నా నేల రకం నాకెరుక

పదును చూసి విత్తడం నా జ్ఞానం

చిన్న మళ్ళుగా  చేసుకోవటం నా అనుభవం

నా నేల నా ఇష్టం

నా విత్తనం  నా నేలలో నిరుడు పండిందే

మోట కొట్టిన నాటి నుండే వరి నా నేలన

సుఖం మేమెరుగం నా ఎడ్లూ ఎరుగవు

నా తిండికి నేను వాటి మేతకు అవి కష్ట పడటం అలవాటు

నీళ్ళు పట్టి

తొక్కి తొక్కి దున్ని దున్ని

మట్టంతా మెత్తగా బురదగా చేయటమంటే ప్రతిభ కాదా!

మడంతా చదును పెద్ద చెక్కను గుంజే నాఎడ్ల సత్తువ

గట్ల మీది చెట్ల ఆకులు బురదలో తొక్కే

సేంద్రీయ ఎరువు తరాలుగా అబ్బిన విద్య 

నారు పోసి నాటు పెట్టేదాకా 

పెరిగిన వరిలో కలుపు మొక్కలు కనిపెట్టే చాతుర్యం మా ఆడబిడ్డలదే

మందుల పిచికారితో కలుపుని చంపలే

వరి పొట్టకి రాగానే ఆచి తూచి నీరు మళ్లింపు మడి మడికి

ఏ ఏలిక నేర్పలే

ఏ కార్పోరేట్ శిక్షణ ఇవ్వలే 

పక్వానికి రాగానే కొడవళ్ళపదును

చకచక కోసే చేతుల గాజుల గలగల

బండ మీద తొక్కే ఎడ్ల మెడల్లో గంటల గణగణ 

రాలే గింజల మువ్వల  సవ్వడి

నా హృదయ స్పందనలు స్టెతస్కోప్ కి అందవు

తూర్పు వాలులో

చాట తూర్పారా

గంపల నిండే పుట్లు

గుమ్ముల దాకా కష్టార్జితం

నువ్వు కొనూ కొనక పో

నేనే అమ్ముకుంటా ధర నా చేతుల్లోనే

రహదార్లకి అటూ ఇటూ కొట్ల అంగడి

లక్షలాది వాహనాలు రోజూ

దళారీ లేని అమ్మకం

నేనూ బాగుపడతా

నా తోటి వారికీ ఆహారం చౌకగా

నాకంటూ ఆలోచన వస్తే విప్లవాత్మకమే!!

Leave a Reply