లక్ష ద్వీప్ మనకు పడమట దిక్కున ఉన్న దీవులు. ముప్పై ఆరు దీవుల సమూహం. డెబ్భై వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం. 97 శాతం వరకు ముస్లిం జనాభా ఉంటుంది. మిగతా మూడు శాతం బయటి నుండి వచ్చిన వారు. అక్కడ గత కొన్ని వారాలుగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. కారణం తమ నేల నుండి తమని పరాయి వారిని చేయడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతలకు ఐఏఎస్ లేదా ఐపిఎస్ అధికారులను పరిపాలన అధికారులుగా రాష్ట్రపతి నియమిస్తారు. కానీ గత డిసెంబర్లో గుజరాత్ కు చెందిన భాజపా నేత ప్రఫుల్ ఖోడా పటేల్ ను లక్షద్వీప్ కు పరిపాలన అధికారిగా నియమించారు. అయన నేపథ్యం ఆరెస్సెస్. అందులోను ఆయన మోడీ హ‌యాంలో హోంమంత్రి. ఇక ఆయ‌న రికార్డు ఎలా ఉంటుందో ఊహించ‌వ‌చ్చు.  ప్రజలు తిరస్కరించడంతో ఇంటికి పరిమితం అయ్యాడు. యువుకులకు ఉద్యోగాలు ఇవ్వలేని మోదీ త‌న  త‌ల్లి వేరు ఆర్.ఎస్.ఎస్ కు చెందిన వాళ్ల‌ను  రాజ‌కీయ నిరుద్యోగం నుంచి బైట‌ప‌డేస్తున్నాడు. త‌న  సన్నిహితులకు మాత్రం ఉద్యోగ కల్పనలో ముందున్నాడు. అందుకే ప్రఫుల్ ఖోడా పటేల్ తీసుకెళ్లి లక్షద్వీప్ పరిపాలనాధికారిని చేశాడు. ఇంకేముంది ఒక ముస్లిం ప్రాంతానికి అధికారి కావ‌డంతో  వాళ్ళను అక్క‌డి నుంచి  వెళ్లగొట్టే ప‌నిలో ప్రఫుల్ ఖోడా పటేల్ ఉన్నాడు. 

ఆయ‌న బాధ్యతలు చేపట్టడంతోనే మూడు చట్టాల డ్రాఫ్ట్ (ముసాయిదాలను ) తీసుకువచ్చారు. ఆ మూడు చట్టాల లక్ష్యం ముస్లిం రహిత లక్ష ద్వీప్‌ .

ఈ మూడు చట్టాలలో మొదటిది గూండా యాక్ట్ / సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక ముసాయిదాను ను తీసుకువచ్చాడు. దీనిలో భాగంగా పరిపాలనాధికారి అనుమానం వస్తే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏ వ్యక్తినైనా ఏడాది వరకూ అదుపులో తీసుకుని నిర్బంధించవచ్చు. విచారణ కూడా ఉండదు.

దేశంలో అతి తక్కువ నేరాలు నమోదయ్యే ప్రాంతాల్లో లక్షదీవులు ఒకటని గణాంకాలు చెబుతున్నాయి. అసలు నేరాలే జరగని ప్రాంతంలో, ఇలాంటి చట్టాల అవసరం ఏముంది  అని అక్కడ ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఉద్దేశం ముస్లింల అణిచివేత తప్ప మరొకటి కాదు.  తమ అణిచివేతను ప్రశ్నిస్తూ రోడ్డెక్కకుండా చేయడమే ఈ చట్టం లక్ష్యం. 

ఇక రెండవ చట్టం లక్షద్వీప్ జంతు సంరక్షణ నియంత్రణ, 2021. ఈ నిబంధన ప్రకారం ఎవరైనా ప్రత్యక్షంగా, లేక పరోక్షంగా గొడ్డు మాంసం అమ్మడం, నిల్వ ఉంచుకోవడం, రవాణా చేయడం, అమ్మకానికి ప్రదర్శించడంతో పాటు బీఫ్ ఉత్పత్తులు కొనడంపై కూడా ఈ నిషేధం ఉంటుంది. దీనిని ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా ఉంటుంది. దీని  అసలు ఉద్దేశం బీజేపీ అవలంబిస్తున్న మత రాజకీయల ప్రయోజనాలు మాత్రమే. లక్షద్వీప్ జనాభాలో 97 శాతం వరకు ఉన్న ముస్లింల ఆహారాన్ని నిషేధించడానికి జంతు పరిరక్షణ లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఇప్పటిదాకా ఈ దీవులలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. ఇప్పుడు మద్యపానానికి అనుమతి ఇచ్చారు. పైగా టూరిస్టు కేంద్రంగా అభివృద్ధి కోసం ఈ చర్యలు తీసుకున్నాం అని చెబుతున్నారు. 

ఇక మూడవది అత్యంత వివాదాస్పదమైన చట్టం డ్రాఫ్ట్ లక్షద్వీప్ డెవలప్‌మెంట్  అథారిటీ రెగ్యులేషన్ 2021. ద్వీపంలో ప్రస్తుతం ఉన్న భూ యాజమాన్యాన్ని మార్చాలని దీని ప్రతిపాదన.  “అభివృద్ధి” కార్యకలాపాల కోసం ఏ భూమినైనా  ఎన్నుకునే అధికారాన్ని ఈ చ‌ట్టం ప్రభుత్వానికి ఇస్తుంది. భూమిని ఎంచుకున్న తర్వాత, ప్రభుత్వం త‌న *అభివృద్ధి*కి సరిపోయేలా  దీనిని ఉపయోగించవచ్చు. దీని అర్థం “ప్రజా ప్రయోజనం” కోసం భూమిని ఇచ్చిన య‌జ‌మానికి ఇక ఆ భూమిపై నియంత్రణ ఉండదు. స్థానిక ప్రజలు తమ ఆస్తిని ఎప్పుడైనా పరిపాలన స్వాధీనం చేసుకుంటుందనే భయంతో ఎప్పటికీ జీవించాల్సి ఉంటుంది.

ఇది రహదారులు, రైల్వే లైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించడానికి నివాసితుల భూమిని స్వాధీనం చేసుకోవడానికి పాల‌కుల‌కు అనుమతిస్తుంది. అంతేకాక అక్కడ “15 మీటర్ల వెడల్పు” ఉన్న రహదారులను నిర్మించే ప్రణాళికలు ఉన్నాయి, కాని స్థానికులు లక్షద్వీప్‌కు రహదారులు అవసరం లేదని, అలాంటి ప్రాజెక్టులు ద్వీపాల పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

లక్షద్వీప్‌లోని ముస్లింలు భారతదేశంలో అరుదైన ముస్లిం సమూహాలలో ఒకటి. వీరు షెడ్యూల్డ్ తెగగా వర్గీకరించబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వ్డ్ కోటా,  రాష్ట్రం నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో సీట్లు, గ్రామ,  జిల్లా కౌన్సిళ్ల స్థానిక కార్యనిర్వాహక అధికారాలను  ముస్లింల నుంచి స్వాధీనం చేసుకోవడమే లక్షద్వీప్ పరిపాలన అధికారి లక్ష్యంగా ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు.

ఎన్నుకోబడిన కౌన్సిల్ ప్రతినిధులు ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య , పశుసంవర్ధక , మత్స్య సంపద వంటి ప్రజలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అనేక సమస్యలపై నిర్ణయాలు తీసుకోలేరు, ఎందుకంటే ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే ఈ విషయాలు పరిపాలన అధికారి  ప్రత్యక్ష నియంత్రణలోకి వస్తాయి.

ప్రఫుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 500 మంది సాధారణ, కాంట్రాక్టు కార్మికులు తమ ఉద్యోగాల‌ను  కోల్పోయారు. లక్షద్వీప్ ప్రభుత్వం నడుపుతున్న పర్యాటక సంస్థ, సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ నేచర్ టూరిజం అండ్ స్పోర్ట్స్ (స్పోర్ట్స్) మాత్రమే ఫిబ్రవరిలో దాదాపు 200 మంది కాంట్రాక్టు సిబ్బందిని రద్దు చేసింది. వాటిని బయటి వారితో ( గుజరాతీలతో ) భర్తీ చేయబోతున్నారు.

అనేక పాడి క్షేత్రాలు మూసివేయబడ్డాయి. అక్కడి పశువులను వేలం వేయబోతున్నారని ప్రజలు చెబుతున్నారు. గుజరాత్ కేంద్రంగా ఉన్న ఒక పాడి దిగ్గజాన్ని ద్వీపాలలో దాని రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడమే పటేల్ ప్రణాళిక అని వారు ఆరోపణలు ఉన్నాయి.  

ఇది గుజరాత్ అభివృద్ధి నమూనా. ఇది దేశానికీ అవసరమంటూ కార్పొరేట్లు టముకు వేసే అభివృద్ధి నమూనా. పేదలు కనిపించకూడదని గోడ కట్టిన అభివృద్ధి సూత్రం. ఇప్పుడు లక్షద్వీపాలకు చేరింది.


 ఈ సంఘటనలు నడుస్తున్న క్రమంలో మోదీ పరిపాలనకు ఏడేళ్లు నిండాయి. ఈ కాలంలో మోదీ ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని అమిత్ షా ప్రకటించారు. ప్రజల భద్రత, సంక్షేమం, సంస్కరణల రంగాలలో ఈ విజయాలు సాధించిందని చెప్పారు. ఈ ఏడేళ్లలో అమిత్ షా మొదట ఐదేళ్లు భాజపా అధ్యక్షుడుగాను, తరువాత రెండేళ్లు కేంద్ర హోంమంత్రి గాను ఉన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లు చెప్పుకుంటున్న  అపూర్వ విజయాలన్నీ ముస్లిం మైనారిటీల‌ను, దళిత ఆదివాసుల అణిచివేత లక్ష్యంగా సాగినవే. ఆ క్రమంలో ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసే సీఏఏ – ఎన్ఆర్సీ చట్టాలను తీసుకువచ్చారు. ఇక ఏడేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ముస్లిమేతర ప్రజలకు పౌరసత్వం కల్పిస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. ఇక ఇదే సమయంలో లక్ష ద్వీప్ ముస్లింల  ఆందోళనలు పరిశీలిస్తే ఇవి ఏవి విడిగా లేవ‌ని అర్థ‌మ‌వుతాయి.  ఇప్పటిదాకా దేశ‌మంతా సాగుతున్న  ముస్లిం వ్యతిరేకత ఇప్పుడు లక్షద్వీప్ లకు చేరింది. ఫాసిస్టు ధోర‌ణులు చేరిన‌ట్లే, దాని ప్ర‌తిఘ‌ట‌న‌కు కూడా  లక్షద్వీప్ కేంద్రం కాబోతోంది. అందువ‌ల్ల  అక్కడి ముస్లిం ప్రజలకు   మద్దతివ్వ‌డం మ‌న పోరాట క‌ర్త‌వ్యం కావాలి. 

One thought on “ల‌క్ష ద్వీప్ కోసం మాట్లాడ‌దాం

Leave a Reply