వధ్యశిల రజతోత్సవమ్మట
బంధిఖానలు ప్రజల సొమ్మట
న్యాయమే వర్థిల్లుతుందట
నాయకుల ఆరాధనాలట

పూలుగోయర తమ్ముడా
మాల గట్టవె చెల్లెలా

కొత్త సంకెళ్లేమిలేవట
తెల్లదొరలను దించినారట
దేశ దేశములోన భారతి
బిచ్చమెత్తుట మాన్పినారట

గర్వపడరా తమ్ముడా
పరవశింపవె చెల్లెలా

ఆనకట్టలు కట్టినారట
భూమి పేదలకిచ్చినారట
ఆకలెత్తిన ఆయుధాలను
అణచి మేల్‌ సమకూర్చినారట
భయములేదుర తమ్ముడా
శీలవతివే చెల్లెలా
గ్రామ పంచాయతులు పెట్టి
పేదలకు నిధి పంచినారట
పల్లె నుండీ ఢల్లిదాకా
సోషలిజమే పారుతుందట

వంతపాడర తమ్ముడా
గొంతుకలపవె చెల్లెలా

పదవికయినా కొలువుకయినా
తెలివి ఒక్కటె గీటురాయట
కులమతాలను చంపినారట
రామరాజ్యము తెచ్చినారట
అందుకొనరా తమ్ముడా
ఆడిపాడవె చెల్లెలా

అధిక ధరలను ఆపినారట
దోచువారికి జైలు శిక్షట
దేవళమ్ములు నిలిపినారట
ముక్తి మార్గం చూపినారట
పూజ సలపర తమ్ముడా
పున్నె మొచ్చునె చెల్లెలా

ప్రణాళికల పరిమళాలట
ప్రతి గృహానికి ప్రాకినాయట
నిరుద్యోగమ పొమ్ము పొమ్మని
కొత్తగొంతుక విప్పుతారట

సహన ముంచర తమ్ముడా
ఆలకించవె చెల్లెలా

ఎవరి ప్రాణము తీయలేదట
పౌరహక్కుల గాచినారట
పార్లమెంట్లో అడిగినారట
ప్రజాస్వామ్యం నిలిపినారట

విప్లవించకు తమ్ముడా
విన్నవించవె చెల్లెలా.

26.7.1972

One thought on “వధ్య శిల

Leave a Reply