ఒక చాటింపు పొద్దు కుంగే వేళ
ఓ సమూహ కలయిక
వంటా వార్పు రేపు
డప్పు పై దరువు తో

మరునాడు పొద్దు పొడిచే వేళ
బండెడ్లు సిద్దం
గిన్నెలు తపేలాలతో తరలు
అంతా ఒకే చోటు

వనం అంటే చెట్లు
ఇళ్లకు గొళ్ళెం పెట్టి
చెట్ల కిందకి
సమూహాలుగా
సమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపిక
నీడ కోసం

ఉసిరి లేదు మర్రి లేదు
వేప లేదు రావి లేదు
చల్లని గాలి కాసింత నీడ ఆ వేళ
మంత్రం లేదు
తంత్రం లేదు
సామూహిక వికాసంలో భాగం
మానసిక సంఘర్షణకు ఉపశమనం
అందరిలో ఒకరమై ఒకరికి ఒకరమై
మాటలు చేతలు కలివిడిగా

చెట్టు కొమ్మలకు వేలాడే వేటలు
జంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులు
పొందిక గా పోగులు
పొయ్యి మీద నూనె తాళింపు చిటపట
అల్లం వెల్లుల్లి ఘాటు నషాళానికి
వుడికే బగారా – మాంసం కూర

వావి వరుసల పిలుపులు
కులం లేదు మతం లేదు
అందరూ కలిసి ఆరగించే భోజనం
వన భోజనం

చాటింపు రూపాంతరం ఫ్లెక్సీ ల దాకా
సమూహాలు కులాలై
కుల భోజనాలు గా మార్పు
వివాహ పరిచయ వేదికలై
రంగు రుచి లేని ములాఖత్

వనం కులమై
మతం మృగమై
వ్యవస్థ చీడపట్టి
కుళ్ళి పోతుంటే చెట్లు దిగాలుగా
మేలుకోరా అంటూ చిర్ర పుల్ల డప్పుపై టపటప
జనం వీపు పై చర్ణకోలా చరచక తప్పదు లే!!!.

Leave a Reply