జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే…’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు.

అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ అనిపించుకోవచ్చు. కాని మంచి కథ అవుతుందన్న గ్యారంటీ లేదు. అంచేత వొక కథకు స్థల కాలాలని తప్పనిసరి చేసినట్టే కథకునికి దృష్టీ దృక్పథం తప్పనిసరి చేసుకోవాలి, అప్పుడే ఆ కథ అర్థవంతమైన కథగా మారుతుంది.

కంటికి కనిపించేది చూపు. కాని ఆ చూపుకు బుద్ధిని జోడించినప్పుడు అది దృష్టి అవుతుంది. ఆ దృష్టిని తమదైన తత్త్వంలో చూస్తే దృక్పథం అవుతుంది. అందుకుగాను అనేక తత్త్వాలు లోతుగా విస్తారంగా చూడడానికి పనిముట్లుగా ఉపకరిస్తాయి. సహకరిస్తాయి. అందుకే వొకే వస్తువుని యెన్నుకొని కథగా మలిచినా కథకుడి దృష్టికోణంవల్ల దృక్పథంవల్ల ఆయా కథలన్నీ వొకేలా వుండవు.

దీన్ని మనం సాధారణ అర్థంలో లోచూపు అంటాం. కథలో పైకి కనిపించే అంశాలతో రూపు కట్టినా ఆ కథకుడి అంతః దృష్టివల్ల అతః సారం దర్శనమిస్తూ బోధ పరచాల్సినదేదో బోధ పరుస్తుంది. అప్పుడు ఆ కథా ప్రయోజనం నెరవేరుతుంది.

ఈ సందర్భంగానే కారా మాస్టారు ‘సత్యం – వాస్తవికత – కాల్పనికత’ల పాత్రని గ్రహించాలని అనేక మార్లు చెప్పారు. ‘కళ్ళకు కనిపించేది సత్యం. ఆ సత్యం వెనుక దాగి వుండేది వాస్తవం. వాస్తవికతను గురించిన సంఘటనలని సన్నివేశాలని పాత్రల ప్రవర్తనలని కల్పించేది కాల్పనికత’ అని.

మన దృష్టీ దృక్పథం వల్లనే కార్య కారణ సంబంధాలను సరిగా అంచనా వేయగలుగుతాము. కార్య కారణ సంబంధాలు వ్యక్తంగానో అవ్యక్తంగానో కథలో యిమిడి వుంటాయి. పాఠకుడి బుద్ధినీ మేధనీ జోడించినప్పుడు ఆ రచనలో అవి పొరలు పొరలుగా అందుతాయి. చదివేకొద్దీ అవగాహన పెరిగేకొద్దీ కొత్త పొరలూ కంటపడతాయి.

అయితే మన లోచూపు యెంత లోతు తక్కువదో మాస్టారి మాటల్లో వొకసారి బయటపడింది. కథల్లోనైనా సినిమాల్లోనైనా ‘యాక్సిడెంటు’లు జరుగుతూ వుంటాయి. కథని మలుపు యెటు తిప్పాలో తెలియనప్పుడు కథకుడో దర్శకుడో ఆ పాత్ర వెళ్తున్న వాహనం స్టీరింగ్ తిప్పేసి యాక్సిడెంటు జరిపిస్తాడు. ఏం చేయాలో తెలియనప్పుడు యాక్సిడెంటులు చేస్తామని నా అవగాహన. అవసరం కొద్దీ కూడా యాక్సిడెంటులు జరిపిస్తాం. నాకే కాదు, చాలామందికి యాక్సిడెంటు అంటే యాక్సిడెంటే. యాదృచ్చికమే. ఊహించనిదే. అనుకోకుండా జరిగేదే.

మాస్టారి లోచూపు యిందుకు భిన్నమైంది. కథకులు ఆలోచించవలసింది. అవగాహన చేసుకోవలసింది. ‘యాక్సిడెంటులు వొత్తినే జరగవు. ఆ యాక్సిడెంటు జరిగిన ‘స్థలం’ రోడ్డు. అంటే రోడ్డు పొడవు వెడల్పులూ వచ్చీ పోయే వాహనాల రద్దీ. యాక్సిడెంటు జరిగిన ‘కాలం’ సమయం. అంటే వీకెండ్ రద్దీ అధికంగా వుంటుంది, కొన్ని వేళలు మనం పీక్ అవర్స్ అంటాం కూడా. ఇలా యివన్నీ కారణాలవుతాయి. ఆ తరువాతే ఆ పాత్ర మానసిక వొత్తిడీ ఆలోచనలూ అంటే యెక్కడో వుండి నడపడం లేదా ఆ పాత్ర అవసరం వల్ల అనవసర వేగమూ యింకా ఆ పాత్ర వయసూ దూకుడూ లేదా ట్రాఫిక్‌లోనే జీవితం గడిచిపోతున్నదన్న యిదివరకటి భారమూ యిప్పటి అసహనమూ… యిలా చాలా పరిగణంలోకి తీసుకోవాలి…’ అని చాలా లెక్కలు చెప్పారు.

‘ఓర్నాయన… లెక్కల మేస్ట్రో’ అని లోపల అనుకోకుండా వుండలేకపోయాను.

కాని కథకులు యెలా ఆలోచించాలో బోధపడింది. కార్య కారణ సంబంధాలను యెలా చూడాలో కూడా అర్థమయ్యింది. అంటే మనం కంటికి కనిపించిన వాటిని పట్టుకున్నంతగా బుద్ధికి కనిపించని వాటిని పట్టుకోం. పట్టుకున్నా వొదిలేసినవి కొన్ని మిగిలే వుంటాయి. ఆ ఖాళీలను వొక్కో పాఠకుడు వొక్కో రకంగా పూరించుకుంటాడు. అయితే పాఠకుని ఆలోచనలను యెగదోసే చలన సూత్రాలను అందిచ్చే పనీ బాధ్యతా ఆ కథకుడి మీదే వుంటుంది. అంచేత లోతుగా ఆలోచించి సృజన చేయడమే కాదు, మరిన్ని లోతులు యెరుక పరిచేలా పాఠకుడికి దారులు వేసి వెళ్ళనివ్వగలిగిన మేర వెళ్ళనివ్వాలి.

కారా మాస్టారి కథల నిర్మాణంలో చూడగలిగితే యివన్నీ మనకు కనిపిస్తాయి.

వేగంగా మారుతున్న కాలంలో మార్పుల్ని అర్థం చేసుకొని అవగాహనకు తెచ్చుకొని రాసేలోపలే మళ్ళీ మారిపోతున్నప్పుడు రాయడం కష్టమవుతుందని, అలాంటప్పుడు పాత కథాంశాలనే కొత్తగా తిప్పి తిప్పి రాయడం జరుగుతుందని, అంతకంటే రాయకుండా వుండడం మంచిదని కూడా మాస్టారు చెప్పారు.

మాస్టారే అన్నట్టు రాయడం ఎవరికి వారు నేర్వవలసిందేగానీ ఒకరు నేర్పితే వచ్చేది కాదు. కాకపోతే కథల గురించిన అవగాహనను పెంచుకోవడంలో సహాయపడేందుకు యివన్నీ వుపకరిస్తాయని గుర్తున్న మేరకు గుర్తు చేస్తున్నాను.

ఏమైనా లోచూపు దిక్సూచి. ఆ దిక్సూచితో మన ఈత మనం కొడదాం. అప్పుడు మాస్టారూ మనల్ని చూసి సంతోషిస్తారు.

Leave a Reply