నవంబర్ 19, 2021 దేశ చరిత్రలో ఫాసిస్టు శక్తులకు ఓటమి ఎదురైన రోజు. మూడు  వ్య‌వ‌సాయ  చట్టాల రద్దుపై మొండిగా ఉన్న  కేంద్ర  ప్ర‌భుత్వం  లొంగిరాక త‌ప్ప‌లేదు.  దేశంలో గత ఏడాది కాలంగా సాగుతున్న రైతాంగ పోరాటం విజయం సాధించింది. ఈ విజయం కార్పొరేట్ ప్రాయోజిత పాలక వర్గాలు పైన విజయం. సుదీర్ఘ కాలంగా కొనసాగించిన పోరాటం ప్రజలకు అనేక అనుభవాలను ఇచ్చింది.  పాలక వర్గాలు పోరాడుతున్న ప్రజలను ఖలిస్తానీలుగా, అర్బన్ మావోయిస్టులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేశాయి. ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. వీటన్నిటిని తట్టుకుని రైతులు విజయం సాధించారు. ఈ కాలంలో 700 మంది రైతులు అమరులయ్యారు. అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. మూడు రైతాంగ చట్టాలు కార్పొరేట్లకు అనుకూల‌మైనవని రైతు నాయకులు మొదటి నుండి స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగానే తమ నిరసన చర్యలను చేపట్టారు. అంబానీ, ఆదానీ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను బహిష్కరించారు. ఎవరి లబ్ది కోసం ఈ చట్టాలను చేస్తున్నారో స్పష్టంగా చెప్పారు.    

ఇదే కాలంలో దండకారణ్యంలో ఆదివాసులు సైనిక క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. 2017 నుండి మొదలైన ఆపరేషన్ సమాధాన్ యుద్ధ వ్యూహంలో ఇవి  భాగం.  దీనిలో భాగంగా ఇప్పటికే ప్రహర్ 1,2 ఆపరేషన్లను కేంద్రం చేపట్టింది. వైమానిక దాడులు, సైనిక క్యాంపులు, మహిళలపై అత్యాచారాలు, కుట్ర కేసులు.. ఇలా ఎన్నో. ప్రజలను అణిచివేయడానికి .. ఇలాంటివ‌న్నీ ఉపయోగించింది. 

2020 అక్టోబర్ లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమన్వయంతో భారత పాలకవర్గాలు ప్రహర్ దాడిని మొదలుపెట్టాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో మే 17-18,  2021 నాడు బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు గ్రామం సిలిగేర్ వద్ద సైనిక బలగాలు చేసిన కాల్పులు జరిపాయి. దీనిలో ఐదుగురు స్థానిక ఆదివాసీ ప్రజలు ఉయిక పాండు, ఏమ్లా వాగాలు, ఉర్సం భీమాలు, పూనెం సోమ్లి, మిడియం మాసాలు     మృతి చెందారు.  వీరిలో ఉయిక పాండు 14 సంవత్సరాలు కూడా నిండని మైనర్. అలాగే  పూనెం సోమ్లి నిండు చూలాలు (గర్భవతి ).  వీరి మృతిపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ను వేసింది. ఇది కంటి తుడుపు చర్య మాత్రమే. పైగా చనిపోయిన వారి కుటుంబాలకు ముప్పై వేల పరిహారం అందించారు. వీటిని ఆ కుటుంబాలు తిరస్కరించాయి.    

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న ఎనిమిది మంది రైతులను ఎలాగైతే పాలక వర్గాలు హత్య చేశాయో స‌రిగ్గా ఇది కూడా అలాంటిదే.  అయితే చనిపోయింది ఆదివాసులు కావడం వల్ల మీడియాకు ఇది పెద్దగా పట్టలేదు. ఎందుకంటే ఆదివాసులు మావోయిస్టులు అయ్యారు. మావోయిస్టులు   ఈ దేశానికీ అతిపెద్ద *అంతర్గత* శత్రువులు. కాబట్టి వాళ్ళ ప్రాణాలకు విలువలేదు.  ఆ పేరుతో ఎవరినైనా చంపవచ్చు.  

ఈ హ‌త్యాకాండ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ  ఆదివాసులే ఈ దురాగ‌తాల్ని  బయటి సమాజానికి చెప్పేందుకు   ‘నిజాలు నిగ్గు తేల్చాలి’ అంటూ నిరసన ర్యాలీలు తీశారు. బూటకపు ఎన్కౌంటర్లలో  చనిపోయిన వారి ఫోటోలు ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా నిరసన తెలుపుతున్నారు.   ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. 2012 జరిగిన సర్కేగూడ ఎన్కౌంటర్ పేరుతో జరిగిన హత్యాకాండలో మావోయిస్టులు ఎవరూ  లేరని జుడీషియల్ కమిషన్ 2020 డిసెంబర్ కు తేల్చింది. 2013 మే లో జరిగిన ఎన్కౌంటర్ బూటకం అని నష్ట పరిహారం ఇవ్వమని జుడీషియల్ కమిషన్ 2021 లో ఆదేశించింది. ఇంకా ఇలా బయటికి రాని సంఘటనలు ఎన్నో.            

మావోయిస్టుల పేరుతో చంపివేసిన ఆదివాసుల ఫోటోల ప్రదర్శన(పైన ). 2016 లో మావోయిస్టు ఆరోపణతో మాడకం హిద్మా ను రేప్ చేసి పోలీసులు చంపివేశారు. న్యాయం కోసం ఆమె తల్లి ఇంకా పోరాడుతుంది. (కింద వైపు సోనీసోరి తో హిద్మా తల్లి)

సిలిగేర్ మొదటి సైనిక క్యాంపు కాదు. గత రెండేళ్లలో బస్తర్ అటవీ ప్రాంతంలోనే ముప్పైకి పైగా క్యాంపులను ఏర్పాటు చేశారు  నారాయణ్ పూర్ జిల్లా కడియమెట్ట, దంతెవాడ జిల్లా నహాడీ, బోదిలి, పొటాలీలలో సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తున్నారు. పాలకులు ప్రజల రక్షణ కోసం ఇవి ఏర్పాటు చేశామని చెబుతాయన్నారు. కానీ అపారమైన ప్ర‌కృతిక సంపదను దోచుకోవడానికి అడ్డంగా ఉన్న మావోయిస్టులు, ఆదివాసీల నిర్మూలన ఈ క్యాంపుల ఉద్దేశం. ఈ క్యాంపుల ఏర్పాటు ఒక్క దండకారణ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. ఝార్ఖండ్ రాష్ట్రంలోనూ 15 క్యాంపులను ఏర్పరిచారు. 

ఆదివాసీ ప్రాంతాలన్నీ కూడా ప్రకృతి సంపదలతో విలసిల్లుతున్నాయి. ఛతీస్ఘడ్ లో  1,18, 494 హెక్టార్లలో 28 రకాల గనులున్నాయని ‘జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ అంచనా వేసింది. వీటి విలువ సుమారు 100 లక్షల కోట్లు. వీటిని కార్పొరేట్ల పరం చేయడమే ప్రభుత్వాల ఉద్దేశం. గత నాలుగు దశాబ్దాలుగా   మావోయిస్టు  ఉద్య‌మం వ‌ల్ల  వీటి ఆక్రమణ సజావుగా సాగడం లేదు. ఈ  ఉద్య‌మం ఉన్నంత వ‌ర‌కు  వాటి ఆక్రమణ పూర్తి కాద‌నేది  కార్పొరేట్ పాలకవర్గాల ఆందోళన. దాని కోసమే ఈ క్యాంపుల ఏర్పాటు.   

నయా ఆసియా శ్రీమంతుడు ఆదానీ కోసం దంతెవాడ జిల్లాలోని మోదీ బైలదిల్లా 13వ డివిజన లో  ఇనప ఖనిజపు గనులను ప్రైవేట్‌ పరం చేశాడు. గత యూపీఏ ప్రభుత్వం గనుల తవ్వకాలు ఈ ప్రాంతంలో చేపట్టకూడదని సిఫార్సులు చేసింది. వాటిని బేఖాతరు చేస్తూ వాటిని ఆదానికి అప్పచెప్పారు. ఇక్క ఎటువంటి  గ్రామ సభ కూడా జరపలేదు.  దీనిని అక్కడి ఆదివాసులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. తమ ప్రకృతి దేవత అక్కడ ఉంటుంద‌ని వారి నమ్మకం. దేవతలు, మతం, నమ్మకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీకీ ఇవేవీ పట్టవు.  ఆదివాసుల *మ‌తం*  బిజెపి చెబుతున్న మతం కాదు.  వాళ్ల దేవుడు సంఘ్‌ప‌రివార్  నమ్ముతున్న దేవుడు కాదు. మతం అనేది  బీజేపీ కి  రాజ్యాధికారం చేజిక్కించుకోడానికి ఎన్నుకున్న మార్గం మాత్రమే. వారి ప్రధాన లక్ష్యం కార్పొరేట్ల సేవ. 

రైతుల చేతిలో భాజపా ఓటమి దేశంలోని పోరాట ప్రజలకు గొప్ప శక్తిని ఇచ్చాయి. ప్రజల బలం ముందు ఎవరైనా సరే ఓడిపోవాల్సిందేనని నిరూపించింది. అయితే ఇంతకాలం కొనసాగిన రైతు ఉద్యమానికి ఎంతమంది మద్దతునిచ్చారో అంతకంటే ఎక్కువమంది వారిని వ్యతిరేకించారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా భాజపా ప్రభుత్వం, హిందుత్వ శక్తులు భావజాల రంగంలో వేసిన ప్రభావం. దేశభక్తి అనే మాయలో కార్పొరేట్ రాజ్యం న‌డుస్తున్న‌ది.  

ఈ మాయ దేశంలో కొన‌సాగుతున్న‌ది కాబ‌ట్టే  నాగాలాండ్ లో 13 మంది పౌరులను చంపి పొరపాటు చర్య అని భారత ప్రభుత్వం త‌ప్పించుకోగ‌లిగింది.  మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం అంటూ  యుద్ధ‌మే చేస్తున్న‌ది.  ఈ యుద్ధం సొంత ప్రజలపై జరుగుతుందని   సమాజం గుర్తిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు మనముందున్న ప్రశ్న. ఇది ప్రజలు సంక్షేమ కోసం సాగుతున్న యుద్ధం కాదు. ఇది కార్పొరేట్ శక్తులను పోషించడానికి భారత ప్రజల సంపందను దోచిపెట్టాడనికి జరుగుతున్న యుద్ధం. ఇది  గుర్తించి ఈ యుద్ధంలో వారికీ మద్దతిస్తామా లేదా అన్నదే అసలు విషయం. 

Leave a Reply