డాక్టర్ వినోదిని రాసిన “కట్ట” కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో “బ్లాక్ ఇంక్” కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు.
ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన కథలివి.వాడల లోపలి కథలు.
అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి కథలు కావాలంటే ముందు పేజీల పరిమితులను దాటాలి, అనేక సరిహద్దు గీతల్ని దాటాలి. చీకటి గురించి కష్టం గురించి కన్నీటి గురించి రక్తం గురించి మలం గురించి మూత్రం గురించి, ముట్టు గుడ్డల గురించిన కథలను ప్రచురించాలంటే ఆ దమ్ము పత్రికలకు ఉండాలి.
అరుణతారలో ఈ కథ ప్రచురితమైనపుడు పాఠక లోకం ఆశ్చర్యపడింది. కొంతమంది విమర్శకులు నివ్వెరపోయారు. ఇంకొంతమంది పత్రికా సంపాదకులు మదనపడ్డారు. ఇలా కూడా కథ రాయవచ్చా? జీవితం ఇట్లా కూడా ఉంటుందా? ఈ కథకి శిల్పం ఉందా? ఇలాంటి కథలు చదవటంలో ఇబ్బంది లేదా?
ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు, ఎన్నో మొహమాటాలు…ఇవన్నీ కథ లోని జీవితం తెలియని వాళ్ళకే. రచయిత తను తెలుసుకున్న సత్యాలను తనకు తెలిసిన జీవితాన్ని చిత్రించే టప్పుడు జీవన వాస్తవికత బలంగా ఉన్న కథలు
సంవేదనలను, సంచలనాన్ని, ఉద్వేగాలను, సంతోషాలను దుఃఖాలను, సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పాఠకులు మంచి కథలు చదివాక మళ్లీ మరోసారి కథలోకి వెళ్తారు. కథలోని జీవితం గురించి ఆలోచిస్తారు. కథ ఏం చెప్పింది ?ఏం చెప్పలేదు? ఏం సూచించింది? కథ దేన్ని విడమర్చి చెప్పింది? దేన్ని దాచి పెట్టింది? అని పాఠకులు ఆలోచిస్తారు. కథ మొత్తం చదివాక పాఠకులకు ఏమి పని లేకపోతే ఆ కథలో పస లేదని అర్థం. మంచికథ పాఠకుల మెదళ్లకు హృదయాలకు చాలా పని పెడుతుంది.ఆధునిక ప్రపంచం ఎలా వేగంగా వెడుతోంది? అభివృద్ధి అంటే అర్థం ఏమిటి? స్వతంత్రం తర్వాత భారతదేశ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజయం వైఫల్యం ఏమిటి? దిగువ స్థాయి వ్యక్తుల జీవితాలలోని దుఃఖాలకు అసౌకర్యాలకు, అబద్రతలకు, వైఫల్యాలకు, అనేకానేక మానసిక రుగ్మతలకు, ఆత్మహత్యలకు, తాకట్టు పాలవుతున్న జీవితాలకు, అత్యాచారాలకు,అసహజ మరణాలకు ఎవరు సమాధానం చెబుతారు?
ఈ కథ చదివిన తర్వాత పాఠకులు అంత తొందరగా సాధారణ స్థితిలోకి రాలేరు. అంతర్జాతీయ స్థాయిలో చర్చించాల్సిన కొన్ని మంచి తెలుగు కథలలో ” కట్ట” కథ కూడా ఒకటి.
*
ఈ కథ ఇప్పటికీ తాజాగానే ఉంది.
ఈ కథ ఇంకా జరుగుతూనే ఉంది.ఈ కథ లోపలికి మనం వెళ్లాలంటే ముందు మనం మన భవనాలను దాటాలి, మన పట్టణాలను దాటాలి.
కంచెకు అవతలి జీవితం తెలియని వాళ్ళకే ఈ కథలు అంటరానివిగా అనిపిస్తాయి. రైలు కట్టల వెంట రైలులో కూర్చొని ప్రయాణం చేయటం కాదు, ఆ రైలు కట్ట చుట్టూ పగలు, రాత్రీ ఆత్మగౌరవానికి సంబంధించి నిత్యం జరుగుతున్న ఆత్మహత్యల గురించి హత్యల గురించి, నిత్య ప్రమాదాల గురించి ఆలోచించమని ఈ కథ చెబుతుంది. ఈ కథ కేవలం ఒక ఈ విషయాన్ని లేదా సంఘటనని గురించిన కథ కాదు. అనేక కథల పొరల సంకీర్ణం ఈ కథ. తాటాకు గుడిసెల్లోని రైలు కట్ట చుట్టుపక్కలి అనేకుల జీవితం ” కట్ట” కథయ్యింది.
*
వీటిని దళిత కథలని, క్రైస్తవ కథలని, స్త్రీవాద కథలనీ ఏదోరకంగా పరిమితం చేయడానికి కుదరదు. ఏ పరిమితికీ లోబడని కథలివి. ఈ కథలు చదువుతుంటే ఆడ్డుగోడలు, అసమానతలు, సందిగ్ధాలు, మొహమాటాలు, దాపరికాలు బద్దలు కావాలనిపిస్తుంది. వాటంతట అవి బద్దలు కావు, బద్దలు కొట్టాలనిపిస్తుంది. అదీ ఈ కథల శక్తి.
“కట్ట ” కథలోచెవిటి కరుణమ్మ నిర్జీవ దేహం పాఠకుల కళ్ళముందు కదలాడకపోతే ఈ కథ కథే కాదు. వర్తమాన భారతదేశపు నగ్న స్వరూపాన్ని , అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వెలివాడ బతుకుల దుర్భర పరిస్థితులను, అతలాకుతలంగా ఉన్న జీవితాలను సహానుభూతితో నిర్మొహమాటంగా, ఏదీ దాచి పెట్టకుండా చూపించిన కథ “కట్ట”.
దేవాలయాలు ఉన్న ఊర్లు కాదు, మసీదులు మందిరాలు చర్చిలు ఉన్న ఊర్లు కాదు.. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్న ఊర్లు కావాలి. అభివృద్ధి అంటే ఒక నిదర్శనం ఇదే. ఒక కొలమానం ఇదే. ఒక ఉదాహరణ ఇదే. అందుకే మరుగుదొడ్డి అభివృద్ధి ఆనవాళ్లలో అత్యంత ముఖ్యమైంది.
*
వందల,వేల కోట్ల రూపాయలతో విగ్రహాలు నిర్మించి, అభివృద్ధి సూచికలుగా, సాంకేతిక విజయాలుగా జబ్బులు చరుచుకునే మనుషులకు ముళ్ళ పొదల చాటున రైలు కట్టల పైన మలవిసర్జన చేసి, ఆత్మగౌరవాన్ని, ప్రాణాన్ని, మానాన్ని పోగొట్టుకుంటున్న భారతీయ మహిళల దుస్థితి కళ్ళకు కనపడదు. ఆ దుఃఖాలు చెవులకు వినబడవు. ఆ ఆక్రందనలు మనసుకు రుచించవు.
సఫాయి కర్మచారి వాస్తవాలు మాట్లాడితే ఈ దేశం తట్టుకోగలదా?
*
రైలు అభివృద్ధికి చిహ్నం. మనుషుల రవాణా, సరుకుల రవాణా పేరుతో అభివృద్ధికి ప్రభుత్వం చూపుతున్న నిదర్శనం. ఇప్పటికీ కాపలాదారులు కాపలా కాయలేని చోట్ల సంభవిస్తున్న మరణాలు ఎన్నో ఉన్నాయి. రైలు కిందపడి మరణిస్తున్న వాళ్లందరినీ ఆత్మహత్యలు మాత్రమే కావు. చెవిటి కరుణమ్మది ఆత్మహత్య కాదు. ప్రమాదం కూడా కాదు. ఈ కథ చదివిన తర్వాత ఇది ఒక హత్య అని అర్థమవుతుంది. అసలు బహిర్భూమికి వెళ్లే ప్రయత్నంలో అత్యాచారాలకు హత్యాచారాలకు గురైన ,గురవుతున్న మహిళల గురించి ఆధునిక ప్రపంచం ఇంకా సక్రమంగా ఆలోచించలేక పోతోంది.
మగవాళ్లు వస్తున్నారంటే దొడ్డికి కూర్చుంటున్న ఆడవాళ్లు ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా సరేలేచి నిలబడాల్సిందే. రైలు వస్తుందంటే, అది గూడ్స్ రైలు అయినా సరే, గార్డు ఉంటాడు, లైట్ ఉంటుంది కనుక ఆడవాళ్ళు లేచి నుంచో వలసిందే.
ముళ్ళ పొదల చాటున చెంబుతో దొడ్డికి వెళ్లిన అమ్మాయికి కి వాడెవడో చెయ్యరాని సైగ చేస్తాడు. చూపుడువేలు బొటనవేలు సున్నాలా చుట్టి శృంగార చేష్టలు చేస్తాడు. అపరిచితురాలు అయిన ఒంటరి అమ్మాయితో అలా ప్రవర్తిస్తున్న వాడిని అక్కడికక్కడే శిక్షించ లేని సమాజం మనది. ఒంటరిగా మహిళ కనపడితే చాలు వికృతంగా ప్రవర్తించే ధైర్యం మగవాళ్లకు ఎక్కడ నుండి వచ్చింది?
ఒక ఒంటరి మహిళ తో అలా ప్రవర్తించే ధైర్యాన్ని, నీచ ప్రవర్తనని అతడికి సమాజం, రాజ్యం ఇచ్చాయి. కనీసం ఒంటరిగా మహిళ మలవిసర్జనకు సైతం ప్రశాంతంగా ధైర్యంగా నింపాదిగా వెళ్లలేని దుస్థితిని కూడా అదే రాజ్యం అదే సమాజం కల్పించాయి. ఇంత అభద్రత ఆమెది. అంతటి తెగింపు అతడిది.
*
మనుషులకు బ్రతకడం తెలిస్తే చాలదు. తిండిగింజలు సంపాదించుకుంటే చాలదు. గుడిసె వేసుకుంటే చాలదు. కప్పుకోవడానికి చాలీచాలని గుడ్డలు ఉంటే చాలదు. కూడు గూడు గుడ్డ ఈ మాయ మాటలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడు సమానత్వం కావాలి సహజ హక్కులు కావాలి జీవితాలకు భద్రత కావాలి గౌరవం కావాలి మానాలకు ప్రాణాలకు రక్షణ కావాలి.
పి. సత్యవతి గారు చెప్పినట్టు ఆమె కంఠం పదునైనది, తీక్షణమైనదే అయినప్పటికీ, వినోదిని కథ చెప్పే పద్ధతిలో ఎక్కడా ఆవేశం కానీ ఉపన్యాస ధోరణి కానీ ఉండవు. అయితే ఈకథలు చదివిన పాఠకులకు ఆవేశం,ఆలోచనల్లో మార్పు రాకుండా ఉండదు. కులం, మతం, ధనికవర్గం, పెద్దరికం పేరుతో కొనసాగుతున్న ఆధిపత్యాన్ని అడ్డుకుని ఆ అధికారాన్ని ఆ అహంకారాన్ని బద్దలు కొట్టాలనిపిస్తుంది. ఈ కథలలో ఉత్తుత్తి మర్యాద ఉండదు. అట్లా అని ఎవరినీ అగౌరవించే కథ కాదు ఇది. నిరుపేద దళిత మహిళ ఆత్మగౌరవం ఒకరోజులో ఎన్ని వందల సార్లు- ఎన్ని మార్గాల్లో,ఎంతెంత దారుణంగా హత్య చేయబడుతుందో ఎన్ని విధాలుగా స్త్రీలు పరాభవించేబడుతున్నారో ఈ కథ చెబుతుంది.
*
పన్నెండు పేజీల కథలో ఏం చెప్పొచ్చు?
ఇంటర్ చదివే అమ్మాయికి 12 రోజులు కాలేజీ కి హాస్టల్ కి సెలవు వస్తే గుండెల్లో రాయి పడింది. ఆ రాయి హాస్టల్ అన్నం లో దొరికేంత చిన్న సైజుది కాదు. రైలు కట్ట మీదుంటదే, చేతిలో సరిపోయేంతది. అంతదీ! ఇలా ప్రారంభమవుతుంది”కట్ట” కథ.
ఈ కథ చదువుతున్నప్పుడు చదివాక కొన్ని ప్రశ్నలు మిగులుతాయి. సమాధానాలను అన్వేషించమంటాయి. ఈ కథ ప్రశ్నించడాన్ని, కొత్తగా ఆలోచించడాన్ని కొందరు పాఠకులకు నేర్పుగా నేర్పుతుంది.
సంక్రాంతి దసరాకు సెలవులు ఉన్నట్లు క్రిస్మస్ కు ఎందుకు ఎక్కువ రోజులు సెలవులు ఉండవు అన్నది ఒక ప్రశ్న. పిల్లలు ప్రయాణాలు చేసి వాళ్ళ ఊర్లకి వెళ్లే లోపలే సగం క్రిస్మస్ అయిపోయి ఉంటుంది. వాళ్లకు పండుగ ఆనందం ఎక్కడ ఉంటుంది? పిల్లలకే కాదు పెద్దలకు అయినా ప్రయాణం చేసి రావటానికి క్రిస్మస్ కు ముందూ వెనకా సెలవు ఉండాలి కదా. అన్ని పండుగలు పట్ల సెలవులు విషయంలో సమానత్వం లేకపోవడం అనాదిగా వస్తున్న ఒక అనాచారం..కాక మరేమిటి?.
కథలో ఒక చమత్కారం ఉంది. చాలా గుంభనంగా లోతైన విషయాన్ని చెప్పడం.తన తోటి విద్యార్థులు ఏఏ కొత్త బట్టలు వేసుకుంటారో, ఏ ఏ పిండి వంటలు తింటారో,వేసవి సెలవుల్లో ఎక్కడెక్కడ తిరుగుతారో అదంతా స్వరూపను ఆకర్షించదు. అసూయ కలిగించదు. ఆమెని ఆలోచనలో పడవేసింది, ఆమెకు అసూయ కలిగించింది ఒక్క విషయం మాత్రమే..
“వొక్కొక్కరూ వాళ్ళు ఎంత లేటుగా లేస్తారు అని చెబుతున్నారే.. అది మాత్రం రేపటి తెల్లగా తెల్లవారడం గురించి తనను ఆలోచనలో పడేసింది,అసూయ లో కూడా!”అంటుంది రచయిత్రి.
ఎందుకంటే వాడల్లో తెల్లవారకముందే ఆడవాళ్లు తప్పనిసరిగా నిద్ర లేయాలి. ఇంకా చీకటి చీకటి గా ఉండగానే మలవిసర్జనకు ముళ్ళ పొదల్లోకో రైలు కట్ట పైకో వెళ్లి రావాలి. ఆడపిల్లలు యువతులు ముసలివాళ్ళు నిండు గర్భిణీలు జబ్బు పడ్డ వాళ్ళు ప్రత్యేక ప్రతిభావంతులు.. వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్లు అందరూ.. తెల్లారగట్ట లేయాల్సిందే. వాళ్ళు త్వరగా నిద్ర లేయక పోయినా, తెల్లవారకముందే వాళ్లకు దొడ్డికి రాకపోయినా, పగటిపూట వాళ్లకి అత్యవసరంగా దొడ్డికి వచ్చినావాళ్లు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తప్పు చేసిన వాళ్ళలాగా తలలువంచుకుని, బెదురు నడకలు నడవాల్సిందే.
*
కథలోకి…
ఇల్లు ఎలాంటిదంటే .. పేరుకే అది ఇల్లు. హాస్టల్ నుండి వేసవి సెలవుల్లో ఆ అమ్మాయి ఇల్లు చేరుకుంటుంది.
ఆస్టల్ నుంచి బ్యాగు తీసుకొని బయటి కొచ్చి బస్సెక్కి యింటికొచ్చేసరికే రాత్రి యెనిమిదయింది. యూరియా సంచులు కలిపి కుట్టి, నాలుగు మూలలా పాతిన బొంగుల ఆసరాతో మూడు గోడల్లా చుట్టి, తలుపు బదులు మా అమ్మ పాతచీర అడ్డంగా కట్టిన బాత్రూం. లోపల పరిచిన రెండు యిరిగిపోయిన నాపరాళ్లు, వొక పక్కన బురదలోకి కూరకపోతంటే వేడినీళ్లతో మొకం కాళ్లు చేతులు కడుక్కొని లోపలికెళ్లా.
*
గోంగూర పచ్చి మిరపకాయలు ఉడకబెట్టి నూరిన పచ్చడి .. రుచీ బాగుందని ఇంకాస్త తినే సరికి ఆ అమ్మాయికి విరేచనాలు పట్టుకుంటాయి.
బంగాళాఖాతంలో వాయుగుండం అయితే అక్కడ ఈ అమ్మాయి ఆ రాత్రి ఆ వర్షానికి నిద్ర నుంచి లేచి కూర్చుంటుంది. తాటాకు కప్పులోంచి కాళ్ల వద్ద బొట్టు బొట్టుగా పడతా ఉంటే ఆమె బిగదీసి కప్పుకున్న దుప్పటి తడుస్తుంటుంది. రచయిత్రికు ఆ జీవితం తెలిస్తే తప్ప ఇలా రాయలేందు.అప్పుడా అమ్మాయి ఏం చేసిందో చూడండి..
” లేచి కూర గిన్నె తెచ్చి పెట్టి దండం మీద యాలాడబడతున్న మా అన్నయ్య బన్నీ తీసి అందులో పడేసా. ఇంగప్పుడు నిద్ర పట్టింది'”.
లెట్రిన్ వస్తున్న కారణంగా రాత్రి మధ్యలో ఆమెకు మెలకువ వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మను లేపుతుంది. రబ్బరు చెంబులో నీళ్లు పట్టుకుని ఇద్దరూ రైలుకట్ట వద్దకు వెళ్లివస్తారు .ఇంటికి వచ్చి కాళ్ళు కడుగుతూ ఉంటే వాళ్ల నాన్న ఒక ప్రశ్న అడుగుతాడు..
స్త్రీ భద్రతకు సంబంధించిన సందేహం, ప్రశ్న, భయం, ఒక రకం హెచ్చరిక అది.
” తెల్లారక ముందే బయటికి పోయారేంది,?”
సమాధానం ? ఆ తల్లి ఇలా చెబుతుంది.
” పిల్లలకి దొడ్డి నొప్పొచ్చింది లే”
సాధారణంగా మరుగుదొడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్ళు బహిర్భూమికి వెళ్లి రావడం పైన కూడా ఆంక్షలు పరిమితులు నిషేధాజ్ఞలు ఉంటాయి. ఆడవాళ్లకే ప్రత్యేకంగా హద్దులు సరిహద్దులు ఉంటాయి. కుల వివక్షత గురించి చెప్పాల్సిన పనిలేదు . ఊర్లు, వాగులు వంకలు, చెరువు కట్ట కింద పొలాలు, స్మశానాలు , ఆఖరికి దొడ్డికి కూర్చునే ప్రదేశాలు ఎక్కడైనా సరే అందరికీ సమాన అవకాశాలు హక్కులు ఉండవు. ఆడవాళ్లు ఎప్పుడు దొడ్డికిపోయి రావాలో కొన్ని కట్టుబాట్లు నియమాలు ఉంటాయి.వాటిని అతిక్రమించినప్పుడు చూసేవాళ్ళకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
సమయం కాని సమయంలో.. ఒంటికి దొడ్డికి పోవడం ఆడవాళ్లు చేయాల్సిన పని కాదేమో అన్నట్లు ఉంటాయి అక్కడి మనుషుల మొహాలు చూపులు మాటలు. అభివృద్ధి సాధించేసాం, వెలిగిపోతున్న దేశంలో ఆడవాళ్లు ఒంటికి దొడ్డికి పోవడానికి కూడా నిర్ణీత సమయాలు నిర్ణీత నియమిత నిర్దేశిత ప్రదేశాలు, కాంక్షలు కట్టుబాట్లు హెచ్చరికలు అవసరమా??
మరోసారి ఆ అమ్మాయి స్వరూపకి కడుపులో మంట ఎక్కువ అవుతుంది. విరేచనాలు మొదలవుతాయి.
“జనం తిరుగుతున్నారు లే పోమ్మా “అంటుంది తల్లి. ఈ సారి తల్లి తోడు రాదు.
రైలు కట్ట ఎక్కి కూర్చుంటుంది.
ఇక్కడి నుండి కథ రచయిత్రి మాటల్లోనే చదవాలి.
*
ఈ సారి రైలుకట్ట యెక్కాల్సిందే.
అప్పటికే ఆడోళ్లు అక్కడొకళ్లు అక్కడొకళ్లు కూర్చోనున్నారు. రెండు పట్టాల మీద యెదురెదురుగా. మాటలినపడతన్నాయ్.
నేను యివతల పట్టామీద కూర్చున్న. యిట్లాకూర్చోవాలంటే అలవాటుండాల. లేకపోతే బ్యాలన్స్ కుదరక ముందుకో యెనక్కోపడిపోతాం. ముందుకైతే పర్వాలా, చెంబు మీదనో, రాళ్ల మీదనో చేతులు బెట్టి బోర్లా పడకుండ యెట్నో ఆపుకోవచ్చు. యెనక్కయితే యింగంతే సంగతి- నిప్పుల్లో పడ్డట్టే!
చూడ్డానికి యిరగబూసిన బంతిపూల్లాగా, చేమంతిపూల చెండుల్లాగా కనపడతయ్ గనీ,
బో చెడ్డగవులు!
కదిలిస్తే కంపు. యింకందులో పడ్డావంటే యేవుందీ..?!
చిన్నప్పుడు నేనట్నేబడ్డా! నాలుగో తరగతిలో!
యెదురుగా యేదో కదిలితే పామనుకొని!
మమ్మ తీసకపొయ్యి చేపని కడిగినట్టు సుబ్బరంగా రుద్ది పెట్టింది నన్ను. కానీ ఆ పీతోసన నాకాడ నాలుగురోజులు వస్తనే వున్నట్టనిపిచ్చింది నాకు.
పట్టా బెత్తెడు మీద రెండేళ్లుంటదంతే!
పాదమేమో మూడుబెత్తెలుంటది. పట్టాకి అడ్డంగా- పాదంలో యెనక భాగం కొంచెం పట్టాన మిగిల్చి, పాదం ముందు భాగం ఖాళీగా వొదిలేసి, బొటినేలు… అపుడపుడు కిందకొంచి… రాళ్లమీద ఆనిస్తా, బ్యాలెన్స్ చేసుకుంటావుండాలి. ఒకసారి కూర్చుంటే అయిపోయేవరకు జరిగి కూర్చోవాల్సిన పనుండదు… పట్టాయెత్తుగా వుంటది కాబట్టి…!
ఈ జీవితం, ఈ పరిస్థితి, ఈ అవస్థ ఇంతకు ముందు ఎక్కడా కథల్లో కనరానిది,వినరానిది. వినోదిని ఎంత సులభంగా చిన్న మాటల్లో ఇంత పెద్ద బరువైన విషయాలను చెప్పుకు పోతుందంటే, కథ కళ్ళ ముందర జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
మనం అక్కడే ఉన్నట్టు రైలు కట్ట పైన కూర్చున్నట్టుగా ఈ కథ జరుగుతుంది. రైలు వస్తున్న చప్పుడు కూడా కథ చదువుతుంటే వినిపిస్తుంది. రైలు తాలూకు లైట్ వెలుతురు కూడా మనకు కథలో కనిపిస్తుంది. అది రచయిత్రి సాధించిన పరిణతికి నిదర్శనం.
*
దూరంగా గేట్ కవతల రైలు ఆగిపోతుంది కానీ దాని చాలా పెద్ద వెలుతురు అలాగే ఉంటుంది ,లైట్ మాత్రం ఆగదు. తొమ్మిదో నెల కడుపుతో బుజ్జక్క ఆ రైలు కట్ట పైన కూర్చుని ఉంటుంది.
ఎంతటి విషాదకరం?
ఎంతటి భీభత్సదృశ్యం?
అంత వెలుగులో కూర్చోబుద్ధి గాక ఎనక పిర్రలు నిండా దోమలు కుట్టి దద్దుర్లు వస్తుంటే, స్వరూప లేచేస్తుంది.
నెలలు నిండిన గర్భిణీ కి మరుగుదొడ్డి సౌకర్యం లేకపోతే, రైలు కట్ట పైన కూర్చుని రావాలంటే,అది ఎంతటి కష్టమో? ఆ బాధ అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. కుటుంబంలో అలాంటి స్త్రీలు ఉన్న వాళ్లకే తెలుస్తుంది.
దారిలో బుజ్జక్క సత్తెనపల్లిలోని అంజమ్మత్త గురించి చెబుతుంది. చీకటి పడ్డాక చెంబు ఒక చేత్తో రాయి ఒక చేత్తో పట్టుకుని బయలుదేరుతుంది ఆమె.ఆ ఊర్లో రోడ్డు పక్కనే కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి గురిచూసి రాయి వేసి కరెంటు స్తంభం మీద లైటు పగలగొడుతుంది.
వెలుతురులో కూర్చోలేక. ఆమె ప్రతిసారి లైట్లు పగలగొట్టడం మున్సిపాలిటీ వాళ్ళు కొత్త లైట్ వేసి పోవటం, మళ్ళీ ఆమె ఆ లైట్లు పగలగొట్టడం.. ఇంతకీ కారణం వెలుతురులో ఆమె కూర్చోలేక పోవడమే.
కనీస సౌకర్యాల కల్పనలో, మౌలికవసతుల జాబితాలో మరుగుదొడ్లు అసలు ఉన్నాయా లేవా?
సరైన మరుగుదొడ్లు లేకపోతే వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్లు మల మూత్ర విసర్జనకు వెళ్లకుండా ఉంటే, వాటిని ఆపుకొనే కొద్దీ వాళ్లకు సంభవించే శారీరక కష్టాలు జబ్బుల గురించి ప్రభుత్వాలకు తెలియదా?
పల్లెల్లోనూ మురికివాడల్లో నూ దళితవాడల్లో నే కాదు, ఆడవాళ్లు పని చేసే చోట, కర్మాగారాల్లో, కార్యాలయాల్లో కనీస వసతులు కల్పించకపోవడం నేరం కాదా? ఇంకా ఎంతకాలం ఈ వివక్ష?
పాఠకుడు ఈ కథ చదువుతుంటే ఆలోచించకుండా ఉండలేడు..
*
ఉదయం ఎనిమిది గంటలకు మరోసారి విరేచనాలు మొదలవుతాయి ఆ అమ్మాయికి. పగలు కట్ట పైన ఆడవాళ్లు కూర్చోవడానికి లేదు. కట్ట పక్కన డౌన్లో వున్న ముళ్ళకంచె లోపలికి వొంగి వొంగి నడుచుకుంటా పోయి కూర్చుని రావాలి. అసలే పెంటల రొచ్చు రోతగా ఉంటాది .దానికి తోడు రాత్రంతా వాన పడి ఉంది. కుప్పలన్నీ చింది చుట్టూ చెల్లాచెదురుగా యెగిరి పడి ఉంటాయి.
అక్కడ నడవటం ఎంత కష్టమో? తావు ఎతుక్కోవడం ఎంత కష్టమో?
కట్టమీద పరిచిన రాళ్ల పక్కన ముళ్ళ కంచె లోకి దిగి మంచు మీద సన్నటి కాలిబాట. ఆ అంచు మీద నుంచి మగవాళ్ళు చెంబు తీసుకొని ఆడవాళ్ళని దాటి పోతుంటారు, ఖాళీ చెంబుతో వస్తుంటారు. కొందరు తలవంచుకొని వెడితే, కొందరు తలెత్తి ఆడవాళ్ళ మొహంలోకి చూసి తలతిప్పుకొని పోతూ ఉంటారు.
రచయిత్రి మాటలు ఎంత పదునుగా ఉన్నాయో, అక్కడి ఆడవాళ్ల జీవితం ఎంత కర్కశంగా ఉందో .. చూడండి.
వాడు ఎట్టాంటోడైనా అంత దూరంలో మగ మనిషి కనబడ్డాడు అంటే లేచి నిలబడాల్సిందే.
రైలు కూడా మొగోడే! వస్తే నిలబడాల్సిందే! గూడ్పు బండొస్తే కూడా! ఎన్ని పెట్టెలుండి యెంతపొడుగున్నాసరే, ఇంక కూర్చోగూడదు, చివర్లో గార్డు వుంటాడుగా! టెన్త్ దాకా నాక్లాసుమేట్ మోజస్ యెండం చేతిలో ఖాళీ చెంబుతో యెదురయ్యాడు. నవ్వు మొగం పెట్టుకొని తలకాయొంచుకొని దాటిపొయ్యాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మగవాళ్ళు ఎవరు వచ్చినా లేచే పని లేదు. జనం తిరుగుతున్నా పట్టించుకునే పని లేదు.కట్టమీద కనే పీతిగవులు. చేపల మార్కెట్లో వచ్చే నీసోసన చిక్కగా వస్తావుంది.
పీతిపెంటలన్నీ దాటుకుంటా చిన్నగా ఆ ముళ్ల కంచల్లోకి దిగా! ఆడోళ్లెవరూలేరు. అందరూ చీకటితోనే పోయొస్తుంటారు. రెండు జానల చోటు దొరకడం కనాకష్టమై పోయింది. చెంబు పెట్టడానికి బెత్తెడు చోటులేదు. కుడిపాదం మీద పెట్టుకున్నా! పొర్లునెప్పి! నీళ్ల విరోచనం! ఆ తడినేలలో యింకలేకపోతంది.
నేనెప్పుడైనా యిట్లా కంపల్లోకొస్తే చుట్టూ చూస్తా వుంటా! వొకటి పాములు, రెండు పందులు. పాములంటే నాకు చిన్నట్నుంచి బోబయ్యం. పందులంటే మామూలుగానైతే బయంలేదు. గానీ యిట్లా కంపల్లోకొస్తే… కాసుకొని చూస్తా, కూర్చోగానే పరిగెత్తుకొని వస్తయ్! యెనకా ముందూ చూడవ్, గబుక్కున లేచి తప్పుకోవాల్సిందే, లేదంటే ఆ కంగార్లో పీతుర్లలో పడిపోతాం.
బడిలో ఆడపిల్లలు రింగాట ఆడేటపుడు, నెట్ కి అవతలున్నోళ్లు యిసిరేస్తే, యివతలున్నోళ్లు దాన్ని కిందబడనియ్యకుండా పట్టుకోవాల! కిందపడనిస్తే పాయింటు పోద్ది! అవుటయినట్టే! అట్టా పందులు కూడా, మనిషి రాగానే దగ్గరకొచ్చి నిలబడి కాసుకోనుంటయ్. కూర్చుంటంటే కిందబడనివ్వవ్…. తింటంటే రెండుపక్కల సెలాలమ్మట కొంచెం కొంచెం జారతా చిదపలు పడతావుంటాయ్.
చిన్న గుంటలో రెండు మూడు పెరిగిన పిల్లలు పొడుకోనున్నయ్… దొడ్డికి బురదలో! యెందుకో వొడుపు చెయ్యట్లా, కొద్దిగా మెదుల్తున్నయంతే!!
అక్కడక్కడా దోస తీగలున్నయ్, కొన్ని నేల మీద పాకి, కొన్ని కంపచెట్ల మొదట్లో అల్లుకొని, తీగలకి పూలూ పిందెలు కనబడతన్నయ్. తిన్నప్పుడు అరక్కుండా దొడ్డికిలో బయటికొచ్చిన యిత్తనాలన్నీ యిట్లామొలిచి- తీగలయ్యి, మంచి మంచి కాయలు కాస్తాయంట. పీతుర్ల మజ్జన పెరగడం వలన పెద్ద పెద్ద సైజుల్లో నిగనిగలాడ్తుంటయ్యంట. మొగోళ్లు కూర్చున్నే కెల్లయితే గంపలు గంపలు కాస్తయ్యంట.
అందుకే పెద్దబాయి పక్కనున్న వజ్రమ్మమ్మమ్మ తెల్లారామే టార్చిలైటు తీసుకొని గంపకెత్తుకొచ్చి కోటయ్య కొట్టుకేసుట. ఈ సంగతి మాగేర్లో అందరికి తెల్సు. అందుకే యెవురూ కోటయ్యకొట్లో దోసకాయలు మాత్రం కొనరు. రోడ్డవతలోళ్లు కొనుక్కొని పోతుంటారు.
ఎవరో ఒక అతను ఖాళీ చెంబుతో కనిపించేసరికి మళ్లీ అమ్మాయి లేచేస్తుంది.
మొగుళ్ళ కైతే ఈ బాధే లేదు. జనం తిరుగుతున్నా పట్టించుకోరు.
క్లాసులో తెలుగు మేడం అడిగిన”మరో జన్మంటూ ఉంటే మీలో ఎంత మంది పురుషులుగా పుట్టాలనుకుంటున్నారు”అనే ప్రశ్నకు ఆడపిల్లలు ఏమేం సమాధానం చెప్పారో గుర్తుకొస్తుంది.
అమ్మాయిలు చాలా సమాధానాలు చెప్పేరు. సెకెండ్ షోకి వొంటరిగా పోవచ్చని, సిగిరెట్ తాగొచ్చని, యెండాకాలం చొక్కావిప్పదీసుకోవచ్చని, నెలనెల మెన్సెస్, కడుపు-కాన్పు యేవీ కేకుండా వుండొచ్చని యిట్లా… చాలా… యీ ఆడవాళ్ల యిబ్బందులన్నీ అనుభవించినోళ్లకే తెలుస్తాయని ముగించారు. నాకప్పుడు ‘యిది’ చెప్పాలనిపించింది. “యిట్లా మజ్జలో లేచి నిలబడే అవసరముండదని”.
కానీ క్లాసులో చెప్పలా! ధైర్యం చేసి రాత్రికి ఆస్టల్ రూంలో చెప్పా.
‘ఛీ పాడు యిలాంటియ్ చెబుతారా? యింకానయం క్లాసులో చెప్పలేదు…’ యిలాంటియే రెండు మూడు మాటలని, యిదొక పాయింటే కాదని కొట్టిపడేశారు. వాళ్లకేం తెల్సు…?
యిది… అనుభవించినోళ్లకే తెలుస్తది.!! ఆయనెల్లి పొయ్యాడు. మళ్లీ అట్టా కూచున్నానో, లేదో, రైలు కూత యినబడింది. చాలా స్పీడుగా వస్తంది. మళ్లీ లేచి నిలబడ్డా. రైలు దగ్గరికి రాగానే ఆస్పీడుకి రైలు కట్టమీదున్న ఈగలన్నీ గుమ్మని వొకేసారి లేచినయ్.
*
సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు క్యాండిల్స్ తయారు చేసే పనికి వెళ్లి తను సంపాదించిన డబ్బు మొత్తం తన పుస్తకాలకి బట్టలకే. ఆమె డబ్బుని వాళ్ళ అమ్మానాన్న ముట్టుకోకపోవడం గమనార్హం. ఆమె సంపాదన ఆమెదే, ఆమెకే అని ఆమె ఆర్థిక స్వతంత్రాన్ని వాళ్ల తల్లిదండ్రులు …వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్న సరే ,ఎంత దరిద్రం అనుభవిస్తునన్నా సరే, గౌరవించడం వాళ్ల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.
మధ్యాహ్నం మరోసారి అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే చెప్పులైనా వేసుకోకుండా కట్ట దిగి కంపల్లోకి దూరిపోతుంది.
కట్ట అంచున సన్న దారిలో సైకిల్ మీద వచ్చిన ఒకతను వెకిలిగా సైగ చేస్తాడు. గబాల్న లేచి వస్తుంది. లేకి మాటలు, బూతులు, చూపుడువేలు బొటనవేలు సున్నాలా చుట్టి సైకిల్ జేబులో నుంచి డబ్బులు తీసి చూపిస్తాడు. ఆపై సైకిల్ స్టాండ్ వేసి నిలబడతాడు.
భయపడి పోయిన అమ్మాయి చెంబు అట్లాగే పట్టుకుని ముండ్లను తొక్కుకుంటూ, పీతిని తొక్కుకుంటూ పరిగెత్తుతుంది.
దారులు అందరూ ఆమె వైపూ చెంబు వైపూ విచిత్రంగా చూస్తుంటారు. సిగ్గుతో చెంబు పారెయ్యా లనుకుంటుంది గాని ఉన్నది ఒకే మంచి చెంబు. మరో మార్గం లేదు తప్పదు.సిగ్గు అంటే సిగ్గు కాదు, పెళ్ళికూతురు పడే సిగ్గు కాదు. ఇబ్బంది ఎగతాళి అవమానం..
చిన్న చిన్న బట్టల సబ్బు ముక్కలతో ఒళ్ళంతా రుద్ది రుద్ది కడుక్కుంటుంది. ఒంటి సబ్బు పెరట్లో ఉండదు. కాకి ఎత్తుకు పోతుందని బంగారం లాగా దాన్ని ఇంట్లోనే దాచి పెట్టుకుంటారు వాళ్లు.
ఇదీ వాళ్ల జీవితం. మురికి వాడల జీవితం, అట్టడుగు వర్గాల జీవితం.
ఎట్లా అయితే నేను ఇల్లు చేరి, నడి మంచం లో కూర్చుని అరికాలు ఒల్లో పెట్టుకుని పిన్నీసు తో ముల్లు తీసేస్తుంది.
ఇరవై మూడు ముళ్ళు ఉంటాయి. కొన్ని సగానికి విరిగి పోయి లోపలే ఉండి పోయి ఉంటాయి. బయటకు రానివి ఇంకో పదన్నా ఉంటాయి. రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కన్నీళ్ళతో వైద్యం చేస్తుంది.
వెకిలి చేష్టలు మగవాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది.సగ్గుబియ్యం గంజి తాగుతూ పూలతో అరికాళ్ళకి కాపడం పెట్టుకుంటుంది ఆ అమ్మాయి.
అప్పుడు వాళ్ళమ్మ మానసిక పరిస్థితిని రచయిత స్పష్టంగా చెబుతుంది. వాళ్ళ అమ్మ ఆందోళనతో ఉంటుంది ,బాధతో ఉంటుంది ,కోపంతో ఉంటుంది, ఆవేశంతో ఉంటుంది, ఆగ్రహంతో రగిలిపోతూ ఉంటుంది.
కథ ముగింపు ఇలా ఉంటుంది.
మళ్లీ కడుపులో కొంచెం కొంచెం తేడా మొదలయ్యింది. అయినా యింకిప్పుడు బయ్యంలేదు. బడినుంచొచ్చిన ఆడపిల్లలు, ముసలీ ముతకా చాలా మంది చెంబుతీసుకొని బయలు తేరతారు. అయితే నేను నడిచిపోడం చాలా కష్టం.
చెప్పులేసుకుంటే కూడా – కట్టమీదున్న రాళ్లమీద నడవాలంటే కష్టం. యెట్లా పోవడం?. పాదాల మీద చల్లటి నీళ్లు పోసుకుంటే యిరోచనం తొందర్ని కొద్దిగ సేపు వాయిదా వెయ్యొచ్చు.
చిన్నగా గాబుకాడికి నడిచెళ్లి చెంబు ముంచి, పాదాలమీద గుమ్మరిచ్చుకున్నా. లక్ష గాజు పెంకులు పాదాలలోకి దిగబడినట్టుంది. నోట్లోంచి శబ్దం కూడా రాలా, గాలంతా గుండెల్లోకి తన్నింది. ఆడ ఆగింది. తీట… !
చీకటి పడేదాకా ఆపడం కష్టమనిపిస్తుంది. చీకటి పడడానికి చాలా టయముంది. ఈలోపు వొకసారి యెళ్లి రావడమే మంచిది. కష్టమ్మీద చెప్పులేసుకొని గాబుకాడ చెంబు ముంచుతుంటే – “యేందమ్మా, మాత్తరేసుకున్నా కట్టుకోలేదే…!” అనంటా నాచేతిలో చెంబుతీసుకొని మమ్మ నా పక్కనే నడుస్తావుంది. అడుగుతీసి అడుగేయడం గగనమవుతోంది. మమ్మ నా పాదాలెంక జూస్తా మళ్లీ ‘ఆ సైతాన్నా బట్ట’ అని తిట్లకి లంకిచ్చుకుంది.
మా యనక నుంచి చెంబుదీసుకొని వచ్చిన సెవిటి కరుణమ్మవ్వ “యెప్పుడొచ్చావ్ సిన్నమ్మాయ్” అని నా బుగ్గల్లాగి ఆ యేళ్లు ముద్దు పెట్టుకుంది. సగం పళ్లు వూడిపొయినయ్, మనిషి బాగా వడిలింది. యెండి తునకలాగా వుంది. కానీ వుషారు తగ్గలా!
‘రాత్రోచ్చానవ్వా అంటే ‘యేందీ నిన్నొచ్చావా’ అని ‘తల్లీకూతుళ్లు పెళ్లినడక నడుస్తున్నారే, నడవండి, నడవండి…, నాకు తొందరగుంది, నే బోతన్నా’ అని ముసిముసిగా నవ్వుకుంటా మమ్మల్ని దాటెల్లి పోయింది. నాకు కరణమ్మవ్వంటే బో యిష్టం. నాకే గాదు పిల్లలందరికీ! చిన్నప్పుడు మా పిల్లలందర్నీ పోగేసి రకరకాల ఆటలు ఆడిచ్చేది. భలేభలే కతలు చెప్పేది. యిప్పటికీ అంతే…
యింక కట్టెక్కుతామనగా రైలు కూత యినబడింది. ‘రైలుబోనీయమ్మా’ అంది మమ్మ.వక్కరవ్వ ముందొచ్చినట్లయితే ఈ పాటికి కట్టదాటి కంపలోకెళ్లుండేదాన్నే. ఛీ… యీ పొర్లునెప్పి పాడుగాను, యెంతనెప్పంటే, ఈ పాటికి కట్ట దాటే దాన్నే… మమ్మ చెప్పినా వినకుండా…కానీ పాదాలు నడవనివ్వవ్! నిలబడలేకున్నా! కడుపు నొప్పి- కాళ్ల నెప్పి…!
రైలు వొకటే మొయినంగా కూతేస్తావుంది. చెవులు చిల్లులుపడతన్నయ్. దగ్గర కొచ్చేకొద్దీ రైలు స్పీడు తగ్గి స్లో అయింది. స్లో అయ్యి ఆగిపొయ్యింది. కూతేస్తా ఆగింది. ‘స్నిగ్నలిచ్చినా కూడా ఆగిందే’ అంటంది మమ్మ.
అయిదు నిమిషాల తర్వాత మాగేర్లోవాళ్లు కట్ట మీదకి లగెత్తుతున్నారు. ‘సెవిటి కరుణమ్మ దొడ్డికెల్లి రైలు కిందబడి సచ్చిపొయ్యిందంట’ అనుకుంటా!
రైలు పెద్దగా కూతేసి, చిన్నగా కదిలి, మా ముందునుంచి వెళ్లిపొయ్యింది. “వామ్మో “కరుణమ్మమ్మోవ్” అని అరుసుకుంటా, మమ్మ నన్నిడిసి పెట్టి కట్టమీదకి పరిగెత్తింది.
నా గుండెల్లో లక్షరైళ్లు పరిగెత్తినయ్. అడుగుతీసి అడుగెయ్యలేకపోతున్నా. బట్టల్లోనే యిరోచనం అయింది. నిలబడిన చోటే కూలబడిపోయా.గుండెల్లోంచి దుఖం పెద్ద రైలుకూతలా తన్నుకొస్తంది.
*
ఇదొక భయానక దృశ్యం.
ఎంత అత్యవసరం అయితే రైలు వస్తుందని తెలిసినా కట్ట దాటాలని అనుకుంటారు మనుషులు? ఎంత మరో దారి లేని పరిస్థితి అయితే,ప్రాణాలకు తెగించి మరీ దొడ్డికి పోతారు? ఆపడం ఆపుకోవడం ఎవరితరం? మరుగు లేని ఈ జీవితాలకు పరిష్కారం ఏది? సమాధానం కోసం అన్వేషణే ఈ కథ.అయినా ఈ కథ వేసిన ఏ ఒక్కప్రశ్నకూ జవాబు ఇంకా రాలేదు.
ఈ కథలోని జీవితాలకు మరో రకమైన ముగింపు లేదు. ఈ కథలోని పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. వస్తుందన్న నమ్మకం లేదు.అయినా ఏం జరిగినా ఆగని రైలు లాగా దేశం అభివృద్ధి పేరిట పథకాల పట్టాలపై గుడ్డిగా పరుగులు తీస్తూనే ఉంది.
దేశం వెలిగిపోతూనే ఉంది. ఆడంబరాలకి , ఉత్సవాలకి, పండుగలకి, వేడుకలకి, విగ్రహాలకి, వివాహాలకి, శుభకార్యాలకు, అంత్యక్రియలకు, సమాధులకు, స్మారక చిహ్నాలకు, నదుల పుట్టిన రోజులకు అనేకానేక నిర్మాణాలకు లక్షల కోట్లు ఖర్చు అవుతూనే ఉన్నాయి. విధ్వంసాలకు అడ్డుకట్ట వేయడానికి, ఆసమానతలను అడ్డుకోవటానికి, భారతదేశంలో ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి నిర్మించి నీటి సౌకర్యం కల్పించడానికి మాత్రం ఏదో అడ్డుపడుతోంది.
అట్లా అడ్డుపడుతున్నది ఏమిటో?
అందుకు కారణం ఏమిటో?
అందుకు బాధ్యులు ఎవరో?
నిజం తెలుసుకోవలసిన ,తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.