రాచమల్లు రామచంద్రారెడ్డి గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం. సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన ప్రత్యేక ముద్ర వేశారు. విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది. తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.
అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు? ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి? పరిశీలించాలి. విమర్శలో నిక్కచ్చిగా ఉంటాడని ఆయనకు పేరు. కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.
మనం అలవాటుకొద్దీ సాహిత్య విమర్శ అని వ్యవహరించేదానిలో అనేక విభాగాలు ఉంటాయి. దేని గురించి మాట్లాడుతున్నామో తెలిసి ఉండాలి. రారా సాహిత్య విమర్శలోని ఏ విభాగంలో కృషి చేశాడో తెలిసి అంచనా వేయాలి. ఆయనే ప్రవేశ పెట్టిన కొత్తదనం ఏమిటో గుర్తించాలి. దాన్ని మొత్తంగా సాహిత్య విమర్శ చరిత్రలో భాగంగా చూడాలి. రారా అనే కాదు, సాహిత్య విమర్శకుల కృషిని కేవలం వాళ్ల రచనల ఆధారంగానే నిర్ధారించలేం. దాని వెనుక విమర్శా చరిత్ర క్రమం ఉంటుంది. ఎవరినైనా సరే ఆ మొత్తంలో భాగంగా చూసి అంచనా వేయాలి.
అయితే సాహిత్య విమర్శ చరిత్ర కేవలం సాహిత్య చరిత్రకు సంబంధించిందే కాదు. సాహిత్యానికి బైట ఆ భాషా సమాజంలోని రాజకీయార్థిక సాంస్కృతిక పరిణామాలు, మేధో రంగ అన్వేషణలు, సిద్ధాంత కల్పనలు, వివిధ ప్రజా పోరాటాలు, భావజాల సంఘర్షణలు వంటివి ఎన్నో సాహిత్య విమర్శను ప్రభావితం చేస్తాయి. అందుకే సాహిత్య విమర్శ అనేక ఆలోచనా రంగాలకు సన్నిహితంగా ఉంటుంది. మాధ్యమంగా ఉంటుంది. ఇవన్నీ సాహిత్య విమర్శలోని ఒక్కో విభాగాన్ని ఒక్కోలా ప్రభావితం చేయవచ్చు. అందుకే మన సాహిత్య విమర్శలోని అన్ని విభాగాలు ఒకే స్థాయిలో లేవు. విమర్శకులకు పట్టింపు లేక పోవడం వల్లనే ఈ సమస్య తలెత్తలేదు. అనేక ఇతర కారణాలు ఉంటాయి. అందువల్లనే సమాజ చరిత్రలోని ఎత్తుపల్లాలన్నీ ఏదో ఒక రూపంలో సాహిత్య విమర్శ చరిత్రలో కూడా కనిపిస్తాయి. సాహిత్య చరిత్రలాగే సాహిత్య విమర్శ చరిత్ర కూడా సమాజ చరిత్రలో భాగం. ఈ స్థూల ప్రాతిపదికలపై రారా విమర్శను పరిశీలించాలి.
రారా విమర్శ పుస్తకాలు రెండు ఉన్నాయి. ఒకటి సారస్వత వివేచన. ఇది ఆయనే అచ్చు వేసుకున్నారు. రెండోది వ్యక్తి స్వాత్వంత్య్రం-సమాజ శ్రేయస్సు. ఇది మరణానంతరం అచ్చయింది. ఇటీవల యుగ సాహితి, రారా స్మారక సమితి కలిసి ఆయన సాహిత్యాన్నంతా నాలుగు సంపుటాలుగా తీసుకొచ్చాయి. పైన చెప్పిన రెండు సాహిత్య విమర్శ పుస్తకాలను కలిపి సాహిత్య సర్వస్వం రెండో సంపుటంగా తెచ్చారు. సారస్వత వివేచనలో 18 వ్యాసాలు, వ్యక్తి స్వాంత్య్రం-సమాజ శ్రేయస్సులో 44 వ్యాసాలు ఉన్నాయి.
రారా కథలు కూడా రాశారు. కథలు ఎలా ఉండాలని విమర్శ రాశారో అట్లా ఆయన కథలు ఉండవు. చదువుకోడానికి బాగుంటాయి. అంతకుమించి ప్రత్యేకత ఏమీ కనిపించదు. అందువల్ల కూడా విమర్శలోనే ఆయన మిగిలిపోయారు.
0 0 0
రారా ప్రధానంగా 1960లు, 70లలో ఓ పదేళ్ల పాటు గట్టిగా విమర్శ రాశారు. దానికి ముందు వెనుకల కూడా కొంత రాశారు. కానీ ఆయన ప్రధానమైన కృషి అటూ ఇటూగా దశాబ్దంపాటు సాగింది. కంప్లీట్ ఆర్టికల్స్ అనదగిన రచనలు కొన్నే ఉన్నాయి. మిగతా వాటిలో ఏదో ఒక పరిశీలన, వ్యాఖ్య ఉంటుంది. అవీ ముఖ్యమైనవే.
సాహిత్య రచనలోకి సమాచారం రాకూడదనే కచ్చితమైన అభిప్రాయం రారాకు ఉంది. ‘సాహిత్యంలో అనవసరమైన ప్రతి భావమూ సాహిత్య వ్యతిరేకమే. అనవసరమైన ప్రతి మాటా సాహిత్య శతృవే..’ అంటారు. దీన్ని ఆయన సాహిత్య విమర్శలో కూడా పాటించారు. సమాచారం, సిద్ధాంత విషయాల ఊసు చాలా తక్కువగా రారా విమర్శ సాగుతుంది. బహుశా సాహిత్యంలాగే విమర్శను కూడా ఆయన ఒక కళగానే భావించాడనిపిస్తుంది. ఆయన వ్యాసాలు చక్కటి నిర్మాణ సౌష్టవంతో ఉంటాయి. వాటిలో కూడా కళా విలువలను చూడవచ్చు.
విమర్శ అనేది కళగా మొదలై శాస్త్రంగా ఎదుగుతుందనే అభిప్రాయం కొందరిలో ఉంది. అసలు ఏ విషయమైనా కళా? లేక శాస్త్రమా? అనే ఎడతెగని చర్చ గతంలో ఉండిరది. ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు విస్తరించే కొద్దీ ఈ సమస్య చాలా వరకు పరిష్కారమైపోయింది. సాహిత్య విమర్శ నిస్సంకోచంగా శాస్త్రమే. అదీ అనేక ప్రత్యేకతలున్న ఒకానొక సామాజిక శాస్త్రం. కళాత్మకత, కాల్పనికత వల్ల సాహిత్యంగా మారిన వాస్తవికతను విశ్లేషించే పరికరాలు, పద్ధతులు, సిద్ధాంతం ఉన్న సామాజిక శాస్త్రం. అందుకే సాహిత్యాన్ని విమర్శించడమే కాదు, సాహిత్య విమర్శ ఎలా ఉండాలనే చర్చ కూడా సాహిత్య విమర్శలో తప్పనిసరి అవుతుంది.
అయితే రారా దాదాపుగా విమర్శ గురించి ఏమీ రాయలేదు. తెలుగు సాహిత్య విమర్శ బాగాలేదని తీవ్రమైన కోపం ప్రకటించారు. అందులోని చెడు ధోరణులను ఎత్తి చూపించారు. సాహిత్య విమర్శలో ఆయన కొన్ని కర్తవ్యాలను ఎంచుకున్నారు. 1968లో రాసిన ‘విమర్శ’ అనే వ్యాసంలో వాటిని చూడవచ్చు. సాహిత్య విమర్శ అనేది శాస్త్రమని, అది పలానా విధంగా ఉండాలని, లేదా ఫలానా విధంగా ఉండకూడదని సిద్ధాంత స్థాయిలో రారా ఎక్కడా చెప్పలేదు. సాహిత్య విమర్శకులందరూ నేరుగా ఈ పని చేయాలని లేదు. సాహిత్య విమర్శలోని ఏ విభాగంలో, ఏ రూపంలో పని చేసినా.. అది శాస్త్రమనే ఎరుక అవసరం.
సాహిత్య విమర్శ .. శాస్త్రస్థాయిని అందుకోడానికి దోహదపడగల కొన్ని భావనలను రారా ప్రవేశపెట్టారు. అయితే దాన్ని ఆయన శాస్త్రమని ప్రత్యేకంగా అనుకోలేదు. ఆయన సాహిత్య విమర్శలోని పరిమితులను ఎవరైనా చెప్పదలిచితే ఈ పాయింటు దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ విషయం దానికదే లోపం కాకపోవచ్చు. కాకపోతే విమర్శ అనేది శాస్త్రమని అనుకోకపోవడం రారాలో ఆధునిక దృక్పథ పరిమితిగా తయారైంది. ఈ పరిమితిని అంచనా వేయకుండా ఆయన సాహిత్య విమర్శను నిక్కచ్చిగా అంచనా వేయడం కుదరదు.
0 0 0
రారా విమర్శ ఎక్కువగా సాహిత్య రచనల విశ్లేషణగా సాగింది. టెక్స్ట్‌ను పరిశీలించడం సాహిత్య విమర్శలో ఒక ముఖ్యమైన పని. కొన్ని వ్యాసాల్లో ఆ పని ఆయన బాగా చేశారు. అయితే అన్ని వాచకాలను ఒకే పద్ధతితో, స్పూర్తితో చూశారా? అంటే సంతృప్తి కలగదు. విమర్శను శాస్త్రంగా పరిగణించి ఉంటే ఏ వాచకాన్ని పరిశీలించేందుకైనా ఒక పద్ధతి ఉండేది. విమర్శను శాస్త్రం అనుకొని శాస్త్రస్థాయిలో కృషి చేసినంత మాత్రాన విమర్శకులు ప్రతి రచననూ ఒకే స్థాయిలో విశ్లేషిస్తారనే గ్యారెంటీ ఏమీ లేదు. అది పూర్తిగా వేరే సమస్య. విమర్శను శాస్త్రం అనుకోకపోవడం వల్లనే వాచకాలను పరిశీలించడానికి రారాకు ఒక సమగ్రమైన పద్ధతి ఏర్పడలేదు.
రారా కాలానికి మార్క్సిస్టు విమర్శ రంగంలో వాచకాన్ని పరిశీలించే పద్ధతి ఉండేది. అయితే అది బాగా అభివృద్ధి చెందలేదు. రారా ఆ పనిలోకి వచ్చారు. అప్పటి దాకా లేని ఫోకస్‌ను తీసుకొచ్చారు. ఆ రకంగా ఆయన విమర్శను ముందుకు తీసికెళ్లారు. దీనికి మంచి ఉదాహరణ మహీధర రామ్మోహనరావు కొల్లాయి కట్టితేనేమి నవల మీద చేసిన విశ్లేషణ.
ఇలాంటి రెండు మూడు మినహా రారా విమర్శ ప్రధానంగా శిల్పం మీద సాగుతుంది. ఆయనకు సాహిత్యకత మీద శ్రద్ధ ఎక్కువ. ఆయన విమర్శ రచనలన్నిటిలో ఇది ఒక సాధారణ లక్షణం. బహుశా విమర్శలోకి ఆయన వచ్చేనాటికి శిల్ప చర్చ తగినంత లేకపోవడం వల్ల ఆయన దాని మీద కేంద్రీకరించి ఉండవచ్చు. ఇది సానుకూల అంశం. దేనికంటే సాహిత్య విమర్శలో శిల్ప విశ్లేషణ ఒక ప్రధానమైన అంశం.
శ్రీశ్రీ మీద అద్దేపల్లి రామ్మోహన్రావు రాసిన పుస్తకాన్ని ‘ఆకాశమంత ఎత్తుగా ఉండే అతని..’ అనే పేరుతో సమీక్షించారు. ఇందులో అద్దేపల్లి శ్రీశ్రీ దృక్పథాన్ని పట్టించుకోలేదని గట్టిగా అంటారు. శిల్పంతోపాటు ఇట్లా మిగతా విషయాలను రారా తక్కువగా పట్టించుకున్నారు. అద్దేపల్లి రామ్మోహన్రావు పుస్తకం సందర్భంలో కూడా ఆయన శిల్పం, రూపం, ప్రక్రియా చర్చలోకే వెళ్లి అదెలా లోపభూయిష్టమో వివరించారు. సరిగ్గా ఇలాంటిదే సృజన చలం ప్రత్యేక సంచికపై ‘మహానుభావుడు చలం’ అనే పేరుతో చేసిన విశ్లేషణ.
ఇలా ఇంకొన్ని ఉదాహరణలు చెప్పవచ్చు. ఈ వ్యాసాలు విమర్శకుడిగా రారా ఫార్మేషన్లో కీలకం. ఆ తర్వాత రాసిన వ్యాసాల్లో వీటిలోని మౌలిక భావనలు స్పష్టంగా కనిస్తాయి. ఇంకా బలపడ్డాయి. ఒక రకంగా రారా సాహిత్య విమర్శకు అవే ఆధారం. ఆయన సాహిత్య విమర్శలో మార్క్సిస్టు పద్ధతిని అంచనా వేయడానికంటే ముందు ఆధునికతా పునాదిని పరిశీలించడం ఆసక్తికరంగా ఉంటుంది.
‘సర్వ సాహిత్యానికీ హృదయమే కేంద్రం. హృదయమే ఇతివృత్తం. హృదయమే హద్దు. హృదయాన్ని దాటి, హృదయాన్ని ధిక్కరించి, హృదయాన్ని అథ:కరించిన సాహిత్యమంటూ ఉండజాలదు…’ అంటారు రారా.
ఆధునికులు కవిత్వాన్ని శుద్ధ అనుభూతి వాహికగా ఎంచుతారని నిర్ధారిస్తారు. సాహిత్యం హృదయ వ్యాపారం అనీ, శుద్ధ సాహిత్యమని, శుద్ధ సౌందర్యం అనీ ఎన్నో సందర్భాల్లో సూత్రీకరించారు. వాటిని ప్రమాణంగా చేసుకొని విమర్శ సాగించారు.
రారా ఇక్కడితో ఆగలేదు. నేరుగా రసం దగ్గరికి వెళ్లారు. ‘రసమే కవిత్వ జీవధాతువు. ధ్వని ఎంత ఉన్నా, రసం లేని రచన కవిత్వం కాజాలదు. ధ్వని బొత్తిగా లేకున్నా, రసం ఉన్న రచన కవిత్వం అవుతుంది. రసం ఎంత ఉంటే అంత గొప్ప కవిత్వం అవుతుంది. ఇది ఆధునికుల విశ్వాసం..’ అని నిర్ధారించారు.
నిస్సందేహంగా సాహిత్యం మానవ భావోద్వేగాల మీద కాల్పనికంగా నిర్మాణమవుతుంది. ఇది తెలియకుంటే సాహిత్యంతో వ్యవహరించడం కష్టం. ఈ ఎరుక ఉంటేనే సాహిత్య విమర్శ కూడా ఒక శాస్త్రం అవుతుంది. బహుశా సాహిత్యంలోని ఈ భావోద్వేగ కోణం లేనివారు విమర్శ రంగంలోకి రాలేరు.
కానీ రారా ‘సాహిత్యం హృదయ వ్యాపారం’ అనే మాట ఈ అర్థంలో అనలేదు. లేదా ఆ కాలానికి అంతకంటే ఇంకో మాట ఏదీ దొరకక అలా అనలేదు. వాదనలో భాగంగా ఇలాంటి మాటలు అని వదిలిపెట్టలేదు.
ఇవాళ చాల జాగ్రత్తగా ఆయన విమర్శ రచనలన్నీ పరిశీలిస్తే వాటిలో హృదయవాదం ఒక ధారగా కనిపిస్తుంది. ఆయన సాహిత్య దృక్పథంలో అది ఒకానొక అంశం కానే కాదు. బహుశా అనేక మంది కవిత్వాన్ని, కథలను పరిశీలించడానికి హృదయవాదమే ఆయనకు గీటురాయి. ఆయన ప్రశంసలకు, ఆయన ‘క్రూరమైన’ విమర్శలకు అదే ప్రధానమైన భూమిక.
దీనికి భిన్నమైన పరికరాలను, ప్రమాణాలను ఆయన విమర్శ రచనల నుంచి ఎత్తి చూపవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయి. కానీ పాఠకుడిగా సాహిత్యాన్ని అనుభవించడం, విమర్శకుడిగా అంచనా వేయడం వెనుక ఈ హృదయవాదాన్ని గమనించకపోతే రారాకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. రారా సాహిత్వ సర్వస్వం సంపాదకుడు కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి చాలా స్పష్టంగా ఈ హృదయవాదమే రారా విశిష్టత అని గుర్తించారు. ఎవరమైనా అలాగే గుర్తించి విమర్శనాత్మకంగా అంచనా వేయాలి.
పాఠకుల మీద సాహిత్యం భావోద్వేగపూరిత ప్రభావమే వేస్తుంది. అలా వేస్తేనే అది సాహిత్యమవుతుంది. కాబట్టి సాహిత్యమంటే హృదయ వ్యాపారమని పాఠకులు అనుకోవచ్చు. కానీ మానవ అనుభవం నుంచి, అందులోని భావోద్వేగాల నుంచి వాస్తవికతను, దాని చారిత్రకతను కాల్పనికంగా ఎత్తిపట్టే సాహిత్యాన్ని వివరించే విమర్శకులు కూడా సాహిత్యానికి హృదయమే కేంద్రం అనడానికి లేదు. భావోద్వేగాలను తట్టిలేపే సాహిత్యాన్ని వివరించవలసిన విమర్శకులు హృదయమే సర్వస్వమనుకుంటే వారు విమర్శను శాస్త్రంగా భావించలేదనే అర్థం. కళకు మూలమైన భావోద్వేగాలను, కళాకారుల కాల్పనికతను వివరించడానికి సామాజిక సిద్ధాంత పునాదిని కల్పించ లేదని చెప్పవచ్చు.
హృదయాన్ని రారా ఇంత మితిమీరి కేంద్రం చేసుకోడానికి మూలం ఏమిటో పరిశీలించాలి. సాహిత్యం మానవ చైతన్యరూపమని, సాహిత్యం ఒకానొక సామాజిక, చారిత్రక ఉత్పత్తి అని, మానవ ఆచరణ రూపమని మార్క్సిస్టుల ప్రాథóమిక అవగాహన. రారా సాహిత్య విమర్శలోకి వచ్చేనాటికే ఈ భావనలు ఉన్నాయి. ఆ తరం తెలుగు విమర్శకులు వాటిని యాంత్రికంగా అర్థం చేసుకున్నారా? సమగ్రంగా చూడలేకపోయారా? అనే చర్చ ఎంతయినా చేయవచ్చు. కానీ రారా ఈ మౌలిక భావనలనే తీసుకోలేదు. హృదయవాదాన్ని తయారు చేశారు. ప్రాచీన ఆలంకారికుల రస సిద్ధాంతాన్ని జోడించారు. అట్లని ఆయనకు ఆధునిక దృక్పథం లేదని అనడానికి లేదు. సాహిత్యం ఆధునిక జీవిన విలువలను ప్రేరేపించాలని, శాస్త్ర దృక్పథం లేకుంటే ఆధునిక జీవితం అర్థం కాదని చాలా వివరంగానే అంటారు. గురజాడ మీద రాసిన ‘మహోదయం’లో కేవీఆర్ తెలుగు సమాజంలోని ఆధునికతా క్రమాలను అద్భుతంగా వివరిస్తారు. వాటన్నిటి నుంచి గురజాడ రూపుదాల్చి ఆధునికతా వికాసాన్ని ముందుకు తీసికెళ్లాడని రాశారు. ఈ విషయాలనీ రారా అంగీకరిస్తూనే గురజాడలోని ఆధునికతనంతా కేవీఆర్ గుర్తించారా? అనే సందేహం వ్యక్తం చేస్తారు. ఆధునికత పట్ల రారా పట్టింపు అలాంటిది. సాహిత్యంలో ఆధునికత అనే వ్యాసమే రాశారు.
ఇంతగా ఆధునికతను పుణికిపుచ్చుకున్నా ఆయన అలంకార శాస్త్రాలతో తెగతెంపులు చేసుకోలేదు. సాహిత్యతత్వం, సాహిత్య ఉత్పత్తి గురించిన వైఖరులు సాహిత్య విమర్శలో కీలకం. వీటిని వివరించడానికి రారా అలంకారశాస్త్రాల నుంచి కొన్ని భావనలను తీసుకున్నారు. చివరి దాకా వాటినే వాడుకున్నారు. ఆధునికతను, మార్క్సిస్టు చింతనను అనుసరిస్తూనే సంప్రదాయంతో సహజీవనం చేస్తున్నాననే ఎరుక లేనంతగా ఆయన వాటి ప్రభావంలో ఉండిపోయారు. సాహిత్యకతను, శిల్పాన్ని దీక్షగా పరిశీలిస్తూ సాహిత్యానికి ఉండే సామాజికతను పెద్దగా పట్టించుకోకపోవడానికి కూడా ఇదే కారణం.
సాహిత్యానికి ఉండే సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకు చాలా అవగాహన ఉన్నది. దాని కోసమే విమర్శరంగంలోకి వచ్చారు. ఆధునికత అంటే ఏమిటో తెలిసి ఉండటానికి, దాన్ని తన రంగంలో ప్రవేశపెట్టడానికి తేడా ఉంటుందని రారా నిరూపించారా? అనిపిస్తుంది.
విమర్శలో ఆధునికతను అనుసరించడమంటే సాహిత్యానికి ఉండే సామాజికతకు, సాహిత్యకతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని రారా అనుకోలేదు. సామాజికతను వివరించగల పద్ధతులను తయారు చేసుకోలేదు. అసలు ఒక రచనలోకి సాహిత్యకత కేవలం రచయిత కాల్పనిక శక్తి వల్లనే వస్తుందా? దాన్నీ సామాజికత ప్రభావితం చేస్తుందా? అనే కీలక ప్రశ్నలు అప్పటికే ఉన్నాయి. రారా వాటిని పట్టించుకోలేదు. ఎందుకు ఈ పరిమితి ఏర్పడిందా? లోతుగా పరిశీలించాలి.
ఆయన అలంకార శాస్త్ర పునాదిని వదులుకోకుండానే, విమర్శలోకి కొన్ని ఆధునిక భావనలను బలంగా ప్రవేశపెట్టారు. ఆమేరకు ఆయనకు ఆధునికత అర్థం కాలేదు. విడిగా ఆధునికత అర్థమైనా తన విమర్శ దృక్పథానికి అది మౌలిక ప్రాతిపదిక కాలేదు. సంప్రదాయం నుంచి ఆధునికతకు రాడికల్‌గా షిఫ్ట్ కాకపోవడమే దీనికి కారణం.
ఇదంతా రారా పరిమితిగానే చూడలేం. ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమానికి గతంతో రాడికల్ రప్చర్ జరగలేదు. గతంతో ఏ విషయాల్లో తెగతెంపులు చేసుకోవాలో స్పష్టత సంపాదించుకోలేదు. ఈ పరిస్థితి ఉన్నందు వల్లనే రారా నిస్సంకోచంగా అలంకార శాస్త్ర భావనలను వాడుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధం లేకుండా అకడమిక్ పద్ధతిలో తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ క్రమాన్ని పరిశీలించడంలో చాలా చిక్కులు ఉన్నాయి. అప్పుడది ఎటూ తేలని పండిత చర్చగా మారిపోతుంది.
0 0 0
ఆర్ఎస్ సుదర్శనం సాహిత్య విమర్శ దృక్పథం మీద రారా రాసిన విమర్శలో ఈ ధోరణి బాగా కనిపిస్తుంది. తనలోని సంప్రదాయకతను వదులుకోకుండానే ఆర్ ఎస్ సుదర్శనంలోని సంప్రదాయకతను తీవ్రంగా ఎదుర్కొన్నారు. ఆ విమర్శ వ్యాసానికి మేర మీరిన మేధ అని శీర్షిక పెట్టారు. మేధావి అనే భావనలోనే చాలా చిక్కులు ఉన్నాయి. పైగా దానికి ఒక మేర ఉండటం, దాన్ని మీరడం..! ఇలాంటి విచిత్రమైన సంప్రదాయక ఆలోచనలు రారాలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఆధునిక వైఖరులతో ముడివేసి చెప్తూ పోతుంటారు.
రారా విమర్శలోని ఆధునికతను పరీక్షించానికి రెండు మంచి ఆధారాలు ఆయన రచనల్లోనే ఉన్నాయి. దిగంబర కవిత్వం మీద చేసిన ‘క్రూరమైన’ విశ్లేషణ ఆయన ఆధునిక సామాజిక దృక్పథాన్ని పరీక్షించేందుకు మనల్ని పురికొల్పుతుంది. కవిత్వమంటే హృదయ వ్యాపారమని, శుద్ధ కవిత్వమే సామాజిక ప్రయోజనాన్ని ఉద్దీపింపజేస్తుందని, రసం ఎంత ఉంటే అంతగా కవిత్వం అవుతుందనే ఆయన మౌలిక విమర్శా ప్రమాణాలు దిగంబర కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి అడ్డమయ్యాయి. దిగంబర కవిత్వం వల్ల ‘మనకు రోత కలుగుతుంది. వీళ్ల రచనలు చదివితే అసహ్యం వేస్తుంది. ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ అటవిక ఆవేశమూ, ఆ ఒళ్లెరుగని కుసంస్కారమూ, ఆ నోటి తీటా, ఆ మాటల కంపూ జుగుప్స కలిగిస్తాయి..’ అంటారు.
నిజంగానే ఆయనకు దిగంబర కవిత్వం చదివాక ‘రససిద్ధి’ కలిగి ఉండదు. ఈ ‘లోపం’ వల్ల ఆ కవిత్వపు స్థలకాలాలను, సామాజికతను, చారిత్రక అనివార్యతను రారా గమనించలేకపోయారు. రారాలోని సంప్రదాయకత, దాని నుంచి పుట్టుకొచ్చిన హృదయవాదం దీనికి ఒక కారణం మాత్రమే.
ఇంతకంటే ప్రధానమైంది ఏమంటే.. ఆయనకు తెలుగు సాహిత్యం సాగించిన ఆధునికతా క్రమమే అర్థం కాలేదు. మన సాంఘిక సాంస్కృతిక రంగాల ఆధునికతా ప్రయాణంలోని చిక్కుముళ్లు ఆయనకు తెలియదు. ఆధునికత గురించి స్థూలంగా సవ్యమైన అవగాహనే ఉన్నప్పటికీ మన సమాజ ప్రత్యేకతల్లో అది ఎలా తయారైందీ రారా పట్టించుకోలేదు. అదే విధంగా ఆధునిక రూపమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వల్ల రాజకీయ, ఆర్థిక రంగాలు ఎంత దారుణంగా తయారైందీ సిద్ధాంతపరంగా తెలుసుకోలేకపోయారు. బైటికి కనిపించే వికృత రూపాలను ఆయన గ్రహించకపోలేదు. వాటి గురించి ఆవేదన చెందారు. ఆగ్రహించారు. కానీ దాని సారం తెలుసుకోగలిగే విమర్శనాత్మక ఆధునిక చింతన లేదు. ఆ కాలంలో అలా తప్ప ఇంకో రకంగా ధిక్కారం వెల్లడి కాలేని సామాజిక పరిస్థితి ఉన్నదని తెలిసి ఉంటే దిగంబర కవిత్వం మీద ఆ వైఖరి తీసుకొనే వాడు కాదు.
అంటే రారాకు ఆనాటి సంక్లిష్టమైన సామాజిక పరిణామాలను అర్థం చేసుకొనే దృక్పథ పుష్టి లేదు. సామాజిక చలనాల్లోని ఆధునిక ప్రగతిదాయక అన్వేషణలను పట్టుకోగలిగే గంభీరమైన సిద్ధాంతబలం లేదు. నిజానికి రారా కీలకమైన విమర్శా రచనలు చేసిన కాలం కూడా సుమారుగా అదే. అలాంటి సంక్షుభిత సామాజిక సాంస్కృతిక సందర్భంలో ఒక అవసరం తీర్చడం ఆయన విమర్శలోని సానుకూల అంశం. బహుశా ఆ సామాజిక సందర్భమే ఆయనకు ఒక కంఠస్వరాన్ని ఇచ్చి ఉంటుంది. కాకపోతే ఆ సంగతి కూడా ఆయనకు తెలియకపోవడమే విషాదం. అంతగా ఆయనకు మన సామాజిక పరివర్తనా క్రమం అంతుపట్టలేదు.
దిగంబర కవిత్వం మీద వైఖరిని రారా ఆధునిక దృక్పథానికి కేవలం ఒక లిట్మస్ టెస్టుగా భావించడం సరికాదు. ఏదో ఒకానొక పొరబాటు అంచనా అనకూడదు. కేవలం సాహిత్య హృదయవాదం, రస సిద్ధాంతంపట్ల మొగ్గు ఉన్నందు వల్లే అనుకున్నా సరిపోదు. ఆయన ఆధునిక దృక్పథానికి సరళమైన కాలాన్ని, ఆ కాలపు వ్యక్తీకరణగా వచ్చిన సాహిత్యాన్ని మాత్రమే అర్థం చేసుకోగల శక్తి ఉన్నది. బహుశా ఆయన సాహిత్య సిద్ధాంతంలో ప్రత్యేకంగా పని చేయకపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చు.
విప్లవ కవిత్వం గురించి కూడా రారా ఇలాంటి అభిప్రాయాలే చెప్పారు. వాస్తవాన్ని సవ్యంగా, విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవడం ఆధునిక పద్ధతుల్లో కీలకం. నక్సలైట్ ఉద్యమాన్ని రారా ఎలా అర్థం చేసుకున్నారో చూడండి..‘భారత దేశంలోని పరిస్థితి సాయుధ విప్లవానికి సిద్ధంగా ఉందని చెప్పే పెకింగ్ రేడియో మాటలు నమ్మి రాజకీయంగా అమాయకులూ, అజ్ఞానులూ అయిన యువకులు సాయుధ పోరాటానికి పూనుకున్నారు’ అంటారు. విప్లవ కవిత్వమంటే కొట్టు, నరుకు, చంపు, రక్తం తాగు.. అని 1978లో రారా రాశారు. అప్పటికి శివసాగర్ ఉద్యమం నెలబాలుడు, గెరిల్లా గీతాలు చాలా వరకు వచ్చాయి. గద్దర్, వంగపండు అద్భుతమైన పాటలు వచ్చాయి. చెరబండరాజు, వరవరరావు కవిత్వం వచ్చి ఉన్నది. కవిత్వం ఎలా ఉండాలని శ్రీశ్రీ కొన్ని దశాబ్దాలుగా చెబుతూ వచ్చాడో సరిగ్గా అట్లాంటి కవిత్వం రాయడం ఆరంభించాడు. మరోప్రస్తానం గీతాలు చాలా మటుకు అచ్చయ్యాయి. ఈ కవిత్వాన్నంతా కొట్టు చంపు నరుకు కవిత్వమని రారా నిర్ధారించారు. ఆ కవిత్వంలో కూడా ఆయనకు రససిద్ధి కలగలేదు. ఈ మొత్తంలో ప్రస్పుటంగా కనిపించే రారా రాజకీయ వ్యతిరేకతను తప్పక గౌరవించాల్సిందే. అసలు విషయం ఏమంటే .. మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నమే ఆయనకు అర్థం కాలేదు.
కాళీజీ కవిత్వం మీద కూడా రారా ఇలాంటి వైఖరే తీసుకున్నారు. ఖలీల్ జీబ్రాన్కు కాళోజీ చేసిన అనువాదం గురించి మాట్లాడుతూ ఆయనకు ఇంగ్లీషు రాదని తేల్చేశారు. బహుశా రారా చెప్పినట్లు కాళోజీ అనువాదం బాగా లేకపోయి ఉండవచ్చు. ఆ మాటకొస్తే అనువాద సమస్యలు అనే పుస్తకమే రాసిన రారా చేసిన కొన్ని అనువాదాలు చదవడం కంటే వచ్చిన కొద్దిపాటి ఆంగ్లంతో మూలం చదువుకోవడమే సుఖం అనుకున్నావారెందరో ఉన్నారు. కాళోజీకి ఇంగ్లీషు వచ్చా రాదా అనేది కాదు సమస్య. కాళోజీ కవిత్వం మీద రారా వైఖరి ఖలీల్ జీబ్రాన్ అనువాదం మీద కూడా ప్రసరించింది. ఇది ఆయన విమర్శలోని ఆధునికతను పట్టిస్తుంది.
రారా ఏమంటారంటే..‘ కవిత్వానికి ఆయనకు(కాళోజీకి) ఏనాడూ సంబంధం లేదు. కవులకు సాధారణంగా ఉండే ఆవేశమూ, అర్థ గాంభీర్యమూ, భావుకతా, అంతర్లయా, శబ్దమైత్రీ, శ్రవణ సౌఖ్యమూ మొదలైన మాయమర్మాలేవీ ఎరుగని అమాయకుడు ఆయన. జిత్తులమారి మిత్రులెవరో ఆయన్ను కవిలోకపు ఇంద్రుడవనీ, సాహితీ లోకపు చంద్రుడవనీ పొగిడి ఆయన్నీ రొంపిలోకి దింపినారు..’ అంటాడు.
రారా ‘క్రూర’మైన విమర్శను సరిగ్గా పసిగట్టడానికి ఇదొక మంచి ఉదాహరణ. నిజంగానే ఆయన శుద్ధ హృదయవాద, శుద్ధ సౌందర్యవాద ప్రమాణాలకు లోబడని కవి కాళోజీ. ఇవన్నీ చెప్పి రారాకు వాచకం చదవడం రాదని ఎవరైనా అంటే ఆయనకు తీవ్రమైన అన్యాయం చేసినట్లే. ఆయన టెక్ట్స్‌ను చాలా లోతుగా చూడగలడు. కానీ అందులోని సామాజిక, సాహిత్యకతల సమ్మేళనాన్ని పట్టుకోగలిగే ఆధునిక దృక్పథమే లేదు.
ఇంకో ప్రత్యేకత కూడా రారాలో ఉన్నట్లుంది. ఆయనకు ఆధునిక సామాజిక శాస్త్రాలతో ఎంత పరిచయం ఉందో చెప్పలేం. ఒక రచనను వివరించేటప్పుడు స్థూలంగా ప్రజానుకూల వైఖరిని రారా తప్పక తీసుకుంటారు. కానీ ఆ రచనలోని కళా, కాల్పనిక, సామాజిక అర్థాలను వివరించడానికి రాజకీయ అర్థశాస్త్ర భావనలను, సామాజిక శాస్త్ర భావనలను వాడుకోలేదు. చరిత్రను (కొల్లాయిగట్టితేనేమి మినహాయింపు) పట్టించుకోలేదు. బహుశా ఆధునికతను విమర్శకు ప్రమాణం చేసుకొని ఉంటే తప్పక చారిత్రక భౌతికవాదం దగ్గరికి వెళ్లేవారు. సామాజిక శాస్త్రాలను వాడుకొనేవారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రామాణికతకు ఆ మేరకు ఆయన దూరమైపోయారు.
0 0 0
సాహిత్య విమర్శ చరిత్రలోకి సూటిగా, నేరుగా, సరళంగా ఉండే విమర్శ పద్ధతిని రారా తీసుకొచ్చారు. అకాడమీలు, సన్మానాలు, సినిమాలు, అవార్డుల చీదరను గురి చూసి రాశారు. సాహిత్యరంగంలోని చీడను నిర్మూలించేలా విమర్శలేదనే వాస్తవాన్ని బైటపెట్టారు. వీటన్నిటికీ ఆధునిక విలువలు తప్పనిసరి అనే భావనలను ప్రవేశపెట్టారు. వాచక విమర్శ పద్ధతికి తోడ్పడ్డారు.
అదే సమయంలో ఆయన అలంకార శాస్త్ర భావనలను ఆధునిక, మార్క్సిస్టు భావనల కలయికను నిష్పూచీగా ముందుకు తీసికెళ్లారు. బహుశా ఇప్పటికీ తెలుగు సాహిత్య విమర్శలోని కలగూరగంప ధోరణికి నిత్య ప్రేరణ అందిస్తున్నారు. బయటికి కనిపించరుగాని సాహిత్య విమర్శలోకి రాజకీయాలను ఆయన ఇంకో వైపు నుంచి బలంగా తీసుకొచ్చారు. అభ్యుదయ రచయితల సంఘానికి అప్పటి దాకా ప్రత్యేకంగా దోహదం చేయకపోయినా సాహిత్యంలో విప్లవోద్యమం ఆరంభయ్యాక ఆయన అభ్యుదయ సాహిత్యం మళ్లీ దారిలోకి రావాలని రాజకీయంగా ఆకాంక్షిస్తూ రాశారు. అభ్యుదయ సాహిత్యం తనలోని లోపాలను వదిలించుకోవాలని సూచించారు. ‘మన అభ్యుదయ రచయితల సంఘం’ అనే దాకా రాజకీయ నిర్మాణ సాన్నిత్యాన్ని ప్రదర్శించారు. ఆ రకంగా ఆయన విమర్శలోకి రాజకీయాలను నేరుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విప్లవ సాహిత్యోద్యమాన్ని ఏటుకూరి బలరామ్మూర్తి, మోటూరి హనుమంతరావులాంటి వాళ్లు ఎదుర్కోడానికి అవసరమైన దారిని దిగంబర కవిత్వం దగ్గరి నుంచే రారా దారి వేసి చూపించారు. ఇన్ని విభిన్న కోణాలతో తెలుగు సాహిత్య విమర్శ చరిత్రలో రారా స్థానం పదిలం. ఆయనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఎవ్వరూ తక్కువ చేయలేరు. ఎక్కువా చేయలేరు.