వాకపల్లి ఆదివాసీ మహిళలను అత్యాచారం చేసిన వాళ్ల మీద   కేసును  ఏప్రిల్‌ 6న కోర్టు కొట్టేసింది. ఆ మరుసటి రోజు ఇంకా తెల్లారక ముందే చత్తీస్‌ఘడ్‌లోని పామేడ్‌ ప్రాంతంలో భారత ప్రభుత్వం రెండో విడత వైమానిక దాడులు చేసింది. ఈ రెండు ఘటనలు వరుసగా జరగడం యాదృశ్చికం కావచ్చు. కానీ వాటి మధ్య పోలిక ఉన్నది. సంబంధం ఉన్నది. 

ఈ రెండు ఘటనలకు మధ్య పదహారేళ్ల ఎడం ఉన్నది.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఆదివాసీ గ్రామం వాకపల్లి. ఆగస్టు 20, 2007న ఆంధ్రా ఒడిషా సరిహద్దుల్లో విప్లవకారులను హత్య చేయడానికి  కూబింగ్‌కు వెళ్లిన గ్రేహౌండ్స్‌ పోలీసులు వాకపల్లి మహిళల మీద సామూహిక అత్యాచారం చేశారు.  మధ్య భారతదేశంలోని  విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి దండకారణ్యంలోని బట్టిగూడ, కవరగట్ట, మీనగట్ట, జబ్బగట్ట తదితర గ్రామాల మీద 7, ఏప్రిల్‌ 2023న భారత ప్రభుత్వం వైమానిక దాడులు చేసింది.

వాకపల్లి ఘటనలో పోలీసు అధికారులు సరిగా దర్యాప్తు చేయకపోవడం వల్ల నేరం రుజువు కాలేదని కోర్టు  అభిప్రాయపడిరది. దర్యాప్తు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అత్యాచారానికి గురైన మహిళలకు  పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దీన్ని వాకపల్లి మహిళల నైతిక విజయమని చాలా మంది భావించారు. నేరం జరిగింది కానీ.. రుజువు కాలేదని అనడం, రుజువు కాకుండా చేసిన దర్యాప్తు అధికారులను శిక్షించాలని అనడం, పైగా  పరిహారం చెల్లించాలనడం.. ఇవన్నీ నైతిక విజయం కిందికి వచ్చాయి. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాత్రం తీర్పయినా రావడం ఆశ్చర్యమే. 

వాకపల్లి ఘటన ఆగస్టు 20, 2007న జరిగింది కానీ అది ఆ రోజుతో ముగిసిపోలేదు. ఆ మహిళల గుండెల్లో, గూడెంలో, సమాజంలో కొనసాగుతూ వచ్చింది. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ దాన్ని రాపిడిపెట్టాయి. అత్యాచార హింసతో మొదలై అనేక రకాల హింసలకు, విషాదాలకు వాకపల్లి మహిళలు ఈ పదహారేళ్లలో లోనయ్యారు. హత్యాకాండల వల్ల కూడా ఏండ్ల తరబడి విషాదం వెంటాడుతుంది. దాని విధ్వంస  క్రమాలను అనుభవించాల్సి వస్తుంది.  వాటికీ అత్యాచారానికి తేడా ఉంది. అత్యాచారం స్త్రీల లైంగికత మీద దాడి. అది ఆ ఘటనతో ముగిసేది కాదు. అక్కడ మొదలవుతుంది. పితృస్వామ్యం, లైంగిక వివక్షతల నుంచి సమాజం విముక్తం చెందే వరకు ఈ స్థితి ఉంటుంది.

వాకపల్లి ఘటనలో ఇంకో ముఖ్యమైన కోణం ఉంది. సమాజంలో ఉండే పితృస్వామిక స్వభావం వల్లనే ఆ ఘటన జరగలేదు. రాజ్యానికి ఉండే పితృస్వామ్య స్వభావం వాకపల్లి ఉదంతంలో కనిపిస్తుంది. మహిళలందరూ పితృస్వామ్య బాధితులే అయినా, రాజ్యం పీడిత వర్గాల, పీడిత అస్తిత్వాల మహిళల లైంగికతను లక్ష్యం చేసుకుంటుంది. వాళ్లు  నిస్సహాయ స్థితిలోనైనా ఉంటారు. దాన్నుంచి బైటపడ్డానికి పోరాటశక్తులుగా అయినా ఎదిగి ఉంటారు. ఈ రెంటి వల్ల పీడిత సమూహాల మహిళలు పితృస్వామ్య రాజ్యానికి టార్గెట్‌ అవుతారు. ఆధునిక భారతదేశ చరిత్రలో పోలీసులు, సైనికులు చేసిన అత్యాచార ఘటనలన్నిటి  వెనుక ఈ తర్కమే ఉంది. ముఖ్యంగా పోరాట వర్గాల్లోని, సమూహాల్లోని మహిళల లైంగికతపై రాజ్యం దాడి చూస్తూ వచ్చింది.

ఆ పోరాటం తీవ్రస్థాయికి చేరుకున్న  స్థావరాల్లో రాజ్యం దీన్నొక యుద్ధ విధానంగా కొనసాగిస్తుంది. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో వాకపల్లి వంటి ఘటనలు ఎన్నో జరిగాయి. దండకారణ్య వర్గ యుద్ధంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాకపల్లితో సహా ఇవేవీ విడి ఘటనలు కాదు. ఈ సమాజంపై, ప్రజలపై రాజ్యం చేస్తున్న రాజకీయార్థిక, సాంస్కృతిక, సైనిక యుద్ధంలో అతి ముఖ్యమైన భాగం. ఈ పదహారేళ్లుగా భారత రాజ్యం మరింత హింసాత్మకంగా మారి యుద్ధ స్వభావానికి చేరుకున్నదనడానికి వాకపల్లి ఒక ఉదాహరణ. 

విప్లవోద్యమాన్ని అణచివేయడానికి  గ్రామాల్లోకి, ఆదివాసీ ప్రాంతాల్లోకి వేల సంఖ్యలో గ్రేహౌండ్స్‌  హంతక ముఠాలు చొరబడిన దశ నుంచి లక్షల సంఖ్యలో మిలటరీ, పారా మిలటరీ బలగాలు పోరాట ప్రాంతాలను చుట్టుముట్టి నిత్యం హత్యలు, అత్యాచారాలు చేయడమేగాక ఏకంగా భారత ప్రభుత్వం ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ ఆధ్వర్యంలో ఆదివాసులపై వైమానిక దాడులు చేసే దాకా వాకపల్లి విస్తరించింది. పోరాటశక్తులను అణచివేయడానికి పితృస్వామ్యాన్ని, హెలికాప్టర్‌ దాడులను వాడటం అనే భౌతిక, భావజాల, సైనిక వ్యూహాన్ని రాజ్యం అమలు చేస్తున్నది.

 ఈ వ్యూహం గత పదహారేళ్లలో బలపడుతూ వచ్చింది. 2007 నాటికి ఆపరేష్‌ గ్రీన్‌హంట్‌ అనే రూపంలో మంద్రస్థాయి యుద్ధం తీవ్రమైంది. 2003లో బస్తర్‌లోకి సిఆర్‌పిఎఫ్‌ బలగాలు ప్రవేశించాయి. అంతక ముందే 2004`5 సంవత్సరాల్లో  సాల్వాజుడుం అనే పేరుతో ఆదివాసీ సమాజంలోనే అంతర్గత వైరుధ్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక రకాల కేంద్ర బలగాలు దండకారణ్యం చేరుకొని క్యాంపులు ఏర్పాటు చేసుకొన్నాయి. అప్పటి నుంచి బలగాల మోహరింపు పెరుగుతూపోతోంది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మూడు దశలు, ఆపరేషన్‌ ప్రహార్‌ మొదలైన అభియాన్‌లు నడిచాయి.

ఈ మొత్తం స్థితి దండకారణ్యానికే పరిమితం కాదు. దండకారణ్య ప్రత్యామ్నాయ నమూనా దేశం మొత్తానికి సంబంధించిందయినట్లే దాన్ని దెబ్బతీయడానికి మొదలైన అణచివేత కూడా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. వాకపల్లి ఘటనకు ఇంత నేపథ్యం ఉన్నది. కొనసాగింపు ఉన్నది. దీన్ని కేవలం మదమెక్కిన గ్రేహౌండ్స్‌ పోలీసుల దుర్మార్గంగానే చూడ్డానికి లేదు. స్త్రీల విషయంలో మగవాళ్లకు, అందునా అధికారబలం ఉన్న మగవాళ్లకు సంబంధించిన పితృస్వామ్య కోణం ఇందులో ఉన్నది. దానితోపాటు రాజ్య కోణం ఉన్నది. వర్గపోరాటాన్ని దెబ్బతీసే క్రమంలో భారత రాజ్యం తన పూర్తి స్థాయి యుద్ధ స్వభావాన్ని బట్టబయలు చేసుకున్నది. ఇది ఇవాళ నేరుగా వైమానిక దాడులుగా మారింది.

2023 జనవరి 11న వైమానిక దాడులు జరిగాక దేశ వ్యాప్తంగా నిరసన మొదలైంది. భారత ప్రభుత్వం తన ప్రజల మీద తానే బాంబులు వేయడం ఏమిటి అనే ప్రశ్న వినిపించింది. ఇది రాజ్యాంగానికి, చట్టబద్ధ పాలనకు వ్యతిరేకం అనే అనే విమర్శ వచ్చింది. ప్రభుత్వం అలాంటి విమర్శలను ఖాతరు చేసే స్థితిలో లేదు.  ఇది గతంలోనూ ఉన్నదే. ఈ ఇరవై ఏళ్లలో  తీవ్రమైంది. వాకపల్లి ఘటన జరిగినప్పుడు కూడా దేశవ్యాప్తంగా పెద్ద నిరసన వచ్చింది. కానీ దాన్నుంచి నిందితులను తప్పించడానికి పోలీసు అధికారులు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. ఇంత దారుణమైన ఘటనలో నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా అనుకోలేదు. అంటే ఇది జరగవలసిందే అనే బరితెగింపు అప్పటి నుంచే ఉన్నదన్నమాట.  దాని పర్యవసానమే కోర్టు తీర్పు.  ఈ పదహారేళ్లలో భారత రాజ్యం తన అణచివేత స్వభావాన్ని యుద్ధ దశలోకి తీసికెళ్లింది. ప్రశ్నలను, భిన్నాభిప్రాయాలను, పోరాటాలను అణచివేయడం ప్రభుత్వాలకు సహజమే. కానీ వాకపల్లి నుంచి పామేడు దాకా ప్రత్యామ్నాయ రాజకీయాలను నిర్మూలించే వ్యూహాన్ని భారత రాజ్యం  విస్తరించింది. వాకపల్లి అత్యాచారం కేవలం లైంగికత మీద దాడి మాత్రమే కాదు. ఆ మహిళలు, ఆ ఊరివాళ్లు, దేశవ్యాప్తంగా ఆలాంటి అదివాసులు, పీడిత అస్తిత్వ ప్రజలు, శ్రామిక వర్గం చేపట్టిన రాజకీయ పోరాటాల మీద అత్యంత నికృష్టమైన, అమానవీయమైన యుద్ధ ప్రకటన అందులో ఉన్నది.  కానీ దేశవ్యాప్తంగా ఉన్న పీడిత మహిళలు సహా శ్రామిక వర్గంలోని అన్ని సెక్షన్ల ప్రజలు ఈ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. వెనుతిరగడం లేదు. బలాబలాల పొందికలో ఎన్ని తేడాలైనా ఉండవచ్చు. తలవంచేది లేదని ధిక్కారం చట్టబద్ధ, శాంతియుత, సాయుధ పోరాట రూపాల్లో విస్తరిస్తూనే ఉన్నది. దీన్ని ఇక ఏమీ చేయలేని స్థితిలో భారత రాజ్యం వైమానిక దాడులకు దిగింది. ఈ యుద్ధం ఏమవుతుంది? అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తవచ్చు. ఆ సందేహమే అక్కరలేదని వాకపల్లి మహిళలు నిరూపించారు. పోలీసులు, ప్రభుత్వం, న్యాయస్థానం ఎలా వ్యవహరించినా పోరాటమే మన శ్వాస అని వాళ్లు ఈ అన్యాయమైన తీర్పు సందర్భంలో కూడా చెబుతున్నారు. అంతకంటే ఆ బాధిత తల్లుల బిడ్డ డానియెల్‌ పోరాటం కోసం జీవితాన్ని బలిపెట్టి బరిగీసి నిలవాల్సిందే అనే సందేశాన్నిచ్చి అమరుడయ్యాడు. ఆ సందేశ స్పూర్తి వైమానిక దాడులను సహితం నిలువరిస్తుంది. సందేహం లేదు.

Leave a Reply