భారత సమాజాన్ని విదేశీ ఆలోచనాపరులే కాకుండా ఎంతోమంది స్వదేశీ ఆలోచనాపరులు కూడా ఒక చలనరహిత సమాజంగా నేటికీ చూస్తూనే ఉన్నారు. గత కాలం నుండి ఈనాటి వరకు భారత సమాజంలో వర్ణం, కులం ఎటువంటి మార్పు లేకుండా అస్తిత్వంలో ఉన్నాయని వారంటారు. కాని భారత సమాజపు అసలు వాస్తవికత సంక్లిష్టమైనదని, అది కులవ్యవస్థ రూపంలో వ్యక్తమవుతుందని గుర్తిస్తారు. ఆ సంక్లిష్ట వాస్తవికతను ‘చాతుర్వర్ణ’ నమూనా వివరించజా లదని తెలిసినప్పటికీ, సైద్ధాంతికంగా దానిని ఎంత మాత్రమూ తిరస్కరించరు.
మరి కొంతమంది ఆలోచనాపరులు ఆసియాతరహా ఉత్పత్తి విధానం ఆధారంగా భారతీయ సమాజపు చలనరాహిత్యాన్ని గురించి తమ వాదనలు చేస్తారు. అయితే వర్ణం, ఆసియా తరహా ఉత్పత్తి విధానం వంటి సంవర్గాలను(categories)ఉపయోగించి వాదన చేసే వారందరూ భారత సమాజాన్ని ఒక నిశ్చల సమాజంగా మాత్రమే చూపించలేదు. వారిలో కొందరు విభిన్న కాలాలలో భారత చరిత్రలో చోటు చేసుకున్న మార్పుల్ని కూడా చాలా ప్రభావవంతంగా చిత్రించారు.
అయితే భారత సమాజపు చలనశీలతను అర్థం చేసుకోవడానికి పైన పేర్కొన్న వర్ణం, ఆసియా తరహా ఉత్పత్తి విధానం అనే రెండు సంవర్గాలూ ఉపయోగపడవని అమరుడైన విప్లవ మేధావి నవీన్ బాబు రాసిన “వర్ణం నుండి కులం దాకా”అనే ఈ పరిశోధనా పుస్తకంలో నిరూపిస్తాడు. ముఖ్యంగా భారత సమాజం చలన రహితమైనది కానేకాదని నొక్కి చెప్పడమే తన అధ్యయన లక్ష్యమని ఆయన ఇందులో పేర్కొంటాడు.
వర్ణం, కులం అనేవి వరుసగా పశుపాలక వ్యవస్థ, వ్యవసాయిక వ్యవస్థ అనే రెండు విభిన్న సామాజిక ఉత్పత్తి విధానాలకు సంబంధించినవి అనే దీపాంకర్ గుప్తా (ప్రజా మేధావి, జె. ఎన్. యు. ప్రొఫెసర్) వాదనతో ఈ పుస్తక రచయిత ఏకీభవిస్తాడు. పశుపాలక సామాజిక వ్యవస్థలో తెల్లరంగు గల ఆర్యులు, నల్ల రంగు గల దాసులు/దస్యులు(అనార్యులు) రెండు వర్ణాలే ఉండేవని, వాటి మధ్య విభజన ఒక్కటే ఆనాడు ఉండేదని అంటాడు. కాని రుగ్వేద కాలం నాటికీ ఆర్య,అనార్య తెగల మధ్య ఉన్నటువంటి విభజనే కాకుండా, ఆర్య తెగలైన బ్రాహ్మణులు, క్షత్రియులు, విశ్ ల (సాధారణ జనం) మధ్య అంతర్గత విభజన అనే రెండు రకాల సామాజిక విభజనలు ఏర్పడ్డాయి.
పశుపాలక ఆర్థిక వ్యవస్థ సమాజంలో అందరినీ పోషించలేకపోవడం వల్ల మరో ప్రత్యామ్నాయ (వ్యవసాయ ఆర్థిక )వ్యవస్థ ఏర్పడే పరిస్థితులు తలెత్తాయ. ఇలా సమాజం పశుపాలక వ్యవస్థ నుండి వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ లోకి పరివర్తన చెందడంలో ఆర్య తెగల (మధ్యనున్న )అంతర్గత విభజనే ముఖ్య పాత్ర నిర్వహించింది. అలాగే పాత సామాజిక (వర్ణ) విభజన కొత్త సామాజిక (కుల) విభజనకు దారితీసింది. తత్పలితంగా రాజ్యం, గ్రామ సముదాయం వంటి కొత్త సంస్థలు ఆవిర్భవించి సామాజిక (కుల) విభజనను బలోపేతం చేశాయి. క్రమంగా ఆర్యులకు, అనార్యులకు మధ్యన ఉన్న రంగు బేధాన్ని సూచించే ‘వర్ణం’ అనే పదం చాతుర్వర్ణాలైన బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సూచించే పదంగా మారిపోయింది.
తర్వాతి కాలంలో బ్రాహ్మణులు తమను ఉన్నత స్థానంలో ఉంచుకునేందుకు చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని సమాజపు అసలు వాస్తవికత అయిన కుల వ్యవస్థతో జోడించి అభివృద్ధి చేశారు. వర్ణ సంకర సిద్ధాంతం లాంటి వాటిని కనిపెట్టి చాతుర్వర్ణ ప్రాసంగి కతను నిలబెట్టడానికి వారు అపసోపాలు పడ్డారు.
ద్విజులు, ఏకజులు అనే భావనలను ప్రవేశపెట్టి ఉపనయనం చేసుకొని జంధ్యం వేసుకోవడం ద్వారా క్షత్రియులు, వైశ్యుల వంటి వారు కూడా బ్రాహ్మణా ర్హతను (సమాజంలో ఉన్నత స్థానాన్ని) పొందే మార్గాలను అవలంబించారు.
మొత్తంగా ఈ పుస్తకం ( రుగ్వేద కాలం నుండి మౌర్యుల దాకా) ప్రాచీన భారతదేశంలోని పరిణామాలన్నింటినీ అధ్యయనం చేసే విస్తృతమైన పరిశోధన కానప్పటికీ, ప్రాచీన భారత చరిత్రను నూతన దృక్కోణంలో అధ్యయనం చేయడానికి తగిన చట్రాన్ని రేఖామాత్రంగా ఈ పుస్తకం అందజేస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఈ పుస్తకంలో మొత్తం ఐదు అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో సామాజిక కేటగిరీలు,వర్గం వంటి ముఖ్యమైన భావనలు, సామాజిక మార్పు గురించి; రెండవ అధ్యాయంలో ఈ విషయానికిసంబంధించిన గ్రంథాల,అధ్యయనాల సమీక్ష గురించి; మూడవ అధ్యాయంలో పశుపాలక వ్యవస్థ గురించి; నాలుగవ అధ్యాయంలో వ్యవసాయక సమాజంలోకి పరివర్తన గురించి; చివరి ఐదవ అధ్యాయంలో చాతుర్వర్ణ సిద్ధాంత భావన ఈనాటికీ కొనసాగుతున్న తీరు గురించి వివరించడం జరిగింది. అయితే వాటన్నింటినీ వివరించడం ఇక్కడ సాధ్యం కాదు గాని, వాటి సారాంశాన్ని మాత్రం క్లుప్తంగా వివరిస్తాను.
విభిన్న ఉత్పత్తి విధానాలను విశ్లేషించడానికి భిన్న సామాజిక కేటగిరీలు అవసరమౌతాయి. ప్రతి సామాజిక కేటగిరి ఒక నిర్దిష్ట సామాజిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే, ఒక నిర్దిష్ట ఉత్పత్తి విధానంలోని ఉత్పత్తి సంబంధాలు ఆ ఉత్పత్తి విధానానికి సంబంధించిన సామాజిక కేటగిరీ/వర్గా ల్లోనే వ్యక్తం అవుతాయి. ఉత్పత్తి విధానం మారినప్పుడల్లా ఉత్పత్తి సంబంధాలు మారతాయి. ఆ మారిన ఉత్పత్తి సంబంధాలకు ప్రాతినిధ్యం వహించేలా అప్పటికే వివిధ సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్న ప్రజలు తమను తాము నూతన సామాజిక వర్గాలుగా పునస్సమీకరించుకుంటారు. ఆ రకంగా బానిస ఉత్పత్తి విధానంలో బానిస యజమానులు,బానిసలు ; భూస్వామ్య ఉత్పత్తి విధానంలో భూస్వాములు, అర్ధ బానిసలూ; పెట్టు బడిదారీ ఉత్పత్తి విధానంలో పెట్టుబడిదారులు, కార్మికులూ అనే నూతన సామాజిక వర్గాలు ఉనికిలోకి వస్తాయి. అలాగే ప్రాచీన భారత సమాజానికి సంబంధించిన రెండు విభిన్న- పశుపాలక, వ్యవసాయక- ఉత్పత్తి విధానాల్లోని వేర్వేరు ఉత్పత్తి సంబంధాలను విశ్లేషించి వివరించడానికి వర్ణం, కులం అనే రెండు భిన్నమైన సామాజిక కేటగిరీలు అవసరమవుతాయని రచయిత ఈ పుస్తకంలో పేర్కొంటాడు.
అయితే మొదటి సామాజిక వ్యవస్థలోని కొన్ని అంశాలు తర్వాతి సామాజిక వ్యవస్థలో కూడా కొనసాగవచ్చు. అలా కొనసాగినప్పుడు అవి దేని ఆధారంగా కొనసాగుతున్నాయో, ఆ కొనసాగింపు పరిణామాలు ఏమిటో మనం చూడాల్సి ఉంటుంది. గత సామాజిక వ్యవస్థలోని కొన్ని పాత అంశాలను తర్వాతి కొత్త సామాజిక వ్యవస్థలో సైద్ధాంతిక భావజాల అంశాలుగా వాడుతుండవచ్చు. ఉదాహరణకు,పశు పాలక సమాజ నిర్మాణ లక్షణమైన ‘వర్ణా’న్ని తర్వాతి కాలంలో ఒక భావజాలంగా, అలాగే వ్యవసాయక సమాజ నిర్మాణ లక్షణమైన ‘కులా’న్ని ఆధునిక కాలంలో ఒక భావజాలంగా ఉపయోగిస్తుండడం భారతదేశంలో మనం చూడవచ్చు.
వర్గం :- మార్క్స్ ప్రకారం, ఉత్పత్తి సాధనాలకు సంబంధించి ఒకే రకమైన స్థానంలో ఉన్న ప్రజల సముదాయాన్ని వర్గం అనంటారు. అయితే వర్గం అనే భావనను అమూర్తమైన,నిర్దిష్టమైన (రెండు) అర్థాల్లో వాడతారు. ఉత్పత్తి సాధనాలను కలిగి ఉన్నవారు, అవి లేనివారు అని రెండు పరస్పర వ్యతిరేక ‘ప్రామాణిక’ సామాజిక సముదాయాల గురించి చెప్పడానికి వర్గం అనే భావనను అమూర్త అర్థంలో వాడతారు. అలాగే ఒక నిర్దిష్ట వాస్తవ సమాజంలో పరస్పర వ్యతిరేకమైన రెండు అమూర్తమైన వర్గాలే ఉండవు. అవి మరికొన్ని సామాజిక సముదాయాలుగా విడిపోయి ఉంటాయి. వాటినే మనం సామాజిక వర్గాలని అనవచ్చు. వాటిని అధ్యయనం చేయడానికి వర్గం అనే భావనను నిర్దిష్టమైన అర్థంలో కూడా వాడతారు.
దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే- ఒకవైపు కార్మికులు, మరొకవైపు పెట్టుబడిదారులు, భూస్వాములు అనే ‘ప్రామాణిక’ వర్గాలే కాకుండా, వాటి మధ్య అనేక మధ్యమ సామాజిక వర్గాలు ఉంటాయని, అవి తమ మొత్తం భారంతో శ్రామిక(కార్మిక) వర్గపు మూపులపై కూర్చొని ఉన్నత వర్గపు సామాజిక భద్రతను, అధికార బలాన్ని పెంచుతూ కాపాడుతాయని మనం అర్థం చేసుకోవాలి. అమూర్త వర్గాలలో భాగమై ఉన్న ఇటువంటి మధ్యమ సామాజిక సముదాయాలు/ వర్గాలు పెట్టుబడిదారీ సమాజాల్లోనే కాదు, పెట్టుబడిదారీ పూర్వ సమాజంలో కూడా ఉండినవని చరిత్ర చెబుతోంది. అయితే వాటిని సామాజిక వర్గాలని అని పిలవకుండా వాటికి ప్రత్యేకమైన నిర్దిష్టమైన పేర్లు ఉండేవి. ఉదాహరణకు, మధ్యయుగాల యూరప్ లో వారికి కులీనులని, భూస్వాములని, అర్థబానిసలని, స్వతంత్ర రైతులని, చేతివృత్తుల వాళ్ళనీ పేర్లు ఉండేవి. భారతదేశ వ్యవసాయక వ్యవస్థలో మాత్రం ఆ అమూర్త వర్గాలు ‘కులాల’ రూపం తీసుకున్నాయని మనం చెప్పవచ్చు.
అయితే పైన ఉన్న కులాలను ఉన్నత (అగ్ర)కులాలుగా, అట్టడుగున ఉన్న కులాలను నిమ్న కులాలుగా వాటికి పరస్పర వ్యతిరేక వర్గ స్థానాలను ఆపాదించవచ్చు. కానీ ఈ కులాలకు నిచ్చెన మెట్ల అమరిక ఉండడం వల్ల మధ్య(మ)నున్న కులాలకు అలాంటి స్థానాలను ఆపాదించలేం. ఇటువంటి మధ్యమ కులాల విషయాల్లో ఉన్న అస్పష్టతను ఛేదించడానికి మార్క్స్ చెప్పిన ‘తనలో తనే (ఉండే) వర్గం'(class-in-itself) & ‘తన కోసమే తాను (ఉండే) వర్గం’ (class-for-itself ) అనే మరో విభజన మనకు దోహదపడుతుంది.
వర్గ పోరాటాల క్రమంలో వర్గ చైతన్యం పెంపొంది ‘తనలో తానే ఉండే వర్గం’ ‘తన కోసమే తాను ఉండే వర్గం’గా మారినప్పుడు అస్పష్టతలన్నీ తొలగిపోతాయని, అంటే, సామాజిక వర్గాలు వాటికవే సహజంగానే రూపుమాసిపోతాయని కమ్యూనిస్ట్ లు/ మార్క్సిస్టులు గతంలో భావించేవారు. కానీ పాత సమాజాలను వర్తమాన సమాజాలను మనం నిశితంగా పరిశీలిస్తే అది తప్పని రుజువవుతుంది. వర్గ చైతన్యం పెంపొందినంత మాత్రాన్నే వాటికవిగా సామాజిక వర్గాలు రద్దయిపోయి, సమాజం రెండు పరస్పర వ్యతిరేక ప్రామాణిక వర్గాలుగా ఏర్పడుతుందని చెప్పలేం. వాస్తవానికి, పోరాట క్రమంలో ఆయా సామాజిక వర్గాలు దోపిడీ చేస్తున్న వర్గాలతోనో, దోపిడీకి గురవుతున్న వర్గాలతోనో గుర్తించుకున్నప్పటికీ, అవి తమ ప్రత్యేక అస్తిత్వాలను మాత్రం నిలుపుకుంటూనే ఉంటాయని వాస్తవ సమాజ పరిశీలనలు తేల్చివేశాయి. కనుక రాజకీయార్థిక వ్యవస్థ మార్పుకై జరిగే విప్లవాత్మక వర్గ పోరాటాలలో వివిధ పీడిత అస్తిత్వాల సమన్వయాత్మక విముక్తి పోరాటాలు కూడా సహజంగానే అంతర్భాగమై కొనసాగుతాయి/ కొనసాగాలి.
ఉత్పత్తి విధాన భావన- ప్రాసంగికత:- మార్క్సిస్ట్ సిద్ధాంత భావనల ప్రాతిపదికగా గతం నుండి నేటి వరకు విప్లవాత్మక వర్గ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ, భారతదేశంలో కొనసాగుతున్న ఉత్పత్తి విధానం ఎటువంటిదనే విషయంపై చర్చోపచర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. వలస కంటే ముందు అది ఆసియా తరహా ఉత్పత్తి విధానమా, లేక భూస్వా మ్యమా ; వలసకాలం నాటి నుండి అది అర్థ భూస్వా మ్యమా, లేక వలస సమాజమా ,లేక పెట్టుబడిదారీ సమాజమా లేక ద్వంద్వ స్వభావమున్న ఉత్పత్తి విధానమా లాంటి అనేక ప్రశ్నలతో భారత సమాజపు స్వభావానికి సంబంధించిన విభేదాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ పుస్తకంలో రచయిత ఉత్పత్తి విధానం అంటే ఏమిటనే దాన్ని వివరించి ఉత్పత్తి విధానపు సాధారణ భావనకు, ఆసియా తరహా ఉత్పత్తి విధానానికి ఉన్న తేడాలను వివరిస్తాడు.
‘రాజకీయ అర్థశాస్త్ర విమర్శకు కొన్ని చేర్పులు’ అనే పుస్తకానికి మార్క్స్ రాసిన ముందు మాటలో పేర్కొన్న నిర్వచనమే ఉత్పత్తి విధానానికి ఖచ్చితమైన నిర్వచనం అని రచయిత అంటాడు. ఉత్పత్తి విధానపు నిర్వచనంలో ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తులు అనే రెండు అంశాలు చాలా ముఖ్యమైనవని అంటాడు.
‘అదనపు శ్రమను స్వాధీన పరుచుకునే నిర్దిష్ట పద్ధతిని, ఆ పధ్ధతికి సరిపోయేలా ఉండే ఉత్పత్తి సాధనాల సామాజిక పంపిణీకి చెందిన నిర్దిష్ట రూపాన్నీ ఉత్పత్తి సంబంధాలు నిర్వచిస్తాయని’ బి. హిండెస్, పాల్ హర్స్ట్ లు అన్న విషయాన్ని రచయత ఉటంకిస్తాడు. అలాగే ‘ఉత్పత్తి సాధనాలు (ఉత్పత్తికి సంబంధించిన పనిముట్లు, ముడి పదార్థాలు), శ్రమశక్తి (ఉత్పత్తి చేసే వ్యక్తుల ఉత్పాదక కౌశల్యాలు-faculties) ,అంటే- శారీరక శక్తి, నైపుణ్యజ్ఞానం, సృజనాత్మకతలను కలిపి ఉత్పాదక శక్తులు అంటారన్న జి. ఏ. కోహెన్ నిర్వచనాన్ని కూడా రచయిత ఇక్కడ ఉటంకిస్తాడు. ఏదేమైనా,
ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి విధానం గురించి మాట్లాడాలంటే సామాజికవర్గాలు,దోపిడీ గురించి మాట్లాడక తప్పదని అంటాడు.
కాని తూర్పు దేశాల గురించి రాసిన అత్యధిక యూరోపియన్ సామాజిక శాస్త్రవేత్తలు ఆ సమాజాలను చలనరహితమైన వాటిగా చిత్రించారు. తూర్పు దేశాలపై రాసిన మార్క్స్ తొలి రచనల్లో కూడా ఇలాంటి ధోరణులే ఉన్నాయని చెప్పడానికి ఆసియా తరహా ఉత్పత్తి విధానంపై ఆయన వెలిబుచ్చిన ఈ క్రింది లక్షణాలే నిదర్శనం. అవి (1)నియంతృత్వ రాజ్యం,(2) దేనికదిగా విడివిడిగా ఉండే సంపూర్ణమైన గ్రామీణ సముదాయాలు, (3)చలన రహిత వ్యవస్థ(4) వర్గరాహిత్యం. అలాగే భారతదేశం గురించి చేసిన రచనల్లో మరికొన్నిచోట్ల భారత సమాజం చాలా సుదీర్ఘకాలం ఒకేలా కొనసాగుతూ మార్పును మొండిగా ప్రతిఘటిస్తుందని కూడా రాశాడు. అంటే, భారత సమాజం సుదీర్ఘకాలం పెద్దగా మారకుండా ఒకేలా కొనసాగుతూ నిదానమైన మార్పులకు గురవుతోందని చెప్పాడు. ఆయన అలా చెబుతూనే విడివిడిగా ఉండే స్వయం సంపూర్ణ గ్రామాలే ఆసియా తరహా ఉత్పత్తి విధానానికి పునాది అని కూడా మార్క్స్ నొక్కి వక్కాణించాడు. కానీ మలి రచనల్లో మార్క్స్ గ్రామీణ సముదాయాల నిర్మాణం గురించి మరింకేమీ మాట్లాడ(రాయ)లేదు.
బ్రిటిష్ చరిత్రకారుడు పెర్రీ ఆండర్సన్ మాటల్లో చెప్పాలంటే- చారిత్రక భౌతిక వాద సూత్రాల ప్రకారం ఒక శక్తివంతమైన,కేంద్రీకృత రాజ్యం ఉండాలంటే వర్గ విభజన బాగా జరిగి ఉండాలి. అలాగే ఒక బలమైన నియంతృత్వ రాజ్యమూ , సమానత్వంతో కూడిన గ్రామీణ కమ్యూన్లు కలిసి ఉండటం కూడా సాధ్యం కానిది.
కనుక భారత సమాజపు ఆసియాతరహా ఉత్పత్తి విధానం గురించి మార్క్స్ రాసిన దాన్ని మనం భారత సమాజంలోని ఉత్పత్తి విధానపు ప్రత్యేకతను ఎత్తి చూపినట్టుగా భావించాలి గాని, వేరే విధంగా భావించకూడదు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పిన “ఇంతవరకూ నడిచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే” అన్న మార్క్స్ మౌలిక సూత్రీకరణ ప్రకారం ఆసియా తరహా ఉత్పత్తి విధానమనే భావన సరైనది కాదని ఇర్ఫాన్ హబీబ్, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర,డి. థా ర్నర్ లాంటి మార్క్సిస్ట్ చరిత్రకారులు భావించారు. అదేవిధంగా ఈ పుస్తక రచయిత కూడా ఆసియా తరహా ఉత్పత్తి విధానం లాంటి భావనలు మార్క్సిస్ట్ మౌలిక సూత్రాలకు విరుద్ధమైనవని, అవి భారత సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనల్ని తప్పుదారి పట్టి స్తాయని నిర్ధారిస్తాడు.
అయితే భారతదేశంలో ‘భూస్వామ్య వ్యవస్థ’ లేదా ‘వ్యవసాయక ఆర్థిక వ్యవస్థ’ కంటే ముందున్న ఉత్పత్తి విధానం గురించి పెద్దగా చర్చ జరగలేదని రచయిత అంటాడు. దీపాంకర్ గుప్తా చెప్పినట్టు-వర్ణం, కులం రెండు భిన్నమైన ఉత్పత్తి విధానాలకు చెందిన భిన్న కేటగిరీలు అనే విశ్లేషణ సరైనదని చెబుతూ, భారత సామాజిక వ్యవస్థలో వర్ణం, కులం రెండింటికి ఉన్న భౌతిక పునాదిని ఉత్పత్తి విధానపు మార్క్సిస్టు భావనా దృక్కోణం నుండి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని పేర్కొంటాడు.
అంతేగాకుండా మలి వైదిక కాలంలో ఉన్న “క్షత్రియ-వ్యవసాయదారుల”నిర్మాణం గురించి,గణ సంఘాలను రాజరిక వ్యవస్థలోకి కలిపెయ్యడంలో బౌద్ధం నిర్వహించిన పాత్ర అనే కోణం నుండి సామాజిక పరివర్తన క్రమాన్ని గురించి, అలాగే మధ్యయుగపు భారత చరిత్రను కూడా కులం, గ్రామీణ సముదాయాల ప్రాతిపదికగా మరింత లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అవసరమైన విశ్లేషణా పరికరాలను కూడా ఈ పుస్తకం అందిస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చు.
(‘వర్ణం నుండి కులం దాకా : భారత సామాజిక వ్యవస్థలో కులం -ఒక రాజకీయార్థిక విశ్లేషణ’ అనే ఈ పుస్తకాన్ని మిత్రుడు ఎన్. రవి తెలుగులోకి అనువాదం చేయగా, చేంజ్ పబ్లికేషన్స్ వారు 2017&18 లో ప్రచురించారు.)