అరెస్టు పరంపర వెల్లువెత్తింది.  ప్రముఖ సామాజిక కార్యకర్త గుజరాత్ బాధితుల పక్షాన నిలిచిన తీస్తా సెతల్వాడ్ ను జూన్ 25నాడు ముంబాయిలో గుజరాత్ ఆంటీ టెర్రరిస్టు స్క్వాడ్ నిర్బంధంలోకి తీసుకుంది.  గుజరాత్ లో చోటుచేసుకున్నమత ఘర్షనల మారణకాండలో భాగంగా గుల్బర్గ్ సొసైటీలో 28 ఫిబ్రవరి 2002న హిందుత్వ శక్తుల దాష్టీకానికి సజీవంగా మంటలపాలైన 68 మందిలో ఒకరైన మాజీ ఎం.పీ. ఎహసాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ దోషులను శిక్షించాలనీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసిన మర్నాడే సెతల్ వాడ్ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఆమె, ఆమె నడుపుతున్న ‘‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’’ స్వచ్ఛంధ సంస్థ జాకియాకు అండగా నిలిచాయి. జాకియా పిటిషన్ కు అసలు విచారణార్హతే లేదని కోర్టు తేల్చివేసింది.  అదే  సందర్భంగా తీస్తా సెతల్వాడ్ 2006 నుంచి అగ్గి రాజేసే ప్రయత్నం చేసిందంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం క్రూర పరిహసం తప్ప మరేం కాదు. ఆమె బాబ్రీ మసీదు కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకించిన జర్నలిస్టు. ‘కమ్యూనలిజం కంబాట్’ అనే పత్రికను నడుపుతున్నది. అందుకే ఆమె మోదీ అండ్ కంపెనీకి కంటిలో నలుసైంది.

మారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని అతిక్రమించిన ఆరోపణలపై 2022 జులై మొదటివారంలో సుప్రీం కోర్టు ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ కు రూ. 51.72 కోట్ల జరిమాన విధించింది. ఆ సంస్థ మాజీ సీఈఓ, హిందుత్వ శక్తులకు సుతారమూ గిట్టని ఆకార్ పటేల్ కూడ రూ. 10 కోట్లు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా వాస్తవాలను తేల్చి చెప్పే ఆల్ట్ న్యూస్ ఆద్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ. 2 లక్షల మేర విరాళాలు అందాయనీ పోలీసులు ఆరోపించారు. ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడైన మహమ్మద్ జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్ పై జూన్ 27న అంటే నాలుగేళ్ల తరువాత దిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నూపూర్ శర్మ సహ అనేక మంది సాధువులు దేశంలో విద్వేషాన్ని విస్తరింపచేస్తున్నారని జుబైర్ విమర్శించడంతో ఆయనపై నాలుగేళ్లనాటి కేసును ముందుకుతెచ్చారు. అదే విధంగా ఝార్ఖండ్ లో మూలవాసుల పక్షాన నిలిచిన స్వతంత్ర పాత్రికేయుడు రూపేశ్ కుమార్ ను మావోయిస్టులతో సంబంధాలు వున్నాయనీ అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు దంతెవాడ జిల్లా గొంపాడులో పోలీసులు 16 మందిని హత్య చేసి మావోయిస్టులుగా ఆరోపించడంపై దర్యాప్తు జరుపాలనీ సుప్రీం కోర్టును కోరిన ఆదివాసీ మిత్రుడు , ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్ ఆరోపణలు ఉత్తవేనని పోలీసుల చార్జ్ షీటుతో వెల్లడైందనీ, ఇలాంటి తప్పుడు ఆరోపణలతో కోర్టుకెక్కకూడదనీ సుప్రీం కోర్టు ఆయనకు రూ. 5 లక్షల జరిమానా విధిస్తూ చెల్లించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలనీ చెప్పి న్యాయాన్ని ఖూనీ చేసింది.  నిజానికి గత 17 సంవత్సరాలలో ఆయన బస్తర్ డివిజన్ లో జరిగిన పోలీసుల అరాచకాలపై దాదాపు 517 ఆరోపణలు కోర్టు దృష్టికి తీసుకువెళ్లాడు. వాటిలో ఏ ఒక్కటీ నిరాధారమైనవి కావు, సరకదా, అవన్నీ వాస్తవాలేనని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. కానీ, ఇపుడు మన దేశ అత్యున్నత న్యాయస్థానం కనీస దర్యాప్తైనా జరుపకుండానే పోలీసుల చార్జీషీటును ప్రామాణికంగా పరిగణించి వాస్తవాలను పరిశీలించండనీ కోరిన వారికే శిక్ష విధించడం దేశంలో తీవ్రతరమవుతున్న అసహిష్ణుత, కక్ష సాధింపు రాజకీయాల వ్యక్తీకరణే తప్ప మరేం కాదు.

జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలీద్ ను, శాహీన్ బాగ్ కేసులో సెప్టెంబర్ 2020లో అరెస్టు చేశారు. అతనికి వరుసగా బెయిల్ నిరాకరించబడుతోంది. నిజానికి ఉపాలో కూడ ఇలా చేయకూడదు. కాకపోతే ట్రయల్ నడిపించి శిక్షించివచ్చు. ఆయన కోర్టుకు ఇచ్చిన స్టేట్ మెంట్లో ‘జుంలా’ అనే పదం వాడాడు. అదేం తప్పు కాదు. మోదీ-షాల పాలనకు మన దేశంలో అది పర్యాయపదమైంది. ముద్దాయిలు కోర్టులలో ఏ భాష వాడాలో డిక్షనరీ తయారు చేసిందేమీ లేదు. తుదకు రాజద్రోహం సుప్రీం కోర్టు పరిశీలనలో వున్నందున తాము బెయిల్ ఇవ్వకూడదన్నారు. నిజానికి చట్టసభలలో వాడకూడని పదుల కొద్ది పదాలు వాడి సభా మర్యాదలకు శాసన నిర్మాతలు భంగం కలిగించడం చూస్తున్నాం. ‘‘బాల్ బుద్ది, ఎబ్యూజ్డ్, తానాషాహీ, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, ఎషేండ్, బిట్రేయ్డ్, కరప్ట్, డ్రామా, ఇన్ కాంపిటెంట్, అనార్కిస్ట్, శకుని, డిక్టెటోరియల్, కోవిడ్ స్ప్రెడర్, వినాశ్ పురుష్, స్నూప్ గేట్, జుమ్లాబాజీ, హిపోక్రసీ, ధోఖా, దొహరా చరిత్ర్, లాలీపాప్, విశ్వాస్ ఘాత్, సంవేధన్, హీన్, బెహ్రీ సర్కార్, గిర్గిట్ , గూన్స్, ఘడియాలీ ఆంసూ, అపమాన్, అసత్య, అహంకార్, ఖరీద్ ఫరోక్త్’’ లాంటి అనేకపదాలు నిషేధం. కానీ అఖాడాగా మారిన మన దేశ పార్టమెంట్ లో ఏ పార్లమెంటేరియన్ నోటినుండైనా ఇవి వెలువడకుండా మాటే పెకలదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

గుజరాత్ విధాన సభ సభ్యుడు జిగ్నేష్ మేవానీని ఎప్రిల్ చివర అరెస్టు చేశారు. ప్రధానిని దుర్భాషలాడిండని అసోం లోని కోక్రాఝార్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. డ్యూటీలో వున్న మహిళా పోలీసు అధికారితో అసభ్యంగా మాట్లాడిండని రెండవ దఫా అరెస్టు చేస్తే బెంగాల్ లోని బార్ పేట న్యాయమూర్తి ఆయన అరెస్టును ఖండించి బెయిల్ ఇచ్చాడు. కానీ ఆ తరువాత మెవానీ సహ 9 మందికి 2017జులైలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆజాదీ మార్చ్ నిర్వహించారనీ శిక్షలతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. ఇవి రాజకీయ  కక్షలకు చక్కని నమూనా. ఆప్ నేతలను విమర్శిస్తే పంజాబ్ లో పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేస్తున్నారు. మమతా బెనర్జీ పోలీసులు కూడ ఈ విషయంలో వెనుకపడి లేరు. ఉత్తర ప్రదేశ్ లో నైతే ఏకంగా దేశద్రోహంతో పాటు క్రిమినల్ కేసులే పెడుతున్నారు. అధికారానికి దాసోహం అయి వుండాలనే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. పాలకులంతా ఒకే తాను ముక్కలు. వీరి అరెస్టులకో, శిక్షలకో జడుసుకునే రోజులు పోతున్నాయనీ పెరుగుతున్న ప్రజా పోరాట చైతన్యం స్పష్టం చేస్తున్నది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లో ముందస్తు అనుమతి వుంటేనే ర్యాలీలు నిర్వహించాలనీ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసింది. కానీ, మూలవాసీ ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఏ తాఖీదులు వుద్యమించే ప్రజలను భయపెట్టలేవనీ నిరూపిస్తున్నారు.    

భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అతి పెద్ద కేసుగా వున్న పార్వతీపురం కుట్ర కేసును మించి 10 వేల పేజీల చార్జిషీటును భీమా కోరేగాం కేసులో దాఖలు చేశారు. నిరాధారమైన ఆరోపణలతోనే అనేక మందిని అరెస్టు చేశారు. 60 సార్లు బెయల్ కోసం సుధా ప్రయత్నం చేసింది. అత్యంత హస్యాస్పదం, జుగుప్సాకరమైన విషయమేమంటే ఉత్తర ప్రదేశ్ లో హథ్ రాస్ కేసు కవరేజికి వెళ్లిన కప్పన్ అనే పాత్రికేయుడిని, అతడికి ఘటన వివరాలను అందిస్తున్న ఇద్దరు యువకులను ఉపా కింద అరెస్టు చేశారు. వోలా అనే కారు డ్రైవర్ను కూడ జైలు పాలు చేశారు.  వీటికి వ్యతిరేకంగా గళం విప్పడం నేటి భారత పౌరుల ప్రథమ కర్తవ్యంగా మారింది. వాస్తవానికి మన దేశంలో  43 శాతం ఎంపీలు, 30 శాతం ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగినవారు అని అనేక కమిటీలలో సభ్యుడిగా వున్న మజీర్ హుస్సేన్ అన్నాడు. ఝార్ఖండ్ రాష్ట్రంలో 74 శాతం ఎమ్మెల్యేలకు నేర చరిత వుంది. ముందు వీరందరిని విచారించి శిక్షించాల్సిన అవసరం వుంది. కానీ, వర్గ పాలనలో వర్గాతీత న్యాయాన్ని ఆశించలేం.

1996లో కశ్మీర్ లో అరెస్టు చేసిన కశ్మీరీ యువకులు మహమ్మద్ అలీ భట్, లతీఫ్ అహ్మద్ వజా, మీర్జా నిస్సార్ హుస్సేన్ లను 23 యేళ్ల తరువాత నిర్ధోషులుగా విడుదల చేశారు. కానీ అన్ని సంవత్సరాలు వారి జీవితాలను ఛిద్రం చేసిన రాజ్యాన్ని శిక్షించేదెవరు? అయితే, ఆ రోజులు ఇంకా చెల్లవనీ పురోగమిస్తున్న ప్రజా వుద్యమాలు, సచేతనులవుతున్న ప్రజలు చాటుతున్నారు. వారి స్వరాలు ఖండాంతరాలకు విన్పిస్తున్నాయి. ‘ఫ్రీ ఇడిమె’ అంటూ ఈ రోజు ప్రపంచం నినదిస్తున్నది. తత్పర్యవసానంగా, గత సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినం నాడు పోలీసులు దంతెవాడ జిల్లాలో ఇడ్మే మడ్కంను అక్రమంగా అరెస్టు చేయడాన్ని అంతర్జాతీయంగా నే యూ.ఎన్. నిపుణులు (మేరీ లాలర్, ఎలీనా స్టేయినెర్టే, ఇరీనీ ఖాన్, క్లిమెంట్ న్యాలెట్సొస్సీ, ఫియోన్నుల ని ఓలెయిన్, డుబ్రెవ్కా సిమొనోవిక్, ఎల్జబెత్ బ్రొడరిక్) తప్పు పట్టారు. ‘‘మానవ హక్కుల కార్యకర్తలను నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు. శాంతియుత నిరసనలను ఉగ్రవాదంతో ముడి పెట్టి ఉగ్రవాద నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’’అని వారు పేర్కొన్నారు. 2017లో సుక్మా జిల్లా బుర్కపాల్ లో మావోయిస్టు లు జరిపిన ఒక దాడిలో 25 మంది పోలీసులు మరణించిన కేసులో 121 మంది గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేసి 5 యేళ్లు జైలులో నిర్బంధించారు. కానీ, ఇటీవలే వారంతా నిర్ధోషులనీ కోర్టు వారిని విడుదల చేసింది. దానితో ఆ ప్రాంతంలో పని చేస్తున్న మూలవాసుల పోరాట సంస్థలు వారందరికి ఏటా రెండు లక్షల రూపాయల చొప్పున తలా రూ. 10 లక్షల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలనే ఆందోళనకు పూనుకోవడం అభినందనీయం. సీతల్వాడ్ అరెస్టును ఖండిస్తూ జె.ఎన్.యూ.టీ.ఏ ఆమె విడుదలను డిమాండ్ చేసింది. జంతర్ మంతర్ వద్ద అనేక మంది ప్రజాహిత బుద్ది జీవులు ప్రదర్శన జరిపి ఆమెతో పాటు పోలీసు అధికారి శ్రీకుమార్ ను , సంజీవ్ భట్ట్ ను విడుదల చేయాలనీ కోరారు. వాళ్లకు అండగా నిలువాలనీ జె.ఎన్.యూ.టీ. ఏ. ప్రజలను కోరింది. మరోవైపు హిమాంశు కుమార్ ను శిక్షించడం అన్యాయమనీ జంతర్ మంతర్ వద్ద వందలాది ప్రగతిశీల కార్యకర్తలు, మూలవాసీ పోరాటకారులు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. జుబేర్ అరెస్టును ఖండిస్తూ దేశం గళం విప్పింది. ఇటీవలే ఆగస్టులో పంజాబ్ లో జరిగిన ఏపీడీఆర్ కన్వెన్షన్ లో పాల్గొన్న పీ.యూ.సి.ఎల్., సీ.ఆర్.పీ.పీ., అసంసోల్ పౌర హక్కులు మరియు ఖైదీల కమిటీలు రాజకీయ ఖైదీల విడుదలను డిమాండ్ చేశాయి. ఇలాంటి స్వరాలను, నిరసనలను, పోరాటాలను మరింత తీవ్రం చేయాలి.  లేనిచో దినదినం ఆర్థిక, రాజకీయ సంక్షోభాలలో కూరుకుపోతున్న దోపిడీ పాలకవర్గాలు తీవ్రం చేసే అణచివేత చర్యల నుండి ప్రజలు తమ హక్కులను, అధికారాలను కాపాడు కోలేరని పరిస్థితులు హెచ్చరిస్తున్నవి.

93 సంవత్సరాల క్రితం కామ్రేడ్ జతీన్దా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడితే, ఈరోజు మనం అనేక సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తోంది. మన దేశంలో ఈనాడు దానితో జత కట్టిన హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా కూడ పోరాడక తప్పని పరిస్థితులు నెలకొన్నవి. సామ్రాజ్యవాదులు ప్రత్యక్షంగా యుద్దానికి కాలుదువ్వి వుక్రెయిన్ లో లక్షన్నర ప్రజలను బలి తీసుకున్న నూతన పరిస్థితులలో మనమున్నాం. దేశంలో ఇప్పటికే ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలిచిన కామ్రేడ్స్, మితృలు వరవరరావు, ఆనంద్ తేల్తుంబ్డే, వర్నన్ గొంజాల్విస్, అరుణ్ ఫరేరా, సుధా భరద్వాజ్, సోమా సేన్, మహేశ్ రావుత్, సుధీర్ దావ్డే, సురేంద్ర గడ్లింగ్, హానీ బాబు, సాగర్ గోర్కీ లాంటి అనేక మందిని ప్రభుత్వం కటకటాల వెనుక బందించిన వైనం చూశాం. ఇపుడు సీతల్వాడ్ నుండి హిమాంశు కుమార్ వరకు చేపట్టిన రాజ్య ప్రతీకార చర్యలనూ చూశాం. మరో విడుత దేశంలో పెద్దఎత్తున ప్రగతిశీల శక్తులను అరెస్టు చేయడానికి ఎన్.ఐ.ఏ సిద్దమవుతున్నది. వాటిని మనమంతా గట్టిగా ప్రతిఘటించాలి. మన కోసం ప్రపంచ విప్లవ శక్తులు, కార్మిక సంఘాలు తమ సంఘాభావాన్ని అందిస్తున్నవి. వారు 90 శాతం వికలాంగుడైన కామ్రేడ్ సాయిబాబాను విడుదల చేయాలనీ చాల కాలంగా నినదిస్తున్నారు.  ఇది విప్లవాల తొలి సంధ్యాకాలం.  విప్లవ మార్గం చాలా కఠినమైనదే. కానీ విప్లవిస్తే విజయం మనదే. ఏ చట్టాలు, ఏ జైళ్లు, శిక్షలు, ఉరిశిక్షలు వుద్యమాలను నిరోధించలేవనీ చరిత్రలో నిరూపించింది.

Leave a Reply