అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు.

ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు నీళ్లులేక గొంతెండిన బతుకుల గోసను విన్నాడు. రాజ్యహింసలో తల్లడిల్లుతున్న పల్లెల గోడును చూశాడు. అలజడి. సంఘర్షణ. లోపలా, బయటా. దీంతో అక్షరం అతనికి ఆయుధమైంది. నడవాల్సిన తొవ్వను చూపింది. అది వెలుగు దారి. వెన్నెల దారి. నిప్పుల వాగై ఉప్పొంగే దారి. అది తెలంగాణ రైతాంగం సాయుధమై నినదించిన దారి. నక్సల్బరీ, శ్రీకాకుళం, తెలంగాణల్ని రగిలించిన వసంత మేఘగర్జనల దారి. అట్లాంటి దారిలో నడిచాడు సలంద్ర. వేడిగాలై వీచాడు. ఝంఝామారుత రణన్నినాదమై. హోరుహోరుగా. పోరుజెండై. భావాలను సాయుధం చేశాడు. సున్నితమైన భావాల సలంద్ర. గొంతెత్తి పాడిన గోరువంక. నెత్తురోడే నెలవంకల కవాతు. జీవితాన్ని ప్రేమించినంత లోతుగా చావునూ ప్రేమించిన విలుకాడు. ఆ చావుకు సార్థకత వుండాలని తపించాడు. చివరి ఊపిరిదాకా జనం కోసమే బతికాడు.

సలంద్ర లక్ష్మీనారాయణ. 12 జనవరి, 1956లో నిజామాబాద్‌లోని దారు గల్లీలో పుట్టాడు. నిరుపేద దళిత కుటుంబం. పాఠశాల వయసులోనే (1972లో) హేతువాదం వైపు నడిచాడు. కర్మ సిద్ధాంత పునాదులపై నిర్మించిన పుక్కిటి పురాణాల్ని ప్రశ్నించాడు. భావవాదాన్ని ధ్వంసం చేశాడు. చిన్ననాటి నుంచే అన్వేషణ. అది తీరని దాహాల అన్వేషణ. అక్షరాల్లో వెల్లువెత్తిన వేనవేల సంద్రాల్ని గుండెల్లో నింపుకున్న అన్వేషణ. ఈ వెతుకులాటలో అతనికో దారి ఎదురైంది. ఆ ప్రత్యామ్నాయ ఆలోచనా ధారలో మమేకమయ్యాడు. కలలై. అలలై. పాటలై హోరెత్తాడు. 1973లో హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు. చుట్టూ అలముకున్న చీకట్లు. పేదరికం. కన్నీళ్లు. కష్టాలు. గుండెతడి వున్న మనిషి కదా!. మనుషుల కోసం తపించాడు. వెలి గాయాలను గేయాలల్లాడు. అతనికి బతుకే ఓ యుద్ధమని తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రతిఘటనై నిలబడ్డాడు. కలబడ్డాడు. నమ్మిన విశ్వాసాల కోసం పల్లేరుగాయల్ల నడిచాడు. సలపరించే గాయాలు. మానని గాయాలు. కళ్లెదుటే ధ్వంసమైపోతున్న స్వప్నాలు. అతణ్ని రాటుదేల్చాయి. వడిసెల రాయిలా మలిచాయి. అందుకే గురితప్పని విలుకాడయ్యాడు. ఎక్కుపెట్టిన పద్యమయ్యాడు. అతని అక్షరాల నిండా ధిక్కారం. ప్రతిఘటన. పోరాటం. అది వర్గపోరాటం.

అది నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వలు దావానలమైన సందర్భం. ఆ మంటలు శ్రీకాకుళం అడవుల మీదుగా ఉత్తర తెలంగాణను అంటుకున్న సందర్భం. నక్సల్బరీ వెల్లువ దేశవ్యాప్తంగా యువతరాన్ని పోరాటాల్లోకి కదిలించింది. విశ్వవిద్యాలయాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. అది దోపిడీ వ్యవస్థకు నిప్పంటించిన కాలం. ‘నక్సల్బరీ ఏకీ రస్తా’ నినాదం మార్మోగుతున్న కాలం. పల్లె పల్లెనా పల్లవించిన కాలం. ‘నెత్తురు మండే శక్తులు నిండిన’ యువతరం నక్సల్బరీ తొవ్వను ఎంచుకున్న కాలం. 1969లో ‘తిరగబడు’, 1970లో ‘మార్చ్‌’ కవితా సంపుటాలు తెలుగు సాహిత్యంలో కొత్త వెలుగుల్ని ప్రసరించాయి. 1970 ఫిబ్రవరిలో ‘రచయితలారా… మీరెటు వైపు?’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాల్‌ తెలుగు సాహితీరంగాన్ని కుదిపేసింది. 1970 జులై 4న విప్లవ రచయితల సంఘం ఏర్పడిరది. తెలుగు నేలంతా విప్లవ ప్రభంజనమైంది. అట్లాంటి కాలమే సలంద్రనూ వెలిగించింది. సలంద్ర నక్సల్బరీ రాజకీయాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాడు. ‘దున్నేవారికే భూమి’ నినాదం విప్లవాన్ని ప్రేమించేలా చేసింది. సామాజిక బాధ్యతగా జర్నలిజాన్ని ఎంచుకున్నాడు. 1974లో ‘యిందూరు వాణి’ పత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాడు. ‘ప్రజారాజ్యం‘ పత్రిక ఎడిటింగ్‌లో సహాయకుడిగా, ‘ఆంధ్ర పత్రిక’కు విలేకరిగా పనిచేశాడు. 1975లో సిద్ధాంత విబేధాల వల్ల ‘యిందూరు భారతి’కి రాజీనామా చేశాడు. 1975లో సలంద్ర మిత్రుడు బైస రామదాసు ‘కేకలు’ పత్రిక స్థాపించాడు. ఆ పేరును సూచించింది సలంద్రే. ఆ పత్రిక రూపొందడం వెనక సలంద్ర ఆలోచనలున్నాయి. కృషి వున్నది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకుడు జంపాల చంద్రశేఖర ప్రసాద్‌, మరికొందరు మిత్రుల సహచర్యం సలంద్ర ఆలోచనల్ని విశాలం చేశాయి.

వరంగల్‌ రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కేంద్రంగా 1972 నాటికే కామ్రేడ్‌ సూరపనేని జనార్దన్‌ విప్లవ విద్యార్థి రాజకీయాలను నిర్మించాడు. అదే ఏడాది ఏప్రిల్‌ 14న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రగతిశీల విద్యార్థి నాయకుడు కామ్రేడ్‌ జార్జిరెడ్డిని మతోన్మాద గూండాలు హత్యచేశారు. క్యాంపసంతా అల్లకల్లోలమైంది. మతోన్మాదాన్ని ఎదిరించే యువతరం సంఘటితమైంది. సమసమాజ స్థాపన కోసం పోరాటమే మార్గమని నమ్మింది. తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి విప్లవ శిబిరాలు కలిసి పనిచేసిన కాలంలో ‘డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌’ (డీఎస్‌యూ) ఏర్పడింది. పుల్లారెడ్డి శిబిరం విడిపోవడంతో కొందరు విద్యార్థులు ‘ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌’(పీడీఎస్‌యూ) ఏర్పాటు చేసుకున్నారు. చారుమజుందార్‌ మార్గాన్ని అనుసరించే విద్యార్థులతో 1974 అక్టోబర్‌ 2న రాడికల్‌ విద్యార్థి సంఘం (ఆర్ఎస్‌యూ) ఏర్పడింది. గ్రామాలకు వెళ్లింది. రైతులు, కూలీలతో మమేకమైంది. భూసంబంధాలను అధ్యయనం చేసింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రైతాంగానికి వ్యవసాయిక విప్లవ సందేశాన్నందించింది. రైతుకూలీ సంఘాల నిర్మాణం, భూస్వాధీన పోరాటాలకు పిలుపునిచ్చింది. అది జగిత్యాల జైత్రయాత్రయింది (1978 సెప్టెంబర్‌ 8). చెలరేగిన విప్లవ ప్రభంజనమైంది. 1975 జులై 25న విప్లవ విద్యార్థులు సూరపనేని జనార్దన్‌, మురళీమోహనరెడ్డి, ఆనందరావు, సుధాకర్‌లను మెదక్‌ జిల్లా గిరాయిపల్లిలో పోలీసులు చెట్లకు కట్టేసి కాల్చిచంపారు. అదే ఏడాది నవంబర్‌ 5న నీలం రామచంద్రయ్య, జంపాల చంద్రశేఖర ప్రసాద్‌లను గుంటూరులో అరెస్టుచేసి కాల్చిచంపారు. చండ్ర పుల్లారెడ్డి సీపీఐ (ఎం.ఎల్‌.) నిర్మాణం చేసిన తర్వాత నీలం రామచంద్రయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు, విద్యార్థులను విప్లవ రాజకీయాల వైపు తీసుకొచ్చాడు. జర్నలిజం విద్యార్థి యాధాటి కాశీపతి సహచర విద్యార్థులపై తీవ్ర ప్రభావం వేశాడు. జంపాల ప్రసాద్‌ అమరత్వం తర్వాత శ్రీపాద శ్రీహరి, మధుసూదన్‌ రాజ్‌, జావీద్‌, ప్రదీప్‌ మరికొందరు పీడీఎస్‌యూ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. 1976 నవంబర్‌లో చంచల్‌గూడలో సీపీఐ (ఎం.ఎల్‌.) కార్యదర్శి పొట్ల రామనర్సయ్య, శ్రీపాద శ్రీహరిలను పోలీసులు అరెస్టుచేశారు. వరంగల్‌ జిల్లా పాకాల చెరువు దగ్గర చిలకలగుట్ట అడవిలో కాల్చిచంపారు. ఈ వరుస సంఘటనలు సలంద్రను నిలువనీయలేదు. ఆలోచింపజేశాయి. అలజడిరేపాయి.

అదేకాలంలో నిజామాబాద్‌లో ‘ప్రజాసాహితీ యువ రచయితల వేదిక’ ఏర్పడిరది. సలంద్ర ఆ సంస్థ ప్రథమ కార్యదర్శిగా ఉంటూ ‘వేడిగాలి’ (మార్చ్‌, 1976) సంకలనం ప్రచురించాడు. అప్పటికి డిగ్రీ విద్యార్థి. ఇరవయేళ్ల వయసులోనే లోతైన జీవన తాత్వికత అలవడిరది. జీవితంలోనూ, కవిత్వంలోనూ. ‘వేడి గాలి’కి శ్రీశ్రీ స్వాగతం పలికాడు. ‘ఇవి ఫాసిజానికి పక్కలో బల్లేలయితే, ప్రజలకు వైతాళిక గీతాలు’ అని రాశాడు. సలంద్ర 1976 జూన్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అప్పటికే ‘సృజన’, ‘జీవనాడి’, ‘ఎరుపు’, ‘అరుణతార’, ‘పిలుపు’, ‘నూతన’ పత్రికలు క్యాంపస్‌లో వర్గపోరాట రాజకీయాలను ప్రచారం చేశాయి. బ్యానర్లు, గోడల మీద నక్సల్బరీ నినాదాలు యువతరం రక్తాన్ని పరవళ్లు తొక్కించిన కాలమది.

ఉస్మానియా యూనివర్సిటీ ‘లా’ కాలేజీ విద్యార్థి మల్లోజులు కోటేశ్వరరావు, రాంచందర్‌ విప్లవోద్యమంలోకి వెళ్లారు. వాళ్ల ప్రభావం క్యాంపసంతా వ్యాపించింది. విద్యార్థుల్ని చైతన్యం చేసింది. గద్వాలకు చెందిన సుదర్శన్‌, పటేల్‌ సుధాకర్‌ రెడ్డి పాలమూరు విప్లవోద్యమాన్ని నిర్మాణం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ ఎం.ఏ (ఫిలాసఫీ) విద్యార్థులు ఎర్రంరెడ్డి సంతోష్‌ రెడ్డి, రంగవల్లి విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌ పాలనలో 1985 నాటికే ‘ఆట మాట పాట’ బంద్‌ అయింది. అప్రకటితం నిషేధం అమలైంది. తీవ్ర నిర్బంధం మధ్యే విప్లవ విద్యార్థి నాయకులు మేకల దామోదర్‌ రెడ్డి, రామేశ్వర్‌, విజయ్‌ కుమార్‌ 1992 దాకా రాడికల్‌ విద్యార్థి సంఘాన్ని విస్తరింపజేశారు. చంద్రశేఖర్‌ (నిజాం కాలేజీ), ఎంఎస్ఆర్‌ (వాసవీ ఇంజనీరింగ్‌ కాలేజీ), రమణారెడ్డి, మఠం రవికుమార్‌(మంజీర) (ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీ), ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుంచి వీరారెడ్డి (‘భూమిపుత్రుడు’ వీరన్న), వెంకటయ్యలు ఉస్మానియా యూనివర్శిటీని యుద్ధక్షేత్రంగా మలిచారు.

నక్సల్బరీ వెల్లువలో సమసమాజాన్ని కలగన్న ఓ తరం, పల్లెల నుంచి ఉస్మానియా యూనివర్శిటీకి ఎదురీదుతూ వచ్చింది. కోటి ఆశలతో. ఓయూ క్యాంపస్‌లో నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నాళేశ్వరం శంకరం, జింబో (మంగారి రాజేందర్‌), కె.ముత్యం, గుడిహాళం రఘునాథం, అల్లం నారాయణలతో సలంద్రకు స్నేహం కుదిరింది. మల్లయ్య బండ క్యాంటీన్‌, బషీర్‌ హోటళ్లలో ఎడతెగని సాహితీ చర్చలు. పండు వెన్నెల్లో క్యాంపస్‌ రోడ్లపై చెట్ల వెలుగు నీడల్లో కవిత్వమై ప్రవహించిన కాలం. కరపత్రమై ఎగసిన కాలం. ‘విప్లవాల యుగం మనది… విప్లవిస్తె జయం మనదే’ అని నినదించిన కాలం. ఈ కాలాన్నంతా కాగడాలా వెలిగించాలని కలలుగన్నాడు సలంద్ర. సాహితీ చర్చల కోసం సంఘం పెట్టమని మిత్రులకు సలహా ఇచ్చాడు. దీంతో 1976లో ‘ఉస్మానియా యూనివర్సిటీ రైటర్స్‌ సర్కిల్‌’ ఏర్పడింది. విశాల ప్రాతిపదికన ఏర్పడిన సంస్థ ఇది. ఇందులో పీడీఎస్‌యూ, ఆర్ఎస్‌యూ, డీఎస్ఓ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్‌ సంఘాల విద్యార్థులు సభ్యులు. ఈ సంస్థ కల్లోల దశాబ్ధి గుండెచప్పుళ్లను రికార్డ్‌ చేసింది. 1971-80ల మధ్యకాలాన వచ్చిన కవిత్వంతో డిసెంబర్‌ 1982లో ‘ఈతరం యుద్ధకవిత’ సంకలనం ప్రచురించింది. ‘దందహ్యమాన దశాబ్దాన్ని’ చరిత్రలో నమోదుచేసింది. దీనికి లక్నారెడ్డి, కె.నర్సింహాచారి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గుడిహాళం రఘునాథం, గుంటూరు ఏసుపాదం సంపాదకులు. ‘‘కవిత్వాన్ని బలమైన ఆయుధంగా చేసుకొని అచంచల దీక్షతో జీవితాంతం ఈ క్రూర వ్యవస్థతో యుద్ధంచేసి ఈతరానికి ఆదర్శంగా నిలిచిన విప్లవ కవి చెరబండరాజుకు అంకితమిచ్చారు.

సలంద్ర 1977లో నిజామాబాద్‌ జిల్లా ‘అంబేద్కర్‌ యువజన సంఘం’ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. పల్లె పల్లెనా తిరుగుతూ అంబేద్కర్‌ని పరిచయం చేశాడు. మార్క్సిజాన్ని అధ్యయనం చేశాడు. వర్గపోరాటంలో కుల నిర్మూలనా పోరాటాన్ని అంతర్భాగంగా ఎట్లా చేయాలో అర్థం చేసుకున్నాడు. గతితార్కిక చారిత్రక భౌతికవాదం వెలుగులో సమాజాన్ని విశ్లేషించాడు. మార్క్సిజమే మార్గమనీ, సోషలిజమే ప్రత్యామ్నాయమని నమ్మాడు. 1979లో ప్రజాసాహితీ ప్రచురణగా ‘చావుగీతం’ ప్రకటించాడు. ‘బూర్జువా సమాజాల్లో విలువలు ఆర్థికతతో ముడిపడి వుంటాయని తెలియక జీవితాంతం బాధలనుభవించే వారికి సానుభూతితో ఈ కవిత’ అని పీడిత జనం గుండెచప్పుళ్లను మోగించాడు. పేదజనం బతుకు పునాదులపై నిర్మించిన చీకటి సామ్రాజ్యాలు ఎప్పటికైనా కూలక తప్పదన్నాడు. ఆకలికీ దోపిడీకి మధ్య పోరాటం నిరంతరమని తెలుసు. దోపిడీ, పీడనల్ని కూల్చడానికి దీర్ఘకాలిక పోరాటం ఒక్కటే మార్గమనీ తెలుసు. అందుకే పోరాటాన్ని ప్రేమించాడు. జీవితాన్ని ప్రేమించాడు. అంతే ఇష్టంగా చావునూ ప్రేమించాడు. అందుకే ‘నేను జీవితంతో చేతులు కడిగాక’ అని వీలునామా రాసుకున్నాడు. అది డెత్‌ సెంటెన్స్‌. ‘చావాలని వుంది’ అని రాసుకున్న మరణ వాంగ్మూలం. కానీ, చావుకొక సార్థకత వుండాలని తపనపడ్డ డెత్‌ సెంటెన్స్‌. అందుకే…
‘‘చస్తే అల్లూరి ఎందుకు చచ్చాడో
భగత్‌ ఎందుకు చచ్చాడో
చివ్వర్కి
జంపాల చంద్రశేఖర ప్రసాద్‌
ఎందుకు చచ్చాడో
అందుకే నాకు సైతం చావాలనే అనిపిస్తుంది’’ అని రాసుకున్నాడు. ‘డెత్‌ ది డియర్‌’ అంటూ చావును ప్రేమగా పిలిచిన అక్షరం అది. ‘ఈ రాత్రే నేను తూర్పు గగనాన దీపం వెలిగిస్తున్నాను’ అని రేపటి సూర్యోదయాన్ని కలగన్నాడు. ఎరుపెక్కిన తూర్పుగాలిని ఊపిరిగా నింపుకున్నాడు.

సలంద్ర 1980లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజం, న్యాయశాస్త్రం చదివాడు. ఒకవైపు చదువు. పత్రికా రచన. మరోవైపు విప్లవ రాజకీయాలు. సలంద్ర, అల్లం నారాయణ, మరికొందరు మిత్రులు ఓయూ క్యాంపస్‌ ‘సి’ హాస్టల్‌ (రూమ్‌ నం.35)లో ఉండేవాళ్లు. అది విప్లవ రాజకీయ చర్చలకు కేంద్రం. వేలాది రాడికల్‌ విద్యార్థులకు నీడనిచ్చిన తావది. అదే కాలంలో ‘సృజన’, ‘జీవనాడి’, ‘ఎరుపు’, ‘పిలుపు’, ‘అరుణతార’ పత్రికలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం వేశాయి. క్యాంపస్‌ గోడలపై నక్సల్బరీ రాజకీయ నినాదాలు విద్యార్థుల్ని ఉత్తేజపరిచేవి. ‘సలంద్ర’ ఆర్ట్స్‌ కాలేజీ ఎన్నికల్లో రాడికల్‌ విద్యార్థి సంఘం అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాడు. 1983లో రమను ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఆంధ్రభూమిలో పార్ట్‌ టైమ్‌ విలేకరిగా పనిచేశాడు. 1985లో జర్నలిస్టు యూనియన్‌కు సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

ప్రజా రాజకీయాల ఆచరణలో ఉంటూనే కవిత్వానికి పదును పెట్టుకున్నాడు. పాటలు రాశాడు. గుండె గుండెనూ మండించే రగల్‌ జెండా రణన్నినాదాల్ని గోడలపై అందమైన అక్షరాల్లో రాసేవాడు. బీడీ ముక్కను రంగుల్లో ముంచి వాల్‌ పోస్టర్‌ రాసేవాడు సలంద్ర. అతని మునివేళ్లు తాకని నినాదం లేదు. అతని గొంతులో రగలని రణన్నినాదం లేదు. ప్రతీ క్షణాన్నీ కాగడాలా వెలిగించాడు. రాత, మాట, పాటల్ని సాయుధం చేశాడు. పెద్ది శంకర్‌ అమరత్వంపై అద్భుతమైన పాట రాశాడు. ఈ పాట ఆనాటి రాడికల్స్‌లో ఉజ్వల గీతికగా మార్మోగింది. ‘జన్ను చిన్నాలో… గన్ను చిన్నాలో’ అంటూ చిందేస్తూ పాడేవాడు. అతడు భూతల్లి ఒడిలో పెరిగిన చెమట చిత్తడి జీవితాలను గానం చేశాడు. ‘జన్నూ నువు చావలేదు… చావు నీకు లేనేలేదు…’అంటూ గన్నులై పేలుతామన్నాడు. ఈ పాట ‘జనం చిన్నాలు’ కవితా సంకలనంలో అచ్చయింది.
‘‘పొద్దింకా పొడవలేదు
పోరాటం ఆగలేదు
పెద్ది శంకరూ నీకు
పోరాటపు లాల్‌ సలాం…’’ అమరుడు పెద్ది శంకర్‌ జ్ఞాపకాల్లో రాసిన పాట. ప్రాణహిత అడుగుతోంది నువ్వెక్కడ పోయావని. చెరచబడ్డ చెల్లెలు కుమిలి ఏడుస్తోంది. మూగబోయిన మొయిబిన్‌ పేట. జన సంద్రపు అలలకు చావులేదు. అట్లా ఈ భూమిపై ఎప్పటికీ చావులేని మనుషుల గురించి తపనపడ్డాడు సలంద్ర. కామ్రేడ్‌ వీవీ రాసినట్టు… ‘తల్లి గర్భానికీ స్మశానానికీ మధ్య ఊరేగింపు’ సలంద్ర కవిత్వం. పాట. మాట. వాన చినుకై జనం కనుపాపల్ని ముద్దాడిన సలంద్ర ఆట. చిందాట.
‘‘నేను
భూమికీ.. ఆకాశానికీ వున్న
సంబంధాన్ని చెప్తే వీళ్లు (సృజన, ఫిబ్రవరి 1978).
నవ్వుతారు…’’ అని కోరస్‌ పాడాడు. ‘‘ఆలోచనలకూ ఆచరణకూ అర్థంచెప్తే వీళ్లే అపార్థం చేసుకుంటారు’’ అని వాస్తవికతను చెప్పాడు. విప్లవకారుల మహోన్నత ఆశయాలను చెప్తూ…
‘‘కొందరు నన్ను
సుత్తిగా పిలిస్తే (అరుణతార, జూన్‌`నవంబర్‌ 1978)
మరికొందరు కొడవలిగా పిలుస్తారు…’’ అన్నాడు. ఎవరే పేరుతో పిలిచినా నేను మాత్రం శ్రమైక జీవినే. ఘర్మ బిందువునే అన్నాడు. అట్లా భూమితో మాట్లాడే మనుషుల గురించి కలవరించాడు. కవిత్వమై పలవరించాడు. సలంద్ర కవిత్వం ఓ నదీ ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసే సంద్రం. అతని అక్షరాల నిండా మట్టిమనుషుల గుండెచప్పుళ్లు. అతని వాక్యాల నిండా శ్రమజీవుల చెమట చిత్తడి పరిమళాలు.

యూనివర్సిటీల్లో వీరంగమాడే కాషాయ మూకలకు సలంద్ర ముగుతాడు వేశాడు. ‘ఈ దేశంలో ఉండాలంటే వందేమాతర గీతం పాడాల్సిందే’ అని విర్రవీగిన తామర పూలను తన అక్షరాలతో తూర్పారబట్టాడు. మతోన్మాద మత్తులో జోగుతూ, కులోన్మాదంలో పొర్లాడే దారితప్పిన యువతను సొంత అన్నలా మందలించాడు. మార్పు తెచ్చాడు. మానవత్వాన్ని మరిచి జాతీయతను ప్రశ్నించే దగుల్బాజీ నాజీ భావాలకు అగ్గిపెట్టాడు. నేటికీ కొనసాగుతున్న మధ్య యుగాల నాటి భావాలను దగ్ధం చేశాడు. నిలువెల్లా ధ్వంసంచేశాడు. ఈ నేపథ్యంలో సలంద్ర రాసిన కవిత. ‘జాతీయత’.
‘‘స్మశానంలో అడుగుపెట్టి
శవాలకు ప్రాణం పోయాలనుకునే
తెలివిలేని తమ్ముడూ

కుళ్లునీ కుట్రల్నీ కుహకాల్నీ
సంస్కృతి పేరిట పహారా కాసే
మత మౌఢ్యపు కుక్కా

ఆలోచనలకూ కాంతి కిరణాలకీ
జాతీయత వుండదు
భావాలు ఎక్కడ పుట్టినా ఒక్కటే
భావాలు భావాలే

సూర్యుడి జాతీయత
ముందు ఏదో కనుక్కో (అరుణతార, జనవరి 1981)
నా జాతీయత ఏదో తెలుస్తుంది నీకు…’’ అంటూ ‘జాతీయత’ పేరుతో నాజీల్లా మారిన మతోన్మాద, జాతీయోన్మాదాలను ఎదుర్కొన్నాడు. మతతత్వ ఫాసిజాన్ని ఎదిరించాడు. జాతీయత ముసుగులో ఉన్నదంతా అభివృద్ధి నిరోధక, ఛాందసవాద భావాలే. హేతురహిత క్షీణభావాలే. అది సమాజాన్ని తిరోగమనం వైపు మళ్లించే కుట్ర. ప్రజల్ని అడుగడుగునా అణచివేసే కుట్ర. ఇట్లాంటి కుట్రల్ని పసిగట్టాడు సలంద్ర. దేశాన్ని మధ్యయుగాల దారుల్లోకి మళ్లింపజూస్తున్న హిందూ మతోన్మాదాన్ని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చాడు.

సలంద్ర 1981లో ‘దళిత్‌ మానిఫెస్టో’ ప్రకటించాడు. ఇది ఆనాటి యువతరాన్ని ఆలోచింపజేసింది. దిక్సూచిలా నిలిచింది. నడవాల్సిన దారిని చూపింది. అందులో ఉన్నదల్లా విప్లవ వాస్తవికతే. సలంద్ర మదిలోని భావాలను సూటిగా, స్పష్టంగా వ్యక్తం చేశాడు. మాటైనా. కవిత్వమైనా. పాటైనా. ఇది దేశీ కవిత్వ ధిక్కార ఒరవడి. అట్టడుగు ప్రజల మౌఖిక కళారూపాల నుంచి అందుకున్న అడుగుజాడ. భాష, శైలి, శిల్పం, పదచిత్రాలు, భావచిత్రాలు, ప్రతీకలు, ఉపమానాల్ని ఒడుపుగా చిత్రించిన అభివ్యక్తి. సలంద్రది దృశ్య శైలి. విప్లవ కవిత్వంలో ఇది సరికొత్త డిక్షన్‌. అతడు విప్లవ కవిత్వ వస్తురూపాల్ని విస్తృతం చేశాడు. ప్రతీ సామాజిక సందర్భాన్నీ కవిత్వంగా మలిచాడు. వర్తమాన కల్లోలాన్ని రికార్డ్‌ చేశాడు. నిజాయితీ, నిబద్ధత, నిమగ్నత, ఆలోచన, అవగాహన, ఆవేశం, సామాజిక స్పృహ, శ్రమైక జీవన సౌందర్యం, స్పష్టమైన రాజకీయ దృక్పథం కలగలిసిన కవిత్వం ఇది. మనిషిని మనిషిగా చూడని మతాన్ని ధ్వంసంచేయాలని పిలుపునిచ్చాడు. కులాన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నాడు. అంతిమంగా వర్గపోరాటమే విముక్తి మార్గమని చాటాడు. వస్తుశిల్పాల ఐక్యతతో ప్రభవించిన అద్బుతమైన కవిత్వం సలంద్రది. ‘పొద్దింకా పొడవలేదు’, ‘కోరస్‌’, ‘మహోన్నతానంతం’, ‘అమరుడు’, ‘కాంట్రడిక్షన్స్‌’, ‘జాతీయత’, ‘నిప్పంటిద్దాం’, ‘దళిత్‌ మానిఫెస్టో’లాంటి అద్భుతమైన కవిత్వం రాశాడు. తన అనుభవాలను, ఆచరణాత్మకంగా పదునుపెట్టుకొనే సమయంలోనే సలంద్ర ఆరోగ్యం పాడైంది. రోజు రోజుకీ క్షీణించింది. వాంతులు, ఫిట్స్‌ ఎక్కువయ్యాయి. దీంతో 1986 సెప్టెంబర్‌ 14న ఉస్మానియా ఏఎంసీ వార్డ్‌లో చేరాడు. వైద్యం అందుతున్న క్రమంలోనే అపస్మారక స్థితికి చేరాడు. మరుసటి రోజు ఫిట్స్‌ తగ్గాయి. అప్పడడప్పుడూ కొద్దిగా స్పృహలోకి వస్తున్నాడు. 16న మేల్కొన్నాడు. కళ్లు తెరిచాడు. మనుషుల్ని గుర్తించాడు. మెడినోవాలో పరీక్షించారు. ట్యూమర్‌ గ్లోమా ఉన్నట్లు నిర్ధారణయింది. ఆ మూడు రోజులూ మూత్రం రాక అవస్థపడ్డాడు. 17న ఆకస్మికంగా ఊపిరొదిలాడు. తన జీవితమంతా ఉద్యమాలు, పోరాటాలే. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడిన సలంద్ర మరణం దినపత్రికల్లో సింగిల్‌ కాలమ్‌ వార్తయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక చనిపోతే, సాధారణ మరణంగా రిపోర్ట్‌ చేశారు. జర్నలిస్టులు హంతక వ్యవస్థకు కొమ్ముకాశారు.

సలంద్రకు జీవితమంటే ఎంత ప్రేమో…చావన్నా అంతే ప్రేమ.అందుకే జీవితాన్ని ప్రతీ క్షణం సంరంభంగా మార్చుకున్నాడు. ‘నా శవానికి నిప్పంటించండి’ కవితలో జీవితమంటే ఏమిటో చెప్పాడు. జీవితం విలువను చెప్పాడు
“చావుకు సైతం ఒక కిరీటం పెట్టిన
సెల్యూట్‌ చేయ వీలు కల్పించిన
ఒక భగత్‌ సింగ్‌లా
ఒక అల్లూరిలా చావాలి…’’ అని రాసుకున్నాడు. అట్లాంటి సార్థక జీవితాన్ని కోరుకున్నాడు. అట్లనే బతికాడు.

విరసం ఇరవై ఏళ్ల సభల సందర్భంగా జంట నగరాల శాఖ 1990 జనవరి 11న ‘మన సలంద్ర’ పేరుతో పుస్తకం ప్రచురించింది. అతని స్నేహం, స్వభావం, చైతన్యం, పోరాటతత్వం, వ్యక్తిత్వాలను స్మరించుకున్నది. సలంద్ర మనకు భౌతికంగా దూరమై ముప్ఫై ఆరేళ్లు దాటింది. కాలమేమీ మారలేదు. అదే దోపిడీ. అదే పీడన. అదే అణచివేత. వివక్ష. భారత పాలకవర్గం ఆర్థిక సంస్కరణల పేరుతో దేశ సంపదనూ, సహజ వనరులనూ సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టింది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణను అమలుచేస్తోంది. సహజ వనరుల్ని కాపాడుతున్న ఆదివాసీలపై యుద్ధానికి దిగింది. ‘ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌’ నుంచీ ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ దాకా ఆదివాసీలపై మారణకాండ కొనసాగిస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన రాకుండా హిందూ మతోన్మాదాన్ని ఆశ్రయించింది. మతమే రాజ్యమైంది. రాజ్యమే మతమైంది. మతం, రాజ్యం కలిసి ఫాసిజంగా మారింది. దేశమే జైలయింది. రాజ్యాన్ని ప్రశ్నిస్తే కంఠాలు తెగిపడుతున్నవిషాధ సందర్భం. ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న ఫాసిజాన్ని నిలువరించేందుకు, ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రకటన చేయాల్సిన సందర్భమూ ఇదే. సాంస్కృతిక ప్రతివ్యూహాన్ని నిర్మించాల్సిన తక్షణ అవసరమూ ఇదే.

సలంద్ర రాసిన ‘జాతీయత’, ‘నిప్పంటిద్దాం’, ‘దళిత్‌ మానిఫెస్టో’లను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ఈ తరానికి సలంద్రను, ఆయన కవిత్వాన్ని పరిచయం చేయాలని విరసం భావించింది. ఆయన జీవించి ఉండగా వెలువడిన ‘చావుగీతం’, ‘వేడిగాలి’ కవితా సంపుటాలను, మరణానంతరం విరసం అచ్చువేసిన ‘మన సలంద్ర’ పుస్తకాన్ని కలిపి ఈ సమగ్ర సంకలనం తీసుకొస్తున్నాం. మొదటి రెండు పుస్తకాల్లో లేని కొన్ని కవితలు, ఆయన స్మృతిలో మిత్రుల రచనలు ‘మన సలంద్ర’లో ఉన్నాయి. ఆయన జ్ఞాపకాల్లో మరి కొన్ని రచనలు కూడా ఉండవచ్చు. ఇది సలంద్ర కవిత్వ సర్వస్వం కాబట్టి ఇక్కడికే పరిమితం అయ్యాం. విప్లవ కవిత్వ ఉద్యమంలో రెండో తరానికి చెందిన ‘సలంద్ర కవిత’ను చదవండి. ఆయన అక్షరాల్లోకి చూడండి. ఓ వెలుగు రేఖ మిమ్మల్ని వెలిగిస్తుంది. ఓ వేడిగాలి మిమ్మల్ని నిలువెల్లా అలముకుంటుంది. తూర్పు దారుల్లోకి నడిపిస్తుంది. హోరెత్తే నక్సల్బరీ నినాదమై. వెన్నెల రాత్రుల్లో రణన్నినాదమై. వసంత గీతమై. మార్మోగే రేరేలా పాటలై.

సలంద్ర అన్నట్టు… పొద్దింకా పొడవలేదు. పోరాటం ఆగలేదు.
లాల్‌ సలామ్‌ కామ్రేడ్‌ సలంద్ర.

– శివరాత్రి సుధాకర్‌
హైదరాబాద్‌
నవంబర్‌, 2022

One thought on “లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

  1. గొప్ప పరిచయం. సలంద్ర జీవితాన్ని ఆవిష్కరించారు

Leave a Reply