1. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని  కోస్తా ఆధిపత్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ప్రతి పక్షాలు  మద్దతు ఇస్తున్నాయి. దీనిని ఎట్లా చూడాలి?

జవాబు: మేం ఆ డిమాండ్ ను అప్రజాస్వామికమైనదిగా పరిగణిస్తున్నాం. అయితే, గత ప్రభుత్వ ఆ నిర్ణయపు తప్పొప్పులకు అన్నీ రాజకీయ పార్టీలూ బాధ్యులే. అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆర్ పి పార్టీ ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.  అందువల్ల  ఆపార్టీ  గతంలో తాము అమరావతి రాజధాని ప్రతిపాదనకు మద్ధతునివ్వడం తప్పని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సంబంధిత ప్రజలను చర్చలకు పిలిచి సముచిత నష్టపరిహారం ఇవ్వాలి. రాజకీయ చదరంగంలో ప్రజలని, వారే పార్టీ వారైనా పావులను  చేయడం అన్యాయం. అమరావతీ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధిలో ఇతర ప్రాంతాలకు న్యాయమైన వాటా ఇవ్వడం సమంజసమని అంగీకరించాలి.    

2. ఉమ్మ‌డి రాష్ట్రం విడిపోయిన‌ప్ప‌డు ఏపీ రాజ‌ధానిని క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌ని  రాయ‌లసీమ వాళ్లు డిమాండ్ చేశారు. అదంతా ప‌క్క‌కుపోయి అమ‌రావ‌తి రాజ‌ధాని అనే ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఇప్ప‌డు మూడు రాజ‌ధానులు అంటున్నారు. దీన్నంతా రాయ‌ల‌సీమ వైపు నుంచి మీరు ఎలా చూస్తున్నారు? 

జవాబు:  మేమైతే దీన్ని రాజకీయ ఎత్తుగడగా భావిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీని దెబ్బతీసే ప్రయత్నమేదప్ప, సీమ పై గల ప్రేమకాదని ఈ ప్రభుత్వ నిర్ణయం స్పస్టం చేస్తున్నది. నిజంగా శ్రీబాగ్ ఒడంబడిక అమలుజేయాలంటే కనీసం పాలనా రాజధానిని  అభివృద్ధి చెందిన విశాఖకుగాక కర్నూల్ కు కేటాయించవలసింది. అంతేగాక, తన అధీనంలో లేని హైకోర్ట్ ను సీమకు కేటాయిస్తూ తన చేతిలో వున్న కృష్ణా యాజమాన్య బోర్డ్ కార్యాలయాన్ని, ఆ నదితో ఏమాత్రం సంభంధం లేని విశాఖకు ప్రతిపాదించడంలోనే ఈ ప్రభుత్వపు అభివృద్ధి వికేంద్రీకరణ విధానపు ఎత్తుగడ అర్థం చేసుకోవచ్చు. ఇదంతా సీమను ఎండమావులవెంట పరిగిత్తేoచేందుకేనని మా అభిప్రాయం. మూడు రాజధానుల నిర్ణయంతో వైఎస్ ఆర్ పి ఒకే  దెబ్బకు రెండుపిట్టల రాల్చిందనుకుంటుంది. తెలుగుదేశం పార్టీకి బలమైన అనుయాయులను దెబ్బతీయడమే గాక, మిగతా రెండు ప్రాంతాల ప్రజల అభిమానం తాత్కా లికంగానైనా చూరగొనింది.     

3. ఇప్ప‌డు తిరిగి తిరుపతి సభలో రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ వ‌చ్చింది. దీని వెనుక ఉన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఏమిటి? 

జవాబు: అమరావతీ రైతుల పాదయాత్ర, సభ, మరియు తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి ప్రజాసంఘాల సమాఖ్య పేరిట జరిగిన సభ-రెండూ తెలుగుదేశం, వైఎస్ ఆర్ పి పార్టీల ప్రాయోజిత కార్యక్రమాలే.

4. ముఖ్య‌మంత్రి వైజాగ్‌లో రాజ‌ధాని అనే నిర్ణ‌యంతో ఉన్నట్లు స్ప‌ష్ట‌మైంది. తాజాగా రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని అనే నినాదం  వెనుక వైసీపీ ప్ర‌భావం ఉన్న‌ట్ల‌నిపిస్తోంది. ఇది ఆ పార్టీకి, ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రం క‌దా? మ‌రి దేనికి ఇది ముందుకు వ‌చ్చింది?  దీన్ని కొంద‌రు రాయ‌ల‌సీమ మేధావులు కూడా అందుకున్న‌ట్లు క‌నిపిస్తోంది? దీన్ని ఎలా చూడాలి? 

జవాబు: ప్రత్యేక రాయలసీమ ఏర్పాటవుతే గాని కర్నూల్ లో రాజధాని సాధ్యంకాదు. ఆ విషయంపై ప్రాయోజిత కార్యక్రమంలో పాల్గొన్న మేధావులకూ తెలుసు. ఇప్పటికే అమరావతి ప్రాంత ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న వైఎస్ ఆర్ పి పార్టీ ,రాజధాని కర్నూల్ కు తరలించి విశాఖ ప్రాంత వ్యతిరేకతను మూటగట్టుకునేందుకు సిద్ధపడదు. రాజధాని డిమాండ్, సీమ ప్రజలలో ఆ పార్టీ పట్ల క్రమంగా పెరుగుతున్న అసంతృప్తి వారు నీటికోసం,హైకోర్ట్ కోసం, కెఆర్ ఏంబి కార్యాలయం కోసం చేబడుతున్న ఉద్యమాలను పక్కదారి పట్టించడం, నీరుగార్చడమే  తిరుపతి సభ ఉద్ధేశ్యం. రాజధాని డిమాండ్ బలంగా ప్రజల్లోకి వెళ్ళితే మాత్రం జగన్ ప్రభుత్వం కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. సీమ ప్రజల ప్రాధాన్యత నీటిహక్కు కాబట్టీ రాజధాని డిమాండ్ అంత వేగిరo ఊపందుకోదని  వైఎస్ ఆర్ పి విశ్వాసం. అదీ నిజమే. పోతే, వైఎస్ ఆర్ పి ఎత్తుగడలలో కొందరు మేధావులు భాగస్వాములు కావడం విచారకరం.  

5. ఈ నినాదంతో రాయ‌ల‌సీమ ఓడిపోయే పోరాట మ‌లుపు తీసుకున్న‌ట్లు కాదా?

జవాబు: అలా ఏం కాదు. సమస్యలున్నంత కాలం ప్రజలు పోరాటం జేస్తూనే ఉంటారు. ఏమంటే ప్రజా అసంతృప్తిని నిజాయితీతో నిస్వార్థంగా ఒక సంఘటిత ఉద్యమంగా మలిచే నాయకత్వం గావాలి. గతంలో జరిగిన ఉద్యమాలు చాలావరకు వ్యక్తుల చుట్టూ తిరిగినవే. ఆయా నాయకులు వాటిని తమపదవుల ఆరోహణకు మెట్లుగా వినియోగించుకున్నారు. అందువల్ల, ప్రజలు అంత త్వరలో ఎవ్వరినీ నమ్మే పరిస్థితిలో లేరు. పోతే, తెలంగాణ ఉద్యమ ప్రేరణతో ముందుకువచ్చిన నూతన నాయకత్వం గత దశాబ్దకాలంలో ప్రజల విశ్వాసం చూరగొనింది. ఏ రాజకీయపార్టీ మద్ధతు లేకుండానే వేలాదిమందిని సంఘటితం చేయగలుతుందని “సిద్దేశ్వరం అలుగు ప్రజాశంఖుస్థాపన” కొరకు జరిగిన ఉద్యమం ఋజువుచేసింది.  

6. నిజంగానే రాజ‌ధానిని  ఏర్పాటు చేస్తే   సీమకు ఎంత మేలు జ‌రుగుతుంది?  

     జవాబు: రాజధాని సీమ అస్తిత్వానికి ప్రతీక. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయి. సహజంగానే చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి దోహదం జేస్తుంది. అయితే, సీమ ప్రజల ప్రధాన సమస్య తాగు, సాగు నీరుకై పోరాటం జేయక తప్పదు.  

7.  క‌ర్నూలులో  హైకోర్టు ప్రధాన కేంద్రం (Principle Seat)  ఏర్పాటు,కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటు,రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్న సాగునీటి ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరించాల‌నే డిమాండ్ల భ‌విత‌వ్యం ఎలా ఉండ‌బోతోంది?

     జవాబు: నిజంగానే పైన తెలిపినవే సీమ ప్రజానీకపు అసలు డిమాండ్లు. ప్రాథమికమైనవి కూడా. అందులోనూ ప్రథమ ప్రాధాన్యత సాగునీటి ప్రాజక్టులు. వాటి సాధనకై పోరాటాలు ఉదృతం చేయక తప్పదు.   

8. రాజ‌ధాని పేరుతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల కుమ్ములాటలో మొత్తంగానే  రాయ‌ల‌సీమ ప్ర‌యోజ‌నాల కోసం సాగే ఉద్య‌మం త‌న‌దైన ప్ర‌త్యేక వైఖ‌రిని ఏం చెబుతుంది? 

     జవాబు: రాజ‌ధాని పేరుతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల కుమ్ములాటలో సీమ ప్రజలు భాగం కావద్దని విజ్ఞప్తి జేస్తుంది. అన్నిరంగాలలో ముఖ్యంగా సాగునీటి కేటాయింపులో  తమ వాటాకొరకు పోరాటాలు కొనసాగిద్ధామని కోరుతుంది. 

9. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ధ‌ర్మ దీక్ష‌కు  ఆంధ్రా మేధావుల నుంచి, ఉద్య‌మ‌కారుల నుంచి రాయ‌ల‌సీమ‌కు మ‌ద్ద‌తు వ‌చ్చిందా?  తిరుప‌తి స‌భ త‌ర్వాతి ప‌రిణామాల దృష్ట్యా ఇప్ప‌డు కోస్తా ప్రాంత మేధావుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి మీరు ఎలాంటి సంభాష‌ణ కొన‌సాగిస్తారు?

జవాబు:   ఆ దీక్షకు పలు ప్రజాసంఘాలు మద్ధతు తెలిపాయి. వారికి కృతజ్ఞతలు. రాయలసీమ న్యాయమైన డిమాండ్ల కోరకు మేము జరుపుతున్న పోరాటానికి అన్ని  ప్రాంతాల ప్రజాస్వామ్య మేధావుల మద్ధతు కోరుతున్నాం.  తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం కోసం  జరిపిన ఉద్యమాలకు మేం సంపూర్ణ మద్ధతునిచ్చాo. ఇప్పటికే, తెలుగు ప్రజలు  అభివృద్ధికేంద్రీకరణ ఫలితాలను చూశారు. భవిష్యత్తులో అలా జరగకుండా వుండాలంటే వెనుకబడిన(నెట్టేయబడ్డ) ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నిధుల, నీళ్ళ కేటాయింపులలో ప్రాధాన్యత నివ్వాలి. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలను, మిని సెక్రటేరియేట్లను, బోర్డ్ కార్యాలయాలనేగాక, అసెంబ్లీ సమావేశాలను అన్నీ ప్రాంతాలలో జరపాలి. ఈ వికేంద్రీకరణకై మేము జరిపే పోరాటాలకు అన్ని  ప్రాంతాల ప్రజాసంఘాలతో సమావేశం త్వరలో ఏర్పాటుజేసేందుకు మేము సమాయత్తమవుతున్నాం. 

Leave a Reply